14వ శతాబ్దపు తెలుగు కవి From Wikipedia, the free encyclopedia
ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. నన్నయ భారతాన్ని చదివి, ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయే వ్రాసాడేమో అనిపిస్తుంది. అలాగే తిక్కన భారతము చదివి ఎర్రన వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కనే వ్రాసాడేమో అనిపిస్తుంది.
![]() | ఈ వ్యాసంలో అస్పష్టమైన, సంశయాత్మక పదాలను వాడారు: ఇలాంటి పదాలు సాధరణంగా పక్షపాతంతో కూడుకుని గానీ, నిర్ధారించుకోలేని సమాచారంతో కూడుకుని గానీ ఉంటాయి. |
సంస్కృతంలో రాసిన మహాభారతానికి తెలుగు అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎర్రన 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతనిని ఎర్రయ్య, ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది.
ఎర్రన తన నృసింహపురాణంలో చేసిన వంశవర్ణననుబట్టి అతని వివరాలు తెలుస్తున్నాయి. ఎఱ్ఱాప్రగడ పాకనాడు సీమ ((ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామము))లో జన్మించాడు. ఈయన ప్రస్తుత గుంటూరు జిల్లా వేమూరు మండలములోని చదలవాడ గ్రామములో నివసించాడు. వీరు "శ్రీవత్స" గోత్రము "అపస్తంబు" శాఖకు చెందిన బాహ్మణుడు. అతని తండ్రి సూరన, తల్లి పొత్తమ్మ (పోతమాంబ). ఎఱ్రన్నకు అతని తాత గారి నామధేయమయిన ఎఱపోతనను నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. ఎఱ్ఱాప్రగడ మామ్మ పేరు పేర్రమ్మ (పేరమాంబ, ప్రేంకమాంబ). ఎఱ్ఱాప్రగడ ముత్తాత బొల్లన (అతని భార్య పోలమ్మ లేదా ప్రోలమాంబ). ఎఱ్ఱాప్రగడ కుటుంబ ఆరాధ్య దైవం శివుడు. గురువు గారి పేరు శ్రీ శంకర స్వామి. ఎఱ్రన్న కుటుంబ ఆరాధ్య దైవం శివుడైనా, విష్ణువుని కూడా పూజించేవాడు.
ఎర్రన బహుశా సా.శ. 1280లో జన్మించి, 1364వరకు జీవించి ఉంటాడని సాహితీ చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. (కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి కందుకూరు మొదలు గోదావరీ తీరం వరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు). ఆ సమయంలోనే ఎర్రన 45ఏండ్ల వయసుగల ప్రౌఢకవి ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవి అయ్యాడు. ఆ రాజు ఆస్థానంలోనే తన సాహితీజీవితాన్ని కొనసాగించాడు.
1353లో ప్రోలయ వేముడు మరణించాడు. ఎర్రన శేషజీవితం గురించి వివరాలు స్పష్టంగాలేవు. అయితే 1364లో అనపోతవేమారెడ్డి వేయించిన దానశాసనం (కొల్లూరు శాసనం) ప్రకారం కనీసం 1364వరకూ, బహుశా ఆ తరువాత మరికొంతకాలం కూడా, ఎర్రాప్రగడ జీవించి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. (ఈ విషయమై ఏకాభిప్రాయం లేదు.)
ఎర్రనకు రెండు బిరుదులున్నాయి (1) శంభుదాసుడు (2) ప్రబంధ పరమేశ్వరుడు. మొదటి బిరుదు అతని ఆధ్యాత్మిక ప్రవృత్తినీ, రెండవ బిరుదు అతని సాహిత్య విశిష్టతనూ తెలుపుతాయి.
