Remove ads
తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు From Wikipedia, the free encyclopedia
సాలూరి రాజేశ్వరరావు (11 అక్టోబర్ 1922 - 25 అక్టోబర్ 1999) తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.
సాలూరి రాజేశ్వరరావు | |
---|---|
జననం | 11 అక్టోబర్ 1922 శివరామపురం |
మరణం | అక్టోబర్ 25, 1999 |
వృత్తి | సంగీత దర్శకుడు |
పిల్లలు | నలుగురు కొడుకులు |
తండ్రి | సన్యాసిరాజు |
సాలూరి రాజేశ్వరరావు సాలూరు మండలంలోని శివరామపురం గ్రామంలో 11అక్టోబర్ 1922 సంవత్సరంలో జన్మించాడు. రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది. ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు వద్దే “సరిగమలు” దిద్దాడు. సన్యాసిరాజుగారు ప్రముఖ వాయులీన విద్వాంసులైన ద్వారం వెంకటస్వామి నాయుడుకి కచేరీలలో మృదంగంపై సహకరించిన వ్యక్తి. అలాగే అప్పట్లో మూకీ సినిమాలకు తెరముందు, హార్మోనియం వాద్యకారునిగా, సంగీతాన్ని వినిపించేవాడు. అంతేకాదు రాజేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా! "ఆ తోటలోనొకటి ఆరాధనాలయము", "తుమ్మెదా! ఒకసారి మోమెత్తి చూడమని", "పొదరింటిలోనుండి పొంచి చూచెదవేల", "కలగంటి కలగంటి" లాంటి కొన్ని మంచి మంచి పాటల్ని ఇతని ద్వారానే మనకు లభించాయి.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు, నాలుగేళ్ళ వయసులోనే రాజేశ్వరరావు అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరో మూడేళ్ళు గడిచేసరికి అన్న హనుమంతరావుతో కలిసి పాట కచేరీలు ఇవ్వడం, హరికథలు చెప్పడం మొదలు పెట్టాడు. రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి హచ్చిన్స్ గ్రామఫోను కంపెనీ బెంగుళూరుకు ఆహ్వానించడం జరిగింది. 1933-34 మధ్యకాలంలో “బాల భాగవతార్ మాస్టర్ సాలూరి రాజేశ్వరావు ఆఫ్ విజయనగరం” కంఠం గ్రామఫోను రికార్డుల ద్వారా (భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు, మోతీలాల్ నెహ్రూ పై పాటలు మొదలగునవి) మొదటిగా విజయనగరం ఎల్లలు దాటి యావదాంధ్రదేశానికీ పరిచయమయింది.
సాలూరి ఖ్యాతి సినీ నిర్మాణ కేంద్రమైన మద్రాసు నగరానికి చేరడానికి మరెంతో కాలం పట్టలేదు. ఇతని గాత్ర మాధుర్యానికి ముగ్ధులైన పినపాల వెంకటదాసు, గూడవల్లి రామబ్రహ్మం తమ (వేల్ పిక్చర్స్) రెండవ చిత్రానికి, (శ్రీకృష్ణ లీలలు,1935), ఇతనిని “కృష్ణుడి” పాత్రధారునిగా ఎంపిక చేసుకొని మద్రాసుకు చేర్చారు. తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పాడు. ఆ చిత్రంలో, ముఖ్యంగా, కంసునితో (వేమూరి గగ్గయ్య) సంవాద ఘట్టంలో, గగ్గయ్యలాంటి ప్రఖ్యాత కళాకారునికి దీటుగా ఆయన పాడినపద్యాలు (”ఔరలోక హితకారి”,”దీనావనుడనే”, “ప్రణతులివె”,”మేనల్లుళ్ళని”, ...) వింటుంటే పదమూడేళ్ళ వయసులోనే సాలూరి సంగీత ప్రతిభ ఎంతటిదో తెలుస్తుంది.
