Remove ads
రంగస్థల నటుడు, న్యాయవాది From Wikipedia, the free encyclopedia
బళ్ళారి రాఘవ (ఆగష్టు 2, 1880 - ఏప్రిల్ 16, 1946) తెలుగు నాటకరంగ ప్రముఖులు. ప్రముఖ న్యాయవాది అయినా నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభతో రాణించాడు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం వెచ్చించిన ఈయన 1946, ఏప్రిల్ 16 న మరణించాడు.
బళ్ళారి రాఘవ | |
---|---|
జననం | తాడిపత్రి రాఘవాచార్లు ఆగష్టు 2, 1880 తాడిపత్రి, అనంతపురం జిల్లా |
మరణం | ఏప్రిల్ 16, 1946 |
వృత్తి | న్యాయవాది, రంగస్థల నటుడు |
పదవి పేరు | రావు బహుద్దూర్ |
భార్య / భర్త | కృష్ణమ్మ |
తండ్రి | నరసింహాచారి |
తల్లి | శేషమ్మ |
బళ్ళారి రాఘవ 1880 ఆగస్టు 2న అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించాడు.[1] అతని పూర్తిపేరు తాడిపత్రి రాఘవాచార్యులు. తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ. రాఘవ తల్లిదండ్రులకు లేకలేక పుట్టిన బిడ్డ. అతను పుట్టకముందు బళ్ళారిలోని బసప్ప అన్న ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు తీసుకున్నారు. ఆ వెంటనే పుట్టిన బిడ్డ కావడంతో రాఘవకు మొదట బసప్ప అన్న పేరు పెట్టారు. క్రమేపీ వైష్ణవ సంప్రదాయానుసారం రాఘవాచార్యులున్న పేరు స్థిరపరిచారు. వారిది శ్రీవైష్ణవ శాఖకు చెందిన బ్రాహ్మణ కుటుంబం. తండ్రి తాడిపత్రి పురపాలక సంఘ పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసేవాడు. ఆంధ్ర నాటక పితామహునిగా పేరొందిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాఘవకు స్వయానా మేనమామ.[2]
రాఘవ ప్రాథమిక విద్య పూర్తిచేసి, ఎనిమిదవ యేట బళ్ళారిలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి మొదలుపెట్టాడు. పద్నాలుగవ యేట మెట్రిక్యూలేషన్ పూర్తిచేశాడు. తర్వాత బళ్ళారిలోని వార్డ్ లా కళాశాలలో ఎఫ్.ఎ., మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ. పూర్తిచేశాడు. బళ్ళారి తిరిగివచ్చి కొంతకాలం పాటు ఉపాధ్యాయునిగా, ఇంజనీరింగ్ గుమాస్తాగా పనిచేశాడు. తిరిగి మద్రాసులో లా కాలేజీలో న్యాయవిద్య అభ్యసించి బి.ఎల్. పట్టా అందుకున్నాడు.[3]
రాఘవకు బాల్యం నుంచే నటనలో, నాటకాల్లో ఆసక్తి ఉండేది. అది మరింత వికసించి మద్రాసులో చదివే రోజుల్లో అనేక నాటకాల్లో నటించి అనుభవం గడించేలా ఉపకరించింది.
కర్నూలుకు చెందిన లక్షమణాచారి గారి కూతురు కృష్ణమ్మతో వివాహము జరిగింది. బళ్ళారి ఉన్నత పాఠశాల చేరి మెట్రక్ పూర్తి చేసి, మద్రాసులోని క్రిష్టియన్ కాలేజీలో న్యాయశాస్త్రం చదవడానికి చేరాడు. న్యాయశాస్త్రంలో 1905లో ఉత్తీర్ణత పొందాక, మద్రాసులో న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు.
కొద్దికాలంలోనే రాఘవ న్యాయవాదిగా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో, ప్రసిద్ధి చెందాడు. ధనికుడయ్యాడు. ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. "రావు బహద్దూర్" అన్న బిరుదు కూడా ఇచ్చింది.
కానీ ఆయనకు నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభ ఉన్నాయి. బళ్ళారి రాఘవ నాటక ప్రదర్శనను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి అని అప్పట్లో కళాప్రియులు చెప్పుకొనేవారు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం ధారాళంగా వెచ్చించాడు. 1946, ఏప్రిల్ 16 న రాఘవ మరణించాడు.
