Remove ads
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుండి వాయవ్యంగా 448 కిలోమీటర్ల దూరాన సుమారు 3,048 మీటర్ల ఎత్తున ఉంది. ఈ పట్టణం ఒకప్పుడు వెస్ట్ కామెంగ్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండేది. వెస్ట్ కామెంగ్ నుండి తవాంగ్ జిల్లా ఏర్పడినప్పుడు ఆ జిల్లాకు ముఖ్యపట్టణంగా మారింది.
తవాంగ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°35′18″N 91°51′55″E | |
దేశం | India |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | తవాంగ్ |
Government | |
• Type | మునిసిపల్ కార్పొరేషను |
• Body | నగర పాలిక |
Elevation | 3,048 మీ (10,000 అ.) |
జనాభా (2011) | |
• Total | 11,202 |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | AR |
అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించి భారత, చైనాల మధ్య ఉన్న వివాదంలో ఈ ప్రాంతం భాగం. చైనా దీనిని టిబెట్ అటానమస్ రీజియన్‌లో భాగంగా చెప్పుకుంటుంది [1] [2]
తవాంగ్ చారిత్రికంగా మోన్పా ప్రజలు నివసించే టిబెట్‌లో భాగం. తవాంగ్ బౌద్ధ విహారాన్ని 5 వ దలైలామా, న్గావాంగ్ లోబ్సాంగ్ గయాట్సో కోరికపై 1681 లో మేరక్ లామా లోడ్రే గయాట్సో స్థాపించాడు. దాని పేరు గురించి ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. ఆ పేరుకు అర్థం "గుర్రం ఎంచుకున్నది" అని. ఆరవ దలైలామా, సాంగ్యాంగ్ గ్యాట్సో, తవాంగ్‌లో జన్మించాడు.
1914 లో జరిగిన సిమ్లా ఒప్పందం మెక్ మహోన్ లైన్ ను బ్రిటిష్ ఇండియాకు, టిబెట్‌కూ మధ్య కొత్త సరిహద్దుగా నిర్వచించింది. ఈ ఒప్పందం ద్వారా టిబెట్, తవాంగ్‌తో సహా అనేక వందల చదరపు మైళ్ల భూభాగాన్ని బ్రిటిష్ వారికి వదులుకుంది. కాని చైనా దీనిని గుర్తించలేదు. [4] 1914 లో అంగీకరించిన సరిహద్దు, సిమ్లా ఒప్పందాన్ని చైనా అంగీకరించాలనే షరతుందని బ్రిటిష్ రికార్డులు చూపిస్తున్నాయని సిరింగ్ షాక్యా చెప్పాడు. బ్రిటిష్ వారు చైనా అంగీకారం పొందలేక పోయినందున, టిబెటన్లు మాక్ మహోన్ రేఖను "చెల్లద"ని భావించారు. జియా లియాంగ్ ప్రకారం, బ్రిటిష్ వారు తవాంగ్‌ను స్వాధీనం చేసుకోలేదు, ఇక్కడ టిబెట్ పరిపాలనే కొనసాగింది. 1935 లో బ్రిటిష్ వృక్షశాస్త్రజ్ఞుడు ఫ్రాంక్ కింగ్డన్-వార్డ్ టిబెట్ అనుమతి లేకుండా సెలా పాస్ దాటి, తవాంగ్ లోకి ప్రవేశించినపుడు, అతన్ని కొద్దిసేపు అరెస్టు చేశారు. టిబెటన్ ప్రభుత్వం బ్రిటన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇది బ్రిటిష్ వారి దృష్టిని ఆకర్షించింది. వారు భారత-టిబెట్ సరిహద్దును తిరిగి పరిశీలించగా, టిబెట్ తవాంగ్‌ను బ్రిటిష్ ఇండియాకు అప్పగించినట్లు కనుగొన్నారు. బ్రిటిషు ప్రభుత్వం మెక్‌మహాన్ రేఖను పునరుద్ధరించడానికి ప్రయత్నించింది. నవంబరులో, బ్రిటిష్ ప్రభుత్వం 1914 సిమ్లా ఒప్పందాన్ని అమలు చేయాలని టిబెట్‌ను డిమాండ్ చేసింది; టిబెట్ ప్రభుత్వం దీన్ని తిరస్కరిస్తూ, మెక్ మహాన్ రేఖ ప్రామాణికతను తిరస్కరించింది. తవాంగ్‌ను అప్పగించడానికి టిబెట్ నిరాకరించింది. తవాంగ్ ఆశ్రమానికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఒక కారణం. 