From Wikipedia, the free encyclopedia
క్రికెట్లో, ఒక బ్యాటరు ఇన్నింగ్స్‌ను ప్రత్యర్థి జట్టు ముగించినప్పుడు అవుట్ అవడం అంటారు. దీన్ని బ్యాటింగు జట్టు వికెట్ కోల్పోవడం ఫీల్డింగ్ జట్టు వికెట్ తీసుకోవడం అంటారు. దాంతో బాల్ డెడ్ అవుతుంది. (అంటే ఆ డెలివరీలో ఇకపై పరుగులు తీయలేరు). అవుటైన బ్యాటరు మైదానం వదలి వెళ్ళి పోవాలి. అతని స్థానంలో తరువాతి బ్యాటరు వస్తారు. జట్టు లోని పదకొండు మంది అటగాళ్ళలో పది మందిని అవుట్ చేస్తే జట్టు ఇన్నింగ్స్ ముగుస్తుంది. ఆటగాళ్ళు జంటగా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి, ఒకే ఒక్క బ్యాటర్ మిగిలి ఉన్నప్పుడు అతను నాటౌట్‌గా మిగులుతాడు. ఆ తరువాత జట్టు బ్యాటింగ్ చేయడం సాధ్యం కాదు. దీన్నే బ్యాటింగ్ చేసే జట్టును ఆలౌట్ చేయడం లేదా బౌలౌట్ చేయడం అని అంటారు.
బ్యాటర్‌ను ఔట్ చేయడానికి అత్యంత సాధారణ పద్ధతులు (తరచుదనం క్రమంలో): క్యాచ్, బౌల్డ్, లెగ్ బిఫోర్ వికెట్, రనౌట్, స్టంప్డ్. వీటిలో, లెగ్ బిఫోర్ వికెట్, స్టంప్డ్ ఔట్ పద్ధతులను బౌల్డ్, రనౌట్ ఔట్ చేసే పద్ధతులకు సంబంధించినవిగా చూడవచ్చు.
చాలా వరకు తొలగింపు పద్ధతులు చట్టవిరుద్ధమైన డెలివరీ వేసినపుడు (అంటే వైడ్ లేదా నో-బాల్) లేదా కొన్ని పోటీల్లో నో-బాల్ తరువాత వచ్చే ఫ్రీ హిట్ డెలివరీ లోనూ వర్తించవు. సాధారణ పద్ధతులలో, ఏ రకమైన డెలివరీ సమయంలోనైనా బ్యాటరు ఔటయ్యేది "రనౌట్" మాత్రమే.[1] [2] [3]
సాంప్రదాయికంగా, ఔటయ్యే నిర్ణయాలు ప్రధానంగా ఆటగాళ్ళే తీసుకుంటారు. అవుటవడం స్పష్టంగా కనిపిస్తే, అంపైర్ నిర్ణయం అవసరం లేకుండా బ్యాటరే స్వచ్ఛందంగా మైదానం వదలి వెళ్ళిపోతాడు. ఒకవేళ అవుట్ అవడం పట్ల బ్యాటరు, ఫీల్డింగ్ జట్టు విభేదిస్తే, ఫీల్డింగ్ జట్టు అంపైరుకు అప్పీల్ చేస్తుంది. అప్పుడు బ్యాటర్ అవుట్ కాదా అని అంపైరు నిర్ణయిస్తారు. పోటీ క్రికెట్లో, చాలా కష్టమైన క్యాచింగ్, LBW నిర్ణయాలు అంపైర్‌కు వదిలివేస్తారు. అటువంటి సందర్భాలలో బ్యాటరు తాను అవుట్ అయ్యానని భావించి, అంపైరు నిర్ణయం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోతే దానిని "వాకింగ్" అని పిలుస్తారు. దాన్ని గౌరవప్రదమైన చర్యగా, కానీ వివాదాస్పద చర్యగా, పరిగణిస్తారు.[4]
తానిచ్చిన నిర్ణయం తప్పని అంపైరు విశ్వసిస్తే, బ్యాటరు ఇప్పటికే మైదానం నుండి వెళ్ళిపోయినట్లైతే, ఆ బ్యాటరును వెనక్కి పిలిపించవచ్చు. దీనికి ఉదాహరణగా 2007లో ఇంగ్లండ్, భారతదేశం మధ్య జరిగిన లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో కెవిన్ పీటర్సన్ క్యాచ్ ఇచ్చాడు. కానీ టెలివిజన్ రీప్లేలు మహేంద్ర సింగ్ ధోని పట్టుకోడానికి ముందు బంతి నేలను తాకిందని చూపించడంతో బ్యాటరును వెనక్కి పిలిచారు. [5]
బ్యాటర్‌ను అనేక విధాలుగా ఔట్ చేయవచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనవి బౌల్డ్, క్యాచ్, లెగ్ బిఫోర్ వికెట్ (LBW), రనౌట్, స్టంప్ చేయడం. 1877 - 2012 మధ్య టెస్ట్ మ్యాచ్‌లలో ఔట్ల విశ్లేషణలో ఈ కాలంలో జరిగిన 63,584 ఔట్లలో 98.2% ఈ ఐదు రకాల్లో ఏదో ఒక పద్ధతిలో జరిగినట్లు తేలింది.[6] రిటైరవడం, బంతిని రెండుసార్లు కొట్టడం, హిట్ వికెట్, బంతిని హ్యాండిల్ చేయడం/ఫీల్డ్‌ను అడ్డుకోవడం, టైమౌట్లు చాలా అరుదుగా జరిగాయి.
