మహబూబ్​నగర్

తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ మండలం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia

మహబూబ్​నగర్

పాలమూరు, తెలంగాణ రాష్ట్రం, పాలమూరు జిల్లా, పాలమూరు మండలానికి చెందిన నగరం.[2][3] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ నగరం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని మహబూబ్ నగర్ మండలంలో ఉండేది.[4]

త్వరిత వాస్తవాలు పాలమూరు, దేశం ...
పాలమూరు
Thumb
పాలమూరు తూర్పు కమాన్
Nickname: 
మహబూబ్ నగర్
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాపాలమూరు
Population
 (2021)[1]
  Total
3,43,587
Languages
  Officialతెలుగు
మూసివేయి


భౌగోళిక స్థితి

పాలమూరు కేంద్ర స్థానమైన మహబూబ్‌నగర్‌ నగరం భౌగోళికంగా జిల్లా మధ్యలో రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు నైరుతి వైపున 100 కిలోమీటర్ల దూరంలో 16°74" ఉత్తర అక్షాంశం, 78°00" తూర్పు రేఖాంశంపై ఉంది. చుట్టూ ఎత్తయిన కొండలు, గుట్టలచే ఆవరించబడిన ఈ నగరానికి రవాణా పరంగా రోడ్డు, రైలు మార్గాన మంచి వసతులున్నాయి.వ్యవసాయకంగా, పారిశ్రామికంగా ఈ నగరం ఇప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలతో పోటీ పడుతోంది.

నగర పరిపాలన

Thumb
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, పాలమూరు

పాలమూరు పాలన నగర పాలక సంస్థచే నిర్వహించ బడుతుంది. నగరంలో నీటిసరఫరా, వీధిదీపముల నిర్వహణ, డ్రైనేజీ నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర కార్యకలాపాలు నగర పాలికచే చేపట్టబడుతుంది. రజాకారుల కాలంలో "ధరోగా సఫాయి"గా పిల్వబడిన నగర పురపాలక స్థాయి అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. 1952లో మహబూబ్‌నగర్‌కు మున్సీపాలిటీగా గుర్తింపునిచ్చారు.[5] అప్పుడు పురపాలక సంఘంలో 15 వార్డులు ఉండగా, ఆతరువాత 38 వార్డులుకు పెరిగినవి. ప్రారంభంలో మున్సీపాలిటీ స్థాయి మూడవగ్రేడు ఉండగా, ఇది కూడా క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుతం స్పెషల్ గ్రేడు స్థాయికి పెరిగింది తరువాత 2025లో నగర పాలక సంస్థగా వృద్ధి చెందింది. ప్రస్తుతం సుమారు 4 లక్షల జనాభా కల ఈ నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి.1883 నుండి ఈ నగరం జిల్లా కేంద్రంగా సేవలందిస్తుంది.తలపండిన మేధావులు, రాజకీయ ఉద్ధండులు ఈ పురపాలక సంఘానికి చైర్మెన్లుగా వ్యవహరించారు.

జిల్లా కేంద్రం కావడంతో మండల, డివిజన్ స్థాయి కార్యాలయాలతో పాటు అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు నగరంలో ఉన్నాయి.

