కటక్

ఒడిశాలో రెండవ అతిపెద్ద నగరం From Wikipedia, the free encyclopedia

కటక్
Remove ads

కటక్ ఒడిషా రాష్ట్రానికి పూర్వ రాజధాని. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం. ఇది కటక్ జిల్లాకు ప్రధాన కేంద్రం. కోట అనే అర్ధం గల కటకా ఈ నగరపు అసలు పేరు. పురాతన బారాబతి కోట ఈ పేరుకు మూలం. ఈ కోట చుట్టూరానే నగరం తొలుత అభివృద్ధి చెందింది.సా.శ. 989 లో మర్కత కేశరీ రాజు కటక్ రాజధానిగా పరిపాలించాడు.[18] తరువాత బ్రిటిష్ శకం వరకు ఈ నగరాన్ని చాలా మంది పాలకులు రాజధానిగా ఉపయోగించారు. ఆ తరువాత in 1970 భువనేశ్వర్ ఒడిశా రాజధాని అయ్యింది.[19] 1000 సంవత్సరాల చరిత్ర, ప్రసిద్ధి గాంచిన వెండి ఫిలిగ్రీ పనుల కారణంగా కటక్‌ను మిలీనియం సిటీ అని, సిల్వర్ సిటీ అనీ పిలుస్తారు. ఒరిస్సా హైకోర్టు [2] ఇక్కడే ఉంది. ఇది ఒడిశా వాణిజ్య రాజధాని. నగరం లోను, చుట్టుపక్కలా అనేక వ్యాపార సంస్థలున్నాయి. కటక్ దుర్గా పూజకు ప్రసిద్ధి చెందింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మస్థలం కటక్. భారత ప్రభుత్వం ఉపయోగించే ర్యాంకింగ్ సిస్టమ్ ప్రకారం ఈ నగరాన్ని టయర్-II నగరంగా వర్గీకరించారు.[3][4][5]

త్వరిత వాస్తవాలు కటక్ కటక, దేశం ...
Remove ads

పాత నగరం కథజోడి, మహానది నదుల మధ్య ఉన్న భూభాగంలో ఉంది. దీనికి ఆగ్నేయ సరిహద్దుగా పాత జగన్నాథ్ రహదారి ఉంది.[6] 59 వార్డులతో కూడిన కటక్ మున్సిపల్ కార్పొరేషను నగర పరిపాలన నిర్వహిస్తుంది.[7] కటక్ నగరం, దక్షిణాన కథజోడి మీదుగా ఫుల్నాఖరా నుండి ఉత్తరాన బిరూపా నది మీదుగా చౌద్వార్ వరకు విస్తరించి ఉంది. తూర్పున కందర్‌పూర్ వద్ద ప్రారంభమై పశ్చిమాన నారాజ్ వరకు వెళుతుంది. మహానది దాని ఉపనదులైన కథజోడి, కుఖాయ్, బిరుపాలు నగరం గుండా ప్రవహిస్తున్నాయి. కథజోడి నది కూడా ఇక్కడ దేవి, బిలుఖాయి అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. వీటన్నిటి కారణంగా నగర భౌగోళికం దారాలతో అల్లుకున్నట్లుగా కనిపిస్తుంది.

కటక్, భువనేశ్వర్‌లను ఒడిశా జంట నగరాలుగా పేర్కొంటారు. రెండు నగరాలతో ఏర్పడిన మెట్రోపాలిటన్ ప్రాంతం జనాభా 2018లో 18.62 లక్షలు [8] కటక్ ఒక ప్రణాళిక లేని నగరం. వీధులు, సందులు, గొందులతో ఉంటుంది. అందుకే ఈ నగరాన్ని బౌనా బజార్, టెపనా గలీ అని పిలుస్తారు. దీనికి అర్థం - 52 వీధులు, 53 సందులు అని.

Remove ads

చరిత్ర

కటక్ తొలి లిఖిత చరిత్ర కేశరి రాజవంశం నాటిది .[9] విశిష్ట చరిత్రకారుడు ఆండ్రూ స్టిర్లింగ్ చెప్పినట్లుగా, ప్రస్తుత కటక్ సా.శ. 989 లో కేశరి రాజవంశానికి చెందిన రాజు నృప కేశరి సైనిక కంటోన్మెంట్‌గా స్థాపించాడు. స్టిర్లింగ్ తన అభిప్రాయాన్ని పూరీలోని జగన్నాథ దేవాలయ చరిత్ర అయిన మదాల పంజిపై ఆధారపడి చెప్పాడు.[10] సా.శ. 1002 లో వచ్చిన వరదల నుండి కొత్త రాజధానిని రక్షించడానికి నిర్మించిన రాతి కట్టకు మహారాజా మర్కట కేశరి పాలన ప్రసిద్ధి చెందింది.