“వేల్” వారి శశిరేఖాపరిణయం (మాయాబజార్ 1936) ఆయన రెండవ చిత్రం. దీనిలో అభిమన్యుడి పాత్రని పోషిస్తూ కొన్ని పాటలు కూడా (నను వీడగ గలవే బాలా, కానరావ తరుణీ) పాడాడు. ఆ చిత్రం పూర్తయిన తరువాత మరొక చిత్రంలో నటించేందుకై కలకత్తాకు చేరుకోవడంతో ఇతని జీవితంలో మరో ముఖ్య ఘట్టం మొదలయ్యింది. గాయక నటునిగా పేరు సంపాదించినా సంగీతకారునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తృష్ణ ఈయనలో అధికంగా వుండేది. అదే, కలకత్తాలో,”న్యూ థియేటర్స్ సంగీతత్రయం”తో (ఆర్.సి.బోరల్, పంకజ్ మల్లిక్, తిమిర్ బరన్) పరిచయాలకు, ప్రముఖ గాయకుడు కె.ఎల్.సైగల్ వద్ద శిష్యరికానికి దారి తీసింది. ఇలా ఒక సినిమాలో నటించడానికని కలకత్తా చేరిన వ్యక్తి సంవత్సర కాలం పైగా అక్కడే వుండిపోయి, అక్కడి ఉద్దండుల వద్ద (హిందుస్తానీ) శాస్త్రీయ సంగీతంలోని మెళుకువలు, బెంగాలీ, రవీంద్ర సంగీతరీతులు, వాద్యసమ్మేళన విధానం నేర్చుకున్నాడు. ఆయన తదుపరి సంగీత సృష్టిలో అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 1938లో మద్రాసుకు తిరిగి వచ్చిన తరువాత సంగీతబృందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక తమిళ చిత్రానికి (”విష్ణులీల” 1938) సహాయ సంగీత దర్శకునిగా పనిచేశాడు. మరికొద్ది కాలానికి చిత్రపు నరసింహరావు దర్శకత్వంలో తయారయిన “జయప్రద”(పురూరవ 1939) చిత్రానికి పూర్తి సంగీతదర్శకత్వపు బాధ్యతలు చేపట్టి, అప్పట్లో అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. కాని ఆయనకు సినీ సంగీతదర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా ఇల్లాలు (1940).
సాలూరిలోని సంగీతదర్శక ప్రతిభను కూడా గుర్తించిన రామబ్రహ్మం “ఇల్లాలు”లో కొన్ని పాటలు చేసే అవకాశం కల్పించాడు. రాజేశ్వరరావు కట్టిన వరసలు రామబ్రహ్మం చిత్రాలకు సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న బి.ఎన్.ఆర్ కు ( భీమవరపు నరసింహారావు, మాలపిల్ల (1938), రైతుబిడ్డ (1939) ) అమితంగా నచ్చడంతో ఆయన పక్కకు తొలిగి సాలూరినే అన్ని పాటలు చేయమని కోరాడు. ఆ చిత్రం ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా ఈయన చేసిన పాటలు పలువురి ప్రశంసలనందుకొన్నాయి.
ఆ చిత్రంతో తెలుగు శ్రోతలకొక కొత్తరకమైన సంగీతం పరిచయం చేయబడింది. “లలిత సంగీత”మన్న దానికి తెలుగులో మొదటిగా శ్రీకారం చుట్టి ఒక కొత్త వొరవడిని సృష్టించాడు. కలకత్తాలో బెంగాలీ సంగీతం ద్వారా ప్రభావితుడైన సాలూరి ఆధునికత్వం కోసం చేసిన ప్రయోగాలు తెలుగు సినీ పరిశ్రమలో అంతగా ఆదరణ పొందకపోయినా, తెలుగు పాటకు పాశ్చాత్య బాణీని యెలా జతపరచవచ్చో “ఇల్లాలు” ద్వారా; ఆ తరువాత ఈయన పాడిన లలిత గీతాల ద్వారా, సమర్ధవంతంగా నిరూపించాడు. ఆర్కెస్ట్రా నిర్వహణలో “హార్మొనీ” యొక్క ప్రాధాన్యత ఏమిటో ఆయనకు అర్థమయినంతగా మరెవ్వరికి కాలేదేమో!
