గౌతమీపుత్ర శాతకర్ణి (లేక శాలివాహనుడు) (సా. శకం. 78-102) లేదా సా.శకం 113 నుండి 139 వరకుశాతవాహన రాజులలో 23వ వాడు. అతని తండ్రి తరువాత శాతకర్ణి రాజయ్యెను.
శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించెను. అతని తరువాత శాలివాహనుడు రాజయ్యెను. అప్పటికి రాజ్యమైతే విస్తరించబడ్డది కానీ శత్రుదేశాలనుండి ప్రత్యేకంగా శకులు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉండినది. శాలివాహనుడు శకులను, యవనులను, పహ్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. . భారతీయ పంచాంగం (కాలండరు) శాలివాహనుని పేరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది. ఈయన నహపాణున్ని ఓడించి పెద్ద మొత్తములో లభ్యమవుతున్న జోగళ్‌తంబి నాణకశాల వర్గానికి చెందిన క్షహరత నాణేలపై తిరిగి ముద్రింపజేశాడు.
నాసిక్ ప్రశస్తి గౌతమీపుత్ర శాతకర్ణిని అప్రాంత, అనూప, సౌరాష్ట్ర, కుకుర, అకార, అవంతి ప్రాంతాల పాలకునిగా పేర్కొన్నది. ఈ ప్రాంతాలను ఈయన నహపాణుని నుండి హస్తగతం చేసుకొని ఉండవచ్చు. ఈయన తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కను ప్రాంతాలు కూడా తిరిగి సంపాదించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి కాలములో శాతవాహన ప్రాబల్యం దక్షిణాన కంచి వరకు వ్యాపించింది. ఈయన ఆనంద గోత్రీయుల నుండి దక్షిణ మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతాలను జయించినాడని ప్రతీతి. శాలివాహనుడు బనవాసి ప్రాంతాన్ని తన రాజ్యములో కలుపుకొని కర్ణాటకలోని కొంతభాగముపై అధికారము సాధించాడు. ఈయన తరువాత సా.శ.130 ప్రాంతములో ఈయన కుమారుడు వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి రాజ్యం చేపట్టాడు.
గౌతమీపుత్ర శాతకర్ణి, శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికాడు. మరాఠులు, ఆంధ్రులు, కన్నడిగులు నేటికీ శాలివాహన శకాన్ని పంచాంగాలలో ఉపయోగిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి ధరించిన బిరుదులు
- త్రిసముద్రపిత్తోయవాహన (తన అశ్వములు మూడు సముద్రాలలో నీరు తాగినవాడు)
- శకయవనపల్లవనిదూషణ (శక, యవన, పల్లవుల నాశకుడు)
వ్యక్తిత్వం
గౌతమీపుత్రుని వ్యక్తిత్వం చాలా విశిష్టమైంది. ఈయన మూర్తి ఉన్న నాణేలనుబట్టి ఈయన దృఢకాయుడని, స్ఫురద్రూపియని తెలుస్తున్నది. పరవార విక్రముడు, శత్రుభయంకరుడు, సమర శిరసివిజిత రిపుసంఘాతకుడు, ఉదార పాలకుడు, పౌరజన సుఖదు:ఖాలలో భాగస్వామి, వైదికవిద్యాతత్పరుడు, ఆగమనిలయుడు, వర్ణసాంకర్యాన్ని ఆపినవాడు, విద్వద్బ్రాహ్మణ కుటుంబాలను పోషించినవాడు, పరమధార్మికుడు, ధర్మార్థకామ పురుషార్థాలపట్ల శ్రద్ధ వహించినవాడు, ఏకబ్రాహ్మణుడని కీర్తిపొందినాడని ఆయన తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి వల్ల తెలుస్తున్నది. గౌతమీపుత్ర శాతకర్ణి రాజకీయ కారణాల వల్ల పరమత సహిష్ణుత ప్రదర్శించి బౌద్ధులకు సైతం ధానధర్మాలు చేసాడు.
గౌతమీ పుత్రుని బిరుదులు: వినివర్తిత ఛాతుర్వర్ణ సన్కర ఆగమనిలయ త్రిసముద్రతోయపీతవాహన సర్వమండల వాదిత
నహపాణుని జయించుట
గౌతమీపుత్రుడు పరాక్రమశాలి:మొక్కవోని స్వదేశాభిమాని.ఇతడు శ్రీ కృష్ణదేవ రాయలు లవలె దిగ్విజయయాత్ర సల్పి తనపూర్వులిదివరలో కోల్పోయిన పశ్చిమాంధ్ర రాష్త్రమును జయించి ప్రతిష్థాననగరంన తన కుమారుడును యువరాజును అయిన శ్రీపులోమావిని తనకు ప్రతినిధిగా నియమించెను. ఈతనివిజయధాటికి వెరచి యవనశకపహ్లావు లితనితో సంధికావించుకొని ఇతనికి దోసిలియొగ్గెను.శాతవాహవమ్శమునకు ప్రత్యర్థిగానుండిన ఖగరాట నహపాణుని సంపూర్ణముగా పరాజయము చేయదలచి, ఆతడు తన సైన్యముతో ధాన్యకటకము నుండి బయలుదేరి ప్రతిష్ఠానమునుండి బయలుదేరి పులమాయిని తొడగొని సౌరాష్ట్ర దేశముపై దండెత్తి సహపాణుని చంపి ఖగరాట వంశమును నిర్మూలించెను. అటుపై ఆ ప్రాంతమునకు చస్తనుడుని రాజప్రతినిధిగా నియమించెను.
