From Wikipedia, the free encyclopedia
రామదేవ రాయలు, (లేదా వీర రామదేవ రాయలు) (సా.శ. 1617-1632) విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ప్రభువు. 1614లో తండ్రి, ప్రభువైన రెండవ శ్రీరంగ రాయలు వరుసకు తన సోదరుడైన జగ్గారాయుడి చేత చంపబడిన తర్వాత 1617లో సింహాసనం అధిష్టించాడు. రెండవ శ్రీరంగ రాయల కుటుంబం మొత్తం చంపబడ్డా రెండవ వేంకటపతి దేవ రాయల నమ్మకస్తుడైన సేనాపతి యాచమ నాయుడు చెరసాల నుండి రామ దేవుడిని కాపాడాడు.
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
వేంకటపతి దేవరాయలకు నలుగురైదుగురు భార్యలున్నా వారిలో ఎవరికీ పుత్రసంతానం కలగకపోవడంతో బాయమ్మ అనే భార్య ఒక బ్రాహ్మణ బాలుడిని దత్తు తీసుకుని తనకు, దేవరాయలకు పుట్టిన కుమారునిగా చూపజూశారు. విషయం తెలుసుకున్న వేంకటపతి దేవరాయలు ఆ పిల్లవాణ్ణి తన కుమారుని వలెనే పెరగనిచ్చి, బావమరిది కుమార్తెనిచ్చి పెళ్ళిచేసినా చివరకు రాజ్యాన్ని మాత్రం అన్నగారి కుమారుడైన శ్రీరంగరాయలకు ఇచ్చారు. వేంకటపతి దేవరాయల మరణానంతరం శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే వేంకటపతిదేవరాయల బావమరిది, బాయమ్మ సోదరుడు జగ్గరాయలు శ్రీరంగరాయలను సకుటుంబంగా ఖైదుచేశారు. శ్రీరంగరాయలు సకుటుంబంగా ఖైదులో ఉండగానే యాచమనాయుడు అనే సేనాని జగ్గరాయని కుట్రకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తూ రామదేవరాయలను ఖైదు నుంచి తప్పించారు. ఆపైన శ్రీరంగరాయల కుటుంబాన్ని కూడా తప్పించబోగా జగ్గరాజు మొత్తంగా కుటుంబాన్ని అంతా నరికివేశారు.[1] జగ్గారాయుడు వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడిని సింహాసనంపై అధిష్టింపచేశారు.
అసలు వారసుడైన రామదేవ రాయల తరఫున యాచమ నాయుడు ఆ ప్రయత్నాల్ని అడ్డుకున్నాడు. అనంతరం జరిగిన అంతర్యుధ్ధంలో యాచమ నాయుడు జగ్గారాయుడిని ఓడించాడు.
అంతర్యుధ్ధంలో ఓడిపోయిన జగ్గారాయుడు మొదట అడవుల్లోకి పారిపోయినా తర్వాత మదురై, జింజి నాయకుల సహాయం కోరాడు. అప్పటికే విజయనగర సామ్రాజ్యం నుండి విడిపోయి సొంత పాలన చేయాలని వున్న మదురై, జింజి నాయకులు, యాచమ నాయుడు, రామదేవ రాయల మీదకు దండెత్తారు. యాచమ నాయుడు, రామదేవ రాయలు తంజావూరు నాయకుల సహాయం కోరగా, విజయనగర పాలనను గౌరవిస్తున్న తంజావూరు నాయకులు అందుకు సమ్మతించారు.
జగ్గారాయుడు, మదురై, జింజి నాయకులు, కొందరు పోర్చుగీసు వారు తిరుచ్చిరాపల్లి వద్ద పెద్ద సైన్యాన్ని మోహరించారు. యాచమ నాయుడు వెల్లూరు నుండి తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. అతనికి దారిలో తంజావూరు నాయకుడి సైన్యం కలిసింది. కర్ణాటక నుండి కొంత, డచ్చి, జాఫ్నా సైన్యాలు కూడా కలిశాయి.
1616 చివరి మాసాల్లో రెండు సైన్యాలు తిరుచ్చికి సమీపంలో కావేరి నదికి ఉత్తరాన ఉన్న తొప్పూరు అనే ప్రదేశంలో ఎదురుపడ్డాయి. రెండు సైన్యాలు కలిపి పది లక్షల సైనికులు పోరాడిన ఈ యుధ్ధం దక్షిణ భారతదేశంలో జరిగిన అతిపెద్ద యుధ్ధాలలో ఒకటిగా చెప్పబడింది.
