Remove ads
స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. From Wikipedia, the free encyclopedia
బూర్గుల రామకృష్ణారావు (మార్చి 13, 1899 - సెప్టెంబర్ 14, 1967) బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు.[1]
బూర్గుల రామకృష్ణారావు | |
---|---|
జననం | మార్చి 13, 1899 మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం, పడకల్ గ్రామం |
మరణం | సెప్టెంబర్ 14, 1967 |
మరణ కారణం | గుండెపోటు |
నివాస ప్రాంతం | మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం, పడకల్ గ్రామం |
ఇతర పేర్లు | బూర్గుల రామకృష్ణారావు |
వృత్తి | మొదటి హైదరాబాద్ రాష్ట్రముఖ్యమంత్రి(1952) కేరళ గవర్నర్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ బహుభాషావేత్త స్వాతంత్ర్య సమరయోధుడు రచయిత న్యాయవాది |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమర యోధుడు,కవి,రచయిత |
పదవి పేరు | డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డాక్టర్ ఆఫ్ లాస్ |
తండ్రి | నరసింగరావు, |
తల్లి | రంగనాయకమ్మ |
సంతకం |
రామకృష్ణరావు 1899 మార్చి 13 న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో జన్మించాడు. వీరి స్వగ్రామం బూర్గుల; ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ప్రఖ్యాత గృహనామమైనది. ధర్మపంత్ స్కూలు (హైదరాబాద్) లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. 1915లో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. పూణె లోని ఫెర్గూసన్ కళాశాలలో బీఏ (హానర్స్) డిగ్రీ చదివాడు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ (లా డిగ్రీ) పూర్తిచేసి, హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బూర్గుల దగ్గర పివినరసింహారావు జూనియర్ లాయర్‌గా పనిచేశాడు.
1924లో పెళ్ళి చేసుకున్నాడు. 1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నాడు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.
హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. 1948లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవెన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.[2]
1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగిపుడు, మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యాడు.[3] పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలో సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు.[4] 1956లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అయినపుడు, కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. బూర్గుల, కేరళ రాష్ట్రానికి గవర్నరుగా వెళ్ళాడు. 1960 వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత 1962 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు.
1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించాడు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో వీరు చేపట్టిన సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, మధ్యప్రదేశ్ విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నాడు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు ఉర్దూ అకాడమీ, భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగా గొప్ప సాంస్కృతిక సేవలందించాడు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, సంస్కృత పరిషత్‌ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించాడు.
బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవాడు. పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం, రెడ్డి రాజుల కాలం-మత సంస్కృతులు (పరిశోధనా వ్యాసం) మొదలైనవి ఆయన ఇతర రచనలు. ఈయన రచించిన వ్యాసాలు 'సారస్వత వ్యాస ముక్తావళి' పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, కృష్ణశతకం, వేంకటేశ్వర సుప్రభాతం, నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశాడు. అనువాద రచనలు కూడా చేశాడు. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో 'తెలంగాణ రచయితల సంఘం' ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యాడు.
బూర్గుల 1967, సెప్టెంబర్ 14 న గుండెపోటుతో మరణించాడు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.