తంజావూరు
From Wikipedia, the free encyclopedia
తంజావూరు, దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని ఒక పట్టణం. ఈ పట్టణం కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది. చెన్నై నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. తంజావూరు జిల్లాకు ఈ పట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్-అన్ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ, శ్రీ నీలమేగప్పెరుమాల్ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టబడిందని నమ్ముతారు.ఈ నగరం తంజావూరు జిల్లాకు ప్రధాన కేంద్రం. కావేరీ డెల్టాలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యవసాయ కేంద్రం. దీనిని తమిళనాడు బియ్యం బుట్ట అని పిలుస్తారు. తంజావూరు 128.02 చ.కి.మీ (49.43 చ.మైళ్లు) విస్తీర్ణంలో నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన సాగుతుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 2,90,720 జనాభాను కలిగి ఉంది. రహదారి మార్గాలు ప్రధాన రవాణా సాధనాలు, నగరం నుండి రైలు ద్వారా ప్రయాణసౌకర్యం కూడా అందుబాటులో కలిగి ఉంది. నగరానికి 59.6 కిమీ (37.0 మైళ్ళు) దూరంలో ఉన్న తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. తంజావూరు నుండి 94 కిమీ (58 మైళ్ళు) దూరంలో ఉన్న కారైకాల్ సమీప ఓడరేవు.
Thanjavur
Tanjore | |
---|---|
Smart City | |
![]() | |
Coordinates: 10°47′13.2″N 79°08′16.1″E | |
Country | India |
State | Tamil Nadu |
District | Thanjavur |
Region | Cauvery Delta |
Government | |
• Type | City Municipal Corporation |
• Body | Thanjavur Municipal Corporation |
• Mayor | Shan.Ramanathan (DMK) since 2022 |
విస్తీర్ణం | |
• Total | 128.02 కి.మీ2 (49.43 చ. మై) |
Elevation | 77 మీ (253 అ.) |
జనాభా (2023) | |
• Total | 4,52,989 |
• Rank | 11th in Tamil Nadu |
• జనసాంద్రత | 3,500/కి.మీ2 (9,200/చ. మై.) |
Demonym | Tanjorians |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 613 0XX |
Telephone code | 04362 |
Vehicle registration | TN-49 |
చరిత్ర


చారిత్రకముగా ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. చోళుల పాలనలో సామ్రాజ్యం రాజధానిగా పనిచేసినప్పుడు ఈ నగరం మొదట ప్రాముఖ్యతను సంతరించుకుంది.తరువాత నాయక రాజులు తరువాత విజయ నగర రాజులు ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ శివాజీ మహా రాజుకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కానీ విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.ఇది 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో భాగంగా ఉంది.
సంగం కాలం (సా.శ.పూ. 3వ శతాబ్దం నుండి నాల్గవ శతాబ్దం వరకు) తమిళ రికార్డులలో తంజావూరుకు సంబంధించిన ప్రస్తావనలు లేవు, అయితే కొంతమంది పండితులు ఈ నగరం అప్పటి నుండి ఉనికిలో ఉందని భావిస్తున్నారు. కోవిల్ వెన్ని, నగరానికి తూర్పున 15 మైళ్ల (24 కిమీ) దూరంలో ఉంది, ఇది చోళ రాజు కరికాల, చేరస్, పాండ్యుల సమాఖ్య మధ్య వెన్ని యుద్ధం జరిగిన ప్రదేశం.[1] 1365, 1371 మధ్య శ్రీరంగంపై దండయాత్ర చేసిన సమయంలో కంపన్న ఉడయార్ తంజావూరును జయించాడని నమ్ముతారు. 1443 నాటి దేవరాయ శాసనం, 1455 నాటి తిరుమల శాసనం 1532- 1539 నాటి అచ్యుతదేవుని భూదానాలు తంజావూరుపై విజయనగరం ఆధిపత్యాన్ని ధృవీకరిస్తున్నాయి.