చిన్నతనంనుండి రాఘవకు నాటకరంగంపై ఆసక్తి ఉండేది. ఆయన మేనమామ ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాఘవను ప్రోత్సహించాడు. 12వ యేట మొదటిసారి రంగస్థలంపై నటించాడు. బళ్ళారిలో షేక్స్‌పియర్ క్లబ్ స్థాపించి, తద్వారా షేక్స్‌పియర్ నాటకాలు ప్రదర్శించేవాడు. బెంగళూరులో కోలాచలం శ్రీనివాసరావు నడిపే 'సుమనోహర' అనే సంఘం ప్రదర్శించే నాటకాలలో ప్రధాన పాత్రలను ఎక్కువగా బళ్ళారి రాఘవ పోషించేవాడు.
హావభావ ప్రకటనలోను, డైలాగులు చెప్పడంలోను రాఘవ అసమానుడనిపించుకొన్నాడు. విదూషక పాత్ర అయినా, మహారాజు పాత్రయినా రాఘవ అవలీలగా పోషించేవాడు. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషలన్నింటిలోనూ రాఘవ ప్రదర్శనలిచ్చాడు.
హరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, బృహన్నల, రామరాజు చరిత్ర, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు - ఇవి ఆయనకు బాగా పేరు తెచ్చిన నాటకాలు. బళ్ళారి రాఘవ శ్రీలంక, ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు పర్యటించి భారతీయ నాటకాలు, కళలగురించి ఉపన్యాసాలు, సెమినార్లు ఇచ్చాడు. 1927లో ఇంగ్లాండులో లారెన్స్ ఆలివర్, ఛార్లెస్ లాటన్ ప్రభృతులతో కలిసి ప్రదర్శనలిచ్చాడు. అమెరికా, రష్యా వంటి దేశాలనుండి కూడా ఆహ్వానాలు అందినాయి గాని ఆయన వెళ్ళలేకపోయాడు.
సామాన్య ప్రేక్షకులు, కళాప్రియులు, ప్రముఖులు కూడా బళ్ళారి రాఘవ నాటకాలను బహువిధాలుగా ఆదరించారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాధ టాగూరు, జార్జి బెర్నార్డ్ షా వంటివారు రాఘవ నాటకాలను ప్రశంసించారు. 1930లో మద్రాసులో రాజమన్నారు రచించిన "తప్పెవరిది?" నాటక ప్రదర్శనం తెలుగు నాటకరంగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెబుతారు.
స్త్రీలను నాటకాలలో పాల్గొనడానికి రాఘవ ప్రోత్సహించాడు. (ఈ విషయమై అప్పుడు వివిధ వేదికలలోనూ, పత్రికలలోనూ చాలా చర్చ జరిగింది). కొప్పరపు సరోజిని, కొమ్మూరి పద్మావతి, కాకినాడ అన్నపూర్ణ వంటి స్త్రీలు ఆయన నాటకాలలో నటనను ప్రారంభించి తరువాత ప్రసిద్ధ రంగస్థలనటీమణులయ్యారు. కె.ఎస్.వాసుదేవరావు, బసవరాజు అప్పారావు, బందా కనకలింగేశ్వరరావు వంటి వారు కూడా బళ్ళారి రాఘవ శిష్యులే.
పౌరాణిక నాటకాలలో తారస్థాయిని చేరుకొన్న పద్యాల వినియోగం తెలుగు నాటకాల్లో కాస్త తగ్గించాలనీ, సహజ నటనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనీ రాఘవ వాదించేవాడు. ఇంకా సాంఘిక ప్రయోజనాలకు కూడా నాటకాలలో మరింత ప్రోత్సాహం ఇవ్వాలనేవాడు.
1919 జనవరిలో బెంగుళూరులో జరిగిన ఫెస్టివల్ ఆప్ పైన్ ఆర్ట్ లో రఘవ పఠాన్ రుస్తుంగా ప్రదర్శించిన అభినయాన్ని రవీంద్ర నాథ్ టాగూర్ ఎంతగానో మెచ్చుకున్నారు.
