మూస:ఇస్లాం దీన్ (ధర్మం) ఇస్లాం దీన్ (ధర్మం): ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం.అల్లాహ్ సృష్టించిన తొలి మానవుడు , ప్రథమ ప్రవక్త ఆదాము మొట్టమొదటి ముస్లిం (దైవవిదేయుడు). ముహమ్మద్ (ఆయనపై శాంతి శుభాలు వర్షించునుగాక) ఆఖరి ప్రవక్త .
ఇది ముహమ్మద్ (ఆయన పై శాంతి,శుభాలు కలుగుగాక) ద్వారా పరిపూర్ణం చేయబడిన దీన్ (ధర్మం), దాదాపు 200 కోట్ల జనాభాతో ప్రపంచంలో క్రైస్తవం తరువాత ఇస్లాం రెండవ అతి పెద్దది [1]
ఇస్లాం అనునది సిల్మ్, సలాం అనే అరబ్బి పదం నుండి వచ్చింది దీని అర్థం శాంతి, ముస్లిం అనగా అల్లాహ్‌కి తన విధేయత ప్రకటించిన వ్యక్తి అని అర్ధం.
ఇస్లాం అనే పదానికి మూలం అరబీ భాషాపదం 'సిల్మ్', సలాం అంటే శాంతి, స్వచ్ఛత, అర్పణ, అణకువ , సత్ శీలత. ధార్మిక పరంగా చూస్తే ఇస్లాం అనగా భగవదేఛ్ఛకు అర్పించడం , అతడి ధర్మానికి అనుగుణంగా నడచుకోవడం. ముస్లిం అనగా భగవదేఛ్ఛకు లోబడి, స్వయాన్ని భగవంతుడికి అప్పగించేవాడు, శాంతి కాముకుడు, శాంతి స్థాపకుడు. మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన మార్గాన్ని, ధర్మాన్ని అవలంబించువాడు. మానవులకులకు పరమ పవిత్రం దేవుని (అల్లాహ్) వాక్కు, ఆదేశము ఖురాన్, మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు/ఉల్లేఖనాలు హదీసులు. అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు , ప్రథమ ప్రవక్త. ముహమ్మద్ చివరి ప్రవక్త.[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక]
ఇస్లాం ఐదు మూలస్తంభాలు
ఇస్లాం విశ్వాసాల ప్రకారం,భగవంతుడు (అల్లాహ్) తన ఆఖరి ప్రవక్త ముహమ్మద్ను ఉపదేశకుడుగా పంపాడు, ఖురాను (పవిత్ర గ్రంథం) అవతరింపజేశాడు. ఇస్లాం ఐదు మూలస్తంభాలుగా పరిగణించబడే నమ్మకాలు.
విశ్వాసం
ఖురాను ప్రకారం ప్రతి ముస్లిం అల్లాహ్, అవతరింపబడ్డ గ్రంధాలు, దేవదూతలు, ప్రవక్తలు, ప్రళయదినం పై విశ్వాసం వుంచవలెను. హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) ప్రవక్తలు అవతరించారు. ఖురానులో 25 ప్రవక్తల ప్రస్తావన ఉంది. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్ ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో చాలామంది ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ అల్లాహ్ ప్రవక్తలను అవతరింపజేశాడు. ప్రతి ప్రవక్త అల్లాహ్ యొక్క శుభ సూచికలు , హెచ్చరికలను ప్రజానీకానికి చేరవేస్తాడు. ప్రతి ప్రవక్తకాలంలోని ప్రవక్తల అనుయాయులందరూ ముస్లిములే, కాని క్రొత్త ప్రవక్త అవతరించినచో అతడిని అవలంబించవలసి యుంటుంది. ఉదాహరణకు ఇబ్రాహీం ప్రవక్త అనుయాయులు ఇస్మాయీల్, లను అవలంబించారు. వీరి అనుయాయులను అవలంబించారు. వీరి అనుయాయులును అవలంబించారు. ఇది ప్రవక్తల గొలుసుక్రమం. వీరందరూ ఈ క్రమంలోని అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ ను అవలంబించవలెను. ఈ విశ్వాసం గలవారే ముస్లింలు. ఈవిధంగా విశ్వాసం (ఈమాన్) వుంచేవారిని విశ్వాసులు లేక మోమిన్ (ఆస్తికులు) అని, అవిశ్వాసులను కాఫిర్ (నాస్తికులు) లేక తిరస్కారులు అని అంటారు.
అల్లాహ్
అల్లాహ్ ఆ సర్వేశ్వరుడి నామం. సకల చరాచర జగత్తును సృష్టించిన మహాసృష్టికర్త. ఇస్లాంలో ఏకేశ్వరోపాసన కఠోర నియమము. అల్లాహ్ పై విశ్వాసప్రకటనను షహాద అని, ఏకేశ్వర విశ్వాసాన్ని తౌహీద్ అంటారు. అల్లాహ్ యొక్క 99 విశేషణాత్మక, గుణగణాల నామాలు ఉన్నాయి. ముస్లింలు భగవన్నామస్మరణ చేయునపుడు ఈనామాలన్నీ స్మరిస్తారు.
ఖురాన్
అల్లాహ్ చే జిబ్రయీల్ దేవదూత ద్వారా మహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] పై అవతరింప బడ్డ దైవగ్రంథం ఈ ఖురాన్. సా.శ. 610 - 632 ల మధ్య మక్కా , మదీనాలో అవతరింపబడింది. ఖురాన్ అనగా పఠించడం.
ఇందులో
మక్కాలో అవతరింపబడిన సూరాలను మక్కీ సూరాలు అని, మదీనాలో అవతరింపబడిన సూరాలను మదనీ సూరాలు అని అంటారు. మొదటి ఖలీఫా అయిన అబూబక్ర్ కాలంలో వీటినన్నిటినీ క్రోడీకరించి ఒక గ్రంధరూపాన్నిచ్చారు. ఖురాన్ ను కంఠస్తం చేసినవారిని హాఫిజ్-అల్-ఖురాన్ అంటారు. ఖురాన్ గ్రంథంలో భగవంతుని (అల్లాహ్), ఆదేశాలు, హితోక్తులు, విశ్వసృష్టి, మానవసృష్టి, మానవజీవన చరిత్ర, దైవమార్గం అనుసరించినవారి విజయాలు, అనుసరించనివారి వినాశనాలు, మానవజాతి కొరకు ప్రకృతినియమాలు, సద్బోధనలు గలవు. ఇస్లామీయ ప్రభుత్వాలు గల దేశాలలో ఖురాన్ ఆదేశాల ప్రకారం చట్టాలు నడుపబడుచున్నాయి.
మలాయిక (దేవదూతలు)
దేవదూతకు అరబ్బీలో మలక్ అని పర్షియన్ లో ఫరిష్తా అని, బహువచనంలో మలాయిక 'ఫరిష్తే' అని అంటారు. దేవదూతలలో ముఖ్యులు నలుగురు. 1. జిబ్రయీల్, 2. మీకాయీల్, 3. మలకుల్ మౌత్, 4. ఇస్రాఫీల్.