“ఇల్లాలు”లో సాలూరి, బాలసరస్వతి పాడిన “కావ్యపానము చేసి కైపెక్కినానే” అన్న బసవరాజు అప్పారావుగారి పాట ఆనాటి కుర్రగాయకులకు, కుర్రకవులకు చాలామందికి కైపెక్కించింది. ఆ చిత్రం యొక్క మరో ప్రత్యేకత, సాలూరి బాలసరస్వతుల స్వరమైత్రికి నాంది పలికటం. ఆ మైత్రి రికార్డులపై చాలా దూరం సాగి (”కోపమేల రాధా”, “రావే రావే కోకిలా”, “తుమ్మెదా ఒకసారి”, “పొదరింటిలోనుండి”, ...) తెలుగు సంగీత చరిత్రలో ఒక కమనీయమైన ఘట్టంగా శాశ్వతంగా నిలిచిపోయింది. వీరిరువురి గానమాధుర్యానికి ముగ్ధులై తెలుగునాట మూగ గొంతులు సైతం మారుమ్రోగి కొద్దోగొప్పో పాడనేర్చాయి. వారిరువురి కొత్త రికార్డు ఎప్పుడు వస్తుందా అని ఆకాలపు శ్రోతలు ఎదురు చూసేవారు. ఆంధ్రదేశంలో సంగీతరంగానికి నలభయ్యవ దశకం ఒక స్వర్ణయుగమైతే దానిలో సుమారొక యెనిమిదేళ్ళపాటు రాజేశ్వరరావు, బాలసరస్వతులు రాజ్యమేలారంటే అతిశయోక్తి కాదు.
ఇంక తానే బాణీలు కట్టుకొని, మధురంగా, సున్నితంగా ఆలపించిన “చల్లగాలిలో యమునాతటిపై”, “పాట పాడుమా కృష్ణా”, “గాలివానలో ఎటకే వొంటిగ”, “ఓహో విభావరి”, “ఓహో యాత్రికుడా”, “ఎదలో నిను కోరితినోయి”, “షికారు పోయిచూదమా”, “హాయిగ పాడుదునా చెలీ” వంటి పాటలు ఈనాటికీ సంగీతప్రియుల గుండెల్ని పులకరింపజేస్తున్నాయి.
మరో రామబ్రహ్మం చిత్రానికి (అపవాదు (1941), “కోయిలొకసారొచ్చి కూసిపోయింది” లాంటి సుమధుర గీతాలతో) పనిచేసిన అనంతరం మంచి అవకాశం రావడంతో “జెమిని” సంస్థలో చేరి, జీవన్ముక్తి (1942) నుంచి మంగళ (1951) వరకు, ఆ సంస్థకు ఆస్థాన సంగీతదర్శకుడిగా పనిచేశాడు. “జెమినీ” వారి బాలనాగమ్మకు (1942) నేపథ్య సంగీతంలో అందులోని భయానక కరుణరస సన్నివేశాలకు అనుగుణంగా మనవారికి నచ్చేరీతిని పాశ్చాత్య స్వరమేళ ఫణితుల్ని అవలీలగా కల్పించి ప్రయోగించాడు. అదే సమయంలో, “జెమినీ”వారి చిత్రానికి పోటీగా తయారయిన “వసుంధర” వారి శాంత బాలనాగమ్మలో (1942) “బాలవర్ధి రాజు” పాత్ర ధరిస్తూ ఆ చిత్రానికి సంగీతాన్ని అందివ్వడం, కొన్ని పాటలు పాడడం (ప్రియజననీ వరదాయని, సుఖదాయి సుఖదాయి) వింతైన విషయం.
“జెమిని”లో పని చేస్తున్న కాలంలోనే అడపదడపా రేడియోవారి నాటకాలకు, సంగీతరూపకాలకు కూడా వరసలు కట్టడం, పాటలు పాడడం చేస్తుండేవాడు. “మోహినీ రుక్మాంగద” (1942, శ్రీశ్రీ రచన) లాంటి నాటకాలకు అందించిన సంగీతం ద్వారా ఆయన అనుభవశాలియైన సంగీత దర్శకుడనిగా నిరూపించుకున్నాడు.
సాలూరి ప్రతిభను యావద్భారత దేశానికి తెలియ జెప్పిన చిత్రం చంద్రలేఖ (1948). కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలని,లాటిన్ అమెరికన్, పోర్చుగీస్, స్పానిష్ జానపద సంగీత పోకడల్ని ఎంతో ప్రతిభావంతంగా సమ్మిళితం చేసి, ఆ కాలంలో వూహించలేనటువంటి పెద్ద వాద్యబృందంతో సృష్టించిన చిత్రమది. “చంద్రలేఖ” తరువాత ఆయన మరి వెనుతిరిగి చూడలేదు.
ఇంక సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, నాలుగు పుష్కరాల తర్వాతకూడా నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. వి.ఎ.కె.రంగారావుగారి మాటల్లో చెప్పాలంటే “బి.ఎన్.రెడ్డి కార్యదక్షతతో, దేవులపల్లి మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, పసుమర్తి కృష్ణమూర్తి నృత్య సారధ్యంతో, ఘంటసాల భానుమతిల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి అన్న తీరుగా రూపొందింది.” “ఇదొక్కటి చాలు సాలూరి గొప్పతనం తెలియజెప్పడానికి” అనేవారు కొందరైతే, “దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని” దృఢంగా విశ్వసించే వారూ చాలామంది ఉన్నారు. సాలూరే “మల్లీశ్వరి” పై వ్యాఖ్యానిస్తూ "చంద్రలేఖ" కథకు ఒక కాలం అంటూ లేదు కనుక అన్నిరకాల సంగీతం వినిపించడానికి అవకాశం కలిగింది. కాని, “మల్లీశ్వరి” చరిత్రకు సంబంధించిన చిత్రం. అటు కథాకాలానికి, ఇటు కాస్త ఆధునికంగానూ వుండేలా సంగీతం కూర్చవలసి వచ్చింది. శాస్త్రీయ రాగాలను తీసుకొని, సెమిక్లాసికల్ గా స్వరపరిచాను. అలాగే అందులోని ఏ పాటా కూడా ట్యూన్‌కి రాసింది కాదు! బి.ఎన్.గారికి సంగీతాభిరుచి ఎక్కువ కావడంతో ఒక్కో పాటకు ఐదారు వరసలు కల్పించవలసి వచ్చింది. ఆ చిత్రానికి మొత్తం ఆరునెలలపాటు మ్యూజిక్ కంపోజింగ్ జరిగిందని చెప్తే ఈ రోజుల్లో ఎవరికైనా ఆశ్చర్యగా ఉంటుందేమో అని అన్నాడు. ఈ చిత్రంలో చేపట్టని సంగీతప్రక్రియ లేదేమో! ప్రతి సంగీత విద్యార్థిమొదటిగా నేర్చుకొనే శ్రీగణనాధ సింధూరవర్ణ (మలహరి) అన్న పురందరదాస కృతితో చిత్రం ప్రారంభమవుతుంది. తరువాత తేలికగా పాడుకోగలిగే బాణీలలో పిల్లల పాటలు (ఉయ్యాల జంపాల, రావి చెట్టు తిన్నె చుట్టూ), హాస్య గీతం (కోతీబావకు పెళ్ళంట), ప్రకృతి పాట (పరుగులు తీయాలి), జావళి ( పిలచిన బిగువటరా), జానపదం (నోమీన మల్లాల), వీడ్కోలు పాట (పోయిరావే తల్లి), యక్షగానం (ఉషాపరిణయం), యుగళ గీతం, ఇలా అన్నిరకాల పాటలనందించి విభిన్న శ్రోతలను ఆనందపరచిన చిత్రమిది. మరింత ప్రత్యేకంగా పేర్కొనవలసినది, తెలుగువారందరూ ఎంతో గర్వపడ వలసినది, కాళిదాసుని మేఘసందేశానికేమాత్రం తీసిపోని సాలూరి, దేవులపల్లి, ఘంటసాల భానుమతుల సమష్టి కృషిఫలితం ఆకాశవీధిలో అన్న పాట. ఈ రాగమాలిక(భీంపలాస్, కళంగద, కీరవాణి, హంసానంది) అనురాగరసంతో విరహగీతాన్ని విరచించే తూలిక!
“మల్లీశ్వరి” తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం విప్రనారాయణ (1954). ఎవ్వాడే అతడెవ్వాడే అన్న అపూర్వమైన రాగమాలికనొక్కసారి (భైరవి, మోహన, కాపి, వసంత) జ్ఞప్తికి తెచ్చుకోండి! ఈ చిత్రంలోని ప్రతి పాటా గొప్పదే. పాలించర రంగా (హేమవతి), చూడుమదే చెలియా (హిందోళం), రారా నా సామి రారా (కల్యాణి), సావిరహే (యమునాకల్యాణి),మేలుకో శ్రీరంగ (బౌళి, మలయమారుతం), …
శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్ బందీలు, పాశ్చాత్య సంగీత రూపాలు, … ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించారు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలేదు. వాయిద్యాలపై ఆయనకున్న పట్టును గురించి చిత్రరంగంలో చాల గొప్పగా చెప్పుకొంటారు. 20 - 30 వయొలిన్లు ఒకేసారి వాడిన సందర్భాల్లో ఏ వొక్క వయొలిన్ తప్పు పలికినా ఆ నంబరును చెప్పి మరీ గుర్తించే వారని అంటారు. మరో పర్యాయం అతను అడిగిన గమకాన్ని పలికించక పోగా, అది అసాధ్యం అన్న వాద్యకారునికి ఈయనే వెంటనే వయొలిన్‌ను అందుకొని అదే గమకాన్ని పలికించాడు. ఇదెలా సాధ్యపడిందని ఆశ్చర్యపోయేవారికి, ఆయన నిత్యం విద్యార్థిగానే కొనసాగాడని చెప్పాలి. బాల్యంలోనే తబలా, ఢోలక్, మృదంగం, హార్మోనియం నేర్చిన సాలూరి, తరువాత కలకత్తాలో సితార్, సుర్బహార్ అధ్యయనం చేశాడు. ఆ తరువాత పియానో, మాండలిన్, ఎలెక్ట్రిక్ గిటార్ వాయించడంలో కూడా పరిణతి సాధించాడు. ఇలా పలు వాద్యాలలో ప్రవేశం ఆర్కెస్ట్రేషన్ నిర్వహణలో ఈయనకు ఎంతో సహాయపడింది.
లక్ష్మన్న తమ వ్యాసంలో సాలూరిపై పెండ్యాల నాగేశ్వరరావు అభిప్రాయాన్ని పేర్కొన్నాడు. అలాగే సహ దర్శకుల యెడల సాలూరికున్న గౌరవాభిమానాలు గుర్తించదగ్గవి. ఉదాహరణలుగా పెండ్యాల “భీంపలాస్”లో స్వరపరచిన నీలిమేఘాలలో గాలి కెరటాలలో (బావామరదళ్ళు, 1960), రమేష్ నాయుడు 'కల్యాణి' రాగంలో చేసిన జోరు మీదున్నావు తుమ్మెదా (శివరంజని, 1978) పాటలను తనకు నచ్చిన ఉత్తమమైన గీతాలుగా యెన్నుకుంటూ వారిని కొనియాడడం చెప్పుకోవచ్చు.
ఈయన సుదూర సుస్వర సంగీతయాత్రలో 200కు పైగా చిత్రాలకు, ఎన్నో లలిత గీతాలకు, పెక్కు ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించాడు. ఆయన 40 ఏళ్ళకు పైబడిన సినీ జీవితంలో కనీసం పేరైనా పేర్కొనవలసిన చిత్రాలు రాజు పేద (54), మిస్సమ్మ (1955), భలేరాముడు (1956), మాయాబజార్ (1957, 4 పాటలు మాత్రమే), అప్పుచేసి పప్పుకూడు, (1958), చెంచులక్ష్మి (1958), భక్త జయదేవ (1960), అమరశిల్పి జక్కన (1963), భక్త ప్రహ్లాద (1967).
అభేరి (భీంపలాస్), కల్యాణి, మోహన, సింధుభైరవి,శంకరాభరణం ఈయనకు ప్రియమైన రాగాలు. శాస్త్రీయ రాగాల్లో ఆయన వినిపించిన వరసల గురించి మరొక సుదీర్ఘమైన వ్యాసమే రాయవచ్చు. జగమే మారినది (కల్యాణి, దేశ ద్రోహులు 62), నా హృదయంలో నిదురించే చెలీ (శంకరాభరణం, ఆరాధన 62), పాడవేల రాధికా (మోహన, ఇద్దరు మిత్రులు 60), … లాంటి పాటలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
సాధారణంగా, సృజనాత్మకత అన్నది పెరుగుతున్న వయసుతో తగ్గుతూ పోతుంది అనడం కద్దు. కాని, సినీరంగంలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు దాటిన తరువాత కూడా ఆయనలో అలాంటి తగ్గుదలేమి లేదని చెప్పడానికి ఈ మూడు రికార్డులు, 1977లో చేసిన ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు (ఈనాటి బంధం ఏనాటిదో), 1980లో చేసిన అభినందన మందారమాల (తాండ్ర పాపారాయుడు), కృష్ణం వందే జగద్గురుం (ప్రైవేటు ఎల్ పి.) చాలు.