1938 లో బ్రిటిష్ వారు, కెప్టెన్ జిఎస్ లైట్ఫుట్ ఆధ్వర్యంలో ఒక చిన్న సైనిక దళాన్ని పంపి, తవాంగ్‌పై తమసార్వభౌమాధికారాన్ని నొక్కిచెప్పారు. [5] ఆ యాత్రకు టిబెట్ ప్రభుత్వం నుండి, స్థానిక ప్రజల నుండీ బలమైన ప్రతిఘటన ఎదురైంది; బ్రిటిష్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
లైట్ఫుట్ జరిపిన సందర్శనపై టిబెట్, దౌత్యస్థాయిలో గట్టి నిరసన తెలియజేసింది. కానీ భూభాగాల మార్పిడేమీ జరగలేదు. 1941 లో చైనా, జపాన్ల మధ్య యుద్ధం మొదలైన తరువాత, అస్సాం ప్రభుత్వం నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (ఈ NEFA యే తరువాత అరుణాచల్ ప్రదేశ్ అయింది) ప్రాంతంపై పట్టు బిగించడానికి అనేక 'ఫార్వర్డ్ పాలసీ' చర్యలను చేపట్టింది. 1944 లో జెపి మిల్స్, దిరాంగ్ జోంగ్ వద్ద అస్సాం రైఫిల్స్ పోస్టును ఏర్పాటు చేసి, టిబెట్‌కు చెందిన పన్ను వసూలు చేసేవారిని అక్కడినుండి తరిమేసాడు. దాంతో సెలా కనుమకు దక్షిణంగా ఉన్న ప్రాంతంపై బ్రిటిషు నియంత్రణ నెలకొంది. దీనిపై టిబెట్ వెలిబుచ్చిన నిరసనలను పట్టించుకోలేదు. అయితే, కనుమకు ఉత్తర ప్రాంతం నుండి టిబెట్ వారిని తొలగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తవాంగ్ పట్టణం ఈ ప్రాంతం లోనే ఉంది. [6] : 50–51
భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత కొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగింది. కానీ 1950 లో టిబెట్ తన స్వయంప్రతిపత్తిని కోల్పోయి, కొత్తగా స్థాపించబడిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగమై పోయినప్పుడు ఒక నిర్ణయాత్మకమైన మార్పు వచ్చింది. 1951 ఫిబ్రవరిలో, మేజర్ రాలెంగ్నావ్ 'బాబ్' ఖాతింగ్ అస్సాం రైఫిల్స్ దళాన్ని తవాంగ్ పట్టణానికి నడిపించాడు. అక్కడి టిబెట్ పరిపాలనను తొలగించి, తవాంగ్ ట్రాక్ట్ మొత్తాన్నీ తన నియంత్రణ లోకి తెచ్చుకున్నాడు. [7] [8] 1962 భారత చైనా యుద్ధంలో, తవాంగ్ కొద్దిరోజుల పాటు చైనా నియంత్రణ లోకి వెళ్ళింది. యుద్ధం ముగిసే సమయానికి చైనా తన దళాలను ఉపసంహరించుకుంది. తవాంగ్ మళ్ళీ భారత పరిపాలనలోకి వచ్చింది. కాని తవాంగ్‌తో సహా అరుణాచల్ ప్రదేశ్ లో చాలా భూభాగంపై చైనా తన వాదనలను వదులుకోలేదు. [6] : 384–502
తవాంగ్, తవాంగ్ శాసనసభ నియోజకవర్గం లోను, తూర్పు అరుణాచల్ లోక్‌సభ నియోజకవర్గం లోనూ భాగం. తవాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి 2019 లో ఎన్నికైన శాసనసభ్యుడు త్సెరింగ్ తాషి.
తవాంగ్ పట్టణం సుమారు గువహాటి నుండి 565 కి.మీ. దూరం లోను, తేజ్‌పూర్ నుండి 320 కి.మీ. దూరం లోనూ ఉంది. తవాంగ్ సగటు ఎత్తు 2,669 మీటర్లు (8,757 అ.) .
తవాంగ్‌లో వాతావరణం వెచ్చగా, సమశీతోష్ణంగా ఉంటుంది. వేసవి కంటే శీతాకాలంలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. కొప్పెన్, గీగర్ లు ఈ వాతావరణాన్ని Cwb గా వర్గీకరించారు. తవాంగ్‌లో సగటు ఉష్ణోగ్రత 10.3 °C. సగటు వార్షిక వర్షపాతం 915 మిల్లీమీటర్లు (36.0 అం.) . [9]
శీతోష్ణస్థితి డేటా - Tawang | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 10.1 (50.2) |
11.6 (52.9) |
14.5 (58.1) |
17.3 (63.1) |
19.5 (67.1) |
21.5 (70.7) |
21.6 (70.9) |
21.1 (70.0) |
20.2 (68.4) |
17.8 (64.0) |
14.2 (57.6) |
11.4 (52.5) |
16.7 (62.1) |
రోజువారీ సగటు °C (°F) | 2.0 (35.6) |
4.0 (39.2) |
7.2 (45.0) |
10.5 (50.9) |
13.5 (56.3) |
16.6 (61.9) |
17.0 (62.6) |
16.7 (62.1) |
15.1 (59.2) |
11.2 (52.2) |
6.5 (43.7) |
3.3 (37.9) |
10.3 (50.6) |
సగటు అల్ప °C (°F) | −6.1 (21.0) |
−3.5 (25.7) |
0.0 (32.0) |
3.8 (38.8) |
7.6 (45.7) |
11.4 (52.5) |
12.4 (54.3) |
11.8 (53.2) |
10.1 (50.2) |
4.6 (40.3) |
−1.1 (30.0) |
−4.7 (23.5) |
3.9 (38.9) |
సగటు అవపాతం mm (inches) | 3 (0.1) |
6 (0.2) |
22 (0.9) |
40 (1.6) |
95 (3.7) |
186 (7.3) |
203 (8.0) |
176 (6.9) |
124 (4.9) |
48 (1.9) |
9 (0.4) |
3 (0.1) |
915 (36) |
Source: [9] |
5 వ దలైలామా, నాగ్వాంగ్ లోబ్సాంగ్ గయాట్సో కోరిక మేరకు తవాంగ్ బౌద్ధ విహారాన్ని మేరా లామా లోడ్రే గయాట్సో స్థాపించాడు. ఇది గెలుగ్పా వర్గానికి చెందినది. ఇది భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ విహారం. లాసా లోని బౌద్ధ విహారం తరువాత ప్రపంచం లోనే అతి పెద్ద బౌద్ధ విహారం ఇది.[11] తవాంగ్, ఆరవ దలై లామా జన్మస్థలం కాబట్టి బౌద్ధులకు ఇది చాలా పెద్ద పుణ్యస్థలం.[12]
చైనా సైన్యం నుండి తప్పించుకోవడానికి 14 వ దలైలామా టిబెట్ నుండి పారిపోయి, 1959 మార్చి 30, న భారతదేశంలోకి ప్రవేశించాడు. ఏప్రిల్ 18 న అతను అస్సాంలోని తేజ్‌పూర్ చేరుకోవడానికి ముందు, తవాంగ్ విహారంలో కొన్ని రోజులు గడిపాడు. [13] 1959 కి ముందు, తవాంగ్‌తో సహా అరుణాచల్ ప్రదేశ్‌పై భారత సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి దలైలామా నిరాకరించాడు. 2003 లో, దలైలామా "అరుణాచల్ ప్రదేశ్ వాస్తవానికి టిబెట్‌లో భాగం" అని అన్నాడు. జనవరి 2007 లో, 1914 లో టిబెటన్ ప్రభుత్వం, బ్రిటన్ రెండూ మక్ మహోన్ రేఖను గుర్తించాయని చెప్పాడు. 2008 లో, "టిబెట్, బ్రిటిష్ ప్రతినిధులు సంతకం చేసిన ఒప్పందం ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో భాగం" అని ఆయన అన్నాడు. [14] దలైలామా 2009 నవంబరు 8 న తవాంగ్‌ను సందర్శించాడు. అతని మత ప్రవచనాలు వినేందుకు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్ ప్రజలతో సహా సుమారు 30,000 మంది హాజరయ్యారు. [15]
