Remove ads
విజయనగర పాలకుడు (1614) From Wikipedia, the free encyclopedia
మొదటి శ్రీరంగరాయలు 1614లో విజయనగర చక్రవర్తిగా కొద్దిరోజుల అతితక్కువ కాలం పరిపాలన చేసిన చక్రవర్తి. రాచకుటుంబంలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆయన కొద్దిరోజుల్లోనే జగ్గరాజు అనే రాజబంధువు వల్ల ఖైదులో పడ్డారు.[1]
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
1585 నుంచి 1614 వరకూ విజయనగర సామ్రాజ్యాన్ని పెనుకొండ, చంద్రగిరి కోటల నుంచి పరిపాలించిన చక్రవర్తి ఆరవీటి వేంకటపతిదేవరాయలు. ఆయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన అళియ రామరాయల తమ్ముని కుమారుడు. వేంకటపతి దేవరాయలకు నలుగురు భార్యలు ఉండేవారు. కొన్ని ఆధారాల ప్రకారం ఆయన భార్యల సంఖ్య ఐదు. వేంకటపతి దేవరాయ మహారాయలకు ఇందరు భార్యలున్నా పుత్రసంతానం మాత్రం ఏ భార్య వల్ల కూడా కలుగలేదు. వేంకటపతి దేవరాయల పెద్ద భార్య వెంకటాంబ తన పుట్టింటి వారితో ఒక తంత్రం నడిపారు. వెంకమాంబ పుట్టింటి ప్రాంతానికి చెందిన ఓ బ్రాహ్మణస్త్రీ గర్భవతిగా ఉండగా భర్త చనిపోవడంతో తనకున్న స్థితిలో తనకు పుట్టబోయే బిడ్డను ఎవరికైనా ఇవ్వాలని ఆశించింది. ఆ విషయాలు తెలుసుకున్న ప్రాంతపాలకులైన వెంకటాంబ తండ్రి తన కూతురికి నెలతప్పిందని ప్రకటించి ఆమెకు మగబిడ్డ పుడితే వానిని ఆమె కుమారునిగా ప్రకటింపజేసే పన్నుగడ పన్నారు. అలా ఆమె తాను గర్బం ధరించినట్టు వేషంవేసింది. చివరకు బ్రాహ్మణ స్త్రీకి మగపిల్లాడు పుట్టడంతో వానిని తీసుకువచ్చి ఆమె పక్కలోవేసి అతను చక్రవర్తి కుమారుడన్నట్టు భ్రమింపజేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం రాయలవారి వరకూ వచ్చింది. అయితే ఈ విషయంపై ఏం చేసినా తనకూ, రాణికీ కూడా అపకీర్తి కలుగుతుందని భావించి ఏమీ ఎరగనివానిలా ఉన్నారు. పుత్రోత్సవం జరిపి నామకరణం చేసి ‘’చిక్కరాయలు’’ అని ఆ పిల్లానికి పేరు పెట్టారు. రాకుమారునికి జరిపే ముద్దుముచ్చటల్లో లోపం ఏమీ చేయకున్నా అతనిపై పుత్రునిపై చూపే ప్రేమ చూపేవారుకాదు. అదుపాజ్ఞల్లో పెంచారు. పద్నాలుగేళ్ళ వయసులో రాయలవారు తమ బావమరిది కుమార్తెనిచ్చి చిక్కరాయలకు పెళ్ళిచేశారు. ఎంతచేసినా యువరాజుకు ఇచ్చే మర్యాదలు మాత్రం చిక్కరాయలకు దక్కించలేదు.[1]
వెంకటపతి దేవరాయల కుమారుడు బ్రాహ్మణ పుత్రుడని నమ్మిక రూఢిగా వ్యాపించివుండడంతో ఆయన తర్వత రాజ్యానికి ఎవరు వస్తారనే విషయంపై సా.శ1600 నాటికే ఆలోచన ఉంది. రాయలవారి అన్నయ్య, శ్రీరంగపట్నానికి రాజప్రతినిధిగా ఉన్నవారు అయిన రామరాయలకి చామరాజు, రంగరాయలు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడైన రంగరాయలపై ఆయన ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఈ రంగరాయలే చక్రవర్తి అవుతాడన్న అభిప్రాయం వ్యాపించేవుంది. చివరకు రాజుకు అవసానకాలం ఆసన్నమైనప్పుడు 1614లో మంత్రులు, సామంతులు మొదలైన ముఖ్యరాజపురుషుల సమక్షంలో తన కొడుకుగా చెప్పబడే చిక్కరాయలను