Remove ads
From Wikipedia, the free encyclopedia
దివాకర్ల తిరుపతి శాస్త్రి (Divakarla Tirupati Sastry) (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry) (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.
వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.
దివాకర్ల తిరుపతి శాస్త్రి ప్రజోత్పత్తి సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమి బుధవారం అనగా 1872 మార్చి 26న పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకటావధాని కూడా గొప్ప వేదపండితుడు, సూర్యోపాసకులు. తిరుపతి శాస్త్రి విద్యాభ్యాసం బూర్ల సుబ్బారాయుడు, గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గార్ల వద్ద సాగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రికి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తోడయ్యారు. 1898లో తిరుపతి శాస్త్రి వివాహం జరిగింది.
మధుమేహం వ్యాధి కారణంగా ఆయన 1920 నవంబరులో మరణించారు.
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి ప్రమోదూత సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం అనగా 1870 ఆగస్టు 8న తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణతిలక విలాసము అనే మహాద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉండేవి. తరువాత వారు యానాంకు సమీపం లో ఇంజరం కు మకాం మార్చారు. యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
శ్రీవెంకటకవి చదువుకై ఎందరెందరో గురువులను ఆశ్రయించి తిరిగి తిరిగి శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రిని ఆశ్రయించారు. అప్పటికే వారివద్ద కౌముది చదువుతున్న శ్రీ తిరుపతిశాస్త్రితో పరిచయమైనది. కాని కాలు నిలువని వెంకటకవి విద్యాగ్రహణమునకై వారణాసికి పోవలెనను ఉబలాటము కలిగి, గురువులతో మాయమాటలు చెప్పి ఒక మిత్రునితో కాశికి బయలుదేరినాడు. డబ్బులేదు. నిడమర్రు చేరి అక్కడి ఉద్యోగుల సభలో శతఘంటకవనము చేయగలనని ప్రగల్భముగా పద్యాలు చెప్పెను. అప్పటికి ఆయన వయసు 20సం. కూత ఘనముగా ఉన్నదని ఆయనతో అష్టావధానము చేయించిరి. పూర్తి చేసి, అయ్యా నేనెప్పుడు అష్టావధానము చేయలేదని ఊరక అడిగిన ధనమీయరని ప్రగల్భములు పలికితిని, లోపములున్న మన్నింపమని పలికిరి. వేంటనే సభ్యులందరు కోపమేమీ లేదని బాగుగా చేసితివి అని పలికి రూ.30 ఇచ్చి సత్కరించిరి వెంకటకవిని. అదే ఆయన మొదటి అవధానము. రెండవ అవధానము గుండుగొల్లులో చేసిరి. శ్రీ శాస్త్రిగారు కాశిలో ఎక్కువకాలముండలేదు. గురువుల ఆదేశమును అనుసరించి స్వదేశము తిరిగివచ్చిరి. కాశీ సమారాధనముకు, గంగపూజకు డబ్బుకొరకు కోనసీమలో ముమ్మిడివరము, ఐనాపురము, కేసవకుర్తిలో అవధానము చేసి ధనం సంపాదించి గంగపూజ చేసారు.
ఆపిమ్మట శ్రీవెంకటశాస్త్రిగారు బ్రహ్మగురువులను చేరి నిలుకడగా శ్రీతిరుపతి శాస్త్రితో కలసి విద్యాభ్యాసం ఆరంభించెను. వారిద్దరికి మొదట్లో విద్యస్ఫర్ధ ఉండెడిది. ఇతరు శిష్యులలో కొందరీయనను, మరికొందరు ఆయనను బలపరిచేవారు. ఆ స్ఫర్దే వారి మైత్రికి బీజమైనది. అప్పటికి తిరుపతిశాస్త్రి సంస్కృత రచనమేకాని ఆంధ్రపద్య రచన ఎరుగరు. వెంకటశాస్త్రి పరిచయంతో ఆయన ఆంధ్ర కవిత్వములోనికి దిగెను. అప్పటినుంచే జంట కవిత్వ కృషి ఆరంభమైనది.
