Remove ads
From Wikipedia, the free encyclopedia
అచ్యుత దేవ రాయలు (అచ్యుతరాయలు) విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. తుళువ నరస నాయకుని మూడవ భార్య అయిన ఓబాంబ కుమారుడు. అచ్యుతరాయలు, తుళువ నరసనాయకుని దక్షిణ దండయాత్ర అనంతరం రామేశ్వరం దర్శించివచ్చిన తర్వాత జన్మించాడని "అచ్యుతరాయాభ్యుదయము", "వరదాబింక పరిణయం"లో పేర్కొనబడినది. [1] శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు. శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు. ఇతడు 1529 నుండి 1542 వరకు పరిపాలించాడు.
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
శ్రీకృష్ణదేవరాయల మరణంతో విజయనగరములో అంతఃకలహాలు చెలరేగాయి. అచ్యుతరాయల్ని వారసునిగా ప్రకటించడం నచ్చని కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయలు ప్రతిఘటించి అధికారం కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ విశ్వాసపాత్రులైన సాళువ నరసింగనాయకుడు వంటి సామంతులు ఆ ప్రయత్నాలు సాగనివ్వలేదు.
ఇతడు మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడు[1].అచ్యుతరాయల పట్టాభిషేకాలను రాజనాథ డిండిమభట్టు వ్రాసిన అచ్యుతరాయాభ్యుదయములో వివరముగా వర్ణించాడు.
అచ్యుతరాయలు రాజ్యము చేపట్టేనాటికి వారసత్వ పోరు కారణంగా విజయనగర రాజధానిలోని కల్లోల పరిస్థితులను ఆసరాగా తీసుకొని సామ్రాజ్యంపై ప్రతాపరుద్ర గజపతి దండెత్తినాడు. అయితే రాయలు గజపతిని తిప్పికొట్టాడు. 1530లో గోల్కొండ సుల్తాను కులీ కుత్బుల్ ముల్క్ దండెత్తి కొండవీడును ముట్టడించగా వెలుగోటి గని తిమ్మనాయుడు అతన్ని ఓడించి సుల్తాను అశ్వదళానికి అపార నష్టం కలిగించి దండయాత్రను తిప్పికొట్టాడు. ఇతను అనేక యుద్ధములందు విజయం సాధించాడు.
శత్రు దండయాత్రల ప్రమాదాన్ని గుర్తించిన అచ్యుతరాయలు, రామరాయలుతో సంధి చేసుకున్నాడు. కానీ సాళువ నరసింగనాయకునికి (సెల్లప్ప) అది నచ్చక ఉమ్మత్తూరు మొదలైన దుర్గాధిపతులతో కలిసి తిరుగుబాటు చేశాడు. అయితే అచ్యుతరాయల బావమరుదులైన సలకం పెద తిరుమలరాజు, సలకం చిన తిరుమరాజులు తిరుగుబాటును అణచివేసి శాంతిని నెలకొల్పారు.
కులీ కుత్బుల్ ముల్క్ తో కోయిలకొండ దగ్గర జరిగిన యుద్ధములో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్‌షా మరణించగా, అతని కొడుకు మల్లూ ఆదిల్‌షా రాజ్యాన్ని చేపట్టాడు. ఇతని పాలన నచ్చని ప్రజలు అసద్ ఖాన్ లారీ అనే ఉద్యోగి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఇదే అదనుగా 1535లో అచ్యుతరాయలు దండెత్తి రాయచూరు అంతర్వేదిని ఆక్రమించుకున్నాడు.
రాజధానిలో రామరాయలు బలం నానాటికి పెరగసాగింది. రామరాయల తమ్ములు వెంకటాద్రి, తిరుమలలు అతడికి అండగా ఉన్నారు. కందనవోలు, అనంతపూరు, ఆలూరు, అవుకు దుర్గాధిపతులు రామరాజు పక్షము వహించారు. ఇంతలో బీజాపూరులో మల్లూ ఆదిల్‌షాను తొలగించి ఇబ్రహీం ఆదిల్‌షా గద్దెనెక్కి, మల్లూ సానుభూతిపరులైన ఉద్యోగులను, మూడు వేల సైన్యాన్ని తొలగించాడు. అలా తొలగించబడిన సైనికులను రామరాయలు తన సైన్యములో చేర్చుకొని రాజధానిలోని తురకవాడలో నిలిపి ఉంచాడు.[6]
1536లో గుత్తి ప్రాంతములోని తిరుగుబాటును అణచి తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకొని రాజధానికి తిరిగివస్తున్న అచ్యుతరాయలను బంధించి, రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించి పట్టాభిషేక ప్రయత్నాలు జరిపాడు. కృష్ణదేవరాయల భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి రామరాయలకు మద్దతు నిచ్చారు. కానీ ప్రజలు, సామంతులు రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించడాన్ని ఇష్టపడలేదు. పట్టాభిషేకానికి అన్నీ సన్నద్ధం చేసుకున్నా, రాయరాయల పట్టాభిషేకం జరగలేదు.[7] మధుర, కొచ్చిన్ ప్రాంత సామంతులు కప్పం చెల్లించడం నిలిపివేశారు. రామరాయలు వారిపై దండయాత్రకు బయలుదేరిన సమయములో రాజధానిలోని ఉద్యోగులు సలకం పెద తిరుమలరాజుతో చేరి, అచ్యుతరాయల్ని చెర నుండి విడిపించి సింహాసనముపై పునఃప్రతిష్ఠించారు.
