ఏకకాలంలో పలు సాహితీ సమస్యలను పరిష్కరించే ప్రక్రియ From Wikipedia, the free encyclopedia
అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability)కి పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే అష్టావధానంలో 8 మంది పృఛ్ఛకులు (ప్రశ్నలు అడిగేవారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరికొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు.
ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. అవధానం విజయవంతంగా చేసిన వారిని అవధాని అని అంటారు. ఏక కాలంలో తెలుగు, సంస్కృతం - రెండు భాషల లోనూ అవధానం చేసిన పండితులు ఉన్నారు.
అవధానాలు చాలా రకాలు. ముఖ్యంగా అవధానాలను వేదసంబంధ, సాహిత్య, సాహిత్యేతర అవధానాలుగా వర్గీకరించవచ్చు.
సంగీత నవావధానం ..ఈప్రక్రియను ప్రారంభించిన వారు మీగడ రామలింగస్వామి. ఎనమిది మంది పృఛ్ఛకులకు, ఇరవై పద్యాలను పన్నెండు రాగాలను ఇస్తారు. వాటిలో నుండి పద్యాలు తాము కోరుకున్న రాగాలలో గానం చేయమని అడగవచ్చు. ఉదాహరణకు పాండవోద్యోగంలో బహుళ ప్రచారంలో ఉన్న పద్యం 'జెండాపై కపిరాజు ' ఇంతవరకు పాడిన నట గాయకులందరూ దీన్ని మోహన రాగంలోనే పాడారు. పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఉన్న శివరంజని లేక ముల్తాన్ రాగాలలో పాడమని పృఛ్ఛకులు అడిగితే అవధాని ఆ రాగంలో పద్యభావం చెడకుండా పాడాలి. పృచ్చకులు కూడా దాదాపుగా పద్యాలను రాగయుక్తంగా పాడగలవారై ఉంటారు. అందువల్ల ఒక్కొక్క పద్యాన్ని పరస్పర విరుద్ధమైన ఛాయలున్న రాగాలలో వినగలుగుతాం.
అవధానంలో అనేక అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పండితుడు నిర్వహిస్తాడు. అతడిని పృచ్ఛకుడు అని అంటారు. అవధాని పాండిత్యాన్ని, సమయస్ఫూర్తినీ పరీక్షిస్తూ తగు ప్రశ్నలను సంధిస్తూ ఉంటారు పృచ్ఛకులు. ఈ అంశాలను స్థూలంగా నాలుగు వర్గాలుగా విభజించవచ్చు. అవి:
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలానా ఛందస్సులో ఒక పద్యం చెప్పవలసినదిగా అవధానిని కోరతాడు. అవధాని ఆ విషయం మీద ఆ చందస్సులో ఒక పద్యం మొదలెడతాడు, ఒక పదంతో. అప్పుడు వృచ్ఛకుడు అవధాని చెప్పిన పదాన్ని బట్టి తరువాత ఏ అక్షరం రాగలదో ముందుగానే వూహించి ఆ అక్షరం మీద సిషేదం విధిస్తాడు. అంటే అప్పుడు ఆ అక్షరం ఉపయోగించ కూడదని అర్థం. అవధాని ఆ అక్షరం కాకుండా వేరే అక్షరంతో పద్యాన్ని కొనసాగిస్తాడు. ఈ విధంగా ఆ పద్యం పూర్తయ్యే లోపు అనేక సార్లు నిషిద్దాక్షరాన్ని ప్రయోగిస్తాడు వృచ్ఛకుడు. అవదాని పద్యభావం చెడకుండా పద్యాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేయడమంటే ఒకేసారి పూర్తి చేయడం కాదు. అవధానం పూర్తయ్యేలోపు పూరించాలి. అవధాని ఆ పద్యంలో రెండు మూడు పాదాలు చెప్పగానే మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. ఇంత వరకు చెప్పిన పద్య భాగాన్ని అలాగే మనసులో ముద్రించుకొని ఇచ్చిన మరో అంశానికి వెళతారు అవదాని. ఈ అవధాన ప్రక్రియ సంస్కృతంలోను, తెలుగులో మాత్రమే మనకు తెలుస్తుంది. ఇది తెలుగు భాషకు మహాభూషణము.
నిషిద్ధాక్షరి విభాగంలో అవధానిని - శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని పై ఒక పద్యాన్ని చెప్పమనగా అవధాని ఇలా చెప్పాడు.