వెంకటశాస్త్రిగారు రెండవసారి బ్రహ్మగురువుల వద్దకు వచ్చి కుదురుకునేవరకూ ఒకచోట కాలునిలువక, ఒకచోట నని విద్యాభ్యాసము చేయక, ఒక చదువునికాక, రకరకాలుగా కొంత ఆకతాయిగా తిరిగారు. ఇందుకు కొంతవరకు ఆయన బాల్యములో తండ్రి ఆర్థికస్థితి అంతగా బాగుండక పోవుట ఒక కారణము. కాని మూలకారణము ఆయన అశాంత చిత్తమే. బడికి సరిగా పోలేదు. తాతగారి గ్రంథ సంచియమునుండి ఆంధ్రగ్రంధాలు స్వయముగా పఠించారు. సంస్కృత భాషాధ్యయమునకై ఎందరెందరో గురువులను ఆశ్రయించారు. ఆంధ్రకవిత్వము చిన్నప్పుడే వంటపట్టెను. చిన్నప్పుడే హరికథలు వీధినాటకములు వ్రాసెను. మృదంగ వాదనము, కొంచెము ఇంగ్లీషు కొంచెము కుస్తీ కూడా అభ్యసించెను. ఈ చిల్లరవిద్యలలో తిట్ల కవిత్వం ఒకటి. కొంతకాలము చదువుకంటే చదరంగమును ఎక్కువుగా అభ్యసించెను.
కొంత స్థితచిత్తము కుదిరినాక, కొన్ని రాత్రులు రెండుక్రోసుల దూరములో ఉన్న పిల్లంకకు పోయి లఘుకౌముదియు, కొన్ని రాత్రులు భారవి పాఠము చేసి తెల్లవారిసరికి ఇంటికి వచ్చుచుండెను. ఈవిధంగా చదువుకు ఎక్కడ ఏచిన్న అవకాశము చిక్కినా, వదలక విద్యాభ్యాసము కావించెని. అన్నిటికీ తోడు ఆయన కంటి సమస్య ఒకటి. కాని వారికి విస్తారమయిన ధారణశక్తి ఉండటము వలన చదివిన చదువు గట్టిగానిలిచేది.
ఆయనకు 17సం. వయస్సులో యానాము వేంకటేశ్వరునిపై శతకము చెప్పి వినిపించగా కొందరు అందులో తప్పులను ఆక్షేపించి అందులో సంస్కృతమాసతసంధిని గూర్చి ప్రశ్నించిరి. అప్పటికాయనకు ఆంధ్రవ్యాకరణము తప్ప సంస్కృతవ్యాకరణము తెలియనందున వారికి బదులీయలేకపోయిరి.అది అవమానముగా భావించి వ్యాకరణ శాస్త్రమును అభ్యసించుటకు కాశికి వెళ్ళ నిశ్చయించి, కంటి వైద్యమునకు పోవుచుంటినని ఇంట్లో చెప్పి, ఒక మిత్రునితో కాశికి బయలుదేరెను.విశాఖపట్నంనకు వెళ్ళిరి.అక్కడ ఏడు నూతుల వీధిలో మధ్యహ్నభోజనము చేసిరి. అక్కడ అన్నము దుర్గంధముగా ఉన్నటముతో మిత్రుడు హడలి మిత్రుడు వెనుదిరగగా, తప్పని సరియై తానును తిరిగి వచ్చెను.
బ్రహ్మగురునివద్ద చేరువరకు ఆయనకు సుఖభోజనము, నిలికడుగా చదువు, కుదరలేదు. కాని కాశిలో వ్యాకరణాధ్యయనము చేసిరావలెననే వ్యామోహము వదలలేదు. మరలా చెప్పకుండా కాశికి మరలా పోయి 4 నెలలు ఉండి విద్యనభ్యసించారు.కాని తల్లితండ్రుల గొడవవలన బ్రహ్మ గురువులు ఉత్తరము వ్రాయగా దానిని మన్నించి తిరిగివచ్చి స్థిరముగా బ్రహ్మగురునియొద్ద చదువునకు కుదిరెను.
