ఆంధ్రప్రదేశ్
భారతదేశ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia
భారతదేశ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం.[6] ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. రాష్ట్రానికి వాయవ్యంగా తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఒడిషా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. కేంద్రపాలితప్రాంత భూభాగం పుదుచ్చేరికి చెందిన యానాం రాష్ట్రం హద్దులలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ | |||||||
---|---|---|---|---|---|---|---|
| |||||||
Motto(s): | |||||||
Anthem: "మా తెలుగు తల్లికి మల్లె పూదండ" | |||||||
Coordinates (ఆంధ్రప్రదేశ్): 16.53°N 80.47°E | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రావతరణ | 1956 నవంబరు 1 | ||||||
రాజధాని | అమరావతి | ||||||
Government | |||||||
• Body | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | ||||||
• గవర్నరు | సయద్ అబ్దుల్ నజీర్ | ||||||
• ముఖ్యమంత్రి | చంద్రబాబునాయుడు | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 1,62,970 కి.మీ2 (62,920 చ. మై) | ||||||
• Rank | 7వ | ||||||
జనాభా (2011)[2] | |||||||
• Total | 4,93,86,799 | ||||||
• Rank | 10వ | ||||||
• జనసాంద్రత | 308/కి.మీ2 (800/చ. మై.) | ||||||
జి.డి.పి (2021-22 ముందస్తు అంచన) | |||||||
• మొత్తం | ₹12.02 లక్ష కోట్లు (US$150 billion) | ||||||
• తలసరి | ₹2,00,771 (US$2,500) | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
UN/LOCODE | AP 39 | ||||||
అక్షరాస్యత రేటు | 67.41% (2011) | ||||||
అధికార భాషలు | తెలుగు | ||||||
తీరప్రాంతం | 974 కిలోమీటర్లు (605 మై.) | ||||||
Symbols of ఆంధ్రప్రదేశ్ | |||||||
Emblem | ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం | ||||||
Song | మా తెలుగు తల్లికి[4] | ||||||
Language | తెలుగు | ||||||
Bird | రామచిలుక[5] | ||||||
Fish | డాల్ఫిన్ | ||||||
Flower | మల్లె[5] | ||||||
Tree | వేప[5] | ||||||
Dance | కూచిపూడి | ||||||
Sport | చెడుగుడు |
162,970 కి.మీ2 (62,920 చ. మై.) విస్తీర్ణంతో ఇది ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం.[7] భారతదేశంలో గుజరాత్ తరువాత 974 కి.మీ. (605 మై.)తో రెండవ పొడవైన తీరప్రాంతం కలిగివుంది.[8] కోహినూర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు రాష్ట్రంలోని కోళ్లూరు గనిలో లభించాయి.[9][10] భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటైన తెలుగు దీని అధికార భాష.
తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి.[11] పంచారామ క్షేత్రాలు, శ్రీశైల క్షేత్రం, కోదండ రామాలయం వంటి అనేక పుణ్యక్షేత్రాలు, అమరావతి స్తూపంతో పాటు ఇంకా పలు ప్రదేశాలలో బౌద్ధ చైత్యాలు, స్తూపాలు, విశాఖపట్నం సముద్ర తీరం, అరకు లోయ, హార్స్లీ కొండలు, కోనసీమ డెల్టా లాంటి సహజ ఆకర్షణలు ఉన్నాయి.
సామాన్య శక పూర్వం (సా.శ.పూ.) 8 వ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతరేయ బ్రాహ్మణ లో ఆంధ్రస్ అనే వ్యక్తుల సమూహం ప్రస్తావించబడింది. ఆంధ్రులు ఉత్తర భారతదేశంలో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలుస్తుంది.[12][13][14][15] ఈ ప్రాంతంలోని ప్రజలు విశ్వామిత్ర సంతతి వారని, అస్సాక జనపదం (సా.శ.పూ. 700-300) ఆగ్నేయ భారతదేశంలోని గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న ఆంధ్రుల పురాతన రాజ్యమని రామాయణ, మహాభారత పురాణాల ద్వారా తెలుస్తుంది.[16] ఆంధ్రదేశానికి, భారతదేశానికి తొలి రాజులైన ఆంధ్రులు అని పిలవబడిన శాతవాహనులను ఆంధ్ర, ఆంధ్ర జాతీయ, ఆంధ్రభృత్య పురాణాలలో అనటం వలన కూడా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని తెలుస్తుంది.[17][18][19][20][21][22] వారు వారి నాణేలు లేదా శాసనాలలో ఆంధ్రులమని చెప్పుకోలేదు. వారి జాతి కారణంగా లేదా వారి భూభాగం ఆంధ్ర ప్రాంతాన్ని కలిగి ఉన్నందున వారిని ఆంధ్రులు అని పిలిచిన అవకాశం ఉంది.
అస్సాకా మహాజనపదం పదహారు వేల మహాజనపదాలలో ఒకటి. దీనిలో ప్రస్తుత ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణలు ఉన్నాయి.[23] సా.శ.పూ. 5వ శతాబ్దంలో ప్రతీపాలపురం రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని భట్టిప్రోలు స్తూపం త్రవ్వకాలలో ఆధారాలు లభించాయి. అమరావతి, ధాన్యకటకం, వడ్డమాను వంటి ప్రదేశాల పురావస్తు ఆధారాలు ఆంధ్ర ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగమని సూచిస్తున్నాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకాన్ని సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. అశోక చక్రవర్తి మరణం (సా.శ.పూ. 232) తరువాత, మౌర్య పాలన సా.శ.పూ. 200 ప్రాంతంలో బలహీనపడింది. ఆంధ్ర ప్రాంతంలో అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి.[24]
శాతవాహనులు సా.శ.పూ. 3 వ శతాబ్దం నుండి సామాన్య శకం (సా.శ.) 2 వ శతాబ్దం వరకు దక్కన్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించారు.[25] శాతవాహనులు ధరణికోటని తమ రాజధానిగా చేసుకున్నారు. వారు సామ్రాజ్యాన్ని మరాఠా దేశం హద్దులు దాటి విస్తరించారు.[26] బౌద్ధ గ్రంథాల ప్రకారం మహాయాన తత్వవేత్త నాగార్జున సా.శ. 2-3 వ శతాబ్దాలలో నివసించాడు.[27] తరువాత ఆంధ్ర ఇక్ష్వాకులు, విజయపురి రాజధానిగా, సా.శ. 2 వ శతాబ్దం చివరి అర్ధ భాగంలో కృష్ణా నది లోయలో పాలించారు.[28] మొదట శాతవాహన రాజుల క్రింద కార్యనిర్వాహక అధికారులుగా ఉన్న పల్లవులు, సా.శ. 2 వ శతాబ్దానికి ముందు గుర్తించబడిన రాజకీయ శక్తి కాదు. సా.శ. 7 వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో రెండవ పులకేశి నేతృత్వంలోని పశ్చిమ చాళుక్యుల దండయాత్రలో ఓడిపోయారు.[29]
సాలంకాయనులు ఆంధ్ర ప్రాంతాన్ని సా.శ. 300 నుండి సా.శ. 440 వరకు వేంగి రాజధానిగా పరిపాలించారు.[30] ఇక్ష్వాకుల పతనం తరువాత, విష్ణుకుండినులు సా.శ. 5, 6 వ శతాబ్దాలలో మొట్టమొదటి గొప్ప రాజవంశంగా కళింగ, తెలంగాణలోని కొన్ని భాగాలతో సహా మొత్తం ఆంధ్రదేశంపై పట్టు సాధించారు. వారు ఏలూరు, అమరావతి, పురానిసంగం కేంద్రాలుగా ముఖ్యమైన పాత్ర పోషించారు.[31]
సా.శ 5వ శతాబ్దంలో రేనాటి చోళులు పాలించారు. తెలుగు భాష మూలాలు గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, ఇతరచోట్ల దొరికిన నాటి శాసనాలలో కనబడతాయి.[32][33]
వెంగీ (తూర్పు చాళుక్యులు) రాజవంశం సా.శ. 7 వ శతాబ్దం నుండి సా.శ. 1130 వరకు ఐదువందల సంవత్సరాలు కొనసాగింది. చివరికి చోళ రాజవంశంలో విలీనం అయ్యింది. వారు 1189 వరకు చోళ రాజవంశం రక్షణలో పాలన కొనసాగించారు. చివరిగా వారి రాజ్యం హొయసలు, యాదవులకు లొంగిపోయింది.[34]
కాకతీయులు సా.శ 12- 14 శతాబ్దాలలో ఈ ప్రాంతాలను పరిపాలించారు. వీరు అనేక కోటలను నిర్మించారు. వీరి తరువాత ముసునూరి నాయకులు పాలించారు. తెలుగు ప్రాంతాలలో ఢిల్లీ సుల్తాను పాలనను పడగొట్టడానికి ముసునూరి నాయకులు, ప్రాంతంలోని నాయకుల సమాఖ్యకు నాయకత్వం వహించారు.[35]
14 వ శతాబ్దం ప్రారంభంలో ప్రోలయ వేమారెడ్డి చేత రెడ్డి రాజ్యం (సా.శ.1325–సా.శ.1448) స్థాపించబడింది. వీరు నేటి కొండవీడు నుండి పాలించారు. ఢిల్లీ సుల్తానుల ముస్లిం సైన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన రాష్ట్రాల సమాఖ్యలో భాగంగా ప్రోలయ వేమారెడ్డి కొండవీడు కోటను నిర్మించాడు. ఈ ప్రాంతం ఒరిస్సా గజపతుల స్వాధీనం లోకి పోయి, 1458 లో బహమనీ రాజ్యపు ముస్లిం పాలకులచే ధ్వంసం చేయబడింది. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు సా.శ.1516 లో దీనిని స్వాధీనం చేసుకున్నాడు. గోల్కొండ సుల్తాన్లు 1531, 1536, 1579 లలో కోట పై దాడి చేశారు. సుల్తాన్ కులీ కుతుబ్ షా 1579 లో దీనిని స్వాధీనం చేసుకుని, ముర్తుజానగర్ అని పేరు పెట్టాడు. తరువాత విజయనగర రాజులు మరల స్వాధీనం చేసుకున్నారు.[36][37][38]
విజయనగర సామ్రాజ్యం కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతాలలో లలిత కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించింది. ఈ కాలంలోనే కర్ణాటక సంగీతం ఆధునిక రూపంలోకి అభివృద్ధి చెందింది.[39] విజయనగర సామ్రాజ్య కాలంలో, పెమ్మసాని నాయకులు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించారు. వారు పెద్ద కిరాయి సైన్యాలను కలిగి ఉన్నారు, ఇవి పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి రక్షణగా ఉన్నాయి. లేపాక్షిలో శివ, విష్ణు, వీరభద్ర ఆలయాల సమూహం సాంస్కృతికంగా, పురావస్తుపరంగా ముఖ్యమైనవి. వీటిలో విజయనగర రాజుల కుడ్య చిత్రాలు, ద్రావిడ కళ, శాసనాలు ఉన్నాయి. ఆలయ సముదాయం దగ్గర పెద్ద గ్రానైట్ నంది శిల్పం ఉంది.