[2][3] ఆర్కాట్‌లోని విజయనగర వైస్రాయ్ సేవప్ప నాయక్ (1532–80), 1532లో (1549, కొన్ని ఆధారాల ప్రకారం) స్వతంత్ర చక్రవర్తిగా స్థిరపడి తంజావూరు నాయక్ రాజ్యాన్ని స్థాపించాడు.[4] అచ్యుతప్ప నాయక్ (1560–1614), రఘునాథ నాయక్ (1600–34), విజయ రాఘవ నాయక్ (1634–73) తంజావూరును పాలించిన నాయక్ రాజవంశానికి చెందిన ముఖ్యమైన పాలకులు.[5][6] 1673లో తంజావూరు మదురై నాయక్ రాజు చొక్కనాథ నాయక్ (1662–82) చేతిలో పడడంతో రాజవంశం పాలన ముగిసింది.1673.[7] చొక్కనాథ కుమారుడైన విజయ రఘునాథ నాయక్ ఒక యుద్ధంలో చంపబడ్డాడు. చొక్కనాథ సోదరుడు అళగిరి నాయక్ (1673–75) సామ్రాజ్య పాలకుడిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. 1674లో బీజాపూర్ సుల్తాన్ మరాఠా సామంతుడు, భోంస్లే రాజవంశానికి చెందిన శివాజీ (1627/30-80) సవతి సోదరుడు ఎకోజీ I (1675–84) తంజావూరును విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఏకోజీ తంజావూరు మరాఠా రాజ్యాన్ని స్థాపించాడు, ఇతను 1855 వరకు తంజావూరును పాలించాడు.1855.[8][9]మరాఠాలు 17వ చివరి త్రైమాసికంవరకు, 18వ శతాబ్దమంతా తంజావూరుపై తమ సార్వభౌమాధికారాన్ని ప్రదర్శించారు. 1787లో, తంజావూరు రాజప్రతినిధి అయిన అమర్ సింగ్, మైనర్ రాజా, అతని మేనల్లుడు సెర్ఫోజీ II (1787–93)ను తొలగించి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సెర్ఫోజీ II బ్రిటిష్ వారి సహాయంతో 1799లో పునరుద్ధరించబడ్డాడు, అతను రాజ్య పరిపాలనను విడిచిపెట్టమని ప్రేరేపించాడు. తంజావూరు కోట, చుట్టుపక్కల ప్రాంతాలకు అతనికి అప్పగించాడు. చివరి తంజావూరు మరాఠా పాలకుడు శివాజీ II (1832–55) చట్టబద్ధమైన మగ వారసుడు లేకుండా మరణించినప్పుడు, 1855లో 1855లో డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ ద్వారా రాజ్యం బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయబడింది. బ్రిటిష్ వారు తమ రికార్డులలో ఈ నగరాన్ని తంజోర్ అని పేర్కొన్నారు.[10] ఇది విలీనం అయిన ఐదు సంవత్సరాల తరువాత, బ్రిటిష్ వారు నెగపటం (నేటి నాగపట్నం) స్థానంలో తంజావూరును జిల్లా పరిపాలనా కేంద్రంగా మార్చారు. బ్రిటిష్ పాలనలో, తంజావూరు ఒక ముఖ్యమైన ప్రాంతీయ కేంద్రంగా ఉద్భవించింది. 1871 భారత జనాభా లెక్కల ప్రకారం 52,171 జనాభా నమోదైంది, మద్రాసు ప్రెసిడెన్సీలో తంజావూరు మూడవ అతిపెద్ద నగరంగా మారింది.[11] భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, తంజావూరు జిల్లా కేంద్రంగా కొనసాగుతుంది.[12]
జనాభా గణాంకాలు
సంవత్సరం | జనాభా | ±% |
---|---|---|
1871 | 52,171 | — |
1881 | 54,745 | +4.9% |
1891 | 54,390 | −0.6% |
1901 | 57,870 | +6.4% |
1911 | 60,341 | +4.3% |
1921 | 59,913 | −0.7% |
1931 | 66,889 | +11.6% |
1941 | 68,702 | +2.7% |
1951 | 1,00,680 | +46.5% |
1961 | 1,11,099 | +10.3% |
1971 | 1,40,547 | +26.5% |
1981 | 1,84,015 | +30.9% |
1991 | 2,02,013 | +9.8% |
2001 | 2,15,725 | +6.8% |
2011 | 2,92,943 | +35.8% |
Sources:* 1871 – 1901: Imperial Gazette of India, Volume 23. Clarendon Press. 1908.* 1901 – 2001: "Populationmythu growth". Thanjavur municipality website. Archived from the original on 25 July 2010.* 2011:[13] |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తంజావూరులో దాదాపు 2,50,000 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 1,042 స్త్రీల లింగ నిష్పత్తిగా ఉంది,ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ.[14]నగర జనాభా మొత్తంలో 19,860 మంది ఆరేళ్లలోపు వారు ఉన్నారు.