ఔటయ్యే పద్ధతి: | బౌల్డ్ | క్యాచ్ | ఎల్బిడబ్ల్యు | రనౌట్ | స్టంపౌట్ | రిటైరవడం | బంతిని రెండుసార్లు కొట్టడం | హిట్ వికెట్ | ఫీల్డును అడ్డుకోవడం | టైమౌట్ |
---|---|---|---|---|---|---|---|---|---|---|
స్ట్రైకరు ఔటవుతాడా? | ||||||||||
నాన్-స్ట్రైకర్‌ను అవుట్ చేయవచ్చా? | ||||||||||
ఔట్ చేసిన ఘనత బౌలర్దేనా ? | ||||||||||
అవుట్ చేసిన ఘనత ఫీల్డర్ లేదా వికెట్ కీపర్దేనా? | ||||||||||
నో బాల్ లేదా ఫ్రీ హిట్ లో అవుట్ అవ్వడం సాధ్యమేనా? | N/A | N/A | ||||||||
వైడ్ బాల్ లో ఔటివ్వవచ్చా? | N/A | N/A |
బౌలరు వేసిన చట్టబద్ధమైన (అంటే నో-బాల్ కాదు) డెలివరీ వికెట్‌ను తాకితే, స్ట్రైకింగులో ఉన్న బ్యాటరు (బౌలర్‌కి ఎదురుగా ఉన్న బ్యాటర్) అవుట్ అవుతాడు. బంతి నేరుగా స్టంప్‌లను తాకినా, లేదా బ్యాట్స్‌మన్ చేతిలోని బ్యాట్‌ను గానీ అతని శరీరాన్ని గానీ తగిలి ఆ తరువాత వికెట్లను తాకినా ఔట్ అయినట్లే. అయితే, స్టంప్‌లకు తగిలే ముందు బంతిని మరే ఇతర ఆటగాడు గానీ, అంపైరు గానీ తాకినట్లయితే బ్యాటర్ బౌల్డ్ అవడు. [7]
అన్ని ఇతర తొలగింపు పద్ధతుల కంటే బౌల్డ్ కు ప్రాథమ్యత ఉంటుంది.[8] దీని అర్థం ఏమిటంటే, ఒక బ్యాటర్ బౌల్డ్ అవడమే కాకుండా, అదే సమయంలో మరొక కారణంగా కూడా ఔటైతే, ఆ రెండో కారణాన్ని విస్మరించి, బ్యాటర్ బౌల్డౌట్ అయినట్లు నిర్ణయిస్తారు.
1877 - 2012 మధ్య, మొత్తం టెస్ట్ మ్యాచ్‌ల ఔట్లలో 21.4% ఈ పద్ధతిలో జరిగాయి.[6]
బౌలరు వేసిన చట్టబద్ధమైన డెలివరీని (అంటే నో-బాల్ కాదు) బ్యాటరు బ్యాట్‌తో (లేదా బ్యాట్‌కి గ్లౌస్ తాకినప్పుడు గ్లోవ్తో) బంతిని కొట్టినపుడు, ఆ బంతి నేలను తాకక ముందే బౌలరు గానీ, ఫీల్డరు గానీ పట్టుకుంటే ఆ బ్యాటరు క్యాచౌట్ అవుతాడు.
బ్యాటరు కొట్టిన బంతిని వికెట్ కీపరు పట్టుకుంటే దాన్ని అనధికారికంగా "క్యాట్ బిహైండ్" అంటారు. చాలా అరుదుగా స్లిప్ ఫీల్డర్లు పట్టుకున్నపుడు కూడా ఇలా అంటారు. బంతిని వేసిన బౌలరే తిరిగి క్యాచ్ పట్టుకుంటే దాన్ని "క్యాట్ అండ్ బౌల్డ్" అంటారు.