ముహమ్మద్ ప్రవక్త
ముహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక], ప్రవక్తల గొలుసుక్రమంలోని ఆఖరు ప్రవక్త. ఇస్లాం ప్రవక్తల గొలుసు ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమైనది, ఇస్లాం ఆదమ్ తోనే స్థాపింపబడింది. ఇస్లాం ప్రవక్తలలో ఆఖరి ప్రవక్త ముహమ్మద్[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] . సా.శ. 570 ఏప్రిల్ 20 న మక్కా నగరంలో జన్మించారు. తండ్రి 'అబ్దుల్లా' తల్లి 'ఆమినా'. తన 40 యేట వరకూ సాధారణ జీవితం గడిపిన ముహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] కు, హిరా గుహ యందు ధ్యానంలో యుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ ఆదేశాలను , ఖురాన్ యొక్క మొదటి సూరాను అవతరింపజేశారు. ఈ సూరా 'ఇఖ్రా బిస్మి రబ్బుకల్లజి ఖలఖ్' అనే ఆయత్తో ప్రారంభమైనది. దీనర్థం " (ఇఖ్రా) చదువు, అల్లాహ్ ఒక్కడేనని, అతడే సర్వాన్నీ సృష్టించాడని....'. ఈ అవతరణ పొందిన ముహమ్మద్[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] తన ప్రవక్త జీవితం ప్రారంభించారు. బహుఈశ్వరాధకులైన అరబ్ పాగన్లు ముహమ్మద్[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక]ని నానా కష్టాలు పెట్టారు. సా.శ. 622లో మక్కా నుండి మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్ళారు. ఈ సంవత్సరం నుండే ఇస్లామీయ కేలండర్ ఆరంభమైనది. మదీనాలో స్థిరపడిన ముహమ్మద్[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక]కు మక్కా వాసులనుండి అగచాట్లు తప్పలేదు. ఇస్లామీయ రీతి నచ్చని మక్కావాసులు మదీనా వాసులపై అనేక యుద్ధాలు చేశారు. ఈ యుద్ధాలకు నాయకత్వం వహించిన ముహమ్మద్[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] ఒకటీ రెండూ యుద్ధాలు తప్ప అన్నింటిలోనూ విజయాలను చవిచూసారు. ఆఖరుకు ముస్లిం సమూహాలు మక్కానూ కైవసం చేసుకున్నారు. సా.శ. 632లో ముహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] పరమదించారు. ముహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] ఆచరణలను సున్నహ్ అనీ ఉపదేశాలను హదీసులు అనీ వ్యవహరిస్తారు. ఖురాన్ ఆదేశాల తరువాత సున్నహ్ , హదీసులే ముస్లింలకు ప్రామాణిక ఆదేశాలు.
ఆచరణీయాలు
ముస్లిం ప్రపంచం లేదా ప్రపంచంలోని ముస్లింలు ఖురాన్, షరియా , హదీసులను ఆచరిస్తారు. ముస్లింల సాంప్రదాయాలు వీటినుండి ఉద్భవించినవే. ముస్లింల ఆచారాలు, ముస్లిం సాంప్రదాయాల నుండి , ప్రాదేశిక ఆచార వ్యవహారాలనుండి ఉద్భవించినవి.
ప్రళయాంతం
ఒకానొక రోజు సర్వసృష్టీ అంతమగును. ఆ రోజునే ఇస్లాంలో యౌమ్-అల్-ఖియామ (అరబ్బీ : يوم القيامة) (ఉర్దూ : ఖయామత్)అర్థం 'ప్రళయాంతదినం', సృష్టి యొక్క ఆఖరి రోజు. ఖయామత్ పై విశ్వాసముంచడాన్ని అఖీదా అంటారు. ఖయామత్ గురించి ఖురాన్ లోను, హదీసుల లోనూ క్షుణ్ణంగా వర్ణింపబడింది. ఉలేమాలు అయిన అల్-ఘజాలి, ఇబ్న్ కసీర్, ఇబ్న్ మాజా, ముహమ్మద్ అల్-బుఖారి మొదలగువారు విశదీకరించారు. ప్రతి ముస్లిం , ముస్లిమేతరులు తమ తమ కర్మానుసారం అల్లాహ్ చే తీర్పు చెప్పబడెదరు - ఖురాన్ 74:38. ఖురానులో 75వ సూరా అల్-ఖియామ పేరుతో గలదు.
మగ్ ఫిరత్
ముస్లింలు ఖురాన్ ప్రకారం నడుచుకుంటూ, అల్లాహ్ కు తమవిధేయతను ప్రకటించి, సన్మార్గంలో నడచినప్పుడే మోక్షము కలుగుతుంది. ఈ మోక్షాన్నే ముస్లింలు మగ్ ఫిరత్ అంటారు. ఈ మగ్ ఫిరత్ పొందినవారే స్వర్గం (జన్నత్) లో ప్రవేశిస్తారు.