1211 CEలో గంగా రాజవంశానికి చెందిన రాజా అనంగభిమదేవ III స్థాపించిన రాజ్యానికి కటక్ రాజధానిగా మారిందని చారిత్రక, పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి.[11] గంగా పాలన ముగిసిన తరువాత ఒడిషా, సూర్యవంశీ గజపతి రాజవంశం (1434-1541 CE) చేతుల్లోకి వెళ్లింది, వీరి ఆధ్వర్యంలో కటక్ ఒడిషా రాజధానిగా కొనసాగింది.[11] ఒరిస్సా చివరి హిందూరాజైన రాజా ముకుంద దేవ [12] మరణం తరువాత, కటక్ మొదట ముస్లిం పాలనలోను, ఆ తరువాత మొఘలుల క్రిందకూ వచ్చింది.[13] మొగలులు కటక్‌ను షాజహాన్ పాలన కింద కొత్త ఒరిస్సా సుబాహ్ (సామ్రాజ్య అత్యున్నత స్థాయి ప్రావిన్స్) గా చేసారు.

1750 నాటికి, కటక్ మరాఠా సామ్రాజ్యం క్రిందకు వచ్చింది. ఇది నాగ్‌పూర్‌లోని భోన్సాలే మరాఠాలు, బెంగాల్‌లోని ఆంగ్ల వ్యాపారుల మధ్య సంబంధానికి అనుకూలమైన ప్రదేశంగా వ్యాపార కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందింది. 1750లో కటక్‌ను, 1758లో అట్టోక్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత మరాఠా సామ్రాజ్యపు పరిధిని వివరించడానికి "అట్టోక్ నుండి కటక్ దాకా" ( అటాక్ టు కటక్) అనేది వాడుక లోకి వచ్చింది. కటక్‌ను 1803లో బ్రిటిషు వారు ఆక్రమించారు. తరువాత 1816లో ఒడిషా డివిజన్‌కు రాజధానిగా మారింది. 1948 లో, రాజధానిని భువనేశ్వర్‌కు మార్చినప్పటి నుండి, నగరం ఒడిషా రాష్ట్రానికి పరిపాలనా ప్రధాన కార్యాలయంగా కొనసాగింది.

Remove ads

భౌగోళికం

కటక్ 20°31′23″N 085°47′17″E వద్ద సముద్రమట్టం నుండి 36 మీ. ఎత్తున ఉంది. నగరం 192.5 కి.మీ2 (74 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. నగరం, 59 వార్డులను కలిగి ఉన్న కటక్ మున్సిపల్ కార్పొరేషన్ . నగరం దక్షిణాన ఫుల్నాఖర నుండి ఉత్తరాన చౌద్వార్, తూర్పున కందర్పూర్ నుండి పశ్చిమాన నారాజ్ వరకు విస్తరించి ఉంది. ప్రధాన నగరం మహానది నది డెల్టా మొగదలలో ఉంది. మహానది కాకుండా, దాని నాలుగు పాయలు మహానది, కథజోడి, కౌఖాయ్, బిరూప కూడా నగరం గుండా ప్రవహిస్తాయి. కథజోడి మళ్ళీ రెండు పాయలుగా చీలుతుంది. కుడివైపు పాయ దేవి, ఎడమవైపుది బిలుఖై. మహానది ప్రధాన నగరాన్ని జగత్‌పూర్ పారిశ్రామిక ప్రాంతం నుండి వేరు చేస్తూ ఉత్తరం వైపున నగరం గుండా వెళుతుంది. ప్రధాన నగరాన్ని గోపాల్‌పూర్ నుండి వేరు చేసిన తర్వాత కథజోడి నది బయాలిస్ మౌజా (42 వార్డులు) ద్వీపాన్ని ఏర్పరుస్తుంది. కౌఖాయ్ నది నగరం దక్షిణ భాగాన్ని ప్రతాప్ నగరి నారన్‌పూర్ అనే రెండు భాగాలుగా విభజిస్తుంది. భువనేశ్వర్‌లోకి ప్రవేశించే ముందు కువాఖాయ్ నగరానికి దక్షిణాన ఫుల్నాఖరా వెంట నడుస్తుంది. బిరూప నది జగత్‌పూర్ పారిశ్రామిక ప్రాంతానికి ఉత్తరం గుండా ప్రవహిస్తూ దీనిని చౌద్వార్ నుండి వేరు చేస్తుంది.

