From Wikipedia, the free encyclopedia
భారత అమెరికా సంబంధాలు భారతదేశం, అమెరికా మధ్య అంతర్జాతీయ సంబంధాలను సూచిస్తుంది. స్వాతంత్ర్యానంతరం అధికారికంగా మొదలైన భారత అమెరికా సంబంధాల్లో అనేక మార్పుచేర్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. రిచర్డ్ నిక్సన్, ఇందిరా గాంధీల కాలంలో అత్యంత క్షీణ దశను, జార్జి డబ్ల్యూ బుష్, మన్మోహన్ సింగ్ ల కాలంలో ఎంతో స్నేహపూర్వక దశను చవి చూసాయి. కేవల ద్వైపాక్షిక విషయాలకే పరిమితంగా ఉండే ఈ సంబంధాలు, ద్వైపాక్షిక చర్చల్లో వివిధ అంతర్జాతీయ అంశాలను చర్చించే స్థాయికి ఎదిగాయి.[2]
భారత స్వాతంత్ర్య ఉద్యమంలోని ప్రముఖ నాయకులకు అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. 1947లో యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా ఇవి కొనసాగాయి. 1954లో, అమెరికా పాకిస్తాన్‌ను సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సెంటో) ఒప్పందంలో మిత్రదేశంగా చేర్చుకుంది. పాకిస్తాన్-అమెరికా సంబంధాలను ఎదుర్కోవటానికి భారతదేశం, సోవియట్ యూనియన్‌తో వ్యూహాత్మక సైనిక సంబంధాలను పెంపొందించుకుంది.[3] అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో ఏ శిబిరంలోనూ చేరకుండా ఉండటానికి 1961లో, భారతదేశం అలీనోద్యమంలో వ్యవస్థాపక సభ్యుడయింది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో నిక్సన్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడంతో, భారత అమెరికా సంబంధాలు క్షీణించాయి. 1991లో సోవియట్ యూనియన్ రద్దు అయ్యే వరకు ప్రతికూలంగానే ఉంటూ వచ్చాయి. 1990లలో, భారత్ తన విదేశాంగ విధానాన్ని ఏకథ్రువ ప్రపంచానికి అనుగుణంగా మలచుకుని అమెరికాతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంది.
ఇరవై ఒకటవ శతాబ్దంలో, భారతదేశం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వినియోగించుకుని తన సార్వభౌమ హక్కులను పరిరక్షించుకోడానికీ, బహుళ ధ్రువ ప్రపంచంలో జాతీయ ప్రయోజనాలను పెంపొందించుకోడానికీ ప్రయత్నించింది.[4][5][6] అధ్యక్షులు జార్జ్ డబ్ల్యు. బుష్, బరాక్ ఒబామా పరిపాలనలో, అమెరికా భారతదేశం ప్రధాన జాతీయ ప్రయోజనాలనూ అపరిష్కృతంగా ఉన్న సమస్యలనూ గుర్తించింది.[7]
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెరుగుదల, ప్రపంచ భద్రతా విషయాలపై సహకారం, గ్లోబల్ గవర్నెన్స్ (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి) విషయాలపై నిర్ణయం తీసుకోవడంలో భారతదేశాన్ని చేర్చడం, వాణిజ్య, పెట్టుబడి వేదికలలో (ప్రపంచ బ్యాంక్, IMF, APEC) ప్రాతినిధ్య స్థాయిని పెంచడం, ఎగుమతి నియంత్రణ విషయాల్లోకి (MTCR, వాస్సేనార్ అరేంజ్మెంట్, ఆస్ట్రేలియా గ్రూప్) ప్రవేశం, అణు సరఫరాదారుల సమూహంలో ప్రవేశానికి మద్దతు, సాంకేతిక భాగస్వామ్యంతో ఉమ్మడి-తయారీ కార్యక్రమం అభివృద్ధి మొదలైనవి భారత అమెరికా సంబంధాల్లో కీలకమైన మైలురాళ్ళుగా మారాయి.[8][9] 2016లో, లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ పై రెండు దేశాలు[10][11][12] సంతకం చేశాయి. భారతదేశాన్ని అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా ప్రకటించారు.[13]
ప్రకారం గాలప్ వార్షిక ప్రపంచ వ్యవహారాల సర్వే, భారతదేశం గ్రహించిన అమెరికన్లు ప్రపంచంలో తమకు ఇష్టమైన దేశాల్లో ఆరవ దేశంగా భారతదేశాన్ని భావించారు. భారత్‌కు అనుకూలంగా 2015లో 71% [14] 2017లో 74%, 2019లో 72% [15] మంది అమెరికన్లు భారతదేశం పట్ల అనుకూల అభిప్రాయంతో ఉన్నారు.[16]
2017వ సంవత్సరంలో, ద్వైపాక్షిక వాణిజ్యం (వస్తువులు, సేవలు రెండింటిలోనూ) 9.8% పెరిగి US $126.1 బిలియన్లకు చేరుకుంది. అమెరికాకు భారతదేశ ఎగుమతులు $76.7 బిలియన్ డాలర్లు కాగా, యుఎస్ఎ భారతదేశానికి ఎగుమతులు 49.4 బిలియన్ డాలర్లు [17][18]
బ్రిటిషు వలసపాలన రోజుల్లో భారతదేశానికీ అమెరికాకూ మధ్య సంబంధాలు పెద్దగా ఉండేవి కావు.[19] 1893లో జరిగిన ప్రపంచ ఉత్సవాల సందర్భంగా చికాగోలోని ప్రపంచ మతాల పార్లమెంటులో స్వామి వివేకానంద అమెరికాలో యోగా, వేదాంతాలను ప్రోత్సహించారు. మార్క్ ట్వైన్ 1896లో భారతదేశాన్ని సందర్శించాడు.[20] తన ఫాలోయింగ్ ది ఈక్వేటర్ పుస్తకంలో దాని పట్ల తనకున్న ఆకర్షణను, వికర్షణనూ వర్ణించాడు. తాను కలలు కన్న, మళ్ళీ చూడాలనుకుంటున్న ఏకైక విదేశీ భూమి భారతదేశమే అని చెప్పాడు.[21] ఇంగ్లీష్ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ ద్వారా అమెరికన్లు భారతదేశం గురించి మరింత తెలుసుకున్నారు.[22] 1950లలో మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్ ప్రవచించిన అహింసా తత్వంపై మహాత్మా గాంధీ ముఖ్యమైన ప్రభావాన్ని చూపాడు.