'శంభుదాసుడు'గా తాను ప్రశస్తుడవుతాడని తన తాతగారు కలలో కనిపించి ఆశీర్వదించారని నృసింహపురాణం పీఠికలో ఎర్రన వ్రాసుకొన్నాడు. అతని బిరుదు శంభుదాసుడు అయినప్పటికీ అతడు గ్రహించినవన్నీ విష్ణుకథలే. ఈ విధంగా ఎర్రన హరిహరాద్వైతమును జీవితంలోనూ, రచనలలోనూ కూడా పాటించాడని తెలుస్తుంది.
'ప్రబంధ పరమేశ్వరుడు' అనే ప్రశస్తి అరణ్య పర్వశేష రచన వలన కలిగి, తరువాత అది బిరుదంగా కొనసాగిందని నృసింహపురాణంలోని ఒక పద్యం ద్వారా తెలుస్తున్నది. ఎర్రన పురాణకవుల కోవకు చెందినవాడయనా గాని, అద్భుతమైన తన వర్ణనాత్మకత ద్వారా తరువాతి ప్రబంధ కవులకు మార్గదర్శకమైనాడు. అతని ప్రబంధశైలి నృసింహపురాణంలో ఉన్నత స్థాయిని చేరుకుంది.
ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలో చేరడానికి ముందు ఎర్రన చేసిన రచనల గురించి ఏ విధమైన వివరాలూ లేవు. అప్పటికే ఎర్రన మాన్యుడైన కవి గనుక కొన్ని రచనలు చేసి ఉండవచ్చును కాని వాటిని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. నేడు మనకి తెలిసిన ఎర్రన రచనలన్నీ వేమారెడ్డి ఆస్థానంలో ఉండగానే సాగాయి.
ప్రోలయ వేముని కోరికపై ఎర్రన ముందుగా రామాయణాన్ని రచించాడు. కాని అది ఇప్పుడు దొరకడంలేదు. ఎర్రన వంశంవాడైన చదలవాడ మల్లన, ఎర్రన రచనల గురించి వ్రాస్తూ "వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్ర ప్రబంధంబు జేసె" అని చెప్పాడు. అనగా ఇది వాల్మీకి రామయణానికి ఆంధ్రీకరణమేననీ, అదీ ఒక ఉద్గ్రంధమైన ప్రబంధమనీ తెలుస్తుంది. అయితే హుళక్కి భాస్కరాదులు వ్రాసి, సాహిణి సూరనకంకితమిచ్చిన భాస్కర రామాయణములోని కొన్ని ఘట్టాలు పాఠాంతరాలుగా చాలాపద్యాలు కనిపిస్తున్నాయి.ఈ పద్యాలు ఎర్రాప్రగడవే కావచ్చునని పండితుల ఊహ. అలాంటి 46 పద్యాలను ఎంతో శ్రమతో సేకరించి వేటూరి ప్రభాకరశాస్త్రి భారతి పత్రికలో "ఎర్రాప్రగడ రామాయణం" అనే శీర్షికతో ప్రకటించాడు.
ఇది కూడా ప్రోలయవేముని కోరికపై రచించి ఎర్రన ఆ రాజుకే అంకితమిచ్చాడు. ఈ రచన 1335 - 1343 మధ్యకాలంలో జరిగి ఉండవచ్చును (అమరేశ్వరాలయ శాసనం, ముట్లూరి శాసనం ఆధారంగా). ఇది ఖిలపురాణము. సంస్కృతంలో హరివంశం హరివంశ, విష్ణు, భవిష్య పర్ాలుగా విభజింపబడిఉన్నది. ఎర్రాప్రగడ మాత్రం దాన్ని పూర్వోత్తర భాగాలుగా విభజించాడు. ఈ హరివంశం ఆరంభంలో ఎర్రన తన గురువునూ, నన్నయనూ, తిక్కననూ ప్రశంసించాడు. ఈ రచనలో మూలకథ ప్రాశస్త్యం చెడకుండా దాన్ని సంగ్రహించి, అందులోని కథలను ఔచిత్యశుద్ధంగా, క్రమబద్ధంగా వ్రాయడంలో ఎర్రన ఎంతో నేర్పును కనబరచాడు.
