Remove ads
ఆంధ్రప్రదేశ్ రాజధాని From Wikipedia, the free encyclopedia
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
అమరావతి | |
---|---|
Coordinates: 16.514°N 80.516°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు | గుంటూరు |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Government | |
• Type | ప్రాధికార సంస్థ |
• Body | ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ |
విస్తీర్ణం | |
• నగరం | 217.23 కి.మీ2 (83.87 చ. మై) |
• Metro | 8,390 కి.మీ2 (3,240 చ. మై) |
జనాభా (2011)[5] | |
• నగరం | 1,03,000 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
• Metro | 46,87,389 |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 520 xxx, 521 xxx, 522 xxx |
Vehicle registration | AP07 to AP16 |
అధికారిక భాషలు | తెలుగు |
సా.శ.పూ. 1వ శతాబ్దం నుండి సా.శ. 3వ శతాబ్దం వరకు భారతదేశంలో దాదాపు 60 శాతాన్ని (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్,తెలంగాణా, మహారాష్ట్ర,గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలను) పరిపాలించిన శాతవాహన సామ్రాజ్యానికి రాజధాని ధరణికోట ఈ ప్రాంతంలోనే ఉంది.
కొత్త రాజధానికి భూసేకరణ కొత్త తరహాలో అనగా ప్రధానంగా అభివృద్ధిపరచిన నగరంలో ప్లాట్లు ఇచ్చేటట్లు జరిగింది. అమలు ప్రారంభమైన 60 రోజులలో 25,000 రైతులనుండి 30,000 ఎకరాలను (121.40 చ.కిమీ.) సమీకరించారు.[6] భారత ప్రధాని నరేంద్రమోడి ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబరు 22న విజయదశమి నాడు శిలాన్యాసం (శంకుస్థాపన) చేసాడు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా భవన సముదాయానికి 2016 అక్టోబరు 28 వ తేదిన అప్పటి కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి, ఎం. వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేసాడు. 2016 జనవరి నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి శంకుస్థాపన చేసాడు. 2015 జూన్ నాటికి పరిపాలన అక్కడి నుంచి సాగించాలని భావించినా అది అక్టోబరు నాటికి సాకారమయింది.[7][8]
రాజధాని ప్రాంతపు అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (APCRDA)అభివృద్ధి సంస్థ ఏర్పాటైంది.[9][10][11] దీనిక సహాయంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ [12] ఏర్పాటైంది.
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరం నిర్మాణం కోసం సింగపూర్ ఆధారిత అస్కెన్డాస్-సిన్బ్రిడ్జ్, సెంకోకార్ డెవలప్మెంట్ కన్సార్టియాన్ని ప్రారంభించింది. కొత్త రాజధాని నగరం యొక్క మౌలిక సదుపాయాలు, 7-8 సంవత్సరాల దశలో, 33,000 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయబడతాయి. హడ్కో నుండి 7,500 కోట్లు, ప్రపంచ బ్యాంకు నుండి $ 500 మిలియన్లు, భారత ప్రభుత్వం నుండి 2,500 కోట్ల రూపాయలు, వీటిలో 1,500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. [13]
