From Wikipedia, the free encyclopedia
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం విశాఖపట్నం లోని బురుజుపేట పరిధిలోకల ప్రసిద్ద దేవాలయం.ఇక్కడి అమ్మవారు శ్రీకనకమహాలక్ష్మి విశాఖప్రజల గ్రామదేవతగా వెలుగొందుతుంది.[1]
ఈ దేవాలయానికి సంబంధించి సరియైన చారిత్రక ఆధారాలులేవు. ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత, కుటుంబ దేవతగా తెలుస్తుంది. అప్పటి రాజుల కోట బురుజు కలప్రాంతంలోని బురుజుపేటలో కల అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది.
స్థానిక కథనం ప్రకారం, 1912 లో శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మునిసిఫల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరోచోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విసాఖలో ప్లేగు వ్యాధి ప్రభలి అనేకమంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వలనే జరిగిందని తలచి మళ్ళీ యధాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడటం తరువాత ఆమె మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందింది.
విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువైన శ్రీకనక మహాలక్ష్మీ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు గానీ, గోపురం గానీ ఉండదు. అంతేకాదు, అమ్మవారికి వామ హస్తం (ఎడమ చేయి) కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు.[1]
వరలక్ష్మీ వ్రతం, దసరా పండుగల సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాక్షాత్తు కనక మహాలక్ష్మి ఇక్కడ స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పాడేసి రక్షించారని చెబుతారు.బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై.. తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు, తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు. మరో కథనం ప్రకారం.. సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై.. తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే, ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని, మన్నించాలని ప్రాదేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామ హస్తంలోని పరిగ అనే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి.. అమ్మవారి వామ హస్తాన్ని మోచేతి పైవరకు ఖండిచి, శాంతిపజేస్తాడు. కనక మహాలక్ష్మీగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే, ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు.[1]
అమ్మవారి దేవస్థానానికి చేరుకోడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్‌ల నుంచి బస్సు సదుపాయం ఉంది. ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన చారిత్రాత్మక ప్రాంతం ఇది
Seamless Wikipedia browsing. On steroids.