Remove ads
సినీ నటుడు From Wikipedia, the free encyclopedia
ఎస్. వి. రంగారావు (సామర్ల వెంకట రంగారావు) (1918 - 1974) ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత.[1] కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం అతనుకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక, అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు. 1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ (1975).[2]
యస్.వి. రంగారావు | |
---|---|
జననం | సామర్ల వెంకట రంగారావు 1918 జూలై 3 |
మరణం | 1974 జూలై 18 56) మదరాసు | (వయసు
మరణ కారణం | గుండెపోటు |
ఇతర పేర్లు | ఎస్వీయార్, నట యశస్వి, నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి |
విద్య | డిగ్రీ |
విద్యాసంస్థ | హిందూ కాలేజ్ |
వృత్తి | అగ్నిమాపక శాఖ ఉన్నతోద్యోగి, నటుడు, దర్శకుడు, రచయిత |
పిల్లలు | విజయ, ప్రమీల, కోటేశ్వరరావు |
తల్లిదండ్రులు |
|
ఎస్వీ రంగారావు కృష్ణా జిల్లా లోని నూజివీడులో, 1918 జూలై 3 వ తేదీన తెలగ నాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు. తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టాడు కోటీశ్వర నాయుడు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశాడు. మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు, న్యాయ శాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. ఆయనకు వృత్తి రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. ఈమె భర్త మరణానంతరం మనుమలు, మనుమరాళ్ళతో సహా మద్రాసుకు మారింది. రంగారావు హైస్కూలు చదువు అక్కడే సాగింది. మద్రాసు హిందూ హైస్కూలులో తన పదిహేనవ ఏట మొదటి సారిగా నాటకంలో నటించారు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో అతనులో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశం ఉండేది. 1936 లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో రంగారావు బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు. వాటిని విశ్లేషించేవారు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన లవకుశ. మద్రాసులో ఎస్. ఎస్. ఎల్. సి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాలలోనూ, బి. ఎస్. సి కాకినాడలోని పి. ఆర్. కళాశాలలోనూ పూర్తి చేశారు. మద్రాసులో చదువులో అంతంతమాత్రంగా ఉన్న రంగారావు కాకినాడ, విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు. ఇంటర్ పరీక్షకు 45 మంది హాజరయితే అందులో రంగారావు ఒక్కడే ఉత్తీర్ణుడు కావడం విశేషం.
ఏలూరులో ఉన్న రంగారావు మేనమామ బడేటి వెంకటరామయ్య మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు నాయనమ్మ తన మకాంను మద్రాసు నుంచి ఏలూరుకు మార్చింది. తమ ఇంట్లో ఎవరూ కళాకారులు లేరు. అందువల్ల అతను బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ళ కోరిక. కానీ రంగారావుకు మాత్రం నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలి పెట్టలేదు. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. అతనుకు ఇక్కడ అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది.
నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతననం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు. రంగారావుకు ఇంగ్లీషు మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటకాలు వేస్తూనే బి. ఎస్. సి పూర్తి చేశారు. తర్వాత ఎం. ఎస్. సి చేయాలనుకున్నారు. కానీ అగ్నిమాపక దళంలో పని చేసే చొలెనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తర్వాత మొదట బందరులో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసరుగా పనిచేశారు. ఈ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఉద్యోగ స్వభావ రీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలులేదు. తాను కళకు దూరం అవుతున్నేనేమో నని భావించిన రంగారావు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశారు.
అతను నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనుకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జానికి వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.[3] కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో అతనుకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరారు.[4] జంషెడ్పూర్ లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు. వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా అతను వేషాలు వేసేవారు. అదే సమయంలో అతను వివాహం కూడా జరిగింది.
కొద్ది రోజుల తర్వాత బి. ఎ. సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది. అదే సమయంలో రంగారావు తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం ఎ. వి. సుబ్బారావుకు ఇచ్చేశారు. బి. ఎ. సుబ్బారావుకు రంగారావుతో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్నపాత్ర దక్కింది. తర్వాత ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం, పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యంలేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహ పడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగాడు.
అప్పుడే నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావుకిచ్చారు. ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు కెరీర్ కు గట్టి పునాది పడింది. తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి (1951) సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావుకిచ్చారు. కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో రంగారావుకి మంచి పేరు వచ్చింది.
1952లో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్ళి చేసి చూడు సినిమాను తమిళంలో కల్యాణం పణ్ణి పార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు. తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు తమిళంలో కూడా చేశారు. తర్వాత అన్నై, శారద, కర్పగం, నానుం ఒరుపెణ్ వంటి తమిళ చిత్రాలలో నటించి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయనటుడిగా పేరు గాంచారు. తెలుగులో ఘనవిజయం సాధించిన పాతాళ భైరవి సినిమాని జెమిని అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు మాంత్రికుని పాత్ర పోషించారు. హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాత వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై భీ లడ్కీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూకైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, విదయాగలే ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించారు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతను్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవములో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. కొన్ని చిత్రాలకు అతను దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతి అందుకున్నది. నటి లక్ష్మి ఈ చిత్రంతోనే సినీ రంగంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు.
మొదటి సినిమా వైఫల్యం తర్వాత మళ్ళీ అవకాశాలు దొరక్కపోవడంతో సినీ రంగం మీద ఆశలు వదిలేసుకున్న రంగారావు జంషెడ్పూర్ లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇదే సమయంలో అతని మేనమామ బడేటి వెంకటరామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని 1947 డిసెంబరు 27న వివాహం చేసుకున్నారు. సినిమా అవకాశాలు అంతగా లేని రోజుల్లో అతని భార్య అతనిమీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేది. ఆమెకు ఇష్టమొచ్చినప్పుడు తిరిగి రమ్మనీ, తమకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చేవారు.[4] వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలు సహనటులతో చర్చించడానికి ఇష్టపడేవాడు కాదు. మనసు బాగాలేనప్పుడు తన ఫాం హౌస్ లోకి వెళ్ళిపోయేవారు. దర్శక నిర్మాతలే అతడిని వెతుక్కుంటే వెళ్ళేవారు. అతని ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వరరావు. కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలనుకుని కొంత చిత్రీకరణ కూడా జరిగింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా కొనసాగలేదు.
యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. అతని ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు. పెంపుడు జంతువులంటే రంగారావుకిష్టం. వాళ్ళ ఇంటిలో జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కలుండేవి. వేట అంటే కూడా అతనుకు ఆసక్తి ఉండేది. కానీ కొద్దికాలం తర్వాత ఆ అలవాటు మానేశారు. ఆంగ్ల చిత్రాల్లో నటించలని అతనుకు కోరికగా ఉన్నా అలాంటి అవకాశం రాలేదు. విదేశాల్లో సైతం గుర్తింపు లభించినా స్వదేశంలో మాత్రం తనకు సరైన గుర్తింపు లేదని అతనుకు కొరతగా ఉండేది.[1]
రంగారావు.. వంటి మహానటులు ఆంధ్రదేశంలో పుట్టటము వారి దురదృష్టము అనిపిస్తుంది. ఏ పాశ్చాత్య దేశాలలోనో వీరు పుట్టి ఈ ప్రతిభ చూపివుంటే ఆదేశ ప్రజలు, ప్రభుత్వాలూ వీరినెంత పైకి ఎత్తివుండేవో, ఎన్ని గౌరవాలు వీరికి లభించివుండేవో, ప్రపంచమహానటుల స్థాయి వీరికి దక్కి వీరికి ఇంకా ఎంత పేరు వచ్చివుండేదో ననిపించక మానదు.
- శిష్టా ఆంజనేయశాస్త్రి[5]
ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, పాలకొల్లు, సామర్లకోట, పెనుగొండ, అనకాపల్లి లాంటి ఊర్లలో అతనుకు సన్మానాలు జరిగాయి. జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, ఆంధ్రా ఫిల్మ్ జర్నలిస్టు సంఘం వారు, దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి, మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు. అన్నై, శారద, నానుం ఒరుపెణ్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతులమీదుగా పారితోషికం స్వీకరించారు.
ఇతను నటించిన బంగారుపాప (1955) అనే చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసిన చార్లీ చాప్లిన్ ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించేవాడని అన్నారు. ఇలియట్ రాసిన సైలాస్ మార్నర్ అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం.[6] ప్రముఖ నటుడు గుమ్మడి ఆయనను ప్రశంసిస్తూ ఇలా అన్నారు. రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ ఆయనకు దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదుమంది ఉత్తమ నటుల్లో ఒకడయ్యుండే వారు.[7] తెలుగు చలనచిత్రంలో గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నా అతను చనిపోయినప్పుడు కనీసం ఒకరోజైనా సంతాపంగా థియేటర్లు మూసివేయడమో, మరేదైనా గౌరవమో ఇవ్వలేదంటూ అభిమానులు బాధపడ్డారు.[8]
1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోద కృష్ణ (1975). యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ లోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు.[9]
రంగారావు శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షతన 2018 జూలై 3లో హైదరాబాదులో జరిగాయి.[10] ఈ ఉత్సవాలను 2018 జూలై 3 నుంచి జూలై 8 వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, సారథి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి.[11] 2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.[12][13]
2013 లో భారత తపాలాశాఖ భారత చలనచిత్ర పరిశ్రమ శతవార్షికోత్సవాల సందర్భంగా ఎస్ వి రంగారావుచిత్రంతో తపాలా బిళ్ల విడుదల చేసింది.
రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన నటుడు. సహజ నటుడిగా పేరుగాంచారు.[14] రంగారావుకు తొలినాళ్ళలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తనా విధానాన్ని అనుకరించారు. సంతానం చిత్రంలో అతను పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ళు పాటు అంధుల ప్రవర్తనను గమనించారు. మాంత్రికుడి పాత్ర కూడా అతను పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు గనక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు.
రంగారావు యుముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఆయన నటనను అభినందించారు. వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడురు. రౌడీ పాత్రల్లో నటించేటపుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే, డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు. అతను కళ్ళు, కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలచేవారు.
సతీ సావిత్రి, దేవాంతకుడు లాంటి సినిమాల్లో ఆయనక పోషించిన యముని పాత్ర దానికి ఒక ప్రత్యేకతను సాధించి పెట్టింది. 1970 వరకు యముని పాత్ర అంటే అతనే గుర్తుకు వచ్చేవారు. తర్వాత ఇలాంటి పాత్రలు కైకాల సత్యనారాయణ పోషించడం ప్రారంభించారు. సాంఘిక చిత్రాల్లో ఆయన ఎక్కువగా కుటుంబ పాత్రలు పోషించారు. మాయాబజార్ సినిమాలో ఆయన పోషించిన ఘటోత్కచుడి పాత్ర పెద్దలకే కాక పిల్లలను కూడా ఆకట్టుకుంది.[15] రంగారావుకు పేరు తెచ్చిన పాత్రలు కొన్ని:
|
|
ఎస్.వి.రంగారావు నటుడిగానే కాక కథా రచయితగా కూడా రాణించాడు.[16] ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి. "వేట", "ఆగష్టు 8", "పసుపు కుంకుమ", "ప్రాయశ్చిత్తం", "విడుదల", "సంక్రాంతికి", "సులోచన" అనే ఏడు కథలు మాత్రం లభ్యమౌతున్నాయి. ఇటీవల ఈ కథలతో ఎస్.వి.రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.