1930లలో 1940ల ప్రారంభంలో, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అమెరికా చాలా బలంగా మద్దతు ఇచ్చింది.[23][24] 1965కి ముందు భారతదేశం నుండి అమెరికాకు జరిగిన మొదటి ముఖ్యమైన వలసల్లో ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో సిక్కు రైతులు కాలిఫోర్నియాకు వెళ్లారు.[25]
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికన్ చైనా బర్మా ఇండియా థియేటర్ (సిబిఐ) లో భారతదేశం ప్రధాన స్థావరం కావడంతో మొత్తం మారిపోయింది. పదుల వేలల్లో అమెరికన్ సైనికులు వచ్చారు, అన్ని రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ డబ్బునూ తీసుకువచ్చారు; వారు 1945 లో వెనక్కి వెళ్ళిపోయారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలన్న అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ నేతృత్వంలోని అమెరికా డిమాండ్లపై తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఈ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ తీవ్రంగా తిరస్కరించారు. కొన్నేళ్లపాటు, రూజ్వెల్ట్ భారతదేశం నుండి బ్రిటిష్ విడిపోవడాన్ని ప్రోత్సహించాడు. వలసవాదం పట్ల వ్యతిరేకత, యుద్ధ ఫలితాల పట్ల ఆచరణాత్మక ఆందోళన, వలసరాజ్యానంతర కాలంలో అమెరికా పెద్ద పాత్ర ఆశించడం వగైరాలపై అమెరికా ఆలోచన ఆధారపడింది. ఏదేమైనా, 1942 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, బ్రిటిష్ అధికారులు వెంటనే పదివేల మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, చైనాకు సహాయం చేసే క్రమంలో అమెరికాకు భారతదేశమే స్థావరమయింది. రూజ్వెల్ట్ మరీ వత్తిడి పెడితే, రాజీనామా చేస్తానని చర్చిల్ బెదిరించాడు. దాంతో రూజ్వెల్ట్ వెనక్కి తగ్గాడు.[26][27]
ట్రూమన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం 1940 ల చివరలో భారతదేశానికి అనుకూలంగా మొగ్గు చూపింది. భారతదేశాన్ని పొరుగున ఉన్న పాకిస్తాన్ కంటే దౌత్యపరంగా విలువైనదిగా చాలా మంది అమెరికా మేధావులు చూడడమే దీనికి కారణం.[28] యితే, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో నెహ్రూ అవలంబించిన అలీన విధానం చాలా మంది అమెరికన్ పరిశీలకులకు ఇబ్బందికరంగా ఉండేది. భారతదేశ అలీన విధానాన్ని అమెరికా అధికారులు తమకు ప్రతికూలంగా గ్రహించారు. భారత తటస్థతను ఆమోదయోగ్యమైన స్థానంగా అమెరికా పరిగణించడం లేదని రాయబారి హెన్రీ ఎఫ్. గ్రేడీ అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో చెప్పాడు. గ్రేడీ "ఈ విషయంలోఊగిసలాట పనికిరాదని, భారతదేశం వెంటనే ప్రజాస్వామ్య పక్షాన చేరాలని" నెహ్రూకు తెలియజేశానని 1947 డిసెంబరులో అమెరికా విదేశాంగ శాఖకు చెప్పాడు.[29] 1948 లో, కాశ్మీర్ సంక్షోభాన్ని మూడవ పార్టీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోమని అమెరికా చేసిన సూచనలను నెహ్రూ తిరస్కరించాడు.