తవాంగ్ వైమానిక దళ స్టేషన్లో ఇప్పటికే హెలిపోర్టు, "అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్" (ఎజిఎల్) ఉన్నాయి. ఇక్కడ లాక్‌హీడ్ మార్టిన్ సి -130 జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాలు కూడా దిగగలవు. [16] [17] పర్యాటకం కోసము, ఉడాన్ పథకం కోసమై సివిల్ హెలికాప్టర్లు, విమానాలను నడిపేందుకు భారతీయ వైమానిక దళం (IAF) తవాంగ్‌లో అప్‌గ్రేడ్ చేసిన ALG ని సిద్ధం చేసింది. [18]
షెడ్యూలు ప్రకారం విమానాలు నడిచే దగ్గర లోని పౌర విమానాశ్రయాలు: గువహాటిలో లోకప్రియ గోపీనాథ్ బొర్దొలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం 450 కిలోమీటర్ల దూరం లోను, తేజ్‌పూర్‌లో సలోనిబారి విమానాశ్రయం 325 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయి. [19]
ప్రధాన నగరాల నుండి రైళ్ళు నడిచే రైల్వే స్టేషను నహర్లాగన్ వద్ద ఉంది. అస్సాంలోని మిస్సమారిని తవాంగ్‌తో కలిపే బ్రాడ్-గేజ్ రైల్వే లైను ప్రతిపాదనలో ఉంది. ఈ మార్గం కోసం 2011 లో ఒక సర్వే మంజూరైంది. [20]
166 కిలోమీటర్ల పొడవైన భలుక్పాంగ్-తవాంగ్ రైల్వే లింకు ప్రస్తుతం ఉన్న భలుక్పాంగ్ రైల్వే స్టేషన్ నుండి అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వరకు జాతీయ ప్రాజెక్టుగా చేపట్టే ప్రతిపాదన ఉంది. ఇది పర్యాటక రంగానికి ఊపునిస్తుంది. సాయుధ బలగాలను వేగంగా తరలించగలుగుతారు. ఈ మార్గం 10,000 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశాల గుండా వెళుతుంది. 80% మార్గం సొరంగాల గుండానే వెళ్తుంది. అత్యంత పొడవైన సొరంగం 29.48 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైలు మార్గం వెంట 2 లేన్ల రోడ్డును కూడా అభివృద్ధి చేస్తారు. ఈ లింకు వలన ప్రస్తుతం 285 కి.మీ. ఉన్న భలుక్పాంగ్-తవాంగ్ రహదారి దూరం 119 కి.మీ మేర తగ్గుతుంది. పూర్తయిన తర్వాత, మరింత విస్తరణ ప్రణాళికలలో పశ్చిమ దిశగా తూర్పు భూటాన్‌లోని యోంగ్ఫుల్లా విమానాశ్రయానికి 100 కిలోమీటర్ల పొడవైన దారిని నిర్మిస్తారు. ఈ దారి భారతదేశంలోని యాబాబ్, భూటాన్‌లోని ట్రాషిగాంగ్ ల గుండా పోతుంది. యోంగ్ఫుల్లా విమానాశ్రయాన్ని భారతదేశం అప్‌గ్రేడ్ చేసింది. భారత సైన్యం, భూటాన్ సైన్యం దాన్ని ఉపయోగిస్తున్నాయి.
జాతీయ రహదారి NH 13 ఉత్తర కొసన ఉన్న తవాంగ్, రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుండి 447.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. APSRTC బస్సులు, ప్రైవేట్ బస్సులూ నడుస్తూంటాయి
2020 జూలైలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), తవాంగ్‌కు పశ్చిమాన ఉన్న లుమ్లా నుండి సాక్టెంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ద్వారా భూటాన్‌లోని ట్రాషిగాంగ్ కు వ్యూహాత్మక రహదారి నిర్మాణాన్ని తలపెట్టింది. దీనివలన గౌహతి తవాంగ్ ల మధ్య దూరం 150 కిలోమీటర్లు తగ్గుతుంది. తూర్పు భూటాన్ లోను, భారత చైనా సరిహద్దు వద్దకూ సైన్యాన్ని తరలించడం వేగవంతమౌతుంది. ఇది మానస్ నది (భూటాన్సేలోని డాంగ్మే చు నది) వెంట ఉన్న మాలో రహదారిని జాతీయ రహదారి ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేస్తుంది. ఈ 40 కిలోమీటర్ల కొత్త వైండింగ్ రహదారిలో కేవలం 10 కిలోమీటర్ల కొత్త రహదారిని మాత్రమే నిర్మించాల్సిన అవసరం ఉంది. మిగిలినదంతా ప్రస్తుతమున్న రహదారుల నవీకరణే. తూర్పు భూటాన్‌ను పశ్చిమ తవాంగ్‌తో అనుసంధానించడానికి మరిన్ని రహదారులను నిర్మించటానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అవి "ట్రాషిగాంగ్-నామ్షు రోడ్", "చోర్టెన్ కోరా-జెమితాంగ్ రోడ్", భూటాన్‌లో రహదారి అప్‌గ్రేడ్, భూటాన్-చైనా సరిహద్దులోని సింగే జొంగ్, ముందస్తు ల్యాండింగ్ గ్రౌండ్ సింగే జోంగ్ ప్రాంతానికి సమీపంలో ఎయిర్‌స్ట్రిప్‌తో పాటు మరిన్ని హెలిప్యాడ్ల నిర్మాణం ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి.
సెలా కనుమ వద్ద నిర్మిస్తున్న సెలా సొరంగం అస్సాంలోని గౌహతి, తవాంగ్ మధ్య అన్ని కాలాల్లోనూ ప్రయాణాలకు వీలు కల్పించే రోడ్డు సొరంగం. అంతేకాకుండా దీని వలన దిరాంగ్, తవాంగ్ ల మధ్య దూరం 10 కిలోమీటర్లు తగ్గుతుంది కూడా. 2020 నాటికి ఇది నిర్మాణంలో ఉంది. ఈ సొరంగం పేరు, 4170 మీటర్ల ఎత్తున ఉన్న సెలా కనుమ నుండి వచ్చింది. భారత ప్రభుత్వం 2018-19 బడ్జెట్లో దీనికి నిధులు సమకూర్చింది. [21] నిర్మాణం 2019 జనవరి / ఫిబ్రవరి లో మొదలై, 2022 జనవరి / ఫిబ్రవరి నాటికి ముగుస్తుందని అంచనా వేసారు.[22] 2020 సెప్టెంబరులో ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించిన అరుణాచల్ ముఖ్యమంత్రి ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తపరచాడు. ప్రాజెక్టు 2021 అంతానికల్లా పూర్తౌతుందని ప్రకటించాడు.[23] సెలా కనుమ 13,700 అడుగుల ఎత్తున ఉండగా, సొరంగం 10,000 అడుగుల ఎత్తులో వెళుతుంది. భారత-చైనా వాస్తవాధీన రేఖ ( మెక్ మహోన్ లైన్ యొక్క వివాదాస్పద భాగాలు) లోని సంగాస్టర్ త్సో (తవాంగ్‌కు ఉత్తరం) నుండి బుమ్ లా కనుమ వరకు ఉన్న రహదారిని కూడా BRO మెరుగుపరుస్తోంది. నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ పునాదిరాయి వేశాడు.
తవాంగ్‌లో ఏటా డిసెంబరు-జనవరి నెలల్లో మంచు కురుస్తుంది. [24] పట్టణంలో స్కీ లిఫ్ట్ కూడా ఉంది. తవాంగ్ సందర్శకులకు, మిగతా అరుణాచల్ ప్రదేశ్ మాదిరిగానే, ప్రత్యేక ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పి) పొందాల్సి ఉంటుంది. కోల్‌కతా, గువహాతి, తేజ్‌పూర్, న్యూ ఢిల్లీల్లో ఉన్న కార్యాలయాల నుండి ఈ అనుమతిని పొందవచ్చు. పర్యాటకులు తేజ్‌పూర్ నుండి రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు. తేజ్‌పూర్, గువహాటి నుండి నేరుగా విమాన సౌకర్యం ఉంది. 2014 అక్టోబరులో, గువహాటి నుండి వారానికి రెండు సార్లు నడిచే హెలికాప్టర్ సేవను అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
ఇతర ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.