Remove ads
ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద నగరం From Wikipedia, the free encyclopedia
విశాఖపట్నం భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరం, అదే పేరుగల జిల్లాకు కేంద్రం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సముద్రం లోకి చొచ్చుకొని ఉన్న కొండ "డాల్ఫిన్ నోస్", అలల తాకిడిని తగ్గించి సహజ సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా ఉంది. విశాఖపట్నానికి విశాఖ, వైజాగ్, వాల్తేరు అనే పేర్లు కూడా ఉన్నాయి.
విశాఖపట్నం
విశాఖ, వైజాగ్, వాల్తేరు, | |
---|---|
Nickname(s): విధిగల నగరం (The City of Destiny), తూర్పుతీర రత్నం (The Jewel of the East Coast) | |
Coordinates: 17°42′15″N 83°17′52″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం, |
పట్టణంగా గుర్తించింది | 1865 |
నగరంగా గుర్తించింది | 1979 |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ, విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ |
• మేయర్ | గొలగాని హరివెంకట కుమారి |
విస్తీర్ణం | |
• మహానగరం | 697.96 కి.మీ2 (269.48 చ. మై) |
• Metro | 4,983 కి.మీ2 (1,924 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మహానగరం | 17,28,128 |
• Rank | భారతదేశంలో జనాభా ర్యాంకు 11 |
• జనసాంద్రత | 2,500/కి.మీ2 (6,400/చ. మై.) |
• Metro | 56,18,000 |
Demonym(s) | వాల్తేరోడు, వైజాగీయుడు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 530 0XX, 531 1XX |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | +91-891 |
వాహనాల నమోదు సూచిక సంఖ్యలు | AP-31, AP-32, AP-33, AP-34 , AP-39 |
అధికారిక | తెలుగు |
2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రతిపాదించాడు.[3] [4]
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం, బౌద్ధ విహారాల అవశేషాలున్న తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ, బొజ్జన కొండ; సముద్రతీర ప్రాంతాలు, ఉద్యానవనాలు, ప్రదర్శనశాలలు ఇక్కడి ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. సరిహద్దు జిల్లాలలో గల పర్యాటక ప్రాంతాలైన అరకు లోయ, మన్యం అడవులు, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు చూడటానికి ఇది ప్రముఖ పర్యాటక కేంద్ర స్థావరం.
విశాఖపట్నం అనే పేరు విశాఖ అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. విశాఖపట్నానికి ఈ పేరు రావడం వెనుక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
విశాఖపట్నం జిల్లా గజిట్ (పిపి 2–3) ప్రకారం శివుని కుమారుడు "వైశాఖ" (కార్తికేయుడు) పేరు పెట్టినందున "విశాఖ" అనే పూర్వపదం వచ్చినట్లు ఉంది.[5] శివుడి కుమారుడు కుమార స్వామికి విశాఖ అనే పేరు కూడా ఉంది. అతని నక్షత్రం కూడా విశాఖే. అతని గుడి ఇక్కడ ఉండేదనీ, అతని పేరిటే ఈ నగరానికి ఆ పేరు వచ్చిందనే వాదన కూడా ఉంది.[6]
వైశాఖేశ్వరుని ఆలయం చుట్టూ నగరం విస్తరించినందువల్లే విశాఖపట్నంగా పేరు వచ్చిందనేది ఒక కథనం.[7] ఈ నగరంలో విశాఖేశ్వరుని ఆలయం ఉన్నందున "విశాఖేశ్వరపురం" అనే పేరు ఉండేదని కాలక్రమంలో, పురానికి రూపాంతరం పట్నం కావున "విశాఖపట్నం"గా మారినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది.[8] ఉత్తర పదం "పట్నం" పట్టణానికి రూపాంతరం. దీనికి ఊర్ల పేర్ల నిఘంటువు[9] ప్రకారం పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలున్నాయి. ఈ నగరం పూర్వం నుండి సముద్రతీర ప్రాంతం, ఓడరేవు ఉన్నందున ఉత్తర పదం "పట్నం" వచ్చినట్లు తెలియుచున్నది.[10]
ద్రాక్షారామం లోని భీమేశ్వరాలయంలో లభ్యమైన సా.శ. 1068 నాటి శిలాశాసనం లోనే విశాఖపట్నం అనే పేరు ఉన్నట్లు తెలుస్తోంది.
