Remove ads
From Wikipedia, the free encyclopedia
క్రికెట్‌లో, అంపైర్ క్రికెట్ చట్టాల ప్రకారం క్రికెట్ మైదానంలో జరిగే సంఘటనల గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న వ్యక్తి. డెలివరీ చట్టబద్ధత, వికెట్ల కోసం అప్పీల్‌లు, చట్టపరమైన పద్ధతిలో ఉండే ప్రవర్తన మొదలైనవాటి గురించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, వేసిన బంతుల సంఖ్యను కూడా లెక్కిస్తూ, ఓవర్ పూర్తయినట్లు ప్రకటిస్తాడు. పాత ఫ్రెంచిలో నోంపేర్ అంటే తోటివాడు కాదు అని అర్థం అంటే జట్లలో ఒకదానిలో సభ్యుడు కాదు అని, తటస్థుడు అని అర్థం.
క్రికెట్ అంపైర్ సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రమే అధ్యక్షత వహిస్తాడు. ఆట ఫలితాన్ని ప్రభావితం చేసే ఎటువంటి నిర్ణయాలు రిఫరీ తీసుకోడు.
సాంప్రదాయకంగా, క్రికెట్ మ్యాచ్‌లకు ఇద్దరు అంపైర్లుంటారు. ఒకరు బౌలర్ బంతిని వేసే చోట (బంతిని వదిలే చోట), మరొకరు నేరుగా బంతిని ఎదుర్కొంటున్న బ్యాటరు వద్ద, సాధారణంగా, స్క్వేర్ లెగ్ స్థానం వద్ద ఉంటారు. అయితే, ఆధునిక ఆటలో, ఇద్దరు కంటే ఎక్కువ మంది అంపైర్లు ఉండవచ్చు; ఉదాహరణకు టెస్టు మ్యాచ్‌లలో నలుగురు ఉంటారు: ఇద్దరు ఆన్-ఫీల్డ్ అంపైర్లు, వీడియో రీప్లేలను యాక్సెస్ చేసే థర్డ్ అంపైరు, మ్యాచ్ బంతులను చూస్తూ, ఆన్-ఫీల్డ్ అంపైరుల కోసం డ్రింక్స్ తీసుకు వెళ్ళే ఫోర్త్ అంపైరు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) లో అంపైర్ల ప్యానెల్‌లు మూడు ఉన్నాయి. అవి: ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్, పెద్ద అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్, ఐసిసి అంపైర్ల అభివృద్ధి ప్యానెల్. చాలా టెస్టు మ్యాచ్‌లలో ఎలైట్ ప్యానెల్‌లోని తటస్థ సభ్యులను నియమిస్తారు. అంతర్జాతీయ ప్యానెల్‌లోని స్థానిక సభ్యులు సాధారణంగా మూడవ లేదా నాల్గవ అంపైరు పాత్రలను నిర్వహిస్తారు. అంతర్జాతీయ ప్యానెల్ సభ్యులు అప్పుడప్పుడు టెస్టుల్లో తటస్థ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. మూడు ప్యానెల్‌ల సభ్యులూ వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌లలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారు. [1] [2]
ప్రొఫెషనల్ మ్యాచ్‌లకు మ్యాచ్ రిఫరీ కూడా ఉంటారు. అతను అంపైర్లు చెయ్యని ఇతర పనులు చేస్తారు. మ్యాచ్ రిఫరీ ఆట ఫలితానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకోడు, ఐసిసి క్రికెట్ ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తాడు. ఆటను సరైన పద్ధతిలో ఆడుతున్నారో లేదో నిర్ధారిస్తారు. టెస్టు మ్యాచ్‌లు, వన్‌డేలను పర్యవేక్షించడానికి ఐసిసి, దాని ఎలైట్ ప్యానెల్ ఆఫ్ రిఫరీల నుండి మ్యాచ్ రిఫరీని నియమిస్తుంది.
చిన్న క్రికెట్ మ్యాచ్‌ల నియంత్రణ కోసం తరచుగా శిక్షణ పొందిన అంపైర్లు ఉంటారు. 1955లో ఏర్పడిన స్వతంత్ర క్రికెట్ అంపైర్లు స్కోరర్ల అసోసియేషను (ACU&S), UKలో అంపైరు శిక్షణను నిర్వహించేది. అయితే ఇది 2008 జనవరి 1 న ECB అసోసియేషన్ ఆఫ్ క్రికెట్ ఆఫీసర్స్ (ECB ACO)గా ఏర్పడింది. క్రికెట్ అంపైరింగు, స్కోరింగు అర్హతల కొత్త నిర్మాణం ఇప్పుడు అమలులోకి వచ్చింది. ACO వీరికి శిక్షణను, పరీక్షలను నిర్వహిస్తుంది. [3] క్రికెట్ ఆస్ట్రేలియా రెండంచెల అక్రిడిటేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చివరికి అంపైర్లందరూ తగిన స్థాయి అక్రిడిటేషన్‌ను సాధించాల్సి ఉంటుంది. అంపైర్లలో కొంతమంది మాజీ ఆటగాళ్ళు కాగా, మరికొందరు క్రికెట్ ప్రపంచంలోకి నేరుగా అంపైర్లుగానే ప్రవేశించినందున అంపైర్ల వయస్సులో చాలా తేడా ఉంటుంది.
