తంజావూరు
తంజావూరు, దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని ఒక పట్టణం. ఈ పట్టణం కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది. చెన్నై నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. తంజావూరు జిల్లాకు ఈ పట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్-అన్ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ, శ్రీ నీలమేగప్పెరుమాల్ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టబడిందని నమ్ముతారు.ఈ నగరం తంజావూరు జిల్లాకు ప్రధాన కేంద్రం. కావేరీ డెల్టాలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యవసాయ కేంద్రం. దీనిని తమిళనాడు బియ్యం బుట్ట అని పిలుస్తారు. తంజావూరు 128.02 చ.కి.మీ విస్తీర్ణంలో నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన సాగుతుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 2,90,720 జనాభాను కలిగి ఉంది. రహదారి మార్గాలు ప్రధాన రవాణా సాధనాలు, నగరం నుండి రైలు ద్వారా ప్రయాణసౌకర్యం కూడా అందుబాటులో కలిగి ఉంది. నగరానికి 59.6 కిమీ దూరంలో ఉన్న తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. తంజావూరు నుండి 94 కిమీ దూరంలో ఉన్న కారైకాల్ సమీప ఓడరేవు.