చస్తనుడు శకవంశుడగు క్షాత్రపుత్రుడు. ఈతడు మాళవదేశములోని ఉజ్జయిని రాజధానిగా రాజ్యమేలాడు. ఉజ్జయిని గౌతమీపుత్రుడు రాజ్యములోనిదేయని గౌతమిబాలశ్రీ శాసనము తెల్పుచున్నది.చస్తనుడు గౌతమీపుత్రునకు సామంతుడు.
ఇతర రాజులతో మైత్రి
ఈకాలమున వంజీపురము రాజధానిగా చేరదేశమును పాలించుచుండిన చెంకుదువానునకును, సింహళద్వీపరాజగు గజబాహునకును, గౌతమీపుత్రుడుకును మిక్కిలి మైత్రియుండెను.ద్రమిళరాజైన చెంకుడువానునకును ఆర్యరాజులైన విజయసేన, కనకసేనులకును జరిగిన జాతియుద్ధములో గౌతమీపుత్రుడు పూర్వపుమైత్రినులపక్షమున చేరరాజు పక్షమునచేరి జయమొందెను. ఇల్లింకొ అడికాల్ అను ద్రమిళకవి విరచితమైన శిలప్పదికారము ఈవిషయము తెలుపుచున్నది.
సామ్రాజ్య విస్తీర్ణము
గౌతమీపుత్ర శాతకర్ణి కాలమున ఆంధ్రసామ్రాజ్యము మిక్కిలి విస్తృతమైనది. అసిక, అస్మిక, మూలక, సురాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అకరావంతిదేశము లీతనిరాజ్యములోనివని నాసిక్ శాసనము చెబుతున్నవి. ప్రస్తుతము రాజ్పుత్రస్థానము లోని బీకనీరు సంస్థాన ప్రాంతదేశమే పూర్వము అసికదేశము.అస్మిక దక్షిణాపధములోనివని పురాణములు తెలుపుచున్నవి.సురాష్ట్రము గుజరాతులోనిది.కుకురదేశము రాజపుత్రస్థానములోఒక భాగము. పశ్చిమకొనలుకను అరేబియా సముద్రమునకును మధ్యనున్న భాగమే ఉత్తరకొంకణ దేశమే అపరాంతము.వింధ్యకు సమీపమున నర్మదకు ఎగువును మహిష్మతీ లెదా మాహీష్మతీ నగరం రాజధానిగా గలదేశమే అనూపదేశము.బీహారు విదర్భదేశము. ఈతడు మగధరాజ్యమును ఏలినాడని శిలప్పదికారము తెలుపుచున్నది.దీనిని బట్టి గౌతమీపుత్రుడు ఆంధ్రసామ్రాజ్యము ఉత్తరమును ఆరావళీ పర్వత శ్రేణులును గంగాతీరమును మొదలుకొని దక్షిణమున కొల్హాపూరు కాంచీపురముల వరకు వ్యాపించెను.
రాజనీతి
గౌతమీపుత్రుడు రాజనీతికోవిదుడు.విదేశీయులైన శక యవన రాజులు దండెత్తివచ్చినప్పుడు అదివరకేవచ్చి స్వదేశస్థులలో కలిసిపోయిన విదేశీయులు రాజద్రోహము తలచి స్వాతంత్ర్యయము ప్రకటించి రాజ్యవిఛ్చిక్తిని రాజ్యవిప్లవమునకు అడగంటుటకై ఆతడు వారిపై శాస్త్రీయముగా విధించిన పన్నులను కూడా తీసివేసెను.
రాజ ప్రతినిధులు
ఇంతతి వైశాల్యముగల మహాసామ్రాజ్యమును ధాన్యకటకమునుండి తానొక్కడే పరిపాలించుటకష్టముగా నుండునని రాజ్యాంగవేత్తయగు గౌతమీపుత్రుడు తనరాజ్యములోని ముఖ్యమైన స్థలములందు రాజప్రతినిధులను నియమించెను. ఇట్టి రాజప్రతినిధులలో శ్రీపులమాయి (కుమారుడు), చస్తనుడు, విలివాయకురుడను వారిపేర్లు తెలుస్తున్నవి. ఇందు శ్రీపులమాయి ప్రతిష్ఠానపురమును రాజధానిగా మహారాష్ట్రమును తండ్రిపేరపాలించెను. చస్తనుడు ఉజ్జయిని, కొల్హాపూరు రాజధానిగా దక్షిణదేశమున బోలియోకురోసు అని టొలిమి పేర్కొనిన విలివాయకురుడను ప్రతినిధి రాజ్యమేలెను. గౌతమీపుత్ర గోవర్ధనములో సైన్యాధికారిగానున్న విష్ణుపాలితుడను వానిపేరుకూడా ఒక శాసనమునందు ఉంది.
ప్రస్తుతము తెలంగాణలో వున్న కరీంనగర్ జిల్లాలో వున్న కోటి లింగాల శాతకర్ణి రాజ్యానికి ముఖ్హ ద్వారంగా ఉంది. కశ్మీర్ లో శాత కర్ణి తల్లి అప్పట్లో శాసనం చేయించారు. మహారాస్ట్రలో ప్రముఖుడైన శివాజీకి ఆతని తల్లి శాతకర్ణి చరిత్రను చెప్పేవారు.
వెనుకటి: శివస్వాతి. |
శాతవాహన వంశపు రాజులు (సా.శ.78-102) |
వారసుడు: వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి |
పాదపీఠిక
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.