సినీ దర్శకుడు, నటుడు From Wikipedia, the free encyclopedia
రెడ్డి నారాయణమూర్తి, (జ. డిసెంబరు 31,[1] 1953[2]) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు. ఎర్రసైన్యం, చీమలదండు మొదలైన విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత, నటుడు, హేతువాది, అవివాహితుడు.
ఆర్.నారాయణమూర్తి | |
---|---|
జననం | రెడ్డి నారాయణమూర్తి 1953 డిసెంబరు 31 |
విద్య | బి. ఎ |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
ఎత్తు | 5"7 |
తల్లిదండ్రులు |
|
నారాయణమూర్తి, కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు. అమ్మ పేరు రెడ్డి చిట్టెమ్మ[3], నాన్న పేరు రెడ్డి చిన్నయ్య నాయడు.[4] వీరిది అతి సాధారణ రైతు కుటుంబం. రౌతులపూడిలో 5వ తరగతి వరకు చదివాడు. రౌతులపూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. చిన్నతనం నుండి సినిమాలలో ఆసక్తితో ఎన్టీయార్, నాగేశ్వరరావుల సినిమాలు చూసి, విరామ సమయంలో వారిని అనుకరించేవాడు. అక్కడే తన నటనా జీవితానికి పునాది పడిందని చెప్పుకున్నాడు.[5] శంఖవరంలో ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడే నారాయణమూర్తికి సామాజిక స్పృహ కలిగింది. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు.
పెద్దాపురంశ్రీ రాజ వత్సవాయి బుచ్చి సీతయ్యమ్మ జగపతి బహద్దర్ మహారాణి కళాశాలలో బి.ఏ చదవడానికి చేరాడు. అక్కడ రాజకీయాలతో ప్రభావితుడై, సినిమాలు, రాజకీయాలు, సామాజిక బాధ్యత అనే మూడు వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరచుకున్నాడు. కళాశాల ఈయన విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. అంతేకాక తను ఉంటున్న ప్రభుత్వ హాస్టలు యొక్క విద్యార్థి అధ్యక్షునిగానూ, పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శి గానూ పనిచేశాడు. స్థానిక రిక్షా కార్మికులు ఈయనను మద్దతుకోసం సంప్రతించేవారు. నారాయణమూర్తి పట్టణ రిక్షాసంఘం అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు. ఎమర్జెన్సీ కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందువలన పోలీసులు ఈయన్ను తీసుకునివెళ్ళి విచారణ కూడా చేశారు. అంతేకాక నారాయణమూర్తి సినిమా నటి మంజులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ ప్రారంభించాడు. అప్పట్లో బీహార్లో వరదసహాయానికి తగిన విధంగా తోడ్పాడ్డాడు. సహవిద్యార్థులు నారాయణమూర్తిని కాలేజీ అన్నగా వ్యవహరించేవారు.
నారాయణమూర్తి సినిమాల్లో హీరో కావాలనే జీవితాశయం ఉండేది. సినిమా పిచ్చి తోటి 1972 లోనే ఇంటర్మీడియట్ పరీక్షలవ్వగానే ఎలాగైనా పరీక్షలో తప్పేది ఖాయం అనుకుని మద్రాసు వెళ్ళిపోయాడు. అప్పటికి ఇతడికి 17-18 ఏళ్ళ వయసు. మహానగరంలో ఎవరూ తెలీదు. మనసులో ఉందల్లా సినిమాల్లో వేషాలు వెయ్యాలని అంతే.. పక్కా సినిమా కష్టలు మొదలయ్యాయి. తిండి లేదు. వసతి లేదు. ఐనా ఏదో మూల ఆశ. అక్కడక్కడ తింటూ, లేని రోజు పస్తుంటూ, రోడ్డు పక్కనే ఏ చెట్టుకిందనో పడుకుంటూ.. రోజులు గడుస్తుండగా, ఒక రోజు హఠాతుగా పేపర్ లో పరీక్షా ఫలితాలు చూసి ఇంటర్మీడియట్ లో పాసయ్యానని తెలుసుకున్నాడు. సరే ఇక్కడా ఏమీ అవకాశాలు రావడంలేదుకదా. పాసయ్యాను కాబట్టి వెనక్కి వెళ్ళి బి.