నగరంలో వర్షపు నీటిని నిల్వ చేసే అనేక చెరువులు ఉన్నాయి. మహానది నగరానికి తాగునీటిని చాలా వరకు అందిస్తుంది. నగరం పెరుగుదల కథజోడి నదికు ఆవల విస్తరణకు దారితీసింది. కథజోడి, మహానది ల మధ్య ఒక కొత్త టౌన్‌షిప్ - మర్కట్ నగర్ ఏర్పడింది. ఇది 2000 ఎకరాల్లో విస్తరించి ఉంది.

CDAలో 15 సెక్టార్‌లు ఉన్నాయి, వాటిలో 11 జనావాసాలు. వీటి జనాభా 1,50,000. జగత్‌పూర్ & మహానది విహార్ నగరంలోని ఇతర రెండు టౌన్‌షిప్‌లు. మహానది విహార్ ఒడిశాలో మొదటి శాటిలైట్ సిటీ ప్రాజెక్ట్. కటక్‌ని బాబాన్ బజార్, తెప్పన్ గలీ అని అంటారు. అంటే ఇది 52 వీధులు 53 సందుల నగరం అని అర్థం. కథజోడి నదికి అవతలి వైపున ఉన్న త్రిశూలియాలో నారన్‌పూర్ మరో ఉపగ్రహ టౌన్‌షిప్ రాబోతోంది.

Remove ads

శీతోష్ణస్థితి

కటక్‌లో ఉష్ణమండల తడి, పొడి వాతావరణం ఉంటుంది. మార్చి నుండి జూన్ వరకు ఉంటుండే వేసవిలో వాతావరణం వేడిగా, తేమగా ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 35 °C నుండి 40 °C ఉంటుంది. వేసవిలో ఉరుములతో కూడిన గాలివానలు ఉంటూంటాయి. నైరుతి రుతుపవనాల ద్వారా నగరంలో వర్షపాతం నమోదయ్యే వర్షాకాలం జూలై నుండి అక్టోబరు మధ్య ఉంటుంది. వార్షిక వర్షపాతం దాదాపు 144 సెం.మీ. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి, సగటున 30 °C ఉంటుంది. నవంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం తేలికపాటి ఉష్ణోగ్రతలతో, అప్పుడప్పుడు జల్లులతో ఉంటుంది. ఉష్ణోగ్రత సుమారు 15 °C వరకు తగ్గుతుంది.[14]

మరింత సమాచారం శీతోష్ణస్థితి డేటా - Cuttack (1981–2010, extremes 1901–2010), నెల ...

జనాభా వివరాలు

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[17] 2011లో కటక్ జనాభా 6,06,007: 331,246 పురుషులు, 302,477 స్త్రీలు. దీని పట్టణ ప్రాంత/ మెట్రోపాలిటన్ జనాభా 6,58,986, అందులో 331,246 మంది పురుషులు, 327,740 మంది స్త్రీలు. 0–6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 48,585 మంది. ఇది కటక్ జనాభాలో 8.02%: వీరిలో 25,358 మంది బాలురు, 23,227 మంది బాలికలు. లింగ నిష్పత్తి 997. పిల్లల్లో ఇది 916.

ఆర్థిక వ్యవస్థ

కటక్‌ను ఒడిశా వాణిజ్య రాజధానిగా పిలుస్తారు. పెద్ద వ్యాపార సంస్థలు, ఫెర్రస్ మిశ్రమాలు, ఉక్కు, లాజిస్టిక్స్ నుండి వ్యవసాయం, వస్త్రాలు, హస్తకళల వంటి సాంప్రదాయ పరిశ్రమల వరకు అనేక రకాల పరిశ్రమల కారణంగా ఒడిషా జిడిపికి రాష్ట్రం లోని మిగతా నగరాల కంటే ఇదే అతిపెద్ద దోహదకారి. జాతీయ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అనేక వ్యాపార సంస్థలు నగరంలో ఉన్నాయి. నగరం నుండి 85 కి.మీ. దూరంలో ఉన్న పారాదీప్ రేవు నగర పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తోంది.[18]