చరిత్ర
ఇస్లామీయ చారిత్రక పురోగతి వలన, ఇస్లామీయ ప్రపంచం అంతర్ , బాహ్య ప్రపంచంలో రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాలలో ఎంతో మార్పు వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ఖురాన్ పఠించిన ఓ వందేళ్ళ కాలంలోనే పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం నుండి తూర్పున మధ్య ఆసియా వరకూ ఇస్లామీయ సామ్రాజ్యం వ్యాపించింది. ఈ క్రొత్త రాజకీయ స్థితులు, ప్రజాయుద్ధాలను లేవదీసి క్రొత్త రాజ్యాలు ఏర్పాటయేలా చేసింది. ఈ క్రొత్త రాజ్యాల మధ్య దారితీసిన యుద్ధాలలో వెలుపలి దేశాల సహాయాలు కూడా పొందాయి. ఇస్లామీయ సామ్రాజ్యం ఆఫ్రికా,భారత ఉపఖండం మూస:మస్లిం సామ్రాజ్య విస్తరణ ఖురాని కి వ్యతిరేక ధోరణిలో హిసాత్మకంగా సాగింది, తూర్పు ఆసియా దేశాలలోనూ విస్తరించింది. ఇస్లామీయ నాగరికత మధ్య యుగంలో అభివృద్ధి చెందిన నాగరికతగా వెలసిల్లింది. కాని యూరప్ దేశాలలో ఆర్థిక సైనిక పురోగతివలన, అంతగా వ్యాప్తి చెందలేక పోయింది. 18వ , 19వ శతాబ్దాలలో, ఇస్లామీయ రాజ్యాలు ఉదాహరణకు ఉస్మానియా సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం మొదలగునవి యూరప్ రాజరిక వ్యవస్థ కబంధ హస్తాలలోకి వెళ్ళాయి. 20వ శతాబ్దంలో ఇస్లామీయ పునరుజ్జీవనం , ఆర్థిక పురోగతుల మూలంగా ఇస్లామీయ ప్రపంచం పునరుజ్జీవనం , అంత॰కలహాలకు గురైంది.[2]
ఖిలాఫత్ ప్రారంభం (632–750)
హిజ్రీ శకానికి ముందు, ముహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక], మక్కా నగరంలో తన ప్రవచనాలను బోధించసాగారు. మదీనా నగరానికి హిజ్రత్ చేసిన తరువాత, అచటనుండి అరేబియా అంతటినీ ఏకీకృతం చేశారు. సా.శ. 632 లో ముహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] మరణం తరువాత, ముస్లిం సమూహాలలో ఆందోళనలు బయలు దేరాయి. ముహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] ఉన్నంతకాలము ముస్లింలందరూ సమష్టిగా ప్రవక్తగారి ఆధ్వర్యంలోని నాయకత్వాన్ని అంగీకరించారు. వీరి తరువాత నాయకుడెవ్వరనే ప్రశ్న తలెత్తింది. ఈ ఆందోళణకు కారణం అదే. ముఖ్యమైన సహాబాలు , అనేక తెగల నాయకులందరూ కలసి అబూబక్ర్ను తమ నాయకునిగా అనగా ఖలీఫాగా ఎన్నుకున్నారు. ముహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] జీవించి యున్నపుడు వారి అభీష్టం కూడా, వారి తరువాత అబూబక్ర్ ముస్లింల నాయకుడు కావాలని. ఈ విషయమెరిగిన సహాబాలు, ప్రధానంగా ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ అబూబక్ర్ ను తమ నాయకునిగా ప్రకటించారు. ఆనాటి 'ఖారిజీలు' అబూబక్ర్ నియామకం పట్ల తమ నిరసనను ప్రకటించారు. (ఈ ఖారిజీలు ప్రతి నిర్ణయాన్నీ విమర్శించేవారు. ముహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] తన జీవనకాలంలో, తన అనుయాయులకు, వీరి పట్ల అప్రమత్తంగా వుండండి, రాబోయే ఫిత్నాలకు వీరే కారణభూతులౌతారని సెలవిచ్చారు.) ముహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] వారసునిగా, వారి అల్లుడైన అలీ ఇబ్న్ అబీ తాలిబ్ను ఖలీఫాగా ఎన్నుకోవాలని గళం విప్పారు. కాని వీరికి సంఖ్యాబలం లభించలేదు. ఇంకొక ప్రధాన విషయం 'అలీ' స్వయంగా తన మద్దతును అబూబక్ర్కు ప్రకటించి, ఖారిజీల గళాన్ని బలంలేకుండా చేశారు. అబూబక్ర్ ముందు తక్షణ కర్తవ్యంగా, బైజాంటియన్ (తూర్పు రోమన్ సామ్రాజ్యం) లను నిరోధించడం, వీటి కొరకు యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఈ యుద్ధాలకు రిద్దా యుద్ధాలు అని వ్యవహరించారు.[3]
634 లో అబూబక్ర్ మరణం తరువాత, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ ఖలీఫాగా ఎన్నికయ్యాడు. ఇతని తరువాత ఉస్మాన్ , అలీ ఇబ్న్ అబీ తాలిబ్లు ఖలీఫాలయ్యారు. ఈ నలుగురికీ రాషిదూన్ ఖలీఫాలు లేదా మార్గదర్శకం గావింపబడ్డ ఖలీఫాలు అని వ్యవహరిస్తారు. వీరి కాలంలో ముస్లింల రాజ్యం బైజాంటియన్ మరియ్ పర్షియన్ సామ్రాజ్యం వరకూ వ్యాపించింది.[4] ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ 644లో షహీద్ అయిన తరువాత, ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ ఖిలాఫత్ వారసుడిగా ప్రకటింపబడ్డారు. ఇతను అనేక సవాళ్ళను వ్యతిరేకతలను ఎదుర్కొన్నారు. 656లో ఇతనూ షహీద్ గావింపబడ్డారు, అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఖలీఫాగా ఎన్నికయ్యారు. ఇతని కాలంలో మొదటి ఫిత్నా (ఖలీఫాల పట్ల తిరుగుబాటు) బయలుదేరింది. ఖారిజీలు 661లో 'అలీ'ని బలిగొన్నారు. వీరి తరువాత ముఆవియా ఖలీఫాగా ఎన్నికయ్యారు. ముఆవియా ఉమయ్యద్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.[5] ఈ ఖలీఫా విషయాల మూలంగా ముస్లిం సమాజంలో షియా తత్వం బయలుదేరి వర్గ విభజన జరిగింది. అలీ ఖిలాఫత్ కు ముందు ఉన్నటువంటి ముగ్గురి ఖలీఫాలను ఖలీఫాలుగా స్వీకరించినవారు సున్నీ ముస్లింలయ్యారు. నిరాకరించినవారు కొద్ది సంఖ్యలో గలవారు షియాలుగా వేరు పడ్డారు.[6] 680లో ముఆవియా మరణించిన తరువాత, ఖలీఫా వారసుల గూర్చి తిరిగీ తర్జన భర్జనలు జరగసాగాయి, ఇవి తిరిగీ తిరుగుబాట్లవరకూ తీసుకెళ్ళాయి, దీనినే "రెండవ ఫిత్నా"గా వ్యవహరిస్తారు. ఈ తరువాయి ఉమయ్యద్ సామ్రాజ్యం 70 యేండ్లపాటు సాగింది. ప్రాంతాలైన మగ్రిబ్ (పశ్చిమం) , అల్-అందులుస్ ( ఇబీరియన్ ద్వీపకల్పం ), ప్రాచీన విసిగోథిక్ హస్పానియా (స్పెయిన్)) , పశ్చిమ ప్రాంతాలైన నర్బోనీస్ గాల్ ద్వారా సింధ్ ప్రాంతం, మధ్య ఆసియా మొదలగునవి ముస్లింల వశమయ్యాయి.[7] ఈ కాలంలోనే ముస్లిం-అరబ్బులు ప్రాపంచిక విషయాలపై ప్రశ్నలు లేవనెత్తారు వీరినే జాహిద్లుగా వ్యవహరిస్తారు. ధార్మికులైన వారికి ప్రపంచ విషయాల పరిత్యాగమే ఉత్తమమని హసన్ బస్రి ఓ ఉద్యమాన్ని లేవదీశాడు. క్రమేపీ ఈ ఉద్యమం సూఫీ తత్వం అవతంచడానికి దోహదపడింది.[8]