1927 గాంధిజీ బెంగుళూరు సమీపంలోని నందీ హిల్స్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పండిత్ తారానాథ్ (రాఘవ ఆధ్యాత్మిక గురువు) రచించిన హిందీ నాటకం 'దీన బంధు కభీర్ ' నాటకాన్ని చూడ వలసిదిగ, గాంధీజీని బెంగుళూరుకు ఆహ్వానించారు. కొన్ని నిముషాల చూద్దామను కొన్నాడు గాంధీజీ. గంట అయినా నాటకాన్ని చూస్తూనె వున్నాడు గాంధీజీ. కార్య దర్శిగా వుండిన రాజాజి, 'ప్రార్థనకు వేళైంది ' అని గుర్తు చేశాడు. "మనం ప్రార్థనలోనే వున్నాం కదా?" అంటూ గాంధీజీ రాఘవ నటన అద్భుతం అన్నాడు. రాఘవ మహరాజ్ కీ జై అన్నాడు గాంధీజీ.
1921 -24 మధ్య రాఘవ ఆంధ్ర ప్రాంతంలోని పలు నగరాలలో ప్రదర్శనలిచ్చాడు.. 1927 లో రంగూన్ లో కూడా ప్రదర్శనలిచ్చి పేరు గాంచారు.
1928 మే 8 న రాఘవ ఇంగ్లాండుకు బయలు దేరాడు. లండన్లో పెక్కు నాటకాలను చూచి, ఆంగ్ల నటుల పరిచయం సంపాదించు కొన్నాడు. విఖ్యాత నాటక కర్త, కళావిమర్శకుడు జార్జి బెర్నార్డ్ షాతో రాఘవ కళల గురించి విశ్లేషణ జరిపాడు. కళల గురించి తెలుసు కోవడానికి మీరు ఇక్కడి కెందుకు వచ్చారు? మేమే ప్రాచ్య దేశాలకు రావాలి. అన్నాడు షా. "మీరు దురదృష్టం కొద్ది భార దేశలో పుట్టారు. ఇంగ్లాండులో పుట్టి వుంటే షేక్సియర్ అంత గొప్ప వరై వుండే వారు అన్నాడు. ఆయన స్మృత్యర్ధం 'బళ్ళారి రాఘవ పురస్కారం' స్థాపించబడింది.
నాటకము | రచయిత | పాత్ర |
---|---|---|
సునందిని | కోలాచలం శ్రీనివాసరావు | దుష్టబుద్ధి |
చాంద్ బీబీ | కోలాచలం శ్రీనివాసరావు | ఉస్మాన్ ఖాన్ |
విజయనగర పతనము | కోలాచలం శ్రీనివాసరావు | పఠాన్ రుస్తుం |
భారత యుద్ధము | కోలాచలం శ్రీనివాసరావు | దుర్యోధన |
హరిశ్చంద్ర | కోలాచలం శ్రీనివాసరావు | హరిశ్చంద్ర |
రామదాసు | ధర్మవరం గోపాలాచార్యులు | రామదాసు |
సుభద్ర | ధర్మవరం గోపాలాచార్యులు | అర్జున |
సారంగధర | ధర్మవరం రామకృష్ణమాచార్యులు | సారంగధర |
పాదుకాపట్టాభిషేకము | ధర్మవరం రామకృష్ణమాచార్యులు | దశరథ |
ప్రమీళార్జునీయం | ధర్మవరం రామకృష్ణమాచార్యులు | అర్జున |
సావిత్రి | ధర్మవరం రామకృష్ణమాచార్యులు | యముడు |
ప్రహ్లాద | ధర్మవరం రామకృష్ణమాచార్యులు | హిరణ్యకశిపుడు |
విరాటపర్వము | ధర్మవరం రామకృష్ణమాచార్యులు | కీచకుడు |
చిత్రనళీయము | ధర్మవరం రామకృష్ణమాచార్యులు | నలుడు |
పాంచాలీ స్వయంవరము | ధర్మవరం రామకృష్ణమాచార్యులు | అర్జున |
ప్రతాపరుద్రీయము | ధర్మవరం రామకృష్ణమాచార్యులు | ప్రతాపరుద్రుడు |
తప్పెవరిది? | పి.వి.రాజమన్నార్ | భీమసేనరావు |
సరిపడని సంగతులు | బళ్ళారి రాఘవ | శ్రీధరుడు |
రాణా ప్రతాపసింహ | ధ్విజేంద్రలాల్ రాయ్ | రక్తసింహుడు |
దుర్గాదాసు | ధ్విజేంద్రలాల్ రాయ్ | దుర్గాదాసు |
రాఘవ మిత్రులు వత్తిడిపై 1936 ఇనిమా రంగంలో ప్రవేశించాడు. హెచ్.ఎం. రెడ్డిగారి 'ద్రౌపదీ మాన సంరక్షణము ' లో దుర్యోధనుడుగా నటించారు. గూడ వల్లి రామ బ్రహ్మంగారి 'రైతు బిడ్డ. లోను, రాజరాజేశ్వరి వారి 'చండిక.' లోను నటించాడు. సహజ స్వతంత్ర నటుడైన రాఘవ సినీ రంగంలో ఇమడ లేక పోయారు. కొద్ది సినిమాలలో బళ్ళారి రాఘవ నటించాడు. ద్రౌపదీ మానసంరక్షణం, రైతుబిడ్డ, చండిక, కన్యాశుల్కం వంటివి ఆయన నటించిన కొద్ది సినిమాలు. ద్రౌపదీ మానసంరక్షణంలో ఆయన దుర్యోధన పాత్రను ఎందరో ప్రశంసించారు గాని ఆ సినిమా విజయవంతం కాలేదు.