నిర్మాణంలో అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే, కర్నూలు, కడప ఫీడెర్ రోడ్ల మద్దతుతో కొనసాగుతున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుండి అమరావతికి వేగవంతమైన రహదారి ప్రవేశం కల్పిస్తుంది.[14][15] దాదాపు $ 1.8 బిలియన్ పెట్టుబడితో బిఆర్‌ఎస్ మెడిసిటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.[16][17] ప్రతిపాదనలు ఆర్ధిక, న్యాయ, ఆరోగ్య, క్రీడ, మాధ్యమాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి తొమ్మిది ఉప నగరాలు, నార్మన్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్, రిలయన్స్ గ్రూప్, NRDC- ఇండియా రూపొందించిన ప్రభుత్వ భవనాలు నగరంలోనే నిర్మిస్తారు.[18][19][20] ₹ 600 కోట్ల (US $ 83 మిలియన్), పై కేర్ సర్వీసెస్ తోటి, ఆరోగ్య సంరక్షణ 'బిపిఓ' మంగళగిరి ఐటి పార్కులో ప్రారంభించబడింది.[21][22] హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అనే ఒక ఐటి సంస్థ ఒకకేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.[23][24]
భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ రవాణా కొరకు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్ (HTT), అమరావతి, విజయవాడ నగరాలను అనుసంధానించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసింది. దీనిద్వారా ప్రయాణ కాలం ఆరు నిమిషాలకు తగ్గుతుంది.[25] సమీపంలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, తెనాలి [26] లతో అనుసంధానించబడిన అమరావతి వృత్తాకార రైలు మార్గము 105 కిలోమీటర్ల (65 మైళ్ళు) విస్తీర్ణంలో సుమారు ₹10,000 కోట్ల (US $ 1.4 బిలియన్) ఖర్చుఅంచనాతో ప్రతిపాదనలో ఉంది.[27]
2019 మే నాటికి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలు మినహా మిగిలిన పనులన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. ఒకటి రెండేళ్లలో రాజధాని నగరానికి ఓ రూపం వచ్చే అవకాశం ఉందని ఇంజనీరింగ్ పనులు పర్యవేక్షిస్తున్న వారు చెప్పారు.[28] జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని వికేంద్రీకరణ విధానంతో చాలా పనులు నిలిచిపోయాయి. కరకట్టు రోడ్డుని విస్తరించడం, అమరావతి నగర సంపర్క రహదారిని ప్రధాన జాతీయరహదారికి అనుసంధానం చేసే పనిని, ఇంకా అసంపూర్తిగా వున్న నిర్మాణాలను పూర్తి చేయాలని జగన్ ఆదేశించాడు.[29]
రాజధాని నగరం 217.23 చ.కి.మీ. (83.87 చ.మై. ) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[30][31] బీజ (సీడ్) రాజధాని 16.94 చ.కి.మీ. (6.54 చ.మై.) విస్తీర్ణంలో విస్తరించింది. దీనిలో మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి లోని 31 గ్రామాలు ఉన్నాయి.[32] ఈ నగరం విజయవాడ నగరానికి నైరుతి దిశలో 12 కి.మీ (7.5 మైళ్లు), గుంటూరు నగరం ఉత్తరదిశలో 24 కి.మీ. (15 మై.) దూరములో ఉంటుంది.[1][33][34]
మండలం | రాజధాని నగరంలో భాగమైన గ్రామాలు,కుగ్రామాలు |
---|---|
తుళ్ళూరు మండలం | అబ్బరాజుపాలెం, ఐనవోలు, అనంతవరం, బోరుపాలెం, దొండపాడు,కొండరాజుపాలెం (డి-జనాభా), లింగాయపాలెం (మోగులంకపాలెం గ్రామంతో సహా), మల్కాపురం, మందడం (తాళ్ళాయపాలెం గ్రామం ప్రాంతముతో సహా), నెక్కల్లు, నేలపాడు, పిచ్చికలపాలెం, రాయపూడి, శాఖమూరు, తుళ్ళూరు , ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం |
మంగళగిరి మండలం | కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు (నీరుకొండ గ్రామ ప్రాంతములతో సహా), నవులూరు, యర్రబాలెం (బేతపూడి గ్రామ ప్రాంతముతో సహా) |
తాడేపల్లి మండలం | పెనుమాక,నులకపేట, డోలాస్‌నగర్, ఉండవల్లి |
అమరావతిని రాజధాని ప్రాంతం అభివృద్ధి సంస్థ భవన నిర్మాణాలను, భూవినియోగ అనుమతులను నిర్వహిస్తుంది. ఇతర పరిపాలన ఈ ప్రాంతానికి సంబంధించిన జిల్లా అధికార వ్యవస్థల ద్వారా జరుగుతుంది. అన్ని ప్రభుత్వ సేవలు మన అమరావతి యాప్‌లో చేర్చబడ్డాయి.[35] ఆండ్రాయిడ్, ఐఒఎస్ స్మార్ట్ ఫోనులకొరకు యాప్‌లు [36][37] అందుబాటులో ఉన్నాయి.
తాత్కాలిక సచివాలయ భవనాలు నిర్మించబడ్డాయి. అమరావతిలో ప్రభుత్వోద్యోగుల కొరకు గృహనిర్మాణం చేపట్టబడింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాష్ట్ర రాజధానిలో భాగంగా ఉన్న మంగళగిరి మండలం, నవులూరు వద్ద నిర్మాణంలో ఉంది.[38][39]
అమరావతి నివాసితులు తెలుగు మాట్లాడే ప్రజలు. తెలుగురాష్ట్ర నగర అధికారిక భాష తెలుగు. హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.[40] ముస్లింలు, క్రిస్టియన్, బౌద్ధ సమాజాలు కూడా ఉన్నాయి. అమరేశ్వర స్వామి ఆలయం, అమరావతి మహాచైత్యం అనేవి అమరావతి హెరిటేజ్ కాంప్లెక్స్ లో ఉన్నాయి.[41][42][43]
ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీటీ- ఎపి) అమరావతిలోని క్యాంపస్‌లలో తరగతులను ప్రారంభించాయి.[44][45] అమృత విశ్వవిద్యాలయం, అమిటీ, ఇండోర్-యుకె ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (IUIH) కింగ్స్ కాలేజ్, లండన్ సహకారంతో ఇతరులు వారి క్యాంపస్ ఏర్పాటు చేసారు.[46][47][48][49]
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ , విజయవాడ, ఎన్టీఆర్ బస్సు స్టేషన్ గుంటూరు నుండి ఎపిఎస్‌ఆర్‌టిసిచే అమరావతి నగరానికి బస్సు సేవలున్నాయి.[50][51] నగరంలో రెండు కొత్త డిపోలు, ఎపిఎస్‌ఆర్‌టిసి యొక్క ఉత్తర, దక్షిణాన నిర్మించబడ్డాయి.[52] ఆటో రిక్షాలు కూడా అమరావతి రాష్ట్ర రాజధాని నగర ప్రాంతంలో తక్కువ దూరానికి పనిచేస్తాయి.[53]
అమరావతి సీడ్ రాజధాని రహదారి జాతీయ రహదారి 16 నుండి ప్రధాన రాజధాని ప్రాంతాన్ని చేరుకోవటానికి ఉపయోగపడే రహదారి.[54] విజయవాడ-అమరావతి రహదారి నగరాన్ని విజయవాడతో కలుపుతుంది.[55]
దేశవ్యాప్తంగా గమ్యస్థానాలకు ఎయిర్ కనెక్టివిటీని అందించడం ద్వారా గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రాజధాని ప్రాంతానికి సేవలు అందిస్తుంది.[56]
రాష్ట్ర రాజధానిలో భాగంగా ఉన్న, మంగళగిరి మండలంలోని మంగళగిరి చీరలు, వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ నుండి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్‌లో ఒకటిగా నమోదు చేయబడ్డాయి.[57][58]
2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం నియమించిన జియన్ఆర్ కమిటీ రాజధాని వికేంద్రీకరణను సూచించింది. దీనిలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పు ప్రతిపాదించారు. దీనికి అమరావతి రాజధాని ప్రాంతం రైతులనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. రిలే నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి.[59] దీనిగురించి అధ్యయనం కోసం బిసిజి సంస్థను నియమించగా, బిసిజి నివేదిక తయారు చేసింది. దీనిపై నిర్ణయం తీసుకొనడానికి హైపవర్ కమిటీ నియామకమైంది. హైపవర్ కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. 2020 జనవరి 20 న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లును అసంబ్లీలో ప్రవేశపెట్టాడు. ఆ తరువాత సిఆర్డిఎను రద్దు చేస్తూ అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత ప్రణాళిక, అభివృద్ధి బోర్డు బిల్లును ప్రవేశపెట్టాడు. తెలుగు దేశం సభ్యులను సస్పెండ్ చేసినతరువాత బిల్లులు ఆమోదం పొందాయి. అమరావతి ప్రాంత వాసుల వ్యతిరేకతను చల్లబరిచే ఉద్దేశంతో 10 సంవత్సరాల కౌలును 15 సంవత్సరాలకు, ఆ ప్రాంత రైతు కూలీలకు ఇచ్చే ఫించనును 2500 నుండి 5000 కు పెంచటం బిల్లులో చేర్చారు. ప్రాంత రైతుల అసెంబ్లీ ముట్టడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు[60][61] శాసనమండలిలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ ఉపసంహరణ బిల్లులపై వైకాప, తెదేపా సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. తెదేపా రూల్ 71 ను ఉపయోగించి బిల్లులను ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని చూసింది. రూల్ 71 పై చర్చ పూర్తయిన తర్వాత, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించాడు.[62] సెలెక్ట్ కమిటీ నిర్ణయానికి కనీసం మూడు నెలలు పట్టే అవకాశంవుంది. దీనిని ఎదుర్కొనటానికి శాసనసభ శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదించింది.[63] కమిటీల పూర్తి నివేదికలను గోప్యంగా ఉంచడం, అనుమానాలకు దారితీసింది.[64] జగన్ ప్రభుత్వం సమీకృత అభివృద్ధి. పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి,విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నరు ఆమోదముద్ర పడింది.[65]