1949 లో నెహ్రూ చేసిన అమెరికా పర్యటన "ఒక దౌత్య విపత్తు". అది రెండు వైపులా చెడు భావాలను మిగిల్చింది.[30] నెహ్రూ, అతని అగ్ర సహాయకుడు వికే కృష్ణ మీనన్ భారతదేశం "అమెరికాతో కొంతవరకు పొత్తు పెట్టుకుని మన ఆర్థిక, సైనిక బలాన్ని పెంచుకోవాలి" అని భావించారు.[31] ట్రూమన్ ప్రభుత్వం భారత్‌కు చాలా అనుకూలంగా ఉంది, నెహ్రూ ఏది కోరినా ఇస్తామని సూచించింది. అతను గర్వంగా నిరాకరించాడు. తద్వారా ఒక మిలియన్ టన్నుల గోధుమను బహుమతిగా పొందే అవకాశాన్ని కోల్పోయాడు. అమెరికన్ విదేశాంగ కార్యదర్శి డీన్ అచేసన్ ప్రపంచంలో నెహ్రూ పోషించగలిగే పాత్రను గుర్తించాడు, కాని "నేను ఇప్పటివరకు వ్యవహరించిన అత్యంత కష్టతరమైన వ్యక్తులలో ఒకడు" అని అన్నాడు.[32] అమెరికా సందర్శనలో నెహ్రూ తన దేశం పట్ల విస్తృతమైన అవగాహనను మద్దతునూ సాధించ గలిగాడు. అతడూ అమెరికన్ దృక్పథం గురించి మరింత లోతైన అవగాహన సాధించాడు.[33]
చైనాలో కమ్యూనిస్టులు సాధించిన విజయాన్ని గుర్తించకూడదనే అమెరికా సలహాను భారత్ తిరస్కరించింది. కాని కొరియా యుద్ధంలో ఉత్తర కొరియా దూకుడును ఖండిస్తూ 1950 ఐక్యరాజ్యసమితి తీర్మానం విషయంలో భారత్ అమెరికాకు మద్దతు నిచ్చింది. ఆ యుద్ధాన్ని ముగించడానికి భారతదేశం మధ్యవర్తిగా వ్యవహరించడానికి ప్రయత్నించింది. అమెరికా, చైనాల మధ్య దౌత్య సందేశాలకు వాహికగా పనిచేసింది. ఈ యుద్ధంలో భారత దళాలు పాల్గొనకపోయినప్పటికీ, ఐరాసకు సహాయం చేయడానికి భారతదేశం 346 మంది ఆర్మీ వైద్యుల మెడికల్ కార్ప్స్‌ను పంపించింది.[34] ఇంతలో, పంటలు సరిగా పండక పోవడంతో భారతదేశం తన ఆహార భద్రత కోసం అమెరికా సహాయం కోరవలసి వచ్చింది. ఇది 1950 నుండి అమెరికా ఈ సహాయం చేసింది.[35] భారత స్వాతంత్ర్యం పొందాక మొదటి డజను సంవత్సరాలలో (1947–59), అమెరికా 1.7 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది; 931 మిలియన్ డాలర్ల ఆహారంతో సహా. ద్రవ్య పరంగా సోవియట్ యూనియన్ చేసిన సాయం ఇందులో సగముంటుంది. అయితే మౌలిక సదుపాయాల సహాయం, మృదువైన రుణాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ఆర్థిక ప్రణాళిక, ఉక్కు మిల్లులు, మెషీన్ బిల్డింగ్, జలవిద్యుత్ శక్తి, ఇతర భారీ పరిశ్రమలు- ముఖ్యంగా అణుశక్తి, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లోని సాంకేతిక నైపుణ్యాల రూపంలో సోవియట్ యూనియన్ చేసిన సాయం ఎన్నో రెట్లు ఉంటుంది. .[36] 1961 లో, US 1.3 బిలియన్ డాలర్ల ఉచిత ఆహారంతో పాటు, అభివృద్ధి రుణాల రూపంలో 1 బిలియన్ డాలర్లు వాగ్దానం చేసింది.[37]
1959 లో, డ్వైట్ డి. ఐసెన్‌హోవర్ ఇరు దేశాల మధ్య అస్థిరంగా ఉన్న సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడయ్యాడు. అతను భారత్‌కు చాలా మద్దతుగా ఉన్నాడు. న్యూయార్క్ టైమ్స్ ఇలా వ్యాఖ్యానించింది, "వాస్తవానికి నెహ్రూ కోరితే చేసారా లేక చైనా కమ్యూనిస్ట్ దురాక్రమణను ఎదుర్కోవటానికి భారతదేశానికి సహాయం చేస్తుందనే హామీ ఇచ్చేశారా అనేది పట్టించుకోదగ్గ విషయంగా అనిపించలేదు. భారతీయ-అమెరికన్ స్నేహానికి అటువంటి హామీ అవసరం లేని స్థాయికి బలోపేతం చెయ్యడ్ం గమనించదగ్గ విషయం. " [38]
జాన్ ఎఫ్. కెన్నెడీ ప్రెసిడెన్సీ (1961-63) సమయంలో భారతదేశాన్ని ఒక వ్యూహాత్మక భాగస్వామిగా, కమ్యూనిస్ట్ చైనా పెరుగుదలకు ప్రతిఘాతంగా పరిగణించారు. కెన్నెడీ ఇలా అన్నాడు:
చైనా కమ్యూనిస్టులు గత పదేళ్ళుగా పురోభివృద్ధి చెందుతున్నారు. భారత్ కొంతమేరకు అభివృద్ధి సాధిస్తోంది. కానీ భారత్ తన 45 కోట్ల జనాభాతో విజయం సాధించలేకపోతే, స్వాతంత్ర్య ఫలాలను పొందలేకపోతే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా అభివృద్ధి చెందని దేశాల ప్రజలు, తాము అభివృద్ధి చెందాలంటే ఎకైక మార్గం కమ్యూనిజమే అని భావిస్తారు.
కెన్నెడీ ప్రభుత్వం 1962 భారత చైనా యుద్ధంలో భారతదేశానికి బహిరంగంగా మద్దతు ఇచ్చింది. చైనా చర్యను "భారతదేశానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు చైనా దురాక్రమణ"గా పరిగణించింది.[39][40] అమెరికా వైమానిక దళం భారత దళాలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వస్త్ర సామాగ్రిని అందించింది. అమెరికా నావికాదళం భారతదేశాన్ని రక్షించడానికి పసిఫిక్ మహాసముద్రం నుండి యుఎస్ఎస్ కిట్టి హాక్ విమాన వాహక నౌకను కూడా పంపింది. అయితే ఇది బంగాళాఖాతాన్ని చేరుకోవడానికి ముందే దానిని వెనక్కి పిలిపించింది.[41][42] 1963 మే జాతీయ భద్రతా మండలి సమావేశంలో, భారతదేశంపై చైనా మరో సారి దాడి చేస్తే అమలు చేయగల ఆకస్మిక ప్రణాళిక గురించి అమెరికా చర్చించింది. అటువంటి పరిస్థితిలో అమెరికన్లు జోక్యం అంటూ చేసుకోవాల్సి వస్తే, అణ్వాయుధాలను ఉపయోగించాలని రక్షణ కార్యదర్శి రాబర్ట్ మెక్‌నమారా, జనరల్ మాక్స్వెల్ టేలర్ లు అధ్యక్షుడికి సూచించారు. కెన్నెడీ, మనం ఏ మిత్రదేశానికైనా ఎలా అండగా ఉంటామో, భారత్‌కూ అలాగే అండగా ఉంటాం అన్నాడు. "మనం భారతదేశానికి రక్షణగా ఉండాలి కాబట్టి, రక్షణగా ఉండితీరతాం." [43][44] భారతదేశానికి కెన్నెడీ రాయబారి ప్రఖ్యాత ఉదార ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాల్‌బ్రైత్, ఆయన భారతదేశానికి ఆప్తుడిగా ఉండేవాడు.[45] భారతదేశంలో ఉన్నప్పుడు, గాల్‌బ్రైత్ కాన్పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ విభాగాన్ని స్థాపించడానికి సహాయం చేశాడు. ఆర్థికవేత్తగా, అతను (ఆ సమయంలో) అతిపెద్ద US విదేశీ సహాయ కార్యక్రమానికి అధ్యక్షత వహించాడు.
