From Wikipedia, the free encyclopedia
తెలుగు ప్రజలు, భారతదేశంలోని ద్రావిడ జాతికి చెందిన సమూహం. ప్రపంచంలో ఉన్న పెద్ద జాతి సమూహలలో తెలుగు జాతి ఒకటి. తెలుగు ప్రజలలో అధికులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నివసిస్తారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక పూర్వం, తెలుగు మాట్లాడే ప్రాంతం చాలా విశాలంగా వుండేది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన అనేక ప్రాంతాలలో తెలుగు సంస్కృతి, భాష కలిగిన వారు ఎక్కువుగా వుండేవారు, ఇప్పటికీ మరికొంతమంది ఉన్నారు.
Total population | |
---|---|
8.46 కోట్లు (సుమారు ఆంధ్రప్రదేశ్ జనాభా 2011 నాటికి) [1] ప్రపంచ జనాభా = ~9 కోట్లు [2] | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
భారతదేశం | 8.5 కోట్లు |
అమెరికా | 10,00,000[3] |
గల్ఫ్ దేశాలు | 3,00,000 |
ఐరోపా దేశాలు | 1,00,000 |
సింగపూర్ | 30,000 |
మలేషియా | 40,000 |
ఆస్ట్రేలియా | 20,000 |
దక్షిణ ఆఫ్రికా | 20,000 |
భాషలు | |
తెలుగు, ఉర్దూ | |
మతం | |
హిందూ మతం · ఇస్లాం మతం · క్రైస్తవ మతం · బౌద్ధ మతం · జైన మతం | |
సంబంధిత జాతి సమూహాలు | |
ఇండో ఆర్యన్ · బ్రహుయి · గోండి · కళింగ · కన్నడిగ · మలయాళీలు · తమిళులు · తుళువ · ద్రావిడ |
దేశాంతరాల్లో తెలుగు ప్రజలు నివాసాలేర్పరచుకున్నారు. 18-19 శతాబ్దాల కాలంలో శ్రీలంక మధ్య, తూర్పు ప్రాంతాలను తెలుగు రాజులు పరిపాలించారు.[4] [5]స్వాతంత్ర్యానికి పూర్వం అనేకమంది తెలుగువారు మయాన్మార్ వలసవెళ్ళి ఆక్కడే స్థిరపడ్డారు.
సంస్కృత ఇతిహాసాలు కాలంలో, మౌర్య చక్రవర్తి అశోకుడు మృతి చెందిన సా.శ. 232వ సంవత్సరంలో ఆంధ్ర రాజ్యం ఉన్నట్లు ప్రస్తావించాయి. ఆకాలంలోనే ఆంధ్రుల ఉనికి ప్రారంభమైనట్లు గ్రంధాలు ద్వారా తెలుస్తుంది.శాతవాహనులు, శాకాలు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, వెలమలు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కుతుబ్ షాహి వంశం, హైదరాబాదీ నిజాంల వంటి పలు రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించినవి.
కళింగులకి, ఈ ప్రాంతానికి (ఉత్తరాంధ్ర, ఒడిషా లకి) అవినాభావ సంబంధముంది. కురుక్షేత్ర సంగ్రామంలో ఆంధ్రులు, కళింగులు కౌరవులకి మద్దతు పలికారు. సహదేవుడు పాండ్యులను, ద్రవిడులను, ఓద్రులను, చేరులను, ఆంధ్రులను, కళింగులను రాజసూయ యాగం చేయునపుడు ఓడించాడు. మథురలో చనూరడను శ్రీకృష్ణుడు సంహరించాడు. హరివంశ పురాణం చనూరుడు కరూశ దేశపు (వింధ్య పర్వతాలకు ఉత్తర భాగాన, యమునా నది తీరాన ఉన్న ప్రదేశానికి) రాజు అనీ, అతను ఆంధ్రుడని ధ్రువీకరిస్తుంది . అక్కడ ఆంధ్రులు నివసించేవారని బౌద్ధ మత ప్రస్తావనలు ఉన్నాయి.
మొట్టమొదటి విశాలాంధ్ర సామ్రాజ్యం శాతవాహనులు స్థాపించారు. ఆఖరి కన్వ చక్రవర్తి శిశుమానుడను ఆంధ్ర జాతికి చెందిన అతని ప్రధాన మంత్రి శిప్రకుడు కుట్రపూరితంగా హత్య చేయటంతో శాతవాహనులు అధికార పగ్గాలని చేజిక్కించుకొన్నారు. వీరు 450 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరిలో చిట్టచివరివాడైన పులోముడు యావత్ భారతదేశాన్ని ఆక్రమించి తన తాత గారి వలె గంగలో మునిగి ఆత్మార్పణ చేసుకొన్నాడు. పులోముడి వలనే చైనీయులు భారతదేశాన్ని పులోమదేశంగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు ఉగాది పర్వదినాన్ని ఒకే రోజు జరుపుకోవటానికి కారణం శాలివాహనుడి పేరు పై ప్రారంభమైన శాలివాహన శకమే!
భారతదేశంలో హిందీ, బెంగాలి భాషల తరువాత తెలుగు భాషను అత్యధికంగా మాట్లాడుతున్నారు. ద్రవిడభాషలలో అత్యధికంగా మాట్లాడబడే భాష కూడా తెలుగే. తెలుగు మాట్లాడే అత్యధికులకు తెలుగు భాష మాతృ భాషగా ఉంది. తెలుగు సంస్కృతి కలిగి వుండి, తెలుగే గాక, కన్నడ భాష, మరాఠీ, ఉర్దూ, దక్కని, గోండి మాట్లాడేవారూ తెలుగువారే. తెలుగు ప్రజల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా వీరు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, ఒడిషాలలో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నారు.
తెలుగు సాంస్కృతిక చరిత్ర కళలు, నిర్మాణ శైలి, సాహిత్యం, ఆహారపుటలవాట్లు, ఆంధ్రుల దుస్తులు, మతం, తత్త్వాలుగా విభజించవచ్చు.ఇక్కడి వాగ్గేయకారులు, కూచిపూడి (నృత్యము) సుసంపన్నమైన సంస్కృతి-సంప్రదాయాలకి నిలువెత్తు సాక్ష్యాలు. కర్ణాటక సంగీతం లో, శాస్త్రీయ సంగీతంలో తెలుగు భాష ఇట్టే ఇమిడి పోవటంతో ఆంధ్రప్రదేశ్ సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి మాతృకగా వ్యవహరించింది.
హైదరాబాదు ప్రాంతంలో పర్షియా నిర్మాణ శైలికి స్థానిక కళాత్మకత మేళవించి కట్టడాలని నిర్మించారు. వరంగల్లులో గ్రానైటు, సున్నపురాయిల కలయికలతో కట్టడాలను నిర్మించారు. శాతవాహనులు ఆధ్యాత్మిక సూక్ష్మాలని తెలిపే శిల్పకళతో కూడిన కట్టడాలు అమరావతిలో నిర్మించారు.
ప్రాచీన భాషగా గుర్తింపబడ్డ తెలుగు సాహిత్య సంస్కృతి విశాలమైంది. అనేక ప్రాచీన కవుల, రచయితల వలన తెలుగు ఉత్తాన పథాన్ని చేరినది. ఆధ్యాత్మిక, సంగీత, తత్వ రచనలకి అనువుగా ఉండటంతో తెలుగువారితో బాటు, తెలుగేతరుల మెప్పు పొందింది. ఇటాలియన్ భాషవలె అజంతాలతో ఉండటం వలన ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని సంబోధించారు. అంతరించిపోతున్న అద్భుత భాషకి మరల జవసత్వాలని అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్తో తెలుగు ఖండాంతరాలకి వ్యాప్తి పొందింది. అనేక ఆధునిక రచయితలు తెలుగు భాషని క్రొత్త పుంతలు త్రొక్కించారు.
బెంగుళూరు, చెన్నై నగరాలలో ఆంధ్ర శైలి భోజన శాలలు విరివిగా ఉండటం, వీటిలో తెలుగువారితో బాటు, స్థానికులు, (తెలుగు వారు కాని) స్థానికేతరులు వచ్చి సుష్ఠుగా భోం చేసి వెళ్ళటం, తెలుగువారి ఆహారం ప్రాశస్త్యం గురించి చెబుతాయి. గోంగూర, తాపేశ్వరం కాజా, పూతరేకులు, ఆవకాయ, హైదరాబాదీ బిరియానిలు తెలుగు ప్రజల వంటలుగా సుప్రసిద్ధాలు.
తెలుగు సాహిత్యంకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైంది. ఆధ్యాత్మికంలోనైనా, శృంగారాది నవరసాలలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతుంది. తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతం తెలుగులో మొదటి కావ్యం. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాధా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది.
ఆంధ్రప్రజలు తమ జీవనవిధానంలో వినోదానికెప్పుడూ పెద్ద పీటనే వేసారు. కళాకారులను కళలనూ గుర్తించి, గౌరవించి పోషించుట చేతనే చాలాకాలం అజరామరంగా జీవించాయి. ఆంగ్లభాష ప్రబలి విద్యుతాధార వినోదం ప్రజలకు అందుబాటులోకి రావడంతో మెల్లమెల్లగా ఒక్కొక్క కళ కనుమరుగవుతూ ప్రస్తుతం అంతరించే స్థితికి చేరుకున్నాయి. తెలుగు వారి కళా ప్రత్యేకతలలో కొన్ని.
పురుషుల పంచెకట్టు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. కోస్తా ఆంధ్రలో పంచెని ధోవతి వలె కట్టటం ఎక్కువ. రాయలసీమలో తమిళుల వలె నడుము చ్టుటూ కట్టే పంచెకట్టుని ఎక్కువగా వినియోగిస్తారు. వ్యవసాయం/సైకిలు త్రొక్కటం వంటి పనులు చేసే సమయంలో కట్టే ధోవతులు/పంచెకట్టులు, తలపాగా కట్లు, ఇతర సమయాలలో కట్టే కట్లతో భేదాలు ఉన్నాయి.
ఉత్తర భారత స్త్రీలు సాధారణంగా పైట చెంగు కుడి భుజం పైకి కడతారు. ఆంధ్రలో (ఆ మాటకొస్తే దక్షిణ రాష్ట్రాలన్నింటిలో) ఇది ఎడమ వైపుకు ఉంటుంది.
తెలుగు వంట తెలుగు వారి ఇంటి వంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ప్రత్యేకం కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతల్లో తెలుగు వంటలు ఉంటాయి. తెలుగు వంటకాలలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని అన్ని రకాల కూరగాయలతో ఊరగాయ చేసుకోవడం తెలుగు వారికే చెల్లయింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.