రంగారెడ్డి జిల్లా
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి From Wikipedia, the free encyclopedia
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. 1978లో హైదరాబాదు జిల్లా నుంచి విడదీసి దీనిని ఏర్పాటుచేశారు
?రంగారెడ్డి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17.366°N 78.476°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 7,493 కి.మీ² (2,893 చ.మై) |
ముఖ్య పట్టణం | హైదరాబాదు |
ప్రాంతం | తెలంగాణ |
జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
52,96,396 (2011 నాటికి) • 707/కి.మీ² (1,831/చ.మై) • 1868000 (2001) • 2708694 • 2587702 • 66.31 (2001) • 75.02 • 57.03 |
హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉంది. హైదరాబాదు నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి[1], ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి, దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, విమోచనోద్యమకారులు కాటం లక్ష్మీనారాయణ, వెదిరే రాంచంద్రారెడ్డి, గంగారాం ఆర్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన[2] కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు ప్రఖ్యాతిగాంచిన జిల్లా.
ఈ జిల్లాలో 37 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ. దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి, 9వ నెంబరు జాతీయ రహదారి, హైదరాబాదు నుంచి కాజీపేట, గద్వాల, వాడి, బీబీనగర్ రైలుమార్గాలు, వికారాబాదు-పర్భని మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి.
1901లో కేవలం 3.39 లక్షలుగా ఉన్న జనాభా 1981 నాటికి 15.82 లక్షలకు చేరింది. ఆ తర్వాత అనూహ్యంగా పెరుగుతూ 1991 నాటికి 25.51 లక్షలు, 2001 నాటికి 35.75 లక్షలు, 2011 నాటికి 52.96 లక్షలకు చేరింది.మండలాల వారీగా చూస్తే సరూర్ నగర్,రాజేంద్రనగర్, మండలాలో జనాభా చాలా అధికంగా ఉంది.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 35,75,064 కాగా దశాబ్దం కాలంలో 48.15% వృద్ధి చెందింది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 52,96,741.[3] జనాభాతో రంగారెడ్డి జిల్లా తెలంగాణలో ప్రథమస్థానంలో, దేశంలో 17వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో జిల్లా.
నిజాం కాలంలో ఇది అత్రాప్-ఎ-బల్ద్ జిల్లాలో భాగంగా గుల్షనాబాదు సూబాలో ఉండేది. 1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటింది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని ఐతే హైదరాబాద్ నగరం దాటిన కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు.[4] 1948లో నిజాం నిరంకుశ పాలన అంతం తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉంది.ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది.హైదరాబాదు రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడైన కె.వి.రంగారెడ్డి పేరు మీదుగా ఈ జిల్లాకు నామకరణము చేశారు.ఈ జిల్లా ఇంతకు మునుపు హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉండేది.1978లో హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి కె.వి.రంగారెడ్డి పేరిట ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు.తర్వాత జిల్లాపేరు లోంచి కె.వి.పదాలను తొలిగించారు.ఏర్పాటు సమయంలో రంగారెడ్డి జిల్లాలో 11 తాలుకాలు ఉండగా 1986లో మండలాల వ్యవస్థ ప్రారంభం కావడంతో తాలుకాల స్థానంలో 37 మండలాలు ఏర్పడ్డాయి.
1947 ఆగస్టు 15న దేశమంతటా ప్రజలు స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటుండగా హైదరాబాదు సంస్థాన ప్రజలు మాత్రం దాష్టీక రజాకార్ల రాక్షస దురాగతాలకు బలైపోతున్నారు.ఆ సమయంలో అప్పటి అత్రాఫ్-ఎ-బల్దా జిల్లాలో భాగమైన ఇప్పటి రంగారెడ్డి జిల్లా ప్రాంతం ప్రజలు కూడా నిజాం, రజాకార్ల బాధలను పడలేక ప్రజలు ఎదురు తిరిగారు. మందుముల నర్సింగరావు, కాటం లక్ష్మీనారాయణ, గంగారం లాంటి ఉద్యమకారులు ప్రజలను చైతన్యవంతం చేశారు. శంషాబాదు ప్రాంతానికి చెందిన గంగారం నారాయణరావు పవార్తో కలిసి నిజాం నవాబునే హత్యచేయడానికి వ్యూహంపన్నాడు. శంషాబాదుకే చెందిన గండయ్య హిందువులను నీచంగా చూడడం భరించలేక పోరాటాన్ని ఉధృతం చేశాడు. అతన్ని అరెస్టు చేసి జైల్లోవేసిన పిదప క్షమాపణలు చెబితే వదిలివేస్తామని నచ్చజెప్పిననూ ఆయన అందుకు నిరాకరించాడు.[5]ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు పోరాటయోధులకు పెట్టనికోటలాంటివి. ఇప్పటి రంగారెడ్డి-నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలను పోరాటయోధులు సమర్థంగా వినియోగించుకున్నారు.