క్రికెట్ సంప్రదాయానికి అనుగుణంగా, చాలా సాధారణమైన, స్థానిక ఆటలకు ఇద్దరు అంపైర్లు ఉంటారు. చెరో వైపు నుండి ఒక అంపైరుంటారు. వారు క్రికెట్ నిబంధనలను న్యాయంగా అమలు చేస్తారు.
బంతి వేసినప్పుడు, అంపైరు (బౌలర్ వైపున ఉండే అంపైరు) నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో స్టంప్‌ల వెనుక నిలబడతాడు. ఇక్కడి నుండి వారికి పిచ్ అంతా స్పష్టంగా కనిపిస్తుంది.
రెండవ అంపైరు (స్ట్రైకర్ ఎండ్ వైపు ఉండే అంపైరు) ఆట ఎక్కడి నుండి బాగా కనిపిస్తుందో అక్కడ నిలుచుంటారు. సాధారణంగా, స్క్వేర్ లెగ్ స్థానంలో నిలుచోవడం ఆనవాయితీ. పాపింగ్ క్రీజ్ ఉండే రేఖను పొడిగించిన వరుసలో బ్యాటరుకు లెగ్ సైడ్‌లో కొన్ని గజాల దూరంలో ఉంటుంది. అందుకే వారిని స్క్వేర్ లెగ్ అంపైరు అని కూడా అంటారు.
అయితే, ఫీల్డర్ స్క్వేర్ లెగ్ వద్ద గానీ, తనకు అడ్డుగా మరెక్కడైనా గానీ నిలబడితే లేదా బ్యాటరు గాయపడి రన్నరుతో ఆడుతూణ్టే ఉంటే, అంపైరు మరొక స్థానాన్ని చూసుకోవాలి. స్క్వేర్-లెగ్ అంపైరు పాయింట్ వద్ద నిలబడాలనుకుంటే, ఆ సంగతిని వారు బ్యాటరుకు, ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌కు, తోటి అంపైరుకూ తెలియజేయాలి. పొద్దు కుంకేటపుడు ఎండా కళ్ళలో పడి, బ్యాటింగ్యు క్రీజు సరిగా కనిపించకపోయినపుడు కూడా, స్క్వేర్-లెగ్ అంపైరు పాయింట్ స్థానానికి మారవలసి రావచ్చు.
బంతికీ, ఆటగాళ్ళకూ దూరంగా ఉండడం అంపైర్లపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి, బంతిని కొట్టి, ఆటగాళ్ళు పరుగు తీసేటపుడు, ఫీల్డింగ్ వైపు ఆ చివరన రన్ అవుట్ చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో స్టంప్‌ల వెనుక ఉన్న అంపైరు సాధారణంగా పక్కకు జరుగుతారు.
ఆట సమయంలో, బౌలర్ చివరలో ఉన్న అంపైరు నిర్ణయాలు తీసుకుంటాడు, అవి ప్రధానంగా చేతి సంకేతాలను ఉపయోగించి వాటిని సూచిస్తారు. కొన్ని నిర్ణయాలు తక్షణమే జరగాలి, మరికొందరికి వారు స్క్వేర్ లెగ్ అంపైరుతో ఆలోచించడానికి లేదా చర్చించడానికి సమయం తీసుకోవచ్చు, ప్రత్యేకించి స్క్వేర్ లెగ్ అంపైరుకు బాగా కనబడిన పక్షంలో.
అంపైరు బంతులను లెక్కిస్తూ ఉంటారు. ఓవరు పూర్తవగానే అయినట్లు ప్రకటిస్తాడు. అప్పుడప్పుడు అంపైరు తప్పుగా లెక్కించవచ్చు. అపుడు ఓవర్‌లో తక్కువో ఎక్కువో బంతులు పడవచ్చు. అయితే చాలా ఆటలలో స్కోరర్లు తప్పు సవరించడానికి అంపైరులతో సంభాషించవచ్చు.
ఈ నిర్ణయాలను వెంటనే సూచిస్తారు. అవి ఆటపై ప్రభావాన్ని చూపుతాయి.
