Remove ads
భారతీయ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia
అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని ఒక రాష్ట్రం. భారతదేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతం ఒక భాగమని చైనా వాదన. భారత, చైనాల మధ్య వివాదాస్పదంగా మిగిలిన ప్రాంతాలలో అక్సాయి చిన్తో పాటు, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన అస్సాం రాష్ట్రం, ఆగ్నేయాన నాగాలాండ్, తూర్పున బర్మా, పశ్చిమాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇటానగర్ రాష్ట్ర రాజధాని. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రం ఉత్తర సరిహద్దైన మెక్‌మెహన్ రేఖను గానీ అధికారికంగా గుర్తించలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించింది: (పశ్చిమం నుండి తూర్పుకు) కోన కౌంటీ, లుంఝే కౌంటీ, నంగ్ కౌంటీ, మైయిన్లింగ్ కౌంటీ, మేదోగ్ కౌంటీ, ఝాయూ కౌంటీ. అయితే అదే సమయంలో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక వాస్తవాధీన రేఖను నిర్ణయించాయి. ఈ వివాదం ఎటువంటి అందోళనలకు దారితీసే అవకాశం లేదని భావించారు.
అరుణాచల్ ప్రదేశ్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
ఇటానగర్ - 27.08°N 93.4°E |
పెద్ద నగరం | ఇటానగర్ |
జనాభా (2001) - జనసాంద్రత |
1,091,117 (26) - 13/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
83,743 చ.కి.మీ (14) - 16 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[అరుణాచల్ ప్రదేశ్ |గవర్నరు - [[అరుణాచల్ ప్రదేశ్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
20-02-1987 - బి డి మిశ్రా - పెమా ఖండూ - ఒకే సభ (60) |
అధికార బాష (లు) | ఇంగ్లీషు, ఆది, నిషి, మోన్‌పా |
పొడిపదం (ISO) | IN-AR |
వెబ్‌సైటు: arunachalpradesh.nic.in | |
అరుణాచల్ ప్రదేశ్ రాజముద్ర |
ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతంగా పిలవబడుతున్న ఈ ప్రాంతం 1987 వరకు అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైంది.[1]
ఇక్కడి గిరిజనుల తొలి పూర్వీకులు అవగత చరిత్రకు మునుపే టిబెట్ నుండి ఇక్కడికి వలస వచ్చారు. తరువాతి కాలంలో థాయి, బుర్మా నుండి వలస వచ్చిన వారు వీరితో చేరారు.
అపతానీ అనే తెగకు చరిత్ర గురించిన అవగాహన ఉన్నప్పటికీ, రాష్ట్ర వాయవ్య ప్రాంత భాగాల గురించి తప్ప మిగతా ప్రాంతం గురించి పెద్దగా తెలియదు. లభ్యమౌతున్న చరిత్ర 16 వ శతాబ్దం నాటి అహోం చరిత్ర గాథలు మాత్రమే. గిరిజన మోన్‌పా, షెర్దూక్‌పెన్ తెగలవారు స్థానిక పాలకుల గురించిన చరిత్రను రికార్డు చేస్తూ వచ్చారు. వాయవ్య ప్రాంతాలు సా.శ.పూ. 500, సా.శ. 600 మధ్య విలసిల్లిన మోన్‌పా రాజ్య ఏలుబడిలోకి వచ్చాయి. తరువాత ఉత్తర ప్రాంతాలు టిబెట్ పాలనలోకి వచ్చాయి. రాష్ట్రం లోని మిగత ప్రాంతాలు, ముఖ్యంగా మయాన్మార్ కు చేరువగా ఉన్న ప్రాంతాలు అహోంల పాలనలోకి వచ్చాయి. 1858లో ఈ ప్రాంతాలను బ్రిటిషు వారు భారత్ లో కలిపేసారు.
పశ్చిమ సియాంగ్ లోని సియాంగ్ పర్వత పాదాల వద్ద గల 14 వ శతాబ్దపు హిందూ దేవాలయం, మాలినీతన్ గుడి శిథిలాల తవ్వకాల్లో రాష్ట్ర పురాతన చరిత్ర గురించిన కొత్త విషయాలు తెలిసాయి. హిందూ దేవతల బొమ్మలు, మండపాలు బయల్పడ్డాయి. స్థానికలకు ఇది తీర్థయాత్రాస్థలంగా మారిపోయింది. భిస్మాక్‌నగర్ వద్ద గల మరో సాంస్కృతిక స్థలం వద్ద లభించిన ఆధారాలను బట్టి ఇక్కడ స్థానిక నాగరికత వర్ధిల్లిందని తెలుస్తోంది. తవాంగ్ జిల్లాలో గల మూడో సాంస్కృతిక వారసత్వ స్థలం, తవాంగ్ బౌద్ధారామం వద్ద బౌద్ధ మతావలంబీకులైన తెగల ప్రజల చరిత్రకు చెందిన ఆధారాలు దొరికాయి.
1913-14లో బ్రిటిషు అధికారి, సర్ హెన్రీ మెక్‌మెహాన్ సిమ్లాలో జరిగిన ఒక సమావేశంలో భారత్ చైనాల మధ్య 550 మైళ్ళ పొడవైన ఒక సరిహద్దు రేఖను ప్రతిపాదించాడు. అదే మెక్‌మెహాన్ రేఖ. కానీ 1947లో చైనా ఈ సరిహద్దు రేఖను తిరస్కరించి, అసలా రేఖను ఎప్పుడూ అంగీకరించలేదని 1929 నాటి ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా లోని మాపును ఉదహరిస్తూ వాదించింది. ఆ మాపులో సరిహద్దు రేఖ ఏకంగా అస్సాం లోని మైదాన ప్రాంతం వద్ద గుర్తించబడి ఉంది. ఈ వివాదాన్ని సాకుగా తీసుకుని, 1959 ఆగష్టు 26 న చైనా సైనికుల గుంపు ఒకటి మెక్‌మెహాన్ రేఖను దాటి భారత భూభాగంలోకి కొన్ని మైళ్ళు చొచ్చుకు వచ్చి, లాంగ్‌జు వద్దగల ఔట్‌పోస్టును పట్టుకుంది. 1961లో దీన్ని వదలి వెనక్కి వెళ్ళినా, తిరిగి 1962లో ససైన్యంగా చొచ్చుకువచ్చి, భారత చైనా యుద్ధానికి తెర లేపింది. ముందు భూటాన్ సరిహద్దుకు దగ్గరగా గల తాంగ్లా, తవాంగ్ ల వద్ద దాడి చేసి, తరువాత మొత్తం సరిహద్దు రేఖ పొడవునా దాడి చేసింది. అనేక చోట్ల బాగా లోపలికి చొచ్చుకు వచ్చారు. అయితే, వెనక్కి, మెక్‌మెహాన్ రేఖ వద్దకు తిరిగి వెళ్ళిపోవడానికి ఒప్పుకుని, 1963లో యుద్ధ ఖైదీలను వదలిపెట్టారు. అస్సాం మైదాన ప్రాంత పరిరక్షణలో భారత సంసిద్ధత, భారతీయ వైమానిక దళ పటిమ, చైనీయులకెదురైన ప్రతికూల పరిస్థితులు దీనికి కారణంగా భారత్ చెప్పుకోగా, కేవలం రాజకీయ కారణాల వల్లనే వెనుదిరిగామని చైనా చెప్పుకుంది.
ఈ యుద్ధం తరువాత అప్పటి వరకు ఈశాన్య సరిహద్దు ఏజెన్సీగా ఉన్న ఈ ప్రాంతం అస్సాంలో భాగమైంది. చైనాతో ఉన్న ఘర్షణాత్మక వైఖరిని దృష్టిలో ఉంచుకుని 1987 లో అరుణాచల్ ప్రదేశ్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చారు.
అరుణాచల్ ప్రదేశ్ లోన్ ఎక్కువ భాగం హిమాలయాలు ఆక్రమించుకుని ఉన్నాయి. అల్థౌఘ్ పర్త్స్ ఒఫ్ లోహిత్ చాంగ్‌లాంగ్, తిరాప్ లలోని కొన్ని ప్రాంతాల్లో పట్‌కోయి కొండలు వ్యాపించి ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ లో వాతావరణం ఎత్తును బట్టి మారుతూ ఉంటుంది. టిబెట్ సరిహద్ద్దుకు దగ్గరగా, ఎగువ హిమాలయాల వద్ద ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో అతిశీతల వాతావరణం నెలకొని ఉంటుంది. మధ్య హిమాలయాల వద్ద సమశీతోష్ణ స్థితి ఉంటుంది. యాపిల్, కమలా పండ్ల వంటివి పండుతాయి. దిగువ హిమాలయాలు, సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణ వాతావరణం ఉంటుంది. రాష్ట్రంలో వర్షపాతం చాలా ఎక్కువ; సాలుకు 2,000 నుండి 4,000 మి.మీ (80 నుండి 160 అంగుళాలు) వర్షపాతం నమోదవుతుంది. పర్వత సానువుల్లో రోడోడెండ్రన్, ఓక్, పైన్, మేపుల్, ఫర్, జూనిపర్ మొదలైన వృక్షాలతో కూడిన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ ను పరిపాలనా సౌలభ్యం కొరకు 16 జిల్లాలుగా విభజించబడింది. ప్రతి జిల్లా పాలనా వ్యవహారాలు నిర్వర్తించడానికి, స్థానిక ప్రజల అవసరాలను తీర్చడానికి ఒక జిల్లా కలెక్టరు నియమించబడతాడు. చైనా యోచనలపై అపనమ్మకంతో ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా టిబెట్ సరిహద్దుపై భారత సైన్యం గట్టి నిఘా కొనసాగుతుంది. ఉత్తర ప్రాంతాలు, ఇండో-బర్మా సరిహద్దులో, నాగాలాండ్ సరిహద్దు ప్రాంతాలలో నాగా-క్రైస్తవ తీవ్రవాద వర్గాలు స్థానిక ప్రజలను హింసిస్తున్నారని వచ్చిన ఆరోపణల వలన ఈ ప్రాంతాలను సందర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరం ఉంది
65% అరుణాచలవాసులు, 20 ప్రధాన సమష్టి తెగలు, 82 చిన్న తెగలకు చెందినవారు. ఈ తెగల సంస్కృతి, భాష, నమ్మకాలు పరిపుష్టం, విభిన్నమైనవి. వీరిలో అధికసంఖ్యాకులు టిబెట్ లేదా థాయి-బర్మా సంతతులకు చెందినవారు. మిగిలిన 35% మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చినవారు. ఈ వలస ప్రజలలో 30,000 మంది బంగ్లాదేశీ కాందిశీకులు, చక్మా నిర్వాసితులు. ఇందులో భారతదేశ ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా అస్సాం, నాగాలాండ్ నుండి వలస వచ్చిన వారు కూడా ఉన్నారు.అరుణాచల్ ప్రదేశ్ స్థానిక తెగలలో ఆది, నిషి, మోన్పా తెగలు ప్రధానమైనవి.
రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 1991 లో ఉన్న 41.59% నుండి 54.74%కు పెరిగింది. ప్రస్తుత గణన ప్రకారం 487,796 మంది అక్షరాస్యులు ఉన్నారు.
రాష్ట్ర జనాభాలో దాదాపు సగభాగం ప్రజలు డోన్యి పోలో మతాన్ని అవలంబిస్తారు. ఇంకొక 42% మంది ప్రజలు బౌద్ధ మతం, హిందూ మతానికి చెందినవారు. మిగిలిన వాళ్లు క్రైస్తవ, ఇస్లాం మతస్థులు.
వ్యావసాయమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన ఆయువుపట్టు. స్థానికులు ఝుం అని వ్యవహరించే పోడు వ్యవసాయ పద్ధతిని గిరిజన జాతుల ప్రజలు విరివిగా అవలంబించేవారు. కానీ అది ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. వ్యవసాయం తర్వాత అంతే ముఖ్య ఆర్థిక వనరు అటవీ ఉత్పత్తులు.ఇక్కడ వరి, మొక్కజొన్న, జొన్న, గోధుమ, పప్పుదినుసులు, చెరుకు, అల్లం, నూనె గింజలు మొదలైన పంటలను పండిస్తారు. అరుణాచల్ వాతావరణం పండ్లు, పూల తోటలకు కూడా చాలా అనుకూలమైంది.చెక్క మిల్లులు, ప్లైవుడ్ తయారీ (ఈ రెండు పరిశ్రమలను ఇటీవల నిషేధించారు), బియ్యపు మిల్లులు, పండ్ల నిలువ కేంద్రాలు, చేనేత, హస్తకళలు రాష్ట్రంలోని ముఖ్య పరిశ్రమలు.
అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి ప్రేమ్ ఖాండు నాయకత్వాన అరుణాచల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అరుణాచల్ కాంగ్రెస్ (మిత్తి), కాంగ్రెస్ (డోలో), పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు.
రాష్ట్రంలో, ఇటానగర్, దాపర్జియో, జీరో, అలోంగ్, తేజూ, పషిగత్ పట్టణాలలో ప్రభుత్వ విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతం పర్వతమయమైనందు వల్ల ఈ విమానాశ్రయాలన్నీ చాలా చిన్నవి. ఎక్కువ సంఖ్యలో విమానాలకు ఇవి ఆశ్రయం ఇవ్వలేవు.
అరుణాచల్ ప్రదేశ్ ప్రశాంత నిర్మల వతావరణం దేశవిదేశాల నుండి అనేకమంది యాత్రీకులను ఆకర్షిస్తుంది. స్థానికంగా కూడా అనేకమంది ప్రజలు అరుణాచల్ ప్రదేశ్ విభిన్న సంస్కృతిని ఆస్వాదించడానికి బొండిలా, తవాంగ్, తిరప్ మొదలైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.