డమరుకమును మ్రోగించుచు
నమరించెను మానవులకు ' అఆ ' మాలన్
కమనీయముగా వ్రాయగ
నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.
నిర్దిష్టాక్షరి అనగా నిర్దేశించబడిన అక్షరాలు గలదని అర్థం. దీనినే న్యస్తాక్షరి అని కూడా పిలుస్తారు. వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలానా చందస్సులో ఒక పద్యం చెప్పమని అవధానిని అడుగుతూ, పద్యంలోని నాలుగు పాదాలలో ఫలానా స్థానంలో ఫలానా అక్షరం మాత్రమే వుండాలి అని నాలుగు అక్షరాలను నిర్దేశిస్తాడు. అవధాని పృచ్ఛకుడు చెప్పిన అక్షరాలను ఉపయోగించి పద్యాన్ని పూరిస్తారు. దీనినే న్యస్తాక్షరి అని కూడా పిలుస్తారు.
ఇది న్యస్తాక్షరి లాంటిదే. కాకపోతే అక్కడ ఒక పాదానికి ఒక అక్షరాన్నిస్తారు. ఇందులో ఒక్క పాదానికి ఒక్కొక్క పదాన్నిస్తారు. ఆ పదాలు కూడా ఒక దానికి ఒకటి పొంతన లేకుండా వుంటాయి. ఉదాహరణగా చెప్పాలంటే. వంకాయ, అమెరికా, రాముడు, గాందీతాత. ఒక్కొక్క పాదంలో ఒక పదాన్ని వుంచి ఫలాన చందస్సులో, ఫలాన విషయంపై ఒక పద్యం చెప్పమని వృచ్ఛకుడు ప్రశ్నను సందిస్తాడు. అవదాని ఆయా పదాలనుపయోగించి అర్థవంతమైన పద్యాన్ని చెప్పడానికి ప్రయత్నించి నాలుగు పదాలు చెప్పగానే మరొక వృచ్ఛకుడు మరో సమస్యతో అడ్డగిస్తాడు. అవధాని అంతవరకు చెప్పిన పద్యభాగాన్ని అలాగే గుర్తు పెట్టుకుని మరో సమస్యలోకి దిగాలి. ఈ దత్తపదులను పృచ్ఛకుడు వివిధ రకాలుగా అడగవచ్చు. ఉదాహరణకు:
వృచ్ఛకుడు లోక విరుద్ధంగా వున్న విషయాన్ని సమస్యగా చేసి ఒక పద్య పాదాన్ని ఇస్తాడు. అవదాని గారు తనకిచ్చిన పద్య పాదంలోని లోక విరుద్ధమైన భావాన్ని విరిచి లోకామోదమైన భావంతో పద్యాన్ని పూరించాలి. ఉదాహరణకు: కప్పను చూడంగ పాము గజగజ లాడెన్. ఈ పద్య పాదంలోని అర్థం లోక విరుద్ధము. అదే అర్థంతో పద్యాన్ని ఎవరైనా చెప్పగలరు. అందులోని అర్థాన్ని సజావుగా మార్చి పద్యం చెప్పాలి. అవధాని గారు ఈ సమస్యను స్వీకరించి మొదటి పద్య పాదంలో కొంత భాగము చెప్పగానే ...... అతని ధారణకు ఆంతరాయాన్ని కలిగిస్తూ మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు.
వృచ్ఛకుడు ఏదో ఒక చందస్సులో, ఏదో ఒక విషయాన్ని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమంటాడు. అవధానిగారు ఆ నిర్థిష్టమైన చందస్సులో ఆ విషయమై వర్ణనాత్మకమైన పద్యం చెప్పాలి. వీటిలో అనేక రకాలైన వర్ణనలు ఉన్నాయి. దైవస్తుతి, పురాణ సంబంధమైన వర్ణనలు, ప్రబంధాలలోని వర్ణనలు, చిత్రకవిత్వాలు, భాషాంతరీకరణ పద్యాలు, అన్యాపదేశ పద్యాలు, ప్రతి పద్యాలు అనగా సుప్రసిద్ధమైన ఒక పద్యాన్ని ఇచ్చి అదే అర్థం వచ్చేటట్లు ఇంకొక ఛందస్సులో వర్ణించడం, అల్పవిషయము - బృహత్పద్యం (ఉదా: దోమకాలు - మహాస్రగ్ధర వృత్తంలో), బృహద్విషయము - అల్పపద్యం (ఉదా: దశావతారాలు - కందపద్యంలో), అచ్చతెలుగు పద్యాలు, సమకాలీన రాజకీయ, సాంఘిక విషయ పద్యాలు, శాస్త్రీయ పద్యాలు, ఆశీర్వచన పద్యాలు ఇలా అవధానాలలో అనేక విధాలుగా వర్ణనాంశాన్ని పూరించారు.