1963 లో కెన్నెడీ హత్య తరువాత, ఇండో-యుఎస్ సంబంధాలు క్రమంగా క్షీణించాయి. కెన్నెడీ వారసుడు లిండన్ బి. జాన్సన్ కమ్యూనిస్ట్ చైనాను ఎదుర్కోవటానికి భారత్‌తో సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే,[46] చైనాతో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలన్న ఆశతోటి, పెరుగుతున్న భారతదేశం సైనిక శక్తిని బలహీనపరిచే ఉద్దేశం తోటీ పాకిస్తాన్‌తో సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించాడు.[46] 1970 ల ప్రారంభంలో నిక్సన్ పరిపాలన సమయంలో ఇరుదేశాల సంబంధాలు ఎప్పుడూ లేనంత కనిష్టానికి చేరుకున్నాయి. రిచర్డ్ నిక్సన్ తన పూర్వ అధ్యక్షులు ఇండో-పాకిస్తాన్ శత్రుత్వాల విషయంలో తీసుకున్న తటస్థ వైఖరిని పక్కన పెట్టాడు. ఆ సమయంలో ఇందిరా గాంధీ నాయకత్వంలో ఉన్న భారతదేశం సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపినట్లుగా ఉండడంతో, అతను పాకిస్తాన్‌తో చాలా సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. సైనికపరంగా ఆర్ధికంగా సహాయం చేశాడు. భారత ఉపఖండంలో సోవియట్ ప్రభావాన్ని ఎదుర్కోవటానికీ, చైనాతో సంబంధాలు ఏర్పరచుకోవడానికీ (చైనాతో పాకిస్తాన్ చాలా దగ్గరగా ఉండేది కాబట్టి) పాకిస్తాన్ చాలా ముఖ్యమైన మిత్రదేశంగా ఆయన భావించాడు.[47] నిక్సన్, ఇందిరల మధ్య వ్యక్తిగత సంబంధాల్లో సౌహార్దం లేకపోవడం ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడానికి మరింత దోహదపడింది.[48] 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో, అమెరికా బహిరంగంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది. యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ను బంగాళాఖాతంలో మోహరించింది. పశ్చిమ పాకిస్తాన్ దళాలకు మద్దతుగా యుఎస్ బల ప్రదర్శనగా భావించారు. తరువాత 1974 లో, భారతదేశం తన మొదటి అణు పరీక్ష, స్మైలింగ్ బుద్ధను నిర్వహించింది. దీనిని అమెరికా వ్యతిరేకించింది. అయితే ఈ పరీక్ష ఎటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని తేల్చి చెప్పింది. జూన్ 1974 లో తారాపూర్ రియాక్టర్ కోసం శుద్ధి చేసిన యురేనియం సరఫరాను కొనసాగించింది.[49][50]
1970 ల చివరలో, జనతా పార్టీ నాయకుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాక, భారతదేశం జిమ్మీ కార్టర్ నేతృత్వంలోని అమెరికాతో సంబంధాలను మెరుగుపరిచింది. భారతదేశ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక రికార్డు సరిగా లేదనే కారణంతో, భారతదేశానికి అణు పదార్థాలను ఎగుమతులను నిషేధించే ఉత్తర్వుపై 1978 లో కార్టర్ సంతకం చేసినప్పటికీ, సంబంధాల మెరుగుదలకు అడ్డంకి కలగలేదు.[51]
1980 లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడ్డాయి. అయితే, ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దండయాత్ర, ఆక్రమణ విషయంలో అమెరికా పాత్రకు భారత్ మద్దతు ఇవ్వనప్పటికీ అది సంబంధాల మెరుగుదలకు అడ్డంకి కాలేదు. అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారతదేశానికి పరిమిత సహాయం అందించింది. ఎఫ్ -5 విమానం, సూపర్ కంప్యూటర్లు, నైట్ విజన్ గాగుల్స్, రాడార్లతో సహా పలు రకాల రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయడానికి భారత్ వాషింగ్టన్‌ను కదిలించింది. భారతదేశానికి తేలికపాటి యుద్ధ విమానాల కోసం ఇంజన్లు ప్రోటోటైపులూ, నావికా దళాల ఫ్రిగేట్ల కోసం గ్యాస్ టర్బైన్లు వగైరా సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేయడానికి 1984 లో వాషింగ్టన్ ఆమోదించింది. 1980 ల చివరలో తమిళనాడులోని తిరునెల్వేలి వద్ద కొత్త విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ రూపకల్పనలోను, నిర్మాణం లోనూ యుఎస్ కంపెనీ కాంటినెంటల్ ఎలక్ట్రానిక్స్ పాల్గొంది.[52] అయితే, ఇరు దేశాలు సంబంధాలను మెరుగుపర్చడానికి 1990 ల చివరికి గానీ గణనీయమైన ప్రయత్నం చేయలేదు.[53]
అటల్ బిహారీ వాజ్‌పేయి భారత ప్రధాని అయిన వెంటనే భారత్, పోఖ్రాన్లో అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షను అమెరికా తీవ్రంగా ఖండించింది, ఆంక్షలు విధించింది. పరీక్షలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశంపై ఆర్థిక ఆంక్షలు విధించాడు. అన్ని సైనిక ఆర్థిక సహాయాలను తగ్గించడం, అమెరికన్ బ్యాంకులు ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ కంపెనీలకు రుణాలు స్తంభింపచేయడం, ఆహార కొనుగోలు మినహా భారత ప్రభుత్వానికి ఇచ్చే రుణాలన్నిటినీ నిషేధించడం, అమెరికన్ ఏరోస్పేస్ టెక్నాలజీ, యురేనియం ఎగుమతులను నిషేధించడం, అంతర్జాతీయ రుణ సంస్థలకు భారతదేశం చేసిన అన్ని రుణ అభ్యర్థనలను వ్యతిరేకించడం వంటి అనేక చర్యలు తీసుకుంది.[54] అయితే, ఈ ఆంక్షలు నిరర్థకమైనవని ఋజువైంది - భారతదేశ ఆర్థిక పెరుగుదల చాలా బలంగా సాగుతోంది. అమెరికాతో వాణిజ్యం భారత జిడిపిలో కొద్ది భాగం మాత్రమే. ప్రత్యక్ష ఆంక్షలు విధించడంలో జపాన్ మాత్రమే అమెరికతో కలిసింది. ఇతర దేశాలు భారత్‌తో వ్యాపారం కొనసాగించాయి. అమెరికా త్వరలోనే ఆంక్షలు ఎత్తివేసింది. తరువాత, క్లింటన్, వాజ్‌పేయి సంబంధాలను పునర్నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు.
21 వ శతాబ్దంలో అమెరికా విదేశాంగ విధాన ప్రయోజనాలకు భారతదేశం చాలా ముఖ్యంగా మారింది. భారతదేశం, ఈ ప్రాంతంలోని ఆధిపత్య వర్గాల్లో ఒకటి. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది పౌరులకు నివాసం. నూతన గొప్ప శక్తిగా, అమెరికాకు "అనివార్య భాగస్వామి" గా చాలా తరచుగా చెబుతూంటారు. పెరుగుతున్న చైనా పట్టుకు ప్రతిరోధకంగా భారత్‌ను చాలా మంది విశ్లేషకులు భావించారు.
మార్చి 2000 లో, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశాన్ని సందర్శించి, ప్రధానమంత్రి వాజ్‌పేయితో ద్వైపాక్షిక, ఆర్థిక చర్చలు జరిపారు. పర్యటన సందర్భంగా, ఇండో-యుఎస్ సైన్స్ & టెక్నాలజీ ఫోరం స్థాపించారు.[55]
బుష్ అడ్మినిస్ట్రేషన్‌తో దౌత్య సంబంధాలను మెరుగు పరచుకునే సమయంలో, భారతదేశం తన అణ్వాయుధ అభివృద్ధిపై అంతర్జాతీయ పర్యవేక్షణను అనుమతించడానికి అంగీకరించింది. అయితే ప్రస్తుత తన అణ్వాయుధ సామగ్రిని వదులుకోవడానికి నిరాకరించింది.[56] 2004 లో, పాకిస్తాన్‌కు మేజర్ నాన్-నాటో అల్లై (ఎంఎన్ఎన్ఎ) హోదా ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా ఎంఎన్ఎన్ఏ వ్యూహాత్మక పని సంబంధాన్ని భారత్‌కూ ఇవ్వజూపగా భారతదేశ<ం దాన్ని తిరస్కరించింది.[57][58]
2001 లో అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల తరువాత, సూయజ్ కాలువ నుండి సింగపూర్ వరకు వ్యూహాత్మకంగా కీలకమైన హిందూ మహాసముద్ర సముద్రపు దారులను నియంత్రించడంలో, పోలీసింగ్ చేయడంలో అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు. బుష్ భారతదేశంతో కలిసి పనిచేశాడు.
జార్జ్ డబ్ల్యు. బుష్ పరిపాలనలో, భారత అమెరికా సంబంధాలు వికసించాయి. ప్రధానంగా పెరుగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై .[59] జార్జ్ డబ్ల్యు. బుష్ వ్యాఖ్యానిస్తూ, "భారతదేశం ప్రజాస్వామ్యానికి గొప్ప ఉదాహరణ. ప్రజాస్వామ్యం పట్ల చాలా గౌరవం ఉంది. విభిన్న మతాలున్నాయి, కాని ప్రతి ఒక్కరూ తమ మతం పట్ల సౌర్యంగానే ఉంటారు. ప్రపంచానికి భారతదేశం అవసరం ".[60] ఫరీద్ జకారియా తన పోస్ట్-అమెరికన్ వరల్డ్ అనే పుస్తకంలో జార్జ్ డబ్ల్యు. బుష్‌ను "అమెరికన్ చరిత్రలో అత్యంత భారతీయ అనుకూల అధ్యక్షుడు" అని అభివర్ణించాడు.[61] యుపిఎ లో అతిపెద్ద భాగమైన కాంగ్రెస్ పార్టీ యొక్క విదేశాంగ విధాన సిద్ధాంతకర్త రెజౌల్ కరీం లాస్కర్ కూడా ఇలాంటి భావాలనే వెలిబుచ్చాడు.లాస్కర్ ప్రకారం, యుపిఎ పాలనలో "అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలలో సమూల పరివర్తన" జరిగింది. దీని ఫలితంగా "అధిక సాంకేతికత, అంతరిక్షం, విద్య, వ్యవసాయం, వాణిజ్యం, స్వచ్ఛమైన శక్తి, తీవ్రవాద నిరోధకతతో సహా అనేక రకాల సమస్యలు ఈ సంబంధాలలో భాగమయ్యాయి".[62]
డిసెంబర్ 2004 సునామీ తరువాత, యుఎస్ భారత నావికాదళాలు శోధన సహాయక చర్యలలోను, ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణంలోనూ పరస్పరం సహకరించుకున్నాయి.