ఈ ఉమయ్యద్ ల నిరంకుశం మూలంగా, ఇస్లాం కేవలం అరబ్బులకు మాత్రమే మతముగా భావింపబదినది.[9] ఈ ఉమయ్యద్ ల విత్తము, ముస్లిమేతరులైన జిమ్మీల పన్నులరూపంలో వసూలయ్యే మొత్తాలపైనే ఆధారపడినది. ఒక ముస్లిమేతరుడు ఇస్లాంలోకి ప్రవేశించాలంటే, ముందు అరబ్బులవద్ద సరకులు కొనేవాడి (గాహక్) గా మారే పరిస్థితి వుండేది. ఇస్లాంలో ప్రవేశించిననూ వీరికి అధములుగా కొన్ని అరబ్ సమూహాలు చూసేవి. ఈ 'నవముస్లిం' మవాలీ అని సంబోధించేవారు. ఈ మవాలీలు ఇస్లాం ప్రసాదించే సంపూర్ణ స్వాతంత్ర్యాలు పొందలేక పోయేవారు. ఈ వ్యవహారం నచ్చని ముహమ్మద్ ప్రవక్త పినతండి అబ్బాస్ ఇబ్న్ అబ్ద్ ముత్తలిబ్ వారసులు వ్యతిరేకించి అబ్బాసీయ సామ్రాజ్యాన్ని సా.శ. 750 లో స్థాపించారు.[10] ఈ అబ్బాసీయుల కాలంలో ఇస్లామీయ సామ్రాజ్యం వేగంగా అభివృద్ధి చెంది ఇస్లామీయ స్వర్ణయుగానికి నాంది పలికింది. ఈ సామ్రాజ్యానికి రాజధాని బాగ్దాద్ నగరం.[11]
స్వర్ణయుగం (750–1258)
9వ శతాబ్దం ఆఖరువరకు, అబ్బాసీ ఖలీఫాలు, తమ సామ్రాజ్యాన్ని పటిష్ఠపరచుకున్నారు. వీరి సామ్రాజ్యం, ఉత్తర ఆఫ్రికా, పర్షియా , మధ్యాసియా లోని అనేక చిన్న చిన్న రాజ్యాలు ఏకీకృతమైనవి. ఏకేశ్వరవాదమూ వీరి సామ్రాజ్యవిస్తరణకు పనికొచ్చింది, ఈ విధంగా వీరి సామ్రాజ్యం విస్తరించి విశాలమైన ముస్లిం ప్రపంచం ఏర్పడడానికి దోహదపడింది. ఖలీఫాల మతపరమైన విధివిధానాలలో షియాలైన ఫాతిమిద్ ల ఆధిపత్యం ప్రగాఢంగా తన ప్రభావాన్ని చూపించింది. సా.శ. 1055 లో సెల్జుక్ తుర్కులు అబ్బాసీయుల సైనికాధిపత్యాన్ని తొలగించగలిగారు, ఖలీఫాలను మాత్రం గౌరవిస్తూనే వచ్చారు.[12] వీరి సామ్రాజ్య విస్తరణ రెండువిధాల సాగినది, ఒకతి శాంతిపరమైన మార్గం దావాహ్, రెండవది యుద్ధాలు. మూడవ విధం, వీరు సాగించిన వర్తకాలు. వీరు వర్తకాలు చేసే ప్రాంతాలలో నివాసాలు ఏర్పరచుకోవడం , "దావాహ్" (ఇస్లాం మార్గంలో ధార్మిక పిలుపు) ను ఆచరించడం. వర్తకాలు సాగించి సామ్రాజ్యాల విస్తరణలు గావించిన ప్రాంతాలలో ఉప-సహారా పశ్చిమ ఆఫ్రికా, మధ్యాసియా, వోల్గా బల్గేరియా , మలయా ద్వీపసమూహాలు. ఈ స్వర్ణయుగం, కొత్త న్యాయ, తత్వ, ధార్మిక పురోగతులను చవిచూసింది. ఆరు ప్రముఖ హదీసుల క్రోడీకరణలు చేపట్టబడ్డాయి. నాలుగు ఇస్లామీయ పాఠశాల (మజహబ్)లు ప్రవేశపెట్టబడినాయి. ఇస్లామీయ చట్టాలు క్రోడీకరించి గ్రంధాలరూపమివ్వబడ్డాయి. 9వ శతాబ్దానికి చెందిన ఇమామ్ అల్ షాఫయీ హదీసుల క్రోడీకరణలకు సూత్రాలు ప్రతిపాదించాడు. ఆవిధంగా హదీసు క్రోడీకరణలకు మార్గం ఇంకనూ సులభమయ్యింది. ఈ సూత్రీకరణల ద్వారా ఇస్లామీయ పండితులలో తర్జనభర్జనలు తగ్గుముఖం పట్టాయి.[13] తత్వవేత్తలు ఇబిన్ లినా (అవిసెన్న) , అల్-ఫరాబీ గ్రీకు నియామాల్ని ఇస్లామ్ లో ప్రవేశపెట్టటానికి ప్రయత్నించగా, అబు హమీద్ అల్ గజ్జలీ వాటిని వ్యతిరేకించి విజయంపొందాడు.[14] సూఫీతత్వం , షియాతత్వం 9 వశతాబ్దంలో చాలా మార్పులకు గురయ్యాయి. సూఫీతత్వం దానివేరునుండి దూరంగా మిస్టిక్ తత్వానికి దగ్గరైంది. షియాతత్వం ఇమామ్ల వారసత్వంగురించిన భేదాభిప్రాయాలకారణంగా విడిపోయింది. చూడండి:[15] ఇస్లామీయ ప్రభావం పెరుగుదల మధ్యయుగ క్రిష్టియన్ రచయితలలో ద్వేషాన్ని పెంచింది. ఇస్లామ్ ను సాతాను మతంగా , ముస్లిములను కామప్రకోపితులు , మనుషులకంటెతక్కువగా చూపించే రచనలు వెలువడ్డాయి.[16] మధ్యయుగాలలో అల్-మారీ ఇస్లామ్ పై పరిశీలనా దృక్ఫధం అలవరచుకొన్నాడు. యూదుతత్వవేత్త మైమానిడెస్ నీతి శాస్త్రానికి తను విస్తరించిన యూదు అభిప్రాయాలతో పోల్చి చూశాడు..[17] 9 వశతాబ్దం ప్రారంభంలో, పశ్చిమ దేశాలలో ముస్లిమ్ దండయాత్రలు వెనుకంజవేశాయి. ఇబెరీయాలో ముస్లిమ్ ప్రాంతాలు, ఇటలీలోని ముస్లిమ్ ప్రాంతాలు నార్మన్ల అధీనంలోకి వచ్చాయి.11 వశతాబ్దినుండి యూరోప్ క్రైస్తవ రాజరికాలు క్రూసేడ్లు అనబడే వాటివలన ముస్లిములు కష్టాలకు గురయ్యారు. పవిత్ర స్థలాన్ని అధీనంలోకి తెచ్చుకొని, క్రూసేడ్ల రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్యంలో తొలివిజయం వచ్చినా సలాదీన్ లాంటి ముస్లిమ్ సైన్యాధిపతి నాయకత్వంలో ఓటమి పాలయ్యాయి.[18]
తూర్పున మంగోల్ సామ్రాజ్యం అబ్బాసిద్ రాజవంశాన్ని బాగ్దాద్ యుద్ధంలో (1258) అంతమొందించింది. ఈజిప్ట్ లో బానిస సైనికుడైన మామ్లుక్ 1250 లో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.[19] గోల్డెన్ హోర్డ్ తో ఒప్పందంకుదుర్చుకొని, మంగోల్ సేనలను అయిన్ జలుట్ యుద్ధంలో ఆపివేశాడు. మంగోల్ అధికారంలోకి ఆసియాలోని చాలా ముస్లిమ్ ప్రాంతాలు చేరాయి , బౌద్ధమతం అధికార మతంగా మారింది. తరువాతి శతాబ్దంలో మంగోల్ ఖానేట్‌లు ఇస్లామ్ మతంపుచ్చుకొని, మంగోల్ ఇస్లామీయ మిలిత మత సంస్కృతి ప్రారంభమై మధ్యఆసియా , భారతఉపఖండంలో ఇస్లాం వ్యాప్తికి కారణమైంది.