ఫీల్డింగ్ వైపు అప్పీల్ చేస్తే తప్ప అంపైరు బ్యాటరును ఔట్ చేయలేడు. అయితే, బ్యాటరు తాను ఔటయ్యానని భావిస్తే వారు వెళ్ళిపోవచ్చు. ఈ రోజుల్లో ఇది చాలా అరుదు -ముఖ్యంగా టెస్టులు, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో వివాదాస్పద నిర్ణయాల సమయంలో. అయితే, ఒక బ్యాటరు బౌల్డ్ అయినప్పుడు లేదా స్పష్టంగా క్యాచ్ పట్టినప్పుడు బ్యాటరు వెళ్ళిపోవడం ఆనవాయితీ. బ్యాటరు ఔటని ఫీల్డింగ్ జట్టు విశ్వసిస్తే, ఫీల్డింగ్ పక్షం అంపైరుకు అప్పీల్ చేయాలి.
అంపైరు ప్రతిస్పందనగా, బ్యాటరు ఔటయ్యారని సూచించడానికి చేయి పైకి లేపి, చూపుడు వేలును తెరిచి పెడతారు. నిర్ణయం "నాటౌట్" అయితే, ఆ మాట స్పష్టంగా చెబుతారు, లేదా తలను అడ్డంగా ఊపుతారు.[4] స్ట్రైకర్ ఎండ్‌లో ఉండే అంపైరు 'అవుట్' సిగ్నల్‌ను సూచించినట్లయితే, బౌలర్ ఎండ్ లోని అంపైరు దాన్ని నిర్ధారించాల్సిన అవసరం లేదు. మరే నిర్ణయమైనా బౌలర్ ఎండ్‌లో ఉండే అంపైరు నిర్థారించాలి.[5]
చట్టవిరుద్ధమైన డెలివరీ వేస్తే అంపైరు ఆ సంగతి ఏ అంపైరైన చెప్పవచ్చు, నో-బాల్ సంకేతం చేయవచ్చు. అయితే, ప్రతి అంపైరుకూ ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది. నో-బాల్‌లకు అత్యంత సాధారణ కారణాలు - ఫుట్ ఫాల్ట్‌లు లేదా బ్యాటరు నడుము కంటే ఎత్తుగా, బౌన్స్ అవ్వకుండా బంతి వెళ్లడం. ఇవి బౌలర్ ఎండ్‌లోని అంపైరు అధికార పరిధిలో ఉంటుంది. స్క్వేర్-లెగ్ అంపైరు చాలా అరుదుగా నో-బాల్‌ని ప్రకటిస్తారు. ఎందుకంటే వారి అధికార పరిధి బ్యాటరు భుజాల కంటే ఎత్తుగా బ్యాటింగ్ క్రీజును దాటే షార్ట్ పిచ్ డెలివరీల వంటి తక్కువ తరచుగా జరిగే ఉల్లంఘనలకు మాత్రమే పరిమితం. సంకేతం ఒక చేతిని అడ్డంగా చాచి, "నో-బాల్" అని అరవడం; వచ్చేది నో బాల్ అని బ్యాటరుకు తెలపడం ఇందులో ఉద్దేశం. [6] ఐసిసి ఆధ్వర్యంలో జరిగే మ్యాచ్‌లలో, బౌలర్ చేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంగి ఉందని అంపైరు భావిస్తే దాన్ని కూడా నో బాల్ అనవచ్చు (బౌలింగ్ కాకుండా విసరడం).
పరిమిత ఓవర్ల క్రికెట్‌లోని T20లు, వన్‌డే రూపాల్లో, బౌలరు క్రీజును అధిగమించడం లేదా బ్యాట్స్‌మెన్ నడుము కంటే ఎత్తుగా బౌలింగ్ చేయడం వల్ల వచ్చే నో-బాల్ అయితే, దాని తరువాత వేసే బంతి ఫ్రీ హిట్ అవుతుంది. నోబాల్ వేసినందుకు ఇది బౌలరుకు విధించే జరిమానా. అంపైరు సాధారణంగా నో-బాల్ సిగ్నల్‌ను (బౌండరీ వంటి నో-బాల్‌తో అనుబంధించబడిన ఏవైనా ఇతర సంకేతాలను) ఇచ్చాక, వారి తలపై వేలిని అడ్డంగా ప్రదక్షిణ చేస్తూ రాబోయేది ఫ్రీహిట్ అని సూచిస్తారు. ఫ్రీ హిట్ డెలివరీ సమయంలో, బ్యాటర్‌లను క్యాచ్ చేయడం, బౌల్డ్ చేయడం, లెగ్ బిఫోర్ వికెట్ లేదా స్టంప్ చేయడం వంటివి చేయలేరు.