సా.శ. 1347లో, దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తానుకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు ఫలితంగా అల్లావుద్దీన్ బహమన్ షా చేత బహమనీ సుల్తానేట్ స్వతంత్ర ముస్లిం రాజ్యంగా స్థాపించబడింది. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ బహమనీ సుల్తాన్ కొలువులో పనిచేశాడు. గోల్కొండను జయించి అధిపతి అయ్యాడు. 1518లో బహమనీ సామ్రాజ్యము పతనమై ఐదు దక్కన్ సుల్తనేట్ ఆవిర్భవించుచున్న సమయములో బహమనీ సుల్తానుల నుండి స్వతంత్రము ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టము స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశమును స్థాపించాడు. కుతుబ్ షాహీ వంశం పదహారవ శతాబ్దం ప్రారంభం నుండి పదిహేడవ శతాబ్దం చివరి వరకు సుమారు రెండు వందల సంవత్సరాలు పట్టు సాధించింది.[40]
సా.శ.1687లో మొగల్ రాజు ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడంతో మొగలుల ప్రత్యక్షపాలన ప్రారంభమైంది. సా.శ.1724 లో మొగల్ రాజప్రతినిధి గావున్న నిజామ్ ఉల్ ముల్క్ అనే బిరుదు గల చిన్ కిలిచ్ ఖాన్ ను అసఫ జా బిరుదుతో దక్కన్ పాలకుడుగా వుండుటకు అప్పటి మొగల చక్రవర్తి మహమ్మద్ షా అనుమతించడంతో అసఫజాహీ వంశ పాలనప్రారంభమైంది. సా.శ. 1766 లో నిజాం ఆలీఖాన్ పాలనలో ఉత్తర సర్కార్లను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించగా, అవి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి. తరువాత ఇతర తీరప్రాంతాలు కూడా కంపెనీ పాలనలో చేరాయి. సా.శ.1800 లో బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ సైన్యసహకారపద్ధతికి అంగీకరించి నిజాం ఆలీఖాన్ ఐదు భూభాగాలను (అప్పటి కర్నూలు, కడప, అనంతపూరు,చిత్తూరు, బళ్లారి భూభాగాలు) కంపెనీ వారికి అప్పగించాడు. స్థానిక స్వయంప్రతిపత్తికి బదులుగా బ్రిటిష్ పాలనను అంగీకరించి, నిజాం హైదరాబాద్ రాచరిక రాష్ట్రంగా అంతర్గత ప్రాంతాలపై నియంత్రణను సాధించాడు.
1947 లో భారతదేశం బ్రిటీషు పాలన నుండి స్వతంత్రమైంది. నిజాం హైదరాబాద్ రాచరిక రాష్ట్ర స్వాతంత్ర్యాన్ని నిలుపుకోవాలనుకున్నాడు, కాని ఆ ప్రాంత ప్రజలు భారతదేశంలో చేరడానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. 1948 లో హైదరాబాద్ రాచరిక రాష్ట్రం, ఆపరేషన్ పోలోతో భారతదేశంలో విలీనం చేయబడింది.[41]
బౌద్ధమతం చరిత్ర ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ కు వ్యాపించింది. దాదాపు వెయ్యి సంవత్సరాలు కృష్ణా నది లోయ అసాధారణమైన బౌద్ధ కార్యకలాపాల ప్రదేశంగా విరాజిల్లింది.[42] అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేటతో సహా దిగువ కృష్ణ లోయలోని పురాతన బౌద్ధ ప్రదేశాలు కనీసంగా సా.శ.పూ. మూడవ శతాబ్దానివని గుర్తించారు.[43]
ఈశాన్య భారతదేశంలో మగధతో పాటు మహాయాన బౌద్ధమతం అభివృద్ధిలో ఈ ప్రాంతం ప్రధాన పాత్ర పోషించింది.[44][45] ఎ.కె.వార్డర్ "మహాయాన భారతదేశానికి దక్షిణాన చాలవరకు కచ్చితంగా ఆంధ్రదేశంలో ఉద్భవించింది" అని పేర్కొన్నాడు.[46] జింగ్ "దక్షిణ భారతదేశంలోని మహాసంఘికలలో ప్రజ్ఞాపారమిత బహుశా ఆంధ్రదేశంలో, కృష్ణా నదిపై అభివృద్ధి చెందుండొచ్చని పలువురు పండితులు సూచించారు" అని పేర్కొన్నాడు.[47] ప్రజ్ఞాపారమిత సూత్రాలు తొలి మహాయాన సూత్రాలకు చెందినవి.[48][49]
తరువాత బౌద్ధమతం ఆదరణ తగ్గి, హిందూమతం ఆదరణ పెరిగింది. ఈ ప్రాంతంలో హిందూమత ఆధ్యాత్మిక వేత్తలలో ఆది శంకరాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మొదలైనవారున్నారు. మతాన్ని నిరసించిన వారిలో వేమన ప్రముఖుడు.
మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నంలో, పొట్టి శ్రీరాములు 1952 లో నిరాహార దీక్షచేసి మరణించాడు. ఫలితంగా మద్రాస్ రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు 1953 అక్టోబరు 1 న విడగొట్టబడి, కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడింది.[50][51] టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రి అయ్యాడు.
పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆంధ్రను, అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా 1956 నవంబరు 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.[52] హైదరాబాద్‌ను కొత్త రాష్ట్రానికి రాజధానిగా చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలు బొంబాయి రాష్ట్రంతో, కన్నడ మాట్లాడే ప్రాంతాలు మైసూర్ రాష్ట్రంలో విలీనం అయ్యాయి. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి.[53][54] 1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమిషన్ తీర్పు మూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడుకు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి.తరువాత, 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగస్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి.
1982 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నందమూరి తారక రామారావు 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, తొమ్మిది నెలలలోనే కాంగ్రెసును ఓడించి, రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టాడు. 1989 ఎన్నికలలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టటంతో, మరల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 1990 లో నేదురుమల్లి జనార్థనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, 1992 లో మళ్ళీ విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు.
1994 లో ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ మరోసారి గెలిచింది. ఎన్.టి రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అతని అల్లుడు నారా చంద్రబాబునాయుడు 1995 లో తన మామకు వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీలో అధికశాతం శాసనసభ సభ్యుల మద్దతు కూడగట్టటంతో అధికారంలోకి వచ్చాడు. 1999 లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించింది. ఆ విధంగా నాయుడు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి (1995 - 2004)గా రికార్డును కలిగి ఉన్నాడు.[55]
రాష్ట్రం ఏర్పడిన తరువాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, దానికి పోటీగా సమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. 2004 శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఐదేళ్ళ అనంతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి మహాకూటమి తరపున పోటీచేశాయి. చలన చిత్ర నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలవటంతో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరల ముఖ్యమంత్రి అయ్యాడు. 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు ఆయన పాలించిన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
2009 లో కె.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణా ఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదమైన లక్ష్యం కొరకు ప్రయత్నించినప్పటికి సత్ఫలితాలివ్వలేదు. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపైబడి సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటును ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్, బిల్లు తయారీ జరిగింది.[56] ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును[57] శాసనసభ, శాసనమండలిలో సుదీర్ఘ చర్చలు పూర్తికాకముందే, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి. 2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా, ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యథాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది.[58][59] ఫలితంగా నల్లారి కిరణకుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేయటంతో ఎన్నికలు దగ్గరబడుతున్నందున, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ఆసక్తి చూపనందున రాష్ట్రపతిపాలన విధించబడింది.[60]
హైదరాబాద్ పదేళ్లవరకు ఉమ్మడి రాజధానిగా ఉండే విధంగా 2014 జూన్ 2 న తెలంగాణ కొత్త రాష్ట్రంగా, సీమాంధ్ర ప్రాంతం అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినవి.[61][62] హైదరాబాదు రాజధానిగా దాదాపు మూడు సంవత్సరాల వరకు కొనసాగింది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకుస్థాపన జరిగింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 చెల్లుబాటును ప్రశ్నించిన పిటిషన్లు అత్యున్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం ముందు 2014 ఏప్రిల్ నుండి తీర్పు కోసం వేచి ఉన్నాయి.[63]
రాష్ట్రంలో తూర్పు కనుమలు నుండి బంగాళాఖాతం తీరం వరకు వైవిధ్యభరిత పర్యావరణ వ్యవస్థలు, వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. కృష్ణ, గోదావరి అనే రెండు ప్రధాన నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర తీరం శ్రీకాకుళం జిల్లా నుండి నెల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉంది.[64] తూర్పు కనుమలకు తీరం మధ్య గల మైదానాలు చాలావరకు గోదావరి, కృష్ణ, పెన్నా నదులచే ఏర్పడిన డెల్టా ప్రాంతాలు. తూర్పు కనుమలు విడిపడి వుండడంతో ఈ విభాగాలకు స్థానిక పేర్లు ఉన్నాయి. ఇవి రాష్ట్ర భౌగోళికంలో ఒక ప్రధాన విభజన రేఖగా ఉన్నాయి. దీని రెండు వంపు శాఖలచే ఏర్పడిన కడప బేసిన్ ఖనిజ సంపన్న ప్రాంతం.[65][66]
కోస్తాంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములలో లక్షల హెక్టార్ల భూమి సాగు చేయబడుతుంది.[67] రాయలసీమలో ఎర్రటి నేలలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పాక్షిక శుష్క పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రంలోని మొత్తం అడవుల విస్తీర్ణం 22,862 చదరపు కిలోమీటర్లు (8,827 చ. మై.).[68] రాష్ట్రంలోని అటవీప్రాంతాన్ని విస్తృతంగా నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు.[69]
తూర్పు కనుమల ప్రాంతం దట్టమైన ఉష్ణమండల అడవులకు నిలయంగా ఉంది. అయితే కొండప్రాంతాల నుండి దక్కన్ పీఠభూమివైపు వృక్షసంపద తక్కువగా, పొద వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. రాష్ట్రంలో లభించే వృక్షసంపద చాలావరకు పొడి ఆకురాల్చే రకాలైన టేకు, టెర్మినాలియా, డాల్బెర్జియా, స్టెరోకార్పస్, అనోజిస్సస్ మొదలైన వాటిని కలిగివుంది. ప్రపంచంలో అరుదైన మొక్కలైన ఎర్రచందనం, సైకస్ బెడ్డోమి, టెర్మినాలియా పల్లిడా, సిజీజియం ఆల్టర్నీఫోలియం షోరియా తలూరా మొదలైనవి రాష్ట్రంలో విస్తారంగా దొరకుతాయి.[69]
కొరింగ, కృష్ణ వన్యప్రాణుల అభయారణ్యం, నాగార్జున్‌సాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం, కంబలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శన శాల, ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల వంటి అనేక అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జంతుప్రదర్శనశాలలు ఉన్నాయి . ఏటపాక, లేలపట్టు, తెలినీలపురం, తేలుకుంచి, పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యాలు అనేక వలస పక్షులను ఆకర్షిస్తున్నాయి.[70] పులులు, నల్ల చిరుత పులి, దుమ్ములగొండి, కృష్ణ జింక, చిరుతపులి, సాంబార్ (లేడి), సముద్ర తాబేలు, అనేక పక్షులు, సరీసృపాలు రాష్ట్ర జంతుజాల వైవిధ్యతను సూచిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలలో గొప్ప మడ అడవులతో పాటు బావురు పిల్లులు, నీటి కుక్కలు, కీస్టోన్ జాతి జంతువులున్నాయి
రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర చెట్టుగా వేపచెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లెపువ్వు 2018, జూన్ 6 న అమల్లోకి వచ్చాయి.[71]
భౌగోళిక ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వాతావరణం గణనీయంగా మారుతుంది. మార్చి నుండి జూన్ వరకు వేసవికాలం ఉంటుంది. తీర మైదానంలో, వేసవి ఉష్ణోగ్రతలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20–41 °C (68–106 °F) మధ్య ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు ఉష్ణమండల వర్షాలు పడే కాలం. మొత్తం వర్షపాతంలో మూడింట ఒకవంతు ఈశాన్య రుతుపవనాల ద్వారా వస్తుంది. అక్టోబరు, నవంబరులో బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థలు, ఉష్ణమండల తుఫానులు ఏర్పడతాయి. ఇవి ఈశాన్య ఋతుపవనాలతో పాటు రాష్ట్రంలోని దక్షిణ తీర ప్రాంతాలకు వర్షాలు కలగజేస్తాయి.
నవంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం సాగుతుంది. రాష్ట్రానికి పొడవైన తీరప్రాంతం ఉన్నందున శీతాకాలం మరీ చల్లగా ఉండదు. శీతాకాలపు ఉష్ణోగ్రత సాధారణంగా 12–30 °C (54–86 °F). చల్లని వాతావరణం గల విశాఖపట్నం జిల్లాలోని లంబసింగిని "ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్" అని పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత 0–10 °C (32–50 °F) మధ్య వుంటుంది.[72][73]
జనాభా పెరుగుదల | |||
---|---|---|---|
Census | Pop. | %± | |
1961 | 3,59,83,000 | — | |
1971 | 4,35,03,000 | 20.9% | |
1981 | 5,35,50,000 | 23.1% | |
1991 | 6,65,08,000 | 24.2% | |
2001 | 7,57,27,000 | 13.9% | |
2011 | 8,46,65,533 | 11.8% | |
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. Source:Census of India[2] |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్ర జనాభా 4,93,86,799, జనాభా సాంద్రత 308/చ.కి. (800/చ.మై.). పోలవరం ఆర్డినెన్స్ బిల్లు 2014 ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసినందున జనాభా 2,47,515 పెరిగింది. ఈ విధంగా 2014 సంవత్సరంలో 2011 జనాభా లెక్కలు ఆధారంగా జనాభా 4,96,34,314, జనసాంద్రత 304.5/చ.కి. (789/చ.మై.). కాకేసియన్ (Caucasian), మంగోలాయిడ్ (mongoloid), ఆస్ట్రాలో మెలనేసియన్ (వెడ్డాయిడ్) జాతుల ప్రజలు ఆంధ్రప్రదేశ్ అంతటా కనిపిస్తారు.
మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 70.4% అనగా 3,47,76,389, పట్టణ జనాభా 29.6% అనగా 1,46,10,410 గా నమోదైంది. 0–6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 52,22,384 మొత్తం జనాభాలో 10.6%గా ఉన్నారు. వారిలో 26,86,453 మంది బాలురు, 25,35,931 మంది బాలికలు ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధిక పట్టణ జనాభా 47.5%, శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక గ్రామీణ జనాభా 83.8% ఉంది. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులం జనాభా 17.1%, షెడ్యూల్డ్ తెగ జనాభా 5.3%.[7]
2,47,38,068 పురుషులు, 2,46,48,731 మహిళలుండగా, లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 996 స్త్రీలుగా ఉంది. ఇది జాతీయ సగటు 1,000 కి 926 కంటే ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత 67.41%. 2021 నాటికి నవ్యాంధ్ర రాష్ట్ర అక్షరాస్యత 91.1%కి చేరుకోవచ్చు.[74] జిల్లాలను విశ్లేషిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక అక్షరాస్యత 74.6%, విజయనగరంలో అత్యల్ప అక్షరాస్యత 58.9% నమోదైంది.[75]
2010నాటికి[update] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి సూచిక విలువ 0.416 తో భారతీయ రాష్ట్రాలలో పదవ స్థానంలో ఉంది.[76]
తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష. ఇది దాదాపు 90% జనాభాకు మాతృభాష.[77][78][79] 2008 లో తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించారు.[80]
ఉర్దూ అతిపెద్ద అల్ప సంఖ్యాకుల భాష. సరిహద్దు ప్రాంతాల్లో తమిళం, కన్నడ, ఒడియా మాట్లాడుతారు. లంబాడి, కోయా, సవారా, కొండా, గడాబా లాంటి అనేక ఇతర భాషలను రాష్ట్రంలోని ఆదివాసులు వాడతారు.[81]
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది ప్రజలు హిందువులు కాగా, ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలోని ప్రధాన మత సమూహాలు హిందువులు (90.87%), ముస్లింలు (7.32%), క్రైస్తవులు (1.38%). కొద్ది సంఖ్యలో బౌద్ధులు, సిక్కులు, జైనులు, తమ మతాన్ని చెప్పడానికి నిరాకరించిన ప్రజలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ నైరుతిలో రాయలసీమ, తూర్పు, ఈశాన్యంలో బంగాళాఖాతానికి సరిహద్దులో ఉన్న కోస్తాంధ్ర ,ఉత్తరాంధ్ర అనే మూడు ప్రధాన ప్రాంతాలను కలిగి ఉంది.[83]
రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా 2022 ఏప్రిల్ 4న పునర్వ్యవస్థీకరించారు. [84]
వ.సంఖ్య | కోడ్[85] | అధికారిక పేరు | ప్రధాన కార్యాలయం | రెవెన్యూ డివిజన్లు | మండలాలు సంఖ్య | జనాభా | విస్తీర్ణం చ.కి.మీ. | జనసాంద్రత చ.కి.మీ.1కి |
స్థితిని తెలిపే పటం |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | SR | శ్రీకాకుళం జిల్లా | శ్రీకాకుళం | 3 | 30 | 21,91,471 | 4,591 | 477.34 | |
2 | PM | పార్వతీపురం మన్యం జిల్లా | పార్వతీపురం | 2 | 15 | 9,25,340 | 3,659 | 252.89 | |
3 | VZ | విజయనగరం జిల్లా | విజయనగరం | 3 | 27 | 19,30,811 | 4,122 | 468.42 | |
4 | VS | విశాఖపట్నం జిల్లా | విశాఖపట్నం | 2 | 11 | 19,59,544 | 1,048 | 1869.79 | |
5 | AS | అల్లూరి సీతారామరాజు జిల్లా | పాడేరు | 2 | 22 | 9,53,960 | 12,251 | 77.87 | |
6 | AK | అనకాపల్లి జిల్లా | అనకాపల్లి | 2 | 24 | 17,26,998 | 4,292 | 402.38 | |
7 | KK | కాకినాడ జిల్లా | కాకినాడ | 2 | 21 | 20,92,374 | 3,019 | 693.07 | |
8 | EG | తూర్పు గోదావరి జిల్లా | రాజమహేంద్రవరం | 2 | 19 | 18,32,332 | 2,561 | 715.48 | |
9 | KN | డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా | అమలాపురం | 3 | 22 | 17,19,093 | 2,083 | 825.30 | |
10 | EL | ఏలూరు జిల్లా | ఏలూరు | 3 | 27 | 20,06,737 | 6,579 | 305.02 | |
11 | WG | పశ్చిమ గోదావరి జిల్లా | భీమవరం | 2 | 20 | 18,44,898 | 2,278 | 809.88 | |
12 | NT | ఎన్టీఆర్ జిల్లా | విజయవాడ | 3 | 20 | 22,18,591 | 3,316 | 669.06 | |
13 | KR | కృష్ణా జిల్లా | మచిలీపట్నం | 3 | 25 | 17,35,079 | 3,775 | 459.62 | |
14 | PL | పల్నాడు జిల్లా | నరసరావుపేట | 3 | 28 | 20,41,723 | 7,298 | 279.76 | |
15 | GU | గుంటూరు జిల్లా | గుంటూరు | 2 | 18 | 20,91,075 | 2,443 | 855.95 | |
16 | BP | బాపట్ల జిల్లా | బాపట్ల | 2 | 25 | 15,86,918 | 3,829 | 414.45 | |
17 | PR | ప్రకాశం జిల్లా | ఒంగోలు | 3 | 38 | 22,88,026 | 14,322 | 159.76 | |
18 | NE | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా | నెల్లూరు | 4 | 38 | 24,69,712 | 10,441 | 236.54 | |
19 | KU | కర్నూలు జిల్లా | కర్నూలు | 3 | 26 | 22,71,686 | 7,980 | 284.67 | |
20 | NN | నంద్యాల జిల్లా | నంద్యాల | 3 | 29 | 17,81,777 | 9,682 | 184.03 | |
21 | AN | అనంతపురం జిల్లా | అనంతపురం | 3 | 31 | 22,41,105 | 10,205 | 219.61 | |
22 | SS | శ్రీసత్యసాయి జిల్లా | పుట్టపర్తి | 4 | 32 | 18,40,043 | 8,925 | 206.17 | |
23 | CU | వైఎస్ఆర్ జిల్లా | కడప | 4 | 36 | 20,60,654 | 11,228 | 183.53 | |
24 | AM | అన్నమయ్య జిల్లా | రాయచోటి | 3 | 30 | 16,97,308 | 7,954 | 213.39 | |
25 | TR | తిరుపతి జిల్లా | తిరుపతి | 4 | 34 | 21,96,984 | 8,231 | 266.92 | |
26 | CH | చిత్తూరు జిల్లా | చిత్తూరు | 4 | 31 | 18,72,951 | 6,855 | 273.22 |
జిల్లాల సవరణలతో 50 రెవెన్యూ విభాగాలను 75 కు పెంచారు. కొత్తగా 25 డివిజన్లు ఏర్పడ్డాయి. వీటిలో కోనసీమ జిల్లాలో కొత్తపేట రెవిన్యూ డివిజన్ పునరుద్ధరణ, వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు, 2022 జూన్ లో జరిగాయి. బాపట్ల జిల్లాలో రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిక గెజెట్ 5 ఆగష్టు 2022 న ప్రకటించారు.[86]
సగటున 8 నుంచి 12 మండలాలు ఒక రెవెన్యూ విభాగంలో వున్నాయి. అయితే కుప్పం రెవిన్యూ డివిజన్ లో తక్కువగా నాలుగు మండలాలే వున్నాయి. విజయవాడ, విశాఖపట్నం నగర ప్రాంతాలలో ఐదారు మండలాలకే ఒక రెవిన్యూ డివిజన్ వుంది.[87]
రాష్ట్రాన్ని 679 మండలాలుగా విభజించారు.
రాష్ట్రంలో మొత్తం 125 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇందులో 16 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 32 నగర పంచాయతీలు ఉన్నాయి.[88]విశాఖపట్నం, విజయవాడ నగరాలు పది లక్షల కంటే ఎక్కువ జనాభా గలవి.
2014 జూన్ 2 న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం విడిపోగా మిగిలిన భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది సభ్యులతో శాసనసభ, 58 మంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటయింది. భారత పార్లమెంటులో రాష్ట్రానికి లోక్‌సభలో 25, రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి.[89] శాసనసభ నియోజకవర్గాలలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 19, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 9 స్థానాలు ఉన్నాయి.[90]
2014 లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని మండలాలు సీమాంధ్రలో కలవడంతో నవ్యాంధ్ర లేక నవ్యాంధ్ర ప్రదేశ్ అనే పేరు తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 లో జరిగిన చివరి ఎన్నికలలో, తెదేపాకు అవశేష (కొత్త) రాష్ట్రంలో ఆధిక్యం లభించింది. నారా చంద్రబాబునాయుడు 2014 జూన్ 8న, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు.[91] 2011 లో వైయస్ఆర్ కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలలో భారీ ఆధిక్యత సాధించగా, వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు.
తెలంగాణాతో కొన్ని 10వ షెడ్యూల్లోని సంస్థల విభజన, షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు 9వ షెడ్యూల్లోని 40 సంస్థల విభజన మరి ఇతర సమస్యలు ఇంకా పరిష్కరించబడవలసి ఉంది.[92]
జగన్ ప్రభుత్వం సమీకృత అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నరు ఆమోదముద్ర పడింది.[93] ఈ చట్టాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసినందున, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం అమరావతి రాజధానిగా కొనసాగుచున్నది.[94] హైకోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఈ శాసనం రద్దుచేసి, మరల కొత్త శాసనాన్ని ప్రవేశపెడతామని తెలిపింది. ఇది ఇలా వుండగా 2022 మార్చి ౩ న ఉన్నత న్యాయస్థానపు త్రిసభ్య ధర్మాసనం రాజధాని వికేంద్రీకరణ శాసనం చెల్లదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4 నుండి అమలయ్యేటట్లు 13 జిల్లాలను, ప్రధానంగా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాతిపదికగా 26 జిల్లాలుగా మార్చింది.[95]
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డిజి) సూచీలో 2020-21గానూ కేరళ 75 పాయింట్లను సాధించి తన తొలి స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుంది. బీహార్ ఈ సూచిలో చివరిస్థాయిలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఒక్కొక్కటి 74 పాయింట్లతో రెండో స్థానంలో, 72 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి చేరుకోగా, 69 పాయింట్లతో తెలంగాణ ఆరో స్థానానికి దిగజారింది.[96]
2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ఆధారంగా, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ₹12,01,736 కోట్లు (ముందస్తు అంచనా). గత సంవత్సరపు విలువ ₹10,14,374 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిగా ఏడాదిలో ₹ 1,87,362 కోట్ల పెరుగుదల నమోదైంది. వార్షిక వృద్ధి రేటు 18.47% దేశపు వృద్ధి రేటు 17 శాతం కంటే ఎక్కువ.[3][97]
2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ప్రాతిపదికన, తలసరి ఆదాయం ₹2,00,771. అంతకు ముందు సంవత్సరంలో తలసరి ఆదాయం ₹176,000. ఏడాదిలో రాష్ట్రంలో ₹31 వేలు తలసరి ఆదాయం పెరగగా, దేశంలో తలసరి ఆదాయం ₹23 వేలు పెరిగింది.[3]
2018 నాటికి[update] మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ) లో భారత రాష్ట్రాల్లో 27వ స్థానంలో ఉంది;[81] వ్యాపార నిర్వహణ అనుకూలత ప్రపంచ బ్యాంకు జరిపే వ్యాపార నిర్వహణ అనుకూలత (Ease of doing business) లో రాష్ట్రం, దేశం మొత్తం మీద 2015 లో రెండవ స్థానంలోను,[98] 2018 లో మొదటి స్థానంలోనూ[99] నిలిచింది.
2010 నాటి ఫోర్బ్స్ పత్రిక అత్యధిక ధనవంతులైన 100 మంది జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు వ్యక్తులు ఉన్నారు.[100]
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, పశు పోషణ మీద ఆధారపడి ఉంది. భారతదేశంలోని నాలుగు ముఖ్యమైన నదులు, గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర రాష్ట్రం గుండా ప్రవహిస్తూ వ్యవసాయానికి నీటిని అందిస్తున్నాయి. జనాభాలో 60 శాతం మంది వ్యవసాయం, దాని సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. వరి రాష్ట్రంలోని ప్రధాన ఆహార పంట. చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు, కూరగాయలకు, కృష్ణ జిల్లాలో మామిడికి, గుంటూరు జిల్లాలో మిరపకాయలకు మూడు వ్యవసాయ ఆర్థిక మండలాలు ఉన్నాయి.
రైతులు వరితో పాటు జొన్న, సజ్జలు, మొక్కజొన్న, సిరిధాన్యాలు, అనేక రకాల పప్పులు, నూనె గింజలు, చెరకు, పత్తి, మిరపకాయ, మామిడి, పొగాకును పండిస్తారు. ఆయిల్ పామ్, ప్రొద్దు తిరుగుడు, వేరుశనగ వంటి పంటల నుండి వంట నూనె ఉత్పత్తి చేస్తారు. అనేక నీటిపారుదల ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి.[101] ఉద్యానవన పంటల్లో బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, సపోటా ముఖ్యమైనవి.
పశుపోషణ, కోళ్ల పెంపకం మరొక లాభదాయక వ్యాపారం. ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం చేపలు, రొయ్యలు సాగులో దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దేశం మొత్తంలో మత్యసంపదలో 10% చేపలు, 70% రొయ్యల ఉత్పత్తి రాష్ట్రంలో జరుగుతున్నది.[102] వన్నమీ రొయ్యలు అత్యధికంగా ఎగుమతి చేయబడుతున్న సముద్ర ఎగుమతులు.[103] వీటిద్వారా 2013–2014లో ఆదాయం ఒక బిలియన్ ను దాటవచ్చని భావిస్తున్నారు.[104]
రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఔషధ, ఆటోమొబైల్, వస్త్రాలు వంటి కీలక రంగాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ ఒక సమగ్ర వ్యాపార నగరం, ఇది పెప్సికో, ఇసుజు మోటార్స్, క్యాడ్బరీ ఇండియా, కెల్లాగ్స్, కోల్గేట్-పామోలివ్, కోబెల్కో మొదలైన సంస్థలకు నిలయం.[105] పెప్సికో సంస్థ శ్రీ సిటీలో భారతదేశంలో అతిపెద్ద ప్లాంటును కలిగి ఉంది.[106] కృష్ణా జిల్లాలోని అశోక్ లేలాండ్, చిత్తూరు జిల్లాలో హీరో మోటార్స్, అనంతపురం జిల్లాలోని కియా ఇండియా వంటి సంస్థలతో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. 2012–2013లో విశాఖపట్నం కేంద్రంగా ఐటి / ఐటి ఆధారిత సేవలు రెవెన్యూ ₹ 14.45 బిలియన్లు. 2012-2013 లో, ఐటి / ఐటి ఆధారిత సేవలు ఆదాయాలు విజయవాడలో ₹ 1,153 మిలియన్, తిరుపతిలో ₹ 693 మిలియన్, కాకినాడలో ₹ 615 మిలియన్ గా నమోదైంది.[107]
విభిన్న భౌగోళిక నిర్మాణాలతో గొప్ప, వివిధ రకాల పారిశ్రామిక ఖనిజాలు, నిర్మాణాల్లో ఉపయోగించే రాళ్ళ నిల్వలున్నాయి.[108] సున్నపురాయి, మేంగనీస్, రాతినార, ఇనుము, బంతి బంకమట్టి, అగ్ని మట్టి, వజ్రం, గ్రాఫైట్, డోలమైట్, స్పటికం, టంగ్స్టన్, స్టీటిటిక్, ఫెల్డ్‌స్పార్, సిలికా, బారియెట్స్, గెలాక్సీ గ్రానైట్, ఇసుక, యురేనియం, బాక్సైట్ మొదలైనవి ఉన్నాయి.
భారతదేశంలో అభ్రకం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో, సున్నపురాయి నిల్వలలో మూడింట ఒక వంతు కలిగి ఉంది.[108] తుమ్మలపల్లె యురేనియం గనిలో 49000 టన్నుల ముడి ధాతువు వున్నట్లు ధ్రువీకరించబడింది. దీనికంటె మూడు రెట్లు ఎక్కువ నిల్వలను కలిగి ఉండవచ్చని సూచనలు ఉన్నాయి. మెటల్ గ్రేడ్ బాక్సైట్ నిక్షేపాలు విశాఖపట్నం నౌకాశ్రయానికి సమీపంలో 700 మిలియన్ టన్నులు ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కాకినాడ సమీపంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో 150 కి.మీ. (93 మై.) దూరంలోగల కెజి బేసిన్ లో, తొమ్మిది ట్రిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువు నిల్వలను కనుగొనింది.[109] 2016 లో, కెజి బేసిన్లో దాదాపు 3.8 ట్రిలియన్ మీ3 (134 ట్రిలియన్ ఘ.అ.) మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు వున్నట్లు కనుగొనబడింది.[110]
వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధికి రవాణా, విద్యుత్తు, డిజిటల్ నెట్వర్క్ లాంటి అవస్థాపన వసతులు కీలకం.
రహదారి, రైలు మార్గాలద్వారా ఇతర రాష్ట్రాలకు కలపబడివుంది. విమానయాన, సముద్రయాన మార్గాలు కూడా ఉన్నాయి. బంగాళాఖాతం తీరంలో, సముద్ర వ్యాపారానికి అనువుగా ఓడరేవులున్నాయి. విజయవాడలో అతి పెద్దదైన రైలు కూడలి, విశాఖపట్నంలో అతి పెద్ద ఓడరేవు ఉంది.