టర్కిష్ , భారతీయ ముస్లిం రాజ్యాలు (1258–1918)
సెల్జుక్ తురకలు అబ్బాసిద్ ప్రాంతాల్ని ఓడించి ఇస్లామ్ తీర్థం పుచ్చుకొని, ఖలీఫేట్ రాజులుగా పరిపాలించారు. బైజాంటిన్ ఓడించి అనటోలియాని కైవశం చేసుకున్నప్పుడు, క్రూసేడులు ప్రారంభానికి కారణమయ్యారు. 12 వశతాబ్దం మలిదశలో వారిపాలన క్షీణించి చాలా అర్థస్వతంత్ర రాజరికాలు ప్రారంభమయ్యాయి. 13 , 14శతాబ్దాలలో ఆటోమాన్ సామ్రాజ్యం (ఆస్మాన్ 1 పేరుతో) బాల్కన్లు, గ్రీసులో ప్రాంతాలు, పశ్చిమ అనటోలియాలను కైవశంచేసుకొని తయారైంది.1453లో మెహ్మెద్ II కానస్టంటినోపుల్ కైవశం చేసుకొన్నాడు.[20]
13వశతాబ్ది ప్రారంభంలో సూఫీతత్వం మార్పుకి గురయ్యింది. అల్ గజ్జలీ సూఫీగురువులు, శిష్యులకు అధ్యాత్మిక నియమాల ఏర్పాటు చేశాడు.[21] మాస్నవి అనబడే కవిత్వాన్ని పర్షియన్ భాషలో జలాలద్ దీన్ ముహమ్మద్ రూమీ రచించాడు. దీని ప్రభావం ఖురాన్ తరువాత స్థాయిలో ఉంది.[22]
16 వశతాబ్దం ప్రారంభంలో షియా (సఫావిద్ రాజరిక వారసులు ) పర్షియాలో అధికారానికి వచ్చి, షియా ఇస్లామ్ ని అధికార మతంగా చేశారు , రెండు శతాబ్దాలు అధికారంలో కొనసాగారు. అప్పుడు 1517 లో మామ్లుక్ ఈజిప్ట్ అట్టోమాన్ వశమైంది. యూరోప్ ఆక్రమణ వియన్నా ద్వారాలదాకా పోయింది.,[24] మంగోల్ రాజులు 1258లో పర్షియా పై దండయాత్ర , బాగ్దాద్ వశంచేసుకున్నాక ఢిల్లీ తూర్పు ముస్లిమ్ సాంస్కృతిక కేంద్రమైంది.[25] భారత ఉపఖండాన్ని చాలా ఇస్లామ్ రాజరికవంశాలు పరిపాలించాయి. వాటిలో ముఖ్యమైనవి ఢిల్లీ సుల్తానులు (1206–1526) , ముఘల్ సామ్రాజ్యం (1526–1857). వీటివలన దక్షిణాసియాలో ఇస్లామ్ వ్యాప్తిచెందింది. but 18 వశతాబ్ది మధ్యలో బ్రిటీషు సామ్రాజ్యం ముఘల్ రాజరికాన్ని అంతమొందించింది.[26] 18 వశతాబ్దంలో వాహాబీ ఉద్యమం సౌదీ అరేబియాలో ప్రాభవంలోకి వచ్చింది. మహమ్మద్ ఇబిన్ అబ్దుల్ వాహ్హాబ్ చే ప్రారంభించబడిన ఈతత్వం, ఛాంధస భావాలు కలిగివుండి సూఫీతత్వం , సన్యాసులకు పెద్దపీట వేయడం లాంటి వాటిని తిరస్కరించింది.[27]
17, 18 వశతాబ్దాలలో అట్టోమాన్ సామ్రాజ్యం యూరోపియన్ ఆర్థిక , సైనిక బలాలముందు భయపడింది.19 వశతాబ్దంలో దేశాభిమానం బలపడి, 1829లో గ్రీసు స్వతంత్రమైంది. అలాగే బాల్కన్ రాష్ట్రాలు కూడా స్వతంత్రంమయ్యాయి. మొదటి ప్రపంచయుద్ధం అంతానికి అట్టోమాన్ సామ్రాజ్యం ముగిసింది.[28]
19 వశతాబ్దంలో సలాఫీ, దేవబందీ , బారెల్వీ ఉద్యమాలకి బీజం పడింది.