వైడ్ అనేది చట్టవిరుద్ధమైన డెలివరీ. ఇది స్ట్రైకరుకు అందనంత దూరంగా వెళ్ళే బంతిని వైడ్ అంటారు. అంపైరు రెండు చేతులనూ క్షితిజ సమాంతరంగా చాపి వైడ్ అని సూచిస్తూ వైడ్ బాల్ అని అరుస్తారు. బంతి నో బాలూ, వైడూ రెండూ అయితే, నో బాల్ అవుతుంది. బంతి బ్యాట్స్‌మన్‌ను దాటే వరకు అంపైర్లు వైడ్ సిగ్నల్ ఇవ్వకూడదు. ఒక బ్యాట్స్‌మన్ వైడ్ డెలివరీని కొడితే, ఒకసారి బ్యాట్ బంతిని తాకితే దానిని వైడ్ అని పిలవలేరు.
అంపైరుకు "లైన్ నిర్ణయం" (అంటే రనౌట్ లేదా స్టంప్డ్ నిర్ణయం) ఖచ్చితంగా చెప్పలేని సందర్భంలో గానీ, లేదా బంతి ఫోరా, సిక్సా అనేది అంపైరుకు తెలియకుంటే, వారు విషయాన్ని థర్డ్ అంపైరుకు సూచించవచ్చు. ఫీల్డరు పట్టిన క్యాచ్‌లను క్లీన్‌గా ఉందాఅ లేదా అనే సమ్ంగతిని కూడా థర్డ్ అంపైరుకు సూచించవచ్చు (కానీ ఆన్-ఫీల్డ్ అంపైర్లు సంప్రదించుకున్న తర్వాత, ఇద్దరికీ తెలియని సందర్భంలో మాత్రమే). ఇది కాకుండా, ఆటగాళ్ళు, అంపైర్లు ఇచ్చిన ఔట్ నిర్ణయాన్ని సమీక్షించేందుకు థర్డ్ అంపైరును కోరవచ్చు. ఆన్-ఫీల్డ్ అంపైరు రెండు చేతులను గాల్లో ఒక పెట్టె ఆకారంలో ఊపి టీవీ తెరను సూచిస్తూ సమీక్ష కోరతాడు. [7]
ఆన్-ఫీల్డ్ అంపైరు తప్పు నిర్ణయం తీసుకున్నాడని థర్డ్ అంపైరు నిర్ణయిస్తే, వారు చూసిన వాటిని హెడ్‌సెట్‌ల ద్వారా ఆన్-ఫీల్డ్ అంపైరుకు తెలియజేస్తారు. వారి నిర్ణయాన్ని మార్చుకోమనీ లేదా వారి అసలు నిర్ణయం సరైనదనో చెబుతారు. ఆ తర్వాత ఆన్-ఫీల్డ్ అంపైరు 'గత సిగ్నల్ రద్దు' గుర్తును సూచించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ లేదా ముఖ్యమైన దేశీయ మ్యాచ్‌లలో తప్ప థర్డ్ అంపైర్‌ని ఉపయోగించరు.
గోల్డెన్ బెయిల్స్ అవార్డును అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) 100 టెస్టు మ్యాచ్‌లలో నిలబడి (ఆఫీషియేట్) చేసిన అంపైర్లకు అందజేస్తుంది. [8] [9] [10] [11] ముగ్గురు అంపైర్లు ఈ మైలురాయిని చేరుకున్నారు: అలీమ్ దార్, స్టీవ్ బక్నర్, రూడీ కోర్ట్‌జెన్ .
అంపైరుగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు: [12]
అంపైర్ | కాలం | మ్యాచ్‌లు |
---|---|---|
అలీమ్ దార్ | 2003– | 145 |
స్టీవ్ బక్నర్ | 1989–2009 | 128 |
రూడి కోర్ట్జెన్ | 1992–2010 | 108 |
| ||
200 వన్డే ఇంటర్నేషనల్స్‌లో నిలిచిన అంపైర్లకు ఐసిసి, సిల్వర్ బెయిల్స్ అవార్డు ఇస్తుంది. ముగ్గురు అంపైర్లు ఈ మైలురాయిని చేరుకున్నారు: అలీమ్ దార్, రూడీ కోర్ట్‌జెన్, బిల్లీ బౌడెన్ .
అంపైరుగా అత్యధిక వన్‌డే మ్యాచ్‌లు: [13]
అంపైర్ | కాలం | మ్యాచ్‌లు |
---|---|---|
అలీమ్ దార్ | 2000– | 227 |
రూడి కోర్ట్జెన్ | 1992–2010 | 209 |
బిల్లీ బౌడెన్ | 1995–2016 | 200 |
|
100 వన్డే ఇంటర్నేషనల్స్‌లో నిలిచిన అంపైర్లకు ఐసిసి, కాంస్య బెయిల్స్ అవార్డు ఇస్తుంది. [8] [9] [14] పదిహేడు మంది అంపైర్లు ఈ మైలురాయిని చేరుకున్నారు.
అంపైరుగా అత్యధిక T20I మ్యాచ్‌లు: [15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.