వారిలో 10,237 మంది పురుషులు ఉండగా, 9,623 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 9.22% ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలు జనాభా .21% మంది ఉన్నారు. నగర సగటు అక్షరాస్యత 83.14%,దీనిని జాతీయ సగటు 72.99% పోల్చగా ఎక్కువ ఉంది.[15] మొత్తం 78,005 మంది కార్మికులు ఉన్నారు, వీరిలో 803 మంది రైతులు, 2,331 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 2,746 మంది గృహ పరిశ్రమలపై ఆధారపడిన వారు, 65,211 మంది ఇతర కార్మికులు, 6,914 మంది సన్నకారు కార్మికులు, 110 మంది సన్నకారు రైతులు, 235 మంది సన్నకారు వ్యవసాయ కార్మికులు ఉన్నారు.[13]
2011 భారత మతపరమైన జనాభా లెక్కల ప్రకారం, తంజావూరు (ఎం) లో 82.87% హిందువులు, 8.34% ముస్లింలు, 8.58% క్రైస్తవులు, 0.01% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.06% జైనులు, 0.11% ఇతర మతాలను అనుసరించేవారు లేక ఏ మతపరమైన ప్రాధాన్యతను సూచించనివారు 0.01% మంది ఉన్నారు.[16] తమిళం విస్తృతంగా మాట్లాడే భాష, ప్రామాణిక మాండలికం మధ్య తమిళ మాండలికం. తెలుగు, తంజావూరు మరాఠీ, సౌరాష్ట్ర ఈ నగరంలో మాట్లాడే భాషలు. తంజావూరు మరాఠీ ప్రజల సాంస్కృతిక, రాజకీయ కేంద్రం. హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ, నగరంలో ముస్లింలు, క్రైస్తవులు కూడా గణనీయమైన జనాభాను కలిగి ఉన్నారు. తంజావూరులోని రోమన్ క్యాథలిక్‌లు తంజోర్‌లోని రోమన్ క్యాథలిక్ డియోసెస్‌కు అనుబంధంగా ఉన్నారు. ప్రొటెస్టంట్లు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రిచీ-తంజోర్ డియోసెస్‌కు అనుబంధంగా ఉన్నారు.[17]
భౌతిక వివరణలు
ఈ నగరం తమిళనాడు లోని నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో తమిళులు, తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. తరువాత సౌరాష్ట్రీయులు, మరాఠీలు ఉంటారు.
భౌగోళికం
నగరం ఒక పైవంతెన (ఫ్లై ఓవరు) వల్ల రెండుగా విభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రం, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రం. ఈ జిల్లా సరిహద్దులుగా 'వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్, కీలవస్తచావిడీ ఉన్నాయి.
వృత్తి
ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయదారులు. ఇక్కడ నలభైకిపైబడి ఉన్న మెడికల్ కాలేజీల వల్ల ఎక్కువ సంఖ్యలో డాక్టర్లు ఉన్నారు.నగర నివాసుల ప్రధాన వృత్తి పర్యాటకం, సేవా ఆధారిత పరిశ్రమ, సాంప్రదాయ వృత్తి వ్యవసాయం. తంజావూరును "తమిళనాడు రైస్ బౌల్" అని పిలుస్తారు. వరి పంట, ఇతర పంటలుగా నల్లరేగడి నేలలలో, అరటి, కొబ్బరి, శొంఠి, రాగి, ఎర్ర శనగ, పచ్చి శనగ, చెరకు, మొక్కజొన్న పండిస్తారు
సంస్కృతి
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరం ముఖ్యముగా కర్నాటక సంగీతానికి చేసిన సేవలకూ, భరత శాస్త్రానికి చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే తంజావూరు పెయింటింగు పరిశ్రమకు చాలా ప్రసిద్ధి. ఇంకా వీణ, బొమ్మలు తయారీకి ప్రసిద్ధి. తంజావూరులో తమిళ సంప్రదాయాలు గల కుటుంబాలు ఎక్కువ. ఇక్కడ లలితకళాక్షేత్రం ఉంది.
ప్రముఖ వ్యక్తులు
- జి.ఎ.నటేశన్ - గణపతి అగ్రహారం అన్నాదురై అయ్యర్ నటేశన్ (1873 ఆగష్టు 25 - 1948 ఏప్రిల్ 29) ఇతను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రచురణకర్త, రాజకీయ నాయకుడు. అతను జి.ఎ. నటేశన్ & కో అనే ప్రచురణ సంస్థను స్థాపించాడు. అది జాతీయవాద పుస్తకాలను ప్రచురించింది. వాటిలో ప్రముఖమైంది "ది ఇండియన్ రివ్యూ."