(హరివంశాన్ని ఎర్రన సమకాలికుడైన నాచన సోమన కూడా
ఎఱ్ఱాప్రగడ కవిత్రయంలో మూడవ కవి, కాని ఆయన అనువదించినది మధ్య భాగము. నన్నయ మహాభారత అనువాదం అరణ్య పర్వం మధ్యలో ఆగిపోయింది. ఈ శేషభాగాన్ని మహాకవి తిక్కన ఏ కారణం చేతనో అనువదించలేదు. అలా మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని తెలుగు లోకి ఎఱ్ఱన అనువదించాడు. అరణ్యపర్వములోని మొదటి మూడు ఆశ్వాసాలనూ, నాలుగవ ఆశ్వాసంలో 142 పద్యాలనూ నన్నయ వ్రాశాడు. తరువాత బహుశా నన్నయ మరణం కారణంగా ఆ కార్యం అక్కడితో ఆగిపోయింది. 143వ పద్యంనుండి ఎఱ్ఱన వ్రాశాడు. ఈ రచన బహుశా ప్రోలయ వేమునికాలంలోనే, హరివంశం రచన తరువాత, జరిగినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అరణ్యపర్వ శేషాన్ని కూడా ఆంధ్రీకరించడంతో తెలుగులో మహాభారత సమగ్రతను సాధించిన గౌరవం ఎర్రనకు దక్కింది. ఎర్రనకున్న సౌజన్యమూ, వినయమూ కారణంగా ఈ అరణ్యపర్వశేషాన్ని నన్నయ రచనతో కలిపే వ్రాసి, దానిని రాజరాజనరేంద్రునికే అంకితమిచ్చాడు. "ప్రయత్నించి తత్కవితా రీతియు గొంత దోప దద్రచనయకా నారణ్యపర్వశేషం" పూరించినట్లు చెప్పుకొన్నాడు."నన్నయభట్ట మహాకవీంద్రు సరస సారస్వతాంశ ప్రశస్తి తన్ను జెందుటయే" అందుకు కారణమని కూడా ఎర్రన చెప్పుకొన్నాడు.
అరణ్యపర్వశేషం ఎర్రన వ్రాయలేదనీ, నన్నయ పూర్తిగా వ్రాసినదానిలో కొంతభాగం పాడు కాగా దానిని ఎర్రన పూరించాడనీ ఒక వాదం ఉన్నది (ఉత్సన్నవాదము - శతఘంటం వేంకటరంగశాస్త్రి). అలా కాదు నన్నయ వ్రాసినదానిలో కొన్ని పద్యాలు చెదలు తినడంవల్ల లోపించాయనీ, వాటిని ఎర్రన పూరించాడనీ మరొక వాదం ఉన్నది (శిథిల పూరణ వాదము - నడికుదుటి వీరరాజు). కాని ఈ రెండు వాదనలూ నిర్హేతుకమైనవనీ, ఎర్రన నిస్సందేహంగా అరణ్యపర్వాన్ని పూరించాడనీ పండితులు అభిప్రాయానికి వచ్చారు. పైగా శైలి, భాషావిషయకమైన ఆధారాలద్వారా కూడా ఎర్రన స్వతంత్రరచనను కవులు నిర్ణయించారు. మూలరచనను గౌరవిస్తూనే ఎర్రన స్వతంత్ర రచనను సాగించాడు. అతని రచనలలో నన్నయ కథనా గమనాన్ని, తిక్కన నాటకీయతను, ఎర్రన వర్ణనాత్మకతను గమనింపవచ్చును.