ఎ. చదువుదామని నిర్ణయించుకుని తిరిగి పెద్దాపురం వెళ్ళిపోయాడు. దాసరి గారి పరిచయం వలన కృష్ణ సినిమా నేరము-శిక్షఈయనకు ఒక చిన్నపాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఒక పాట చిత్రీకరణలో 170 మంది జూనియర్ ఆర్టిస్టులలో ఈయనా ఒకడు. చిన్నవేషంతో నిరుత్సాహపడ్డాడు. కానీ, ఇంటర్మీడియట్ పాసైన విషయం తెలిసింది. డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి రమ్మని దాసరి సలహా ఇచ్చాడు. అదీకాక, సినిమా టైటిల్లలో ఎన్.టి.రామారావు బి.ఏ అని చూసి, తనూ బి.ఏ చెయ్యాలనే కోరిక ఉండేది. అలా బి.ఏ చెయ్యటానికి తూర్పుగోదావరి తిరిగివచ్చాడు. అదే సమయంలో నేరము-శిక్ష సినిమా విడుదలైంది. వందమందిలో ఒకడిగా నిలబడినా, తన గ్రామప్రజలు సినిమా చూసి, తనను అందులో గుర్తిపట్టి, తను కనిపించిన సన్నివేశాలు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి, ఈలలు వేశారు. "మన రెడ్డి బాబులు సినిమాలో ఉన్నాడు" అని చెప్పేవారు. ఈ గుర్తింపు సినిమావంటి ప్రజామాధ్యమం యొక్క శక్తిని నారాయణమూర్తి గుర్తించేలా చేసింది. అప్పుడే డిగ్రీ పూర్తిచేసి సినిమాలలో చేరాలని నిశ్చయించుకున్నాడు.
డిగ్రీ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలలో మహా చురుకుగా పాల్గొనేవాడు. కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా వీరి బృందం కార్యక్రమం ఒకటి ఉండాలంతే. మరో పక్క కమ్యూనిస్ట్ పుస్తకాలు కూడా బాగా చదువుతుండేవాడు. సినిమా పిచ్చి మాత్రం లోపల తొలుస్తూనే ఉండేది. ఒకసారి కాలేజీలో అప్పటి హీరోయిన్ మంజుల గారి నృత్య కార్యక్రమం ఏర్పాటు చెయ్యడంలో ఇతడు ముఖ్యపాత్ర వహించాడు. ఏదో ఒక రోజు నేను కూడా సినిమాల్లోకి వెళ్ళి, సినిమా తారలకున్న కీర్తి కొంచెమైనా తెచ్చుకోవాలనుకునే ఆలోచన మాత్రం ఇతడిలో నుంచీ చెరిగిపోలేదు. అలానే రాజకీయ కార్యక్రమాలు కూడా. అత్యవసర పరిస్థితి రోజుల్లో ఎమ్మేల్లే డా.సి.వి.కె రావు గారూ ఇతడూ ఒకే వేదికమీదనుంచీ మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఇంక బి.ఎ పూర్తి కావడమే తరువాయి. మద్రాసు ప్రయాణం కట్టాడు. ఎప్పుడో మూడు నాలుగేళ్ళ క్రిందట వచ్చిన అనుభవమే మద్రాసుకి. ఐతే ఈ సారి బి.ఎ డిగ్రీ ఉంది కాబట్టి వేషాలు చాలా సులభంగా దొరుకుతాయి అనే భావన ఉండేది. ఏముందీ ఎవరు పడితే వాళ్ళు పిలిచి నాకు హీరో వేషం ఇస్తారు అనుకుంటూ మద్రాసులో అడుగుపెట్టాడు. పరిస్థితిలో ఏమీ మార్పులేదు. ఎవ్వరూ ఇతడిని పలకరించిన పాపాన పోలేదు. ఎందుకు పలకరించాలీ..నేనేమంత గొప్ప పర్సనాలిటీనీ..? ఐనా వయసు, సినిమా మత్తు అలాంటిది. పంపునీళ్ళే కడుపు నింపేవి.
