Remove ads
From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ ద్రవ్య నిధి [1] (English: International Monetary Fund - IMF) వాషింగ్టన్, డి.సి.లో ప్రధాన కార్యాలయం కలిగిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ఇందులో 190 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇది ప్రపంచంలో ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని భద్రపరచడానికి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, అధిక ఉపాధినీ, స్థిరమైన ఆర్థిక వృద్ధినీ ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడానికీ కృషి చేస్తుంది. దాని వనరుల కోసం ఇది ప్రపంచ బ్యాంకుపై ఆధారపడుతుంది.[2]
సంకేతాక్షరం | ఐఎమ్‌ఎఫ్ (IMF) |
---|---|
స్థాపన | 27 డిసెంబరు 1945 |
రకం | అంతర్జాతీయ ఆర్థిక సంస్థ |
ప్రధాన కార్యాలయాలు | అమెరికా లోని వాషింగ్టన్ డి.సి. |
భౌగోళికాంశాలు | 38.53°N 77.02°W |
సేవా | ప్రపంచవ్యాప్తం |
సభ్యులు | 29 వ్యవస్థాపక దేశాలు; 188 సభ్య దేశాలు (ఇప్పటి వరకు) |
అధికారిక భాష | అరబిక్, చైనీసు, ఇంగ్లీషు, ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ |
మేనేజింగ్ డైరెక్టరు | క్రిస్టీన్ లాగార్డే |
ప్రధానభాగం | గవర్నర్ల బోర్డు |
1944 లో అమెరికాలో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో, [నోట్స్ 1] ప్రధానంగా హ్యారీ డెక్స్టర్ వైట్, జాన్ మేనార్డ్ కీన్స్ ల ఆలోచనల నుండి ఇది రూపుదిద్దుకుంది.[3] 1945 లో 29 సభ్య దేశాలతో, అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో అధికారికంగా ఉనికి లోకి వచ్చింది. చెల్లింపుల సంక్షోభాలు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల నిర్వహణలో ఇది ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తోంది.[4] సంస్థలో సభ్యత్వం ఉన్న దేశాలు కోటా విధానం ద్వారా ఒక సంచయానికి నిధులు చేకూరుస్తాయి. చెల్లింపుల సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలు ఈ సంచయం నుండి డబ్బు తీసుకుంటాయి. 2016 నాటికి, ఫండ్‌లో 477 బిలియన్ల ఎక్స్‌డిఆర్ (సుమారు $ 667 బిలియన్) లున్నాయి.[5]
ఫండ్ పనులతో పాటు, గణాంకాల సేకరణ, విశ్లేషణ, సభ్యుల ఆర్థిక వ్యవస్థలపై పర్యవేక్షణ, నిర్దుష్ట విధానాల కోసం డిమాండు చెయ్యడం వంటి ఇతర కార్యకలాపాల ద్వారా, [6] IMF తన సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి పనిచేస్తుంది.[7] ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌లో పేర్కొన్న సంస్థ లక్ష్యాలివి:[8] అంతర్జాతీయ ద్రవ్య సహకారం, అంతర్జాతీయ వాణిజ్యం, అధిక ఉపాధి, మార్పిడి రేటు స్థిరత్వం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సభ్య దేశాలకు వనరులను అందుబాటులో ఉంచడం.[9] IMF నిధులు రెండు ప్రధాన వనరుల నుండి వస్తాయి: కోటాలు, రుణాలు. కోటాల ద్వారా సభ్య దేశాల నుండి సేకరించే నిధులు IMF నిధుల్లో సింహభాగం. ఒక్కో సభ్యుని కోటా పరిమాణం, ప్రపంచంలో దాని ఆర్థిక, ద్రవ్య ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఎక్కువ ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన దేశాలకు కోటాలు పెద్దగా ఉంటాయి. IMF వనరులను పెంచే సాధనంగా కోటాలు ఎప్పటికప్పుడు పెరుగుతూంటాయి.[10] IMF వనరులు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో ఉంటాయి.
2019 అక్టోబరు 1 నుండి IMF మేనేజింగ్ డైరెక్టరు (ఎండి), చైర్ వుమన్ గా బల్గేరియన్ ఎకనామిస్ట్ క్రిస్టాలినా జార్జివా నిర్వహిస్తోంది.[11]
2018 అక్టోబరు 1 నుండి గీతా గోపీనాథ్‌ను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమించారు. ఆమె ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్‌డి పొందింది. ఐఎంఎఫ్ లో నియామకానికి ముందు ఆమె కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా పనిచేసింది.[12]
1944 లో బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ ఒప్పందంలో భాగంగా IMF ను ఏర్పాటు చేసారు.[13] మహా మాంద్యం సమయంలో, వివిధ దేశాలు తమతమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచుకునే ప్రయత్నంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులను అమాంతం పెంచేసాయి. ఇది జాతీయ కరెన్సీల విలువ తగ్గింపుకూ, ప్రపంచ వాణిజ్యంలో క్షీణతకూ దారితీసింది.[14]
అంతర్జాతీయ ద్రవ్య సహకారంలో ఏర్పడిన వైఫల్యం పర్యవేక్షణ అవసరాన్ని సృష్టించింది. అమెరికా, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రం, బ్రెట్టన్ వుడ్స్‌లోని మౌంట్ వాషింగ్టన్ హోటల్‌లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో 45 ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమై యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక సహకారం గురించి, ఐరోపాను ఎలా పునర్నిర్మించాలనే విషయం గురించీ చర్చించారు.
