కబీరుదాసు
From Wikipedia, the free encyclopedia
కబీరుదాసు భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యాలవలె వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. కబీర్ జన్మస్థలం కాశి. ఈయన సా.శ.1399లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ ఇతన్నిఒక నిరుపేద చేనేత ముస్లిం దంపతులైన నీమా, నీరూ పెంచి పెద్దచేశారు. ఇతను దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇతని మొదటి భార్య చనిపోగా రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె పరమగయ్యాళి కావటం వలన జీవితముపై విసిగిపోయాడు. ఆకాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు, మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకొనేవారు, మూఢాచారాలు వ్యాపించి ఉండేవి. ఇవన్నీ చూసిన కబీరుదాసు ఇల్లు వదలి దేశాటనకై బయలుదేరి అనేక యాత్రలు తిరిగి పలుప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకొని జ్ఞాన సంపన్నుడయ్యాడు. కబీరు చదువుకొన్న విద్యాధికుడు కాదు. అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు "కబీరు బీజక్". కబీర్ శ్రీరాముని భక్తుడు. కబీరుదాసు గురువు "రామానందుడు". అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీర్. కబీర్ సా.శ.1518లో మరణించాడు. అతని భౌతికకాయం కోసం హిందువులు, ముస్లింలు వాదులాడుకున్నారు. కబీర్ ముస్లిం అని, కాదు, హిందువని వారు పోట్లాడుకున్నారు. భౌతికకాయం మాయమై, దానికి బదులుగా అక్కడ పుష్పాలు వెలిశాయట. ఈ నిదర్శనం వల్ల వారికి భక్తకబీరు ఎంతటి మహిమాన్వితుడో తేటతెల్లమయింది. ఇతడు 120 యేళ్ళ సుదీర్ఘ జీవితాన్ని చూశాడు.
సాహిత్యం
కబీర్ దాసు దోహాలు చాలా ప్రసిద్ధి చెందాయి.
కబీర్ సూక్తులు
- మతాల పేరిట సామరస్యం చెడగొట్టుకోవటం అవివేకం
- "రామ్ రహీమ్ ఏక్ హై"
- భగవంతుని కొరకు అక్కడ - ఇక్కడ వెతకవలసిన పనిలేదు, అతడు నీలోనే ఉన్నాడు . నీలో వున్న ఆత్మారాముని కనుగొనలేక కస్తూరి మృగం చందంబున అక్కడక్కడ వెదకులాడిన ఏమి లాభం? పూవులోని వాసనలా దేవుడు నీలోనే ఉన్నాడు. తన నాభినుండి బయట పడుతున్న కస్తూరి గంధాన్ని, తెలుసుకొనలేని జింక, దాన్నిబయట గడ్డిలో వెతుకుతుంది. అలాగే నీలోని భగవంతుని బయట వెతకవద్దు.
- ప్రజలు తమ శరీరాలను బాగా శుభ్రపరుస్తారు. కానీ, మనస్సులోని మురికిని శుభ్రం చేయరు. వారు గంగా, గోమతి వంటి నదులలో స్నానం చేయడం ద్వారా తమను తాము పవిత్రులుగా భావిస్తారు, కానీ వారు మూర్ఖులు.
ప్రజలు కదలని రాయికి పంచభక్ష పరమాన్నాలు పెట్టి తినమని పూజిస్తారు తప్ప సాటి మనిషిని ప్రేమించీ కాస్త అన్నం పెట్టారు
రాయిలో దేవుడున్నాడు అనుకొంటే చిన్న రాయికి ఎందుకు ఆ కొండకే పూజలు చేయండి అంటారు అంతకంటే, విసుర్రాయిని పూజించండి గింజల్ని పిండి చేసి ముద్ద పెడుతుంది అంటారు.
మూలాలు
- కబీరుదాసు: సి.వి.నారాయణ 2008 ఫిబ్రవరి సప్తగిరి పత్రికలో వ్రాసిన వ్యాసం ఆధారంగా.
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.