నగర చరిత్ర

ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించుట కారణంగా ఈ నగరానికి పాలమూరు అని పేరు ఉండేది.పాలమూరు అని కూడా పిల్వబడే ఈ నగరానికి చరిత్రలో రుక్కమ్మపేట అని పేరు ఉండేది. హైదరాబాదును పాలిస్తున్న ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ నగర నామాన్ని మహబూబ్ నగర్‌గా మార్చబడింది. ఇప్పటికీ గ్రామీణ ప్రజలు పాలమూరు నామంతోనే వ్యవహరిస్తారు. మొదట చిన్న పట్టణంగా ఉన్న మహబూబ్ నగర్‌ను జిల్లా కేంద్రం చేయడంతో క్రమక్రమంగా జిల్లాలోనే పెద్ద నగరంగా అభివృద్ధి చెందింది.1883లో జిల్లా ప్రధానకేంద్రం నాగర్‌కర్నూలు నుంచి మహబూబ్‌నగర్‌కు మార్చబడింది.[6] నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో ఇక్కడ రైలు మార్గం ఏర్పాటు కావడంతో సౌలభ్యం దృష్ట్యా జిల్లా కేంద్రాన్ని ఇక్కడికి మార్చారు. ప్రారంభంలో లోకాయపల్లి సంస్థానంలో ఉన్న ఈ ప్రాంతం చుక్కాయపల్లిగా కూడా పిలువబడింది. ఈ ప్రాంతానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చినవారు స్థిరపడడంతో పాలమూరు, పాతపాలమూరు, న్యూటౌన్ అనే మూడు ప్రాంతాలు ఏర్పడ్డాయి. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకర్లపై జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన పలువులు పాల్గొన్నారు. ఆ సమయంలో ఇక్కడ ఆర్యసమాజ్ శాఖ బలంగా ఉండేది. క్రమేణా ఈ మూడు ప్రాంతాలు ఏకమైనాయి.మళ్ళీ పాలమూరు పూర్వ వైభవంలోకి రావడానికి పాలకులు కృషి చేస్తున్నారు.

వాతావరణం

ఈ నగర వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండటం వలన ఏడాదిలో 9 నెలలు (మార్చి, ఏప్రిల్, మే మినహా) ఆహ్లాదకరంగా ఉంటుంది. వేడిమి, ఇతర ప్రధాన నగరాలలాగానే కనిపించినా, వాస్తవ వేడిమి, ఏ మాత్రం తేడా లేకుండా ఉంటుంది. ఇతర జిల్లా ప్రధాన నగరాల్లో కర్నూలు, వరంగల్ నగరాలలో కనిపించే వాతావరణం కన్నా సుమారు 10 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.

రవాణా వ్యవస్థ

Thumb
పాలమూరు పట్టణంలోని కొత్త బస్సుస్టేషను

రోడ్డు రవాణా

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండుట, హైదరాబాదు నుంచి కర్ణాటక రాష్ట్రపు ప్రముఖ నగరాలకు వెళ్ళు రహదారి ఈ నగరం గుండా పోవుటచే రోడ్డు రవాణా సౌకర్యవంతంగా ఉంది. 7వ నెంబరు జాతీయ రహదారి నగరానికి 8 కిలోమీటర్ల దూరం నుంచి (భూత్పూర్ వైపు) వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి కర్ణాటక రాష్ట్రపు ప్రధాన నగరాలైన రాయచూరు, ఉడిపి, మంగళూరు, బళ్ళారి, గదగ్, గోవా-పనాజీ వైపు వెళ్ళు బస్సులు పాలమూరు నగరం గుండా సాగే 167వ జాతీయ రహదారి మీదుగా వెళ్తాయి.

రైలు రవాణా

Thumb
పాలమూరు నగర ప్రధాన రైల్వే స్టేషను లోపలి దృశ్యం

దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన రైల్వే స్టేషనులలో ఒకటైన పాలమూరు సికింద్రాబాదు - ద్రోణాచలం మార్గంలో ఉంది. సికింద్రాబాదు నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనూ, కర్నూలు నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాలమూరు, కాచిగూడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలుబండి మరియు పాలమూరు నుండి విశాఖపట్టణం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ రైలుతో సహా 42 రైళ్ళు రోజూ ప్రయాణిస్తాయి. ఇవి కాకుండా వారానికి రెండు, మూడు సార్లు ప్రయాణించు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు 8 సార్లు ప్రయాణిస్తాయి. పాలమూరు నగరంలో 4 రైల్వే స్టేషన్లు, నగర శివారులో ఒక రైల్వే స్టేషను ఉంది. ప్రధాన రైల్వే స్టేషను మినహా మిగితా రెండు రైల్వే స్టేషనులలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగవు. ప్రధాన రైల్వే స్టేషను‌లో నాలుగు ప్లాట్‌ఫారములు ఉన్నాయి. ప్రారంభంలో మీటరు గేజిగా ఉన్న ఈ మార్గం తొలుత సికింద్రాబాదు-పాలమూరు వరకు ఆ తర్వాత 1996లో పాలమూరు నుంచి ద్రోణాచలం వలకు బ్రాడ్‌గేజీగా మార్చబడింది.