వృచ్ఛకుడు ఒక విషయాన్నిచ్చి అడిగిందే తడవుగా, ఆలోచించుకోకుండా వెంటనే ఆశువుగా చందోబద్ధమైన పద్యాన్ని ఆ విషయాన్ని గురించి చెప్పాలి. అవధాని ఛందశ్శాస్త్రంలో ప్రవీణుడై వృత్తాలు, జాతులు, ఉపజాతులలోని పద్యలక్షణాలను ఔపోసన పట్టి ఉండాలి. పద్యాలు చెబుతున్నప్పుడు గణాలు, యతులు, ప్రాసలు అవంతట అవే వాటి స్థానాలలో వచ్చి కుదురుకోవాలి.
వృచ్ఛకుడు పురాణం, ఇతిహాసం, ప్రబంధం, కావ్యం ఇలాంటి గ్రంథాలలో ఒక ప్రధాన ఘట్టాలలో నుండి ఏదైనా ఒకటి రెండు పద్యాలను చదివి వినిపిస్తాడు అవధానిగారికి. అవధానిగారు ఆ పద్యాలను విని ..... ఆ పద్యాలు ఏ గ్రంథంలోనివి, ఆ గ్రంథ కర్త ఎవరు? ఆ సందర్బమేది వంటి విషయాలు.... పురాణ పక్కీలో చెప్పాలి... అవధాని గారు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తుండగా....... మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. అవదానిగారు అతన్ని 'కొంత సేపు ఆగు ' అని అనకుండా అతని ప్రశ్న వినడానికి సిద్ధ పడాలి.
పైన చెప్పిన సమస్యలు అవధాని గారి జ్ఞాపక శక్తికి, అతని ధారణా శక్తిని పరీక్షించేవి. ఆ యా విషయాల గురించి తీవ్రంగా అలోచిస్తూ వుండగా ఈ వృచ్ఛకుడు ప్రస్తుత విషయానికి పూర్తిగా విరుద్ధమైన విషయాన్ని గురించి ఒక కొంటె ప్రశ్న సందిస్తాడు. అవధాని ఏకాగ్రతను చెడగొట్టడానికి అప్రస్తుత ప్రసంగి (పృచ్ఛకులలో ఒకరు) చేయని ప్రయత్నం ఉండదు. ఉదాహరణకు ఒక సభలో ఒకాయన "అవధాని గారూ, భర్త భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తోంది. భర్త పశువ అన్నాడు. భార్య కోతి అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి" అని అడిగారు. దానికి అవధాని... "పళ్లెం నిండా శుభ్రంగా వడ్డించవే" అని భర్త అంటే "కోరినంత తినండి" అని భార్య జవాబిచ్చింది అని చెప్పాడు. "హనుమంతుని తోక పెద్దదా-ద్రౌపది కోక పెద్దదా" వంటివి మరికొన్ని ఉదాహరణలు. అవధాని, అప్రస్తుత ప్రసంగి విసిరే ఛలోక్తులూ చెణుకులకు తడుముకోకుండా చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే, పద్యాలూ ఛందస్సుల గురించి తెలియని వారిని ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.
ఇది ధారణకు సంబంధించిన అంశము. ఈ అంశంలో ఒక వాక్యం లేదా పద్యంలోని అక్షరాలు లేదా పదాలకు అంకెలు వేసి వాటిని వేరువేరుగా కత్తిరించి వాటికి క్రమము తప్పించి అవధానము జరుగుతున్నప్పుడు మధ్యమధ్యలో అవధానికి అందిస్తారు. అవధాని ఆ కాగితపు ముక్కలో ఉన్న అక్షరాన్ని లేదా పదాన్ని చదివి గుర్తు పెట్టుకుని ఆ కాగితపు ముక్కలను పక్కకు పడవేస్తాడు. అవధానం చివరలో ఆ అక్షరాలను/పదాలను క్రమంలో పేర్చి వాక్యాన్ని/పద్యాన్ని అప్పజెప్పుతాడు. ఈ అంశంలో అవధానులు తెలుగు భాష మాత్రమే కాక సంస్కృతం, ఇంగ్లీషు, అరవం, హిందీ తదితర భాషా వాక్యాలను కూడా అప్పజెప్పుతారు. మాడభూషి వేంకటాచార్యులు ఈ అంశాన్ని ఎనిమిది భాషలలో చేశాడు.
