లక్ష్మి (నటి)
సినీ నటి From Wikipedia, the free encyclopedia
లక్ష్మి దక్షిణ భారతీయ నటీమణి. ఈమె సినిమా రంగానికి చెందిన వై.వి.రావు, వై.రుక్మిణిల పుత్రిక. లక్ష్మి తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1952, డిసెంబరు 13 న మద్రాసులో జన్మించింది.
సినిమా వ్యాసంగం
లక్ష్మి 1975లో విజయవంతమైన హిందీ చిత్రం జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది. ఆ సినిమాలో తన నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నది.[1]
ఈమె తండ్రి వై.వి.రావు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు సినీ దర్శకుడూ, నటుడూ. ఈయన అనేక సాంఘిక విషయాలపై సినిమాలను నిర్మించాడు.[2] ఈమె తల్లి రుక్మిణి తమిళ నటి. అమ్మమ్మ నుంగబాక్కం జానకి కూడా నటే. కళాకారుల కుటుంబంలో జన్మించిన లక్ష్మి మూడవ తరము నటి. 15 యేళ్ల వయసులోనే సినీరంగంలో ప్రవేశించింది. ఈమె తొలి సినిమా 1968 లో విడుదలైన తమిళ సినిమా "జీవనాంశమ్". 1970వ దశకంలో తారగా వెలుగొందిన లక్ష్మి దక్షిణ భారత భాషలన్నింటిలో నటించింది. ఈమె నటించిన మలయాళంలో విజయవంతమైన చట్టకారి (1974) చిత్రాన్ని హిందీలో జూలీ (1975) అనే పేరుతో, తెలుగులో "మిస్ జూలీ ప్రేమకథ" (1975) గా పునర్నిర్మించి విడుదల చేశారు. జూలీ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు బెంగాళీ సినీ పాత్రికేయ సంఘం యొక్క "సంవత్సరపు ఉత్కృష్ట నటన" పురస్కారాన్ని అందుకున్నది. [3] జూలీ చిత్రం యొక్క విజయం తర్వాత లక్ష్మి మరే హిందీ చిత్రంలోనూ నటించక దక్షిణాది భాషల సినిమాలపైనే దృష్టిపెట్టింది. 1977లో విడుదలైన తమిళ సినిమా శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ లో నటనకు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకొని ఆ పురస్కారం తమిళ సినిమాకై అందుకొన్న దక్షిణాదికి చెందిన తొలి నటి అయ్యింది. 1980లలో కథానాయకి పాత్రలు కరువైన తరుణంలో తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలలో సహాయనటిగా చేయటం ప్రారంభించింది. జీన్స్ (1998) చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బామ్మ గానూ, హల్‌చల్ (2004) లో కరీనా కపూర్ బామ్మగానూ నటించింది. 400కు పైగా సినిమాలు చేసిన లక్ష్మి, రాజకీయాలలో కూడా అడుగుపెట్టింది.
వ్యక్తిగత జీవితము
ఈవిడ మూడుసార్లు వివాహము చేసుకున్నది. పదిహేడేళ్ళపుడు పెద్దలు కుదిర్చిన సంబంధము ద్వారా భాస్కర్‌ను వివాహం చేసుకుంది. ఇతను ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసేవాడు. ఇతని ద్వారా 1971 లో కుమార్తె ఐశ్వర్య జన్మించింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత తన సహనటుడు మోహన్‌ను పెళ్ళి చేసుకుంది. వీరిద్దరూ కూడా త్వరలోనే విడిపోయారు. తర్వాత నటుడు, దర్శకుడు అయిన శివచంద్రన్‌ని పెళ్ళాడింది. కన్నడ నటుడు అనంత్ నాగ్‌తో కూడా కొద్దికాలం సన్నిహితంగా మెలిగింది.
నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)
తెలుగు
- పెళ్ళి కానుక (1998)
- ఆరో ప్రాణం (1997)
- అల్లుడా మజాకా (1995)
- ప్రాణదాత (1993)
- దోషి (1992)
- ఉదయగీతం (1985)
- పోరాటం (1983)
- చట్టానికి కళ్ళు లేవు (1981)
- కోరుకున్న మొగుడు (1982)
- నే నిన్ను మరువలేను (1979)
- మల్లెపువ్వు(1978)
- పంతులమ్మ (1977)
- బంగారు మనిషి (1976)
- శృంగార లీల (1976)
- జీవనతరంగాలు (1973)
- పల్లెటూరి బావ (1973)
- కొడుకు కోడలు (1972)
- మురారి (2001)
- లాహిరి లాహిరి లాహిరిలో (2002)
- మిథునం(2012)
- మూడు ముక్కల్లో చెప్పాలంటే (2015)
పురస్కారాలు
- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ప్రత్యేక బహుమతి (మిథునం)[4][5][6][7]
- సైమా అవార్డులు: 2019 ఉత్తమ సహాయనటి: ఓబేబి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.