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారితో శ్రీ వేంకటశాస్త్రిగారికి జరిగిన తగాదా చాలా చిత్రమైనది. శ్రీపాదవారు సంస్కృతాంధ్రభాషలలో పండితులే కాక వేదము, శ్రౌతము కూడా అధ్యయనము చేసిన పుణ్యమూర్తులు. వీరు ఒక్కచేతిమీదుగా మహాభారతము, రామాయణము భాగవతము అనువదించి శతాధికగ్రంధకర్తలైన కవిసార్వభౌములు. మహామహోపాధ్యాయ బిరుదాంకితులు.వారివద్ద శ్రీ వేంకటశాస్త్రి మేఘసందేశము ఐదునెలలు శుశ్రూష చేసి కొంత చెప్పుకొనిరి. శ్రీకృష్ణ భారతముపై కొందరు ఒకమహా సభలో శ్రీవేంకటశాస్త్రిగారిని ఖండించి శ్రీపాదవారిని సమర్ధించిరి. శ్రీపాదవారికి గండపెండేరము సమర్పించు సభకువెళ్ళి శ్రీవేంకటకవి స్వయముగా గురుపాదమునకు బిరుదుటందెనలంకరించిరి. శ్రీవేంకటకవికి గండపెండేరము సమర్పించు సభలో శ్రీపాదవారుండటచే వారి అనుమతి లేనిది తానది గ్రహింపనని చెప్పగా, శ్రీపాదవారు వేంకటశాస్త్రి అందుకు తగిన వారే అను ప్రకటించిరి. వీరిరువురు మధ్య పలుసార్లు వైషమ్యములు వచ్చినను చివరకు రాజీ కుదురినట్లు 1931లో ప్రకటించారు.
మదరాసు ప్రభుత్వమువారు ప్రథమాంధ్రాస్థాన కవిని నియమింప నిర్ణయించినపుడు వీరిద్దరిలో ఎవరిని నియమించుటాయని మంత్రులాలోచించిరట. తుదకు ప్రభుత్వము శ్రీవేంకట శాస్త్రినే వరించి గౌరవించింది. ఆతర్వాత కొద్దినెలలకే వారు పరమపదించగా, వేంటనే రెండవ ఆస్థాన కవిగా శ్రీపాదవారిని ప్రభుత్వము వరించింది.
తిరుపతిశాస్త్రి బలశాలియైనను 49సం.లే జీవింపగా బలహీనుడైన శ్రీవేంకటశాస్త్రి 80సం.లు దాదాపు సహస్రమాసములు జీవించెను. శ్రీవేంకటకవి తనకూ, తన కుటుంబమునకు ఎన్నోమారులు జబ్బులు చేయగా, ఆరోగ్య కామేశ్వరి, ఆరోగ్య భాస్కరస్తనము, మృత్యంజయ స్తనము వంటి కావ్యములు చెప్పి వ్యాధి విముక్తులైరి. వీరు మహాశివరాత్రినాడు నిర్యాణము చెందినారు.
వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులైనవారిలో కొందరు - విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి సుందరరామ మూర్తి, పింగళి లక్ష్మీకాంతం
మొదటినుండి తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది.
వేంకట శాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగి వచ్చినాక కాకినాడలో జంటగా శతావధానం ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.
తిరుపతి వెంకటేశ్వరుల దిగ్విజయములకు నాంది పలికినది కాకినాడలో. అది వారి మొదటి శతావధానమేకాక సంపూర్ణ శతావధానమ కూడను. అప్పటికి వెంకటశాస్త్రికి 20సం. తిరుపతి శాస్త్రిగారికి 19వ ఏడు. బాలసరస్వతులవలె నున్నవారిని సభ్యులు అభిమానించుచునే అడుగడుగున గడ్డు పరీక్షలు చేసిరి. కవులన్నింటిలో నెగ్గిరి.