నృసింహ పురాణము (లక్ష్మీనృసింహావతార కథ) అనేది ఎఱ్ఱన స్వతంత్ర రచన. దీనిని ఎర్రన తన ఇష్టదైవమైన అహోబిలం నరసింహావతారము అంకితమిచ్చాడు. ఇది పేరుకే పురాణం గాని ప్రబంధలక్షణాలున్న కావ్యం. ఐతిహ్యం ప్రకారం ఒకరోజు ఎర్రన ధ్యానంలో మునిగి ఉండగా అతని తాత కనబడి ఈ రచనను చేయమని సలహా ఇచ్చాడు. ఇది బ్రహ్మాండపురాణంలోని కథ. విష్ణు పురాణం ఆధారంగా వ్రాయబడింది. "బ్రహ్మాండాది పురాణోక్తంబయిన శ్రీనృసింహావతారంబను పురాణంబు తెనుగు భాష బ్రకటింపవలయు" అన్నాడు. కాని అధికభాగం వర్ణనాదులు ఎర్రన స్వతంత్ర రచనలు. ఇందులో తెనుగు నుడికారపు సొగసులు, పద్యాలకూర్పు ఎంతో హృద్యంగా ఉంటాయి.
తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగు చేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంథిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.
తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగి ఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.
ఎఱ్ఱన పేరుమీద ఒక యుగం అవసరమా? ఆ కాలాన్ని తిక్కన, శ్రీనాథ యుగాలలో కలుపకూడదా? అన్న సందేహానికి పింగళి లక్ష్మీకాంతం తెలిపిన అభిప్రాయం ఇది - "తిక్కన అనంతరం, శ్రీనాథునికి ముందు ఎఱ్ఱన, నాచన సోమన, భాస్కరుడు వంటి మేటికవులవతరించారు. అంతేగాక తెలుగు సారస్వతానికి త్రిమూర్తులైన కవిత్రయం తరువాతనే ఎంతటివారైనా పేర్కొనదగినవారౌతారు. ఆ మువ్వురును ఆంధ్ర కవి ప్రపంచానికి గురుస్థానీయులు. కనుక ఆ మువ్వురిపేరు మీద మూడు యుగాలుండడం ఉచితం. అంతేగాక ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే, వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు. కనుక ఎఱ్ఱనను యుగకర్తగా సంభావించుట ఉచితం."[1]
సాహిత్య అకాడమీ ముద్రించిన అరణ్య పర్వము ముగింపులో ఆ భాగం సంపాదకులు డా. పాటిబండ్ల మాధవశర్మ ఇలా వ్రాశాడు -
తెలుగు వైతాళికులు ప్రచురణాక్రమంలో ఎర్రాప్రగడ పుస్తకాన్ని రచించిన ఆచార్య వి. రామచంద్ర తన రచన ముగింపులో ఇలా వ్రాశాడు.
హరివంశం ఉపోద్ఘాతంలో ఎర్రన చెప్పిన పద్యం
నన్నయభట్ట తిక్క కవినాథులు చూపిన త్రోవ పావనం
బెన్నఁ బరాశరాత్మజ మునీంద్రుని వాఙ్మయ మాదిదేవుఁడౌ
వెన్నుని వృత్త మీవు కడు వేడుకతో విను నాయకుండ వి
ట్లెన్నియొ సంఘటించె మదభీప్సిత సిద్ధికి రాజపుంగవా!
ఎర్రనరామాయణంలోనిదని నేలటూరు వేంకటరమణయ్య భావించిన పద్యం. హనుమంతుడు సాగరాన్ని దాటిన విధం.
చువ్వన మేను వంచి రవి సోకఁగ దోఁక విదల్చి పాదముల్
వివ్వఁగ బట్టి బాహువులు వీచి మొగంబు బిగించి కొండ జౌ
జవ్వన నూగి ముందఱికి జాగి పిఱిందికిఁదూగి వార్ధిపై
ఱివ్వన దాటె వాయుజుడు ఱెక్కలతోడి సురాద్రియోయనన్
మహాభారతం అరణ్యపర్వములో నన్నయ రచించిన చివరి పద్యము - శరత్కాలపు రాత్రులను వర్ణించునది.
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచిపూరము లంబరి పూరితంబులై
అదే వర్ణనను ఎర్రన కొనసాగిస్తూ సూర్యోదయాన్ని వర్ణించాడు. ఇది ఎర్రన భారతాంధ్రీకరణలో మొదటి పద్యం
స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
వరణములై దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల, మ
ద్దురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళఁ జూడగన్
అరణ్యపర్వములోని మరొక పద్యము. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్న మాటలు.
