Remove ads
From Wikipedia, the free encyclopedia
తెలుగు సాహిత్యమునకు వెయ్యేళ్ల నాటి చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాథా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది.
కాలానుగుణ తెలుగు సాహితీ చరిత్ర కోసం తెలుగు సాహితీ చరిత్రను చూడండి.
తెలుగు సాహితీకారుల గురించిన మరిన్ని వివరముల కోసం తెలుగు సాహితీకారుల ను చూడండి.
తెలుగు సాహిత్య చరిత్రను కొన్ని యుగాలుగా విభజించ వచ్చును.
11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉంది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. సా.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో నాగబు అనే పదం కనిపిస్తుంది.
దీనిని "పురాణ యుగము" లేదా "భాషాంతరీకరణ యుగము" అని అంటారు. నన్నయ్య ఆది కవి. ఈయన మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని, ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులు పామరులు మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ,నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగుజాడలను అనుసరించిన వారే. నన్నయ్య ఆది కవి.
నన్నయ తరువాతి కాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవం భక్తిమార్గం ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది.
తిక్కన మహాభారతం లోని 15 పర్వాలను పూర్తి చేసాడు. దీని ద్వారా ఈయన గొప్ప కవి అయ్యరు.
ప్రధాన వ్యాసము: ఎఱ్ఱన యుగం
1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెనుగించబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.
తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగి ఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.
ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్య నిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథుని వంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు.
తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన (14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి. అందువలననే ఈ కాలాన్ని పురాణ యుగము అంటారు.
ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. ప్రబంధము అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నికగన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధం, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కల్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.
ఈ సందర్భంలో రామాయణము కవుల గురించి కూడా చెప్పకోవచ్చును. గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం మనకు అందిన మొదటి రామాయణం.
ఈ కాలాన్నే "మధ్యయుగం" అని కూడా అంటారు.
దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యదతో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.
కర్ణాటక సంగీతపు ప్రముఖులు ఎంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితాలోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డ్స్ వర్త్ వంటి ఆంగ్ల కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు భావకవిత్వం అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), గిడుగు రామ్మూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం), సురవరం ప్రతాపరెడ్డి మొదలైన తెలుగు సాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం, వ్యావహారిక భాషా వాదమునకు దారితీసింది.
తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్విక, ప్రబోధాత్మక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు.తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ;
భక్త కల్పద్రుమ శతకం (1949) మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం సుమాంజలి. హరిహరనాథ శతకము, నుగుబాల నీతి శతకము, తెనుగుబాల శతకము
1963లో రసూల్ ప్రభు శతకము అల్లా మాలిక్ శతకము
సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము
సోదర సూక్తులు
హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్ దాసవర్య
ప్రవక్త సూక్తి శతకము,భయ్యా శతకము
వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమనియె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట
సాధుశీల శతకము కులము మతముగాదు గుణము ప్రధానంబు దైవచింత లేమి తపముగాదు, బాలయోగి కులము పంచమ కులమయా, సాధులోకపాల సత్యశీల
గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో 'గురుని మాట' శతకం మానస ప్రబోధము శతకం
మిత్రబోధామృతము అనే శతకం
బ్రహ్మ విద్యా విలాసము.
తెలుగుసాహిత్యములో ప్రపంచ సాహిత్యములో వలెనే వివిధ రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. ముఖ్యముగా ఈ క్రింది విషయములు చెప్పుకొనవచ్చు.
తెలుగులో వివిధ సాహిత్య రీతుల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎన్నో కావ్యాలు వచ్చాయి. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రస్తుతము విప్లవ సాహిత్యము, అవధానములు, ఇంటర్నెట్టు తెలుగు సాహిత్యము, వివిధ ఇజములుకు చెందిన సాహిత్యములు, నవలలు,టీ. వీ. సాహిత్యము, సినీ సాహిత్యము, రీ మిక్సులు, చిన్న కథలు వంటివి తెలుగు సాహిత్య ముఖ చిత్రాన్ని చాలా వరకు పూర్తి చేస్తున్నాయి
విమర్శ ఒక సాహిత్య పక్రియ.ఈ ప్రక్రియ సర్వ స్వతంత్రమైనది. వచన రచన పక్రియ కాదు. ఏదో ఒక సృజనాత్మక సాహిత్య పక్రియ ఆధారం లేకుండా విమర్శ ఉండదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.