బౌల్డౌట్ తరువాత క్యాచౌట్ కు ప్రాథమ్యత ఉంటుంది.[9] దీనర్థం, బ్యాటరు క్యాచ్ ద్వారానే కాక మరొక కారణం (బౌల్డ్ తప్ప) వలన కూడా ఔటైతే, ఆ రెండో కారణాన్ని విస్మరించి క్యాచౌట్ అనే ఇస్తారు.
1877 - 2012 మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ల అవుట్లలో, ఈ పద్ధతిలో 56.9% క్యాచ్‌ల వలన అయ్యారు. వీటిలో 40.6% ఫీల్డర్లు పట్టినవి కాగా, వికెట్ కీపర్ క్యాచ్ పట్టినవి 16.3%. [6]
బౌలరు వేసిన చట్టబద్ధమైన డెలివరీ (అనగా, నో-బాల్ కాదు) బ్యాట్‌ను (లేదా బ్యాట్‌ని పట్టుకున్న గ్లోవ్) తాకకుండా, బ్యాటరు శరీర భాగానికి తగిలిన సందర్భంలో (కాలికే తగలాల్సిన అవసరమేమీ లేదు), ఒకవేళ ఆ బంతి బ్యాటరుకు తగలకుండా ఉంటే అది వికెట్‌ను తాకి ఉండేదని అంపైరు భావిస్తే ఆ బ్యాటరు లెగ్ బిఫోర్ వికెట్ అవుట్ అవుతాడు. బంతి ఎక్కడ పిచ్ అయింది, బంతి వికెట్ల లైనులోనే బ్యాటర్‌కు తగిలిందా, బ్యాటర్ బంతిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడా అనే దానితో సహా వివిధ అంశాలను పరిగణించి ఈ నిర్ణయం ప్రకటిస్తారు. ఈ అంశాలు కాలక్రమేణా మారుతూ వచ్చాయి.
1877 - 2012 మధ్య, మొత్తం టెస్ట్ మ్యాచ్‌ల ఔట్లలో, ఈ పద్ధతిలో జరిగినవి 14.3%. [6]
బంతి ఆటలో ఉండగా, బ్యాటరు బ్యాటుగానీ, శరీరం లోని ఏ భాగం గానీ క్రీజులో నేలకు ఆని లేనపుడు, ఆ క్రీజు లోని బెయిళ్ళను ప్రత్యర్థి జట్టు పడేస్తే, ఆ క్రీజులో ఉండాల్సిన బ్యాటరు రనౌట్ అవుతాడు.
బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగులు తీస్తూ, పరుగు స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది. స్ట్రైకరైనా, నాన్-స్ట్రైకరైనా రనౌట్ కావచ్చు. పడేసిన వికెట్లకు దగ్గరగా ఉన్న బ్యాటరు ఔటౌతాడు. బ్యాటరు గానీ, బ్యాటు గానీ క్రీజు లైను మీద ఉన్నా అవుట్‌గానే పరిగణిస్తారు. అయితే దీన్ని కనిపెట్టడం కంటికి సాధ్యం కాని సందర్భాల్లో డెసిషన్ రివ్యూ సిస్టమ్‌కు నివేదిస్తారు.
స్టంపౌటుకు, రనౌటుకూ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, వికెట్ కీపరు బంతిని ఆడేందుకు ముందుకు వెళ్ళినపుడు కూడా బ్యాటరును స్టంపౌట్ చేయవచ్చు (అతను పరుగు కోసం ప్రయత్నించకపోయినా). రనౌట్ అయితే కీపర్‌తో సహా ఏ ఫీల్డర్ అయినా చేయవచ్చు.
