వన్ డే ఇంటర్నేషనల్
From Wikipedia, the free encyclopedia
వన్ డే ఇంటర్నేషనల్ (ODI) అనేది పరిమిత ఓవర్ల క్రికెట్ పోటీల్లో ఒక రూపం. అంతర్జాతీయ హోదా కలిగిన రెండు జట్ల మధ్య ఈ పోటీ జరుగుతుంది. దీనిలో రెండు జట్లు చెరొక 50 ఓవర్లు బ్యాటింగు చేస్తాయి. ఆట ఒకే రోజులో పూర్తవుతుంది. దాదాపు 9 గంటల సేపు జరుగుతుంది. [1] [2] సాధారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే క్రికెట్ ప్రపంచ కప్పు ఈ ఫార్మాట్‌లోనే ఆడతారు. వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను లిమిటెడ్ ఓవర్స్ ఇంటర్నేషనల్స్ (LOI) అని కూడా పిలుస్తారు. అయితే ఈ పదం కొత్తగా మొదలైన ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను కూడా సూచిస్తుంది. వన్ డే ఇంటర్నేషనల్ పోటీలు ప్రధానమైన మ్యాచ్‌లు. పరిమిత ఓవర్ల పోటీలైన లిస్ట్ A పోటీల్లో వీటిని అత్యున్నత ప్రమాణంగా పరిగణిస్తారు.
|
అంతర్జాతీయ వన్డే ఆట అనేది ఇరవయ్యవ శతాబ్దపు చివర్లో వచ్చిన పరిణామం. మొదటి ODI 1971 జనవరి 5 న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల మధ్య జరిగింది. ఆ సీరీస్‌లో మూడవ టెస్టు మొదటి మూడు రోజులు వర్షార్పణం అవడంతో అధికారులు ఆ మ్యాచ్‌ను రద్దు చేసి, దానికి బదులుగా, ఒక్కో జట్టుకు 40 ఎనిమిది బంతుల ఓవర్లు ఉండే ఒక-ఆఫ్ వన్-డే గేమ్‌ను ఆడాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ODIలు ఎరుపు రంగు బంతితో తెలుపు రంగు కిట్‌లతో ఆడారు. [3]
1970ల చివరలో కెర్రీ ప్యాకర్, వరల్డ్ సిరీస్ క్రికెట్ పోటీని మొదలుపెట్టాడు. వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పుడు సర్వసాధారణంగా ఉన్న అనేక లక్షణాలను అతను పరిచయం చేసాడు. ఇందులో రంగుల యూనిఫారాలు, తెల్లటి బంతి, నల్లటి సైట్ స్క్రీన్లతో ఫ్లడ్‌లైట్ల కింద రాత్రిపూట ఆడే మ్యాచ్‌లు మొదలైన అంశాలన్నీ అతడు ప్రవేశపెట్టినవే. టెలివిజన్ ప్రసారాల కోసం, అనేక కెమెరాలను వాడడం, ఆటగాళ్ళ నుండి సౌండ్‌లను క్యాప్చర్ చేయడానికి మైక్రోఫోన్‌లు, స్క్రీన్‌పై గ్రాఫిక్‌లు వగైరాలు కూడా ప్రవేశించాయి. రంగుల యూనిఫారాలతో జరిగిన మ్యాచ్‌లలో మొదటిది WSC ఆస్ట్రేలియన్లు (బంగారు రంగుతో) WSC వెస్ట్ ఇండియన్లకు (పగడపు గులాబీ రంగుతో), 1979 జనవరి 17 న మెల్‌బోర్న్‌లోని VFL పార్క్‌లో జరిగింది. ఆస్ట్రేలియాలో క్రికెట్‌కు సంబంధించిన టీవీ హక్కులను ప్యాకర్ కు చెందిన ఛానల్ 9 పొందడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకు ఆడేందుకు డబ్బు చెల్లించి అంతర్జాతీయ నిపుణులుగా మారడానికి కూడా బాట వేసింది. ఇకపై క్రికెట్ ఆటగాళ్ళు ఆటకు బయట ఉద్యోగాలు చెయ్యాల్సిన అవసరం లేకుండా పోయింది. రంగు రంగుల కిట్‌లు, తెల్లటి బంతితో ఆడే మ్యాచ్‌లు కాలక్రమేణా సర్వసాధారణంగా మారాయి. ODIలలో తెల్లటి ఫ్లాన్నెల్స్, ఎరుపు బంతిని ఉపయోగించడం 2001లో ముగిసింది.