మనదేశంలో ఉన్న ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన అబ్జర్వేటరీలలో రంగాపూర్ అబ్జర్వేటరీ ఒకటి. ఇది రంగాపూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాదుకు 56 కి.మీ. దూరంలో ఇబ్రహీంపట్నం దగ్గరగా ఉంది.
రంగారెడ్డి జిల్లా 16°30' నుండి 18°20' ఉత్తర అక్షాంశం, 77°30' నుండి 79°30' తూర్పు రేఖాంశంల మధ్యన విస్తరించియుంది.[6] జిల్లాకు ఉత్తరాన మెదక్ జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, దక్షిణమున మహబూబ్‌నగర్ జిల్లా, పశ్చిమాన కర్ణాటకకు చెందిన గుల్బర్గా, బీదర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 7493 చ.కి.మీ. వైశాల్యం దృష్ట్యా రాష్ట్రంలో రెండవ జిల్లాగా ఉంది.ఈ జిల్లాలో మూసీ నది ప్రవహిస్తుంది
ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వలన, వీరి ప్రధాన వృతి వ్యవసాయం.జిల్లాలో పండించే ప్రధానపంట వరి. ఖరీఫ్, రబీలలో కలిపి 77వేల హెక్టార్లలో వరిపంట సాగవుతుంది. రెండోస్థానంలో ఉన్న జొన్న పంట రెండు కాలాలలో కలిపి 44వేల హెక్టార్లలో పండించబడుతుంది. కందులు ఖరీఫ్‌లో 28వేల హెక్టార్లలో సాగుచేయబడుతుంది. తాండూరు ప్రాంతం కందులకు రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందినది. వేరుశనగ రబీలో 7వేల హెక్టార్లలో పండుతుంది. మండలాల వారీగా చూస్తే వరిపంట హయత్‌నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాలో అత్యధికంగా సాగుఅవుతుంది. జొన్న పంట ఉత్పత్తిలో బషీరాబాదు, మర్పల్లి, వికారాబాదు మండలాలు ముందంజలో ఉన్నాయి. కందిపంట తాండూరు, యాలాల, బషీరాబాదు మండలాలలో ఎక్కువగా సాగుచేయబడుతుంది. మొక్కజొన్న సాగులో చేవెళ్ళ, శంషాబాదు, మొయినాబాదు మండలాలు అగ్రస్థానంలో ఉన్నాయి. చెరుకు పంట బంటారం, పెద్దెముల్ మండలాలలో ఎక్కువగా సాగుచేయబడుతుంది. పండ్ల ఉత్పత్తిలో కందుకూరు మండలం, కూరగాయల ఉత్పత్తిలో చేవెళ్ళ, శంకర్‌పల్లి మండలాలు, పూలఉత్పత్తిలో శంకర్‌పల్లి మండలం ముందంజలో ఉన్నాయి.
జిల్లాలో రెండూ నదులు ప్రవహిస్తున్ననూ పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు లేవు. మొత్తం సాగువిస్తీర్ణంలో కేవలం 30% విస్తీర్ణానికే నీటిపారుదల సౌకర్యం ఉంది. హిమాయత్ సాగత్, ఉస్మాన్ సాగర్ చెరువులున్ననూ అవి ప్రధానంగా త్రాగునీటికే ఉపయోగపడుతున్నాయి. కాగ్నానదిపై నిర్మించిన కోట్‌పల్లి ప్రాజెక్టి మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుగా సుమారు 3700 హెక్టార్లకు సాగునీరు అందిస్తుంది. జుంటుపల్లి ప్రాజెక్టు, లక్నాపూర్ ప్రాజెక్టులు రెండు కలిపి సుమారు 1800 హెక్టార్లకు నీరు అందిస్తున్నాయి.