ద్యూత వ్యాజమునన్ సభాంగణములో దుర్యోనుండట్లు దు
ర్నీతిం గూరి యొనర్చినట్టి యఘముల్ నిష్కంప ధైర్యోన్నతిన్
జేతఃస్ఫారుఁడవైన నీ కొకనికిం జెల్లెన్ సహింపంగ వి
ఖ్యాత క్షాంతులు లేరె ధార్మికులు నిక్కంబిట్టిరే యెవ్వరున్
నృసింహపురాణము పీఠికలో నన్నయ తిక్కలను గురించీ, తన యభీష్టసిద్ధి గురించీ ఎర్రన ఇలా అన్నాడు.
భాసుర భారతార్థముల భంగులు నిక్క మెఱుంగ నేరమిన్
గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెనుంగు వారికిన్
వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లఁగఁజేసినట్టి య
బ్జాసన కల్పులం దలతు నాద్యుల నన్నయ తిక్కనార్యులన్
విష్ణుభక్తులకు కలిగే మేలు గురించి నృసింహపురాణంలో వర్ణన
పొందవు దుఃఖముల్ భయము పొందరు పొందరు దైన్యమెమ్మెయిన్
బొందవు తీవ్రదుర్దశలు పొందుఁ బ్రియంబులు పొందు సంపదల్
పొందు సమగ్ర సౌఖ్యములు పొందు సమున్నత కీర్తులెందు గో
వింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ట చిత్తులన్
నన్నయను గూర్చి పొగుడుతూ ఎర్రన చెప్పిన పద్యం:
ఉన్నతగోత్ర సంభవము నూర్జిత సత్త్వము భద్రజాతి సం
పన్నము నుద్ధతాన్యపరిభావిమదోత్కటము న్నరేంద్ర పూ
జోన్నయనోచితంబునయి యెప్పుడు నన్నయ భట్ట కుంజరం
బెన్న నిరంకుశోక్తి గతి నెందును గ్రాలుటఁ బ్రస్తుతించెదన్
బాలకృష్ణ లీలా వర్ణన (హరివంశంలో)
నోరం జేతులు రెండు గ్రుక్కుకొనుచున్, మోమెల్ల బాష్పాంజన
స్మేరంబై తిలకింపనేడ్చుచు, బొరిన్ మీజేతులం గన్నులిం
పారం దోముచు, జేవబూని పిరుదొయ్యన్ మీద కల్లార్చుచున్
శ్రీరమ్యాంఘ్రియుగంబు గింజికొనుచుం జెల్వంబు రెట్టింపగా
శ్రీ కృష్ణుని శైశవోత్సవ వర్ణన (హరివంశంలో)
పాలుపారగా బోరగిలి పాన్పు నాల్గుమూలలకును వచ్చుచు మెలగి మెలగి
లలి గపోలమ్ములు గిలిగింతలువుచ్చి నవ్వింప గలకల నవ్వినవ్వి
ముద్దులు దొలుకాడ మోకాల గేలను దడుపుచు నెందును దారితారి
నిలుచుండబెట్టి యంగుళు లూతసూపగా బ్రీతితప్పడుగులు వెట్టిపెట్టి
అన్నగంటి దండ్రినిగట్టి నయ్యగంటి
నిందురావయ్య విందుల విందవంచు
నర్ధిదను బిలువంగ నడయాడియాడి
యుల్లసిల్లె గృష్ణుడు శైశవోత్సవముల
వెన్నెవెట్టెద మాడుమాయన్న యన్న
మువ్వలును మొలగంటలు మొరయు నాడు
నచ్యుతుండు, గోపికలు దమయాత్మ బ్రమసి
పెరువు దరువను మరచి సంప్రీతిజూప
మందలు మేపుకు వచ్చిన నందగోపుని వర్ణన (హరివంశం)