రామరాయలు రాజధానికి మరలేనాటికి ఇబ్రహీం ఆదిల్‌షా నాగలాపురాన్ని నేలమట్టం చేసి రాజధాన్ని సమీపించాడు. ఆదిల్‌షా ప్రతిపక్షంలో చేరతాడన్న భయముతో అచ్యుతరాయలు గానీ, రామరాయలు గానీ అతడిని ప్రతిఘటించలేదు. ఇద్దరూ ఆదిల్‌షా సహాయము అర్ధించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. అంతలో బీజాపూరులో ఆదిల్‌షాపై అసద్ ఖాన్ లారీ మొదలైన ఉద్యోగులు కుట్రలు ప్రారంభించారు. పరిస్థితిని గమనించిన ఆదిల్ షా అచ్యుత, రామరాయల మధ్య సయోధ్య కుదిర్చి బీజాపూర్ తిరిగి వెళ్ళాడు.
రామరాయలతో ఒప్పందం అయిన తర్వాత అచ్యుతరాయలు రాజ్య వ్యవహారాలను బావమరిది సలకం పెద తిరుమలరాజు పరం చేసి సర్వదా అంతఃపురములోనే గడిపినట్లు, దానితో ప్రభుత్వం నీరసించినట్లు తెలుస్తున్నది.[8] తుదకు అచ్యుతరాయలు ప్రజాభిమానం కోల్పోయి 1542లో మరణించాడు.
అచ్యుతరాయల మరణంతో రామరాయలు, సలకం తిరుమలల మధ్య స్పర్ధలు తీవ్రమై రాజ్యాన్ని అంతర్యుద్ధంలో ముంచెత్తాయి. అచ్యుతరాయలు కొడుకైన వెంకటపతిని సింహాసనంపై ఎక్కించి, తాను సంరక్షకునిగా అధికారం హస్తగతం చేసుకుని సింహాసనం ఆక్రమించటానికి తిరుమల ప్రయత్నం చేశాడు. దీనికి వ్యతిరేకంగా రాయరాయలు గుత్తి దుర్గంలో సదాశివరాయల్ని రాజుగా ప్రకటించాడు. సదాశివరాయలు అచ్యుతరాయల అన్న రంగరాయల కుమారుడు. అందుచే అచ్యుతరాయల కంటే విజయనగర సింహాసనంపై సదాశివునకు బలమైన హక్కు ఉందని చాటడం రామరాయల ఉద్దేశం.
తిరుమల, రామరాయల మధ్య సంవత్సరంపాటు జరిగిన అంతర్యుద్ధం అవకాశంగా తీసుకొని ఇబ్రహీం ఆదిల్‌షా రెండుసార్లు విజయనగరంపై దండెత్తాడు. మొదట్లో తిరుమలుని దురాశ నుండి తన కుమారుడు వెంకటపతిని రక్షించే ఉద్దేశముతో వరదాంబిక ఆదిల్‌షాను ఆహ్వానించింది. కానీ తిరుమలుడతనితో ఒప్పందం చేసుకొని వెనుకకు మరలించాడు. తిరిగి రామరాయల అభ్యర్ధనపై ఆదిల్‌షా విజయనగరంపై దండెత్తినాడు. ప్రజలు భయభ్రాంతులై సలకం తిరుమలుని విజయనగర సింహాసనం ఎక్కించారు. తిరుమల దేవ మహారాయలనే పేర పట్టాభిషిక్తుడై ఆదిల్‌షాను ఓడించి పారదోలటమే కాక రాజధానికి తిరిగి వచ్చి మేనల్లుడు వెంకటపతిని హత్యచేసి, తనకు ప్రతికూలురైన రాజోద్యోగులను హింసించాడు. అతని నిరంకుశపాలనకు ప్రజలు విసుగెత్తారు.
పరిస్థితిని గమనించి, రామరాయలు గుత్తి నుండి దండెత్తి వచ్చి తుంగభద్రా తీరములో తిరుమలను ఓడించి, సదాశివరాయలను రాజధానిలో పట్టాభిషిక్తుని చేసాడు.