అంతర్జాతీయ క్రికెట్ పాలక మండలి - ICC, వన్డే జట్లకు, బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్ రౌండర్లు Archived 2022-12-17 at the Wayback Machine కోసం ICC ODI ర్యాంకింగ్‌లను నిర్వహిస్తుంది (కుడివైపు ఉన్న పట్టికను చూడండి), . ప్రస్తుతం న్యూజిలాండ్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది.

నియమాలు
ప్రధానమైన క్రికెట్ చట్టాలు మామూలుగానే దీనికీ వర్తిస్తాయి. అయితే, ODIలలో, ప్రతి జట్టు నిర్ణీత ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తుంది. ODI క్రికెట్ ప్రారంభ రోజులలో, సాధారణంగా ఒక్కో జట్టుకు 60 ఓవర్లు ఉండేవి. ఒక్కో జట్టుకు 40, 45 లేదా 55 ఓవర్లతో కూడా మ్యాచ్‌లు ఆడేవారు. కానీ ఇప్పుడు అన్ని మ్యాచులూ ఏకరీతిగా 50 ఓవర్లుగా నిర్ణయించబడింది.
సరళంగా చెప్పాలంటే, ఆటను క్రింది విధంగా ఆడతారు: [4]

- ఒక ODIలో 11 మంది ఆటగాళ్లతో కూడిన రెండు జట్లు పోటీపడతాయి.
- టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ (ఫీల్డ్) ఎంచుకుంటాడు.
- మొదట బ్యాటింగ్ చేసే జట్టు ఒకే ఇన్నింగ్స్‌లో స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. బ్యాటింగ్ జట్టు "ఆల్ అవుట్" అయ్యే వరకు (అంటే, 11 మంది బ్యాటింగ్ ఆటగాళ్లలో 10 మంది "అవుట్" అవడం) లేదా వారికి కేటాయించిన ఓవర్లన్నీ పూర్తయ్యే వరకూ ఇన్నింగ్స్ కొనసాగుతుంది.
- ప్రతి బౌలరుకు గరిష్ఠంగా 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి పరిమితి ఉంటుంది (వర్షం వల్ల ఓవర్లు తగ్గించిన మ్యాచ్‌ల విషయంలో ఈ సంఖ్యను తగ్గిస్తారు. సాధారణంగా ఒక ఇన్నింగ్స్‌లో ఒక్కో బౌలరుకు మొత్తం ఓవర్లలో ఐదవ వంతు లేదా 20% కంటే ఎక్కువ ఉండకూడదు). అందువల్ల, ప్రతి జట్టులో కనీసం ఐదుగురు సమర్థులైన బౌలర్లు ఉండాలి (అంకితమైన బౌలర్లు లేదా ఆల్ రౌండర్లు).
- రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు మ్యాచ్ గెలవడానికి టార్గెట్ స్కోరు కంటే ఎక్కువ స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అదేవిధంగా, ప్రత్యర్థి జట్టు రెండవ జట్టును ఆలౌట్ చేయడానికి ప్రయత్నిస్తుంది లేదా ఓవర్లన్నీ పూర్తయ్యే లోపు వారు గెలవడానికి అవసరమైన స్కోరును చేరుకోనివ్వకుండా కట్టడి చేస్తుంది.
- రెండవ జట్టు అన్ని వికెట్లు కోల్పోయినప్పుడు లేదా ఓవర్లన్నీ అయిపోయినప్పుడు రెండు జట్లు చేసిన పరుగుల సంఖ్య సమానంగా ఉంటే, అప్పుడు ఆట టై అయినట్లుగా ప్రకటించబడుతుంది (జట్లు కోల్పోయిన వికెట్ల సంఖ్యతో సంబంధం లేకుండా).