వారిద్దరు ఓసారి ఏకాంతముగా ఒక కొబ్బరితోటలో నూరు కొబ్బరిచెట్లను పృచ్చకులుగా భావించుకొని చెట్లకు శతావాధానము చేసిరి. దానితో వారు శతావధానమేకాక వారి శక్తి సహస్రమౌనకై నను చెప్పగలము అని నిశ్చయించుకొని సంపూర్ణ శతావధానము చేసి అందులో నెగ్గిరి.కాకినాడ పౌరులు నాలుగు నూటపదార్లు జోడు శాలువలు రెండు చాపులు సమర్పించి, అత్తరు తాంబూలములు ఇచ్చి మొక్కిరి.తాము పుట్తి బుద్ధి ఎరిగిన తరువాత ఇట్టి కవీశ్వరులను ఎరుగమని వారిని సమ్నానించి అశ్వకటకముపై ఎక్కించి మేళతాళములతో ఊరేగించిరి.అది 1891 సం.
కాకినాడ శతావధానమయిన తరువాత కోనసీమ అగ్రహారములలో ఎన్నో అవధానములు చేసిరి.అమలాపురములో అష్టావధాన శతావధానములు కాకినాడ అంత వైభవముగా జరిగినవి.ఆపిమ్మట మహాభాష్యాధ్యయన మారంభమైనది. ద్రవ్యార్జనకై ఏలూరు వెళ్ళి అవధానము చేసి బందరు వెళ్ళిరి. బందరులో వారికి అమితధనలాభముతో పాటు గౌరవాదులు చేకూరినవి.విందులు, సభలు, గానములు, నాటకములు సాటిలేకుండా సాగినవి. అక్కడ సిడ్ని.వి ఎడ్జి అను ఆగ్లేయుడు అదిచూసి వారిని డిసెంబరులో థియొసాఫికల్ (Theosophical society) సభకు రమ్మని ఆహ్వానించెను. అది 1893 సం.
ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.
గుంటూరులో 1911సం.ఆగస్టు నెలలో శ్రీ కొప్పరపు సోదర కవులు అభిమానులు లేవదీసిన కుర్చీతగాదాతో అప్పటికే కుములుచున్న అగ్గివలెనున్న వైదికనియోగి స్పర్ధలు మంటలుగా ప్రజ్వరిల్లినవి.ఏది ఏమైనా ఎవరి ప్రశంసలు వారి అందుకొనుటమానలేదు. పల్లెలలో కూడా వెంకటకవులకు సభలు అవధానములు జరిగినవి.
పోలవరం జమీందారు వారి ప్రతిభ గురించి తెలిసికొని ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన లైట్ ఆఫ్ ఆసియా గ్రంథాన్ని తెలుగులోకి అనువదించమని వారిని కోరాడు. తన సంస్థానంలో కవులుగా చేరమని అర్ధించాడు. ఆ విధమైన కట్టుబాట్లకు వేంకట శాస్త్రి వెనుకాడినా తిరుపతి శాస్త్రి ఆయనను ఒప్పించాడు. ఫలితంగా వారు 1901లో కాకినాడకు నివాసం మార్చారు. 1889లో పిఠాపురం రాజు ప్రారంభించిన 'సరస్వతి' అనే సాహితీ పత్రిక నిర్వహణా బాధ్యతలు వారికి అప్పగింపబడ్డాయి. ఈ పత్రిక కోసం 'బాల రామాయణం', 'ముద్రారాక్షసం', 'మృచ్ఛఘటికం' గ్రంథాలను వీరు సంస్కృతంనుండి తెలుగులోకి అనువదించారు.
1918లో పోలవరం జమీందార్ మరణం వారిని ఇబ్బందులలో పడవేసింది. అయితే గోలంక వీరవరం జమీందార్ రావు రామాయమ్మ వీరికి భరణం ఏర్పాటు చేసింది.