సాంప్రదాయిక పరిశ్రమలు

ఈ నగరం వస్త్రాలకు తూర్పు భారతదేశంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంది. నగర వార్షిక వస్త్ర వ్యాపారం ఒక బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. నగర శివార్లలోని ఒరిస్సా టెక్స్‌టైల్ మిల్స్‌కు కొత్త రూపాన్ని ఇస్తూ ఒక పెద్ద టెక్స్‌టైల్ పార్క్ ప్లాన్ చేసారు. కటక్ సిల్వర్ ఫిలిగ్రీ పనులకు ప్రసిద్ధి చెందింది. ఈ పనుల కారణంగా దీనిని భారతదేశపు వెండి నగరం అని కూడా పిలుస్తారు.[19][20] కటక్ ఆవు, గేదెల కొమ్ములతో చేసే హస్తకళల పనులకు కూడా ప్రసిద్ధి చెందింది. కటక్‌లో ఉత్కల్ గౌరబ్ మధుసూధన్ హార్న్ వర్క్ పేరుతో కొమ్ము వస్తువుల కోసం ఒకే ఒక రిటైల్ స్టోర్ ఉంది. సాధారణంగా, చనిపోయిన పశువుల కొమ్మును ఉపయోగిస్తారు. దీనిని లైసెన్స్ పొందిన కళాకారులు మాత్రమే నిర్వహిస్తారు. ఈ విచిత్రమైన కళాఖండం కేవలం కటక్‌కు ప్రత్యేకం. ఈ చక్కటి ప్రత్యేకమైన హస్తకళ పనులు స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతున్నాయి.

ఇండస్ట్రియల్ కారిడార్, స్పెషల్ ఎకనామిక్ జోన్

కటక్, ఆ చుట్టుపక్కల 11 పెద్ద-స్థాయి పరిశ్రమలున్నాయి. వీటిలో ఎక్కువగా చౌద్వార్ అథాఘర్‌లో ఉన్నాయి. ఈ పరిశ్రమలలో ఉక్కు, పవర్, ఆటోమొబైల్, మిశ్రమాలు, ఫైర్‌క్లే మొదలైనవి ఉన్నాయి. దేశంలో అతిపెద్ద ఫెర్రస్ మిశ్రమలోహాల ఉత్పత్తిదారైన ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ (IMFA), కటక్‌లోని చౌద్వార్‌లో ఉంది. నగరం శివార్లలో ఒక మెగా-ఆటో కాంప్లెక్స్ నిర్మాణ దశలో ఉంది. కటక్ చుట్టూ కేంద్రీకృతమై ఉన్న మధ్యస్థ చిన్న తరహా పరిశ్రమల సంఖ్య రాష్ట్రంలోని నగరాల్లో అతిపెద్దది. కటక్‌లోను, ఆ చుట్టుపక్కలా దాదాపు ఎనిమిది పారిశ్రామిక ఎస్టేట్‌లు ఉన్నాయి. జగత్పూర్, ఖపూరియాలు నగరం లోపల ఉన్న పారిశ్రామిక ఎస్టేట్‌లు. వీటిలో ఎక్కువ భాగం ఒడిశా లోను, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్న పెద్ద పారిశ్రామిక గృహాలకు అనుబంధ పరిశ్రమలుగా ఉపయోగపడుతున్నాయి.

Remove ads

రవాణా

వైమానిక

కటక్‌లో భారత వైమానిక దళం తేలికపాటి కసరత్తులు, శిక్షణ నిచ్చేందుకూ చార్బాటియా ఎయిర్ బేస్ అనే వైమానిక స్థావరం ఉంది. సమీప వాణిజ్య విమానాశ్రయం భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది దాదాపు 28 కి.మీ దూరంలో ఉంది.

రోడ్డు

జాతీయ రహదారి 16 ( పూర్వపు జాతీయ రహదారి 5 ) నగరం ఉత్తరం నుండి దక్షిణం వరకు నడుస్తుంది. గోల్డెన్ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా, ఈ రహదారి చెన్నై నుండి కోల్‌కతా వరకు వెళ్తుంది. జాతీయ రహదారి 55 ( పూర్వపు జాతీయ రహదారి 42 ) కటక్‌ను సంబల్‌పూర్‌తో కలుపుతుంది. అలాగే ఆసియా హైవే 45 నగరం గుండా వెళుతుంది. ఫీడర్ స్టేట్ హైవేలు కటక్‌ని జాజ్‌పూర్, పరదీప్, తాల్చేర్, అంగుల్, కేంద్రపారా, కటక్ జిల్లాలోని సమీప పట్టణాలకు కలుపుతాయి.