విద్యా సౌకర్యం

తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రంగా వెలుగొందుతుంది. తంజావూరులో మొత్తం నాలుగు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అవి పెరియార్ మణిఅమ్మై ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , టెక్నాలజీ, పి.ఆర్.ఐ.ఎస్.టి. విశ్వవిద్యాలయం, శస్త్ర విశ్వవిద్యాలయం, తమిళ విశ్వవిద్యాలయం.[18]
తమిళ విశ్వవిద్యాలయం - 1981లో ప్రారంభించబడిన ప్రభుత్వ సంస్థ. 1983లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి దాని చట్టబద్ధమైన గుర్తింపును పొందింది. తమిళ భాష , శాస్త్రాలలో ఉన్నత పరిశోధనలు చేయడం, భాషాశాస్త్రం, అనువాదం, నిఘంటువు, సంగీతం, నాటకం, మాన్యుస్క్రిప్టులాజీ వంటి వివిధ అనుబంధ విభాగాలలో ఉన్నత అధ్యయనాలు చేస్తున్న తమిళనాడులోని విద్యాకేంద్రాలలో ఇది ఒకటి[19][20]
తంజావూరులో మొత్తం 15 ఆర్ట్స్ , సైన్స్ మేనేజ్‌మెంట్ కళాశాలలు, తొమ్మిది ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.[21] తంజావూరు వైద్య కళాశాల 1961లో స్థాపించబడింది. ఇది తమిళనాడులోని పురాతన వైద్య కళాశాలల్లో ఒకటి.[22] వరి ప్రాసెసింగ్ రీసెర్చ్ సెంటర్ (పి.పి.ఆర్.సి), ఇది తర్వాత 2017లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీగా మారింది, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశోధనకు కేంద్రంగా ఉంది.[23] 16వ శతాబ్దం చివరి నాటి సరస్వతి మహల్ గ్రంథాలయం, జిల్లా పరిపాలన నిర్వహణలో ఉన్న కేంద్ర గ్రంథాలయం నగరంలో రెండు ప్రముఖ గ్రంథాలయాలు.[24] తంజావూరులో 20 నమోదిత పాఠశాలలు ఉన్నాయి, ఇవి నగరం ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక విద్యా అవసరాలను తీరుస్తున్నాయి.[25] తంజావూరులోని సెయింట్ పీటర్స్ హయ్యర్ సెకండరీ పాఠశాలను 1784లో రెవ. సి ఎఫ్ స్క్వార్ట్జ్ స్థాపించాడు. వాస్తవానికి కళాశాలగా స్థాపించబడింది, ఇది దక్షిణ భారతదేశంలో స్థానిక ప్రజలకు ఇంగ్లీష్ నేర్పిన మొదటి పాఠశాల.[26] తంజావూరు డియోసెస్ ద్వారా 1885లో స్థాపించబడిన సెయింట్ ఆంటోనీస్ హయ్యర్ సెకండరీ స్కూల్, తంజావూరు జిల్లాలోని పురాతన పాఠశాలల్లో ఒకటి. తంజావూరులో ఆంగ్ల విద్యను ప్రోత్సహించడంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రముఖ పాత్ర పోషించారు.[27] కళ్యాణసుందరం హయ్యర్ సెకండరీ స్కూల్, 1891లో స్థాపించబడింది, ఇది నగరంలోని పురాతన పాఠశాలల్లో ఒకటి.[28]
చూడవలసిన ప్రదేశాలు

- తంజావూరు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, తమిళనాడులోని ప్రధాన పర్యాటక కేంద్రం. తంజావూరులోని సౌత్ జోన్ సంస్ర్కతి కేంద్రంగా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వంచే స్థాపించబడిన ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలలో ఒకటి.[29] తంజావూరులో ఎక్కువగా సందర్శించే స్మారక చిహ్నం బృహదీశ్వర ఆలయం, దీని నిర్మాణం, చరిత్రకారుడు పెర్సీ బ్రౌన్ "దక్షిణ భారతదేశంలో నిర్మాణ కళ పరిణామంలో ఒక మైలురాయి"గా అభివర్ణించారు. 