చీర
From Wikipedia, the free encyclopedia
చీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది. భారతదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైనది చీర.[1] చీర అత్యంత పొడవైన వస్త్రము; ఇది నాలుగు నుండి తొమ్మిది మీటర్లుంటుంది. చీరను ఎక్కువమంది నడుంచుట్టు కట్టుకొని ఒక చివర భుజం మీదనుండి వెనుకకు వేసుకుంటారు.[1] చీరలోపల క్రిందభాగంలో లంగాను పైభాగంలో రవికె ధరించడం సరైన పద్ధతి.

చరిత్ర



చరిత్రకు పూర్వం సింధూ లోయ ప్రాంతపు స్త్రీలు ప్రత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. ప్రత్తి, పట్టుబట్టల గురించి వేదాలలోను, రామాయణ, మహాభారత కథలలోనూ కూడా చెప్పబడింది. చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాల గురించి "బంగారు జరీతో విలువైన రాళ్ళు పొదగబడినవి" అని వ్రాశాడు. ప్రాచీన కాలపు చిత్రాలలోను, రాతి విగ్రహాలలోను పలచని చీర మడతలు సూచించబడ్డాయి. అజంతా గుహల కుడ్య చిత్రాలలో ప్రాచీన భారతదేశపు నేతగాళ్ళ ప్రతిభ ప్రదర్శింపబడుతూంది. సమకాలీన వాంగ్మయంలో వివరించబడిన చీర్ల పేర్లను పరిశీలిస్తే ఆనాటి హస్తకళా నైపుణ్యం విదితమవుతుంది. ఆకాశంలో దట్టమైన మేఘాలులాగ ఉండే వాటికి మేఘాంబర్ అని, హంస పాదాల చీరకి హంసపాదుక అని పేరుపెట్టారు. మధ్య యుగంలో చీరలకు మంచి ప్రసిద్ధి ఏర్పడింది. ఆనాడు ఆస్మాన్‌తారా (ఆకాశాన నక్షత్రాలు) అనే చీరలు వ్యాప్తిలో ఉండేవి. నీలాంబరి (నీలాకాశం), దూప్‌చాన్ (సూర్యకాంతి నీడ) మరికొన్ని ప్రాచీన చీరల రకాలు.
బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకా మస్లిన్ బుటిదార్ చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. విదేశాలలో కూడా విస్తారంగా వాడేవారు. ఢాకా మస్లిన్ చీరలు మిక్కిలి నాజూకుగాను, సున్నితంగానూ ఉండేవి. వీటిని పచ్చని గడ్డి మీద పరచినప్పుడు పొద్దుటి మంచుతో కప్పబడి కంటికి కూడా కనిపించనంతటి సున్నితంగా, పలచగా ఉండేవి. అందుచేత ఈ చీరలకు సబ్నం (పొద్దుటి మంచు) అనే పేరు వచ్చింది. ఈ సబ్నం చీరలు మొఘల్ అంతపురాలలో కూడా ప్రవేశించాయి. ఔరంగజేబు ఒకనాడు తన కుమార్తె జెబున్నీసా చీరను చూసి ఆ చీర సభ్యత కాదని, గౌరవానికి లోపం అని మందలించాడు. రాకుమార్తె తాను ఎనిమిది మడతలుండే కట్టుకున్నానని చెప్పింది. 19వ శతాబ్దపు విక్టోరియా మహారాణి కాలంలో కూడా సంప్రదాయక ఢాకా మస్లిన్ చీరలు అనేక రకాలు ఉండేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో పెద్ద పెద్ద మెషీనులు, కావలసిన సాధన సంపతు కలిగిన బ్రిటిషు వారు అతి సున్నితమైన ఢాకా చీరల వంటి చీరలను తయారు చేయలేకపోయేవారు. 15 గజాల పొడవు, 1 గజం వెడల్పు గల ఢాకా మస్లిన్ చీర కేవలం 900 గ్రెయినులు తూగేవి.
