సంగీత దర్శకుడు From Wikipedia, the free encyclopedia
కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (కె. వి. మహదేవన్) (జ. 1917 మార్చి 14 - 2001 జూన్ 21) దక్షిణ భారతీయ చలన చిత్ర సంగీత దర్శకుడు. తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన మహదేవన్ చిన్నతనం నుంచి సంగీతం వైపు ఆసక్తి చూపాడు. వీరి పూర్వీకులు కూడా సంగీత రంగంలో నిష్ణాతులే. ఏడవ తరగతి వరకు చదివి ఆపేసి నాటకాల్లో నటించాడు. తర్వాత చిత్రాల్లో పనిచేయడం కోసం మద్రాసు వెళ్ళాడు. మొదటగా కొన్ని చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. తర్వాత కొంతమంది మిత్రులు సంగీత రంగంవైపు మళ్ళమని సలహా ఇవ్వడంతో సంగీత దర్శకుడు ఎస్. వి. వెంకట్రామన్ దగ్గర సహాయకుడిగా చేరాడు. టి. ఎ. కల్యాణం దగ్గర కూడా పనిచేసి వృత్తి మెలకువలు నేర్చుకున్నాడు.1942 లో ఆనందన్ అనే చిత్రానికి మొదటగా సంగీత దర్శకత్వం వహించాడు. 1952 లో ఈయనకు మలయాళీ అయిన పుహళేంది తో పరిచయం ఏర్పడింది. పుహళేంది మహదేవన్ తో కలిసి చివరి దాకా పనిచేశాడు. 1962 లో విడుదలైన మంచి మనసులు సినిమాలో ఈయన స్వరపరిచిన మామ మామ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. ఈయనకు మామ అనే ముద్దు పేరు కూడా వచ్చింది. ఈయన ఎక్కువగా కవి పాట రాశాక స్వరపరిచేవాడు. చివరి దశలో నరాల బలహీనత వ్యాధితో బాధ పడ్డాడు. మాట పడిపోయి మతిస్థిమితం కూడా కోల్పోయాడు. శ్వాస తీసుకోవడం కష్టమై 2001 లో మరణించాడు. ఈయన సంగీతం కూర్చిన చివరి సినిమా కబీర్ దాస్ (2003).
మహాదేవన్ 1917లో మార్చి 14న తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో లక్ష్మీ అమ్మాళ్, వెంకటాచలం అయ్యర్ (భాగవతార్) లకు జన్మించాడు. తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన మహాదేవన్ తండ్రి వెంకటాచలం భాగవతార్ గోటు వాద్యంలో నిష్ణాతుడు. వాళ్ల కుటుంబమంతా సంగీతమయమే. మహాదేవన్ తాతగారు తిరువాన్కూరు సంస్థానంలో సంగీత విద్వాంసునిగా పని చేసేవారు. నాలుగేళ్ల ప్రాయంలోనే చిన్నారి మహాదేవన్ నాదస్వర వాద్యానికి ఆకర్షితుడై నాదస్వర విద్వాన్ రాజరత్నం పిళ్లై దగ్గర శిష్యరికం చేశాడు. అలాగే బూదంపాడి అరుణాచల కవిరాయర్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకొని కొన్ని కచ్చేరీల్లో పాల్గొన్నాడు. ఏడవ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆ తరువాత కొన్ని నాటకాలలో నటించాడు. సినిమాలో చేరాలని ఆశతో టి.వి.చారి గారి సహాయంతో మద్రాసులో అడుగుపెట్టాడు. "తిరుమంగై ఆళ్వార్" అనే తమిళ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం లభించింది.
మహాదేవన్ మిత్రుడైన కొళత్తుమణి నువ్వు సంగీత దర్శకత్వ శాఖలో ప్రవేశిస్తే త్వరగా రాణిస్తావ్ అని సలహా యిచ్చాడు. దానితో కొళత్తుమణికి అప్పటి సంగీత దర్శకుడైన ఎస్.వి.వెంకట్రామన్తో మంచి పరిచయం ఉంది. ఆయన దగ్గర సహాయకునిగా చేరాడు. అప్పటికే అక్కడ సహాయకునిగా పనిచేస్తున్న టి.ఎ.కల్యాణంతో మంచి పరిచయం ఏర్పడింది. కల్యాణం దగ్గరే సినిమా సంగీతంలోని పట్లు, మెళకువలు నేర్చుకున్నాడు. 1942 వ సంవత్సరంలో "మనోన్మణి" అనే తమిళ సినిమాలో "మోహనాంగ వదనీ" అనే పాటకు సంగీతం సమకూర్చే అవకాశం లభించింది. ఎం.ఎస్ విశ్వనాథన్ సమకాలీకుడైన మహాదేవన్ 1942లో ఆనందన్ అనే తమిళ సినిమాతో చిత్రరంగములో అడుగుపెట్టారు ఆ తరువాత "దేవదాసి" అనే సినిమాకు సంగీతం సమకూర్చారు. కాని ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అంతగా పేరు రాలేదు. ఆ తరువాత చాలా కాలం వరకు మళ్లీ అవకాశం రాలేదు.