హైదరాబాదుకు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా మండలాలలో పలు భారీ, అనేక మధ్యతరహా పరిశ్రమలే కాకుండా పలు పారిశ్రామిక వాడలున్నాయి. రాష్ట్ర పారిశ్రామికరంగంలో పేరుగాంచిన బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఐడీపీఎల్, హెచ్‌సీఎల్, హెచ్‌ఎంటీ, ఎన్‌ఎఫ్‌సీ లాంటి పరిశ్రమలు జిల్లాలో కేంద్రీకృతమై ఉన్నాయి.ఇవే కాకుండా చెర్లపల్లిలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్, కుత్బులాపూర్ మండలంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ, జీడీమెట్లలో ఈక్విస్ ఇంజనీర్స్, మేడ్చల్‌లో జీటీ అల్మాక్స్, తుర్కపల్లి, బోడుప్పల్‌లలో జీవీకే బయోసైన్స్,ఉప్పల్ లో హెరిటేజ్ ఫుడ్స్, మౌలాలీలో హిందుస్తాన్ కోకాకోలా బెవెరేజెస్, గుండ్లపోచంపల్లిలో ఇంటగ్రేటెడ్ ఫార్మాసీటికల్స్ ఉన్నాయి. జీడీమెట్ల, బాలానగర్, ఉప్పల్ లలో భారీ, మధ్యతరహా పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. .
రంగారెడ్డి జిల్లాలో లభ్యమగు ఖనిజాలలో నాపరాయి, సున్నపురాయి, ఫెల్స్పార్, క్వార్ట్జ్ మున్నగునవి ముఖ్యమైనవి. తాండూరు, బషీరాబాదు మండలాలలో నాపరాయి, మర్పల్లి మండలంలో సున్నపురాయి, మేడ్చల్, మహేశ్వరం మండలాలలో ఫెల్ప్సార్ దొరుకుతుంది.
2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణ తరువాత ఈ జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లు (రాజేంద్రనగర్, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కందుకూర్ (చివరి మూడు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడ్డాయి), 27 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 33 తో కలుపుకొని 604 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
రంగారెడ్డి జిల్లాలోని 14 పాత మండలాలుతో పాటు 15 నుండి 17 వరకు గల మూడు మండలాలు రంగారెడ్డి జిల్లాలోని మండలాల గ్రామాల నుండి, కొత్తగా ఏర్పడినవి.18 నుండి 24 వరకు గల ఏడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లా నుండి విలీనంకాగా, 25 నుండి 27 వరకు గల మూడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామాల నుండి కొత్తగా ఏర్పడినవి.[7]
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (6)
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 560 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[8]
జిల్లాలో 12 పురపాలక సంఘాలు,3 నగరపాలక సంస్థలు ఉన్నాయి.[9]
భౌగోళికంగా రంగారెడ్డి జిల్లాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 37 రెవెన్యూ మండలాలగా విభజించారు.[10] రంగారెడ్డి జిల్లా హైదరాబాదు జిల్లా చుట్టూ ఉన్న ప్రాంతంతో ఏర్పడింది. అందువలన ఈ బొమ్మలో హైదరాబాదు జిల్లా తెలుపు రంగులో సున్నతో గుర్తించబడింది.
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 8 పాత మండలాలు నూతనంగా ఏర్పడ్డ మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా,[11] అలాగే 15 పాతమండలాలు వికారాబాదు జిల్లా[12] పరిధిలో చేరాయి.
రాష్ట్ర రాజధాని చుట్టూ ఆవరించి ఉండటంతో జిల్లా తూర్పు భాగంగా రవాణా సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయి. జాతీయ రహదారులు, రైల్వేమార్గాలు మాత్రమే కాకుండా హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది.
రోడ్డు రవాణా: హైదరాబాదు నుంచి వెళ్ళు అన్ని జాతీయ రహదార్లు రంగారెడ్డి జిల్లా నుంచే వెళ్ళుచున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి ఉత్తరాన మేడ్చల్ నుండి రాజేంద్రనగర్ వరకు, 9వ నెంబరు జాతీయ రహదారి శేరిలింగంపల్లి నుండి హయత్‌నగర్ వరకు, వరంగల్ వెళ్ళు రాజీవ్ రహదారు ఘట్‌కేసర్ వరకు, బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి పరిగి వరకు ఉన్నాయి. జిల్లా పశ్చిమ భాగంగా తాండూరు వెళ్ళు రహదారి ముఖ్యమైనది. జిల్లాలో జాతీయ రహదార్ల పొడవు 96 కిలోమీటర్లు, కాగా 1850 కిలోమీటర్ల రోడ్డు, భవనాల శాఖ పరిధిలో ఉంది.