న్యూనిజ్ రచనలు అచ్యుతరాయలను వ్యసనలోలునిగా, కౄరునిగా చిత్రీకరించినా, ఈయన ప్రశంసనీయుడని, సామ్రాజ్యపు గౌరవాన్ని, సంపదను నిలబెట్టేందుకు పోరాడాడని చెప్పటానికి ఆ తరువాత కాలములో శాసన, సాహిత్య ఆధారాలు లభించాయి.[9] ఇతడు సమర్ధుడనే కృష్ణదేవరాయలు తన వారసునిగా ఎన్నుకున్నాడు. అచ్యుతరాయల యొక్క జీవితము, పాలనను రెండు సంస్కృత కావ్యాలు, రెండవ రాజనాథ డిండిమ రాసిన అచ్యుతాభ్యుదయం, అచ్యుతరాయల భార్య తిరుమలాంబ రచించిన వరదాంబికా పరిణయం వివరముగా వర్ణిస్తాయి.[10]
అచ్యుత రాయలు విజయనగర సామంతుడైన సలకరాజు కుమార్తె వరదాంబికను వివాహమాడినాడు. వరదాంబికా పరిణయములో అచ్యుతరాయలు పెళ్ళినాటికే చక్రవర్తిగా రాసిన శాసనాధారాలు అచ్యుతరాయలు పట్టాభిషిక్తుడయ్యేనాటికి వరదాంబికతో వివాహమై, కుమారుడు చిన వెంకటపతి కూడా జన్మించియున్నాడని తెలుస్తున్నది. అచ్యుతరాయలతో వియ్యమందిన తరువాత సలకరాజు కుమారులు సలకం తిరుమలుల రాజకీయ ప్రాభవం పెరిగినా పెళ్ళికి ముందునుండే సలకం చిన తిరుమలుడు విజయనగరంలో సేనానిగా పనిచేస్తున్నాడని తెలుస్తున్నది.
ఇతని పరిపాలనా కాలములో హంపిలోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే అచ్యుతరాయ ఆలయము అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది.
ఇప్పుడు కపిల తీర్ధముగా ప్రసిద్ధమైన తిరుపతి లోని ఆళ్వార్ తీర్ధాన్ని అచ్యుతరాయలు నిర్మింపజేశాడు. తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1533లో స్వామివారి పుష్కరిణి మెట్లు బాగుచేయించి పాత పుష్కరిణి పక్కనే కొత్త పుష్కరిణిని కట్టించాడు. తిరుమలలో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు, ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు.[11] తమిళనాట దిండిగల్కు సమీపంలో వున్న తాడికొంబు ఆలయాన్ని తిరుమలరాయలు నిర్మింపజేసాడు.
కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు.[12] అచ్యుతరాయలు స్వయంగా తాళమహోదధి అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి చాటు విఠలనాధుడు, ప్రముఖ సంగీతకారుడు పురందరదాసు, సంస్కృత విద్వాంసుడు రెండవ రాజనాథ డిండిమభట్టు ఉండేవారు. డిండిమభట్టు అచ్యుతరాయాభ్యుదయముతో పాటు సంస్కృతములో భాగవత చంపు వ్రాసి అచ్యుతరాయలకు అంకితమిచ్చాడు. ఈయన ఆస్థానములోని తెలుగు కవులలో రాధామాధవ కవి ముఖ్యుడు. ఈయన రచించిన తారకబ్రహ్మరాజీయమును అచ్యుతరాయల మంత్రి నంజ తిమ్మనకు అంకితం చేశాడు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను వెంకట విలాస మండపము అని పిలిచేవారు.
అచ్యుత రాయల కాలములో స్త్రీలు కూడా చక్కని గ్రంథాలు రాశారు. తిరుమలాంబ వరదాంబిక పరిణయమనే కావ్యము రాసి అందులో అచ్యుత రాయల జీవిత విశేషాలు (చిన వెంకటాద్రిని యువరాజుగా అభిషిక్తుని చేసేవరకు) వివరించింది. ఈ కాలములో ఓడూరి తిరుమలాంబ అనే విదూషీమణి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అచ్యుతరాయలు విఠ్ఠలనాథుని ఆలయానికి బహుకరించిన స్వర్ణ మేరువును పొగుడుతూ ఈమె రాసిన శ్లోకాలు హంపిలోని విఠ్ఠలనాధుని దేవాలయములో ఉన్నాయి.[13] ఈ ఓడూరి తిరుమలాంబ, వరదాంబికా పరిణయము రాసిన తిరుమలాంబ ఒకరేనని కొందరు భావిస్తున్నారు.[10] ఈ కాలములోనే మోహనాంగి అనే మరో రచయిత్రి ఉంది. ఈమె మారిచీపరిణయం వ్రాసింది. ఈమె కృష్ణరాయల కుమార్తె అనీ, అళియ రామరాయల భార్య అనీ కూడా ప్రతీతి.[13]
అచ్యుత రాయలు స్వయంగా మంచి వీణా విద్వాంసుడు కూడా.[14] ఈయన ఉపయోగించిన ప్రత్యేక వీణ అచ్యుతభూపాళీ వీణగా పేరొందినది.[15][16]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.