పరిమిత పలితైక భాసురంబగు కేశసంచయ మారణ్య సంచరమునఁ
దరువులరాయి కేసరముల నత్యంతదూసరంబై కడు మాసరమున
గోఖురోద్ధుతరేతు కుంఠితంబగు మోము చెమటబొట్టులఁజాలఁ జెన్నుమిగులఁ
గట్టిన చెంగావికాసె వేఁజిగురులజిగినూని తను పతిస్నిగ్ధకాంతి
నలరఁ గర్కశగ్రంథిలయష్టి చేతఁ బట్టి గోపాలపరివార బహువిధోక్తు
లెలసి చెలఁగంగఁ గదువుల వలననుండి వచ్చే నందగోపుఁడు నిజా వాసమునకు
ఆలమందల బృందావన వలస (హరివంశం)
బండ్లమెట్టింపుపై బరువులెక్కింపుమీ దళ్లుసుబూన్పు, కావళ్లనునుపు
పదిలంబుగా నేటివనటులు, కొత్తగోనెల బిములు పట్టు నివరివడ్లు
నోడబెరుగపాలు నొనరంగబోసి చాపలుమంచములుమీద బలియంగప్పు
దామెనలును వల్లె త్రాళ్లును దలుగులు గవ్వము ల్గొడవలి కత్తిసూడు
గొడుపువాదోళ్లు మొదలుగా జెడకయుండ
వలయు ముట్లెల్లదెమ్ము గందలపుటెడ్ల
గంపమోపులు ముందరగదలు మనుము.
హరివంశం నుండి గద్యం - మహాఘోష వర్ణన
పుష్పిత ఫలితానేక తురుషండ మండితంబు కాళిందీ తటంబున నలుదెసలం బొడవుగా నమర్చిన బలితంపుములు వెలుంగు లంగరము. జతనంబులై యొప్పు పెనుదొడ్లం గ్రమంబునం బ్రంఓదంబున వేఁకువం బోకు మేసివచ్చి రోమంధన వదనంబుల విహిత శయనలై సుఖియించు కదుపులలోన బేరు పేరంబిలువం బంచతిల్లుచు సుల్లసిత హుంకా రంబులగు వదనంబులతో నున్ముఖలగు తల్లులకు నఖిముఖంబులై హర్ష ప్రతినినందంబులు వొదలం బొదులనుండి యొండొంటిం దాటుకొని కలయు బాలవత్సంబుల యుత్సప సంచారంబులవల్ల, పెదయావుల వెనుకందగిలి యొండొంటిం జేరనీక బలియు రంకెలం బొదివి కాల ద్రవ్వి క్రోడాడుచు బొగరుమిగుల కరకెక్కిన మెడలును, పలుద మూపురంబులును, వెడద వీపులును, దోరంబు గంగడోళ్లునునై క్రాలు వృషంభుల దర్ప వికారంబు వలనను, మొదలనోరి సురువులుం, బెయ్యల రేణంబులుం, బాలకుండల మసులునుందమ యుడళులకు నెడపడనితొడవులుగా బిదికి యురుద్రాళ్లుం, దలుగులు తలమొల లంజుట్టి యిట్టునట్టులుం గలయంబాఱి క్రేపుల నేర్పరించు వారును, పల్లియలువైచి కోడెలంబట్టిపెనంచి కారూళ్ల జట్టికారులకు వశంబు సేయు బరవసం బెసంగ గ్రుమ్మరువారును, జూడుగొడపులుసు వాదోళ్లు ముకుబంతులు మొదలుగాగల సాధనంబులు గొనివచ్చి తెవులు గొంటులం జికిత్సించువారును, గ్రేపులంగొనని యావులందొ లంగం గట్టి పిళ్లువెట్టియు, మందులు సల్లియుల్లం, జాల దు:ఖపడి చేపెరింగించు వారును................"
Seamless Wikipedia browsing. On steroids.