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గానీ మరే కారణం వలన గానీ ఆట సమయాన్ని కొంత కోల్పోయిన సందర్భంలో మొత్తం ఓవర్ల సంఖ్యను తగ్గించవచ్చు. ODI క్రికెట్ ప్రారంభ రోజులలో, మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు గెలిచేది ( సగటు రన్ రేట్ పద్ధతిని చూడండి). కానీ ఇది ఎక్కువగా రెండవ జట్టుకు అనుకూలంగా ఉండేది. [5] 1992 ప్రపంచ కప్ పోటీల్లో, మొదటి జట్టు వేసిన చెత్త ఓవర్ల సంఖ్యను మినహాయించే ప్రత్యామ్నాయ పద్ధతిని ఉపయోగించారు (అత్యంత ఉత్పాదక ఓవర్ల పద్ధతిని చూడండి), కానీ అది ఎక్కువగా మొదటి జట్టుకు అనుకూలంగా మారింది. [5] [6] 1990ల చివరి నుండి, లక్ష్యం లేదా ఫలితం సాధారణంగా డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ పద్ధతి (DLS, గతంలో డక్‌వర్త్-లూయిస్ పద్ధతిగా పిలువబడేది) ద్వారా నిర్ణయించడం మొదలైంది. [5] ఇది గణాంక విధానంతో కూడిన పద్ధతి. చేతిలో ఉన్న వికెట్లు రన్-రేట్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని, చేతిలో తక్కువ వికెట్లు ఉన్న జట్టు కంటే ఎక్కువ వికెట్లు ఉన్న జట్టు మరింత దూకుడుగా ఆడగలదనే వాస్తవాన్ని ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. DLSని వర్తింపజేయడానికి సరిపడినన్ని ఓవర్లు ఆడని సందర్భంలో (సాధారణంగా 20 ఓవర్లు), మ్యాచ్ ఫలితం తేలలేదని ప్రకటిస్తారు. ముఖ్యమైన వన్-డే మ్యాచ్‌లకు, ప్రత్యేకించి ప్రధాన టోర్నమెంట్‌ల చివరి దశల్లో జరిగే మ్యాచిలకు రెండు రోజులు కేటాయించవచ్చు. ఒకవేళ వర్షం కారణంగా మొదటి రోజు ఆట జరక్కపోతే అయినట్లయితే-రెండో రోజున కొత్త గేమ్ ఆడి ఫలితాన్ని సాధించవచ్చు. లేదా వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌ని రెండో రోజున తిరిగి ప్రారంభించవచ్చు.
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఉపయోగించే ఎరుపు బంతికి బదులుగా, వన్డేలో తెల్లటి బంతిని వాడతారు కాబట్టి, బంతి రంగు మారవచ్చు. ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ అది కనబడడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ICC బంతిని ఆడగలిగేలా చేయడానికి అనేక నియమాలను ఉపయోగించింది. ఇటీవల, ICC రెండు కొత్త బంతులను (ప్రతి ఎండ్ నుండి ఒకటి) ఉపయోగించింది. అదే వ్యూహాన్ని 1992, 1996 ప్రపంచ కప్‌లలో కూడా ఉపయోగించారు. తద్వారా ప్రతి బంతిని 25 ఓవర్లు మాత్రమే ఉపయోగించారు. [7] గతంలో, 2007 అక్టోబరులో, 34వ ఓవర్ తర్వాత, అంతే సంక్యలో ఓవర్లు ఆడిన పాతబంతిని శుభ్రం చేసి వాడాలని ICC ఆమోదించింది. [8] 2007 అక్టోబరుకి ముందు (1992, 1996 ప్రపంచ కప్‌లు మినహా), ODI యొక్క ఇన్నింగ్స్‌లో ఒక బంతిని మాత్రమే వాడేవారు. మధ్యలో బంతిని మార్చాలా వద్దా అనేది అంపైరు నిర్ణయంపై ఆధారపడి ఉండేది. [9]
ఫీల్డింగ్ పరిమితులు, పవర్‌ప్లేలు

ODI పోటీల్లో జట్లు పూర్తిగా డిఫెన్సివ్ ఫీల్డింగును ఎంచుకోకుండా నిరోధించడానికి, బౌలింగ్ జట్టుపై ఫీల్డింగ్ పరిమితులను విధించారు. ముప్పై-గజాల సర్కిల్ వెలుపల మోహరించదగ్గ గరిష్ఠ ఫీల్డర్ల సంఖ్యను ఫీల్డింగ్ పరిమితులు నిర్దేశిస్తాయి.