రాఘవ వృత్తి రీత్యా న్యాయవాధి. తాను నమ్మిన సిద్ధాతాల మేరకు న్యాయంగా వున్న కేసులను మాత్రమే చేపట్టే వాడు. క్రిమినల్ లాయర్ గా బాగా పేరుతో పాటు ధనాన్ని అర్జించాడు. కాని ఆయన మిగుల్చుకున్న దేమి లేదు. నాటక కళాభి వృద్ధికే వినియోగించాడు.
న్యాయవాదిగా, కళాకారుడుగా పేరు పొందిన రాఘవను 1933 లో కొందరు మిత్రులు బళ్ళారి మునిసిపల్ కౌన్సిల్ కు పోటీ చేయమని ఒత్తిడి చేశారు. రాఘవ, మరి కొందరు మిత్రులు, ప్రముఖ వ్యాపారి ముల్లంగి కరిబసప్ప మున్నగు వారు చాకలి వీధిలో ప్రచారానికి వెళ్ళారు. మిత్రులు ఓటర్లకు రాఘవను పరిచయం చేసి వారికి ఓటు వేయమని కోరారు. ఓటర్లు మౌనంగా వుండి పోవడంతో కరి బసప్పకు కోపం వచ్చి ఓటర్లను తిట్టాడు. రాఘవ మనస్సు చివుక్కు మన్నది. వెంటనే ఇంటికి వచ్చి తమ నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకొన్నాడు. ఆయన ఆనాటి నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనాడు.
ఆధ్యాత్మిక గురువు పండిట్ తారానాధ్ ఉపదేశాల ప్రభావం రాఘవపై బాగా ఉంది. తుంగభద్రా నది ఒడ్డున ఉన్న ఆశ్రమానికి రాఘవ దండిగా విరాళాలిచ్చేవాడు. కష్టాలలో ఉండి సహాయం కోరినవారికి కూడా రాఘవ విరివిగా సహాయం చేశేవాడు. కాని ఆడంబరాలకోసం అతిగా ఖర్చు చేయుడానికి ఆయన వ్యతిరేకి. సంపన్నుడై ఉండి కూడా చాలా సాదాసీదా జీవనం గడిపేవాడు. రాఘవ సమయ స్ఫూర్తి చాల గొప్పది. ఒక సారి 'చంద్ర్ గుప్త ' నాటకం విజయవాడ దుర్గా కళామందిరంలో ప్రదర్శింప బడుతూ ఉంది. చాణక్య పాత్ర ధారి రాఘవా ప్రళయ కాల రుద్రుని వలె నందులపై ప్రతీ కారం కోసం తపిస్తున్నాడు. శ్మశాన రంగం అది. అంతలో ఆకస్మికంగా ఒక కుక్క రంగ స్థలం మీదికి వచ్చింది. రాఘవ ఏమాత్రం చెలించక కుక్కను చూస్తూ 'శునక రాజమా, నీకు కూడా నేను లోకు వయ్యానా?' అన్నాడు. కుక్క కాసేపు వుండి వెళ్ళి పోతుంది. ప్రేక్షకుల సంభ్రమాశ్చర్యాలతో రంగ మందిరం దద్దరిల్లింది
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.