ప్రపంచ ఆర్థిక సంస్థగా IMF నిర్వహించాల్సిన పాత్ర గురించి రెండు అభిప్రాయా లున్నాయి. IMF ను, అప్పులు తీసుకునే దేశాలు తమ అప్పులను సకాలంలో తిరిగి చెల్లించగలవో లేదో చూసుకునే బ్యాంకు లాగా అమెరికన్ ప్రతినిధి హ్యారీ డెక్స్టర్ వైట్ ఊహించాడు.[15] వైట్ ప్రణాళిక చాలావరకు బ్రెట్టన్ వుడ్స్ తుది రూపులో పొందుపరచబడింది. మరోవైపు, బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్, IMF ను ఒక సహకార నిధి లాగా ఊహించాడు. సభ్య దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తినపుడు, సాయం పొందగలిగే ఒక సహకార నిధి. ఈ అభిప్రాయం ప్రభుత్వాలకు సహాయపడే IMF ను ఊహించింది.[15]
1945 డిసెంబరు 27 న మొదటి 29 దేశాలు దాని ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌ను ఆమోదించినప్పుడు, ఐఎంఎఫ్ అధికారికంగా ఉనికిలోకి వచ్చింది.[16] 1946 చివరి నాటికి IMF 39 మంది సభ్యులకు పెరిగింది.[17] 1947 మార్చి 1 న, IMF తన ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించింది.[18] మే 8 న ఫ్రాన్స్ దాని నుండి రుణాలు తీసుకున్న మొదటి దేశమైంది.[17]
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ లోని ముఖ్య సంస్థలలో IMF ఒకటి; దాని రూపకల్పనతో జాతీయ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని పెంచుతూనే, మానవ సంక్షేమాన్ని కూడా పెంచడానికి వీలు కలిగించింది. దీనిని అంతర్నిర్మిత ఉదారవాదం (ఎంబెడెడ్ లిబరలిజమ్) అని కూడా పిలుస్తారు.[19] మరిన్ని దేశాలను సభ్యులుగా చేర్చుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో IMF ప్రభావం క్రమంగా పెరిగింది. అనేక ఆఫ్రికన్ దేశాలు రాజకీయ స్వాతంత్ర్యం సాధించడం, 1991 లో సోవియట్ యూనియన్ రద్దవడం వల్ల ఈ పెరుగుదల మరింత స్ఫుటంగా కంబడింది.[20]
1971 లో అమెరికా ప్రభుత్వం అమెరికా డాలర్లను బంగారంగా మార్చుకోడాన్ని నిలిపివేసేంత వరకు, బ్రెట్టన్ వుడ్స్ మార్పిడి వ్యవస్థ అమల్లో ఉంది. అమెరికా తీసుకున్న ఆ చర్యను నిక్సన్ షాక్ అంటారు.[21] ఈ మార్పులను ప్రతిబింబించే IMF ఆర్టికిల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌లోని మార్పులను 1976 జమైకా ఒప్పందాలు ఆమోదించాయి. 1970 ల తరువాతి సంవత్సరాల్లో, చమురు ఎగుమతిదారులు డిపాజిట్టు చేసిన డబ్బులతో కళకళ్ళాడుతున్న పెద్ద పెద్ద వాణిజ్య బ్యాంకులు, దేశాలకు రుణాలు ఇవ్వడం ప్రారంభించాయి. ఇది IMF తన పాత్రను మార్చుకోడానికి దారితీసింది. ముఖ్యంగా 1980 లలో ప్రపంచ మాంద్యం సంక్షోభాన్ని రేకెత్తించడంతో IMF తిరిగి ప్రపంచ ఆర్థిక పాలనలోకి తోసుకువచ్చింది.[22]
2000 ల ప్రారంభంలో అర్జెంటీనాకు (1998-2002 అర్జెంటీనా గొప్ప మాంద్యం సమయంలో), ఉరుగ్వే (2002 ఉరుగ్వే బ్యాంకింగ్ సంక్షోభం తరువాత) కు IMF రెండు ప్రధాన రుణ ప్యాకేజీలను అందించింది.[23] అయితే, 2000 ల మధ్య నాటికి, 1970 ల తరువాత IMF ఇచ్చిన రుణాలు ప్రపంచ జిడిపిలో అతి తక్కువ స్థాయికి చేరుకున్నాయి [24]
2010 మే లో, గ్రీదులో ప్రభుత్వ రంగంలోని లోటు వల్ల పేరుకుపోయిన ప్రభుత్వ ఋణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి. € 110 బిలియన్ల మొదటి గ్రీకు బెయిలౌట్‌లో IMF, 3:11 నిష్పత్తిలో పాల్గొంది. ఈ ఉద్దీపనలో భాగంగా, గ్రీకు ప్రభుత్వం 2009 లో 11%గా ఉన్న లోటును 2014 లో "3% కన్నా తక్కువ"కు తగ్గించే చర్యలు తీసుకోడానికి అంగీకరించింది.[25] ఈ ఉద్దీపనలో క్షవరం లాంటి రుణ పునర్నిర్మాణ చర్యలు లేవు. స్విస్, బ్రెజిలియన్, ఇండియన్, రష్యన్లకూ, ఐఎంఎఫ్ యొక్క అర్జెంటీనా డైరెక్టర్లకూ ఇది నచ్చలేదు. స్వయానా గ్రీకు నేతలే క్షవరాన్ని తోసిపుచ్చారు (ఆ సమయంలో, పిఎం జార్జ్ పాపాండ్రీ, ఆర్థిక మంత్రి జార్గోస్ పాపాకోన్స్టాంటినౌ).[26]
2011 అక్టోబరు నుండి కొన్ని నెలల కాలంలో €100 బిలియన్ల రెండవ బెయిలౌట్ ప్యాకేజీని కూడా అంగీకరించారు. ఈ సమయంలో పాపాండ్రీయును పదవి నుండి తొలగించారు. IMF భాగంగా ఉన్న ట్రోయికా ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిర్వాహకులు. 2012 మార్చి 15 న XDR 23.8 బిలియన్లను IMF యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదించారు.[27] ప్రైవేట్ బాండ్ హోల్డర్ల చేత 50% పైకి క్షవరానికి ఐఎమ్‌ఎఫ్ అంగీకరింపజేసింది. 2010 మే, 2012 ఫిబ్రవరి మధ్య విరామంలో హాలండ్, ఫ్రాన్స్, జర్మనీ లకు చెందిన ప్రైవేట్ బ్యాంకులు గ్రీకు రుణాన్ని €122 బిలియన్ల నుండి € 66 బిలియన్లకు తగ్గించాయి [26][28]
2012 జనవరి నాటికి, IMF జాబితాలోని అతిపెద్ద ఋణగ్రహీతలు గ్రీసు, పోర్చుగల్, ఐర్లాండ్, రొమేనియా, ఉక్రెయిన్ లు..[29]
25 2013 మార్చి న, € 10 బిలియన్ల సైప్రస్ అంతర్జాతీయ బెయిలౌట్‌ను ట్రోయికా అంగీకరించింది. అందుకు గాను సైప్రియాట్లకు అయిన ఖర్చులు: దేశం యొక్క రెండవ అతిపెద్ద బ్యాంకును మూసివేయడం; బ్యాంక్ ఆఫ్ సైప్రస్ లోని బీమా చేయని డిపాజిట్లపై వన్-టైమ్ బ్యాంక్ డిపాజిట్ లెవీని విధించడం.[30][31]
"సావరిన్ డెట్ రీస్ట్రక్చర్: ఫండ్ యొక్క లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ కోసం ఇటీవలి పరిణామాలు, చిక్కులు" పేరుతో ఒక నివేదికలో, సావరిన్ డెట్ పునర్నిర్మాణం అనే అంశం 2005 తరువాత మొదటిసారిగా ఐఎంఎఫ్ 2013 ఏప్రిల్‌లో చేపట్టింది.[32] మే 20 న బోర్డు చర్చించారు ఇది కాగితంపై, [33] గ్రీస్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, బెలిజ్, జమైకా ఇటీవల అనుభవాలు సంగ్రహంగా. డిప్యూటీ డైరెక్టరు హ్యూ బ్రెడెన్‌క్యాంప్‌తో వివరణాత్మక ఇంటర్వ్యూ కొన్ని రోజుల తరువాత ప్రచురించబడింది, [34] వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన మటినా స్టెవిస్ చేసిన డీకన్‌స్ట్రక్షన్.[35]
IMF లోని సభ్య దేశాలన్నీ సార్వభౌమ దేశాలు కావు. అందువల్ల IMF లోని కొన్ని "సభ్య దేశాలు" ఐక్యరాజ్యసమితిలో సభ్యులు కావు.[36] అలాంటివి అరూబా, కురకావ్, హాంకాంగ్ మకావు, కొసావోలు .[37][38] IMF లోని సభ్యులందరూ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (IBRD) సభ్యులే. అలాగే అక్కడి సభ్యులు ఇక్కడా సభ్యులే.
మాజీ సభ్యులు క్యూబా (ఇది 1964 లో వెళ్ళిపోయింది), [39] రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్)లు. 1980 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, తైవాన్‌కు మద్దతును ఉపసంహరించుకోవడంతో IMF నుండి తొలగించారు. దాని స్థానంలో పీపుల్స్ రిపబ్లిక్ చైనా చేరింది.[40] అయితే, "చైనా ప్రావిన్స్ అయిన తైవాన్" ఇప్పటికీ అధికారిక IMF సూచికలలో ఉంది.[41]
ఐరాసలో సభ్యత్వం ఉండి కూడా ఐఎంఎఫ్‌లో లేని దేశాల్లో అండోరా, లీచ్టెన్‌స్టెయిన్, మొనాకో, ఉత్తర కొరియా కూడా ఉన్నాయి.
1954 లో మాజీ చెకోస్లోవేకియా "అవసరమైన డేటాను అందించడంలో విఫలమైనందుకు" గాను ఆ దేశాన్నిబహిష్కరించారు. వెల్వెట్ విప్లవం తరువాత 1990 లో తిరిగి చేర్చుకున్నారు. 1950 లో పోలండ్ బయటకు పోయింది (సోవియట్ యూనియన్ ఒత్తిడి వలన అని ఆరోపణలు వచ్చాయి) . కాని 1986 లో తిరిగి వచ్చింది.[42]
ఏ దేశమైనా IMF లో చేరడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. IMF ఏర్పాటైన తరువాత, యుద్ధానంతర కాలం తొలినాళ్ళలో, IMF సభ్యత్వం కోసం నియమాలు సాపేక్షంగా సరళంగా ఉంచారు. ఆ నిబంధనలు: సభ్యులు తమ కోటా ప్రకారం సభ్యత్వ చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉంది. కరెన్సీ నిర్బంధాలు విధించకూడదు (IMF అనుమతి ఉంటే తప్ప), IMF ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌లో ఉన్న ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలి, జాతీయ ఆర్థిక సమాచారాన్ని అందించాలి. అయితే, నిధుల కోసం ఐఎంఎఫ్‌కు దరఖాస్తు చేసుకునె ప్రభుత్వాలకు కఠినమైన నిబంధనలు విధించారు.[19]
1945, 1971 మధ్య IMF లో చేరిన దేశాలు తమ మార్పిడి రేట్లను చెల్లింపుల బ్యాలెన్స్‌లో "ప్రాథమిక అసమతుల్యత"ను సరిచేయడానికి మాత్రమే సర్దుబాటు చేసేలా, అదిన్నూ IMF ఒప్పందంతో మాత్రమే చేసేలా, ఉంచడానికి అంగీకరించాయి.[43]
IMF సభ్య దేశాలకు అన్ని సభ్య దేశాల ఆర్థిక విధానాలపై సమాచారం ఉంటుంది. ఇతర సభ్యుల ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాలు, మార్పిడి విషయాలలో సాంకేతిక సహాయం, చెల్లింపు ఇబ్బందుల సమయంలో ఆర్థిక సహాయం, వాణిజ్యం, పెట్టుబడుల్లో మరిన్ని అవకాశాలూ పొందే అవకాశం ఉంటుంది.[44]
బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో ప్రతి సభ్య దేశం తరపున ఒక గవర్నరు, ఒక ప్రత్యామ్నాయ గవర్నరు ఉంటారు. ప్రతి సభ్య దేశం తన ఇద్దరు గవర్నర్లను నియమిస్తుంది. బోర్డు సాధారణంగా సంవత్సరానికి ఒకసారి సమావేశమౌతుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను ఎన్నుకోవడం లేదా నియమించడం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ బాధ్యత. కోటా పెరుగుదల, ప్రత్యేక డ్రాయింగ్ హక్కుల కేటాయింపులు, కొత్త సభ్యుల ప్రవేశం, సభ్యులను తప్పనిసరిగా ఉపసంహరింపజేయడం, ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌కు, ఉప-చట్టాలకూ సవరణలు చేయడానికీ గవర్నర్స్ బోర్డు అధికారికంగా బాధ్యత వహిస్తుండగా, ఆచరణలో అది దాని అధికారాల్లో చాలావాటిని ఎగ్జిక్యూటివ్ బోర్డుకు అప్పగించింది.[45]
బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక కమిటీ, అభివృద్ధి కమిటీలు సలహా ఇస్తాయి. అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక కమిటీలో 24 మంది సభ్యులు ఉన్నారు. ఇది ప్రపంచ ద్రవ్యతలో చోటు చేసుకుంటున్న మార్పులను, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వనరుల బదిలీని పర్యవేక్షిస్తుంది.[46] అభివృద్ధి కమిటీలో 25 మంది సభ్యులు ఉన్నారు, క్లిష్టమైన అభివృద్ధి సమస్యలపై, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన ఆర్థిక వనరులపై సలహా ఇస్తుంది. వారు వాణిజ్య, పర్యావరణ సమస్యలపై కూడా సలహా ఇస్తారు.
బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నేరుగా IMF మేనేజింగ్ డైరెక్టరుకు రిపోర్టు చేస్తుంది.[46]
ఎగ్జిక్యూటివ్ బోర్డులో 24 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మొత్తం 189 సభ్య దేశాలకు భౌగోళిక వరుసలో ఒకరి తరువాత ఒకరు ప్రాతినిధ్యం వహిస్తూంటారు.[47] పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలకు వారి స్వంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఉంటారు. కాని చాలా దేశాలు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దేశాలకు కలిపి సామూహికంగా ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలుగా చేసారు.[45]
2011 మార్చిలో అమల్లోకి వచ్చిన 2008 వాయిస్ అండ్ పార్టిసిపేషన్ సవరణ తరువాత, [48] అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా - ఈ ఏడు దేశాలు ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టరును నియమించుకుంటాయి.[47] మిగిలిన 17 మంది డైరెక్టర్లు ఒక్కొక్కరూ 2 నుండి 23 దేశాలతో కూడిన నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ బోర్డు సాధారణంగా వారంలో చాలాసార్లు కలుస్తూంటుంది.[49] ప్రతి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి బోర్డు సభ్యత్వాన్ని, నియోజకవర్గం వారీగా సమీక్షిస్తారు.[50]
IMF కు మేనేజింగ్ డైరెక్టరు నేతృత్వం వహిస్తారు. వారు సిబ్బందికి అధిపతిగా, ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఛైర్మన్‌గా పనిచేస్తారు. చారిత్రికంగా IMF మేనేజింగ్ డైరెక్టరు ఐరోపాకు, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అమెరికాకు చెందినవారూ ఉంటారు. అయితే, ఈ పద్ధతిని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు పోస్టుల కోసం ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా అర్హత గల అభ్యర్థులు పోటీ పడగలిగే అవకాశం త్వరలో రావచ్చు.[51][52] 2019 ఆగస్టులో, అంతర్జాతీయ ద్రవ్య నిధి తన మేనేజింగ్ డైరెక్టరు పదవికి ఉండే వయోపరిమితిని (65 లేదా అంతకంటే ఎక్కువ) తొలగించింది.[53]
2011 లో ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రిక్ దేశాలు (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా) ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఐరోపా వ్యక్తిని మేనేజింగ్ డైరెక్టరుగా నియమించే సంప్రదాయం IMF చట్టబద్ధతను బలహీన పరిచిందని, మెరిట్ ఆధారంగా నియామకం చేయాలనీ ఈ ప్రకటన పిలుపునిచ్చింది.[51][54]
Nr | తేదీలు | పేరు | మూలం దేశం | నేపథ్య |
---|---|---|---|---|
1 | 1946 మే 6- 1951 మే 5 | డాక్టర్ కామిల్లె గుట్ | బెల్జియం | రాజకీయవేత్త, ఆర్థికవేత్త, న్యాయవాది, ఆర్థిక మంత్రి, ఆర్థిక మంత్రి |
2 | 1951 ఆగస్టు 3 - 1956 అక్టోబరు 3 | ఇవర్ రూత్ | Sweden | ఆర్థికవేత్త, న్యాయవాది, సెంట్రల్ బ్యాంకర్ |
3 | 1956 నవంబరు 21 - 1963 మే 5 | ప్రతి జాకబ్సన్ | Sweden | ఎకనామిస్ట్, లాయర్, అకాడెమిక్, లీగ్ ఆఫ్ నేషన్స్, బిఐఎస్ |
4 | 1963 సెప్టెంబరు 1- 1973 ఆగస్టు 31 | పియరీ-పాల్ ష్వీట్జర్ | ఫ్రాన్స్ | న్యాయవాది, వ్యాపారవేత్త, సివిల్ సర్వెంట్, సెంట్రల్ బ్యాంకర్ |
5 | 1973 సెప్టెంబరు 1 - 1978 జూన్ 18 | డాక్టర్ జోహన్ విట్టవీన్ | నెదర్లాండ్స్ | రాజకీయ నాయకుడు, ఆర్థికవేత్త, విద్యావేత్త, ఆర్థిక మంత్రి, ఉప ప్రధాని, సిపిబి |
6 | 1978 జూన్ 18 - 1987 జనవరి 15 | జాక్వెస్ డి లారోసియెర్ | ఫ్రాన్స్ | వ్యాపారవేత్త, సివిల్ సర్వెంట్, సెంట్రల్ బ్యాంకర్ |
7 | 1987 జనవరి 16 - 2000 ఫిబ్రవరి 14 | డాక్టర్ మిచెల్ కామ్డెసస్ | ఫ్రాన్స్ | ఆర్థికవేత్త, సివిల్ సర్వెంట్, సెంట్రల్ బ్యాంకర్ |
8 | 2000 మే 1 - 2004 మార్చి 4 | హోర్స్ట్ కోహ్లర్ | Germany | రాజకీయవేత్త, ఆర్థికవేత్త, పౌర సేవకుడు, ఇబిఆర్డి, అధ్యక్షుడు |
9 | 2004 జూన్ 7 - 2007 అక్టోబరు 31 | రోడ్రిగో రాటో | స్పెయిన్ | రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, ఆర్థిక మంత్రి, ఆర్థిక మంత్రి, ఉప ప్రధాని |
10 | 2007 నవంబరు 1 - 2011 మే 18 | డాక్టర్ డొమినిక్ స్ట్రాస్-కాహ్న్ | ఫ్రాన్స్ | రాజకీయవేత్త, ఆర్థికవేత్త, న్యాయవాది, వ్యాపారవేత్త, ఆర్థిక మంత్రి, ఆర్థిక మంత్రి |
11 | 2011 జూలై 5 - 2019 సెప్టెంబరు 12 | క్రిస్టీన్ లగార్డ్ | ఫ్రాన్స్ | రాజకీయ నాయకుడు, న్యాయవాది, ఆర్థిక మంత్రి |
12 | 2019 అక్టోబరు 1 - ప్రస్తుతం | డాక్టర్ క్రిస్టాలినా జార్జివా | బల్గేరియా | రాజకీయవేత్త, ఆర్థికవేత్త |
న్యూయార్క్ హోటల్ రూం అటెండర్‌పై లైంగిక వేధింపుల కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టరు డొమినిక్ స్ట్రాస్-కాహ్న్‌ను అరెస్టు చేయడంతో అతడు మే 18 న రాజీనామా చేశాడు. తరువాత ఆ ఆరోపణలను తొలగించారు.[27] అతడి స్థానంలో 2011 జూన్ 28 న, క్రిస్టీన్ లాగార్డ్ ను నియమించారు. ఆమె 2011 జూలై 5 న మొదలు పెట్టి ఐదేళ్ల పాటు పనిచేసింది.[27][55] 2016 జూలై 5 న మరో ఐదేళ్ళ కాలానికి ఆమె తిరిగి ఎన్నికైంది.[56]
మేనేజింగ్ డైరెక్టర్కు మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరు సహాయం చేస్తారు, సాంప్రదాయికంగా ఎల్లప్పుడూ అమెరికా జాతీయులే ఈ పదవికి ఎంపికౌతారు.[57] మేనేజింగ్ డైరెక్టర్, అతని / ఆమె మొదటి డిప్యూటీ కలిసి IMF సీనియర్ మేనేజ్‌మెంట్‌కు నాయకత్వం వహిస్తారు. మేనేజింగ్ డైరెక్టరు వలె, మొదటి డిప్యూటీ సాంప్రదాయకంగా ఐదేళ్ల కాలపరిమితితో పనిచేస్తారు.
Nr | తేదీలు | పేరు | మూలం దేశం | నేపథ్య |
---|---|---|---|---|
1 | 1949 ఫిబ్రవరి 9 - 1952 జనవరి 24 | ఆండ్రూ ఎన్. ఓవర్బీ | యు.ఎస్.ఏ | బ్యాంకర్, సీనియర్ యుఎస్ ట్రెజరీ అధికారిక |
2 | 1953 మార్చి 16 - 1962 అక్టోబరు 31 | హెచ్. మెర్లే కోక్రాన్ | యు.ఎస్.ఏ | యుఎస్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ |
3 | 1962 నవంబరు 1 - 1974 ఫిబ్రవరి 28 | ఫ్రాంక్ ఎ. సౌథార్డ్, జూనియర్. | యు.ఎస్.ఏ | ఆర్థికవేత్త, పౌర సేవకుడు |
4 | 1974 మార్చి 1 - 1984 మే 31 | విలియం బి. డేల్ | యు.ఎస్.ఏ | ప్రజా సేవకుడు |
5 | 1984 జూన్ 1 - 1994 ఆగస్టు 31 | రిచర్డ్ డి. ఎర్బ్ | యు.ఎస్.ఏ | ఆర్థికవేత్త, వైట్ హౌస్ అధికారిక |
6 | 1994 సెప్టెంబరు 1 - 2001 ఆగస్టు 31 | స్టాన్లీ ఫిషర్ | యు.ఎస్.ఏ ఇజ్రాయిల్ | ఆర్థికవేత్త, సెంట్రల్ బ్యాంకర్, బ్యాంకర్ |
7 | 2001 సెప్టెంబరు 1 - 2006 ఆగస్టు 31 | అన్నే ఓ. క్రూగర్ | యు.ఎస్.ఏ | ఎకనామిస్ట్ |
8 | 2006 జూలై 17 - 2011 నవంబరు 11 | జాన్ పి. లిప్స్కీ | యు.ఎస్.ఏ | ఎకనామిస్ట్ |
9 | 2011 సెప్టెంబరు 1 - 2020 ఫిబ్రవరి 28 | డేవిడ్ లిప్టన్ | యు.ఎస్.ఏ | ఎకనామిస్ట్, సీనియర్ యుఎస్ ట్రెజరీ అఫీషియల్ |
10 | 2020 మార్చి 20 - ప్రస్తుతం | జాఫ్రీ WS ఒకామోటో | యు.ఎస్.ఏ | సీనియర్ యుఎస్ ట్రెజరీ అధికారిక, బ్యాంక్ కన్సల్టెంట్ |
IMF లో ఓటింగ్ శక్తి కోటా విధానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి సభ్యునికి అనేక ప్రాథమిక ఓట్లు ఉంటాయి (ప్రతి సభ్యుడి ప్రాథమిక ఓట్ల సంఖ్య మొత్తం ఓట్లలో 5.502%కి సమానం), [58] సభ్య దేశం యొక్క కోటాలో ప్రతి 100,000 ప్రత్యేక డ్రాయింగ్ రైట్ (ఎస్‌డిఆర్) కు ఒక అదనపు ఓటు ఉంటుంది.[59] ప్రత్యేక డ్రాయింగ్ హక్కు IMF యొక్క ఖాతా యొక్క యూనిట్, ఇది కరెన్సీ కోసం క్లెయిమును సూచిస్తుంది. ఇది కీలకమైన అంతర్జాతీయ కరెన్సీలపై ఆధారపడి ఉంటుంది. ప్రాథమిక ఓట్లు చిన్న దేశాలకు అనుకూలంగా స్వల్ప పక్షపాతాన్ని ఏర్పరుస్తాయి, కాని ఎస్‌డిఆర్ ప్రకారం వచ్చే అదనపు ఓట్లు ఈ పక్షపాతాన్ని మించిపోతాయి.[59] ఓటింగ్ షేర్లలో మార్పులు చెయ్యాలంటే 85% మెజారిటీ వోట్ల ఆమోదం అవసరం.[4]
IMF లోని పెద్ద సభ్యుల కోటా, వోటింగు వాటాల జాబితా ఈ పట్టికలో ఉంది[60] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
1980 లో చేపట్టిన ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ (ఓడిఐ) పరిశోధనలో IMF పై విమర్శలు ఉన్నాయి. టైటస్ అలెగ్జాండర్ చెప్పిన ప్రపంచ వర్ణవివక్షకు ఆధారంగా ఉన్న స్తంభం అనే వర్ణనకు మద్దతు ఇస్తుంది.[61]
మార్కెట్ ఆధారిత విధానాలను ప్రోత్సహించే IMF స్వభావం అనివార్యంగా విమర్శలను మూటగట్టుకుందని ఓడిఐ తీర్మానించింది. మరోవైపు, ప్రభుత్వాలు అంతర్జాతీయ బ్యాంకర్లను నిందించడానికి IMF ఒక బలిపశువుగా ఉపయోగపడుతోంది. ఐఎంఎఫ్ విధాన షరతులు సరళంగానే ఉన్నా తక్కువ అభివృద్ధి చెందిన దేశాల రాజకీయ ఆకాంక్షలను అది పట్టించుకోలేదని ఓడిఐ అంగీకరించింది.[62]
విధాన ప్రతిపాదనలను పాటించడంలో ఒక మోడల్ దేశమని IMF భావించిన అర్జెంటైనా, 2001 లో విపత్కర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది.[63] ఇది IMF- ప్రేరిత బడ్జెట్ పరిమితుల వల్లన, వ్యూహాత్మకంగా ముఖ్యమైన జాతీయ వనరులను ప్రైవేటీకరించడం వలనా సంభవించిందని కొందరు భావిస్తారు. ఆరోగ్యం, విద్య, భద్రత వంటి కీలకమైన రంగాలలో కూడా జాతీయ మౌలిక సదుపాయాలను కొనసాగించగల ప్రభుత్వ సామర్థ్యం, IMF- ప్రేరిత బడ్జెట్ పరిమితుల వలన తగ్గిపోయింది.[64] అర్జెంటీనా అనుసరించిన తప్పుడు ఫిస్కల్ ఫెడరలిజమే సంక్షోభానికి కారణమని మరికొందరు భావిస్తారు.[65] ఈ సంక్షోభం వలన అర్జెంటీనా లోను, ఇతర దక్షిణ అమెరికా దేశాలలోనూ ఈ సంస్థపై విస్తృతంగా ద్వేషం పెరిగింది. చాలా మంది, ఈ ప్రాంతపు ఆర్థిక సమస్యలకు కారణం IMF యే నని నిందించారు.
ఒక ఇంటర్వ్యూలో (2008-05-19), మాజీ రొమేనియన్ ప్రధాన మంత్రి సెలిన్ పోపెస్కు-టెరిసానూ, "2005 నుండి, దేశ ఆర్థిక పనితీరును మదింపు చేసిననపుడల్లా, IMF తప్పులు చేస్తూనే ఉంది" అని పేర్కొన్నాడు.[27] అప్పుల బారిన పడిన ఆఫ్రికన్ దేశాలు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు తమ సార్వభౌమత్వాన్ని అప్పజెబుతున్నాయని టాంజానియా మాజీ అధ్యక్షుడు జూలియస్ నైరెరే అన్నాడు. "ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆర్థిక మంత్రిత్వ శాఖగా ఐఎంఎఫ్‌ను ఎన్నుకున్నారా ఏంటి?" అనే అతడి ప్రశ్న ప్రఖ్యాతి గాంచింది.[27][66]
ఐఎమ్‌ఎఫ్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్, మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ (ఇతను 2007-08 ఆర్థిక సంక్షోభాన్ని అంచనా వేశాడు) ఐఎమ్‌ఎఫ్ అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్శ్‌ట్రా ప్లేయరు లాగా ఉంటోందని విమర్శించాడు. అమెరికా ద్రవ్య విధానాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వినాశనం కలిగిస్తున్నాయని అతడి అభిప్రాయం. అలాంటి అమెరికా ద్రవ్య విధానాలను ఐఎంఎఫ్ ప్రశంసించడాన్ని అతడు విమర్శించాడు.[27] పాశ్చాత్య దేశాలు, ఐఎంఎఫ్ అనుసరిస్తున్న అతి-స్వేచ్ఛా ద్రవ్య విధానాలను అతడు విమర్శించాడు.[27][27]
విధాన సంస్కరణ అవసరమని చెబుతున్న దేశాలలో స్థానిక ఆర్థిక పరిస్థితులు, సంస్కృతులు, పర్యావరణాల గురించి IMFకు "తెలియదు" అని విమర్శించారు.[67] ఖర్చు పెట్టడం అంటే కాగితంపై ఏమిటి, వాస్తవంలో పౌరుల్లో దానికి అర్థం ఏమిటి అనే వాటి మధ్య వ్యత్యాసాన్ని IMF ఆర్థిక సలహాలు ఇచ్చేటపుడు పరిగణనలోకి తీసుకోకపోవచ్చు.[68] ఇష్టమొచ్చినట్లు షరతులు పెట్టేసి, ఆ షరతుల వలన కార్యక్రమాల గతి ఏమౌతోందో "పట్టించుకోరు" అని దేశాలు ఆరోపిస్తున్నాయి.
IMF ఇచ్చే మందు ఎలా ఉంటుందంటే, "బడ్జెట్ బెల్టును బిగించాలని అసలు బెల్టే లేని పేద దేశాలకు చెబుతుంది" అని జెఫ్రీ సాక్స్ అన్నాడు.[68] స్థూల ఆర్థిక సమస్యలలో ప్రత్యేకత కలిగిన సాధారణ సంస్థగా IMF పాత్రకు సంస్కరణ అవసరం అని సాక్స్ రాశారు. దాని షరతులను కూడా విమర్శించాడు.[69]
స్టిగ్లిట్జ్ ఇలా అన్నాడు, "ఆధునిక హైటెక్ యుద్ధంలో భౌతికమైన సంబంధం ఉండదు: 50,000 అడుగుల ఎత్తు నుండి బాంబులు వేసే వ్యక్తికి తాను ఎంత నాశనం చేస్తున్నాడో అనుభూతికి అందదు. ఆధునిక ఆర్థిక నిర్వహణ కూడా ఇలాగే ఉంటుంది: తన లగ్జరీ హోటల్ గది నుండి నిర్లక్ష్యంగా షరతులను రుద్దే వ్యక్తికి, తాను నాశనం చేస్తున్న వ్యక్తుల జీవితాల గురించి తెలిస్తే బహుశా తాను పెట్టే షరతుల గురించి మరోసారి ఆలోచిస్తాడు." [70]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.