Remove ads
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా From Wikipedia, the free encyclopedia
విజయనగరం జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. జిల్లా కేంద్రం విజయనగరం. 2022 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధి ప్రాతిపదికగా జిల్లా చేయుటకు, పార్వతీపురం రెవెన్యూ డివిజనులోని 11 మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చి, శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజనులోని 4 మండలాలు జిల్లాలో కలిపారు.
విజయనగరం జిల్లా | |
---|---|
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | ఉత్తరాంధ్ర |
ప్రధాన కార్యాలయం | విజయనగరం |
విస్తీర్ణం | |
• Total | 4,122 కి.మీ2 (1,592 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 19,30,800 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
భాషలు | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0 |
బొబ్బిలి కోట, విజయనగరం కోట, విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఆలయం జామి వృక్షం,రామతీర్థంలో ప్రాచీన శ్రీరామ దేవాలయం, బౌద్ధక్షేత్రం అవశేషాలు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.
దీర్ఘతమసుడు అనే రాజు అంగవంగ కళింగాలని ఏక దేశంగా చేసుకొని పాలించాడని మహా భారతంలో చెప్పబడింది. [ఆధారం చూపాలి] ఈ ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగం. బౌద్ధ, జైన మతాలు ఎక్కువ ప్రాభవం పొందాయి. సాలిహుండం మొదలు కొని జామి వరకూ బౌద్ధులూ జైనులూ నివసించారనడానికి ఆధారాలున్నాయి. అశోకుని సైతం అహింసావాదిగా మార్చిన అమృత సీమ ఈ కళింగసీమ అంటారు. [ఆధారం చూపాలి]
క్రీ.పూ. 4వ శతాబ్దం నాటికే గోదావరి, మహానదుల మధ్య భాగాన్ని అంటే కటక్ నుంచి పిఠాపురం వరకూ ఉన్న ప్రాంతాన్ని కళింగదేశం అన్నారు. కళింగ దేశంలో ఏనుగులు ఎక్కువని అందుకే ఇక్కడి రాజులకి "గజపతులు" అని పేరు వచ్చిందని అర్ధశాస్త్రంలో ఉంది. విదేశీ చరిత్రకారులు ప్లీనీ, మెగస్తనీస్, హుయన్ చాంగ్ లు కళింగ దేశ నాగరికత గురించి రాశారు. కళింగ భూములు ఎంతో సారవంతమయినవని, బెల్లంకొండ నుంచి పాలకొండ వరకూ ఎన్నో కొండలున్నాయని ప్లీనీ రాశాడు. అక్కడి ప్రజలు మోటు వారయినా న్యాయం తప్పని వారని హుయాన్ చాంగ్ రాశాడు.
తూర్పు గాంగులు ఈ ప్రాంతాన్ని బహుకాలం పాలించారు. మధ్యయుగంలో దక్ష్ణిణకళింగంలో వడ్డాది మత్స్య వంశీయులు, జంతర్నారు, వీరకోతాం పల్లవులు మొదలగు చిన్నచిన్న రాజ్యాలు తలెత్తాయి. గోల్కొండ నవాబ్, మొఘల్ ఫౌజ్ దారీల అధికారం ఈ ప్రాంతంపై చెల్లింది. 17వ శతాబ్దం మధ్యలో విజయనగరం, బొబ్బిలి సంస్థానాలు ఏర్పడ్డాయి. అంతకుముందు జయపురం ఒరిస్సా సంస్థానం, ఈ ప్రాంతమందు విస్తరించుకొని ఉండేది. ఆండ్ర, సాలూరు, సంగమవలస, పాచిపెంట, పార్వతీపురం మొదలగు చిన్న సంస్థానాలు జయపురం వారి చేతనే సృష్టించబడినవి. తూర్పు గాంగులకు, చోళులకు మధ్య రాజకీయ వైవాహిక సంబంధాలు ఏర్పడిన మీదట, ఇక్కడ ప్రాంతాల పేర్లు క్రమేపి మార్పు చెందాయి. గంగచోళ్ళపేట (చోళ+గంగ), చోడవరం మొదలైనవి. చోళ్ళు అనేవి ఆహారధాన్యాలలో ఒకటిగా ఉన్నాయి. వాటికి ఆపేరు కూడా చోళ సంబంధం వలన వచ్చిందే! తూర్పు గంగ రాజులలో మూడవ అనియంక భీముడు (12-11-1238) ప్రముఖుడు. భీమ నామధేయులు వడ్డాది మత్స్య వంశీకులలోనూ కనిపిస్తారు. భీమవరం అనేగ్రామం బాడంగి, శృంగవరపుకోట, చీపురుపల్లి తాలూకాలలో ఉంది. తూర్పు గాంగుల ముఖ్య దైవం మధుకేశ్వరుడు. గజపతినగరంలో అందుకే మధుపాడ అనే గ్రామం ఉంది. [ఆధారం చూపాలి]
బొబ్బిలికి 13 మైళ్ళదూరంలో 11వ శతాబ్దానికి చెందిన నీలేశ్వరాలయం నారాయణపురంలో ఉంది. అక్కడ రేపర్తి నాయకుల శాసనాలు కూడా లభించాయి. వారిలో మేడపరాజు (1100-1180) ప్రముఖుడు. ఇతని పేరుతోనే కాబోలు పెదమేడపల్లి, చినమేడపల్లి (గ) ఏర్పడినవి. అలానే జయపురం సంస్థానీయుల మూలపురుషుల పేర్లతో ఏర్పడిన గ్రామాలు, నందాపురం, భరిపురం, ముకుందరాజపురం, విశ్వనాధపురం, వినాయకపల్లి, బలభద్రారాజపురం మొదలైనవి. పూసపాటి వారి తొలి స్థావరాలలో ఒకటి కుమిలి. దీని ప్రాచీన నామధేయం కుంభిశాపురం. కుమిలి కోటకట్టిన కృష్ణంరాజు పితామహుడు పెదకృష్ణభూపతి. ఇతని పేరుమీదన వెలసిందే పెదకృష్ణరాజపురం. గజపతినగరం, శృంగవరపుకోట, వియ్యంపేట, పార్వతీపురం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, బాడంగి తాలూకాలలో మొత్తం 11 సీతారామపురాలు ఉన్నాయి. పూసపాటి పాలకులలో దేవులపల్లి పాలకుడు సీతారామరాజు (1717-1741), ఇంకా దివాన్ సీతారామరాజు (1748-1794) పేర్ల మీదనే ఏర్పడి ఉండవచ్చును.కురుపాం సంస్థాన సంపాదకుడు సన్యాసిదొర. పెద సన్యాసిరాజు కుమారుడు శివరామరాజు (1740-1794). ఈతని కుమారుడు చిన సన్యాసిరాజు పేరుతోనే 1803లో శాశ్వత పరిష్కారం జరిగింది. ఇతని దత్తపుత్రుడు సీతారామరాజు 1830లో చనిపోగా అతని భార్య సుభద్రమ్మ 1841లో ఆమె మరణకాలంవరకు జమీను నిర్వహించింది. వీరి పేర్లమీదన పలు గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. శృంగవరపు సంస్థానానికి మరియొకపేరు కాశీపురం. బొబ్బిలి యుద్ధంలో (1757) విజయనగరం పక్షం వహించాడు ముఖీకాశీపతిరాజు. కాశీపతిరాజపురం ఇప్పటికీ శృంగవరపుకోట తాలూకాలో ఉంది. అందువలన ఈ జిల్లాలో అధికభాగం గ్రామాలు లేదా ప్రాంతాల పేర్లు ఈప్రాంతాన్ని ఏలిన రాజవంశీయుల, జమిందారుల, తదాశ్రితుల రాజోద్యోగుల, కవి పండితుల గృహనామాలబట్టి ఏర్పడినవి. 17వశతాబ్దం నుంచి ఈప్రాంతంనందు గ్రామాలు ఎక్కువగా ఏర్పడినట్లు గ్రహించవచ్చు. వలసలు ఎక్కువగా ఉండటంవలన ఒకప్రాంతంనుండి వేరొక ప్రాంతానికి వలసిపోయారు. అందుకే పెక్కుగ్రామాల పేర్లు వలస చివరగా ఉండును. [ఆధారం చూపాలి]
సా.శ.1713 విజయదశమి జయవారం నాడు విజయరామరాజు పేరన నిర్మించబడింది కావున పంచజయశబ్దపూర్వకంగా విజయనగరం అనే పేరు వచ్చింది. తరువాత ఈ పేరుతోనే జిల్లా ఏర్పడింది.
జిల్లా 1979 జూన్ 1 న ఏర్పడింది. జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 34 మండలాలు, 1552 రెవెన్యూ గ్రామాలు వుండేయి.[2] 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 2,342,868.
2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పార్వతీపురం రెవెన్యూ డివిజనులోని 11 మండలాలు కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో చేరాయి. అలాగే శ్రీకాకుళం జిల్లా, పాలకొండ రెవెన్యూ డివిజను లోని 4 మండలాలు జిల్లాలో చేరాయి. ఫలితంగా జిల్లాలో 27 మండలాలున్నాయి.[1] బొండపల్లి మండలాన్ని బొబ్బిలి రెవెన్యూ డివిజన్ పరిధి నుండి విజయనగరం రెవెన్యూ పరిధికి మార్చారు.[3]
2022 లో సవరించిన జిల్లా పరిధి ప్రకారం, జిల్లా విస్తీర్ణం 4122 చ.కి.మీ.[1] జిల్లాకు ఉత్తరాన పార్వతీపురం మన్యం జిల్లా, తూర్పున శ్రీకాకుళం జిల్లా, దక్షిణాన విశాఖపట్నం జిల్లా, బంగాళాఖాతం, పశ్చిమాన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. Map
ఉమ్మడి జిల్లాలో గోస్తని, చంపావతి, నాగావళి, గోముఖి, సువర్ణముఖి, వేగావతి నదులున్నాయి.
అడవులు ఉమ్మడి జిల్లా ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. జిల్లాలో అడవుల రకాలు: 1. దక్షిణ ఉష్ణమండల మిశ్రమ ఆకురాల్చే అడవులు, 2. ఉత్తర ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు, 3. దక్షిణ ఉష్ణమండల పొడి మిశ్రమ ఆకురాల్చే అడవులు, 4. పొడి ఆకురాల్చే పచ్చని అడవులు 5. పొడి సతత హరిత అడవులు.
ఇక్కడి ప్రధానమైన జంతువులు గబ్బిలాలు, ఎలుగుబంట్లు, అడవి దున్న, నక్క, హైనా, తోడేలు, ముంగిస మొదలైనవి. ఇక్కడి పక్షులలో పావురాలు, కాకి, పిచ్చుక మైనా ముఖ్యమైనవి.
శీతోష్ణస్థితి డేటా - విజయనగరం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 38.7 (101.7) |
31.3 (88.3) |
36.2 (97.2) |
37.2 (99.0) |
37.0 (98.6) |
35.1 (95.2) |
32.9 (91.2) |
32.8 (91.0) |
33.3 (91.9) |
31.9 (89.4) |
30.2 (86.4) |
29.8 (85.6) |
33.87 (92.97) |
సగటు అల్ప °C (°F) | 17.2 (63.0) |
19.1 (66.4) |
23.2 (73.8) |
26.1 (79.0) |
27.0 (80.6) |
26.8 (80.2) |
25.7 (78.3) |
26.3 (79.3) |
25.7 (78.3) |
22.8 (73.0) |
19.5 (67.1) |
17.1 (62.8) |
23.04 (73.47) |
సగటు అవపాతం mm (inches) | 11.4 (0.45) |
7.7 (0.30) |
7.5 (0.30) |
27.6 (1.09) |
57.8 (2.28) |
105.6 (4.16) |
134.6 (5.30) |
141.2 (5.56) |
174.8 (6.88) |
204.3 (8.04) |
65.3 (2.57) |
7.9 (0.31) |
945.7 (37.23) |
Source: [4] |
2022 లో సవరించిన జిల్లా పరిధి ప్రకారం, 2011 జనగణన ఆధారంగా జిల్లా జనాభా 19.308 లక్షలు.[1]
జిల్లా 3 రెవెన్యూ డివిజన్లున్నాయి. అందులో విజయనగరం పాత రెవెన్యూ డివిజను కాగా, బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్లు జిల్లాలో కొత్తగా ఏర్పడ్డాయి,
నెల్లిమర్ల మండలం చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ నుండి విజయనగరం రెవెన్యూ డివిజన్ కు నవంబరు 2022 న మార్చారు.[5]
నగరం:విజయనగరం
జిల్లాలో 955 గ్రామాలు, 777 గ్రామ పంచాయతీలున్నాయి.[6]
జాతీయ రహదారి 16 భోగాపురం మండలం,పూసపాటిరేగ మండలాలలో గుండా పోతుంది. జాతీయ రహదారి 26 జిల్లాలో విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం పట్టణాలను అనుసంధానిస్తుంది. రైల్వే మార్గాలు దక్షిణతీర రైల్వే జోన్ లో వాల్తేర్ విభాగం పరిధిలోకి వస్తాయి. విజయనగరం, కొత్తవలసలో ప్రధాన రైల్వేస్టేషన్లు. సమీప విమానాశ్రయం విశాఖపట్నంలో ఉంది.