1952లో ఓ మలయాళీ కుర్రవాడు పరిచయం అయ్యాడు. చాలా కొద్ది కాలంలోనే మహాదేవన్ మనసు గెలుచుకున్నాడు. అతన్ని తన సహాయకునిగా పెట్టుకున్నారు. ఆ కుర్రవాడే పుహళేంది. ఈయన చివరి వరకు మహాదేవన్ తోనే పనిచేశారు. 1958 వ సంవత్సరంలో ప్రతిభా సంస్థ నిర్మించిన దొంగలున్నారు జాగ్రత్త అను సినిమాకు తొలిసారిగా తెలుగులో స్వరాలు అందించారు. అదే సంవత్సరంలో విడుదలైన ముందడుగు సినిమాతో మహాదేవన్ ప్రతిభ బయటపడింది. 1962 లో విడుదలైన "మంచి మనసులు" కేవలం పాటల వల్లే సినిమా హిట్టయిందన్నవారు కూడా ఉన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ముఖ్యంగా మావా...మావా పాట బాగా జనాదరణ పొందింది. అప్పటి నుంచి మహాదేవన్ ను మామ అని పిలవడం మొదలుపెట్టారు. 1963లో వచ్చిన "మూగ మనసులు" మామను తిరుగులేని స్థానానికి చేర్చాయి. మామ తెలుగు సినిమా సంగీతంలో ఓ కొత్త బాణీకి ఊపిరిపోశారు. కాని ఈయనకు తెలుగు రాదు. అయినా సంగీతానికి భాష అనే ఎల్లలు లేవు అని నిరూపించిన వారిలో మహాదేవన్ ఒకరు. ఈయన కవి పాట రాశాక దానికి స్వరాలను అద్దేవారు. చివరి వరకు ఆయన ఇదే పద్ధతిని అనుసరించారు. మనం బాణీ చేసి ఇస్తే అందులో మాటలు పట్టక కవి ఇబ్బంది పడతాడు. అందుకే ఆ పద్ధతి వద్దు అని సున్నితంగా తిరస్కరించేవారు. పాటలోని సాహిత్యాన్ని అధిగమించకుండా స్వరాలను అల్లేవారు. ఒక్కోసారి సాహిత్యం కోసం బాణీల్లో మార్పులూ చేర్పులూ చేసేవారు. తెలుగు తెలియకపోయిన కవి రాసిన సాహిత్యం అర్థం కాకపోయినా అడిగి మరీ దానర్థం తెలుసుకొని సందర్భానుసారం స్వరాలను అందించేవారు.
మామ వారసులెవ్వరూ సినీ రంగంలోకి రాలేదు. తనలాగ తన పిల్లలు కష్టపడకూడదనుకున్నారాయన. మామకు 82 ఏళ్లు దాటాక "సహస్ర చంద్రదర్శనం" వేడుక చేశారు. అధిక మాసాలతో కలిపి వెయ్యి పున్నమి చంద్రులను చూసిన వారికి ఈ వేడుక చేస్తారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరుపుకున్నారు. చాలా కొద్ది మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. అందులో ఇప్పటి ప్రముఖ సంగీత దర్శకులైన ఎం. ఎం. కీరవాణి కూడా ఒకరు.
సంపూర్ణ రామాయణము, తిరువిళయదాల్ వంటి పౌరాణిక చిత్రాలకు పేరుమోసిన మహాదేవన్ శాస్త్రీయ సంగీతాన్ని, సినిమా సంగీతముతో మిళితం చేసే ఒరవడికి ఆద్యుడని భావిస్తారు. అనేక మంది సినీ సంగీత దర్శకులకు ఈయన గురువు. ఈయన సంగీతం సమకూర్చిన సినిమాలలో శంకరాభరణం, దసరా బుల్లోడు, గోరింటాకు, ఇక భక్తి చిత్రాలైనటువంటి అయ్యప్పస్వామి మహత్యం, అయ్యప్పస్వామి జన్మ రహస్యం, ఇంకా భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో వచ్చిన సుమారు అన్ని చిత్రాలకు మామే స్వరాలను అందించారు. ఇంకా తమిళంలో కందన్ కరుణై, వసంత మాలిగై, వియత్నాం వీడు, పడిక్కథ మీతై, వానంబాడి ప్రసిద్ధిగాంచినవి. ఈయన సంగీతము సమకూర్చిన చివరి సినిమా కబీర్ దాస్ (2003) లో చనిపోయిన తరువాత విడుదలైంది. చనిపోక ముందు చివరి సినిమా " కె. విశ్వనాధ్ తీసిన "స్వాతి కిరణం" నిజంగా చెప్పలంటే ఈ సినిమాకు రెండు పాటలనే మామ స్వరపరిచారు. ఆ సమయంలో ఆరోగ్యం సరిగా లేక మిగిలిన పాటలను పుహళేంది స్వరపరిచారు. అయినా మామ పేరునే టైటిల్స్ లో వేసి గురుభక్తిని చాటుకున్నారు పుహళేంది. అలాగే తమిళంలో చివరి సినిమా మురుగనే తుణై (1990).
మామకు చివర్లో నరాల బలహీనత వచ్చి తీవ్ర అస్వస్థులయ్యారు. దాంతో మాట కూడా పడి పోయింది. చివర్లో మతి స్థిమితం కూడా తప్పింది. ఏసి రూమ్ లో ఆయనను ఒంటరిగా ఉంచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎం. ఎం. కీరవాణి మామ ఇంటికి వెళ్లారు. తమిళంలో తను స్వరపరిచిన తొలి చిత్రం "పాట్రుట్ దిట్టన్" ఆడియో కేసట్ ను మామకు చూపించాలని ముచ్చట పడ్డారు. ఆ కేసట్ ను ఓ ఆట వస్తువులా ఆడుకున్నారాయన. అలా ఆ పరిస్థితిలో మామను చూసి కీరవాణి కంటతడి పెట్టుకున్నారు. ఆ తరువాత [1] మహాదేవన్ అంతిమదినాలలో శ్వాసపీల్చుకోవటం కష్టమై వారం రోజుల పాటు అస్వస్థతతో ఆసుపత్రిలో ఉండి 2001, జూన్ 22న 83 సంవత్సరాల వయసులో మద్రాసులో మరణించారు.[2]
కె.వి.మహదేవన్ స్వరపరచిన కొన్ని తెలుగు చిత్రాలు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.