2004 నుండి, వాషింగ్టన్, న్యూ ఢిల్లీలు భాగస్వామ్య విలువల పైన, సాధారనంగా ఒకేలా ఉండే భౌగోళిక రాజకీయ ప్రయోజనాల పైనా ఆధారపడిన "వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని" అనుసరిస్తున్నాయి. అనేక ఆర్థిక, భద్రత, పౌర అణు కార్యక్రమంలో సహకారం కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. మొదటగా 2005 లో ప్రారంభించిన పౌర అణు కార్యక్రమంలో సహకారం, మూడు దశాబ్దాల అమెరికన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానాన్ని రివర్సు చేసింది. 2005 లో, ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని విస్తరించే లక్ష్యంతో అమెరికా, భారతదేశం పదేళ్ల రక్షణ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇరు దేశాలు మున్నెన్నడూ లేని, అనేక సంయుక్త సైనిక విన్యాసాలు జరిపాయి. భారతదేశానికి ప్రధాన యుఎస్ ఆయుధ అమ్మకాల ఒప్పందాలు జరిగాయి. ఏప్రిల్ 2005 లో ఓపెన్ స్కైస్ ఒప్పందం కుదిరడంతో విమానాల ద్వారా వాణిజ్యం, పర్యాటకం వ్యాపారం మెరుగుపడ్డాయి. ఎయిర్ ఇండియా 8 బిలియన్ డాలర్ల వ్యయంతో 68 యుఎస్ బోయింగ్ విమానాలను కొనుగోలు చేసింది.[63] అమెరికా, భారతదేశం 2005 లో సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంపై ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశాయి.[64] కత్రినా హరికేన్ తరువాత, భారతదేశం అమెరికన్ రెడ్‌క్రాస్‌కు 5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. సహాయానికి రెండు విమానాల సహాయక సామగ్రిని పంపింది.[65] 1 మార్చి 2006 న, అధ్యక్షుడు బుష్ భారతదేశం యుఎస్ మధ్య సంబంధాలను మరింత విస్తరించడానికి మరొక దౌత్య పర్యటన చేశారు [66]
అన్ని ద్వైపాక్షిక వాణిజ్యం యొక్క విలువ 2004 నుండి 2008 వరకు మూడు రెట్లు పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది. రెండూ దిశల్లోనూ కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి.[67]
పెద్ద భారతీయ-అమెరికన్ సమాజం యొక్క ప్రభావం, అమెరికా కాంగ్రెస్‌లోని అతిపెద్ద దేశ-సంబంధ కాకస్ రూపంలో కనిపిస్తుంది. 2009–2010 మధ్యకాలంలో 1,00,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికన్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు హాజరయ్యారు.[68]
నవంబర్ 2010 లో, అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశాన్ని సందర్శించి, భారత పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాడు.[69] ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సీటు కోసం భారతదేశం చేసిన ప్రయత్నాన్ని ఆయన సమర్థించాడు.[70]
2004 - 2014 మధ్య పాశ్చాత్య థింక్-ట్యాంకులు, ముఖ్యంగా యుఎస్ యుకెలలో ఉన్నవారు, పెరుగుతున్న మధ్యతరగతి యొక్క ఎన్నికల ఓటింగ్ విధానాలను ఊహించడంలోను, ప్రాథమిక విద్య, పత్రికా స్వేచ్ఛ యొక్క మెరుగుదలల ద్వారా భారతదేశంలో రాజకీయ మార్పుల స్థాయిని ఊహించడంలోనూ విఫలమయ్యాయి. వుడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్లోని దక్షిణ, ఆగ్నేయాసియాల నిపుణుడు మైఖేల్ కుగెల్మన్ ప్రకారం, "భారతదేశంలో వస్తున్న పరివర్తనల వేగాన్ని అందుకోలేక పోవడం" కారణంగా భారతదేశంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవటానికి అమెరికా సిద్ధంగా లేదు.[71]
మార్చి 2009 లో, భారతదేశానికి $ 2.1 బిలియన్ల విలువైన ఎనిమిది పి -8 పోసిడాన్లను అమ్మడానికి ఒబామా ప్రభుత్వం సంతకం చేసింది.[72] ఇది, ఒబామా నవంబర్ 2010 పర్యటన సందర్భంగా ప్రకటించిన $ 5 బిలియన్ల బోయింగ్ సి -17 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్ 414 ఇంజిన్లను అందించే ఒప్పందంతో కలిపి, భారతదేశపు సైనిక సరఫరాదారులలో అమెరికా మూడవదైంది (ఇజ్రాయెల్ రష్యా తరువాత).[73] ఈ వ్యవస్థలను దాడి కోసం వాడకూదనే కాంట్రాక్ట్ నిబంధనల పట్ల భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు.[74] ఇప్పటికే భారత్‌కు పంపిణీ చేసిన బోయింగ్ పి -8 ఐ పనితీరుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి భారత్ ప్రయత్నిస్తోంది.[75][76]