11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు ఈ ప్రాంతాన్ని జయించాడు. అతను ఈ నగరానికి "కులోత్తుంగపట్నం" అనే పేరు పెట్టాడు. విశాఖపట్నం నుంచి తంజావూరు వరకూ అతని రాజ్యం ఉండేది. కానీ అతని తదనంతరం ఆ పేరు కనుమరుగు అయిపోయింది. ఈ విషయాన్ని చరిత్రకారులు ధ్రువీకరించారు.[6] 1102 నాటి శాసనంలో విశాఖపట్నం పూర్వపు పేరు "కులోత్తుంగ చోళ పట్టిణం" లేదా "విశాఖ పట్టిణం" అని ఉంది. అంటే కులోత్తుంగ చోళుడు ఈ పట్టణానికి "కుళోత్తుంగపట్నం"గా మార్చినప్పటికీ, అంతకు పూర్వమే "విశాఖ పట్టిణం" అని ఉన్నట్లు తెలియుచున్నది. ఉత్తర పదం "పట్టణం" లేదా "పట్టిణం" అనేది ఓడరేవు పట్టణం అయినందున వచ్చినట్లు తెలియుచున్నది.[5]
1908 నాటి బ్రిటిషు ఇండియా వారి ఇంపీరియల్ గజటీర్ ఈ నగరాన్ని విజాగపటం (VIZAGAPATAM) అంటోంది. ఈ గజెట్ మొదటి కూర్పు 1880 లో వెలువడింది.[11] ఇంగ్లీషులో వైజాగపటం అని రాసినా, తెలుగులో రాసేప్పుడు మాత్రం విశాఖపట్నం అనే రాశారు బ్రిటిష్ వాళ్లు. అప్పటి ప్రభుత్వ ముద్రలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. ఆ వైజాగపటంలోని మొదటి అక్షరాలతో వైజాగ్ ఇప్పుడు బాగా వాడకంలో ఉంది.
శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖుడి పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల రాతి ఆయుధాలను చూడవచ్చు.
స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది. (9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీకి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై, తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు. ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.
గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను ఉంది.
7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డిరాజులు, చోళులు, కుతుబ్ షాహీలు, మొగలులు, నిజాం వంశస్థులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం ఒకటిగా ఉండేది.[12]
కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, 18 వ శతాబ్దంలో బ్రిటిషు వారి వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం జిల్లాగా ఏర్పడింది. ఈ నగరం బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది.[13]
విశాఖపట్నం బంగాళా ఖాతం ఒడ్డున ఉంది. ఈ నగరపు అక్షాంశ రేఖాంశాలు; 17.688° ఉత్తర అక్షాంశం, 83.219° తూర్పు రేఖాంశం. ఈ నగరం మైదాన ప్రాంతం, తీరప్రాంతాలతో ఉంది. నగరం సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తున ఉంది.[14] విస్తీర్ణం 682 కి.మీ2 (263 చ. మై.).