రైలు రవాణా: దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో 11 మండలాల గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. ఇందులో అత్యధికంగా హైదరాబాదు పరిసరాలలో ఉండే (మల్కాజ్‌గిరి, ఘట్‌కేసర్, మేడ్చల్, శేరిలింగంపల్లి, శంషాబార్, శంకర్‌పల్లి) మండలాలు కాగా పశ్చిమ భాగంలో తాండూరు, వికారాబాదు, ధారూరు, నవాబ్‌పేట్, మర్పల్లి మండలాలు ఉన్నాయి. జిల్లా పశ్చిమ భాగంగా ఉన్న వికారాబాదు రైల్వే జంక్షన్. జిల్లాలో ఉన్న మొత్తం 35 రైల్వేస్టేషన్లలో మల్కాజ్‌గిరి మండలంలో అత్యధికంగా 9 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. లింగంపల్లి నుంచి ఎంఎంటీఎస్ రైళ్ళు ప్రారంభమౌతాయి. జిల్లాలో రైల్వేలైన్ల నిడివి 250 కిమీ. హైదరాబాదు నుంచి వాడి, డోన్, కాజీపేట, నిజామాబాదు వెళ్ళు లైనులే కాకుండా, వికారాబాదు నుంచి పర్లివైద్యనాథ్ లైను కూడా జిల్లా నుంచే ప్రారంభమౌతుంది. వికారాబాదు జంక్షన్ నుంచి రాయచూరుకు నూతన మార్గం ఏర్పాటుకు రైల్వే శాఖ సర్వే కూడా జరిపింది. ఈ మార్గం పరిగి గుండా వెళ్తుంది.
వాయుమార్గం: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రంగారెడ్డీ జిల్లాకు చెందిన శంషాబాదు మండలంలో ఉంది. రాష్ట్ర రాజధానికి 22 కిమీ దూరంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని 2008లో ప్రారంభించారు.
జిల్లాలో దాదాపు 390 చ.కి.మీ.ల అడవులు ఉన్నాయి. ఈ అడవులలో అధికభాగం జిల్లా పశ్చిమ భాగంలో ఉన్నాయి.
రాష్ట్ర రాజధానిని ఆవరించి ఉండటంతో ఈ జిల్లాలో పలు ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పబడ్డాయి. జిల్లాలోని ఉన్నత విద్యాసంస్థలలో అధికభాగం హైదరాబాదు సమీపంలో ఉన్న మండలాలలో కేంద్రీకరించబడి ఉన్నాయి. గచ్చిబౌలీలో హైదరాబాదు విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌లో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆదిభట్లలో గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల, చిలుకూరులో హైపాయింట్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల, గండిపేట్‌లో హైటెక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాల, కోకాపేట్‌లో మహాత్మాగాంధీ టెక్నాలజీ సంస్థ, చేవెళ్ళలో ఇంద్రారెడ్డి స్మారక ఇంజనీరింగ్ కళాశాల, కొండాపూర్‌లో సంస్కృతి ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థ, నాగర్‌గుల్‌లో స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల, శేరిగూడలో శ్రీదత్తా ఇంజనీరింగ్ & సైన్స్ కళాశాల, బోగారంలో తిరుమల ఇంజనీరింగ్ కళాశాల, కాచారంలో వర్థమాన్ ఇంజనీరింగ్ కళాశాల, కనకమామిడీలో కె.ఎస్.రాజు టెక్నాలజీ& సైన్స్ కళాశాల, ఎంకేపల్లిలో భాస్కర్ ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి.ఇవి కాకుండా వ్యాప్తంగా 2459 ప్రాథమిక, 882 మాధ్యమిక, 1235 ఉన్నత పాఠశాలలు, 258 జూనియర్ కళాశాలలు, 73 డీగ్రీ కళాశాలలు ఉన్నాయి.
వీసాల దేవాలయంగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం, కీసరగుట్ట శివాలయం,మిలారమ్ బాలాజీ దేవాలయం,గండిపేట చెరువు, రత్నాలయం, నీళ్ళపల్లి, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టు, కోట్‌పల్లి ప్రాజెక్టు జిల్లాలోని ముఖ్య పర్యాటక క్షేత్రాలు. అనంతగిరి కొండలు మూసీనదికి జన్మస్థానం.[13] ఇక్కడే శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచారు. తాండూరు ప్రాంతంలో అంతారం, కొత్లాపూర్‌లలో నూతనంగా నిర్మించిన దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
హైదరాబాదుకు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతాలలో అన్ని రకాల క్రీడలు అభివృద్ధి చెందాయి. జిల్లా పశ్చిమ భాగంలో క్రికెట్, వాలీబాల్ లాంటి క్రీడలు ప్రజాదరణ పొందాయి. ఉప్పల్ లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్రీడా స్టేడియం ఉంది. కుల్కచర్ల మండలానికి చెందిన వాలీబాల్ క్రీడాకారులు జాతీయస్థాయి (బాలుర) జట్టులో స్థానం పొందారు
మర్రి చెన్నారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి వికారాబాదు సమీపంలోని సిర్పూర్ గ్రామంలో 1919 జనవరి 13న జన్మించాడు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజాసమితి పార్టీ స్థాపించి అన్ని సీట్లలో విజయం సాధించాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. తమిళనాడు గవర్నరుగా ఉంటూ 1996లో మరణించాడు.
