Remove ads
1967 తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia
భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన ప్రహ్లాదునిని కథ ఆధారంగా వచ్చిన సినిమా. ఈ చిత్రాన్ని ఎవిఎం ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.వి. మెయ్యప్పన్ నిర్మించాడు. ఈ చిత్రానికి రచన డి. వి. నరసరాజు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు. దీనికి మునుపు 1931, 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా ఎస్.వి. రంగారావు, ప్రహ్లాదుడిగా రోజారమణి, ప్రహ్లాదుడి తల్లిగా అంజలీ దేవి నటించారు.
భక్త ప్రహ్లాద (1967 సినిమా) | |
---|---|
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
రచన | డి.వి.నరసరాజు (స్క్రీన్ ప్లే, మాటలు) |
నిర్మాత | ఏ.వి.మెయ్యప్పన్ |
తారాగణం | బేబి రోజారమణి , ఎస్వీ రంగారావు, అంజలీదేవి |
ఛాయాగ్రహణం | విన్సెంట్ |
కూర్పు | ఆర్.విఠల్ |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో కూడా అనువాదం చేశారు. ఈ చిత్రంతోనే రోజారమణి వెండితెరకు పరిచయం అయ్యింది. అంతకు ముందు దాకా కేవలం సాంఘిక చిత్రాలకే పరిమితమైన డి. వి. నరసరాజు రచించిన తొలి పౌరాణిక చిత్రం ఇది. 1942 లో వచ్చిన భక్త ప్రహ్లాద చిత్రానికి కూడా చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వం వహించాడు.
వైకుంఠము వాకిలి వద్ద కావలి ఉండే జయ విజయులు తపోదనులైన సనకసనందులను లోనికి వెళ్ళనీయక అడ్డుకొని అపహాస్యం చేయడంతో వారు కోపించి రాక్షసులు కమ్మని శపిస్తారు. విష్ణువును శరణు వేడిన జయవిజయులకు శ్రీహరి రెండు ప్రత్యామ్నాయాలు చెబుతాడు. ఏడు జన్మలు ఆయన భక్తులుగా ఉంటారా లేక మూడు జన్మలు విరోధులుగా ఉంటారా అని అడుగుతాడు. వారు ఏడ జన్మలు విష్ణువు దూరంగా ఉండలేమని మూడు జన్మలు ఆయన విరోధులుగా పుట్టి ఆయన చేతిలో మరణించి తిరిగి వైకుంఠం చేరేలా శాప విమోచనం పొందుతారు.
వారి మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా దితి గర్భాన జన్మిస్తారు. హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేసి తనకు పగలు కాని, రాత్రి కాని- బయటా, లోపలా కాని- మనిషి వలన కాని, జంతువువలన కాని, ఏ ఆయుధముల వలన కాని మరణం లేకుండా వరం పొందుతాడు.
హిరణ్యకశిపుడు తపస్సు చేయుచున్నపుడు ఇంద్రుడు ఆమె భార్యను అపహరించి తీసుకొని పొతున్నపుడు నారదుడు అడ్డుకొని ఆమెను తన ఆశ్రమమునకు తీసుకొని వెళతాడు. అక్కడ ఆమెకు శ్రీహరి గురించి జ్ఞానభోద చేయుచున్నపుడు ఆమె కడుపులో ఉన్న ప్రహ్లాదుడు వింటుంటాడు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారద ముని ఆశ్రమమునుండి తీసుకెళ్ళి, సమస్త లోకాలనూ జయించి దేవతలను బానిసలుగా చేసుకొంటాడు.
ప్రహ్లాదుడు పెరుగుతూ హరిభక్తిని కూడా పెంచుకొంటుంటాడు. తండ్రికి అది ఇష్టముండదు. హరి మనకు శత్రువు అతడిని ద్వేషించమని చెప్తాడు. అయినా హరినామ స్మరణ చేస్తూ తన తోటి వారిని కూడ హరి భక్తులుగా మార్చుతుంటాడు. అనేక విధాలుగా చెప్పి చెప్పి విసిగిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపివేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుని చంపుటకు తీసుకొని పోయిన వారు అతడిని అనేక విధాలుగా చంపుటకు ప్రయత్నించిననూ ప్రహ్లాదుడు హరి ప్రభావము వలన చనిపోడు. హిరణ్య కశిపుని వద్దకు వచ్చి వారు మహరాజా! పాములతో కరిపించితిమి, కొండలపై నుండి తోయించితిమి, ఏనుగులతో తొక్కించితిమి, మంటలలో వేయించితిమి, సముద్రములో పడవేసితిమి అయిననూ ప్రహ్లాదునికేయు అవ్వలేదని చెపుతారు. హిరణ్య కశిపుడు తన చేతులతో విషము తాగించినా ప్రహ్లాదుడు చనిపోక తనను అనుక్షణం ఆ శ్రీహరి రక్షిస్తూ ఉంటాడని చెపుతాడు. నిన్ను రక్షించిన శ్రీహరి ఎక్కడున్నడని అడిగిన తండ్రితో సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఎక్కడైనా, అంతటా తానై ఉంటాడని అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్థంభములో ఉంటాడా నీ శ్రీహరి చూపించు అని, స్థంభమును బ్రద్దలు కొడతాడు హిరణ్యకశిపుడు. స్థంభమునుండి నృసింహావతారమున వెలువడిన శ్రీ మహావిష్ణువు సంద్యా సమయమున, ఇంటి బయటాలోనా కాని గడపపై, మానవ శరీరము, జంతువు కాని రూపములో ఆయుధము లేకుండా తన వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు.
1950వ దశకంలో వదిన, సంఘం లాంటి సాంఘిక చిత్రాలు నిర్మించి ఆర్థికంగా నష్టపోయిన ఎవియం ప్రొడక్షన్స్ అధినేత ఎ. వి. మెయ్యప్పన్ కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమాలు నిర్మించలేదు. ఈ చిత్రంతో ఆయన తిరిగి తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు నిర్మించడం మొదలు పెట్టారు.[1] బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.
ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వర రావు సంగీత దర్శకత్వం వహించాడు. సముద్రాల, దాశరథి, కొసరాజు, ఆరుద్ర, పాలగుమ్మి పద్మరాజు, సముద్రాల జూనియర్ పాటలు రాశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల, ఎస్.జానకి, సూలమంగళం రాజలక్ష్మి, ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు పాడారు.[2]
పాట | రచయిత | గాయకులు |
---|---|---|
జీవము నీవేకదా | సముద్రాల | పి.సుశీల |
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం | సముద్రాల | పి.సుశీల, బృందం |
రారా ప్రియా సుందరా | దాశరథి | పి. సుశీల |
జననీ వరదాయనీ త్రిలోచనీ | పాలగుమ్మి పద్మరాజు | ఎస్. జానకి |
ఆది అనాదియు నీవే దేవా | దాశరథి | మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
సిరిసిరి లాలీ చిన్నారి లాలీ | ఆరుద్ర | మంగళంపల్లి బాలమురళి కృష్ణ, ఎస్.జానకి |
అందని సురసీమ నీదేనోయి అందరు ఆశించు | సముద్రాల జూనియర్ | పి సుశీల, ఎస్ జానకి, శూలమంగలం రాజ్యలక్ష్మి |
హిరణ్యకశిపుని దివ్య చరిత్రము - హరికథ | ఆరుద్ర | మాధవపెద్ది, పిఠాపురం |
కనులకు వెలుగువు నీవే కాదా | సముద్రాల సీనియర్ | పి. సుశీల, ఎస్ జానకి |
ఆదుకోవయ్యా ఓ రమేషా ఆదుకోవయ్యా | సముద్రాల సీనియర్ | పి సుశీల బృందం |
పాములోల్లమయ్య మా బల్లె చూడవోయి బల్లె | కొసరాజు | పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ ఆర్ ఈశ్వరి |
శ్రీమానినీ మందిరా భక్త మందారా | సముద్రాల | పి.సుశీల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బృందం |
. చెట్టు మీద ఓక చిలకుంది, రచన: కొసరాజు గానం. పి. సుశీల.
కరుణ లేని మనసున, రచన: దాశరథి, గానం. పి సుశీల .
ఎల్ల శరీర దారులకు (, భాగవతం నుండి) గానం. పి సుశీల
కంజాక్షునకు గాని కాయంబు కాయమే ,(భాగవతం నుండి) గానం.పి.సుశీల
కలడంభోది గలండు గాలి (భాగవతం నుండి) గానం. పి సుశీల
గాలిన్ గుంబిన్ అగ్నిన్(భాగవతం నుండి) గానం.మాధవపెద్ది
చదివించిరి నను గురువులు ,(భాగవతం నుండి) గానం: పి.సుశీల
పంచాబ్దిoబుల వాడు తండ్రినగు,(భాగవతం నుండి), గానం. మాధవపెద్ది సత్యం
బలయుతలకు దుర్భలలుకు,(భాగవతం నుండి), గానం.పి.సుశీల
భుజ శక్తి నా తోడ పోరాడు ,(భాగవతం నుండి), గానం. మాధవపెద్ది సత్యం
మందార మకరంద,(భాగవతం నుండి), గానం: పి సుశీల
ముంచితి వార్పులన్ గద ,(భాగవతం నుండి), గానం.మాధవపెద్ది సత్యం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1967 వ సంవత్సరానికి గాను తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అవార్డు ప్రకటించింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.