నగరానికి పశ్చిమాన సింహాచలం కొండలు, ఆగ్నేయాన యారాడ కొండలు, వాయవ్యాన కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నాయి. 621.52 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ కొండలు విశాఖపట్నం పర్యావరణంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.[15]
విశాఖపట్నంలో ఉష్ణమండల, తడి పొడి వాతావరణం (కొప్పెన్ Aw) ఉంటుంది. వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 24.7–30.6 °C (76–87 °F) మధ్య ఉంటాయి, గరిష్ఠ ఉష్ణోగ్రత మే నెలలోను, కనిష్ఠ ఉష్ణోగ్రత జనవరిలోనూ ఉంటుంది; కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17–27 °C (63–81 °F) మధ్య ఉంటాయి. ఇప్పటివరకు అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత 42.0 °C (107.6 °F) 1978 లోను, అత్యల్ప ఉష్ణోగ్రత 10.5 °C (51 °F) 1962 జనవరి 6 న నమోదైంది.[16][17] నైరుతి, ఈశాన్య రుతుపవనాల నుండి వర్షపాతం లభిస్తుంది. సగటు వార్షిక వర్షపాతం 1,118.8 మిమీ (44.05 అంగుళాలు).[18] 2014 అక్టోబరులో హుద్‌హుద్ తుఫాను విశాఖపట్నం సమీపంలో తీరాన్ని తాకింది.[19]
శీతోష్ణస్థితి డేటా - విశాఖపట్నం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 34.8 (94.6) |
38.2 (100.8) |
40.0 (104.0) |
40.5 (104.9) |
45.0 (113.0) |
45.4 (113.7) |
41.4 (106.5) |
38.8 (101.8) |
38.2 (100.8) |
37.2 (99.0) |
35.0 (95.0) |
34.2 (93.6) |
45.4 (113.7) |
సగటు అధిక °C (°F) | 28.9 (84.0) |
31.3 (88.3) |
33.8 (92.8) |
35.3 (95.5) |
36.2 (97.2) |
35.3 (95.5) |
32.9 (91.2) |
32.7 (90.9) |
32.5 (90.5) |
31.7 (89.1) |
30.4 (86.7) |
28.9 (84.0) |
32.5 (90.5) |
సగటు అల్ప °C (°F) | 17.0 (62.6) |
18.9 (66.0) |
22.0 (71.6) |
25.1 (77.2) |
26.7 (80.1) |
26.3 (79.3) |
25.1 (77.2) |
25.0 (77.0) |
24.6 (76.3) |
23.3 (73.9) |
20.6 (69.1) |
17.6 (63.7) |
22.7 (72.8) |
అత్యల్ప రికార్డు °C (°F) | 10.5 (50.9) |
12.8 (55.0) |
14.4 (57.9) |
18.3 (64.9) |
20.0 (68.0) |
20.6 (69.1) |
21.0 (69.8) |
21.1 (70.0) |
17.5 (63.5) |
17.6 (63.7) |
12.9 (55.2) |
11.3 (52.3) |
10.5 (50.9) |
సగటు అవపాతం mm (inches) | 21.4 (0.84) |
17.7 (0.70) |
17.5 (0.69) |
37.6 (1.48) |
77.8 (3.06) |
135.6 (5.34) |
164.6 (6.48) |
181.2 (7.13) |
224.8 (8.85) |
254.3 (10.01) |
95.3 (3.75) |
37.9 (1.49) |
1,265.7 (49.82) |
సగటు వర్షపాతపు రోజులు | 1.7 | 2.3 | 2.3 | 3.2 | 4.9 | 8.8 | 11.9 | 12.6 | 12.6 | 9.9 | 5.0 | 1.7 | 76.9 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 71 | 70 | 69 | 71 | 69 | 71 | 76 | 77 | 78 | 74 | 68 | 67 | 72 |
Source 1: IMD ( సగటు గరిష్ట, కనిష్ట వర్షపాతం)[20] | |||||||||||||
Source 2: IMD (2010 వరకు అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు)[21] |
భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం, విశాఖపట్నం జనాభా 1,728,128, వీరిలో పురుషులు 873,599, ఆడవారు 854,529, - లింగ నిష్పత్తి 1000 మగవారికి 978 మంది. జనాభా సాంద్రత 18,480 /చ. కిమీ (47,900 / చదరపు మైళ్ళు). 0–6 సంవత్సరాల వయస్సులో 164,129 మంది పిల్లలు ఉన్నారు, 84,298 మంది బాలురు, 79,831 మంది బాలికలు ఉన్నారు - లింగ నిష్పత్తి 1000 మంది అబ్బాయిలకు 947 మంది బాలికలు. మొత్తం 1,279,137 మంది అక్షరాస్యులతో సగటు అక్షరాస్యత రేటు 81.79%గా ఉంది, వారిలో 688,678 మంది పురుషులు, 590,459 మంది స్త్రీలు ఉన్నారు.[22][23] ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో విశాఖపట్నం 122 వ స్థానంలో ఉంది.[24] మొత్తం మురికివాడ జనాభా జనాభాలో 44.61%. అంటే 770,971 మంది మురికివాడల్లో నివసిస్తున్నారు.[25]
నగర పరిమితుల విస్తరణ తరువాత జనాభా రెండు మిలియన్ల మార్కును దాటి 2,035,922 వద్ద ఉంది.[26]
విశాఖపట్నంలో మతాలు (2011) source: Visakhapatnam city Census 2011 data | ||||
---|---|---|---|---|
హిందూ | 92.32% | |||
ముస్లిమ్ | 3.85% | |||
క్రైస్తవం | 3.07% | |||
ఇతరులు | 0.76% |
తెలుగు స్థానిక ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష, అధికారిక భాష.[27][28] సాధారణ మాండలికం,ఉత్తరాంధ్రా (ఈశాన్య ఆంధ్ర) మాండలికం వాడుకలోవున్నాయి. ఉత్తరాంధ్ర మాండలికం ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రజలు మాట్లాడతారు.[29] విశాఖపట్నం కాస్మోపాలిటన్ జనాభాలో తమిళులు,[30][31] మలయాళీలు,[32][33] సింధీలు,[34] కన్నడిగులు,[35][36] ఒడియాస్,[37] బెంగాలీలు, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బిహారీ వలసదారులు ఉన్నారు.[38][39] నగరపు మొదటి కాస్మోపాలిటన్లుగా పరిగణించబడే ఆంగ్లో-ఇండియన్ సముదాయం కూడా ఉంది.[40]
2011 జనాభా లెక్కల ప్రకారం, నగరంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు, 92.72% మాట్లాడేవారు, తరువాత ఉర్దూ (2.52%), హిందీ (2.15%), ఒడియా (1.00%), తమిళం (0.33%), మలయాళం (0.32%) ),, బెంగాలీ (0.31%).[41]
పౌరులలో హిందూ మతం ఎక్కువమంది ఆచరిస్తున్నారు, తరువాతి స్థానాలలో ఇస్లాం, క్రైస్తవ మతం ఉన్నాయి. ఈ ప్రాంతం పురాతన కాలంలో బౌద్ధమతం ప్రాబల్యంవుండేది అనేదానికి చిహ్నంగా దగ్గర ప్రాంతాల్లోని అనేక బౌద్ధ సంఘరామాలున్నాయి. ఇటీవలి జనాభా లెక్కల ఆధారంగా మొత్తం నగరంలో బౌద్ధమతస్తుల జనాభా సుమారు 0.03%గా ఉంది.[42]
పరిపాలన కొరకు 1858లో పురపాలక సంఘం, 1979 లో నగర పాలక సంస్థ, 2005 నవంబరు 21 నాడు మహానగర పాలక సంస్థ ఏర్పడ్డాయి..[43][44]
నగర ప్రాంత అభివృద్ధి కొరకు విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుచేయబడింది.