ఉమ్మడి జిల్లా అక్షరాస్యత రేటు 51.82% రాష్ట్ర సరాసరి 61.55% కన్నా బాగా తక్కువ. ఈ జిల్లాలో 2379 ప్రాథమిక పాఠశాలలు, 462 ప్రాథమికోన్నత పాఠశాలలు, 341 ఉన్నత పాఠశాలలు (2004-2005 అంచనాల ప్రకారం) ఉన్నాయి. అదే ఉన్నత విద్యలో 81 జూనియర్, 33 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ 14 పారిశ్రామిక శిక్షణా సంస్థలు, 2 పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. అదే 9 బి.ఇడి. కళాశాలు, ఒక ఎమ్.ఎడి. కళాశాల, ఒక సంస్కృత కళాశాల, ఒక సంగీత నృత్య కళాశాలలు కూడా ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రింద ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, 5 ఇంజినీరింగ్ కళాశాలలు, 2 న్యాయ కళాశాలలు, ఒక వైద్య కళాశాల ఈ జిల్లాలో స్థాపించబడ్డాయి.
జిల్లా పరిధి సవరించిన తర్వాత జిల్లా అక్షరాస్యత 53.21%.[6]
ఈ జిల్లాలో 38 గ్రంథాలయ శాఖలు ఉన్నాయి.
చెరకు, వరి, మామిడి, టమాటా, ప్రధాన ఉత్పత్తులు.
ఉమ్మడి జిల్లాలోని ప్రారిశ్రామిక అభివృద్ధి ప్రధానంగా వ్యవసాయ పంటల మీద ఆధారపడింది. వీనిలో నార మిల్లులు, చక్కెర కర్మాగారాలు, ధాన్యం, నూనె మిల్లులు, పెంకుల తయారీ ముఖ్యమైనవి. ఇక్కడి ఖనిజాల్ని ఫేకర్, ఇతర పరిశ్రమలు వినియోగిస్తున్నాయి. ఈ జిల్లాలో సుమారు 520 కర్మాగారాలు నమోదు చేయబడి ఇంచుమించు 27,800 కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.
ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల సాంఘిక కట్టుబాట్లు చిన్న తేడాలతో దక్షిణ భారతీయ పద్ధతిలో ఉంటాయి. ఇక్కడి ప్రజలు మృదు స్వభావం, జాలిగలిగి, గట్టి కుటుంబ వ్యవస్థను కలిగివుంటారు. గురజాడ అప్పారావు నవలలు, నాటకాలు, గీతాలు, కథలు ఈ ప్రాంత భాషా సంస్కృతులను ప్రతిబింబిస్తాయి.
దసరా ఉత్సవాలలో భాగంలో జరిగే నవరాత్రోత్సవాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఆ తొమ్మిది రోజులు నాటకాలు, హరికథలు, బుర్రకథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్న పట్టణాలు కళకలలాడుతాయి. విజయనగరంలోని గ్రామదేవతైన పైడితల్లి అమ్మవారి పండుగ ప్రసిద్ధి చెందింది.
ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో 44 లక్షల మంది పైచిలుకు, 2016లో 55 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.