ఈ అంశంలో పృచ్ఛకుడు, అవధాని పద్యాలలో సంభాషిస్తారు. పృచ్ఛకుడు ప్రశ్నను ఒక పద్యంలో కాని ఒక పద్య భాగంలో కాని అడిగితే అవధాని సమాధానాన్ని ఆ పద్యం మిగిలిన భాగంలో పూర్తి చేస్తాడు.
ఘంటా గణనం అనగా అప్పుడప్పుడు గంట కొడుతుంటారు. అవధాని ఆ సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని గంటలు కొట్టారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.
ఈ అంశాన్ని సాధారణంగా జంట అవధానాలాలో ప్రదర్శిస్తారు. ఈ అంశాన్ని ధూళిపాళ మహదేవమణి ప్రవేశపెట్టాడు. ఇది ఒక విధంగా Dumb charades వంటిది. ఒక అవధానికి పృచ్ఛకుడు ఒక పదం కాని ఒక వాక్యం కానీ చెబుతాడు. ఆ అవధాని ఒక స్టీలు పళ్ళెంపై గరిటతో కాని, స్పూనుతో కాని శబ్దం చేస్తాడు. ఆ శబ్దాన్ని బట్టి రెండవ అవధాని ఆ పదాన్ని/ వాక్యాన్ని చెబుతాడు.
పుష్ప గణనము అనగా అవధానికి తగిలేలా అప్పుడప్పుడు పుష్పాలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని పూలు విసిరారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.
నమూనా అవధానం ఇలా జరుగుతుంది.
1.ఇప్పటి వరకు ఒక ఆవృతం మాత్రమే పూర్తయింది. ఏ ఒక్కరికీ పూర్తి సమాధానం ఇవ్వకనే మరో వృచ్ఛకుడు అడ్డు తగిలాడు. ఈ సారి రెండో ఆవృతంలో (రెండో రౌండు) తిరిగి మొదటి వృచ్ఛకుడు నాప్రశ్నకు సమాదానమేది అని ప్రశ్నిస్తాడు. అతనడిగిన ప్రశ్నేమిటో ఎంతవరకు సమాదాన మిచ్చాడో గుర్తు పెట్టుకొని ఆ పద్యంలో రెండో పాదం చెప్పాలి. మొదటి వృచ్చకునికొ సమాధానం పూర్తి కాక ముందే రెండో వృచ్చకుడు నాసంగతేమిటని అడుగుతాడు. అతనికి ఇంతకు ముందు ఎంతవరకు సమాధానము చేప్పారో గుర్తు పెట్టుకొని మిగతా సమాదాన భాగాన్ని పూరిచి చెప్పాలి. ఇంతలో మూడో వృచ్చకుడు.... ఇల ఒకరి తర్వాత మరొకరు తాము ఇదివరకు సంధించిన ప్రశ్నలు చెప్పకుండా తమకు రావలసిన సమాధానలను గురించే అడుగుతారు. అవధానిగారు ....... మీకు ఎంత వరకు సమాదానము చెప్పాను? అని అడగ కుండా ఆ విషయాన్ని మనసులోనే వూహించుకుని తరువాతి పద్య పాదాన్ని పూరించి సమాధానము చెప్పాలి. ఆ విధంగా నాలుగో రౌండులో మాత్రమే ప్రతి వృచ్ఛకునికి పూర్తి సమాదానము వస్తుంది. అవధానులెవరైనా వృచ్చకులు అడిగిన ప్రశ్నలకు చంధోబద్దమైన పద్యాలతో సమాధానము చెప్పడమే కాదు ఆ సమాధానాలు అత్యంత రసవత్తరంగా, మనోజ్ఞంగా. సాధారణ ప్రేక్షకుల సైతం ఆకట్టు కునే విధంగా వుటాయి. అందులోనే అవధాని గారి గొప్పతనం, ప్రజ్ఞా వుంటాయి.
ఆ విధంగా అన్ని నియమాలతో పద్యాలు చెప్పడం ఒక ఎత్తైతే నాలుగు రౌండ్లు పూర్తవగానే ఆ పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా వాటిని అపొపగించడం మరో ఎత్తు. ఇదే ఈ అవధాన కార్యక్రమంలో గొప్పవిషయం. అలా అష్టావధాన కార్యక్రమం చాల కోలాహలంగా ఆనంద భరితంగా ముగుస్తుంది.
