Remove ads

పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. వైజ్ఞానిక రచనలు, గణిత రచనలు, సాహిత్యపరమైన రచనలు మొదలుకొని అనేకానేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి.

పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.

848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీస పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి.[1] వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంధాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.


Remove ads

పద్య లక్షణములు[2]

ఉత్పలమాల :- ఇందలి గణములు భ, ర, న, భ, భ,ర,వ ఈ పద్యమునకు

నాలుగు పాదములుండును ప్రతి పాదమునకు భ, ర, న, భ, భ,ర,వ, అను గణములు వర్తించును. ప్రాసనియమము కలదు. యతి 1వ అక్షరము 10 వ అక్షరము యతి నాలుగు పాదములకు వర్తించును. పాదమునకు 20 అక్షరములు ఉండును ఇతి వృత్త జాతి పద్యము.

చంపకమాల:- ఇందలి గణములు న, జ, భ, జ, జ, జ, ర ఈ పద్యమునకు

నాలుగు పాదములుండును. ప్రతి పాదమునకు న, జ, భ, జ, జ, జ, ర అను గణములు వర్తించును. ప్రాసనియమం కలదు. యతి 1వ అక్షరము 11వ అక్షరము. యతి నాలుగు పాదములకు వర్తించును. పాదమునకు 21 అక్షరములు ఉండును. ఇది వృత్తజాతి పద్యము.

మత్తేభం :- ఇందలి గణములు స, భ, ర, న, మ, య, వ ఈ పద్యమునకు నాలుగు పాదములుండును. ప్రతి పాదమునకు స, భ, ర, న, మయ, వ అనుగణములు వర్తించును. ప్రాసనియమం కలదు. యతి 1వ అక్షరం 14వ అక్షరం. యతి నాలుగు పాదములకు వర్తించును. పాదమునకు 20 అక్షరములు ఉండును. ఇది వృత్త జాతి పద్యము.

శార్దూలం :- ఇందలి గణములు మ, స, జ, స, త, త, గ ఈ పద్యమునకు

నాలుగు పాదములుండును. ప్రతి పాదమునకు మ, న, జ,స,త,త,గ అను గణములు వర్తించును. ప్రాసనియమం కలదు. యతి 1వ అక్షరం 13వ అక్షరం. యతి నాలుగు పాదములకు వర్తించును. పాదమునకు 19 అక్షరము లుండును. ఇది వృత్తజాతి పద్యము.

ఆటవెలది :- ఇనగణ త్రయంబు, ఇంద్రద్వయంబు, హంసపంచకంబు

ఆటవెలది. ఈ పద్యమునకు నాలుగు పాదములుండును. 1,3 పాదాలయందు 3 సూర్యగణములు 2 ఇంద్రగణములు 2,4 పాదాలయందు 5 సూర్యగణములు వర్తించును. ప్రాసనియమం లేదు. యతి మొదటి గణము మొదటి అక్షరము, నాల్గవ గణము మొదటి అక్షరము యతి నాలుగు పాదములకు వర్తించును. యతి చెల్లనిచో ప్రాసయతి వాడవచ్చును. ఇది ఉపజాతి పద్యము.

తేటగీతి :- సూర్చుఁడొక్కడు, సురరాజులిద్దరు, దినకరద్వయంబు తేటగీతి. ఈ పద్యమునకు నాలుగు పాదములుండును. ఒక సూర్యగణము, రెండు ఇంద్రగణములు, రెండు సూర్యగణములు నాలుగు పాదములకు వర్తించును. ప్రాసనియమం లేదు. యతి చెల్లనిచో ప్రాసయతి వాడవచ్చును. ఇది ఉపజాతి పద్యం.

సీసపద్యము :- సీసపద్యమునకు ఎనిమిది పాదములుండును. 1,3,5,7

పాదములయందు నాలుగేసి ఇంద్రగణములు 2,4,6,8 పాదములయందు రెండేసి ఇంద్రగణములు రెండేసి సూర్యగణములు వర్తించును. మొదటి గణము మొదటి అక్షరము, మూడవ గణము మొదటి అక్షరము యతి స్థానము. యతి 8 పాదములకు వర్తించును. ప్రాసనియమం లేదు. సీస పద్యము తదుపరి ఆట వెలది కానీ, తేటగీతి గాని లేనిచో సీసము సంపూర్ణముకాదు.

కందపద్యము :- ఇందలి గణములు గగ, నల, న, భ,జ ఈ పద్యమునకు

నాలుగు పాదములుండును. 1,3 పాదములయందు మూడేసి గణములు. 2,4 పాదములయందు ఐదేసి గణములు ఉండును. 1,3,5,7 బేసి గణముల యందు జగణము ఉండరాదు. 2,4 పాదాలయందు చివరి గణము గగకానీ, సగణముకానీ ఉండవలయును. 6వ గణమునందు తప్పని సరిగా జగణము కానీ 'నల' ముకానీ ఉండవలయును. ప్రాసనియమం కలదు. యతి 2,4 పాదములకు మాత్రమే వర్తించును. యతి మొదటి గణము - మొదటి అక్షరము, నాల్గవగణము - మొదటి అక్షరము ప్రాసనియమమనగా పద్యమునందు రెండవ అక్షరము ఏదైతే వచ్చునో మిగిలిన పాదములందు అదే అక్షరము వచ్చుట పంకజముఖి సీతవంటి భామామణియున్

ఉదా: వంకాయ వంటి కూరయు

Remove ads

సీసము

ఉదాహరణ

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. --పోతన భాగవతము నుండి

కందము

ఉదాహరణ

పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామ భద్రుండట ;నే
పలికిన భవహర మగునట
పలికెద; వేరొండు గాథ పలుకగ నేలా! - పోతన భాగవతము నుండి.

తేటగీతి

ఉదహరణ

 
భరత ఖండంబు చక్కని పాడి యావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి.
  -చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు.

చంపకమాల

ఉదాహరణ

 
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్
  - పెద్దన మనుచరిత్రము నుండి.

ఆటవెలది

Thumb
శ్రీకృష్ణదేవరాయలు
ఉదాహరణ

 
తెలు గదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొ కండ;
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స.
  -శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద నుండి.

మరికొన్ని పద్యాలు

 
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
  -పుట్టపర్తి నారాయణాచార్యులు ,శివతాండవము నుండి.

ఘన ఘనాఘన గజ గ్రైవేయ ఘంటికా టంకారములకు ఘంటాపథంబు
శక్రచా పోదగ్ర శార్దూల పాలనా విభవోన్నతికి భూరి విపిన సీమ
చటుల ఝంఝా మరు ఛ్ఛతకోటి భేతాళ లుంఠన క్రియలకు రుద్రభూమి
పటు తటిద్విలసన బ్రహ్మరాక్షస కఠోరాట్టహాసమున కహార్య బిలము

గగన భాగమ్ము ప్రావృష ద్విగుణ రోష
ఘటిత నటనోగ్ర ధాటీ విఘటిత ప్రకట
కుటిల ధూర్జటి ఘన జటా పటల నిటల
వికట భృకుటీ కుటీర ముద్విగ్న మాయె.
  -గుంటూరు శేషేంద్ర శర్మ, ఋతుఘోష నుండి.


Remove ads

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads