From Wikipedia, the free encyclopedia
సి.వి. సుబ్బన్న.(కడప వెంకటసుబ్బన్న) అద్భుతమైన ప్రతిభ, అనన్యసామాన్యమైన వ్యుత్పత్తి, అసాధారణమైన అభ్యాసం కలిగిన శతావధాని.
ఈయన కడప జిల్లా ప్రొద్దుటూరు లో నవంబరు 12 , 1929 న కడప రంగమ్మ చెన్నప్ప దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య రామేశ్వరము (ప్రొద్దుటూరు)లో, సెకండరీ విద్య అనీబిసెంట్ మునిసిపల్ హైస్కూలులో, ఇంటర్మీడియట్ మదనపల్లి అనీబిసెంట్ కళాశాలలో గడిచింది. తరువాత ఎం.ఎ. డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గైకొన్నారు. కె.సుబ్బరామప్ప గారి పర్యవేక్షణలో వీరు అవధాన విద్య అనే విషయం పై పరిశోధనచేసి మైసూరు విశ్వవిద్యాలయం నుండి 1981లో పి.హెచ్.డి పట్టాను గ్రహించారు. అదే సంవత్సరం అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేటుతో వీరిని సత్కరించారు.[1] అవధానాలు చేస్తూ, ఆశుకవితలు చెప్పేవారి కవిత్వంలో పటుత్వం ఉండదని కొందరి అపోహ. ఆంధ్ర దేశాన్ని అవధానాలతో ఉర్రూతలూపి, పద్యాన్ని పశువుల కాపరి దాకా తీసుకుపోయిన తిరుపతి వేంకటకవులు గ్రంథాలు రచించి తమ పద్యావిద్యా ప్రతిభను ప్రదర్శించినట్లే, సి.వి. సుబ్బన్న శతావధాని కూడా శతానేక అవధానాలు చేసి పదికి పైగా పద్య గ్రంథాలు రచించారు. సుబ్బన్న గారు అనేక ప్రాంతాల్లో చేసిన అవధానాల్ని క్రోడీకరించి మూడు సంపుటాలుగా ముద్రించారు. ప్రస్తుతం ఆమూడింటిని కలిపి శతావధాన ప్రబంధం త్రిపుటిః పేరుతో బృహద్గ్రంధాన్ని ప్రకటించారు. వీరు ఇంకా శ్రీ వ్యాస విలాస ప్రబంధము, శ్రీ భద్రాచలరామదాస ప్రబంధం, దివ్యలోచన ప్రబంధం (ధనుర్దాసు) భోజకువింద చరిత్రము, గోపవధూ కైవల్యము, త్రివేణి, దుర్భిక్షము, పల్లెపదాలు, కళావాహిని, తీయనిత్రోవ, నైవేద్యము,అష్టావక్రుడు, పురందరదాసు, కుంతి, చెంచులక్ష్మి(నాటకం), శ్రీ వీరాంజనేయ శతకం, శ్రీకృష్ణశతకం, శ్రీ రామలింగేశ్వర శతకం, శ్రీ వేంకటేశ్వర శతకం అనే గ్రంథాల్ని రచించి ప్రచురించారు. అవధాన్య విద్యను గూర్చి వీరు రచించిన సిద్ధాంత గ్రంథాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ముద్రించారు. కొద్ది రోజుల్లో ఈ సిద్ధాంత గ్రంథం రెండో ముద్రణగా వెలువడబోతుండటాన్ని బట్టి ఈ గ్రంథం పాఠకాదరణకు నోచుకొన్న తీరు వెల్లడవుతున్నది.
సి.వి. సుబ్బన్న, శతావధాని శబ్దానికి సరైన సాక్ష్యం. వర్ణన, సమస్యాపూరణం, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, నిషేధాక్షరి మొదలైనా ఏ అంశాన్నయినా అలవోకగా నిర్వహించగలిగిన సరస్వతీ పుత్రుడు సుబ్బన్న. సంస్కృత సమాసభూయిష్టంగా పద్యాన్ని ఎలా పరుగెత్తించగలడో, తేట తెలుగు పదాలతో పద్యాన్ని అలాగే పరిమళింప జేయగలిగిన నైపుణీ విభాసితుడు సుబ్బన్న. వీరు మొదటి అవధానం ప్రొద్దుటూరులో 1950వ సంవత్సరంలో శివరాత్రి పర్వదినంనాడు చేశారు. చివరి అవధానం 1997లో ఫిబ్రవరి 25వ తేదీన పేరాలలో చేశారు. ఈ మధ్య కాలంలో అంటే 47 సంవత్సరాలపాటు వెయ్యికి పైగా అష్ట శతావధానాలు చేశారు. భారతదేశమంతా తిరిగి అవధాన ప్రతిభాసామర్థ్యాన్ని నిరూపించుకొన్నారు. స్వయంకృషితో ఎం.ఏ. తెలుగుచేసి, మైసూరు విశ్వవిద్యాలయంలో అవధాన విద్య మీద పరిశోధనచేసి డాక్టరేట్ పట్టాను పొందారు. షష్టిపూర్తి తర్వాత కూడా ధారణ తగ్గకుండా అవధానాలు చేసి అందరి మెప్పులు పొందిన శారదాసుతుడు సుబ్బన్న శతావధాని.
"వర్ణనా నిపుణ: కవి:" అని ఆర్యోక్తి. వర్ణనలు కవిత్వానికి ప్రాణం పోస్తాయి. జవ సత్త్వాల్ని కలిగిస్తాయి. సుబ్బన్న శతావధాని గారి వర్ణనా నిపుణత వారి రచనలన్నిటిలోను ప్రదర్శిత మవుతుంది. సుబ్బన్నగారు "త్రివేణిః " అనే ఖండకావ్యంలో పల్లెపదాలు, కళావాహిని, దుర్భిక్షము అనే శీర్షికలతో పద్యాలు రచించారు. రైతు జీవితాన్ని, పరిస్థితిని కళ్ళకు గడుతూ
హలమును మూలబెట్టి శివుడాః యని పంచన గూరుచున్ననిన్
గలమునఁ గ్రుచ్చి క్రుచ్చి యడుగన్ మన సొప్పదు, కోటిరూప్యముల్
గలిగిన కొండ మీది దొర కైనను నీవిడుజొన్నలే సుధా కళి
కలుబీ దేహిః యన్నపుడు కాదనరాదొక కంట జూడుమా
అనే పద్యాన్ని రచించారు. లోకంలో రైతు ప్రాధాన్యం ఎంతటిదో ఇక్కడ ప్రస్తావించారు. రైతు లేకపోతే ఈ లోకంలో ఎవరికీ కూడుండదని కవి భావం. దుర్భిక్షముః అనే ఖండికలో కవి సాలెతను వర్ణిస్తూ
మధుర సంసార సాగరమధనమందు
హాలహల మట్లు దారిద్య్ర మావహిల్ల
నడగఁ ద్రోచి దివ్యామృత మరసియొసఁగు
మోహినీ దేవి సాలెత ముగ్ధ భావః
అని చెప్పారు. రూపకంతో కూడిన ఉపమాలంకారాన్ని కూర్చి ముగ్ధ భావంతో కూడి మోహినీ దేవిగా ఉన్న సాలెతను వర్ణించిన తీరు కవి ప్రతిభను ప్రదర్శిస్తున్నది.
కవికి శాస్త్రజ్ఞతతో పాటు లోకజ్ఞత కూడా ఉండాలి. ఊహా శక్తిమాత్రమే కవిత్వానికి ప్రకాశాన్ని కలిగించదు. వాస్తవ స్థితిని కూడాకవి కవితా వస్తువుకు జోడిస్తే ఆ కవిత్వం సుమధుర భావ పరిమళాన్ని వ్యాపింప చేస్తుంది. ఊహాశక్తికి లోకజ్ఞత జతకూడితే ఎలా ఉంటుందో సుబ్బన్న శతావధాని గారి "పల్లెపదాలు" నిరూపిస్తాయి.
అల ప్రొద్దెక్కిన కోన క్రింద లలితంబై పూలజంపాలకో
సల జాల్వారు ఝరమ్ములో గులుకు మత్స్య భ్రూణముల్ నిల్చి నీళులు మ్రింగున్బీ
జలిదిన్ భుజించు పసివాడున్ నవ్వియన్నంపుంఁబె
ల్లలు రాల్పున్ బయిపైని త్రుళ్ళిపడు నుల్లాసమ్ము వీక్షించుచున్
కవి, పసివాడు అన్నపు పెళ్లలు రాల్చటంతో చేపపిల్లలు త్రుళ్ళి పడుతున్న భావ చిత్రాన్ని కవి పాఠకుల ముందు ప్రదర్శించారు. పల్లె జీవితం తెలిసిన కవి మాత్రమే ఇలాంటి భావన చెయ్యగలుగుతాడు.సుబ్బన్నగారిది సుస్పష్టమైన పాణినీయ ప్రయోగ పరిజ్ఞానము. ఆయనిది అవధాన ప్రదర్శనమాత్ర పర్యాప్తమైన ప్రతిభకాదు. తెలుగు కబ్బములు ఆయన వ్రాసినవి పేరు గడించు కొన్నవి యున్నవి.
వీరు మార్చి 5, 2017న హైదరాబాదులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచారు.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.