శ్రీ తిరుపతి శాస్త్రి నిర్యాణాంతరము శ్రీవెంకటశాస్త్రి చల్లపల్లి రాజాగారగు అంకినీడు ప్రసాదరాయలయు,శ్రీ శివరామ ప్రసాదప్రభువులయు పట్టాభిషేకములకు వెళ్ళి ఘనముగా సన్మానములొందెను.అట్లే బొబ్బిలి రాజాగారి పట్టాభిషేకమునకు శ్రీ వెంకటశాస్త్రి వెళ్ళి, తర్వాత పట్టాభిషేక కావ్యమును రచించెను. ఆ కావ్యము నవిపించుటకు శాస్త్రిగారు శిష్యసమేతముగా బొబ్బిలి వెళ్ళెను.ప్రభువు శ్రీ శాస్త్రిని వేయినూటపదార్లు, శాలువుల జోడు, కింకణములు ఇచ్చి సన్మానించి, నూరార్లు వార్షికము ప్రకటించుటేకాక వెంటవచ్చిన శిష్యులకును నూటపదార్లు ఇచ్చి గౌరవించెను.
ఈవిధముగా శ్రీతిరుపతి వేంకటేశ్వరుల నిద్దరినిగాని తిరుపతి నిర్యాణంతరము వేంకటేశ్వరునిగాని సన్మానించిన ప్రభువులను ప్రభుసమ్మితులు అనేకులు. వారిలో కొందరు, విరవ, కోటరామచంద్రాపురము, వీరవరము, ఉర్లాము, మరదాసా, తోట్లవల్లూరు, తేలప్రోలు, ఖాశింకోట, మైలవరము, నూజివీడు, బొబ్బిలి, జయపురం, రామచంద్రాపురం ఇత్యాది సంస్థానముల అధిపతులు, యానాము శ్రీ మన్యం మహాలక్షమ్మ జమీందారిణీగారు, శ్రీ విక్రమదేవవర్మగారు, చెన్నపట్నములో శ్రీ అల్లాడి కృష్ణస్వామయ్యాగారు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు గారు.
తిరుపతి వేంకట కవులు రాసిన "పాండవోద్యోగం", "పాండవవిజయం" అనే రెండు నాటకాలను కలిపి "పాండవోద్యోగవిజయాలు" లేదా "కురుక్షేత్రం" పేరుతో ప్రదర్శించేవారు. డా. మీగడ రామలింగస్వామి 1993లో "తిరుపతి వేంకట కవుల పాండవ నాటక చక్రం - పరిశీలనాంశం" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాడు.
వీరు తమ గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ప్రోత్సాహంతో కాకినాడలో మొట్టమొదటిసారి జంటగా అష్టావధానాన్ని, ఆ తర్వాత 1890 అక్టోబరులో ఒక శతావధానాన్ని చేశారు. అయితే చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అంతకు ముందే కాశీయాత్ర కోసం అవసరమైన డబ్బు కొరకు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు, గుండుగొలను గ్రామాలలోను, కాశీనుండి తిరిగి వచ్చిన తర్వాత గంగా సంతర్పణ కోసం ముమ్మిడివరం, అయినవిల్లి గ్రామాలలో అష్టావధానాలు చేశాడు. కాకినాడ అవధానాల తర్వాత వీరిరువురూ చెలరేగి పల్లెల్లో, పట్టణాలలో, రాజాస్థానాలలో వందలకొద్దీ అవధానాలు చేశారు. కాకినాడ, అమలాపురం, ఏలూరు, బందరు, నెల్లూరు, విశాఖపట్నం, బెజవాడ, మద్రాసు, గుంటూరు, రాజమండ్రి మొదలైన పట్టణాలలోను, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, వెంకటగిరి, విజయనగరం, నూజివీడు, కిర్లంపూడి మొదలైన సంస్థానాలలోను శతావధానాలు, అష్టావధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు చేశారు. ఈ అవధానాలన్నింటిలోను తిరుపతిశాస్త్రి ఒక పాదం చెబితే వేంకటశాస్త్రి మరొక పాదం చెప్పేవాడు.[2]