కాదని అన్న చిన్నకొడుకు శ్రీరంగరాయలకు తన రాజ్యం చేయవలసిందని ఉంగరాన్నిచ్చి వారసుణ్ణి చేశారు. ఐతే అప్పుడు శ్రీరంగరాయలు ఏడుస్తూ ముందు రాజ్యం వద్దన్నాడని, అక్కడున్న రాజపురుషులు చెప్పినమీదట రాజ్యాన్ని తీసుకున్నాడని ప్రత్యక్షంగా చూసిన బర్రడస్ అనే చరిత్రకారుడు వర్ణించారు. శ్రీరంగరాయలు 1614లో వెంకటపతి దేవరాయలు మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించారు.[1]
రాణీ వెంకటాంబ సోదరుడైన గొబ్బూరి జగ్గరాజు తన మేనల్లునిగా చెలామణి అయ్యేవానికి రాజ్యందక్కితే తాను అధికారం చేయవచ్చన్న ఊహలు కల్లలు కాగా కొందరు సర్దార్ల సహకారాన్ని స్వీకరించి తాను శ్రీరంగరాయలను ఖైదుచేయించారు. ఆపైన తన మేనల్లుడిని రాజ్యంలో నిలిపారు. బలవంతుడైన జగ్గరాజుని ఎదిరించలేక జగ్గరాజు పక్షానే చాలామంది సామంతులు, సర్దార్లు చేరారు. వెంకటగిరి జమీందార్ల పూర్వీకుడు యాచమనాయుడు మాత్రం వెంకటపతి దేవరాయల ఇష్టానికి విరుద్ధమైన ఈ పనిని అంగీకరించలేక జగ్గరాజును వ్యతిరేకించి నిలిచారు.
ఖైదులో ఉన్న రాజకుటుంబాన్ని విడిపించే ప్రయత్నం చేయగా సాధ్యమైనంతలో శ్రీరంగరాయలు తన పన్నెండేళ్ళ కొడుకును మాత్రం పంపగలిగారు. చాకలివాడి మురికిగుడ్డల మూటలో బయటకు తీసుకువచ్చిన రామదేవరాయలను యాచమనాయుడి వద్దకు చేర్చారు. ఈ విషయం తెలియగానే చాలామంది సర్దార్లు యాచమనాయుని పక్షాన చేరారు. సర్దార్లను భయపెట్టి, లంచాలిచ్చి తన పక్షాన నిలుపుకుంటూ చెరసాలలోని రాచకుటుంబానికి బందోబస్తు జగ్గరాజు బాగా పెంచారు. [1]
యాచమనాయుడు రాచకుటుంబాన్ని చెరవిడిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసి తుదకు చెరసాల నుంచి బయటకు తన నమ్మకస్తుడైన బంటుతో ఓ సొరంగం తవ్విస్తూపోయాడు. దాని గుండా రాయలవారిని బయటకు రప్పించాలని ప్రయత్నించేలోగానే పహరాకాసే బంటు ఆ సొరంగంపైన అడుగువేసి బోలుగా ఉన్న నేలలోకి దిగబడిపోగా రహస్యం బయటపడింది. ఈ విషయానికి కోపించిన జగ్గరాజు రాచకుటుంబాన్ని మొత్తంగా చంపించారు. ఇది విని రాజధానిలో అందరూ లోపల్లోపలే అట్టుడికిపోయారు కానీ ఏమీ చేయలేకపోయారు.
యాచమనాయుడు విద్యానగర సామ్రాజ్య సామంతులలో తంజావూరు నాయకులైన అచ్యుతప్పనాయకుడు, అతని కుమారుడు రఘునాధ నాయకుడు మాత్రమే సరైనవారని వారి సహకారం కోరారు. వారు అంగీకారంతో తీసుకువెళ్ళి రామదేవరాయలను ప్రవేశపెట్టారు. ఆ విషయం తెలిసిన జగ్గరాజు తంజావూరు సంప్రదాయ శత్రువులైన మధుర, జింజి నాయకుల సహకారంతో తంజావూరును పట్టుకునేందుకు బయలుదేరారు. తంజావూరు వారు కావేరి నదిని దాటకుండేందుకు కావేరీ అనకట్ట తెగగొట్టించారు. ప్రజలందరికీ ఉపకరించే చక్కని ఆనకట్ట కక్షలు తీర్చుకునేందుకు తెగగొట్టిన ఆ జగ్గరాక్షుసుని స్వయంగా చంపితీరతానని రఘునాధ నాయకుడు పంతం పట్టి మరీ యుద్ధంలో వధించారు. 1616లో జరిగిన ఈ యుద్ధానంతరం రామదేవరాయలు పట్టాభిషిక్తుడయ్యారు. ఆయన 1632 వరకూ చంద్రగిరిలో రాజ్యపాలన చేశారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.