Remove ads
భారతీయ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి From Wikipedia, the free encyclopedia
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా [1] (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు.[2][3][4][5] అతను ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు.[6][7][8][9] అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.
నారా చంద్రబాబునాయుడు | |||
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జూన్ 12 - ప్రస్తుతం | |||
ముందు | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి | ||
---|---|---|---|
పదవీ కాలం 2004 మే 14 – 2014 జూన్ 2 | |||
ముందు | వై.యస్. రాజశేఖరరెడ్డి | ||
తరువాత | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి | ||
పదవీ కాలం 1995 సెప్టెంబరు 1 – 2004 మే 13 | |||
గవర్నరు | కృష్ణకాంత్ గోపాల రామానుజం సి.రంగరాజన్ సుర్జీత్ సింగ్ బర్నాలా | ||
ముందు | ఎన్.టి.రామారావు | ||
తరువాత | వై.యస్. రాజశేఖరరెడ్డి | ||
పదవీ కాలం 2014 జూన్ 8 – 2019 మే 23 | |||
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి | ||
శాసనసభ సభ్యుడు కుప్పం శాసనసభ నియోజకవర్గం | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1989 - ప్రస్తుతం | |||
ముందు | ఎన్.రంగస్వామి నాయుడు | ||
శాసనసభ సభ్యుడు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 1978 – 1983 | |||
తరువాత | మేడసాని వెంకట్రామనాయుడు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | నారావారిపల్లె, మద్రాసు రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, భారతదేశం) | 1950 ఏప్రిల్ 20||
రాజకీయ పార్టీ | 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (1978-1983) | ||
బంధువులు | నారా రామ్మూర్తినాయుడు (తమ్ముడు) ఎన్.టి.రామారావు(మామయ్య) నందమూరి బాలకృష్ణ(బావ) నందమూరి హరికృష్ణ(బావ) దగ్గుబాటి పురంధేశ్వరి(వదిన) జూనియర్ ఎన్. టి. ఆర్ (మేనల్లుడు) నందమూరి కళ్యాణ్‌రాం(మేనల్లుడు) నందమూరి తారకరత్న(మేనల్లుడు) నారా రోహిత్ (తమ్ముని కొడుకు) | ||
సంతానం | నారా లోకేశ్ (ఏకైక పుత్రుడు) | ||
నివాసం | అమరావతి, భారతదేశం హైదరాబాదు, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం | ||
మతం | హిందూ |
ఈయన చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20 వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు.[10][11] అతని తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి.[12] ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్ళి అచట 10వ తరగతి పూర్తిచేసి, తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో బి.ఎ., తరువాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరి లోని జిల్లాపరిషత్తు పాఠశాలలో చేరి 9వ తరగతిని పూర్తిచేశాడు.[13]
చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను, మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా ఉన్నాడు.[13]
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయ వ్యుహ చతురత బయటపడింది. తరువాత శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీచేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసిననూ స్థానిక నేతల కారణంగా విరమించుకోవలసి వచ్చింది.
చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సభ్యుడైనాడు. కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వబడినందున అతనికి ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు. కొంతకాలం తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ యేట నియమితులయ్యాడు.[14] కాంగ్రెస్ (ఐ) క్యాబినెట్ లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందాడు.[15] 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేశాడు.
సినీమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డాడు. 1981, సెప్టెంబరు 10 న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడాడు.[16]
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982, మార్చి 29న ప్రారంభించాడు.[17] అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. ఎన్.టి.ఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచాడు.
1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అద్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. తరువాత అతను తెలుగు దేశం పార్టీలో చేరాడు.[10] తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేశాడు.
1984లో ఎన్టీఆర్ గుండె చికిత్స కోసం అమెరికాకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్‌తో చేతులు కలిపి కొంత మంది శాసనసభ్యులను తనవైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకొన్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశాడు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు, తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నరైన రాంలాల్ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ అతనికి అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. ఆ సందర్భంలో చంద్రబాబునాయుడు తెలుగు దేశంపార్టీ శాసన సభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు, చంద్రబాబునాయుడుని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చాడు. భాస్కరరావు తిరుగుబాటు యత్నం తరువాత చంద్రబాబు తెలుగు దేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించాడు. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసాడు. 1989 ఎన్నికలలో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తగినంత మెజారిటీ లేక పోవడంతో, ప్రతిపక్ష హోదాతో శాసన సభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో, నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు.