వీరి అవధానాలలో వెలువడిన కొన్ని పద్యాలు:
పూరణ:
ఓ నవనీతచోర కృపయుంచి పటమ్ముల నిచ్చి వేగ మా
మానము గావుమన్న వ్రజమానిని పల్కుల కెంతొ వింతన
వ్వాననసీమఁ దోఁపఁ గమలాక్షుడుఁ దానిటు పల్కె, మానినీ
మానవతీలలామ కభిమానమె చాలును జీరయేటికిన్
పూరణ:
గంగాధరుడు నీ మగండని నవ్వంగ
వేషధరుండు నీ పెన్మిటనియె
నెద్దు నెక్కును నీదు నెమ్మెకాఁడని నవ్వ
గ్రద్ద నెక్కును నీ మగండటనియె
వల్లకాడిల్లు నీ వల్లభున కనంగ
నడిసంద్ర మిల్లు నీ నాథున కనె
నాట్యంబుసేయు నీ నాయకుండన నంగు
గావించు వెన్క నీ కాంతుఁడనియె
ముష్టి కెక్కడి కేగె నీ యిష్టుఁడనిన
బలి ముఖంబున కేగెనో లలన! యనియె
నిట్టు లన్యోన్యమర్మంబు లెంచుకొనెడు
పర్వతాంభోది కన్యలఁ బ్రస్తుతింతు
పూరణ:
సెనగపిండి యుల్లిపాయ చిన్నిమిర్పకాయలుం
జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్దచేసియున్
అనలతప్తమైన నేతియందు వైచి వేచినం
జనుఁ బకోడి యనెడు పేరఁ జక్కనైన ఖాద్యమై
పూరణ:
ఏటికీగోల కొండపై నేల డాఁగ
నొక్కమొగిగాఁగ సత మాలముండఁబోదు
దనుజనాయక! నీ పూలదండ వాడు
కొడుకు చేతికి వచ్చులే క్రొత్తకుండ
మహబూబ్ నగర్ జిల్లా లోని సంస్థానాలలో ఒకటైన ఆత్మకూరు సంస్థానాన్ని తిరుపతి కవులు సందర్శించారు. ఇక్కడి ప్రభువులను కలుసుకోవాలనే వారి కోరికకు ధర్మాధికారిగా పనిచేసే ఒక పండితకవి అడ్డుతగిలాడు. వారికి వీరికి వాదన జరిగింది. పండితకవి ప్రభువులకు చాడీలు చెప్పి, వీరికి ప్రభువుల సత్కారాన్ని దూరం చేశాడు. దీనితో ఆగ్రహించిన జంటకవులు ఆ అధికారిని అధిక + అరి అని చమత్కరిస్తూ, అన్యోపదేశంగా నిందిస్తూ 27 పద్యాలతో కూడిన లఘుకృతిని రచించారు. దీనికి శనిగ్రహం అని పేరు పెట్టారు. అందులో ఒక పద్యం....
ధరణీ నాయకుడుత్తముండవని నిన్ ధర్మాధికారమ్మునం
దు రహిన్నిల్పుట తుచ్చ బుద్ధివయి క్రిందున్ మీదునుం గాన కె
ల్లరి కార్యమ్ములు పాడుసేయుటకె? నీ లక్ష్యమ్ము మా బోటు తెం
చరు చండాల! శనిగ్రహంబ! యిక మా సామర్థ్యం ముంజూడుమా!
అమ్మా! సరస్వతీ! నీ దయవలన మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన పద్యం:
కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, వీరు చెప్పిన పద్యం. దమ్మున్న కవులు ఎవరైనా మమ్ములను గెలిస్తే మీసాలు తీసి మొక్కుతామని:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.