3 సమస్యా పూరణం అన్న పై విషయంలో కప్పను జూడంగ పాము గజగజ లాడేన్. ఇది అసమజమైనది. (అనగా కప్పను చూడగా పాము గజగజ లాడి భయపడు. ఆ ఆర్థాన్ని మార్పు చేసూ అక్షరాలను ఏమాత్రము మార్చకుండా పూరించాలి) అనే పద్య పాదాన్ని పూర్వం ఒక సమస్యగా ఇచ్చారు ఒక అవధాని గారికి. దానికి అవధానిగారు పూరించిన సమాదానము పూర్తి పద్యం లోని భావం చూడండి. వెంకప్ప అనే రైతు తన పొలంవద్ద నున్న కుప్పలకు కావలికై వెళుతూ ఒక కర్రను, కిర్రు చెప్పులును ధరించి వెళుతుంటే అతన్ని చూసి అనగా వెంకప్పను జూడంగ పాము గజగజ లాడెన్. ఈ పూరణ ఎంత అద్భుతంగా వుందో.......
4.పువ్వులు విసురుట: అవధాన కార్యక్రమము జరుగుతుండగా ఒకరు అవదాని పైకి అప్పుడప్పుడు ఒక్క పువ్వును విసురు తాడు. అవధానం పూర్తి కాగానే తనపైకి ఎన్ని పువ్వులు విసిరారో గుర్తు పెట్టుకొని కచ్చితమైన సమాధానం చెప్పాలి అవధాని గారు.
6. గంటలు కొట్టుట. అవధానం జరుగుతున్నప్పుడు ఒకరు గంట కొడుతుంటాడు. అవధానం పూర్తవగానె., అతను ఎన్ని గంటలు కొట్టాడొ గుర్తు పెట్టుకొని అవధాని గారు చెప్పాలి. పువ్వులు విసరటం, గంటలు కొట్టటం అనే రెండు అంశాలు రెండు వుండవు. ఈ రెంటి వుద్దేశం ఒక్కటే గాన ఏదో ఒక్కటే వుంటుంది. అది కూడా పైన చెప్పిన ఎనిమిది అంశాలలో ఒకదాని బదులుగా ఈ రెంటిలో ఒక్క దాన్ని వుంచు తారు. ఎలాదైనా ఎనిమిది అంశాలుండాలి అనేది నిబంధన.
అష్టావధానంలో ఎనిమిది ప్రక్రియలు ఒకేసారి చెయ్యాలి. కనీస సమయం నాలుగు గంటలు. సాధారణంగా కింది ప్రక్రియలను ఎన్నుకుంటారు.
ఇవే కాకుండా కొంతమంది సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి, ఘంటా గణనం, పురాణ పఠనం, సహ పఠనం, కావ్యోక్తి, ఇచ్ఛాంక శ్లోకం మొదలగు వాటిలో ఎనిమిది ప్రక్రియలు ఎన్నుకుంటారు. చివరలో "ధారణ"తో అవధానం ముగుస్తుంది. ధారణ అనగా ఆ అవధానంలో తాను చెప్పిన అన్ని పద్యాలను అవధాని చివరలో చెప్పవలసి ఉంటుంది.
అష్టావధానములో ఇవ్వబడిన ఎనిమిది అంశాలలో స్వల్ప తేడాలుంటాయి.
వంద మంది పృచ్ఛకులను ఎదుర్కొని చేసే అవధానాన్ని శతావధానం అంటారు. సాధారణంగా శతావధానంలో సమస్య, దత్తాక్షరి, వర్ణన, అప్రస్తుత ప్రసంగం అంశాలు ఉంటాయి.