రాజ సైన్యం ధాటికి జగ్గారాయని సైన్యం నిలువలేకపోయింది. సైన్యాధ్యక్షులైన యాచమనాయుడు, తంజావూరు రఘునాథ నాయకుడు సైన్యాన్ని ఎంతో క్రమశిక్షణతో నడిపించారు. జగ్గారాయని సోదరుడైన యెతిరాజు ప్రాణాల కోసం పారిపోయాడు. మదురై నాయకుడు పారిపోవాలని చూసినా తిరుచ్చి దగ్గర పట్టుబడ్డాడు. వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు కూడా పట్టుబడ్డాడు. జింజీ నాయకుడు ఒక్క జింజీ కోట తప్ప మిగతా అన్ని కోటలను కోల్పోయాడు. 1617 మొదట్లో యాచమ, తంజావూరు నాయకులు 15 ఏళ్ళ రామ దేవుడిని రామ దేవ రాయలుగా పట్టాభిషేకం చేశారు.
జగ్గారాయని సోదరుడైన యెతిరాజు మరలా జింజీ నాయకుని సహాయంతో తంజావూరు మీదకు దండెత్తినా జయించలేక పట్టుబడ్డాడు. చివరకు గెలవలేక తన కుమార్తెను రామదేవునికిచ్చి వివాహం చేశాడు. వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు 1619లో మరణించడంతో రామదేవునికి పరిస్థితులు చక్కబడ్డాయి.
అంతర్యుధ్ధాన్ని ఆసరాగా చేసుకొని బీజాపూరు సుల్తాను 1620లో కర్నూలు మీదకు సైన్యాన్ని పంపినా జయించలేక మరల 1624లో ఆ ప్రాంతాన్ని పూర్తిగా వశపర్చుకున్నాడు.
అంతర్యుధ్ధం తర్వాత సర్వసైన్యాధ్యక్షుడైన యాచమ నాయుడు యెతిరాజు కుమార్తెతో రామ రాయల వివాహాన్ని వ్యతిరేకించినా, రామరాయలు లెక్క చేయక వివాహం చేసుకున్నాడు. ఇది అవమానంగా భావించిన యాచమనాయుడు ముసలివాడైన తనని రాజాస్థానం నుండి విరమింపచేయాలని కోరాడు. ఇప్పుడు రామ రాయలికి మామ అయిన యెతిరాజు, అంతర్యుధ్ధం సమయంలో జగ్గారాయని నుంచి స్వాధీనం చేసుకున్న గొబ్బూరు ప్రాంతాన్ని తిరిగి ఇవ్వాలని యాచమ నాయుడిపై ఒత్తడి తెచ్చాడు. అందుకు సమ్మతించని యాచమనాయుడిపై తంజావూరు, జింజీ సైన్యాల సహాయంతో రాజ సైన్యం యచమ నాయుడు పాలిస్తున్న ప్రాంతాలపై దండెత్తింది. యాచమ నాయుడి సైన్యం చిన్నదైనా ఎంతో గొప్పగా పోరాడి యెతిరాజు సైన్యాన్ని నిలువరించింది. ఎంతోకాలం సాగిన ముట్టడి తర్వాత గొబ్బూరు ప్రాంతాన్ని తిరిగి ఇవ్వడానికి యాచమ నాయుడు సమ్మతించాడు. పులికాటు, చెంగల్పట్టు, మధురాంతకం ప్రాంతాలు పూర్తిగా వెల్లూరు ఏలుబడిలోకి వచ్చాయి. వెంకటగిరి ప్రాంతాన్ని పాలించడానికి యాచమనాయుడికి అవకాశం వున్నా తన చివరి రోజులను ఉదయారుపాళ్యం సేనాపతి రక్షణలో గడపడానికి నిశ్చయించుకున్నాడు.
వారసులు, సోదరులు లేని రామ రాయలు, ఆనెగొందిని పాలిస్తున్న వరుసకు సోదరుడు, ఆళియ రామ రాయల మనవడు అయిన పెద వేంకట రాయుడిని (మూడవ వేంకట రాయలు) వారసుడిగా ప్రకటించి 30 ఏళ్ళ వయసులో 1632లో 15 ఏళ్ళ పాలన చేసి మరణించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.