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మైక్ ముల్లెన్ భారతదేశం, అమెరికా మధ్య బలమైన సైనిక సంబంధాలను ప్రోత్సహించాడు. "భారతదేశం [యుఎస్ యొక్క] ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా ఉద్భవించింది" అని అన్నారు.[77] యుఎస్ స్టేట్ అండర్ సెక్రటరీ విలియం జోసెఫ్ బర్న్స్ కూడా ఇలా అన్నారు, "భారతదేశం, అమెరికా ఒకదానికొకటి ఇంత ముఖ్యమైనవిగా మునుపెన్నడూ లేవు." [78] ఆగస్టు 1, 2012 న న్యూయార్క్‌లోని ఆసియా సొసైటీలో ప్రసంగించిన అమెరికా రక్షణ శాఖ సహాయ కార్యదర్శి అష్టన్ కార్టర్, ఇరు దేశాల ప్రభావం పరంగా భారతదేశం-యుఎస్ సంబంధానికి ప్రపంచ పరిధి ఉందని అన్నారు. ఇరు దేశాలు తమ రక్షణ, పరిశోధనా సంస్థల మధ్య సంబంధాలను బలపరుచు కుంటున్నాయని ఆయన అన్నాడు.[79]
న్యూయార్క్ నగరంలోని భారత యుఎన్ మిషన్, వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయాలపై గూఢచర్యం జరుపుతున్నట్లు వెల్లడైన విషయాలపై అమెరికా స్పందించాలని 2013 జూలై నవంబర్లలో భారతదేశం డిమాండ్ చేసింది.[80]
2 జూలై 2014 న, జాతీయ భద్రతా సంస్థ భారతదేశంలోని ప్రైవేట్ వ్యక్తులు రాజకీయ సంస్థలపై నిఘా పెట్టిందనే ఆరోపణలపై చర్చించడానికి అమెరికా దౌత్యవేత్తలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించింది.[81][82] ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేసి, వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన 2010 పత్రం, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా) పై నిఘా పెట్టడానికి అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఆదేశాలున్నాయని వెల్లడించింది.[83][84]
పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఎన్జీఓలలోని విదేశీ సహాయక కార్మికులను, సిబ్బందినీ నాన్-అఫీషియల్ కవర్‌గా ఉపయోగించుకున్నాయని వికీలీక్స్ వెల్లడించింది. దీనితో, ఉపగ్రహ ఫోన్ల పర్యవేక్షణ, సున్నితమైన స్థానాల చుట్టుపక్కల ఉన్న మానవతా సహాయ సంస్థలు, అభివృద్ధి సహాయ సంస్థల కోసం పనిచేసే సిబ్బంది కదలికలను పరిశీలించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది.[85][86]
కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్ పట్ల ఒబామా విధానం, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పట్ల వ్యవహరించిన విధానాల కారణంగా భారత్-యుఎస్ సంబంధాలు దెబ్బతిన్నాయి.[87][88] కాశ్మీర్ వివాదాన్ని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో అస్థిరతతో అనుసంధానించినందుకు ఒబామా ప్రభుత్వాన్ని భారత జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ విమర్శించాడు. అలా చేయడం ద్వారా అధ్యక్షుడు ఒబామా "వృథా ప్రయాస పడుతున్నాడు" అని అన్నాడు.[89] ఫిబ్రవరి 2009 లో ఫారిన్ పాలసీ పత్రిక దక్షిణ ఆసియాలో ఒబామా విధానాన్ని విమర్శించింది. దక్షిణ ఆసియాలో "భారతదేశం సమస్యలో భాగం కాదు, పరిష్కారంలో భాగం కావాలి" అని అన్నాడు. ఒబామా ప్రభుత్వ వైఖరితో సంబంధం లేకుండా, ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భారతదేశం మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా ఆ పత్రిక సూచించింది.[90] రెండు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్నట్లు స్పష్టమైన సూచనగా, ఫిబ్రవరి 2009 చివరిలో ఆఫ్ఘనిస్తాన్పై జరిగే సమావేశానికి హాజరుకావాలన్న అమెరికా ఆహ్వానాన్ని అంగీకరించకూడదని భారత్ నిర్ణయించింది.[91] 2008 ముంబై దాడుల తరువాత, భారతదేశంలో ప్రజల మానసిక స్థితి ఉగ్రవాద దాడి వెనుక ఉన్న నిందితులపై చర్యలు తీసుకునేలా పాకిస్థాన్‌పై మరింత దూకుడుగా ఒత్తిడి తేవాలని ఉందని, ఇది మే 2009 లో జరగబోయే భారత సార్వత్రిక ఎన్నికలపై ప్రతిబింబిస్తుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. పర్యవసానంగా, ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశపు కఠినమైన వైఖరితో విభేదించే స్థానంలో ఉంటుంది.[92]
ఇరాన్, రష్యాలతో భారతదేశపు స్నేహపూర్వక సంబంధాల నుండి శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్, బంగ్లాదేశ్‌కు సంబంధించిన విదేశాంగ విధాన విబేధాల వరకు భారత, యుఎస్ ప్రభుత్వాలు వివిధ ప్రాంతీయ సమస్యలపై విభేదించాయి.
