From Wikipedia, the free encyclopedia
అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు ప్రతిభావంతుడైన కవి, శతావధాని, పరిశోధకుడు, గ్రంథ రచయిత, ఉత్తమ ఉపన్యాసకుడు.[1] ఇతడు అనేక సాహిత్య రూపకాలలో ఆధునిక, ప్రాచీనాంధ్ర మహాకవుల పాత్రలను పోషించాడు.
పేరయ్య నాయుడు 1958, ఆగస్టు 5వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, మామిడికుదురు మండలానికి చెందిన పాశర్లపూడి గ్రామంలో తన మాతామహుని ఇంట జన్మించాడు. ఇతడి స్వగ్రామం అమలాపురం సమీపంలోనున్న రెడ్డిపల్లి గ్రామం. సీతామహాలక్ష్మి, బాపిరాజు గారలు ఇతని తల్లిదండ్రులు. ఇతడు ప్రాథమిక విద్యను రెడ్డిపల్లి లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఉన్నత పాఠశాలావిద్యను కామనగరువు జిల్లాపరిషత్తు ఉన్నతపాఠశాలలో పూర్తిచేశాడు. పిమ్మట పొడగట్లపల్లిలోని పెన్మత్స సూర్యనారాయణమ్మ, సత్యనారాయణరాజు ఓరియంటల్ కళాశాలలో చదివి భాషాప్రవీణ పట్టాపుచ్చుకున్నాడు. తరువాత ప్రైవేటుగా ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. (తెలుగు), ఎం.ఎ. (సంస్కృతం)లను పూర్తిచేశాడు. పెద్దింటి దీక్షితదాసు హరికథాసాహిత్యము అనే అంశము పై పరిశోధన చేసి 1997లో హైదరాబాదులోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి.పట్టా సంపాదించుకున్నాడు. పురాణపండ సుబ్బారావు, కందుకూరి శ్రీరామచంద్రమూర్తి, శ్రీపాద లక్ష్మీనారాయణశాస్త్రి మొదలైనవారు ఇతని గురువులు.
ఇతడు పొడగట్లపల్లి లోని ఓరియంటల్ కళాశాలలో 1978 నుండి 1990 వరకు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. తరువాత రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగ ఆస్తిక కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరాడు. 1997లో రీడర్గా పదోన్నతిని పొందాడు.
ఇతడు 18 సంవత్సరాల వయసులో పొడగట్లపల్లి సంస్కృత కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే మొట్టమొదటి అవధానం అక్కడ చేశాడు. ఇతడు పొడగట్లపల్లి, తుని, రంపచోడవరం, అనకాపల్లి, ఏలూరు, యానాం, అమలాపురం, విశాఖపట్టణం మొదలైన స్థలాలలో శతాధిక అష్టావధానాలు, రాజమండ్రిలో రెండు శతావధానాలు, పెనుగొండలో ఒక నేత్రావధానం చేశాడు. ఇతని అవధానాలలో సమస్యాపూరణం, నిషిద్ధాక్షరి, వర్ణన, దత్తపది, వ్యస్తాక్షరి, వారకథనం, ఆశువు, పురాణం, ఘంటగణనం, అప్రస్తుతప్రసంగం మొదలైన అంశాలు ఉంటాయి.
పూరణ:
సలలిత దైవభక్తి విలసన్మృదుచిత్తసరోజ లౌచు, దే
వళముల కేగి, కొల్చి, యుపవాస కృశీభవదంగులౌచు, ని
శ్చలముగ, రాత్రిపూజనము సల్పి, యనల్పము దానఁ గంద బ
చ్చలిఁగని కార్తికమ్మునను సర్వులు మెచ్చిరి భోజనమ్ముల్
పూరణ:
అంబన్ సర్వజగత్సవిత్రి నిజదేహంబందు నర్థంబుగా
సమ్మానించిన రాగమూర్తివి, ప్రశస్తంబైన నీ నామ గా
నంబే పాపచయాపహారకము; విజ్ఞానైకవారాశి వో
సాంబా! రార! సమాహితంబగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్
పూరణ:
మురిసిపోకమ్మ యీనాటి పొంగు పసయు
శాశ్వతంబంచు నెంచి నీ స్వాంతమందు
ఉదయ సాయం సమయముల నొప్పుచుండు
సంధ్య వంటిది బోటిరో జవ్వనంబు.
పూరణ:
చక్రి కెట్టులొ లక్ష్మి, యీశ్వరుని కటులు
నగజ శోభిల్లు రక్తి నానాటి కెటులు
అంబ కెట్టులు మన్నుతులర్పితంబ
మనెడి మమ్ముఁ జాకెట్టుల్లున్ గనదె కృపన్
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.