Remove ads
From Wikipedia, the free encyclopedia
శతకము (Sathakamu) అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
తెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స | |
---|---|
తెలుగు సాహిత్యం యుగ విభజన | |
నన్నయకు ముందు | సా.శ. 1000 వరకు |
నన్నయ యుగం | 1000 - 1100 |
శివకవి యుగం | 1100 - 1225 |
తిక్కన యుగం | 1225 - 1320 |
ఎఱ్ఱన యుగం | 1320 – 1400 |
శ్రీనాధ యుగం | 1400 - 1500 |
రాయల యుగం | 1500 - 1600 |
దాక్షిణాత్య యుగం | 1600 - 1775 |
క్షీణ యుగం | 1775 - 1875 |
ఆధునిక యుగం | 1875 – 2000 |
21వ శతాబ్ది | 2000 తరువాత |
తెలుగు భాష తెలుగు లిపి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా తెలుగు సాహితీకారుల జాబితాలు | |
"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.[1]
శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శతక రచనా ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అవచ్చిన్నంగా కొన సాసుతూనే ఉంది. ఇక తెలుగుకు సజాతీయములైన కన్నడ, తమిళము, మలయాళము భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడా ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.తెలుగు సాహిత్యం ప్రసిద్ధి చెందింది
శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని మకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకము నకు మకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకము నకు మకుటము, అలాగే వేంకటేశ్వరా, దాశరథీ అనునవి ఇతర ఉదాహరణములు.
శతక సాహిత్యం గురించి చెప్పే టప్పుడు, విశ్వనాథ సత్యనారాయణ వారి శతకాల గురించి తప్పకుండా ప్రస్తావన చెయ్యాల్సిందే.
ఈ క్రింద చెప్పిన 10 శతకాలు వాటి పేర్లు, మకుటము ప్రస్తావించటం జరిగింది.
1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ! - విశ్వనాథ సత్యనారాయణ
2. శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ! - విశ్వనాథ సత్యనారాయణ
3. భద్రగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ! - విశ్వనాథ సత్యనారాయణ
4. కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! - విశ్వనాథ సత్యనారాయణ
5. శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ! - విశ్వనాథ సత్యనారాయణ
6. ద్రాక్షారామ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ! - విశ్వనాథ సత్యనారాయణ
7. నందమూరు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ
8. నెకరు కల్లు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి! - విశ్వనాథ సత్యనారాయణ
9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల! - విశ్వనాథ సత్యనారాయణ
10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి! - విశ్వనాథ సత్యనారాయణ
సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.
మిగిలిన సాహిత్య ప్రక్రియలకున్న అలంకారిక, లాక్షణిక నియమాలు అనే బంధాలు శతక సాహిత్యానికి లేవు. ఛందస్సుకు అనుగుణంగా ఉంటే చాలు. విషయాన్ని ఒక పద్యంలో వెళ్ళగ్రక్కవచ్చును. లేదా 10 పద్యాలలో విస్తరింప వచ్చును. కథ చెప్పాలనీ, ముగింపు ఉండాలనీ నియమం లేదు. కనుక కవికి బోలెడంత స్వేచ్ఛ ఉంది. చదివేవాడికి కూడా రోజులతరబడి ఒకే గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన పని బడదు. కనుక ఒక్కపద్యంతోనే కవికీ, చదువరికీ అనుబంధం ఏర్పడవచ్చును. శతకాలు క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకొని ఉండవచ్చును.
శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.
శతకము అనగా వంద అని అర్థము. ఏ శతకము లోనైనా వందకు పైగానె పద్యము లుండవలెను, అంతకన్న తక్కువ పద్యములతో నున్నది శతకమనిపించు కోదు. వందకు తక్కువ గానీ, ఎక్కువ గాని పద్యములున్నచో వాటి విడిగా పేర్లున్నాయి. ఉదాహరణకకు..... పది పద్యములున్నచో దశకము, ఇరవై ఐదు పద్యములతో నున్నదానిని పంచవిశంతి అనీ, ముప్పదిరెండు పద్యములు గల దానికి రాగ సంఖ్య అనీ, మూడు వందల పద్యములున్నచో త్రిశతి అనీ వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి.
శతకము లోని ప్రతి పద్యంలో చివర నున్న సంబోధనా పదమే మకుటము. ఈ మకుటము తప్పని సరిగా సంబోధన గానే వుండవలెను. ఈ సంబోధన కూడా ఒకే రీతిగా నుండ వలెను. మకుటమునకు వాడిన పదానికి సంబంధించిన పదానికి పర్యాయ పదములు గానీ, సమానార్థమైన పదములు గాని వుండ కూడదు. ఒక శతకములో మకుటము.గా సర్వేశ్వరా అనే పదాన్ని వాడిన యడల అన్ని పద్యములకు అదే పదాన్ని వాడవలెను గానీ, దానికి ప్రత్యామ్నాయమైన ఇతర పదాలు అనగా విశ్వేశ్వరా., లోకేశ్వరా వంటి వాడకూడదు. కొన్ని పద్యములలో ఒక పదమే మకుటముగా నుండగా.... కొందరు కవులు ఒక పద్య పాదమంతయూ మకుటముగా నెంచుకొనిరు. ఒక పద్య పాదమంతయు మకుటముగా నున్న శతకమునకు యుధాహరణముగా వేమన శతకాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. విశ్వదాభిరామ వినుర వేమ అను మకుటము పూర్తిగా ఒక పద్య పాదము. ఆవిధంగా ఒకే పదము మకుటం నెంచుకుని వ్రాసిన శతకానికి యుధాహరణగా సుమతీ శతకాన్ని చెప్పుకోవచ్చు. సుమతీ అను ఒక పదము ఇందులోని మకుటము.