నగరం లోపల రవాణా ప్రధానంగా ఆటో రిక్షాల ద్వారా జరుగుతుంది. ఈ రోజుల్లో DTS సిటీ బస్సులు నగరం లోని, రాష్ట్ర రాజధానిలోని వివిధ ప్రదేశాలకు తిరుగుతున్నాయి. కటక్‌లోని బస్ టెర్మినస్ బాదంబాడి వద్ద ఉంది. ప్రతిరోజూ వేలాది ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు వందలాది గమ్యస్థానాలకు తిరుగుతాయి. కథజోడిపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేతు, మహానదిపై ఉత్కల్ గౌరబ్ మధుసూదన్ సేతు అనే రెండు కొత్త వంతెనల నిర్మాణంతో కటక్ నుండి భువనేశ్వర్, ధేన్‌కనల్‌లకు సౌకర్యం మరింత పెరిగింది.

రైలు

Thumb
కటక్ జంక్షన్ రైల్వే స్టేషన్

కటక్ జంక్షన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే యొక్క హౌరా-చెన్నై ప్రధాన లైన్‌లోని స్టేషన్‌లలో ఒకటి. ఇది ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. పరదీప్‌కి ఒక శాఖ కటక్ నుండి ప్రారంభమవుతుంది. కటక్ నుండి రైళ్ల ద్వారా భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది. కటక్ రైల్వే స్టేషన్‌ను ఫుడ్ కోర్టులు షాపింగ్ ప్లాజా, థియేటర్‌లతో బహుళ-ఫంక్షనల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసారు. నగరంలోని ఇతర రైల్వే స్టేషన్‌లు బరంగ్ జంక్షన్ రైల్వే స్టేషన్, బాలికుడ, మతగజ్‌పూర్, కందర్‌పూర్, కథా జోరి, కేంద్రపర రోడ్, కపిలాస్ రోడ్, మంగులి, నెర్గుండి, నారాజ్. మహానది రైలు వంతెన భారతదేశంలో 5వ పొడవైన రైలు వంతెన.

మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (MRTS)

ఒడిశా ప్రభుత్వం కటక్, భువనేశ్వర్ నగరాలకు ఒక వేగవంతమైన రవాణా వ్యవస్థను ప్రతిపాదించింది. 2014 ఆగస్టు 23 న, ఒడిశా ప్రభుత్వ గృహనిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ, కటక్, భువనేశ్వర్‌ల మధ్య 30 కి.మీ. ల మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (MRTS) వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) తయారీ కోసం బాలాజీ రైల్‌రోడ్ సిస్టమ్స్ లిమిటెడ్ (BARSYL)తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.[21]

Remove ads

క్రీడలు

బారాబతి స్పోర్ట్స్ కాంప్లెక్స్

బారాబతి స్టేడియం అంతర్జాతీయ క్రికెట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ముఖ్యమైన వేదిక.[22][23] బారాబతి స్పోర్ట్స్ కాంప్లెక్సులో రాష్ట్రంలోని చాలా క్రీడా సంస్థల ప్రధాన కార్యాలయాలున్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్‌తో పాటు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో లాన్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్విమ్మింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట సచిన్ టెండూల్కర్ ఇండోర్ హాల్ అనే ఇండోర్ హాల్ కూడా ఉంది. ఇండోర్ హాల్ నిర్మాణం ఒడిషా క్రికెట్ అసోసియేషన్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సంయుక్తంగా చేసాయి. బాస్కెట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్, జూడో, వెయిట్-లిఫ్టింగ్, కుస్తీతో సహా వివిధ ఇండోర్ క్రీడలలో పోటీలను నిర్వహించడానికి కూడా ఈ కాంప్లెక్సును ఉపయోగిస్తారు.