ఇటువంటి సున్నితమైన నూలు విలువ ఒక ఔన్సు, 3 పౌండ్ల, 3 షిలింగులు ఉండేది. వారణాశికి చెందిన బెనారస్ జరీ చీరలకు, తమిళనాడు మధుర చీరలకు, పశ్చిమ బెంగాలు లోని ముర్షిదాబాద్ చీరలకు కూడా ఎంతో ప్రసిద్ధి ఉంది. బెనారస్ చీరలు బంగారు, వెండి జరీలతో నేయబడతాయి. అనేక తరాలపాటు మన్నుతాయి. ఇవి చిరిగి పోయినా వాటికి జరీ విలువ ఉంటుంది. ఇదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు చీరలు, వెంకటగిరి చీరలు, ధర్మవరం చీరలు ఎంతో ప్రసిద్ధిపొందాయి. నేత రకాన్నిబట్టి, రంగును బట్టి వీటిని ప్రత్యేక ఉత్సవాలలోను, పండుగలలోను కట్టుకుంటారు. అంతేగాక కాలానుగుణ్యంగా కూడా చీరలు ఉంటాయి. వసంత కాలంలో పసుపు వర్ణపు చీర, వేసవి కాలంలో తెల్లని చీరలు వాడతారు. మధ్యాహ్నమైనప్పుడు, ఉత్సవాలప్పుడు అందంగా నేయబడిన ముదురు రంగు చీరలు ధరిస్తారు.
ఈనాడు లండన్, న్యూయార్క్ నగరాలలో సైతం విలువైన పెద్ద పెద్ద చీరలు కనిపిస్తాయి. బట్టల్లో చీర చాలా అందమైనదని పాశ్చాత్యులు గ్రహించారు. అంతేకాదు, లండన్, న్యూయార్క్‌లో గల భార స్త్రీలు చీరను కట్టే విధానంలో కూడా ఒక విధమైన సౌకుమార్యం, అందం ఉందని వారి అభిప్రాయం. లండన్, న్యూయార్క్ నగరాలలో డిజైనర్లకు భారతదేశపు చీర స్ఫూర్తిని కలిగించింది. సాయంత్రం పూట అక్కడ ధరించే గౌనులకు కూడా చీర డిజైన్లు వారు ప్రవేశపెట్టారు. భారతదేశపు ప్రాచీన కాలపు చీరల డిజైన్లు సరికొత్త ఫేషన్లకు మార్గదర్శకంగా నిలిచాయి. భారత స్త్రీకి ఈ చీర కట్టుడు విధానం వల్ల ప్రపంచ దేశాల్లో ఎనలేని గౌరవ మర్యాదలు సముపార్జించుకుంది. చీరలోని నిండుతనం కొత్త అందాలను సమకూర్చుతూ పరిపూర్ణ మహిళగా భారత స్త్రీ నిలిచింది.[2]
చీరకట్టు
చీరకట్టు మనదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరకంగా ఉంటుంది.
- భారతదేశంలో ఎక్కువమంది చీరను ఒకసారి నడుంచుట్టూ తిప్పి, కొన్ని మడతలు పెట్టి, మళ్ళీ సగం నడుంచుట్టూ తిప్పి రెండవ చివర పమిటచెంగు ఎడమ భుజం మీదనుండి వెనుకకు వదిలేస్తారు.
- గుజరాత్ రాష్ట్రంలో పమిటచెంగు కుడి భుజం మీదనుండి వేసుకుంటారు.
చీరలలో రకాలు
చీరలు తయారుచేసిన దారం ఆధారంగా పట్టుచీరలు, నూలుచీరలు, నైలాన్ చీరలు అని వివిధరకాలుగా పేర్కొనవచ్చును. నూలుచీరలు ఎక్కువగా వేసవికాలంలో ధరించడానికి ఇష్టపడతారు. పట్టుచీరలు ముఖ్యంగా వివాహాలకు, విందులకు, దేవాలయాలకు పోయినప్పుడు ఎక్కువగా ధరిస్తారు. కంచి, ధర్మవరం, పోచంపల్లి, మైసూర్ మొదలైనవి పట్టుచీరలకు ప్రసిద్ధి. పొడవు ఆదారంగా ఆరు గజాల చీర, ఏడు గజాల చీర, తొమ్మిది గజాల చీర అని రకాలు ఉండేవి. ఆ చీరల పొడవులు సుమారు 6, 7, 9 గజాలు. ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా 5 మీ. పొడవు వాడుతున్నారు. వెడల్పు సుమారు 1.2 మీ. నుండి 1.5 మీ. ఉంటుంది.
సాహిత్యంలో చీర

భారతీయుల దుస్తులలో దాదాపు ప్రామాణికమైన చీర సాహిత్యంలో, ముఖ్యంగా జానపద సాహిత్యంలో, పలు సందర్భాలలో ప్రస్తావించబడింది.