శతకము లోని మకుట నియమమును బట్టే వృత్త నియమము యేర్పడినది. తెలుగున తొలి శతకము..... మల్లికార్జున పండితారాధ్యుని శ్రీ గిరి మల్లికార్జున శతకము. ఇందలి మకుటము శ్రీగిరి మల్లికార్జునా అని యుండుట చేత నిందు చంపక మాల, ఉత్పల మాల పద్యములు తప్ప వేరు వృత్తములు ఇమడనేరవు. ఇట్లే సర్వేశ్వర అను మకుటమున్నపుడు ఆ పద్యము మత్తేభము గానీ, శార్దూలము గాని అయి యుండవలెను. వేమన పద్యాలలోని మకుటము విశ్వదాభిరామ వినుర వేమ ఇందులో ఆటవెలది తప్ప మరొకటి వుండే అవకాశము లేదు. అలా వేరు వృత్తములను వ్రాయడాని ప్రయత్నిస్తే చందస్సు కుదరదు. కనుక శతకములో ప్రతి పద్యమూ ఒకే వృత్తంలో నుండవలెననెడి నియమమేర్పడినది.
శతకములో యే రసము ప్రతిపాదిన రచన సాగించాలో ముందే నిర్ణయించుకొని అందులోని పద్యములన్నియు ఆ రస ప్రధానమైనవిగానె వుండవలెను. ఉదాహరణకు భక్తి రస ప్రధానమైన శతకములో ఇతర రసాలైన, శృంగార రసము, ప్రసక్తి రాకూడదు. శతకములో ఒకరసప్రధానమైన చో అందులో ఇతర రసాల ప్రయోగముండారాదని నియమము. అలా ఆయా రసప్రధానమైన శతకములెన్నో ఉన్నాయి. రసనియమముల ననుసరించి వెలువడిన శతకములలో కొన్ని ముఖ్యమైనవి......., భక్తి శతము, శృంగార శతకము, నీతి శతకము, వేదాంత శతకము, హాస్య శతకము, కథా శతకము, సమస్యా శతకము, మొదలగునవి..
శతకము లన్నియు సలక్షణమైన కావ్వ భాషలోనే యుండును. కావుననే లాక్షణికులు శతకములనుండి ప్రయోగములు వంటి వాటిని ప్రామాణికములుగా తీసుకొంటారు. కానీ తెలుగున చంద్రశేఖర శతకమని ఒకటున్నది. దానిలో చంద్ర శేఖర అనే మకుటముతో చంపక, ఉత్పలమాలిక లతోవున్నది. ఇందలి భాష అంతయూ గ్రామ్యమే.
మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము శతక వాఙ్మయమునకు ఆద్యముగా చెప్పవచ్చును. పాల్కురికి సోమన (సా.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము. సుమారు ఈ కాలములోనే బద్దెన సుమతీ శతకము, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వెలువడ్డాయి. వీటి ఒరవడిలోనే తెలుగులోను, కన్నడములోను శతక వాఙ్మయము చాలాకాలం కొనసాగింది.
తరువాత తెలుగులో ఎన్ని వేల శతకాలు వచ్చాయో చెప్పడం కష్టం. ఎందరో పండితులు, కవులు, ఔత్సాహిక రచయితలు వేర్వేరు అంశాలలో శతకాలు రచించారు. భక్తి (కృష్ణ శతకము), శృంగారము (భర్తృహరి), తత్వము, వేదాంతము (బమ్మెర పోతన - నారాయణ శతకము), నీతి (సుమతీ శతకము), పొగడటం, తిట్టటం, పొగడినట్టు తిట్టడం, తిట్టినట్టు పొగడడం, వర్ణించడం, బోధించడం - అన్ని విషయాలలోనూ శతకాలు వ్రాశారు. వీటిలో చాలావరకు ముద్రణకు నోచుకొనబడలేదు.
తెలుగు వాగ్మయమున మొట్టమొదట వెలసిన శతకములన్నియి శైవమత సంప్రదాయకములు. దీనిని బట్టి తెలుగున శతక సాహిత్య ప్రక్రియకు ఆద్యులు శివ కవులే నని రూడిగా చెప్పవచ్చు.
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.
శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే క్రైస్తవ భక్తిపరంగా కూడా చాలా శతకాలున్నాయి.
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.