నవీన కాలం (1918–నేటివరకు)
మొదటి ప్రపంచ యుద్ధ తరువాత, సామ్రాజ్యంలో మిగిలినవి యూరోపు దేశాల అధీనంలోకి వచ్చాయి. ఆతరువాత ముస్లిం సమాజం స్వతంత్రమయ్యాయి , కొత్తగా చమురు ధనంవలన, ఇజ్రాయిల్ తో సంబంధం ప్రధాన సమస్యలయ్యాయి.[29] ఇరవయ్యవ శతాబ్దం కొత్త ఇస్లామ్ పునరుజ్జీవ వుద్యమాలు పుట్టాయి. ఈజిప్ట్ లోని ముస్లిమ్ సౌభ్రాతృత్వం (ముస్లిమ్ బ్రదర్ హుడ్) , పాకిస్తాన్ లోని జమాత్-ఎ-ఇస్లామీ లౌకిక రాజకీయభావాలకు బదులు నిరంకుశమతాధికారాన్ని కోరుతున్నాయి. వారు పశ్చిమ సంస్కృతి విలువల భయంవలన ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్లామ్ లో వుందంటాయి. ఇరాన్ , ఆఫ్ఝనిస్తాన్ లో విప్లవోద్యమాలు లౌకిక పరిపాలనని ఇస్లామీయ రాష్ట్రాలుగా మార్చగా, అల్ ఖైదా ఇస్లామ్ తీవ్రవాదం వారి లక్ష్యాలకుసాధనంగా వాడుతున్నారు. దానితో భేదంగల ఉదారవాద ఇస్లాం మత సాంప్రదాయాన్ని లౌకిక పరిపాలన , మానవ హక్కులతో అన్వయించే ఒక ఉద్యమం.[30]
ఇస్లామ్ విమర్శని సహించదని, నమ్మకస్తులుకానివారిపై ఇస్లామ్ చట్ట ప్రభావం కష్టాన్ని కలిగిస్తుందని ఆధునిక ఇస్లామ్ విమర్శకులు అంటారు. ఇబిన్ వరాక్ లాంటివారు, మహిళలపై దుష్పవర్తనని ప్రోత్సహిస్తుందని, యూదులపై వ్యతిరేఖ వ్యాఖ్యానాలకు అవకాశం ఇస్తుందని అంటారు.[31] అటువంటి వాటిని ఫజ్లుర్ రహ్మాన్ లాంటిముస్లిమ్ రచయితలు వప్పుకోరు],[32] సయ్యద్ అమీర్ అలీ,[33] అహ్మద్ దీవాత్,[34] యూసుఫ్ ఎస్టిస్ [35] డేనియల్ పైప్స్ , మార్టిన్ క్రేమర్ లాంటివారు ఇస్లామ్ ఛాంధనవాదం వ్యాప్తిని విమర్శిస్తారు.[36] మాంట్ గోమరీ వాట్ , నార్మన్ డేనియల్ వీటిని పాత అసత్యాలని , ప్రచారాలని వాటిని త్రోసిపుచ్చుతారు.[37] కార్ల ఎర్నస్ట్ ప్రకారం ఇస్లామోఫోభియా పెరుగుదల ఇస్లామ్ , ముస్లిములగురించి పశ్చిమదేశాల్లో బుణాత్మక అభిప్రాయాలను పెంచడానికి తోడ్పడింది.[38]
సముదాయం
జనగణన
ది ఫోరం ఆన్ రెలిజియన్ అండ్ పబ్లిక్ లైఫ్ 2009 నివేదిక విశేషాలు
ప్రపంచంలో 220 కోట్ల మంది క్రైస్తవులున్నారు.ముస్లిం జనాభా 200 కోట్లు. 232 దేశాల్లో ముస్లిమున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ముస్లిం.లెబనాన్ కంటే జర్మనీలోనే ఎక్కువగా ముస్లింలు .సిరియాలో కంటే చైనాలోనే ఎక్కువ మంది ముస్లింలున్నారు. జోర్డాన్, లిబియా రెండు దేశాల్లో ఉన్న ముస్లింల కంటే రష్యాలోనే ఎక్కువమంది ముస్లింలు ఉన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నంతమంది ముస్లింలు ఇథియోపియాలోనూ ఉన్నారు.దీన్ని బట్టి ముస్లింలు అంటే అరబ్‌లు అనేదానికి ఇక అర్థం లేదు.మొత్తం ముస్లింలలో 60 శాతం మంది ఆసియాలోనే ఉన్నారు.మరో 20 శాతం మంది మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లోనూ, 15 శాతం మంది ఆఫ్రికాలోని సబ్ సహారా ప్రాంతంలోనూ, 2.4 శాతం మంది యూరప్‌లోనూ, 0.3 శాతం మంది అమెరికాలోనూ ఉన్నారు.ఆసియాలో ముస్లింలు అధికంగా ఉన్న దేశాలే ఎక్కువ.ఇస్లాం ప్రధాన మతంగాలేని దేశాల్లోనే సుమారు ఐదో వంతు ముస్లింలు (40 కోట్లు) ఉన్నారు.ముస్లింలను మైనారిటీలుగా పరిగణిస్తున్న ఐదు దేశాల్లోనే (భారత్‌లో 20 కోట్లు, ఇథియోపియాలో 3 కోట్లు, చైనాలో 3 కోట్లు, రష్యాలో 2 కోట్లు, టాంజానియాలో 1.5 కోట్లు) ప్రపంచ ముస్లింలలో 3/4 వ వంతుమంది ఉన్నారు.ఇండోనేషియాలో అత్యధికంగా 22 కోట్ల మంది ముస్లింలు ఉండగా, మూడోస్థానంలో ఉన్న భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది ఉన్నారు. అయినప్పటికీ భారత్‌లో వీరి జనాభా 15 శాతమే. మొత్తం ముస్లింలలో 2/3 వంతు మంది పది దేశాలలో కేంద్రీకృతమై ఉండగా, అందులో ఆరు దేశాలు ఆసియాలోనే ఉన్నాయి. మిగిలిన మూడు ఉత్తర ఆఫ్రికాలో, ఒకటి ఆఫ్రికాలోని సబ్ సహారన్ ప్రాంతంలో ఉన్నాయి.ముస్లింలలో 10 నుంచి 13 శాతం మంది షియాలు ఉన్నారు. షియాల్లో 80 శాతం మంది నాలుగు దేశాలలో (ఇరాన్, పాకిస్థాన్, భారత్, ఇరాక్) ఉన్నారు.[39] దాదాపు 85% సున్నీ ముస్లింలు , 15% షియా ముస్లింలు.ఇస్లామీయ దేశాలు దాదాపు 57 గలవు. ముస్లింల జనాభాలో 20% వరకు అరబ్బులు గలరు. ఆసియా ఖండంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. అందులోనూ దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాలైన ఇండోనేషియా, భారతదేశం, పాకిస్తాన్ , బంగ్లాదేశ్ లలో ముస్లింల జనాభా అధికంగా కానవస్తుంది. ఈ ఉదహరించిన దేశాలలో ప్రతిదేశంలోనూ 10 కోట్ల జనాభాకంటే అధికంగా ముస్లింలు కానవస్తారు.[40] అమెరికా ప్రభుత్వ 2006 లెక్కల ప్రకారం చైనాలో దాదాపు 3 కోట్ల మంది ముస్లింలు గలరు.[41] మధ్య ప్రాచ్యములో అరబ్బేతర దేశాలైన టర్కీ , ఇరాన్ దేశాలు పెద్ద ముస్లింమెజారిటీ గల దేశాలు; ఆఫ్రికాలో, ఈజిప్టు , నైజీరియా దేశాలలో అధిక ముస్లిం జనాభా గలదు.[40] అనేక యూరప్ దేశాలలో క్రైస్తవం తరువాత, ఇస్లాం అతి పెద్దది.[42]
మసీదులు
మస్జిద్ లేదా మశీదు, ముస్లింల ప్రార్థనా ప్రదేశం, మసీదుకు అరబ్బీ నామం మస్జిద్. చిన్న చిన్న మస్జిద్ లు వుంటే అవి సాధారణ మస్జిద్, పెద్ద పెద్ద సమూహాల కొరకు మరీ ముఖ్యంగా శుక్రవారపు ప్రార్థనల కొరకు కేంద్రీయ మస్జిద్ లను 'జామా మస్జిద్' లేదా 'మస్జిద్ ఎ జామి' అని అంటారు. ప్రాథమికంగా ఈ మస్జిద్ లు ప్రార్థనా మందిరాలైనప్పటికీ, వీటిలో సామాజిక కార్యకలాపాలైన పాఠశాలలు, మదరసాలు సామాజిక కేంద్రాలు, మొదలగువాటి కొరకునూ ఉపయోగిస్తున్నారు. ఈ మస్జిద్ లకు మీనార్లు గుంబద్ లు, మిహ్రాబ్, మింబర్, వజూ ఖానాలు మొదలగునవి వుంటాయి.[43]
కుటుంబ జీవితం
ఇస్లామీయ సమాజంలో మూలవ్యవస్థ విషయం "కుటుంబం", ఇస్లామ్ ఈ కుటుంబ సభ్యులందరికీ తగురీతిలో హక్కులను కల్పిస్తున్నది. కుటుంబ వ్యవస్థలో యజమాని 'తండ్రి', ఇతను కుటుంబపు బరువుబాధ్యతలు, ఆర్థిక విషయాలను, ఆలన పాలన పోషణలు చూస్తాడు. ఖురాన్ లో వారసత్వపు విషయాలన్నీ క్షుణ్ణంగా పొందుపరచబడ్డాయి. కుటుంబంలోని ఆస్తిలో స్త్రీహక్కు, పురుషుడి హక్కుతో సమానం. అనగా సగం ఆస్తి స్త్రీకి చెందుతుంది. అన్ని హక్కులూ సగం కల్పించబడ్డాయి.[44] ఇస్లాంలో పెళ్ళి లేదా నికాహ్ అనునది, పౌర-ఒడంబడిక. ఈ నికాహ్ కొరకు, ఇద్దరు సాక్షులు అవసరం. పెళ్ళికొడుకు పెళ్ళికుమార్తెకు భరణం "మహర్" చెల్లించాలి. మహార్ అనునది, పెళ్ళికుమారిడి తరపున పెళ్ళికుమార్తెకు ఓ బహుమతి. ఈవిషయం "నికాహ్ నామా"లో వ్రాయవలసి యుంటుంది.