11వ శతాబ్దంలో చోళ రాజు రాజ రాజ చోళ I (985–1014) చే నిర్మించబడిన ఈ ఆలయం హిందూ దేవుడు శివునికి అంకితం చేయబడింది. గర్భగుడి గోడలు చోళ, నాయకుల కాలం నాటి గోడ చిత్రాలతో కప్పబడి ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. రాజా రాజ కుమారుడు రాజేంద్ర చోళ I (1012–44) నిర్మించిన గంగైకొండ చోళేశ్వర ఆలయంలో ఇది ప్రతిరూపం చేయబడింది. బృహదీశ్వరాలయం - తంజావూరు, రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి చాలా ప్రసిద్ధిచెందిన ఆలయం. ఈ ఆలయం 1987లో యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది. [30][31]ఈ దేవాలయం హిందూదేవుడు శివునికి అంకితం చేయబడింది.[32]
- తంజావూరు మరాఠా రాజ మహల్ - 1674 నుండి 1855 వరకు తంజావూరు ప్రాంతాన్ని పాలించిన భోంస్లే కుటుంబానికి చెందిన అధికారిక నివాసంగా ఉంది. దీనిని వాస్తవానికి తంజావూరు నాయక్ రాజ్య పాలకులు నిర్మించారు. వారి పతనం తరువాత ఇది తంజావూరు మరాఠాల అధికారిక నివాసంగా పనిచేసింది.[33] 1799లో తంజావూరు మరాఠా రాజ్యంలో ఎక్కువ భాగం బ్రిటీష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్నప్పుడు, తంజావూరు మరాఠాలు ప్యాలెస్ చుట్టుపక్కల కోటపై ఆధిపత్యాన్ని కొనసాగించారు. రాజభవనం యొక్క మూడవ చతుర్భుజం యొక్క దక్షిణ భాగంలో గూడగోపురం అని పిలువబడే 190 అడుగులు (58 మైళ్లు) టవర్ లాంటి భవనం ఉంది. ఈ ఆలయాన్ని 1680లో తంజావూరు మొదటి మరాఠా రాజు వెంకోజీ నిర్మించారు.
- సరస్వతీ మహల్ గ్రంథాలయం - తమిళనాడులో ప్రఖ్యాత చెందిన ఈ గ్రంధాలయం రాజ మహల్ ప్రాంగణంలో సుమారు 1700 సంవత్సరములో స్థాపించబడింది. తాళపత్ర, కాగితంపై వ్రాసిన 30,000 పైగా భారతీయ, యూరోపియన్ భాషలలో చేతిరాత ప్రతులు ఉన్నాయి.[34] దాని చేటిరాత ప్రతులలో ఎనభై శాతానికి పైగా సంస్కృతంలో ఉన్నాయి. వాటిలో చాలా తాళపత్రాలపై ఉన్నాయి. తమిళ రచనలలో వైద్యానికి సంబంధించిన గ్రంథాలు, సంగం సాహిత్యంపై వ్యాఖ్యానాలు ఉన్నాయి.[35]
- రాజరాజ చోళ చిత్రకళా మందిరం ఇది రాజ మహల్ లోపల ఉంది - ఇది 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దాల నాటి రాతి, కాంస్య చిత్రాల పెద్ద సేకరణను కలిగి ఉంది. గ్యాలరీలో ఉన్న చాలా విగ్రహాలు తంజావూరు జిల్లాలోని వివిధ దేవాలయాల నుండి సేకరించబడ్డాయి.[36]
- శివగంగ ఉద్యానవనం - ఇది బృహదీశ్వర ఆలయానికి తూర్పున ఉంది. రాజ రాజ చోళుడు నిర్మించినట్లు విశ్వసించబడే శివగంగ చెరువును ఇది చుట్టుముట్టింది. దీనిని 1871-72లో తంజోర్ ప్రజల పురపాలక సంఘ పార్కుగా రూపొందించింది.[37] It h దీనిలో మొక్కల, జంతువుల, పక్షుల సమాహారముతో కలిగి ఉంది, నగరంలో పిల్లలకు ఇది జూ పార్కుగా పనిచేస్తుంది. [38]
ఇవి కూడా చూడండి
- కరంతై తమిళ సంఘం
- ప్రసన్న వెంకటేశ పెరుమాళ్ ఆలయం
- గంగైకొండ చోళపుర ఆలయం
- బృహదీశ్వరాలయం
- తిరునల్లార్ ఆలయం
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.