దశావధానము అనగా ఏక కాలమున విలక్షణములగు పదివిషయములపై ధీపటిమను ప్రసరింపజేసి, ఏవిషయమునను బుద్ధి కుశలత సడలింపక, వీగిపోక సహృదయవతంసులచే శిరః కంపము చేయించు కొనక విద్యావినోదము, అష్టావధానము వలే పది అంశములపై చిత్తము ఏకాగ్రమొనర్చి చేయు అవధానము. ఆశుకవిత అను లేఖిన్యాదిపరికర సాహాయము లేకయే, తడువుకొనకుండ, ధారావాహికముగ, ఆడిగిన విషయమును గూర్చి సలక్షణమగు చంధోబద్ధ రచన మొనరించుట. దీనిని చేసిన ఒకకవి పేరు తెలియకున్నను ఆతని దశావధానకవి అన్న బిరుదు మాత్రము వ్యాప్తినొందినది. ఈకవి శ్లోకమొకటి సా.శ.1689 సం. న రచించబడిన చతుర్భుజుని రసకల్పద్రుమము న ఉదహరింపబడింది. హిందూ పత్రిక (13-12-1949)లో మద్రాసునగరమున పి.ఆర్ముగంపిళ్ళ యను ఒక ద్రావిడకవి దశావధాన మొనరించెననియు, అందలి పదవిషయములలో ఒకటి జ్యోతిశాశ్త్ర కౌశలద్యోతకమనియు ప్రకటింపబడెను. అందు ఆతడు, వెనుకటి ఆంగ్ల సంవత్సరమొకటి పేర్కొని యేనెల యేతిథి యేవార మగునో చెప్పెనట.ఆధునిక కాలంలో ర్యాలీ ప్రసాద్ 'దశావధానం' ప్రక్రియలో వచనావధానాన్ని నిర్వహించారు.
దీనిని చేసిన వారలో పేరుగాంచిన కవి శ్రీ విద్వాన్ అభినవపండితరాయ మాడభూషి వేంకటాచార్యులు గారు. వివిధ ఆకృతులు, పరిమాణములూ గల 100 కంచు చెంబులపై సంఖ్యలు వేస్తారు. వాటిని అవధానికి కనబడకుండా వేరే గదిలో ఉంచి, ఒక్కొక్క చెంబు సంఖ్యను చెప్పి, ఒక కర్రతో కొడతారు. అప్పుడు శబ్దాన్ని విని అవధాని గుర్తు పెట్టుకోవాలి. అలా అన్ని చెంబులనూ సంఖ్య చెప్పి కర్రతో కొడతారు. ఆ తరువాత, తన ఇష్టం వచ్చిన రీతిలో ఏదో ఒక చెంబును కొడతారు. అవధాఅని ఆ శబ్దాన్ని బట్టి ఆ చెంబు సంఖ్య ఎంతో చెప్పాలి. ఇది శత ఘంటావధానములో ముఖ్యమైన ప్రక్రియ.
ర్యాలీ ప్రసాద్ :ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక కవి.తెలుగు కవిత్వంలో తొలిసారిగా వచన కవిత్వంలోని అన్ని 1.అభ్యుదయ కవిత్వం, 2.విప్లవ కవిత్వం, 3.దిగంబర కవిత్వం, 4.స్త్ర్రీ వాద కవిత్వం, 5.దళిత వాద కవిత్వం, 6.ముస్లింవాద కవిత్వం, 7.అనుభూతి వాద కవిత్వం 8.ప్రకృతి వాద కవిత్వం, 9.హైకూ మొదలగు ప్రక్రియలలో అవధానాన్ని చేసి జాతీయ రికార్డులు సాధించారు.వచన కవిత్వంలో మహా సహస్రావధానాలు నిర్వహించారు. సాధారణంగా అవధానాలు ముందస్తు పధకం ప్రకారం జరుగుతాయనేది చాలా చోట్ల చూస్తుంటాము. వీరు అవధానాలు బహిరంగంగా అంటే సభకు వచ్చిన వారిచ్చిన సమస్యలను పూరించి అవధానం పూర్తి చేయడం విశేషం.
వచన కవిగా 1.తమస్, 2.రాలిన పూలు, 3.ఆమని, 4.అల ఒక కల, 5.స్వప్నభాష, 6.పునాసనీడ, 7.మట్టి, 8.ఏలేరు తీరాన 9.తదనంతరం, 10.కుంకుమరేఖ, 11.ఆల్ఫా-ఒమెగా, 12.ఒక రాస్తాను మొదలగు కావ్యాలు రచించారు. కాకినాడ నివాసి. వీరి గురువు తొలుత ర్యాలి వెంకట్రావు, కలహంస, విద్యారత్న, వచన కవితా విశారద బిరుదు.జాతీయ స్ఠాయిలో అనెక పురస్కారాలు పొందారు.
ర్యాలి ప్రసాద్ ఈ ప్రక్రియ రూపశిల్పి.
రాళ్ళబండి కవితా ప్రసాద్, కడిమిళ్ళ వరప్రసాద్, గరికపాటి నరసింహారావు, మాడుగుల నాగఫణి శర్మ, ర్యాలి ప్రసాద్.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.