చెన్నై-కోల్‌కతా లను కలుపు 16 వ నంబరు జాతీయ రహదారి, విశాఖపట్నం-రాయపూర్ లను కలుపు 26 వ నంబరు జాతీయ రహదారి విశాఖను దేశం లోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చే నిర్వహించబడు ద్వారకా బస్సు స్టేషన్ కాంప్లెక్స్ నుండి రాష్ట్ర సర్వీసులు, సరిహద్దు రాష్ట్రాలకు అంతరాష్ట్ర సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. నగరంలోని మద్దిలపాలెం,అనకాపల్లి బస్ స్టేషన్ ల నుండి కూడా బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి యాజమాన్యంలో నగర బస్సులు, నగర ప్రాంతాలకే కాక, పొరుగు జిల్లా కేంద్రాలైన విజయనగరం,శ్రీకాకుళంలకున్నాయి. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి శీఘ్రవంతమైన ప్రజా రవాణా కొరకు బి.అర్.టి.ఎస్ (Bus Rapid Transit System) వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.[45]
దేశంలో నాల్గవ అత్యధిక ఆదాయం కలిగిన వాల్తేరు డివిజన్ ప్రధాన కేంద్రం విశాఖ పట్నంలో ఏర్పాటు చేయబడింది. హౌరా - చెన్నై రైలు మార్గంలో విశాఖపట్నం జంక్షన్ ఒక ప్రధాన రైల్వే స్టేషన్. దువ్వాడ, అనకాపల్లి, సింహాచలం రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి.
విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది నౌకాదళం అధీనంలో నడిచే విమానాశ్రయం. ఇందులోనే ఐ.ఎన్.ఎస్. డేగ పేరుతో నౌకాదళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణిస్తుంటాయి. రుషి కొండలో నగర విహంగ వీక్షణం కొరకు సెలవుదినాలలో, పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాలలో హెలికాప్టర్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. విజయనగరం జిల్లా లోని భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేశారు.
ఇక్కడ సంవత్సరంలో అన్ని రోజులు నౌకలు నిలుపుదల చేయగల సహజ సిద్ద నౌకాశ్రయం కేంద్ర ప్రభుత్వ అధీనంలో లోని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఇది కాకుండా దేశం లోనే లోతైన పోర్ట్ అయిన గంగవరం పోర్ట్ ద్వారా కూడా ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. స్థానిక జాలర్ల కొరకు రాష్ట్రం లోనే అతి పెద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయబడింది. ఎగుమతులు,దిగుమతుల కోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు ఏర్పాటు చేయబడింది. విశాఖ పోర్ట్ నుండి పోర్ట్ బ్లెయిర్ కి రవాణా సౌకర్యం ఉంది.
పర్యాటకుల విహారం కొరకు ఫిషింగ్ హార్బర్ నుండి, రుషికొండ బీచ్ నుండి సాగరంలో బోటింగ్ సౌకర్యాలు ఉన్నాయి.
నగరంలో మూడు రైలు మార్గాలలో మెట్రో రైలు వ్యవస్థ ప్రతిపాదించబడింది.[ఆధారం చూపాలి]
కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే నుండి వాల్తేర్ డివిజన్ ని, దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ ల కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్ లోని ఒడిశా భాగాలూ నూతనంగా ఏర్పాటు చేయబడు రాయగడ డివిజన్ లో భాగం కానున్నాయి. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లోని మిగిలిన భాగాలు విజయవాడ డివిజన్ లో విలీనం చేసేలా సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.[ఆధారం చూపాలి]
ఈ నగరం అనేక విద్యాసంస్థలకు నిలయంగా ఉంది. ఇక్కడ విశాఖపట్నం ప్రజా గ్రంథాలయం కూడా ఉంది.
ప్రభుత్వ రంగం లోని కింగ్ జార్జ్ హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్, విశాఖ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ తో పాటు, టాటా కాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండస్ హాస్పిటల్స్, సెవెన్ హిల్స్ హాస్పిటల్స్, ప్రథమ హాస్పిటల్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, పినాకిల్ హాస్పిటల్, మై క్యూర్, కేర్, అపోలో, ఓమ్ని వంటి హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి.
క్రీడారంగ అభివృద్ధి కొరకు నగరం అనేక మైదానాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఏసీఏ వీడీసీఏ డా.వై.ఎస్.ఆర్.క్రికెట్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి అన్ని ఫార్మాట్ల క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయి. ఇక్కడ డే అండ్ నైట్ మ్యాచ్ లకు సైతం ఆతిధ్యం ఇచ్చే సౌకర్యం ఉంది. ఇది కాక నగరంలో పోర్ట్ ఇండోర్ స్టేడియం, పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఉక్కు స్టేడియం, సౌత్ కోస్ట్ రైల్వే స్టేడియం, హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్ వంటి క్రీడా ప్రాంగణాలు ఔత్సాహికులు అయిన క్రీడా కారులను తీర్చిదిద్దుతున్నాయి.
సాధారణ పారిశ్రామిక వాడలేకాక ఔషధ రంగం, వస్త్ర రంగం, ఆర్థిక రంగం కొరకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఏర్పాటయినాయి.
ప్రత్యెక ఆర్థిక మండలి
భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం ప్రధాన స్థావరం.
ఇంకా భీమునిపట్నం బీచ్, మంగమారిపేట బీచ్, యారాడ బీచ్, గంగవరం బీచ్, అప్పికొండ బీచ్ ఉన్నాయి.
ఇంకా నందమూరి తారక రామారావు సాగర తీరా ఆరామం (వుడా పార్క్), వైశాఖి జల ఉద్యానవనం ఉన్నాయి.
ఇంకా, కంబాల కొండ ఎకో పర్యాటకం పార్క్, జాతర శిల్పారామం, డా. రామానాయుడు స్టూడియోస్, అక్వేరియం,రాజీవ్ గాంధీ కర్ణాటక సంగీత భాండాగారం, VMRDA బుద్ధవనం,విక్టరీ ఎట్ సి మెమోరియల్ (Victory at Sea Memorial), హామిలిటన్ మెమోరియల్ మాసోనిక్ ఆలయం ఉన్నాయి.
సి ఎం ఆర్ సెంట్రల్ - ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ (4 స్క్రీన్ లు), ఐనాక్స్ - వరుణ్ బీచ్ (6 స్క్రీన్ లు), చిత్రాలయ - ఐనాక్స్ (3 స్క్రీన్ లు), విశాఖపట్నం సెంట్రల్ - ముక్తా ఎ2 సినిమాస్ (3 స్క్రీన్ లు) నగరంలో ఉన్నాయి.
విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళల సేవా సంస్థ కళాభారతి 1991 మార్చి 3 న స్థాపించారు. సంగీతకారుడు సుసర్ల శంకర శాస్త్రి కలలకు ప్రతీకగా పుట్టిన ఈ ఆడిటోరియాన్ని 1991 మే 11 తేదీన పిఠాపురం కాలనీలో ప్రారంభించారు. ఇక్కడ నిత్యం, వివిధ సంగీత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు (సంప్రదాయ, జానపద), నాటకాలు జరుగుతాయి.
ఈ సంస్థ విశాఖపట్నంలోని సంగీత (కర్ణాటక, హిందుస్థానీ), నృత్య కార్యక్రమాలకు కేంద్ర స్థానంగా ఉంది. సంగీత, నృత్య ప్రదర్శనల కార్యక్రమాలు, త్యాగరాజు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుంది.
విశాఖపట్నంలో లైన్స్ క్లబ్ (లయన్స్ క్లబ్), రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్. సావిత్రిబాయి ఫూలే ట్రస్టు, గోపాల పట్నం. ప్రతిజ్ఞ ఛారిటబుల్ ట్రస్టు, ఆర్.పి.పేట, మర్రిపాలెం, ప్రేమ సమాజం వంటి అనేక స్వచ్ఛంద సంస్థలున్నాయి
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.