వాయు రవాణా

పాలమూరు నగరానికి వాయు రవాణా సదుపాయము లేదు. సమీపంలోని విమానాశ్రయము శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము.ఇది నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.

శాంతి భద్రతలు

మహబూబ్‌నగర్‌ నగరంలో శాంతిభద్రతలకై 3 పోలీస్ స్టేషన్లు, ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషను ఉన్నాయి. వన్‌టౌన్ పోలీస్ స్టేషను రాయచూరు, భూత్‌పూర్ వెళ్ళే కూడలి అయిన పరదేశీనాయుడు చౌక్ వద్ద, టూటౌన్ పోలీస్ స్టేషను న్యూటౌన్ ప్రాంతంలోనూ, రూరల్ పోలీస్ స్టేషను హైదరాబాదు వెళ్ళు మార్గంలో ఉండగా, ట్రాఫిక్ పోలీస్ స్టేషను న్యూటౌన్ ప్రాంతంలో టూటౌన్ పోలీస్ స్టేషను ప్రక్కనే ఉంది.

విద్యుత్తు సరఫరా

మహబూబ్‌నగర్‌ నగరంలో విద్యుత్తు సరఫరాకై 350 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, వీటి ద్వారా 40,000 కనెక్షన్లకు విద్యుత్తు సరఫరా అవుతుంది.[7] విద్యుత్తు సరఫరాకై నగరాన్ని 3 విభాగాలుగా చేసి, ప్రతి విభాగంలోనూ ఎస్.ఇ.స్థాయి అధికారి నేతృత్వంలో కార్యాలయాలు ఏర్పాటుచేయబడినవి. ప్రధాన విద్యుత్ కార్యాలయము పద్మావతి కాలనీలో హైదరాబాదు వెళ్ళు మార్గంలో ఉంది.

రాజకీయాలు

మహబూబ్ నగర్ నగరం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. లక్షకు పైగా నగర ఓటర్లు ఉండుటచే శాసనసభ స్థానంలో ఈ నగరం తన ఉనికిని నిరూపించుకుంటోంది. ప్రధాన రాజకీయ పక్షాలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఉండగా, భారతీయ జనతా పార్టీకి కూడా పట్టణంలో గుర్తింపు ఉంది. 2012 మార్చిలో జరిగిన మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో నగర ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ, తెరాసలకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీక కంటే అధికంగా ఓట్లు లభించాయి.

రాజకీయం

రాజకీయంగా ఈ నగరం నుంచి పలువురు నాయకులు ప్రసిద్ధి చెందారు. 2009 శాసనసభ ఎన్నికలలో మహబూబ్ నగర్ స్థానం నుంచి గెలుపొందిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి ఈ నగరానికి చెందిన వ్యక్తే. నగరంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెరాసలు బలంగా ఉన్నాయి.

క్రీడలు

మహబూబ్‌నగర్‌ నగరంలో క్రికెట్ క్రీడకు మంచి జనాదరణ ఉంది. ఇవే కాకుండా వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ తదితర క్రీడలకు కూడా గుర్తింపు ఉంది. నగరం మధ్యలో బస్టాండు సమీపంలో ఉన్న క్రికెట్ స్టేడియంలో అంతర్‌జిల్లా క్రికెట్ పోటీలు, ఇతర పోటీలు నిర్వహించబడుతాయి. బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కూడా క్రికెట్, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించబడుతాయి. ఇవే కాకుండా జిల్లా పరిషత్తు మైదానంలో వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ తదితర అంతర్రాష్ట్ర పోటీలు నిర్వహిస్తారు.

స్టేడియంలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్, బాస్కెట్‌బాల్, ఆర్చరీ కోర్టులను 2022 జూన్ 6న తెలంగాణ రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక, క్రీడా శాఖలమంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్స్ రాము, రవికిషన్ రెడ్డి, పటేల్ ప్రవీణ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.[8]

పర్యాటక ప్రదేశాలు

Thumb
750 సంవత్సరాల వయస్సు కల పిల్లలమర్రి వృక్షం

మహబూబ్‌నగర్ నగరానికి సమీపంలోని పర్యాటక ప్రదేశాలు: నగర సమీపంలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన పిల్లలమర్రి పేరుతో 700 సంవత్సరాల చరిత్ర ఉన్న పురాతనమైన, విశాలమైన మర్రి చెట్టు ఉంది.[9] .పిల్లలమర్రి సమీపంలో పురావస్తు మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి.[10]

ప్రధాన వీధులు

మెట్టుగడ్డ

ప్రారంభంలో మహబూబ్‌నగర్‌ నగరానికి ఒకప్పుడు ఇది చివరి ప్రాంతం కావడంతో మెట్టు, ఎత్తయిన ప్రాంతంలో ఉండుటచే గడ్డ రెండు పదాలు కల్సి మెట్టుగడ్డగా పేరువచ్చింది.[11] ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రభుత్వ బి.ఎడ్.కళాశాల, విద్యుత్తు కార్యాలయం, జిల్లా గ్రంథాలయ సంస్థ, పలు బ్యాంకులు ఉన్నాయి. మెట్టుగడ్డ చౌరస్తాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి విగ్రహం ఉంది. ఇది చెన్నారెడ్డి కూడలిగా పేరుపొందింది. పిల్లలమర్రి వెళ్ళడానికి మార్గం ఇక్కడి నుంచే ప్రారంభమౌతుంది.

రాజేంద్రనగర్

మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషను పరిసర ప్రాంతాల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు కల ప్రాంతము రాజేంద్రనగర్‌గా పిల్వబడుతుంది. రైల్వేస్టేషను‌తో పాటు, పలు విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇటీవలికాలంలో అపార్టుమెంటు నిర్మాణాలు జోరందుకున్నాయి. పలు ప్రైవేటు విద్యాసంస్థలు, బి.ఎస్.ఎన్.ఎల్.కార్యాలయము, ఈ-సేవ కేంద్రము ఈ ప్రాంతములో ఉంది.

న్యూటౌన్

నగరంలో వ్యాపారపరంగా అభువృద్ధి చెందిన ప్రాంతము న్యూటౌన్. ప్రారంభంలో నగర శివారులో ఉండేది కాబట్టి ఈ ప్రాంతాన్ని న్యూటౌన్‌గా వ్యవహరించబడింది, కాని నేడు ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది నగరంలో ‌‌‌‌ఒక ప్రధాన కూడలిగా ఏర్పడింది. పలు బ్యాంకులు, ఏ.టి.ఎం.కేంద్రాలు, వ్యాపార సంస్థలకు ఇది కేంద్రస్థానంగా ఉంది.

క్లాక్ టవర్

గడియారం చౌరస్తా అని కూడా పిలువబడే ఈ ప్రాంతం నగరంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటి. ఈ ప్రాంతము పాత పాలమూరుకు, కొత్త పట్టణానికి అనుసంధానంగా ఉంది. నగరపాలక సంఘము ఈ ప్రాంతంలోనే ఉంది. వాణిజ్యపరంగా ఈ ప్రాంతము అభివృద్ధి చెందినది. సామాన్య అవసరాల నుండి, శుభ కార్యాలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. నగరంలో ఇది అతిపెద్ద కూడలి.

పద్మావతి కాలని

నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటైన పద్మావతి కాలని హైదరాబాదు వెళ్ళు మార్గంలో ఉంది. ఇక్కడ విద్యావంతులు అధికం.[12] శ్రీకృష్ణ దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.

వీరన్నపేట

ఈ ప్రాంతపు అసలుపేరు గుండ్లగుట్ట. వీరశైవులు వీరభద్రస్వామిని ప్రతిష్ఠాపనచేసిన పిదప వీరన్నగుట్టగా పేరు వచ్చింది. క్రమేణా ఈ పేరు వీరన్నపేటగా వాడుకలోకి వచ్చింది. ఈ ప్రాంతంలో పూర్వకాలాల నుంచి శ్రీనీలకంఠేశ్వస్వామి ఉత్సవాలు ప్రతి శ్రావణమాసంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీకళాశాల, టౌన్ రైల్వేస్టేషను తదితర సదుపాయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

పుట్నాలబట్టి

పాలమూరు "కోఠి" ప్రాంతంగా పేరుపొందిన మార్కెట్ రోడ్‌కే వాడుకలో పుట్నాలబట్టిగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో పూర్వకాలం నుంచి సంతలకు ప్రసిద్ధి. ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభ్యమౌతాయి. వేడి వేడి పుట్నాలు, బొరుగులు రాశులుగా పోసి అమ్ముతుంటారు. పిల్లలకు, పెద్దలకు, మహిళలకు, విద్యార్థులకు కావలసిన ప్రతి సరకే కాకుండా వ్యాపారవేత్తలకు కావలసిన తక్కెడలు, తూనికరాళ్ళు కూడా ఈ ప్రాంతంలో లభ్యమౌతాయి. దీనికి సమీపంలోనే కూరగాయల మార్కెట్ ఉంది.

షాషాబ్ గుట్ట

షాసహాబ్ దర్గా ఉన్న కారణంగా ఈ ప్రాంతం షాషాబ్ గుట్టగా పేరుపొందింది. పెద్దచెరువుని ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో అనేక ప్రైవేటు కళాశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఇది పట్టణంలోని 13వ వార్డు పరిధిలోకి వస్తుంది.

తిరుమల దేవుని గుట్ట

టి.డి.గుట్టగా పిల్వబడే ఈ ప్రాంతం తాండూరు వెళ్ళే మార్గంలో ఉన్న రైల్వేగేట్ నుంచి ప్రారంభమౌతుంది. చిన్న చిన్న వ్యాపార సంస్థలు, పలు పాఠశాలలు, దేవాలయాలు ఈ ప్రాతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పురాతనమైన శ్రీ తిరుమలనాథస్వామి ఆలయం వెలిసినందున తిరుమలదేవుని గుట్టగా పిలుస్తుంటారు. సుమారు 300 సంవత్సరాల క్రిందటే లోకాయపల్లి సంస్థానాధీశుల కాలంలోనే ఈ ఆలయం వెలిసినట్లు చరిత్రకారుల కథనం.[13] ఇక్కడ ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రసిద్ధిగాంచిన శ్రీబాలాంజనేయస్వామి ఆలయం కూడా ఈ ప్రాంతంలో ఉంది.

పట్టణంలోని ముఖ్య కార్యాలయాలు

Thumb
మహబూబ్ నగర్ జిల్లా పరిషత్తు కార్యాలయము

కలెక్టరు కార్యాలయం

1930లో మహబూబ్ నగర్‌లో కలెక్టరు కార్యాలయం స్థాపించబడింది. 1960-61లో తొలి ఐ.ఎ.ఎస్. కలెక్టరుగా డి.శంకరగురుస్వామి పనిచేశాడు. ప్రస్తుత కలెక్టరు దమయంతి. కలెక్టరు కార్యాలయం కొత్త బస్సుస్టేషను‌కు ఎదురుగా ఉండేది ఇప్పుడు అది నగర శివార్లలో గల బైపాస్ రోడ్డు పక్కన మార్చబడింది.

కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా మహాహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి స‌మీపంలో పాల‌కొండ వ‌ద్ద సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2022, డిసెంబరు 4న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. చాంబర్‌లో కలెక్టర్‌ వెంకట్రావ్‌ను సీట్‌లో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ కార్యక్ర‌మంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పర్యాటక - సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రోడ్లు-భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలతోపాటు ఉమ్మ‌డి మహాహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[14][15]

కోర్టు కాంప్లెక్స్‌

ప్రస్తుతమున్న కోర్టు కాంప్లెక్స్‌లో ఒకేచోట 16 కోర్టుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో అధునాతన కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కోర్టు భవనం కోసం కేటాయించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2022 ఆగస్టు 11న ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశాడు.[16] జిల్లా కేంద్రంలో అధునాతన కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 2022 డిసెంబరు 6న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలమూరు విశ్వవిద్యాలయం సమీపంలోని బైపాస్‌ రోడ్డు పక్కన 10 ఎకరాల స్థలం కేటాయించింది.[17]

జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయం

కలెక్టరు కార్యాలయమునకు సమీపంలోనే మూడంస్తుల భవనంలో జిల్లా పరిషత్తు కార్యాలయము ఉంది. ఇందులో కల పెద్ద సమావేశమందిరములోనే జిల్లా పరిషత్తు సమావేశం, పలు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించబడతాయి. జిల్లా పరిషత్తు ఎదురుగా పాతికేళ్ళ క్రితం మినీ స్టేడియం నిర్మించబడింది. ఈ స్టేడియంలో పలు క్రీడా పోటీలు, సమావేశాలు, పాఠశాలల వార్షికోత్సవాలు నిర్వహించబడతాయి. జడ్పీ ఆవరణలోనే మండల ప్రజాపరిషత్తు కార్యాలయం కూడా ఉంది.

జిల్లా గ్రంథాలయ సంస్థ

మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాలకు సమన్వయసంస్థగా ఇది పనిచేస్తుంది. దీని కిందుగా 80 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. శాఖా గ్రంథాలయాలకు కాలవసిన గ్రంథాల ఎంపిక, అధికారుల జీతభత్యములు, నిధుల విడుదల తదితర కార్యకలాపాలు ఈ సంస్థచే నిర్వహించబడుతుంది. ఇది వరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషను వద్ద పాతభవనం ఉన్న ఈ సంస్థ ఇటీవలే పిల్లలమర్రి రోడ్డులోని నూతన భవనములోకి మార్చబడింది.

పోలీస్ సూపరిండెంట్ కార్యాలయం

క్లాక్‌టవర్ నుంచి బోయపల్లి రైల్వే గేటు వెళ్ళు రహదారిలో విశాలమైదానంలో ఎస్.పి.కార్యాలయము ఉంది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు దీని పరిధిలోకి వస్తాయి. ప్రతిఏటా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం నాడు పరేడ్ ఈ కార్యాలయపు గ్రౌండ్‌లో నిర్వహిస్తారు. పరేడ్ అనంతరం ప్రభుత్వ శాఖల ఉత్తమ అధికారులకు సన్మానం కూడా చేయబడుతుంది.

జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీకార్యాలయం

నగరంలోని మాడ్రన్ స్కూల్ కూడలివద్ద జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయం ఉంది. దీని పరిధిలో 5 సంచార వైద్యశాలలు, 2 రక్తనిధి కేంద్రాలు (మహబూబ్ నగర్, వనపర్తి), 3 రక్తనిల్వ కేంద్రాలు (నారాయణపేట, నాగర్‌కర్నూలు, షాద్‌నగర్) ఉన్నాయి.[18] నగరంలోని పాతపాలమూరులో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆరోగ్యకేంద్రం ద్వారా మురికివాడ ప్రజలకు ఆరోగ్యసేవలందిస్తున్నారు. పట్టణ శివారులోని ఏనుగొండ గ్రామంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తున్నారు.

పండుగలు, సంస్కృతి

మహబూబ్‌నగర్ నగరంలో ప్రజలు తెలుగువారు జరుపుకొనే అన్నిరకాల పండుగలు జరుపుకుంటారు. జనవరి మాసంలో సంక్రాంతి పండుగ నుంచి డిసెంబరులో క్రిస్‌మస్ పండుగ వరకు అన్ని మతస్థులు, అన్ని రకాల పర్వదినాలను ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

గణేశ్ చతుర్థి

ప్రతి ఏటా గణేశ్ చతుర్థినాడు నగరంలోని అన్ని ప్రధాన వీధులలో గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి మూడురోజుల పూజల అనంతరం నిమజ్జనం చేస్తారు. మొదట ఒక మోస్తరుగా ప్రారంభమైన ఈ పండుగ ఇటీవల కాలంలో ఘనంగా జరుపబడుతుంది. పూజలు నిర్వహించే మూడు రోజులే కాకుండా నిమజ్జనానికి ముందు జరిపే గణేశ్ ఊరేగింపులో వేలసంఖ్యలో ప్రజలు హాజరౌతారు. నగరంలోని క్లాక్ టవర్ వద్ద అన్ని వీధుల గణేశ్ విగ్రహాలు కలుస్తాయి. ఇక్కడే గణేశ్ విగ్రహ ప్రతిష్ఠపన సంఘము, అధికారులు కలిసి వేదికపై నుంచి బహుమతులు అందజేయడం జరుగుతుంది.

శ్రీరామనవమి

నగర ప్రజలు ఉత్సాహంగా జరుపుకొనే మరో పర్వదినం శ్రీరామనవమి. ఆ రోజు నగరంలోని శ్రీరామ ఆలయాలన్నీ అలంకరించబడి పూజలు, భజనలతో భక్తులను ఆకర్షిస్తాయి. భజనలు, కీర్తనలు ముఖ్యంగా టీచర్స్ కాలనీలోని శ్రీరామమందిరంలో ప్రతి ఏటా చక్కగా నిర్వహిస్తారు.

దేవాలయాలు

Thumb
మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీరామమందిరం, శ్రీరామనవమి నాటి దృశ్యం
  • శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం (తిరుమల దేవ గుట్ట రైల్వే గేట్ వద్ద) శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం (పిల్లలమర్రి రైల్వే గేట్ వద్ద)
  • అతి ప్రాచీన శివాలయం (వీరన్నపేట,రైల్వే గేట్)
  • శ్రీ రాఘవేంద్రస్వామి దేవాలయం (పరిమళగిరి గుట్ట)
  • శ్రీవీరాంజనేయస్వామి ఆలయం (పరిమళగిరి గుట్ట)
  • శ్రీ నరసింహ స్వామి దేవాలయం (కొత్త గంజ్)
  • శ్రీ రేణుకాఎల్లమ్మ దేవాలయం (కొత్త బస్టాండు వద్ద)
  • శ్రీరామాలయం (టీచర్స్ కాలనీ)
  • శ్రీఅయ్యప్ప దేవాలయం (అయ్యప్ప గుట్ట)
  • శ్రీకృష్ణమందిరము (కాలని)
  • శ్రీఆంజనేయస్వామి దేవాలయం (రైల్వేస్టేషను వద్ద)

చారిత్రక కట్టడాలు

Thumb
నిరంకుశ నిజాం పాలనకు, దాష్టీక రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ పట్టణ ఉద్యమకారులకు వేదికగా నిలిచిన తూర్పుకమాన్

తూర్పు కమాన్

నగరంలోని చారిత్రాత్మక కట్టడం తూర్పు కమాన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. నాటి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి ఇది చిహ్నం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇంకనూ నిజాం నిరంకుశ పాలనలో ఉన్న రోజుల్లో కొందరు దేశభక్తి కల ఉద్యమకారులు తూర్పుకమాన్ పై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రయత్నించారు. ఇది గ్రహించిన నిజాం సైనికులు, పోలీసులు ఈ ప్రయత్నాన్ని వమ్ము చేయాలని పహరాకాశారు. అయిననూ పోలీసుల కళ్ళుగప్పి ఉద్యమకారులు తూర్పుకమాన్ పై జాతీయజెండాను రెపరెపలాడించి తమ పంతం నెగ్గించుకున్నారు. పోలీసులు సమీపించగా కమాన్‌పై నుంచి దూకి ఉద్యమకారులు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. నిజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైన పిదప జాతీయ జెండాని ఇక్కడే ఎగురవేసేవారు.[19] సంస్థానాధీశులచే నిర్మించిన మూడు కమాన్లు, రాజప్రసాదం కట్టడాలలో ఇది ఒకటి. మిగితావి మట్టిలో కలిసిపోగా ఇది మాత్రమే మిగిలింది. హైదరాబాదు-రాయచూరు రహదారిపై నుంచి వెళ్ళేవారికి ఇది కనిపిస్తుంది.

వినోదం

మహబూబ్‌నగర్ నగరంలోని సినిమా థియేటర్లు

  • AVD థియేటర్
  • వెంకటాద్రి థియేటర్
  • వెంకటేశ్వర థియేటర్
  • శ్రీకృష్ణ థియేటర్
  • ఆసియన్ శ్రీనివాసా థియేటర్

విద్యాసంస్థలు

Thumb
ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాల, మహబూబ్ నగర్
పట్టణంలోని డిగ్రీ కళాశాలలు
  • ఎం.వి.ఎస్.డిగ్రీ కళాశాల
  • ఆదర్శ డిగ్రీ కళాశాల
  • గౌతమి డిగ్రీ కళాశాల
  • వనిత డిగ్రీ కళాశాల
  • వాసవి డిగ్రీ కళాశాల
  • స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల
  • తక్షశిల డిగ్రీ కళాశాల
విశ్వవిద్యాలయాలు
బి.ఎడ్, వృత్తి విద్యా, వైద్య కళాశాలలు
  • ఆదర్శ కాలేజీ ఆఫ్ టీచర్స్.
  • అల్ మదీనా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్
  • కాలేజి ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్
  • శారద కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్
  • సరోజినీ రాములమ్మ కాలేజీ ఆఫ్ ఫార్మసి
  • వైష్ణవి కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్
  • మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల

పట్టణ ప్రముఖులు

ఇటీవలి సంఘటనలు

  • 2011, అక్టోబరు 30: మహబూబ్ నగర్ శాసనసభ్యుడు ఎన్.రాజేశ్వర్ రెడ్డి మరణం.
  • 2012, ఏప్రిల్ 3: మహబూబ్‌నగర్ పట్టణ పరిధి విస్తరించబడింది. సమీపంలోని గ్రామాలు పురపాలకసంఘంలో విలీనం చేయబడ్డాయి.

సంగీత, నృత్య కళాశాల

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో మహబూబ్ నగర్ బాలభవన్ వద్ద ఏర్పాటుచేసిన సంగీత, నృత్య కళాశాలను 2022 జూన్ 25న తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కలెక్టర్ వెంట్రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రిన్సిపల్ రాఘవ రాజ్ భట్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.[24]

ఐటీ ట‌వ‌ర్

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మహబూబ్​నగర్ పట్టణం సమీపంలోని దివిటీపల్లిలో నాలుగు ఎక‌రాల్లో ఐదు అంత‌స్తుల్లో 40 కోట్ల రూపాయలతో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఐటీ టవర్‌ను నిర్మించింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు 2023 మే 6న ఈ ఐటీ టవర్‌ను ప్రారంభించి, వివిధ కంపెనీలు ఇక్కడ పనిచేసేందుకు అవసరమైన అనుమతి పత్రాలను అందజేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గుర్కా జైపాల్ యాదవ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణ రెడ్డి, చల్లా వెంకట్రామ్ రెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[25]

శిల్పారామం

మహబూబ్‌నగర్‌ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలతో మినీ శిల్పారామం ఏర్పాటుచేసింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు 2023 మే 6న ఈ శిల్పారామాన్ని ప్రారంభించాడు. సకల హంగులతో ఈ శిల్పారామం నిర్మించబడింది. పల్లెదనం ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణంలో ఉండే ఎద్దుల బొమ్మలు, రైతుల బొమ్మలు ఏర్పాటుచేశారు.[26]

అమరరాజా బ్యాటరీ కంపెనీ

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద 270 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీకి 2023 మే 6న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు. 9,500 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానున్న ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.[27]

మూలాలు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.