Remove ads
ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గోదావరి నది ఒడ్డున ఉన్న కొండలు From Wikipedia, the free encyclopedia
పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. ఈ ప్రాంతం 1,012.86 కి.మీ2 (391.07 చ. మై.) విస్తీర్ణంలో వ్యాపించివుంది. ఇది అంతరించడానికి చేరువలో వున్న వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో జీవవైవిధ్యం గల ప్రదేశం. రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణ లోని భధ్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో వున్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది.[1]
ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ఇది ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణము కారణంగా ఆంధ్రా కాశ్మీరం అని పిలుస్తారు. ఈ ప్రాంత అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం ఉంది. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉన్నాయి.[1]
సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు ఈ ప్రాంతంలోనే తీశారు.[1]
రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణ లోని భధ్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది.
రాజమహేంద్రవరం నుండి పాపికొండల విహార యాత్ర దేవిపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడినుండి లాంచిలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి ఈశ్వరాలయం వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి చాలా తక్కువ వెడల్పుతో కొండల మధ్య ప్రవహిస్తూ మరింత రమణీయంగా వుంటుంది.[2][3]
భద్రాచలం నుండి తూర్పుగోదావరి జిల్లా లోని వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం చేసి పేరంటాలపల్లికి చేరవచ్చు.[4]
ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ పాపికొండల పర్యాటకం విహారయాత్రలకు 2021 జూలై 1 నాడు, 2019 సెప్టెంబరులో దుర్ఘటన జరిగిన 21 నెలల తర్వాత మరల అనుమతించింది[5]
పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, చీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పోలవరం వద్ద కట్టుతున్న ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది.
దగ్గరి రైల్వే స్టేషన్ రాజమండ్రిలో ఉంది.
దగ్గరి విమానాశ్రయం రాజమండ్రిలో ఉంది.
రాజమండ్రినుండి రోడ్డు మార్గంలో పురుషోత్త పట్నం చేరి అక్కడనుండి లాంచీలో ప్రయాణం మొదలవుతుంది.[3]
ఇక్కడ యాత్రికుల ఆలయ సందర్శన కోసం లాంచి ఆగుతుంది.
త్రిశూలం, బంగారు బుల్లోడు చిత్రాలకు చిత్రీకరణ ఇక్కడే జరిగింది.
దేవీపట్నం పోలీస్ స్టేషన్ లో ప్రయాణీకుల వివరాలు అందచేయటానికి లాంచి ఆగుతుంది. దీని తరువాత మొబైల్ ఫోనులు పనిచేయవు, రోడ్డు రవాణా ద్వారా అత్యవసర సేవలు అందుబాటులో వుండవు. ఇక్కడ సీతారామరాజు ముట్టడించిన పాత పోలీస్ స్టేషన్ చూడవచ్చు.
రెండు రోజుల యాత్ర చేసేవారు బసచేయడానికి కొల్లూరులో దిగుతారు. ఇక్కడ వెదురుగుడిసెలున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలోని పేరంటాలపల్లి దగ్గర గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనే ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్దంలో రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్ధులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
భద్రాచలం నుండి పాపికొండల యాత్ర చేసేవారు తూర్పు గోదావరి జిల్లాలో శ్రీరామగిరి గ్రామంలో శ్రీరామగిరి పుణ్యక్షేత్రం సందర్శించవచ్చు. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. పక్కనే ఎత్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటాయువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
2019 సెప్టెంబరులో పోలవరం నుండి పాపికొండలుకు బయలు దేరిన రాయల్ వశిష్ట పడవ కచులూరు సమీపంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది సురక్షితంగా బయటపడగా 45 పైగా ప్రయాణికులు చనిపోయారు.[6] చాలా ప్రయత్నాల తరువాత, నెలరోజులకు ధర్మాడి సత్యం నేతృత్వంలోని బృందం మునిగిపోయిన బోట్ ను వెలికీతీయటంలో విజయం సాధించింది.[7]
రెండేండ్ల క్రితం కట్టలూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన తర్వాత పర్యాటకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తరిగి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విహారయాత్రకు అనుమతించాయి. దీంతో 2021 డిసెంబరు 18న పరిమిత సంఖ్యలో బోట్లతో భద్రాచలానికి 60 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం పోచవరం నుంచి పాపికొండల విహార యాత్ర పునః ప్రారంభమైంది. యాత్ర సజావుగా సాగేందుకు రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేస్తాయి. ప్రతి బోట్‌లో శాటిలైట్ ఫోన్, జీపీఎస్ ట్రాకర్స్ అందుబాటులో ఉంటాయి.[8]
బోటులో చెక్ చేయడానికి రాజమండ్రి నుండి పట్టిసీమ రేవు/ పోలవరం రేవు/ పురుషోత్తపట్నం రేవు వరకు ఉదయం 7:30 గంటలకు ప్రయాణం ప్రారంభమవుతుంది. పడవలోకి ప్రవేశించిన తరువాత పర్యాటకులు పోలవరం ప్రాజెక్ట్ సైట్‌ను చూడవచ్చు, ఇది పాపి హిల్స్ పర్యటనలో సివిల్ ఇంజనీరింగ్ అద్భుతం. భద్రాచలం బోట్ పర్యాటకం ద్వారా సందర్శించదగిన చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశం. రాజమండ్రిలో టిక్కెట్ బుకింగ్ చేయవచ్చు, ఎందుకంటే సాధారణ బోట్‌లకు ఒక పూర్తి రోజుకు పిల్లలు, పెద్దలకు ధర బ్యాండ్ రూ. 1,000 నుండి 1200 వరకు ఉంటుంది, ఎయిర్ కండిషన్డ్ బోట్‌లకు సింగిల్ డే ప్యాకేజీలో అదనపు మొత్తం చెల్లించాలి.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.