పాండి బజారు చెట్లే రాత్రిపూట ఆశ్రయమిచ్చేవి. అలా కష్టాలు పడుతూనే రోజూ స్టూడియోల చుటూ తిరిగితే ఒకటి అరా జూనియర్ ఆర్టిస్టు అవకాశాలు దొరికాయి. పొలాల్లో పనిచేసేవాళ్ళల్లో ఒకడిగా, కాలేజీ సూడెంట్స్ లో ఒకడిగా, ఊరేగింపులో వెనకాలా..ఇలా అన్నీ గుంపులో గోవిందా వేషాలే. అవి కూడా షూటింగ్ రోజు మాత్రమే తిండి పెట్టగలిగేవి. ఆ రోజుల్లోనే దాసరి నారాయణరావు పరిచయం ఇతడి బ్రతుకుని ఒక మలుపు తిప్పింది. దాసరి ఇతడిలోని కళాతృష్ణని ఎలా కనిపెట్ట గలిగారో కానీ పరిచయం కాగానే ఘట్టమనేని రమేష్ బాబు హీరోగా ఆయన తీస్తున్న నీడ చిత్రంలో ఇతడికి ప్రాధాన్యత - ఉన్న వేషాన్నిచ్చారు.
ఆ సినిమాలో నారాయణమూర్తి కొంత ప్రాధాన్యత ఉన్న నక్సలైటు పాత్ర లభించింది. సినిమా బాగా విజయవంతమై, నారాయణమూర్తి మద్రాసులోని చోళ హోటల్లో కరుణానిధి చేతులపై వంద రోజుల షీల్డు అందుకున్నాడు. ఆ తరువాత దాసరి, రామానాయుడు, జ్యోతి శేఖరబాబు వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక సినిమాలలో సహాయపాత్రలలో నటించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి పూర్తిస్థాయి హీరోగా సంగీత అనే సినిమా తీశాడు. ఈ చిత్రాన్ని పూర్ణాపిక్చర్స్ పతాకంపై హరగోపాల్ నిర్మించాడు. అందులో రెండు పాటలను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు. చిత్రం ఒక మోస్తరు విజయం సాధించి 50 రోజులపాటు ఆడింది. అయితే ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాలేదు, చిన్నవేషాలకు కూడా తీసుకోక బాగా కష్టాలను ఎదుర్కొన్నాడు. తిండికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే హీరో అవ్వాలంటే మొదట దర్శకునిగా నిలదొక్కుకోవాలని అనుకున్నాడు.
దర్శకునిగా పూర్వానుభవం లేకపోవటం వలన, ఎవరూ సినిమా తీసే అవకాశం ఇవ్వలేదు. షూటింగులు ఉన్నప్పుడల్లా దాసరి పనితీరును గమనిస్తూ ఉండేవాడు. దర్శకునిగా తనకు తాను అవకాశమిచ్చుకోవటానికి తనే నిర్మాత అయితే కానీ కుదరదని గ్రహించి, స్నేహితులకు తన ఆశయం తెలియజేయగా, వాళ్లు కొంతమంది నారాయణమూర్తి సినిమా నిర్మించడానికి సహాయం చేశారు. అందుకే తన బ్యానరుకు "స్నేహ చిత్ర" అని పేరు పెట్టుకున్నాడు. భారత-రష్యా స్నేహ కరచాలనాన్ని చిహ్నంగా ఎంచుకున్నాడు.
నారాయణమూర్తి నిర్మాత, దర్శకుడిగా తన మొదటి సినిమా అర్ధరాత్రి స్వతంత్రం చిత్రీకరణను 1984 జూన్ 10న రంపచోడవరంలో ప్రారంభించాడు. ఆ సినిమా పదహారున్నర లక్షల పెట్టుబడితో పూర్తయింది. సెన్సారుతో వచ్చిన చిక్కులను కొంతమంది వ్యక్తుల సహకారంతో అధిగమించి సినిమాను 1986, నవంబరు 6, టి.కృష్ణ వర్ధంతి రోజున విడుదల చేశాడు. ఆ సినిమాలోనారాయణమూర్తి ఒక నక్సలైటు పాత్రను పోషించాడు. ఈ సినిమా ఊహించినంతగా విజయవంతమై చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విజయవంతమవటానికి వంగపండు ప్రసాదరావు వ్రాసిన పాటలు, పి.ఎల్.నారాయణ సంభాషణలు, నారాయణమూర్తి కథ, చిత్రానువాదము, దర్శకత్వం ఎంతగానో దోహదం చేశాయి. నారాయణమూర్తి సినిమాలన్నీ సమకాలీన సామాజిక సమస్యలు ఇతివృత్తంగా తీసినవే. ఈయన చిత్రీకరించిన సినిమాల్లో నిరుద్యోగం, ప్రపంచ బ్యాంకు విధానాలు, డబ్ల్యూటీవో ఒప్పందం, తృతీయ దేశాల సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఆనకట్టలు, నిర్వాసితుల సమస్యలు, భూ సమస్యలు, రాజకీయ అతలాకుతలాలు మొదలైనటువంటి వాటికి అద్దంపట్టాడు. అందువలన బాధిత ప్రజలు ఈయన సినిమాలలోని పాత్రలలో మమేకమైపోయేవారు.