1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్.టి.ఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది.[18]
1989 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పోటీచేసి 50,098 ఓట్లు సాధించి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.[19] కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నాడు.[20] 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ' ప్రతిజ్ఞ ' చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాలా బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది.[19]
1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. అతను ఆహార సబ్సిడీలను తగ్గించి, విద్యుత్ సుంకాలను పెంచాడు.[21] అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్‌డం ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లు హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడును కలిసారు.[7] అమెరికన్ మ్యాగజైన్ "టైమ్"కు చెందిన అపరిసిమ్ ఘోష్, " కేవలం ఐదు సంవత్సరాలలో, అతను గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని, భారత దేశ కొత్త సమాచార-సాంకేతిక కేంద్రంగా మార్చాడు." అని తెలిపాడు. ఆ పత్రిక అతనిని "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా అభివర్ణించింది.[22][23]
భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను "విజన్ 2020" పేరుతో ఈ ప్రణాళికను రూపొందించాడు. దీనిని యు.ఎస్. కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలసి కొన్ని ప్రతిపాదనలు చేసాడు.[7]
విజన్ 2020 ను అమలు చేయడం ద్వారా, నాయుడు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ, విద్యను ప్రైవేటీకరించాడు. ఇది పరోక్షంగా వ్యవసాయ భూముల నుండి చిన్న రైతులు పారదోలేందుకు, తద్వారా పశ్చిమ దేశాలలో వలె పెద్ద సంస్థల వల్ల వ్యవసాయం పెద్ద ఎత్తున చేయగలిగేందుకు దోహదపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం రైతులకు స్థిరమైన / లాభదాయకమైనది కాదనీ, రైతులు జీవనోపాధి కోసం ఇతర రంగాలను ఎన్నుకోవాలనీ తెలిపాడు. 2004 ఎన్నికలలో ఓటమి పాలవ్వడానికి ఇది కూడా ప్రధాన కారణమైంది.[7]
1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబరు 1న ప్రారంభించాడు. ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనంద దాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించాడు. అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు రూపొందించి అమలు చేశాడు. సాంకేతికాభివృద్ధిని అర్ధం చేసుకొని 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్ హైటెక్‌సిటి ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో 1998 సెప్టెంబరు 10న ‘పచ్చదనం–-పరిశుభ్రత’ కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసాడు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్థితో చేపట్టారు.[24]
1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్ మేకర్’గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించాడు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించాడు.[25]
1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు. అతను ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణస్వీకారం చేశాడు. 2000 ఏప్రిల్-అక్టోబరు మధ్య "నీరు-మీరు" కార్యక్రమాన్ని మొదలు పెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం.
ప్రధానంగా నగరాలు విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకంగా "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ ఔట్సోర్సింగ్ సర్వీసెస్" వంటి ముఖ్య విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికోసం చేసిన తన ప్రణాళికపై చర్చించాడు.[26] తన లక్ష్య సాధన కోసం అతను "బై బై బెంగళూర్, హలో హైదరాబాద్" నినాదాన్నిచ్చాడు.[27] మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు సెంటర్‌ను స్థాపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీయాటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం. నాయుడు ఇతర ఐ.టి కంపెనీలను (ఐ.బి.ఎం., డెల్, డెలోఇట్ట్, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఓరాకిల్) హైదరాబాదులో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్నందించాడు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సి.ఇ.ఓ లను ఒప్పించేందుకు కృషిచేసాడు.[8][28] అతని పదవీ కాలం చివరలో 2003-04 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాదు నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.[29] ఇది దేశంలో నాల్గవ అతి పెద్ద ఎగుమతి నగరంగా మారింది. 2013-14 లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి.[30] దీని ఫలితంగా హైదరాబాదులో IT & ITES రంగాలలో 320,000 మందికి ఉపాధి లభించింది.
రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన నారాయణన్ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చచెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు[25].
2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు.[31] ఈ సంఘటనలో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి బి.గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు సి.హెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవరు శ్రీనివాసరాజు లకు కూడా గాయాలైనాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ బాంబుదాడి కేసులో 2014లో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు 2014 సెప్టెంబరు 25, గురువారం తీర్పు చెప్పింది.[32]
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ రెండు సార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసన సభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్‌సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసన సభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.[33] కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షనాయకునిగా తన సేవలనందించాడు.
చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది.[34] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2014 జూన్ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.[35]
ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్ననమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాడు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా రెండెంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ తీసుకొచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం.[36]
1992లో హెరిటేజ్ ఫుడ్స్ గ్రూపును చంద్రబాబునాయుడు స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్ ఫుడ్స్. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది.[37]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తరువాత, నవ్యాంధ్ర కు ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. హైదరాబాదు వలె కాకుండా [38][39] అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐ.టి.సెజ్ - ప్రత్యేక ఆర్థిక జోన్ తో ఐ.టి.హబ్ [40]గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించాడు. అభివృద్ధిలో భాగంగా అతను "ఏ.పి క్లౌడ్ ఇనిషియేటివ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డిజిటల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసాడు.[41][42]
2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు.[43] ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు.
అతని నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టాడు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23, 25 పార్లమెంటు స్థానాలకు గాను 3 స్థానాలలో విజయం సాధించింది.
తెలుగు దేశం పార్టీకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఓడించి ఘన విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ మొత్తం 175 శాసన సభ స్థానాలకు 135 స్థానాల్లో విజయం సాధించింది. నాయుడు సారథ్యం లోని ఎన్‌డిఏ కూటమి 164 స్థానాల్లో గెలుపొంది, మునుపెన్నడూ లేనంత మెజారిటీ సాధించింది. రాయలసీమతో సహా ప్రతి చోటా కూటమి ఏకపక్ష విజయాలు సాధించడం జరిగింది. వైఎస్ఆర్ సిపి 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచి పెట్టుకు పోయింది.తెలుగు దేశం పార్టీ 135 స్థానాలతో ఆధిక్యం కోనసాగింది. జనసేన పార్టీ 21 స్థానాలు గెలిచి 100 శాతం ఫలితంతో భారీ సంచలనం సృష్టించింది. భారతీయ జనతా పార్టీ 8 చోట్ల కమల వికాసం చెందింది.[44]
చంద్రబాబ్ జీవిత చరిత్రపై పుస్తకాలు వచ్చాయి. వాటిలో కొన్ని:
నారా చంద్రబాబునాయుడు, ఎన్.టి.రామారావు కూతురు నందమూరి భువనేశ్వరిని పెళ్ళిచేసుకొని నందమూరి కుటుంబంలో భాగమయ్యాడు. ఈయన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, బ్రాహ్మణితో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు. వీరి కుమారుడు దేవాన్ష్.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.