Thumb
జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం

జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం

తూర్పు భారతదేశంలో రెండవది, ఒడిషాలో ఏకైక ఇండోర్ స్టేడియమ్, జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం కటక్‌లో ఉంది. ఇండోర్ స్టేడియమ్‌ ప్రధానంగా జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ కోసం ఉపయోగిస్తారు. ఇది గతంలో అనేక అంతర్జాతీయ, జాతీయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించింది. ఇది సంగీత కచేరీలు, అవార్డు ప్రదర్శనలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇది 2019 జూలై 17 నుండి 21 వరకు 21 వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లు ఇక్కడ జరిగాయి. 2022 నుండి BWF వరల్డ్ టూర్ టోర్నమెంట్ ఒడిషా ఓపెన్‌కు ఈ స్టేడియమ్‌లో జరుగుతుంది.

Remove ads

చారిత్రిక ప్రదేశాలు

Thumb
Barabati Fort ruins of nine-storied palace complex

బారాబతి కోట, కంటోన్మెంట్

Thumb
కందకంపై ఉన్న బారాబతి కోట ముఖ ద్వారం. ఇది కటక్‌కు చిహ్నం

బారాబతి కోట 10వ శతాబ్దానికి చెందిన సోమవంశీ వంశ పాలకుడు మహారాజా మర్కట కేశరి నిర్మించిన కోట ఇది.[24] కందకం, ద్వారం తొమ్మిది అంతస్తుల ప్రాసాదపు మట్టి దిబ్బ రూపంలో ఈ కోట శిథిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. 102 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట దాదాపు దీర్ఘచతురస్రాకారంలో ఉందని పురావస్తు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దాని చుట్టూ అన్ని వైపులా లేటరైట్, ఇసుకరాళ్ళ గోడ ఉంది. గుట్టకు పశ్చిమాన ఒక చెరువు ఉంది. గుట్టకు ఈశాన్య మూలలో ఒకప్పుడు దేవాలయం ఉన్న అవశేషాలు ఉన్నాయి. ఈ ఆలయం లేటరైట్ బ్లాకుల పునాదులపై తెల్లటి ఇసుకరాయితో నిర్మించబడింది. దాదాపు నాలుగు వందల అచ్చుల శకలాలు, కొన్ని మ్యుటిలేటెడ్ శిల్పాలు ఇప్పటివరకు కనిపించాయి. కోటలో నేడు JN ఇండోర్ స్టేడియం, సత్యబ్రత స్టేడియం, స్పోర్ట్స్ హాస్టల్, దర్గా, గదా చండీ మందిర్, కటక్ క్లబ్, హైకోర్టు మ్యూజియం, అనేక ఉన్నత బంగ్లాలు ఉన్నాయి. నేటి కంటోన్మెంట్ ప్రాంతం, బ్రిటిషు కాలంలో భారతీయులకు ప్రవేశం లేని బంగ్లాలు, సైనిక దండులతో ఉండేది.

ఇతర దర్శనీయ స్థలాలు

  • చుడంగగఢ్ కోట
  • నేతాజీ జన్మస్థలం మ్యూజియం
  • మధుసూదన సంగ్రహాలయ
  • ఆనంద్ భవన్ మ్యూజియం అండ్ లెర్నింగ్ సెంటర్
  • ఒడిశా స్టేట్ మారిటైమ్ మ్యూజియం
  • పాత జైలు, స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నం
  • స్వరాజ్ ఆశ్రమం
  • మరాఠా బ్యారక్స్
  • సాల్ట్ హౌస్
  • లాల్ బాగ్ ప్యాలెస్
  • కనికా రాజబతి
  • గోరా కబర్ శ్మశానవాటిక
  • శ్రీ గోపాల్ కృష్ణ గోశాల
  • లలితగిరి
  • ఒలాసుని కొండ
  • ఉద్యానవనాలు, తోటలు
  • ఓషన్ వరల్డ్ వాటర్ పార్క్
  • CMC జింకల పార్క్
  • వినోద ఉద్యానవనాలు
  • నందన్‌కనన్ జూలాజికల్ పార్క్, బొటానికల్ గార్డెన్స్
  • చందక ఏనుగుల అభయారణ్యం
  • నారాజ్ పీకాక్ వ్యాలీ
  • మహానది నది బోటింగ్
  • సరస్సులు, జలాశయాలు
  • డియోజర్ వాటర్ ఫాల్స్, నరసింగ్‌పూర్, కటక్
  • అంశుపా సరస్సు
  • జోబ్రా బ్యారేజ్
  • నారాజ్, ముండలి రిజర్వాయర్లు
  • మహానదిపై రాతి కరకట్ట
Remove ads

ప్రముఖ వ్యక్తులు

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads