From Wikipedia, the free encyclopedia
స్టీఫెన్ ఆంథోనీ బక్నర్, OJ (జననం 1946 మే 31) జమైకాకు చెందిన మాజీ అంతర్జాతీయ క్రికెట్ అంపైర్.
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | స్టీఫెన్ ఆంథోనీ బక్నర్ |
పుట్టిన తేదీ | మాంటెగో బే, జమైకా | 1946 మే 31
ఎత్తు | 6 అ. 3 అం. (1.91 మీ.) |
అంపైరుగా | |
అంపైరింగు చేసిన టెస్టులు | 128 (1989–2009) |
అంపైరింగు చేసిన వన్డేలు | 181 (1989–2009) |
అంపైరింగు చేసిన ఫ.క్లా | 172 (1988–2009) |
అంపైరింగు చేసిన లిస్ట్ ఎ | 221 (1978–2009) |
మూలం: CricketArchive, 2013 జూన్ 15 |
బక్నర్ 1989 - 2009 మధ్య రికార్డు స్థాయిలో 128 టెస్ట్ మ్యాచ్‌లలో అంపైర్‌గా వ్యవహరించాడు. 1992 నుండి 2007 వరకు వరుసగా ఐదు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్స్‌తో సహా 181 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లకు అంపైర్ అయ్యాడు. క్రికెట్ అంపైర్ కాకముందు అతను హైస్కూల్లో లెక్కల మాస్టారుగానూ, ఫుట్‌బాల్ ఆటగాడిగానూ, రిఫరీగానూ చేసేవాడు. 2007 అక్టోబరులో "క్రీడా రంగంలో అందించిన అత్యుత్తమ సేవలకు" ఆర్డర్ ఆఫ్ జమైకా, కమాండర్ క్లాస్ గౌరవాన్ని అతను అందుకున్నాడు.[1]
బక్నర్ 1960లలో జమైకన్ పారిష్ లీగ్‌లలో గోల్‌కీపర్‌గా ఆడాడు. 1964లో స్కూల్బాయ్ ఇంటర్నేషనల్‌లో జమైకా వర్సెస్ బ్రెజిల్ జమైకా తరపున గోల్ ఆడాడు, జమైకా 1-1తో డ్రా చేసుకుంది. [2]
బక్నర్ 1988లో ఎల్ సాల్వడార్కీ, నెదర్లాండ్స్కీ యాంటిల్స్ మధ్య జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో ఫిఫా రిఫరీగా వ్యవహరించాడు.[3]
అంపైర్‌గా బక్నర్ మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 1989 మార్చి 18న ఆంటిగ్వాలో వెస్టిండీస్‌కీ, భారతదేశానికి మధ్య జరిగిన వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్. అతని మొదటి టెస్ట్ మ్యాచ్ జమైకాలోని కింగ్స్టన్లోని సబీనా పార్క్‌లో 1989 ఏప్రిల్ 28 - మే 3 మధ్య జరిగింది, ఇది కూడా వెస్టిండీస్, భారతదేశం మధ్య జరిగిన ఆటే. కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లలో అంపైరింగ్ చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన 1992 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో అంపైర్‌గా ఎంపికయ్యాడు. పెద్దగా అనుభవం లేకపోయినా ఫైనల్‌కి అంపైరింగ్ చేసే అవకాశం దక్కింది.[4] బక్నర్ దీని తర్వాత వరుసగా 1996, 1999, 2003, 2007ల్లో నాలుగు ప్రపంచ కప్ ఫైనల్స్‌లోనూ అంపైర్‌గా వ్యవహరించాడు. 2007 ప్రపంచ కప్ అతని స్వస్థలమైన వెస్టిండీస్‌లో జరిగింది.[3]
1994లో ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో అంపైర్లలో ఒకరు పోటీలో ఉన్న దేశాలకు చెందని అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్ నుండి ఎంపిక చేయబడిన వ్యక్తి అయివుండాలన్న విధానాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రవేశపెట్టింది. బక్నర్ ఈ ప్యానెల్‌ని స్థాపించిన నాటి నుంచి 2002లో ఐసీసీ తిరిగి అంపైర్లపై తన విధానాన్ని మార్చేంతవరకూ వరకు సభ్యునిగా కొనసాగాడు. అప్పటి నుండి టెస్ట్ మ్యాచ్‌లలో ఇద్దరు అంపైర్లూ, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో కనీసం ఒకరు ఒక అంపైర్లు పోటీపడుతున్న దేశాలకు సంబంధం లేని స్వతంత్ర వ్యక్తి ఉండేలా నియమాలు మారాయి. ఆ తర్వాత ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానెల్ నుండి మ్యాచ్ నిర్వహించడానికి అధికారులను ఎంపిక చేయడం ప్రారంభమైంది. ఇందులో ఐసీసీ ప్రపంచంలో అత్యుత్తమ అంపైర్లుగా భావించేవారే ఉంటారు. ఎలైట్ ప్యానెల్ ప్రారంభమైన నాటి నుంచి తాను పదవీ విరమణ చేసేదాకా అందులో బక్నర్ స్థానం కొనసాగింది
2006 మేలో అంపైర్లు తప్పులు చేస్తున్నట్టు, కీలక ఆటగాళ్ల అంచనాలే సరైనవన్నట్టు టీవీ కంపెనీలు టెక్నాలజీని ఉపయోగించుకుని తమపై ప్రేక్షకులకు దురభిప్రాయం కలిగిస్తున్నాయని అతను ఆరోపించాడు.[5] 2005-06 మధ్యకాలంలో బక్నర్ అంపైరింగ్ ఖచ్చితత్వం 96% ఉందని, ఎలైట్ ప్యానెల్ సగటు 94.8% కన్నా ఎక్కువగా ఉందని ఐసీసీ క్రికెట్ జనరల్ మేనేజర్ డేవ్ రిచర్డ్సన్ అన్నాడు. ఇంత బాగా చేసినప్పటికీ, ఒకటి రెండు కీలకమైన తప్పుడు నిర్ణయాలు బక్నర్ తీసుకోకపోలేదని, అందువల్ల టెక్నాలజీ ఉన్నది అధికారులకు సాయం చేయడానికే తప్ప అడ్డుపడడానికి కాదని సూచించాడు.[6] 2007 ప్రపంచ కప్ ఫైనల్లో అతనితో సహా ఐదుగురు అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా ఆట సరైన వెలుతురు లేని స్థితిలో కొనసాగింది.[7] దీని ఫలితంగా దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ ఛాంపియన్షిప్ నుంచి మొత్తం ఈ ఐదుగురు అధికారులు సస్పెన్షన్ పాలయ్యారు.[8]2007లో అతను ఐసీసీ వారు అందించే అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం షార్ట్-లిస్ట్ అయినా, చివరికి ఆ పురస్కారాన్ని సైమన్ టౌఫెల్ గెలుచుకున్నాడు.[9] 2008 జనవరిలో సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో బక్నర్ తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాల కారణంగా భారత్ ఓటమి పాలైంది. దీనితో పెర్త్‌లో ఆస్ట్రేలియాకి, భారతదేశానికి మధ్య జరిగిన మూడవ టెస్ట్‌లో అధికారికంగా ఐసీసీ అతన్ని తొలగించి బిల్లీ బౌడన్ని అంపైర్‌గా నియమించింది. అధికారికంగా మాత్రం ఐసీసీ ఈ మార్పు భారత జట్టు ఆరోపణల వల్ల జరగలేదని అధికారిక స్టాండ్ తీసుకుంది.[10] మాజీ అంపైర్ డిక్కీ బర్డ్ వ్యాఖ్యానిస్తూ బక్నర్ "మరీ ఎక్కువ కాలం కొనసాగాడు" అంటూ అతను రిటైర్ అవడం మంచిదని సూచించాడు,[11] అయితే బక్నర్ మాత్రం తన తొలగింపు వెనుక భారత క్రికెట్ బోర్డు బీసీసీఐకి ఉన్న ఆర్థిక శక్తే కారణమని నిందించాడు.[12].
తన కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే భారత స్టార్ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ ఆట విషయంలో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు స్టీవ్ బక్నర్ 2008లో గుర్తుచేసుకున్నాడు.[13] 2009 మార్చిలో అంపైరింగ్ నుండి రిటైర్ అవ్వాలని బక్నర్ నిర్ణయించుకున్నట్లు ఫిబ్రవరిలో ఐసీసీ ధ్రువీకరించింది. 2023 మార్చి 19-23 తేదీల మధ్య కేప్ టౌన్లో దక్షిణాఫ్రికాకి, ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన 3వ టెస్ట్ అతనికి చివరి టెస్ట్గానూ, మార్చి 29న బార్బడోస్‌లో అతని స్వస్థలమైన వెస్టిండీస్‌కీ, ఇంగ్లాండ్‌కీ మధ్య జరిగిన 4వ వన్డే ఇంటర్నేషనల్ అతనికి ఆఖరి వన్డేగానూ నిలిచింది. అలా అధికారిగా అతని 20 సంవత్సరాల కెరీర్ ముగిసింది.[14]
బక్నర్ ఐదు ప్రపంచ కప్ టోర్నమెంట్లలో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు. అలాగే, అతను ఐదు ఫైనల్ మ్యాచ్‌లతో సహా 44 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు.[3]
బక్నర్ వందకి పైగా టెస్టు మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన మొట్టమొదటి అంపైర్‌గా రికార్డు సృష్టించాడు.[3] అది కాక, అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన వ్యక్తిగా బక్నర్ సృష్టించిన ప్రపంచ రికార్డు అతను రిటైరైన దశాబ్ది పైచిలుకు కాలం వరకూ నిలిచింది. పాకిస్తాన్‌కు చెందిన అలీమ్ దార్ 2019 డిసెంబరులో తన 129వ టెస్ట్ మ్యాచ్‌లో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా నిలిచి అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లకు అంపైర్‌గా కొత్త రికార్డు నెలకొల్పేదాకా బక్నర్ సృష్టించిన రికార్డే కొనసాగింది.[15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.