1877 - 2012 మధ్య, మొత్తం టెస్ట్ మ్యాచ్‌ల ఔట్లలో ఈ పద్ధతిలో అయినవి 3.5%.[6]
స్ట్రైకరు బంతిని ఆడటానికి క్రీజు ముందు అడుగులు వేసినపుడు, బ్యాటు గానీ, బ్యాటరు శరీరంలోని ఏ భాగం గానీ క్రీజు వెనుక నేలను ఆని ఉండని సందర్భంలో, వికెట్ కీపరు బంతితో వికెట్‌ను కొడితే, అప్పుడు స్ట్రైకరు స్టంపౌట్ అవుతాడు. స్లో బౌలింగులో లేదా మీడియం-పేస్ బౌలింగులో వికెట్ కీపర్ నేరుగా స్టంప్‌ల వెనుక నిలబడి ఉంటాడు కాబట్టి, అప్పుడు స్టంపింగులు ఎక్కువగా అవుతాయి. ఫాస్ట్ బౌలర్ల విషయ వికెట్ కీపర్లు స్టంప్‌ల నుండి చాలా గజాల వెనుక నిలబడినందున, ఫాస్ట్ బౌలర్ల బౌలింగులో స్టంపింగ్‌లు ఎక్కువగా కావు. బంతి కీపర్‌కు తగిలి బౌన్స్ అయిన తరువాత (కానీ బాహ్యంగా ఉండే సాధారణం కాని వికెట్ కీపింగ్ రక్షణ పరికరాలు, హెల్మెట్ వంటివి కాకుండా) స్టంప్‌లకు తగిలినా స్టంపింగ్‌గా పరిగణిస్తారు.
1877 - 2012 మధ్య, మొత్తం టెస్ట్ మ్యాచ్‌ల తొలగింపులలో ఈ పద్ధతిలో అయినవి 2.0%.[6]
బ్యాటరుకు గాయమై, లేదా మరేదైనా కారణంతో ఆడలేక అంపైర్ అనుమతి లేకుండా మైదానం నుండి నిష్క్రమిస్తే, అతను ప్రత్యర్థి కెప్టెన్ సమ్మతితో మాత్రమే తిరిగి ఆడేందుకు అనుమతి ఉంటుంది. తన ఇన్నింగ్స్‌ను తిరిగి ప్రారంభించలేకపోతే అతను రిటైరౌట్ అయినట్లు ప్రకటిస్తారు. బ్యాటింగ్ సగటును లెక్కించే ప్రయోజనాల కోసం, రిటైర్డ్ అవుట్ అనేదాన్ని అవుట్‌గానే పరిగణిస్తారు.
టెస్టు చరిత్రలో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఈ పద్ధతిలో ఔట్ అయ్యారు: మర్వాన్ అటపట్టు (201 వద్ద), [10] జయవర్ధనే (150 వద్ద), ఇద్దరూ 2001 సెప్టెంబరులో బంగ్లాదేశ్ శ్రీలంక మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇలా ఔటయ్యారు. స్పష్టంగా, ఇతర ఆటగాళ్లకు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇచ్చేందుకు ఇలా ఔటయ్యారు. కానీ దీన్ని క్రీడాస్ఫూర్తి లేమిగా పరిగణించారు. విమర్శలకు దారితీసింది. [11] 1983 మేలో, వెస్టిండీస్‌కు చెందిన గార్డన్ గ్రీనిడ్జ్ 154 వద్ద ఉండగా అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెను (రెండు రోజుల తర్వాత మరణించింది) చూసేందుకు వెళ్ళడానికి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత అతన్ని రిటైర్ నాటౌట్‌గా అని నిర్ధారించారు. టెస్టు చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఇదొక్కటే.[12]
ఫస్ట్-క్లాస్ క్రికెట్లో, ప్రత్యేకించి టూర్ మ్యాచ్‌లు, వార్మప్ మ్యాచ్‌లలో బ్యాటర్లు రిటైర్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ మ్యాచ్‌లను సాధారణంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లుగా పరిగణిస్తారు కాబట్టి, ఈ మ్యాచ్‌లలో రిటైర్మెంట్ చేయడం క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకంగా పరిగణించర్. 1993 లో గ్రాహం గూచ్, ఒక సిక్సర్‌తో తన వందో ఫస్ట్-క్లాస్ సెంచరీని పూర్తి చేసిన వెంటనే, 105 వద్ద రిటైరయ్యాడు.[13]
ఇన్నింగ్సు ముగిసే సమయానికి గాయపడి, తిరిగి బ్యాటింగ్‌కు రాని ఆటగాణ్ణి గణాంక ప్రయోజనాల కోసం ఔటైనట్లుగా పరిగణించరు. అయితే, వారి స్థానంలో వేరే ఆటగాడు బ్యాటింగ్ చేయడానికి అనుమతి ఉండదు కాబట్టి, ఆటపై ప్రభావం మాత్రం వారు రిటైర్డ్ అయినట్లే ఉంటుంది.
