ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (1946 జూన్ 4 - 2020 సెప్టెంబరు 25) నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన్ను ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అనతి కాలంలోనే మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | |
---|---|
జననం | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 కోనేటమ్మపేట, నెల్లూరు జిల్లా, మద్రాస్ ప్రెసిడెన్సీ |
మరణం | 2020 సెప్టెంబరు 25 74) ఎంజిఎం హాస్పిటల్, చెన్నై | (వయసు
మరణ కారణం | కోవిడ్ 19 |
ఇతర పేర్లు | బాలు, గాన గంధర్వుడు |
వృత్తి | నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1965 - 2020 |
జీవిత భాగస్వామి | సావిత్రి |
పిల్లలు | చరణ్ & పల్లవి |
తల్లిదండ్రులు |
|
వెబ్‌సైటు | http://www.spbindia.com |
1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.
సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.
అతను కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2021లో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
జీవిత చరిత్ర
బాల్యం, విద్యాభ్యాసం
బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా, కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించాడు.[1] అతని స్వగ్రామం మొదట గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 1825 నుండి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యింది.[2] అతని తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తుండేవాడు. సాంబమూర్తితో ఇంట్లో పండితులు, కవులు భాషా, సాహిత్య పరమైన చర్చలు జరుపుతూంటే విని, బాలసుబ్రహ్మణ్యానికి బాల్యం నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. [3] తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది.
ఐదేళ్ళ వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించాడు. ప్రాథమిక విద్య నగరి లోని మేనమామ శ్రీనివాసరావు ఇంటిలో ఉంటూ పూర్తి చేశాడు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూలు ఫైనలు చదివాడు. చదువులోనే కాక, ఆటల్లో కూడా మొదటి వాడుగా ఉండేవాడు. శ్రీకాళహస్తిలో చదివేటప్పుడే జి. వి. సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు చెంచులక్ష్మి సినిమాలో సుశీల పాడిన పాలకడలిపై శేషతల్పమున అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించాడు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు ఈయనను ఈ ఇల్లు అమ్మబడును, ఆత్మహత్య లాంటి నాటకాల్లో నటింప జేశాడు. తర్వాత తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియుసి చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది.
తిరుపతిలో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్ళిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగులో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశాడు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరాడు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీరు కావాలని కోరిక. తండ్రి కోరిక ననుసరించి బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లోనూ కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవాడు. ఆ కాలం లోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు.[4]
గాయకునిగా ప్రయత్నం
1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు లు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో ఎస్. పి. కోదండపాణి బాలు ప్రతిభను గమనించాడు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చాడు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. "ఏమి ఈ వింత మోహం" అనే పల్లవి గల ఈ పాటను ఆయన పి. సుశీల, కల్యాణం రఘురామయ్య, పి. బి. శ్రీనివాస్ లతో కలిసి పాడాడు.[5] ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. కోదండపాణి, బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్ తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి అవకాశాలు ఇప్పించేవాడు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని అతని పేరే పెట్టుకున్నారు బాలు.
1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశాడు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచాడు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.[6]
బాలుకు తన వృత్తిపట్ల ఎంత అంకితభావముందో తెలియడానికి ఒక ఉదాహరణ ఏమంటే 1989లో వచ్చిన కమల్ హసన్ చిత్రం ఇంద్రుడు చంద్రుడులో డ్యూయెల్ రోల్స్ లో ఒకపాత్ర(జి.కె.రాయుడు)మాట్లాడే యాసకి తగ్గట్టుగా "నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండూ" అనే పాటపాడి గొంతులో చిన్నగుల్ల వచ్చి పాడడానికి ఇబ్బంది పడి తర్వాత శస్ర్తచికిత్స చేయించుకొన్నారు.ఈ విషయాన్ని బాలునే స్వయంగా ఎన్నో ఇంటర్వూలలో చెప్పారు.
2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అయనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2016) ప్రదానం చేసారు.
నటునిగా
అతను 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు.[7] 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాపా లాలి అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా ప్రేమ (1989), దోషి (1992), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించాడు. 2012 లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా, 2015లో మూడు ముక్కల్లో చెప్పాలంటే సినిమాల్లో కనిపించాడు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రాల విభాగంలో మూడవ బహుమతిగా నంది ప్రత్యేక పురస్కారం లభించింది.[8]
డబ్బింగ్ కళాకారుడిగా
కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో సంగీత దర్శకుడు కె.చక్రవర్తి ప్రోద్బలంతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్ కి చక్రవర్తి డబ్బింగ్ చెబితే కమల్ హాసన్ ఆఫీసులో పనిచేసే ఒక క్యారెక్టర్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. పసివాడిప్రాణం చిత్రంలో రఘు వరన్ కు చెప్పిన డబ్బింగ్ సిసినిమాకే హైలెట్ గా నిలిచింది.అలాగే తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవాడు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది.[9] అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారియైన బెన్ కింగ్‌స్లే కు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పాడు.[10]
టీవీ కార్యక్రమాలు
ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసాడు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసాడు. 1996 లో మొదలైన ఈ కార్యక్రమం 2020 లో ఇంకా కొనసాగుతూనే ఉంది.
వ్యక్తిగత జీవితం
బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్. పి. చరణ్. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. అన్నయ్యతో కలిసి ఈమె పలు చిత్రాల్లో పాటలు పాడింది. నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహమాడింది. బాలు తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి 1987లో మరణించగా తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 న 89 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించింది.[11]
పురస్కారాలు
భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది.[12][13] ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు[14][15]
- పద్మశ్రీ (2001)[16]
- డాక్టరేటు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా
- పద్మభూషణ్ (2011)
- శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016), కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా
- 2016లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
- పద్మ విభూషణ్ (2021) [17]
మరణం
2020 ఆగస్టు 5 న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు కోవిడ్-19 వ్యాధి సోకినట్టు ప్రకటించాడు.[18][19] చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు.[20] ఆ తరువాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి ఆరోగ్యం విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగించారు. 2020 సెప్టెంబరు 25 న మధ్యాహ్నం 1.04 లకు బాలు తుదిశ్వాస విడిచాడు.[21] 2020 సెప్టెంబరు 26న తిరువళ్ళూరు జిల్లాలోని రెడ్ హిల్స్, తామరపాకం లోని ఆయన వ్యవసాయం క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి.[22][23]
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.