అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమష్టి కృషి చే From Wikipedia, the free encyclopedia
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా , ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు. యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదటిగా అమెరికా అధ్యక్షుడు ప్రాంక్లిన్ డి, రూజ్వెల్డ్ సూచించారు. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాను జాన్ క్రిస్టియన్ రూపొందించారు, ఈయన దక్షిణా ఆఫ్రికాకు చెందిన వారు.
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు థియోడార్ రూజ్వెల్ట్ , బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకొన్న ఒప్పందాన్ని అట్లాంటిక్ ఛార్టర్ అంటారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధభయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినది.[1]
తరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 ఏప్రిల్ 25నుండి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్య రాజ్య సమితి ఛార్టర్పై సంతకాలు చేశారు. 1945 అక్టోబరు 24న న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.
ఐక్యరాజ్య సమితికి 6 ప్రధానాంగాలు ఉన్నాయి.
ఈ సభలో సభ్యదేశాలన్నింటికీ ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రతి దేశానికి సమానంగా ఒక్క ఓటు ఉంటుంది. సమావేశాలకు ప్రతి సభ్యదేశం గరిష్ఠంగా 5 గురు సభ్యులను పంపవచ్చు. ఈ సభ సంవత్సరానికి ఒక పర్యాయం, సాధారణంగా సెప్టెంబరు మాసంలో, సమావేశమౌతుంది. సమావేశానికి అధ్యక్షుడిగా సభ్యదేశాలు ఎన్నిక చేస్తాయి. కొత్త సభ్యదేశాలకు ప్రవేశం కల్పించడానికి, భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నిక చేయుటలో ఈ సభకే అధికారముంది. సమితి ఆశయాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్యదేశాలను తొలగించే అధికారం కూడా ఈ సభకు ఉంది. అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం దీని కర్తవ్యం. ఈ సభ మూడింట రెండు వంతులు (2/3) మెజారిటీతో నిర్ణయాలు చేస్తుంది.
సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సభ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలు ఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ళ కాలవ్యవధి కొరకు ఎన్నిక కాబడు తాత్కాలిక సభ్యదేశాలు. అమెరికా, రష్యా, ఇంగ్లాండు, చైనా, ఫ్రాన్సులు ఇందులో శాశ్వత సభ్యదేశాలు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం కూడా ఉంది. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేసారు. ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను 10 కి పెంచారు. వీరిలో ఆసియా-ఆఫ్రికా దేశాలనుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాలనుండి ఇద్దరు, పశ్చిమ ఐరోపా నుండి ఇద్దరు, తూర్పు ఐరోపానుండి ఒక్కరు ఎన్నికవుతుంటారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కారాదు. దీనికి అధ్యక్షుడు ప్రతి మాసము మారుతుంటాడు. భద్రతా మండలి తన ఆదేశాలను పాటించని రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.
ఇది ఐ.రా.స. వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులో పది వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తారు. సచివాలయానికి ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. ఐ.రా.స.కీ, దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు అవుసరమైన సమాచారము, అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాలయం అధ్వర్యంలో నిర్వహింపబడుతాయి. ఉద్యోగుల ప్రతిభ, నిజాయితీ, పనితనం , వివిధ ప్రాంతాలకు ఉచితమైన ప్రాతినిధ్యం అనే అంశాలు ఈ ఉద్యోగుల ఎంపికలో ముఖ్యమైన విషయాలని ఐ.రా.స. ఛార్టర్లో వ్రాయబడింది. ఐ.రా.స శాంతి సైనిక దళాలను Blue helmets అంటారు.
కొన్ని పాశ్చాత్య దేశాల వలస పాలన క్రింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ఈ మండలి లక్ష్యం. ఇక్కడి ప్రజలను స్వీయ ప్రతిపత్తికి లేదా స్వయంపాలనకు లేదా స్వాతంత్ర్యానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత. ఇది సంవత్సరానికి రెండు సార్లు సమావేశమవుతుంది. ఇందులో మూడు రకాల సభ్యత్వాలు ఉన్నాయి
ఇది సాధారణ సభ అధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులుంటారు. ఈ మండలి ఏటా రెండుసార్లు సమావేశమవుతుంది. ప్రజల జీవన స్థాయిని మెరుగు పరచడం, విద్య, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేయడం, మానవ హక్కులను సమర్ధించడం వంటివి ఈ మండలి ఆశయాలు.
అంతర్జాతీయ న్యాయస్థానం (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం"గా పిలువబడుతుంది); ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాథమిక తీర్పులను ప్రకటించే అంగము. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధంలో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం , తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం , అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి ఉంది.1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ వారసురాలు.[2]
ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఏర్పడిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలలో పనిచేస్తుంటాయి. ఐక్య రాజ్య సమితి అంగాలలో ఒకటైన "ఆర్ధిక, సామాజిక మండలి" ఈ అనుబంధ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.