మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లో ఉన్న వైద్య కళాశాల.[1] రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పడిన ఈ వైద్య కళాశాలకు 2016, జనవరిలో భారత వైద్య మండలి (ఎంసిఐ) నుండి అనుమతి లభించింది. ఈ కళాశాల కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధం కళాశాలగా ఉంది.[2]
రకం | ప్రభుత్వ వైద్య విద్య |
---|---|
స్థాపితం | జూన్ 2016 |
అనుబంధ సంస్థ | కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
ఛాన్సలర్ | డా. బి. కరుణాకర్ రెడ్డి |
చిరునామ | మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్, తెలంగాణ, భారతదేశం 509001 16.7504592°N 78.0085181°E |
చరిత్ర
2014, ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఈ వైద్య కళాశాలను మంజూరు చేయగా, జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి వెనుకభాగంలోని భవనంలో తాత్కాలిక తరగతులు ప్రారంభించారు. 2015 నవంబరులో 50 ఎకరాల విస్తీరణంలో రూ. 450 కోట్లతో వైద్య కళాశాల భవన సముదాయ నిర్మాణం ప్రారంభించి, రెండున్నరేండ్లలో నిర్మాణం పూర్తిచేశారు. ఎంసిఐ 150 సీట్లకు అనుమతి ఇచ్చి 2016-17లో తొలి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించింది.[3] జడ్చర్ల - మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కళాశాలలో 300 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయబడింది. 2019-20లో ఈక్యూఎస్ కోటా పరిధిలో సీట్లు పెంచడం వల్ల సీట్ల సంఖ్య 175కు పెరిగింది.
2020, జూలై 13న తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించాడు.[4]
కోర్సులు
మూడేండ్లలోనే పీజీ కోర్సులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌కు సంబంధించి 14 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వైద్య కళాశాలకు అనుబంధంగా పారామెడికల్ కళాశాల కూడా ప్రారంభమైంది. డీఎంఎల్‌టీ, డయాలసిస్ టెక్నీషియన్ కోర్సులు కొనసాగుతున్నాయి. త్వరలోనే నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ కళాశాలలు కూడా ఏర్పాటు చేయనున్నారు.[4]
పాలకమండలి
పాలకమండలి చైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్‌గా వైద్యారోగ్యశాఖ మంత్రి, సభ్యులుగా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ, వైద్య విద్య డైరెక్టర్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్/ప్రిన్సిపాల్, డీన్, రిజిస్ట్రార్, పాలమూరు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ పాలకమండలిలో ఉంటారు.
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల
ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను 2023 ఫిబ్రవరి 1న రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖామంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5][6]
ఇవికూడా చూడండి
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.