ఓ పురుషుడు నలుగురు భార్యలను గలిగి వుండవచ్చును. కానీ వీరికి సమాన హక్కులు పోషించగలిగే స్థితిమంతం పురుషుడు కలిగి వుండాలి. స్త్రీ ఒక పురుషుడిని మాత్రమే భర్తగా కలిగి వుండాలి. భర్తతో విడాకులు పొంది ఇంకో పెళ్ళి చేసుకొనవచ్చును. ఇస్లాంలో విడాకులుకు "తలాఖ్" అని వ్యవహరిస్తారు.[45] స్త్రీలు హిజాబ్ లేదా పరదా పద్ధతిని పాటించాలి. దీనినే "ఘోషా" పద్ధతి అని వ్యవహరిస్తారు, ఈ పద్ధతి స్త్రీలను హుందాగా జీవించేందుకు దోహదపడుతుందని భావిస్తారు. ఈ నియమం పై పలు పండితుల వాగ్వివాదాలున్నాయి, విమర్శలూ, అంగీకారాలూ రెండునూవున్నది. కానీ అంగీకారాల శాతం బహు ఎక్కువ. నగర ప్రాంతాలలో ఈ ఘోషాపద్ధతి కొద్ది తక్కువ కాన వస్తుంది.
కేలండర్
ఇస్లామీయ కేలండర్ (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో , ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్. ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు , దాదాపు 354 దినాలు గలవు. "హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగింది. <ref>See:
- Adil (2002), p. 288
- F. E. Peters (2003), p. 67
- B. van Dalen; R. S. Humphreys; Manuela Marín. "Tarikh̲". Encyclopaedia of Islam Online.</ref>
ఇతర మతములు
ఇస్లామీయ ధర్మశాస్త్రాల అనుసారం, ఇస్లాం, మానవకళ్యాణం కొరకు అల్లాహ్ చే ప్రసాదింపబడిన ఓ సరళమైన శాంతిమార్గం, ఈ మార్గం ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమైనది.[46] చరిత్ర గతిలో ఈ ప్రామాణిక క్షీణించే దశలలో అల్లాహ్, ప్రజలకొరకు, తన ప్రవక్తలను అవతరింపజేస్తూ వచ్చాడు.[47] ఈ సిద్ధాంతం ప్రకారం ఇబ్రాహీం, మూసా, బనీ ఇస్రాయీల్ (హిబ్రూ జాతి) ప్రవక్తలు, వీరందరూ ఇస్లామీయ ప్రవక్తలే. ఇంకనూ ఈసా, ముహమ్మద్ ప్రవక్త, దైవసందేశాలను మోసుకొచ్చినవారే.[48][49][50]
ఇస్లామీయ చట్టాలు ముస్లిమేతరులకు వివిధ వర్గాలలో విభజించారు, ఈ విభజనలకు మూలం ఇస్లామీయ రాజ్యాలతో ముస్లిమేతరుల సంబంధాలు. ఇస్లామీయ రాజ్యాలలో నివసించే యూదులు , క్రైస్తవులకు జిమ్మీలు ("సంరక్షించబడిన ప్రజలు (protected peoples)") అని వర్గీకరించారు. ఈ వర్గీకరణ ఒడంబడిక మూలంగా ఈ జిమ్మీల మతపరమైన, సామాజిక, ఆస్తిసంబంధ , ఆర్థిక సంరక్షణ, ఇస్లామీయ ఖలీఫాలు లేదా రాజుల భుజస్కంధాలపై యుండేది. ఈ సంరక్షణ ప్రతిఫలంగా వీరి నుండి జిజియా పొందేవారు. ఈ విధమైన వ్యవస్థవలన జిమ్మీలు అన్ని రకములైన స్వేచ్ఛను పొందేవారు.[51] దీనిని జోరాష్ట్రీయన్లకు , హిందూలకు వర్తించారు. నాస్తికులకు , అగ్నోస్టిక్ లకు వర్తించలేదు. [52] ముస్లిమేతర ప్రాంతాలలో వుండేవారిని హర్బీలనేవారు, వారు ముస్లిమ్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంటే అహ్లాల్ అహద్ అనేవారు. తాత్కాలికంగా ముస్లిమ్ ప్రాంతాలలో వుండి భద్రతపొందేవారిని అహ్లల్-ఆమన్ అనే వారు. వీరినిచట్టపరంగా ధిమ్మీతో సమానంగా వుండేది, వారి జిజియా చెల్లించనవసరంలేదు. ముస్లిమ్ ప్రాంత సరిహద్దులోవుండి ముస్లిం ప్రాంతపై దండయాత్రని చేయమని అంగీకరించినవారిని అహ్లాల్ హుద్నా అనే వారు.[53][54] దేవుని నమ్మకపోవటం నిరోధించబడింది. దీనికి మరణదండన విధించవచ్చు.[55][56]
అలేవీ, యాజిదీ, డ్రూజ్, అహ్మదీయ, బాబి, బహాయ్, బెర్గౌటా , హా-మిమ్ ఉద్యమాలు ఇస్లామ్ నుండి పుట్టాయి లేక దానితో సారూప్యమైన భావాలు కలిగివున్నాయి. కొంతమంది ప్రత్యేకంగా చూడగా మరికొంతమంది ఇస్లామ్ లో తెగలుగా చూస్తారు. కొన్ని నమ్మకాల విషయంలో వివాదాలుంటాయి. పంజాబ్ లో 15 వశతాబ్దంలో గురునానక్ స్థాపించిన సిఖ్కు మతం ఇస్లామ్ , హిందూమతం భావాలని కలిగివుంది.[57]
విభాగాలు
ఇస్లాంలోని సమూహాలకు ఐదు మూలస్తంభాలపై ఎలాంటి తకరారు లేకపోయినప్పటికీ, అనేక ఇతర విషయాలపై తర్జనభర్జనలకు లోనై, అనేక విభాగాలుగా విడిపోయారు. ఇందులో ప్రధానమైనవి సున్నీ ఇస్లాం, షియా ఇస్లాం లు. ప్రపంచంలో సున్నీ ముస్లింలు దాదాపు 85% ఉండగా షియాముస్లింలు 15% గలరు.నిజానికి ఖురాన్ లో సున్ని,షీయా ప్రస్తావనగాని పదాలుగాని లేవు.[58] వీటిని ప్రవక్త (సల్లం) గారి మరణానంతరం కొన్ని ముస్లిం సమాజం చేసుకున్న వర్గాలు.
సున్నీ
సున్నీ ముస్లింలు ఇస్లామీయ సమూహంలో అతి పెద్ద సమూహం. ఇస్లామీయ జనాభాలోని 85% ఈ సున్నీ ముస్లింలే. అరబ్బీ భాషలో 'సున్నీ' అనగా, మార్గం లేదా దారి. ముహమ్మద్ ప్రవక్త ఆచరణీయాలను అమలు చేయువారు సున్నీలు. ఈ సున్నీ ముస్లిం సమూహం, రాషిదూన్ ఖలీఫాల పట్ల తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. (షియాలు ఇందుకు విరుద్ధం). ఈ సున్నీ ముస్లిం సమూహం మరియూ నాలుగు పాఠశాలలో విభజింపబడింది. ఈ సున్నీ పాఠశాలలనే మజహబ్ అని అంటారు. ఈ పాఠశాలలు హనఫీ, షాఫయీ, మాలికీ , హంబలీ పాఠశాలలు.[59]
షియా
ఇస్లాంలో షియా ఇస్లాం లేదా 'షియా' అనునది ఒక శాఖ. వీరు సున్నీల తరువాత పెద్ద సంఖ్యలో గలరు.వీరు మహమ్మద్ ప్రవక్తపై విశ్వాసముంచరు అనే అపవాదు ఉంది. కాని ఇది నిజంగాదు. వీరు అహ్లె బైత్ (అనగా ప్రవక్తగారి కుటుంబం) పట్ల ఎక్కువగా తమ ప్రేమాభిమానాలు చాటుతారు. సున్నీలకు షియాలకు ప్రధాన తేడా, సున్నీలు ప్రధానంగా సున్నహ్ పట్ల తమ జీవితాలను ప్రతిబింబించేలా చూసుకుంటారు. షియాలు సున్నహ్ పట్ల అంతగా ప్రగాఢ విశ్వాసం ప్రకటించరు. షియాలయందు ప్రధానం ఇమామ్. ఈ ఇమామ్ పరంపర అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (ప్రవక్తగారి అల్లుడు, ఫాతిమా గారి భర్త) నుండి ప్రారంభమైనది.[60][61] సున్నీలు షరియా న్యాయశాస్త్రాలను పాటిస్తే, షియాలు జాఫరి న్యాయశాస్త్రం అవలంబిస్తారు.[62] షియా ఇస్లాం అనేక శాఖలుగా విభజింపబడియున్నది. వీరిలో ప్రధానం ఇస్నా అసరియా (12 ఇమామ్ లను అనుసరించేవారు), మిగతావారు ఇస్మాయీలి, జైదియ్యా లు.[63]
సూఫీ తత్వం
సూఫీ తత్వము; ఇస్లాం మతములో ఒక ఆధ్యాత్మిక ఆచారం ఈ సూఫీ తత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందడం ధ్యేయం.[64] ఇస్లామీయ ధర్మశాస్త్రాల ప్రకారం షరియా , ఫిఖహ్లు ఇస్లామీయ ప్రధాన మార్గాలైతే, సాధారణ ముస్లిం సమూహాల ప్రకారం సూఫీ తత్వము ఒక ఉపమార్గము. ఈ సూఫీ తత్వము, దిశ, దశ, దార్శనికత , మార్గ దర్శకత్వము లేని కారణంగా 'గాలివాట మార్గం' గా ముస్లింలు అభివర్ణిస్తారు. , దీనిని ఉలేమాలు, బిద్ అత్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మార్గం, మార్గ దర్శకత్వం లేనికారణంగా, అంధమార్గంగానూ, అంధవిశ్వాసాల మయంగానూ, గమ్యంలేని, స్థిరత్వంలేని మార్గంగానూ అభివర్ణించబడుతుంది. ఇవి అక్షర సత్యాలే, కాని, ఈ తత్వంలోని విశ్వసోదర ప్రేమ మాత్రం శ్లాఘింపదగినది. ఈ సూఫీ తరీఖాలు సున్నీ ఇస్లాం గాని షియా ఇస్లాం గాని కలిగివున్నవే.[65]
ఇతరాలు
ఖారిజీలు, వీరు ఒక వర్గం వారు, ఇస్లాం ఆవిర్భవించినప్పటినుండి, వీరు వేరుగానే వుంటూ వచ్చారు. ఈ వర్గంలోని కేవలం ఒకే ఒక శాఖ ఇప్పటికి వున్నది, దీనినే ఇబాదిజం అని అంటారు. "ఖారిజీ" అనగా "విసర్జించబడిన" లేక 'బాహ్యమైన', వీరు ఇస్లామ్ నుండి బాహ్యంగానే వుంటూ వస్తున్నారు. వీరు ప్రధానంగా ఒమన్లో వుంటున్నారు.[66]
ఇతరవిషయాలు
- ఇస్లామిక్ దేశాలు - ముస్లిం ప్రభుత్వాలుగల దేశాలు
- ముస్లింలు గల నాన్-ఇస్లామిక్ దేశాలు
భారతదేశంలో ముస్లింలకు రిజర్వేషన్లు
- మైనార్టీలు 1800110088 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.
- మైనార్టీ సంఘానికి కూడా జాతీయ షెడ్యూల్డ్ కులాల సంఘానికున్నట్లు రాజ్యాంగ హోదా కల్పించాలని ఆ సంఘం ఛైర్మన్ మహ్మద్ షఫీ ఖురేషీ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కి లేఖ రాశారు. (ఈనాడు 22.2.2010)
- ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకు రిజర్వేషన్లు
ఇవీ చూడండి
|
|
|
వనరులు
మూలాలు
ఇతర పఠనాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.