ఏదో ఒక సంగీతానికే కట్టుబడి వుండాలని ఈయన మడికట్టుకు కూర్చోలేదు. మారుతున్న కాలాన్నిబట్టి పరిస్థితులు ఎన్నో మారుతున్నాయి. అదే విధంగా సినిమా సంగీతంలో కూడా మార్పులెన్నో వచ్చాయి. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని, జాజ్, పాప్, రాక్, డిస్కో వంటి అధునాతన పాశ్చాత్య సంగీతాన్ని మనం అడ్జస్ట్ చేసుకోక తప్పలేని పరిస్థితి. వాటిని మనం అనుసరించడంలో తప్పులేదు. కానీ, కేవలం అనుసరించడం, అనుకరించడం కోసమై మన సంగీతానికి ప్రాణసమానమైన 'మెలొడీ' ని ఈతరంవారు మర్చిపోతున్నారు అని అన్న ఆయన మాటలు ఎంతయినా నిజం. ముఖ్యంగా ఈనాడు! సాంఘికమైనా, పౌరాణికమైనా తను నమ్ముకున్న మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ రాగాల్లో వుండేటటువంటి మధురిమను వదులుకోకుండా చక్కని చిక్కని పాటలు అందించాడు.
ఆహుతి (1950)తో తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ చిత్రానికి సంగీతం నిర్వహించిన ఖ్యాతి కూడా ఈయనదే (శ్రీశ్రీకి కూడా సినీగేయ రచయితగా ఇది మొదటి చిత్రం.) సాధారణంగా డబ్బింగ్ సినిమాలలో పాటలన్నా, వాటి సంగీత దర్శకులన్నా లోకంలో కొంత చిన్నచూపుతో చూస్తాడు. అవే వరసలు మరల వాయించడమే కదా అన్నట్లుగా! కానీ ఆహుతిలో పాటలు ప్రేమయే జనన మరణ లీల (ఘంటసాల), హంసవలె ఓ పడవా వూగిసరావే ( ఘంటసాల, బాల సరస్వతి) జనాదరణ పొందాయంటే సాలూరి సంగీతం గొప్పగా తోడ్పడిందని చెప్పక తప్పదు. హిందీ చిత్రంలోని (”నీరా ఔర్ నందా”) వరసలన్నింటినీ పూర్తిగా మార్చి తన సొంత ముద్ర వేశాడు. ఇతరుల వరుసలు ఎప్పుడయినా అనుకరించినా, అవి హిందీ, బెంగాలీ వాసనలు కొట్టక తెలుగు పరిమళాలు వెదజల్లడానికి కారణం ఈయన పాట వ్రాయించుకున్న తీరు, ఒదుగులు అద్దిన విధము!
రాజేశ్వరరావు కుటుంబం అంతా సంగీతమయం. ఇతని అన్న సాలూరి హనుమంతరావు కూడా తెలుగు, కన్నడ సినిమాలలో సంగీత దర్శకులుగా పనిచేశాడు. రాజేశ్వరరావు పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు ప్రసిద్ధ పియానో, ఎలక్ట్రానిక్ ఆర్గాన్ విద్వాంసుడు. రెండవ కొడుకు పూర్ణచంద్రరావు ప్రసిద్ధ గిటారిస్టు. ఈయన మూడవ, నాలుగవ కొడుకులైన వాసూరావు, కోటేశ్వరరావులు కూడా ప్రసిద్ధ సంగీత దర్శకులే.[1] ముఖ్యంగా కోటేశ్వరరావు (కోటి) ప్రముఖ సంగీత దర్శకులు టీ.వీ.రాజు కోడుకైన సోమరాజుతో కలసి రాజ్-కోటి అన్న పేరుతో అనేక విజయవంతమైన ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. తరువాతి కాలంలో ఇద్దరూ విడిపోయి ఎవరికి వారే సంగీత దర్శకులుగా స్థిరపడ్డారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.