ప్రస్తుత ODI నిబంధనల ప్రకారం, మూడు స్థాయిల ఫీల్డింగ్ పరిమితులు ఉన్నాయి:
- ఒక ఇన్నింగ్స్‌లోని మొదటి 10 ఓవర్లలో (దీన్నే తప్పనిసరి పవర్‌ప్లే అంటారు), ఫీల్డింగ్ జట్టు 30-గజాల సర్కిల్ వెలుపల గరిష్ఠంగా ఇద్దరు ఫీల్డర్‌లను మాత్రమే మోహరించవచ్చు. [10] దీనివలన పవర్‌ప్లే సమయంలో దాడి రకం ఫీల్డింగును మాత్రమే ఏర్పరడానికి అనుమతిస్తుంది.
- 11 - 40 ఓవర్ల మధ్య, 30-గజాల సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లను మాత్రమే మోహరించవచ్చు. ఈ రెండవ పవర్‌ప్లేలో దాడి లేదా సాధారణ ఫీల్డింగు పద్ధతులను ఎంచుకోవచ్చు. [11]
- చివరి 10 ఓవర్లలో 30-గజాల సర్కిల్ వెలుపల ఐదుగురు ఫీల్డర్లను మోహరించవచ్చు. [12] [13] మూడవ పవర్‌ప్లేలో మూడు రకాల ఫీల్డింగులనూ (దాడి, రక్షణ, సాధారణ ఫీల్డ్‌లు) ఉపయోగించవచ్చు.
మూడు పవర్‌ప్లేలను వరుసగా P1, P2, P3 అంటారు. సాధారణంగా ఆధునిక స్కోర్‌కార్డ్‌లలో వీటిని స్కోర్ పక్కనే చూపిస్తారు.
ODI హోదా కలిగిన జట్లు
ఏ జట్లకు ODI హోదా ఉండాలనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయిస్తుంది. అంటే ప్రామాణిక వన్డే నిబంధనల ప్రకారం అటువంటి రెండు జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్‌కైనా అధికారిక ODI హోదా ఉంటుంది.
శాశ్వత ODI హోదా
పన్నెండు టెస్ట్-ఆడే దేశాలు (ఇవి ICC లో పూర్తి సభ్యులు కూడా) శాశ్వత ODI హోదాను కలిగి ఉన్నాయి. పూర్తి ODI హోదాను పొందిన తర్వాత వివిధ దేశాలు ఆడిన తొలి ODI తేదీలను కింది జాబితాలో చూడవచ్చు. శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ODI అరంగేట్రం చేసిన సమయంలో అవి ICC లో అసోసియేట్ సభ్యులుగా ఉండేవి.
ఆస్ట్రేలియా ( 1971 జనవరి 5)
ఇంగ్లాండు ( 1971 జనవరి 5)
న్యూజీలాండ్ ( 1973 ఫిబ్రవరి 11)
పాకిస్తాన్ ( 1973 ఫిబ్రవరి 11)
వెస్ట్ ఇండీస్ ( 1973 సెప్టెంబరు 5)
India ( 1974 జూలై 13)
శ్రీలంక ( 1982 ఫిబ్రవరి 13)
దక్షిణాఫ్రికా ( 1991 నవంబరు 10)
జింబాబ్వే ( 1992 అక్టోబరు 25)
బంగ్లాదేశ్ ( 1997 అక్టోబరు 10)
ఆఫ్ఘనిస్తాన్ ( 2017 డిసెంబరు 5)
ఐర్లాండ్ ( 2017 డిసెంబరు 5)
తాత్కాలిక ODI హోదా
2005, 2017 మధ్య ICC మరో ఆరు జట్లకు (అసోసియేట్ సభ్యులుగా పిలుస్తారు) తాత్కాలిక ODI హోదాను మంజూరు చేసింది. 2017లో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లు టెస్ట్ హోదా (శాశ్వత ODI హోదా) కి పదోన్నతి పొందిన తర్వాత ఈ హోదా నాలుగు జట్లకు పరిమితమైంది. గతంలో ఐసీసీ, వన్డే హోదాను 16 జట్లకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. [14] ICC ప్రపంచ క్రికెట్ లీగ్ యొక్క చివరి ఈవెంట్ అయిన ICC ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో ప్రదర్శన ఆధారంగా నాలుగు సంవత్సరాల కాలానికి జట్లు ఈ తాత్కాలిక హోదాను పొందుతాయి. 2019లో, ICC తాత్కాలిక ODI హోదాను కలిగి ఉన్న జట్ల సంఖ్యను ఎనిమిదికి పెంచింది. కింది ఎనిమిది జట్లకు ప్రస్తుతం ఈ హోదా ఉంది. బ్రాకెట్లలో చూపినది తాత్కాలిక ODI హోదా పొందిన తర్వాత వారి మొదటి ODI మ్యాచ్ జరిగిన తేది.
స్కాట్‌లాండ్ ( 2006 జూన్ 27 నుండి 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయరు పోటీల వరకు)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( 2014 ఫిబ్రవరి 1 నుండి 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయరు పోటీల వరకు)
నేపాల్ ( 2018 ఆగస్టు 1 నుండి 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయరు పోటీల వరకు)
నెదర్లాండ్స్ ( 2018 ఆగస్టు 1 నుండి 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయరు పోటీల వరకు)
నమీబియా ( 2019 ఏప్రిల్ 27 నుండి 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయరు పోటీల వరకు)
ఒమన్ ( 2019 ఏప్రిల్ 27 నుండి 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయరు పోటీల వరకు)
పపువా న్యూగినియా ( 2019 ఏప్రిల్ 27 నుండి 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయరు పోటీల వరకు)
యు.ఎస్.ఏ ( 2019 ఏప్రిల్ 27 నుండి 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయరు పోటీల వరకు)
అదనంగా, ఎనిమిది జట్లు ఇంతకుముందు ఈ తాత్కాలిక ODI హోదా ఉండేది. టెస్ట్ హోదాకు పదోన్నతి పొందడం వలన గానీ, లేదా ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో బలహీన ప్రదర్శన కారణంగా గానీ వీటిని ఈ జాబితా లోంచి తొలగించారు.
కెన్యా ( 1997 అక్టోబరు 10 నుండి 2014 జనవరి 30 వరకు)
కెనడా ( 2006 మే 16 నుండి 2014 జనవరి 28 వరకు)
బెర్ముడా ( 2006 మే 17 నుండి 2009 ఏప్రిల్ 8 వరకు)
ఐర్లాండ్ ( 2006 జూన్ 13 నుండి 2017 మే 21 వరకు)
నెదర్లాండ్స్ ( 2006 జూలై 4 నుండి 2014 జనవరి 28 వరకు)
ఆఫ్ఘనిస్తాన్ ( 2009 ఏప్రిల్ 19 నుండి 2017 జూన్ 14)
హాంగ్‌కాంగ్ ( 2014 మే 1 నుండి 2018 మార్చి 17 వరకు)
పపువా న్యూగినియా ( 2014 నవంబరు 8 నుండి 2018 మార్చి 17 వరకు)
ICC అప్పుడప్పుడు అసోసియేట్ సభ్యులకు పూర్తి సభ్యత్వం, టెస్ట్ హోదా ఇవ్వకుండా శాశ్వత ODI హోదాను మంజూరు చేసింది. పూర్తి సభ్యత్వం లోకి అడుగు పెట్టడానికి ముందు అత్యుత్తమ అసోసియేట్ సభ్యులు అంతర్జాతీయంగా సాధారణ అనుభవాన్ని పొందేందుకు దీన్ని మొదట ప్రవేశపెట్టారు. మొదట బంగ్లాదేశ్, ఆ తర్వాత కెన్యా ఈ హోదాను అందుకున్నాయి. బంగ్లాదేశ్ అప్పటి నుండి టెస్ట్ హోదాను, పూర్తి సభ్యత్వాన్నీ పొందింది. కానీ వివాదాలు, పేలవమైన ప్రదర్శనల ఫలితంగా, 2005లో కెన్యా ODI స్థాయిని తాత్కాలికంగా తగ్గించారు. అంటే ODI హోదాను కొనసాగించాలంటే, ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్‌లో మంచి ప్రదర్శన చేయాల్సి వచ్చింది. 2014 క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ ఈవెంట్‌లో కెన్యా ఐదో స్థానంలో నిలిచిన తర్వాత వన్డే హోదాను కోల్పోయింది. [15]
ప్రత్యేక ODI హోదా
ICC కొన్ని హై-ప్రొఫైల్ టోర్నమెంట్‌లలోని అన్ని మ్యాచ్‌లకు ప్రత్యేక ODI హోదాను కూడా మంజూరు చేయగలదు. ఫలితంగా క్రింది దేశాలు కూడా పూర్తి ODIలలో పాల్గొన్నాయి. వీటిలో కొన్ని, ఆ తరువాత తాత్కాలిక లేదా శాశ్వత ODI హోదాను పొందాయి కూడా.
తూర్పు ఆఫ్రికా (1975 ప్రపంచ కప్)
శ్రీలంక (1975 ప్రపంచ కప్, 1979 ప్రపంచ కప్)
కెనడా (1979 ప్రపంచ కప్, 2003 ప్రపంచ కప్)
జింబాబ్వే (1983 ప్రపంచ కప్, 1987 ప్రపంచ కప్, 1992 ప్రపంచ కప్)
బంగ్లాదేశ్ (1986 Asia Cup, 1988 Asia Cup, 1990 Austral-Asia Cup, 1990 Asia Cup, 1995 Asia Cup, 1997 Asia Cup)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (1994 Austral-Asia Cup, 1996 ప్రపంచ కప్, 2004 Asia Cup and 2008 Asia Cup)
కెన్యా (1996 ప్రపంచ కప్, 1996 Sameer Cup)
నెదర్లాండ్స్ (1996 ప్రపంచ కప్, 2002 ICC Champions Trophy and 2003 ప్రపంచ కప్)
స్కాట్‌లాండ్ (1999 ప్రపంచ కప్)
నమీబియా (2003 ప్రపంచ కప్)
హాంగ్‌కాంగ్ (2004 Asia Cup, 2008 Asia Cup and 2018 Asia Cup)
యు.ఎస్.ఏ (2004 ICC Champions Trophy)
చివరగా, 2005 నుండి, మూడు మిశ్రమ జట్లు పూర్తి ODI హోదాతో మ్యాచ్‌లు ఆడాయి. ఈ మ్యాచ్‌లు:
- ది వరల్డ్ క్రికెట్ సునామీ అప్పీల్, 2004/05 సీజన్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ XI vs ICC వరల్డ్ XI మధ్య ఒకసారి జరిగిన మ్యాచ్.
- ఆఫ్రో-ఆసియా కప్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ XI, ఆఫ్రికా XI మధ్య 2005, 2007 ఆఫ్రో-ఆసియా కప్‌లలో రెండు మూడు-ODI సిరీస్‌లు ఆడారు.
- ICC సూపర్ సిరీస్, 2005/06 సీజన్‌లో ICC వరల్డ్ XI జట్టుకు, అప్పటి అగ్రశ్రేణి ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుకూ మధ్య జరిగిన మూడు-ODI ల సిరీస్.

ఇవి కూడా చూడండి
- ICC టెస్ట్ ఛాంపియన్‌షిప్
- ICC ODI ఛాంపియన్‌షిప్
- ICC T20I ఛాంపియన్‌షిప్
- పరిమిత ఓవర్ల క్రికెట్
- అంతర్జాతీయ వన్డే రికార్డులు
- వన్డే ఇంటర్నేషనల్ హ్యాట్రిక్స్
- 10000 కంటే ఎక్కువ వన్డే అంతర్జాతీయ క్రికెట్ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితా
- వన్డే అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ల జాబితా
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.