కొండా వెంకట రంగారెడ్డి
స్వాతంత్ర్య సమరయోధుడు, 2సార్లు ఆంధ్రమహాసభలకు అధ్యక్షత వహించిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో పలు మంత్రిపదవులు, ఉప ముఖ్యమంత్రిపదవి నిర్వహించిన తెలంగాణ దురంధరుడు కొండా వెంకట రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లాకు ఈ పేరు ఇతని మీదుగానే పెట్టబడింది.[14] 1890 డిసెంబరులో జన్మించిన కె.వి.రంగారెడ్డి 1970 జూలైలో మరణించాడు.
గంగారాం ఆర్య
వెదిరే రమాణారెడ్డి
నిరంకుశ నిజాం ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు వెదిరే రమణారెడ్డి 193 జూన్‌లో ఆరుట్ల గ్రామంలో జన్మించాడు. డీఎస్పీ హోదాలో పనిచేసి ఇండీయన్ పోలీస్ మెడల్‌ను అందుకున్నాడు.
సి.మాధవరెడ్డి
రజాకార్ల మితిమీరిన అకృత్యాలను, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన విమోచనోద్యమనేత మాధవరెడ్డి 1932 జూలై 31న హయత్‌నగర్ మండలంలో జన్మించాడు. రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.
టి.దేవేందర్ గౌడ్
రంగారెడ్డి జిల్లాపరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను పనిచేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్ మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు.[15] ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉండి 2009లో తెలంగాణా అంశంతో విభేదించి నవతెలంగాణ పార్టీ స్థాపించాడు. ఆ తర్వాత దాన్ని ప్రజారాజ్యంలో విలీనం చేశాడు. 2009 ఎన్నికలలో స్వయంగా శాసనసభకు, పార్లమెంటుకు ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యాడు. చివరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినాడు.
కాటం లక్ష్మీనారాయణ
సబితా ఇంద్రారెడ్డి దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా నియమితులైన సబితా ఇంద్రారెడ్డి తాండూరు సమీపంలోని కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న జన్మించింది. మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి మరణంతో రాజకీయ రంగప్రవేశం చేసి 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా, 2009లో హోంశాఖ మంత్రిగా నియమితులైంది. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాల్లోనూ అదే శాఖ లభించింది.
జి.కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన జి.కిషన్ రెడ్డి 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించాడు. 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, 2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.[16]
అంగోత్ తుకారాం అంగోత్ తుకారాం తెలంగాణ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ పర్వతారోహకుడు. ఆయన 2019లో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించాడు.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు కేవలం 6 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండగా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రంలోనే అత్యధికంగా 8 కొత్త నియోజకవర్గాలు ఆవిర్భవించాయి. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు జిల్లాలో ప్రత్యేకంగా లోక్‌సభ నియోజకవర్గం లేదు. అప్పటి అసెంబ్లీ సెగ్మెంట్లు హైదరాబాదు, నల్గొండ, మెదక్ నియోజకవర్గాలలో భాగంగా ఉండేవి. 2008 తర్వాత జిల్లాలోని 7 సెగ్మెంట్లతో ప్రత్యేకంగా చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. మల్కాజ్‌గిరి లోక్‌సభలో ఉన్న 7 సెగ్మెంట్లలో 6 సెగ్మెంట్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో జిల్లాకు చెందిన ఒక సెగ్మెంటు చేరింది.
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలలో, తెలుగుదేశం పార్టీ 5 స్థానాలలో విజయం సాధించాయి. లోక్‌సత్తా పార్టీ, ఇండిపెంట్ సభ్యుడికి చెరో స్థానం లభించింది. మహేశ్వరం నుంచి విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డికి రాష్ట్రమంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ లభించింది.2009 లోక్‌సభ ఎన్నికలలో మాల్కాజ్‌గిరి నుంచి సర్వే సత్యనారాయణ విజయం సాధించగా, చేవెళ్ళ నుంచి గెలుపొందిన సూదిని జైపాల్ రెడ్డి కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిపదవి లభించింది.2012 ఫిబ్రవరిలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వికారాబాదు నుంచి విజయం సాధించిన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మంత్రిమండలిలో చోటులభించింది.[17]
2018 ఎన్నికలలో గెలుపొంది ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు.[18]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.