Remove ads
తెలుగు కవి From Wikipedia, the free encyclopedia
శ్రీనాథుడు (1380-1470) 15 వ శతాబ్దికి చెందిన తెలుగు కవి. దివ్యప్రబంధన శైలికి ఆదరణ కల్పించాడు. చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.
శ్రీనాథుడు | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1380 ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1][2][3][4] |
మరణం | 1470 (కపిలేశ్వర గణపతి కోస్తాంధ్రని గెలిచాక .[5] (75 ఏళ్ల పై వయస్సులో) బొడ్డేపల్లి కృష్ణా నది వడ్డున |
వృత్తి | కవి |
కాలం | 1380-1470 |
విషయం | telugu |
శ్రీనాథుడు ప్రస్తుత కృష్ణా జిల్లాలో ఉన్న కలపటం గ్రామం లో భీమాంబ మరియు మారయ్య దంపతులకు సుమారుగ సామాన్య శకం 1355 లో జన్మించాడు.[6] తాను పాకనాటి నియోగ బ్రాహ్మణుడని మరియు తన తాత పద్మపురాణముని తెనుగించిన కమలనాభామాత్యుడని శ్రీనాథుడు తన కావ్యాలలో చెప్పుకొన్నాడు.[7]
శ్రీనాథుడు 15వ శతాబ్దము కాలపు కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు. శ్రీనాధుడు రెడ్డిరాజుల కడనున్న విద్యాధికారి అన్నమాట లోక విదితం. అద్దంకి రెడ్డిరాజులు క్రమముగా కొండవీడు, రాజమహేంద్రవరములలో రాజ్యమేలినారు. శ్రీనాధభట్ట సుకవి కొన్నాళ్ళు విస్తృతముగా ఆంధ్రదేశముననే కాక కర్ణాటక ప్రాంతమునందు కూడ సారస్వత యాత్రలు నెరపి తన భాషకు ఎనలేని సేవ చేసినాడు. శ్రీనాధామాత్యుని తాతగారు కమలనాభామాత్యుడు తన మనుమని ముద్దు పలికులలో ఇట్లు వర్ణించినాడు "కనకక్ష్మాధర ధీరు, వారిధి తటీ కాల్ పట్టణాధీశ్వరున్ అనుగుందాత, కమనాభామాత్య చూడామణిన్" సాగర తటమునందున్న కాల్ పట్టణమునకు అధిపతి కమలలాభామాత్యుడు నేటి ప్రకాశం జిల్లా గుండ్లకమ్మనదికి దక్షిణ తటమున బంగాళాఖాతమునకు పడమరగా సుమారు ఇరువది కిలోమీటర్ల దూరములోనున్న నేటి ఊరు కొలచనకోట. ఈ కొలచనకోట యే కొలసనకోట (కాల్ సనకోట) అదే శ్రీనాధుని జన్మస్థలమని పలువురి చరిత్రకారుల అభిప్రాయము. ఈ కాల్పట్టణం ఆ సమీపంలోని పాదర్తి అని మరికొందరు అందురు. ఏది ఎమైనా శ్రీనాధుడు ప్రకాశం సీమలోనివాడని, జన్మస్థలము ఈ ప్రాంతములోనే జరిగినదని తెలియుచున్నది.
గౌడ డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢంకను పగుల గొట్టించాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదు ఉంది.
ఇతను ఎన్నో కావ్యాలు రచించాడు. వాటిలో కొన్ని: భీమఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగునవి. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంతా బహు ప్రశస్తి పొందాయి.
కాశీఖండమునందు చెప్పుకున్నట్టుగా
చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు
రచియించితిమరుత్తరాట్చరిత్ర.
నూనుగు మీసాల నూత్న యౌవనమున
శాలివాహన సప్తశతి నుడివితి.
సంతరించితి నిండు జవ్వనంబునయందు
హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని
యాడితి భీమనాయకుని మహిమ
ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మను మహాగ్రంథ మేను
తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.
శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ రెండుపద్యాలూ అవధరించండి.
కుల్లాయుంచితి, కోకసుట్టితి, మహాకూర్పాసమున్ బెట్టితిన్,
వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్,
తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ .
కవితల్ సెప్పిన పాడనేర్చిన వృధాకష్టంబె, యీ భోగపుం
జవరాండ్రేగద భాగ్యశాలినులు, పుంస్త్వంబేటికే పోగాల్పనా ?
సవరంగాసొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టించుచో
యెవరేనిన్ మదిమెచ్చి ధనంబులిత్తురుగదా నీరేజపత్రేక్షణా!
నీలాలకా జాల ఫాల కస్తూరికా
తిలకంబు నేమిట దిద్దువాడ
నంగనాలింగనా నంగ సంగర ఘర్మ
శీకరం బేమిట జిమ్మువాడ
మత్తేభగామినీ వృత్తస్తనంబుల
నెలవంక లేమిట నిల్పువాడ
భామామణీ కచాభరణ శోభితమైన
పాపట నేమిట బాపువాడ
ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి
కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి
… అహహ
పోయె నా గోరు తన చేతి పోరు మాని
ఒకసారి శ్రీనాథ కవిసార్వభౌములు పల్నాటిసీమ కు వెళ్లారు. అక్కడి నీటి ఎద్దడి చూసి ఈ కంద పద్యాన్ని చాటువుగా చెప్పేరట -
సిరిగలవానికిజెల్లును
తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశాగంగవిడువు పార్వతిచాలున్
ఈయన పోతనకు సమకాలీనుడు. పోతనకు బంధువని, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్ని సర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చారిత్రక ఆధారాలు లేని కారణంగా వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి.శ్రీనాథుని బావమరుదులలో ఒకరి పేరు పోతన(దగ్గుపల్లి పోతన). ఇతడు కూడ కవే. తెలియని వారు ఈ పోతనను బమ్మెర పోతనగా పొరపడి ఉంటారు.
శ్రీనాథుని అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి. కొండవీటి ప్రాభవంతో పాటు శ్రీనాథుని ప్రభ మసకబారింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. కృష్ణాతీరాన ఉన్న బొడ్డుపల్లి గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టని కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంతా తిప్పారని ఆయన చాటు పద్యం ద్వారా తెలుస్తుంది.
కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు సుంకంబు నేడు నూర్లు?
దీనారటంకాల దీర్థమాడించితి
దక్షిణాధీశు ముత్యాలశాల,
పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య
నైషధగ్రంథ సందర్భమునకు,
పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
గౌడడిండిమభట్టు కంచుఢక్క,
చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ద
పాదుకొల్పితి సార్వభౌమ బిరుద,
మెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగ మహీపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సకలసద్గుణ నికురంబ! శారదాంబ!
కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా
పురవీధినెదురెండ బొగడదండ,
సార్వభౌముని భుజాస్కంధ మెక్కెనుగదా
నగరివాకిటనుండు నల్లగుండు,
ఆంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మంబున
దగలియుండెనుగదా నిగళయుగము,
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత
వియ్యమందెనుగదా వెదురుగొడియ,
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?
కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయడిచ్చు?
కైలాసగిరి బండె మైలారువిభుడేగె
దినవెచ్చ మేరాజు దీర్పగలడు?
రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,
స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.
చాటు పద్యాల్లో కనిపించే శ్రీనాథుడి వ్యక్తిత్వం ఇది -
శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్ఠుడయాడో చాటువుల ద్వారా కూడా అంతే. ఐతే శ్రీనాథుడివిగా చెప్పబడేవన్నీ ఆయన చెప్పినవేనా అనేది ఎవరూ తేల్చలేని విషయం. కాని, రసవేత్తలైన పాఠకుల దృష్టిలో శ్రీనాథుడి వ్యక్తిగత జీవనచిత్రణని చూపిస్తాయివి. ఈ చాటుపద్యాలలో కనిపించే శ్రీనాథుడు ఎంతో ఆధునిక భావాలున్నవాడు. ఈ కాలపు సమాజంలో హాయిగా ఇమిడిపోగలవాడు. ఆనాటి సమాజానికి ఆయన జీవనశైలి మింగుడుపడనిదై ఉండాలి. అందుకే అంతటి మహానుభావుడూ చివరిదశలో ఎన్నో ఇక్కట్లకు గురయ్యాడు. ఎవరూ ఆయన్ని ఆదుకోవటానికి రాలేదంటే తన బంధుమిత్రులకు ఎంత దూరమయాడో తెలుస్తుంది. సర్వస్వతంత్రుడిగా, నిరంకుశుడిగా జీవితాన్ని తన మనసుకు నచ్చిన రీతిలో సాగించిన శ్రీనాథుడి మూలంగా మనకు మిగిలిన సంపదలో ముఖ్యభాగం ఈ చాటువులు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.