2021 డిసెంబరు 17 నాటికి అమరావతి రాజధానిగా కొనసాగించాలని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకత్వంలో చేస్తున్న రైతుల పోరాటానికి రెండేళ్లు పూర్తయ్యింది. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజుల పాదయాత్ర అమరావతిలో ప్రారంభమై తిరుపతిలో ముగిసింది. ముగింపు సభలో విపక్షాల నాయకులు పాల్గొని పోరాటానికి మద్ధతు పలికారు. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఈ పోరాట కాలంలో 180 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వేలమంది రైతులు పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అమరావతిని అభివృద్ధి చేయవచ్చని అన్నాడు.[66] సంవత్సరం క్రిందట పోరాటం సంవత్సరం ముగింపు సభలో కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారు.[67]
రాజధాని వికేంద్రీకరణను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ల (అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టు WP 13919/2020 (AP CRDA),WP 14282/2020 (Decentralisation)), విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక ధర్మాసనాన్ని హైకోర్టు ఏర్పాటు చేసింది. దీనిలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకె.మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఎవి.శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి వుంటారు. 2020 జనవరి 24 గురువారం నుండి ఈ ధర్మాసనం విచారణ చేపట్టింది.[68] ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.[69] తదుపరి విచారణ ఆగస్టు 14 వరకు యదాతధ స్థితి కొనసాగాలని ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి వున్న ధర్మాసనం తీర్పు ఇచ్చింది.[70]
2020 అక్టోబరు 11 నాడు జగన్ పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు.[71] ప్రధాన న్యాయమూర్తి మహేశ్వర బదిలీ అయ్యాడు.[72]
ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకొనడానికి అంగీకరించింది. ఈ మేరకు 2021 నవంబరు 22 న మూడు రాజధానుల బిల్లులను రద్దు చేసి గత కాలపు CRDA బిల్లు అమలులోకి తెచ్చే బిల్లు ఆమోదంపొందింది. అదేసమయంలో త్వరలో లోపాలు లేని మూడు రాజధానుల మెరుగైన బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించాడు.[73] ఇది ఇలా వుండగా, 2022 మార్చి 3 న, ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు ఎం. సత్యనారాయణమూర్తి, డి.వి.ఎస్.ఎస్ సోమయాజులతో కూడిన ఉన్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. దీని ముఖ్యాంశాలు:.[74]
దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) నడచుకోవాలని తెలిపింది. అంతే కాకుండా, రిట్ పిటీషన్ వేసిన 64 మంది రైతులకు వారికి ఒక్కొక్కరికి 50,000చొప్పున కోర్టుఖర్చులివ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును 807 రోజులుగా ఉద్యమిస్తున్న రాజధాని ప్రాంత రైతులు స్వాగతించారు.[75]
ఇన్ సైడర్ ట్రేడింగ్: జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు శాసనసభలలో తెలియపరచిన తరువాత, పొలాల బేరాలకు సంబంధంలేని వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ పోలీసు యంత్రాంగం విచారణ చేసి పొలాలు కొన్న కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడ్డారని వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. వారు ఆ FIR లను కొట్టివేయాలని హైకోర్టులో పిటీషన్ వేయగా 2021 జనవరి 19 న న్యాయమూర్తి చీకటి మానవేంద్రనాథ్ రాయ్ వారిపై నమోదైన FIR లను రద్దుచేస్తూ తీర్పు ఇచ్చాడు. ఇన్ సైడర్ వ్యాపారం, కంపెనీల విషయంలో షేర్లు, బాండులకు సంబంధించినదని, దానిని పొలాల వ్యాపారాలకు అన్వయించలేమని, రాజధాని ఆ పొలాల ప్రాంతంలో రాబోతున్నదని కొనేవారికి ఒకవేళ తెలిసినా అమ్మేవారికి చెప్పవలసిన అవసరంలేదని తీర్పులో పేర్కొనబడింది.[76] ఈ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ కేసు కొట్టివేసింది.[77]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.