ఆ తరువాత వచ్చిన సినిమాలలో దండోరా సినిమా సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టడానికి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఎర్రసైన్యం భూపోరాటానికి అజ్యం పోసింది. చుండూరు సంఘటనను చిత్రీకరించిన లాల్ సలాం పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఆ సినిమా తీసినందుకు పోలీసులు నారాయణమూర్తిని విచారణ చేశారు. కొన్నాళ్ళు ఆ సినిమాను నిషేధించారు కూడాను. నారాయణమూర్తి సినిమాల్లో ద్వందార్ధ సంభాషణలు, పెద్ద పెద్ద సెట్టింగులు, పేరుమోసిన నటీనటవర్గం, ప్రత్యేక హాస్య సన్నివేశాలు, యుగళగీతాలు మొదలైనవి ఉండవు. వాస్తవ సమస్యలను చిత్రీకరించి సామాన్యప్రజల మనసులను ఆకట్టుకోవటం మీదే ఆధారపడిన సినిమాలవి.
తెలుగు సినిమారంగంలో ఎర్రసైన్యం సినిమా ఒక ట్రెండును సృష్టించింది. ఆ తర్వాత అనేక పెద్ద నిర్మాతలు ఇలాంటి మూసలో అనేక సినిమాలు నిర్మించి, విడుదల చేశారు. అలా మూస చిత్రాల ఉధృతి ఎక్కువై, ఆ తర్వాత వచ్చిన సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు. నారాయణమూర్తి ఒక పది సంవత్సరాల పాటు తీసిన సినిమాలు చాలా విజయవంతమయ్యాయి. ఆ తరువాత ఏడు సంవత్సరాల పాటు వరుస పరాజయాలను చవిచూశాడు. ఊరు మనదిరా చిత్రం విజయంతో తన సినిమా జీవితంలో రెండవ అంకాన్ని ప్రారంభించాడు.
2009 మార్చి వరకు నారాయణమూర్తి కథానాయకునిగా నటించిన 26 సినిమాలలో 10 సినిమాలు విజయవంతమయ్యాయి. అవి (విడుదలైన క్రమంలో) - అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దీవిటీలు, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగుచుక్కలు.
నారాయణమూర్తి ఏ ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడతాడు. అవివాహితుడైన నారాయణమూర్తిని ఎందుకు పెళ్ళిచేసుకోలేదని ప్రశ్నిస్తే, అదంత చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్యేమీకాదని దాటవేశాడు. తన జీవిత భాగస్వామి తన ప్రజాజీవితానికి ఎక్కడ అడ్డువస్తుందో అనే అనుమానంతో పెళ్ళి చేసుకోలేదని చెప్పాడు. సినీ దర్శకనిర్మాతగా 19 సినిమాలను తీసి, 25 సినిమాలలో నటించి ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ, ఈయనకు సొంత ఇళ్లు కానీ, సొంత కారు కానీ లేవు. ఈయనకు తెలుగుదేశం పార్టీ రెండుసార్లు కాకినాడ లోక్‌సభ స్థానం, కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా, రాజకీయాలలో ప్రవేశించే ఉద్దేశం లేకపోవటం వలన తిరస్కరించాడు.[6][7]
దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగ్‌ని చేసి ఆ ఒక్క విషయంలో అన్యాయం చేశాడు. ఇంటికెళ్లగానే.. ఒంటరితనం కమ్మేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు పలకరించే నాథుడు లేకుండా ఒంటరిగా ముడుచుకొని పడుకొని ఉంటాను. తోడులేని నా జీవితం కూడా ఓ జీవితమేనా. ఏ గోంగూరో, లేక చేపల పులుసో తినాలనిపించినప్పుడు, అవి హోటల్లో దొరకనపుడు... అదే నాకంటూ ఓ భార్య ఉంటే వండి పెట్టేది కదా అనిపిస్తుంది. మేం సెటిల్ అవ్వలేదు. అయ్యాక పెళ్ళి చేసుకుంటాం అనే ధోరణి మానండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చక్కగా పెళ్ళి చేసుకోండి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.