- తెలుగు సినిమా పాటలలలో చీర
- చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా - తూర్పు వెళ్ళే రైలు.
- కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి - సితార - (అసలు ఇది విశ్వనాధ సత్యనారాయణ రచించిన కిన్నెరసాని పాటలు లోని చరణం.)
- చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియ్య, అందమంతా చీరలోనే ఉన్నది - బంగారు బాబు
- వళ్ళంత వయ్యారి కోకా, కళ్ళకు కాటుక రేకా ... - అమెరికా అమ్మాయి
- జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గొచ్చింది..
- పట్టుచీర తెస్తననీ పడవేసుకెళ్ళిండే మామా.. - స్వాతిముత్యం
- మొరటోడు నా మొగుడు మోజుపడీ తెచ్చాడు. మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకూ.. - సెక్రటరీ
- సరికొత్త చీరు ఊహించినాను - పెళ్ళి పుస్తకం
వివిధ రకాల చీరలు

వివిధ రకాల చీరలు వాటిని తయారు చేయు ప్రాంతాలు
- చండేరి, మహేశ్వరి, - మధ్య ప్రదేశ్
- కోసా సిల్క్ - ఛత్తీస్ ఘర్
- సంబల్ పూర్ నూలు, పట్టు, ఇక్కత్ నూలు, పట్టు, ఖాండువా నూలు, పట్టు, బొంకై/సోనెపురి నూలు, పట్టు, బెర్హంపురి పట్టు, మత్త పట్టు, బాప్టా నూలు, పట్టు, టాంటా నూలు - ఒడిషా
- తుస్సార్ - బీహార్
- షాలు, తంచోయ్ - ఉత్తర్ ప్రదేశ్
- మూగ - అస్సాం
- ముర్షీదాబాద్, బాలుచారి, కంత నూలు, పట్టు, టంట్ నూలు, ధనియాఖలి నూలు, - పశ్చిమ బెంగాల్
- బనారస్ - వారణాసి
- కంచి, ఆరణి, చిన్నల పట్టు, కుంబకోణం, తిరుబువనం, తంజావూరు, మదురై, కోయంబత్తూరు నూలు, కండంగి సీలై, సుంగుడి సీలై, చెట్టినాడు నూలు - తమిళనాడు
- ముండుం నేరియతుం, బలరాంపురం - కేరళ
- ధర్మవరం పట్టు, వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి, గుంటూరు, నారాయణ్ పేట్, మంగళగిరి, పుట్టపాక - ఆంధ్ర ప్రదేశ్
- మైసూరు పట్టు, బెళగాం పట్టు, బెళగాం, మొలకల్మూరు - కర్ణాటక
- లుగాడె, పథాని - మహారాష్ట్ర
- బంధని - గుజరాత్, రాజస్థాన్
- కోటా డోరియా - రాజస్థాన్
- పటోలా - గుజరాత్
- ఇల్కాల్ చీర - కర్ణాటక రాష్ట్రములోని బాగల్ కోట జిల్లాకు చెందిన ఇల్కాల్లో తయారవుతున్న ప్రసిద్ధ చీరలు.
వివిధ రకాల చీరల చిత్రమాలిక
- 230 BCE లో చీరలో నున్న శాతవాహన స్త్రీ
- CE 320 లో ఛోళీ, అంతరీయము ధరించిన గుప్త వంశీక స్త్రీలు
- c.1375 చెందిన కల్ప సూత్రము.
- గుజరాతీ చీర కట్టులో బాలిక
- తమిళ చీర కట్టులో స్త్రీ
- కుచ్చిళ్ళు లేని బెంగాలీ చీర కట్టులో బాలిక
- సింహళ చీర కట్టు సూచించే చిత్ర పటము
- సింహళ శైలిలో చీరని ధరించిన స్త్రీ
- 1895 లో పోచంపల్లి చీరని ధరించిన బాలిక
- నౌవారీ చీరకట్టు (మహరాష్ట్ర)
- మైసూరు చీరకట్టు
- పొడవాటి కుచ్చిళ్ళు గల మైసూరు చీరకట్టు
- 1912 లో చీరలు ధరించిన స్త్రీలు
- నౌవారీ చీరకట్టులో బాలిక.
- తమిళ నృత్యకారులు ధరించే చీరలు
- చీరతో బాటు వడ్డాణం కూడా ధరించిన తమిళ స్త్రీ
- మైసూరు చీర కట్టులో స్త్రీ
- కేరళ చీర కట్టులో నర్తకి
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.