Remove ads
హాస్య నటుడు From Wikipedia, the free encyclopedia
ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత.[1] 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు.[2] ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు.[3][4] ఇతని తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. తెలుగు సినిమాలలో సహాయక పాత్రలను పోషిస్తుంటాడు.
అలీ | |
---|---|
జననం | మహమ్మద్ అలీ 1968 అక్టోబరు 10 రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | జుబేదా |
పిల్లలు | ఫాతిమా రమీజున్, మహమ్మద్ బాషా, జుబేరియా |
తల్లిదండ్రులు | ఆబ్దుల్ సుభాన్ అలియాస్ మహమ్మద్ భాష, జైతున్ బీబీ |
పురస్కారాలు | నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారము |
ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా బర్మాను వదలి రాజమండ్రిలో స్థిరపడ్డారు.[ఆధారం చూపాలి] తండ్రి అబ్దుల్ సుభాన్ (మహమ్మద్ బాషా అని పిలిచేవారు) దర్జీ పని చేసేవాడు.[1] తల్లి జైతున్ బీబీ గృహిణి.[5] ఆలీ చిన్నప్పటి నుంచే చదువు మీద పెద్దగా ఆసక్తి లేకుండా నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. శ్రీపాద జిత్ మోహన్ మిత్రా బృందంలో మిమిక్రీ కళాకారుడిగా, డ్యాన్సులు, ప్రదర్శనలిచ్చేవాడు. మొదట రాజమండ్రిలోని గంటాలమ్మవీధిలో చిన్న పాకలో ఉండేవారు. ఆలీ పెద్దయ్యాక అక్కడినుండి వేరే ప్రాంతానికి మారారు.[6]
ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత దేవుడు మామయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. తిరిగి రాజమండ్రి నుంచి చెన్నై తిరిగి వచ్చేశాడు. ఈ సినిమాలు చూసిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆయన నిర్మిస్తున్న సినిమా కోసం మళ్లీ చెన్నైకి పిలిపించాడు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా ఆయన రూపొందిస్తున్న సీతాకోక చిలుక చిత్రం కోసం బాలనటుల కోసం చూస్తున్నాడని తెలిసి పరీక్ష కోసమని చెన్నైలో భారతీరాజా కార్యాలయానికి వెళ్ళాడు. ఆలీ ప్రతిభకు మెచ్చిన ఆయన తన చిత్రంద్వారా అవకాశం కల్పించాడు. ఈ సినిమా ఆలీకి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత బాల నటుడిగా కొన్ని చిత్రాలలో నటించాడు. ప్రేమఖైదీ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తో పాటు ఆలీ కూడా మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.[7]
కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎంద చాట అంటూ అలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత ఇలాంటి సంభాషణలే పలు సినిమాల్లో వాడుకున్నారు. అటు పిమ్మట యమలీల చిత్రంద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు. అడపా దడపా కథానాయక పాత్రలను పోషిస్తున్నా మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇస్తున్నాడు.
ఇప్పటి వరకు సుమారు 1100 పైగా చిత్రాలలో నటించాడు.
ఆలీ నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాల జాబితా.
1999 లో నటుడు మురళీమోహన్ తెలుగు దేశం పార్టీ సభ్యత్వం ఇప్పించాడు. అప్పుడు ఎన్నికల సమయంలో పలు నియోజక వర్గాల్లో పార్టీ తరఫున ప్రచారం చేశాడు. 2019 మార్చి 11 న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[17] ఆలీని 2022 అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[18] ఆలీ 2024 జూన్ 28న రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు.[19]
ఆలీ వివాహము జుబేదాతో జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహము. వీరికి ముగ్గురు సంతానము. పెద్ద కుమార్తె ఫాతిమా రమీజున్ బి. డి. ఎస్ విద్యార్థి. రెండో కుమార్తె జుబేరియా. కుమారుడు మహమ్మద్ బాషా. అలీ తమ్ముడు ఖయ్యూం అలియాస్ అజయ్ కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు.[3]
ఇతను చర్మవ్యాధుల నివారణకు ఉపయోగించే మన్మోహన్ జాదూ మలాం కు ప్రచారకర్తగా కూడా వ్యవహరించాడు.
1999 లో జెమిని టివి అధినేత కిరణ్ కు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమం ఆలోచన ఆలీ ఇచ్చాడు. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది నటులు, వ్యాఖ్యాతలు తయారయ్యారు. ఈటీవీ తెలుగులో ఆలీ 369, ఆలీ తో జాలీగా, ఆలీ తో సరదాగా మొదలైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.