2018 నాటికి[update] రాష్ట్రంలోని మొత్తం రహదారుల పొడవు 53,403 కి.మీ. (33,183 మై.) కాగా, దానిలో 6,401 కి.మీ. (3,977 మై.) పొడవు జాతీయ రహదారులు, 14,722 కి.మీ. (9,148 మై.) పొడవు రాష్ట్ర రహదారులు, 32,280 కి.మీ. (20,060 మై.) పొడవు జిల్లా రహదారులు ఉన్నాయి.[111] రాష్ట్రంలో జాతీయ రహదారి 16 పొడవు 1,000 కి.మీ. (620 మై.). ఇది బంగారు చతుర్భుజి ప్రాజెక్టులో భాగం. ఆసియా రహదారి 45 లో కూడా భాగమే. 2014 జూన్ 2 న నవ్యాంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులు 4,193 కి.మీ. కాగా 2021 డిసెంబరుకు 8,183 కి.మీకు అనగా సుమారుగా రెట్టింపు చేరుకున్నాయి. దీనికొరకు ₹35,000 కోట్లు ఖర్చు చేశారు.[112]
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆసియా ఖండములోనే ఒక పెద్ద బస్ ప్రాంగణం.[113] 2019 జనవరి 30 నుండి రాష్ట్రంలోని వాహనాల నమోదు AP-39 కోడ్ తో ప్రారంభమయి ఒక అక్షరము, నాలుగు అంకెల సంఖ్యతో నమోదు చేయటం ప్రారంభమైంది.[114]
కొన్ని రాష్ట్ర రహదారులను, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. వీటికి ఒక ఉదాహరణ నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి.
క్ర. సం. | నెంబరు | పొడవు కిమీ | |
---|---|---|---|
1 | 16 | చెన్నై - గూడూరు - నెల్లూరు - కావలి - ఒంగోలు - చిలకలూరి పెట - గుంటూరు - మంగళగిరి - విజయవాడ - ఏలూరు - రాజమహేంద్రవరం - తుని - విశాఖపట్నం - శ్రీకాకుళం - కోల్‌కతా | 1024 |
2 | 544 డి | అనంతపురం - తాడిపత్రి - వినుకొండ - నరసరావు పేట - గుంటూరు | 417 |
3 | 565 | హైదరాబాద్ - మాచెర్ల - వేంకటగిరి - తిరుపతి | 410 |
4 | 516 ఇ | రాజమహేంద్రవరం - పాడేరు - విజయనగరం | 406 |
5 | 67 | పనాజి - గుంతకల్ - గుత్తి - తాడిపత్రి - ప్రొద్దటూరు - నెల్లూరు - కృష్ణపట్నం | 405 |
6 | 216 | తుని - పిఠాపురం - కాకినాడ - నరసాపురం - మచిలీపట్టణం - రేపల్లె - బాపట్ల - చీరాల - ఒంగోలు | 391 |
7 | 40 | కర్నూలు - నంద్యాల - కడప - రాయచోటి - చిత్తూరు - చెన్నై | 381 |
8 | 42 | బళ్ళారి - అనంతపురం - కదిరి - మదనపల్లి - పుంగనూరు - క్రిష్ణగిరి | 378 |
9 | 44 | శ్రీనగర్ - కర్నూలు - డొన్ - గుత్తి - అనంతపురం - కన్యా కుమారి | 261 |
10 | 716 | చెన్నై - నగరి - పుత్తూరు - తిరుపతి - రాజంపేట - కడప - ముద్దనూరు | 238 |
11 | 167 బి | కడప - కందుకూరు - సింగరాయకొండ | 195 |
12 | 71 | మదనపల్లి - తిరుపతి - శ్రీకాళహస్తి - నాయుడు పేట | 191 |
13 | 65 | ముంబై - జగ్గయ్యపేట - కొండపల్లి - విజయవాడ - తాడిగడప - మచిలీపట్టణం | 150 |
14 | 30 | నైనిటాల్ - చింతూరు - తిరువూరు - కొండపల్లి - విజయవాడ | 135 |
15 | 340 సి | కర్నూలు - దోర్నాల | 131 |
16 | 216 ఎ | రాజమహేంద్రవరం - తణుకు - తాడేపల్లిగూడెం - ఏలూరు | 121 |
17 | 167 | కోదాడ - ఆదోని - బళ్లారి | 110 |
18 | 165 | నరసాపురం - పాలకొల్లు - భీమవరం - గుడివాడ - పామర్రు | 107 |
ఆంధ్రప్రదేశ్ లో [115] బ్రాడ్ గేజి రైలు మార్గం 3703.25 కిమీ. మీటర్ గేజి రైలు మార్గాలు లేవు.[116] రైలు సాంద్రత 1,000 కి.మీ. (620 మై.) 16.59. ఇది భారతదేశానికి సగటు 20 గా ఉంది.[117] రాష్ట్రం గుండా పోయే హౌరా-చెన్నై ప్రధాన మార్గం డైమండ్ చతుర్భుజిలో భాగంగా అతివేగమైన రైలు మార్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలున్నాయి.[118][119] రైలు నెట్వర్క్ రెండు జోనుల పరిధిలో ఉంది. దీనిని డివిజన్లగా విభాగించారు. దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజన్, గుంటూరు రైల్వే డివిజన్, గుంతకల్ రైల్వే డివిజన్., తూర్పు కోస్తా రైల్వే జోన్ లోని వాల్తేర్ రైల్వే డివిజన్. రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ప్రకటించారు.
విశాఖపట్నం, విజయవాడ రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు.[120] రాష్ట్రంలో దేశీయ విమానాశ్రయాలు కర్నూలు, కడప, రాజమండ్రి, తిరుపతి లలో ఉన్నాయి. ఇంకా 16 చిన్న తరహా విమానాలు దిగడానికి సౌకర్యమున్న కేంద్రాలున్నాయి.[121]
దేశంలోనే రెండవ అతిపెద్ద కోస్తాతీరం రాష్ట్రంలో ఉంది.[122]
విశాఖపట్నం ఓడరేవు దేశంలోకెల్లా సరకురవాణాకి అత్యంత పెద్దదైన ఓడరేవు.[123] మిగతా ప్రముఖ ఓడరేవులు కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ. గంగవరం అతిలోతైన పోర్టు కావడంతో అతి పెద్ద సముద్రపడవలు (200,000 – 250,000 టన్నులు సరకులు బరువు) కు అనుకూలమైంది.[124] పెద్దవి కాని పోర్టులు భీమునిపట్నం, దక్షిణ యానాం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు లలో ఉన్నాయి.[125][126]
దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం ముందుంది. అధిక విద్యుత్ ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో రాష్ట్రం విద్యుత్ మిగులుగా మారింది.[127] 24 గంటల విద్యుత్ సరఫరాకు రాష్ట్రానికి సౌర శక్తి, జలవిద్యుత్ కేంద్రాలున్నాయి.[128] వర్షాకాలంలో లభించే నీటిని నిల్వ చేయడం, ఏడాది పొడవునా ఎత్తిపోతల ద్వారా నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్వహించే వీలుంది.[129]
2015 నాటికి రాష్ట్రంలో థర్మల్ ( సహజ వాయువు, బొగ్గు ఆధారిత), పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యం 21,000 MW . స్థానిక విద్యుత్ ప్లాంట్లు 9,600 MW సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇందులో సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ 2000MW, వైజాగ్ థర్మల్ పవర్ స్టేషన్ 1040 MW, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ 1650 MW, శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 1600 MW, డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం 1760 MW. జలవిద్యుత్ కేంద్రాల సామర్థ్యం 1671 MW గా ఉంది.[130]
ఎపిఎస్ఎఫ్ఎల్ (APSFL) రాష్ట్ర వ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెట్వర్క్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, టెలిఫోనీ, ఐపిటివి మొదలైన వాటిని ఫైబర్‌తో వివిధ వినియోగదారులకు అందిస్తుంది.[131] చాలావరకు ప్రభుత్వ సేవలు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.
కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక నృత్య రూపంగా గుర్తించబడింది. ఇది కృష్ణ జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఉద్భవించింది. విజయవాడలో మొత్తం 6,117 మంది నృత్యకారులతో ప్రదర్శించిన కూచిపూడి మహాబృంద నాట్యం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.[132]
కూచిపూడి గ్రామంలో ప్రారంభమైన ఈ నృత్యరీతి ఆంధ్రప్రదేశ్ మొత్తానికే కాక దేశవిదేశాల్లో ఎందరెందరో నేర్చుకుని ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. కూచిపూడి వారు ప్రదర్శించే నృత్యనాటికలు భామా కలాపం, గొల్ల కలాపం వంటివి తెలుగు వారి సంస్కృతిలో భాగంగా నిలుస్తున్నాయి. దేవదాసీలు మాత్రమే ప్రదర్శిస్తూ ఆచారవంతులైనవారు నృత్యకారులను పంక్తిబాహ్యులని భావించే స్థితిలో కేవలం బ్రాహ్మణ పురుషులే అన్ని వేషాలు వేస్తూ, విద్యావంతులైన వారితో కూచిపూడి నృత్యరీతిని సిద్దేంద్ర యోగి వ్యవస్థాపించాడు. కాలక్రమేణా ఈ నృత్యరీతి తెలుగువారి సంస్కృతిలో ముఖ్యభాగమైంది. 1950 నాటికి స్థానికంగా ఉండిపోయిన దీనికి జాతీయ స్థాయిలో మెప్పును, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపునూ తీసుకురావడానికి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి కృషి చేశాడు. ఈయన ఈ కళలోకి స్త్రీలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేసి యావజ్జీవితాన్ని కళకు అంకితం చేశాడు.[133] దేవదాసీల ప్రదర్శనల్లో విలసిల్లి క్రమంగా దేవదాసీ వ్యవస్థతో పాటుగా అంతరించిపోతున్న నృత్యరీతులను, లక్షణ గ్రంథాల్లో సైద్ధాంతికంగా ఉండి తరతరాల నుంచి ప్రదర్శనకు నోచుకోను నృత్యరీతులను, దేవాలయాల్లోని ప్రతిమల నాట్యభంగిమలను, లక్షణ గ్రంథాలతో కలిపి నటరాజ రామకృష్ణ అధ్యయనం చేసి ఆంధ్ర నాట్యం పేరిట సృజించాడు.[134]
వస్తువుల భౌగోళిక సూచికలు(GI) (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) చట్టం, 1999 ప్రకారం వ్యవసాయ హస్తకళలు, ఆహార పదార్థాలు, వస్త్రాల విభాగాలలో ఆంధ్రప్రదేశ్‌లో భౌగోళిక గుర్తింపు సాధించినవి పదిహేను ఉన్నాయి. వీటిలో కొన్ని బనగానపల్లె మామిడి, బందర్ లడ్డూలు, బొబ్బిలి వీణ, బుడితి బెల్, ఇత్తడి హస్తకళలు, ధర్మవరం చేనేత పట్టుచీరలు, పావడాలు, గుంటూరు సన్నం, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారి, మంగళగిరి చీరలు, శ్రీకాళహస్తి కలంకారీ, తిరుపతి లడ్డు, ఉప్పాడ జమ్దానీ చీరలు, వెంకటగిరి చీర.[135] [136] [137]
మచిలీపట్నం, శ్రీకాళహస్తికి చెందిన కలంకారి భారతదేశంలో రెండు ప్రత్యేకమైన వస్త్ర కళారూపాలు.[138] దుర్గిలో దొరికే మృదువైన సున్నపురాయి, విగ్రహ శిల్పాలు వంటి ఇతర ముఖ్యమైన హస్తకళలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి.[139] విశాఖపట్నం జిల్లాలోని ఏటి కొప్పాక లక్క పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది.[140][141] కృష్ణాజిల్లాలో కొండపల్లి గ్రామం కొండపల్లి కొయ్య బొమ్మలకు పేరుపొందింది.
రాష్ట్రంలోని ప్రదర్శనశాలలలో పురాతన శిల్పాలు, చిత్రాలు, విగ్రహాలు, ఆయుధాలు, వంటకు వాడే ఉపకరణాలు, శాసనాలు, మతపరమైన కళాఖండాలు ఉన్నాయి. అమరావతి పురావస్తు మ్యూజియం,[142] విశాఖపట్నంలోని విశాఖ మ్యూజియంలో ఇవి చూడవచ్చు. విశాఖపట్నంలోని తెలుగు సాంస్కృతిక మ్యూజియం లో స్వాతంత్ర్యానికి పూర్వ కాలపు చరిత్ర చూడవచ్చు. విజయవాడలోని విక్టోరియా జూబ్లీ మ్యూజియం లో చాలా కళాఖండాలున్నాయి.
రాష్ట్రానికి తెలుగు అధికార భాష. కవిత్రయమని పేరుగన్న నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. నన్నయ్య తెలుగు వ్యాకరణంపై ఆంధ్ర శబ్ద చింతామణి అనే మొదటి గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు.[143] శ్రీ భాగవతంను తెలుగులో శ్రీమద్భాగవతం అనే పేరుతో పోతన అనువాదం చేశాడు. వేమన తన తాత్విక కవిత్వానికి పేరుపొందాడు. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు అముక్తమాల్యద రాశాడు. కందుకూరి వీరేశలింగం తరువాత తెలుగు సాహిత్యాన్ని ఆధునిక తెలుగు సాహిత్యం అని పిలుస్తారు. అతనిని గద్య తిక్కన అని పిలుస్తారు. తెలుగు సామాజిక నవల సత్యవతి చరితం వ్రాసిన రచయిత ఇతనే. జ్ఞానపీఠ పురస్కారం గ్రహీతలలోవిశ్వనాథ సత్యనారాయణ ఒకడు. విప్లవాత్మక కవి శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో కొత్త వ్యక్తీకరణ రూపాన్ని తీసుకువచ్చాడు.[144]
రాష్ట్రంలో ముద్రణ మాధ్యమాలలో ప్రధానంగా తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు ఉన్నాయి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, ప్రజాశక్తి కొన్ని తెలుగు వార్తాపత్రికలు కాగా, ఆంగ్ల వార్తాపత్రికలలో ది హిందూ, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, దక్కన్ క్రానికల్, ది హన్స్ ఇండియా ఉన్నాయి.[145][146]
ఎలెక్ట్రానిక్ మాధ్యమాలలో ప్రభుత్వరంగంలోని దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలతో పాటు, ప్రైవేటు రంగంలో పలు రేడియో కేంద్రాలు, టెలివిజన్ ఛానళ్లు పనిచేస్తున్నాయి.
కర్ణాటక సంగీతం వాగ్గేయకారులు అన్నమాచార్య, త్యాగరాజు, క్షేత్రయ్య, భద్రాచల రామదాసు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు. ఆధునిక కర్ణాటక సంగీత కారులు, గాయకులు ఘంటసాల, సుజాతా పులిగెల్ల, బాలమురళీకృష్ణ తెలుగు వారే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్. జానకి, పిబి శ్రీనివాస్ పేరొందిన సంగీతకారులు, నేపథ్య గాయకులు. రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో జానపద పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. బుర్రకథ, పోలి వంటి రూపాలు నేటికీ ప్రదర్శించబడతున్నాయి.[147] ఆంధ్రలో ఉద్భవించిన హరికథా కాలక్షేపం (లేదా హరికథ ) కథనంతో పాటు సంబంధిత పాటలను కలిగివుంటుంది.[148] బుర్రకథ అనేది మౌఖిక కథ చెప్పే విధానం. దీనిలో హిందూ పౌరాణిక కథ లేదా సమకాలీన సామాజిక సమస్యను ఇతివృత్తంగా ప్రదర్శిస్తారు.[149] రంగస్థల నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రదర్శిస్తారు.[150] గురజాడ అప్పారావు 1892 లో వ్రాసిన కన్యాశుల్కం అనే నాటకాన్ని తెలుగు భాషలో గొప్ప నాటకంగా భావిస్తారు.[151] సి. పుల్లయ్యను తెలుగు నాటక ఉద్యమ పితామహుడిగా పేర్కొంటారు.[152][153]
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రధానంగా తెలంగాణాలోని హైదరాబాదుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఉంది. తెలుగు చిత్ర సంస్కృతి (టాలీవుడ్) బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద చిత్ర పరిశ్రమ.[154] చిత్ర నిర్మాత డి. రామానాయిడు అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సాధించాడు.[155] 2005, 2006, 2008 సంవత్సరాల్లో, తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చిత్రాలను నిర్మించింది.[156][157] ఈ పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది.[158]
తెలుగు ప్రజల సంప్రదాయ తీపి పూతరేకుల నుండి తూర్పు గోదావరి జిల్లా గ్రామమైన ఆత్రేయపురంలో పుట్టింది.
ఆంధ్రప్రదేశ్ ను 2015 లో 121.8 మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పర్యాటకుల రాకలో 30% వృద్ధితో ఇది భారతదేశంలో అత్యధికంగా సందర్శించిన మూడవ రాష్ట్రంగా నిలిచింది.[159] తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర ఆలయం సంవత్సరానికి 18.25 మిలియన్ సందర్శకులతో ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి.[11]
రాష్ట్రం తీరప్రాంత జిల్లాలలో రుషికొండ, మైపాడు, సూర్యలంక, విశాఖపట్నం, పేరిపాలెం, గొల్లపాలెం, మచిలీపట్నం మొదలైన అనేక సముద్ర తీరాలు (బీచ్‌లు) ఉన్నాయి;[160] బొర్రా గుహలు,[161] ఉండవల్లి గుహలు, కొండను తొలిచి నిర్మించిన పురాతన వాస్తుశిల్పానికి ప్రతీకలు.[162] దేశంలోని రెండవ పొడవైన గుహలు బెలూం గుహలు.[163] లోయలు, కొండలలో ప్రముఖమైనవి అరకు లోయ, హార్స్లీ కొండలు, పాపి కొండలు.[164] విశాఖపట్నం జిల్లాలో ఉన్న అర్మ కొండ శిఖరం తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం.
రాష్ట్రం వివిధ భక్తుల పుణ్యస్థలాలకు నిలయం. వీటిలో తిరుమల ఆలయం, తిరుపతి, ద్వారక తిరుమల (చిన్న తిరుపతి), సింహాచలం ఆలయం, అన్నవరం ఆలయం, శ్రీశైలం ఆలయం, కనక దుర్గ ఆలయం, అమరావతి, శ్రీకాళహస్తి, అహోబిలం, మహానంది, కాణిపాకం, పంచారామాలు, ఆదోనిలో షాహి జామియా మసీదు, విజయవాడలో గుణదల చర్చి, అమరావతి, నాగార్జున కొండ వద్ద బౌద్ధ కేంద్రాలు కొన్ని ముఖ్యమైనవి.[165]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్షరాస్యత 67.41%గా నమోదైంది. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యను ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే, ఇంకా ప్రైవేట్ పాఠశాలలు అందిస్తాయి. వీటిని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ[166] నియంత్రిస్తుంది, ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తుంది.[167][168] రాష్టంలో గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలలు కూడా ఉన్నాయి.[169][170] పిల్లలు, పాఠశాల సమాచార నివేదిక 2018–19 ప్రకారం, మొత్తం 62,063 పాఠశాలల్లో 70,41,568 విద్యార్థులు ఉన్నారు.[171][172] ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ఎస్సి) పరీక్షలు నిర్వహిస్తుంది.[173] 2019 ఎస్ఎస్సి పరీక్షకు 600,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 5,464 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణతతో పాటు మొత్తంగా 94.88% ఉత్తీర్ణత నమోదైంది.[174] బోధనా మాధ్యమాలు ప్రధానంగా తెలుగు, ఇంగ్లీష్ అయినప్పటికి, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒడియా, తమిళ భాషలు కూడా ఉన్నాయి.[175]
2020-21 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలలో 1-6 తరగతుల బోధనా మాధ్యమంగా తెలుగును తొలగించి దాని స్థానంలో ఆంగ్లం ప్రవేశపెట్టాలని, ఆ తరువాత సంవత్సరం నుండి పై తరగతులకు ఈ పద్ధతిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.[176] ఈ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ విద్యాహక్కు చట్టం ప్రకారం మాధ్యమ ఐచ్ఛికం పిల్లల తల్లిదండ్రులకుండాలని తీర్పు ఇవ్వగా, ప్రభుత్వం దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసి హైకోర్టు తీర్పును మధ్యంతరంగా నిలుపు చేయాలని కోరగా, ఆ కోరికను తిరస్కరించింది.[177]
ఇంటర్మీడియట్ విద్యను ఇంటర్మీడియట్ విద్యామండలి (ఆంధ్రప్రదేశ్) నిర్వహణ, నియంత్రణ చేస్తుంది.[178]
రాష్ట్రంలో ఉన్నత విద్యను ఉన్నత విద్యా శాఖ నిర్వహిస్తుంది.[179] సాంకేతిక విద్యను సాంకేతిక విద్యా శాఖ నియంత్రిస్తుంది.[180] ఉన్నత విద్యా పరిషత్ అనే సంస్థ ఉన్నత విద్యను సమన్వయం చేస్తుంది.[181]
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), ఐఐఎం (IIM) విశాఖపట్నం, ఐఐటి (IIT) తిరుపతి, ఎన్ఐటి (NIT) తాడేపల్లిగూడెం, ఐఐఐటిడిఎమ్ (IITDM) కర్నూలు,[182] ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIOPAE),[183] ఎన్ఐడివి (NIDV), సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఐఐటి (IIIT) శ్రీ సిటీ, ఐఐఎస్ఇఆర్ (IISER) తిరుపతి, వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు, ఐఐఎఫ్టి (IIFT) కాకినాడ ముఖ్యమైన కేంద్ర విశ్వవిద్యాలయాలు. గ్రామీణ యువకుల విద్యా అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 లో రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జియుకెటి) ను స్థాపించింది.[184] యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారం, గీతం, కెఎల్ విశ్వవిద్యాలయం, విజ్ఞాన్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడతాయి.[185] ఉద్యానవన, న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, వేదాలు, జంతు వైద్య శాస్త్రాలలో ఉన్నత విద్యను అందించేందుకు 18 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.[186] రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో 1926 లో స్థాపించబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పురాతనమైనది.[187][188]
నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, (NIO), విశాఖపట్నం [189] విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, జాతీయ వాతావరణ పరిశోధన ప్రయోగశాల (NARL),[190] ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), తిరుపతి,[191] సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER), విశాఖపట్నం, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CTRI), రాజమండ్రి,[192] వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోపెదవేగి వద్ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ (IIOPR) [193] CCRH ప్రాంతీయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRI CCRH) గుడివాడ, క్లినికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRI) తిరుపతి రాష్ట్రంలో గల కొన్ని ముఖ్యమైన పరిశోధనా సంస్థలు;[194] అంతరిక్ష పరిశోధన: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అనే ద్వీపంలో శ్రీహరికోట రేంజ్ (షార్) అని పిలువబడే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం.[195] ఇది భారతదేశం ప్రాథమిక కక్ష్య ప్రయోగ ప్రదేశం. ఈ కేంద్రం నుండి 2008 అక్టోబరు 22 న చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని ప్రయోగించారు.[196]
ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి (స్పోర్ట్స్ అథారిటీ) క్రికెట్, ఫీల్డ్ హాకీ, అసోసియేషన్ ఫుట్‌బాల్, స్కేటింగ్, ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్, చెస్, జల క్రీడలు, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, సైక్లింగ్ మొదలైన వాటిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది.[197]
రాష్ట్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడలలో క్రికెట్ ఒకటి. విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియం (ACA-VDCA Stadium) ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు నిలయం. ఈ వేదికలో క్రమం తప్పకుండా అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్,, విజయనగరానికి చెందిన మహారాజ్కుమార్, MV నరసింహ రావు, ఎం. ఎస్. కె. ప్రసాద్, వివిఎస్ లక్ష్మణ్, తిరుమలశెట్టి సుమన్, అర్షద్ అయూబ్, అంబటి రాయుడు, వెంకటపతి రాజు, శ్రావంతి నాయుడు, ఎలకా వేణుగోపాలరావు, హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశానికి ప్రాతినిథ్యం వహించినవారిలో ముఖ్యులు.
కృష్ణ జిల్లాలోని గుడివాడకు చెందిన హంపి కోనేరు భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్.
ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి శ్రీకాకుళం జిల్లాకు చెందినది. ఆమె 2000 సెప్టెంబరు 19న 69 కి.గ్రా. (152 పౌ.) విభాగంలో 240 కి.గ్రా. (530 పౌ.) ఎత్తి, కాంస్య పతకాన్ని గెలుచుకుంది.[198]
భీమవరానికి చెందిన కృష్ణంరాజు గడిరాజు రూబిక్స్ క్యూబ్ ను పరిష్కరించడంలో నాలుగు-సార్లు ప్రపంచ రికార్డ్ గెలుచుకున్నాడు.[199]
పుల్లెల గోపీచంద్ మాజీ భారత బాడ్మింటన్ క్రీడాకారుడు. అతను 2001 లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని ప్రకాష్ పడుకోనె తర్వాత ఈ పురస్కారాన్ని గెలుచుకున్న రెండవ భారతీయుడు అయ్యాడు.[200][201][202]
చెరుకూరి లెనిన్ మలేషియాలోని ఆసియా గ్రాండ్ ప్రిక్స్‌లో రజత పతకం సాధించిన భారతీయ విలువిద్యాకారుడు, శిక్షకుడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.