బ్యాటర్ బంతిని రెండుసార్లు "కొట్టినట్లయితే" అతను ఔట్ అవుతాడు. మొదటి హిట్ బంతి బ్యాటరుకు లేదా బ్యాట్‌కు తగలడం, రెండవది బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా బంతిని కొట్టడం. రెండవసారి కొట్టడం బ్యాట్‌తోనే చెయ్యాల్సిన అవసరం లేదు, బ్యాటరు శరీరం తగిలినా, చేత్తో బంతిని పట్టుకున్నా ఔటే. (అందువల్ల బంతిని రెండుసార్లు కొడితే ఔటే - రెండు సార్లూ బంతిని బ్యాటుతో తాకకున్నా సరే). స్టంపులను తాకకుండా బంతిని ఆపే క్రమంలో బ్యాట్స్‌మన్‌ను రెండోసారి అతని బ్యాటుతో లేదా శరీరంతో (కానీ బ్యాట్ పట్టుకున్న చేతితో తాకకూడదు) ఆపవచ్చు, అది ఔట్ కాదు.
టెస్టు క్రికెట్లో ఇంతవరకూ ఏ బ్యాటర్ కూడా ఈ పద్ధతిలో ఔట్ కాలేదు.
షాట్ కొట్టేటపుడు లేదా వారి మొదటి పరుగు తీసేందుకు ఉద్యుక్తుడయ్యేటపుడు బ్యాటరు తన శరీరంతో గానీ, బ్యాట్‌తో గానీ స్టంప్‌లను పడేస్తే, అతను హిట్ వికెట్ పద్ధతిలో ఔట్ అవుతాడు. ఫీల్డరు వికెట్ల పైకి విసిరిన బంతిని తప్పించుకోడానికో, రన్ అవుట్‌ని తప్పించుకోడానికో బ్యాటరు వికెట్లకు తగిలినా ఈ నియమం వర్తించదు.
2007లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఇంగ్లండ్ vs వెస్టిండీస్ టెస్టు మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో కెవిన్ పీటర్సన్ తలపై బౌన్సర్‌తో కొట్టాడు. అతని హెల్మెట్ స్టంప్‌లకు తగిలింది; రిచీ బెనాడ్ వేసిన ఒక టాప్ స్పిన్నర్ జో సోలమన్ టోపీని పడగొట్టగా అది సోలమన్ స్టంప్‌లపై పడింది.
బ్యాటర్, తన చర్య ద్వారా లేదా మాటల ద్వారా, ఫీల్డింగు జట్టుకు ఆటంకం కలిగించినా లేదా దృష్టి మరల్చినా, అతను ఔట్ అవుతాడు.
ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఫీల్డ్‌ను అడ్డుకోవడంలో ఇప్పటివరకు ఒక్క ఆటగాడు మాత్రమే ఔట్యయ్యాడు: 1951లో లండన్‌లోని ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో ఆడినపుడు ఇంగ్లండ్ ఆటగాడు లెన్ హట్టన్, స్టంప్‌ల మీదుగా ఒక బంతిని కొట్టాడు. కానీ ఆ ప్రయత్నంలో దక్షిణాఫ్రికా వికెట్ కీపరు రస్సెల్ ఎండీన్ను క్యాచ్ పట్టుకోకుండా అడ్డుకున్నాడు.[14] యాదృచ్ఛికంగా, టెస్ట్ మ్యాచ్‌లో బంతిని హ్యాండిల్ చేసి అవుట్ అయిన కొద్ది మంది వ్యక్తులలో ఎండీన్ ఒకడు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎనిమిది మంది బ్యాటర్లు ఈ పద్ధతిలో ఔటయ్యారు. [15]
ఆడేందుకు మైదానం లోకి వస్తున్న బ్యాటరు, బంతిని ఎదుర్కోవడానికి సిద్ధపడేందుకు (లేదా మరొక ఎండ్‌లో నిలబడడానికి) ఉద్దేశపూర్వకంగా మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే "టైమౌట్" అవుతాడు. ఆటలో విరామం తర్వాత నాట్ అవుట్ బ్యాటరు సిద్ధంగా లేకుంటే, అప్పీల్ చేసినపుడు టైమౌట్ ఇవ్వవచ్చు. చాలా ఎక్కువ ఆలస్యమైన సందర్భంలో, అంపైర్లు ఆ జట్టు మ్యాచ్‌ను వదులుకుందని (ఫర్ఫీచరు) ప్రకటించవచ్చు. ఇప్పటివరకు, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ పద్ధతిలో వికెట్ తీయడం ఎన్నడూ జరగలేదు. అన్ని రకాల ఫస్ట్-క్లాస్ క్రికెట్లో ఐదు సందర్భాలలో మాత్రమే జరిగింది.[16]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.