అమెరికా అఫ్‌పాక్ విధానానికి సంబంధించి భారత్‌తో విభేదాలు తలెత్తాయనే అందోళనను దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి రాబర్ట్ బ్లేక్ కొట్టిపారేశాడు. భారతదేశం అమెరికా లు "సహజ మిత్రదేశాలు" అని చెబుతూ,[93] "భారతదేశంతో మైత్రిని పణంగా పెట్టి" పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లలో వ్యూహాత్మక ప్రాధాన్యతలను తీర్చడం అమెరికా చెయ్యజాలదని అతడు అన్నాడు [94]
హెచ్ -1 బి (తాత్కాలిక) వీసాలను పరిమితం చేయాలన్న ఒబామా అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని భారత్ విమర్శించింది. అప్పటి భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ (తరువాత, 2017 వరకు భారత రాష్ట్రపతి) అమెరికా "రక్షణాత్మక వాదాన్ని" తమ దేశం వ్యతిరేకిస్తుందని వివిధ అంతర్జాతీయ వేదికలపై చెప్పారు.[95] ఒబామా అవుట్ సోర్సింగ్ విధానాలకు వ్యతిరేకంగా భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ అంశాన్ని లేవనెత్తుతుందని భారత వాణిజ్య మంత్రి కమల్ నాథ్ అన్నారు.[96] ఏదేమైనా, కెపిఎంజి యొక్క ఔట్సోర్సింగ్ సలహా అధిపతి మాట్లాడుతూ, భారతదేశం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఒబామా ప్రకటనలు "ఉత్పాదక సంస్థలు చేస్తున్న అవుట్సోర్సింగ్కు వ్యతిరేకంగానే నని" అంతేగానీ ఐటి- సంబంధిత సేవల అవుట్సోర్సింగ్కు వ్యతిరేకంగా కాదనీ అన్నాడు.[97]
డిసెంబర్ 2013 లో, న్యూయార్క్‌లోని భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయాని ఖోబ్రగడే ఆమె ఇంటి పనిమనిషికి తప్పుడు వర్క్ వీసా పత్రాలను సమర్పించారని రెస్టు చేసారు. ఇంటి పనిమనిషికి " కనీస చట్టపరమైన వేతనం కంటే చాలా తక్కువ" చెల్లించారని యుఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.[98] ఈ సంఘటనపై భారత ప్రభుత్వం నిరసనతెలిపింది. భారతదేశం-అమెరికా సంబంధాలలో చీలికకు ఈ సంఘటన కారణమైంది; ఖోబ్రగడే స్ట్రిప్-సెర్చ్ (యుఎస్ మార్షల్స్ సర్వీస్ అరెస్టు చేసే వ్యక్తులందరికీ ఒక సాధారణ పద్ధతి) పైన, సాధారణ ఖైదీలతో పాటు ఉంచడం పట్లా భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.[98] ఉదాహరణకు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఖోబ్రగడే పట్ల వ్యవహరించిన తీరు గర్హనీయమని అన్నారు.[99]
ఆమెకు చేసిన "అవమానం" పై అమెరికా క్షమాపణ చెప్పాలని, ఆరోపణలను విరమించుకోవాలనీ భారతదేశం డిమాండ్ చేసింది. దీనిని అమెరికా నిరాకరించింది.[100] భారత కాన్సులర్ సిబ్బంది, భారతదేశంలోని అమెరికా కాన్సులర్ సిబ్బంది, వారి కుటుంబాల ఐడి కార్డులు ఇతర సౌకర్యాలను ఉపసంహరించి, న్యూ ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ ముందు భద్రతా అడ్డంకులను తొలగించి, తమ కాన్సులర్ అధికారిపై అమెరికా చేసిన దుర్నీతికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.[101]
న్యూ ఢిల్లీలోని అమెరికన్ కమ్యూనిటీ సపోర్ట్ అసోసియేషన్ (ఎసిఎస్ఎ) క్లబ్, అమెరికన్ ఎంబసీ క్లబ్‌లను దౌత్యవేత్తలు కానివారు ఉపయోగించకుండా భారత ప్రభుత్వం నిరోధించింది, ఈ సామాజిక క్లబ్‌లను 16 జనవరి 2014 నాటికి దౌత్యేతర సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది.[102] ఎసిఎస్ఎ క్లబ్ ఎంబసీ ప్రాంగణంలో బార్, బౌలింగ్ అల్లే, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, వీడియో-రెంటల్స్ క్లబ్, ఇండోర్ జిమ్, బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది.[103][104][105] ఆహారం, మద్యం, ఇతర దేశీయ వస్తువులను దిగుమతి చేసుకోవడానికి అమెరికా దౌత్యవేత్తలు, కాన్సులర్ అధికారులకు ఇచ్చిన పన్ను రహిత దిగుమతి అనుమతులు తక్షణమే వెనక్కి తీసుకుంది. యుఎస్ రాయబార కార్యాలయ వాహనాలు, సిబ్బంది ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానా నుండి తప్పించుకోలేరు. అమెరికన్ దౌత్యవేత్తలు తమ గృహాలలో పనిచేసే అన్ని దేశీయ సహాయకుల (కుక్స్, తోటమాలి, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది) పని ఒప్పందాలను చూపించమని కోరారు.[106] అమెరికన్ ఎంబసీ పాఠశాలపై కూడా భారత అధికారులు దర్యాప్తు జరిపారు .[107][108][109]
ఖోబ్రగడే అరెస్టు సమయంలో ఆమెకు కన్సులర్ ఇమ్యూనిటీ మాత్రమే ఉంది. (ఇది అధికారిక విధులకు సంబంధించి చేసిన చర్యలకు మాత్రమే ఇమ్యూనిటీ ఇస్తుంది) మరింత విస్తృతమైన డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ కాదు. అందుచేతనే ఆమెపై ప్రాసిక్యూషన్ మొదలైంది.[98][110] ఆమె అరెస్టు తరువాత, భారత ప్రభుత్వం ఖోబ్రగడేను ఐక్యరాజ్యసమితి లోని భారత కార్యాలయానికి తరలించి, ఆమె స్థాయిని పెంచింది. అత్ద్వారాఅ ఆమెకు డిప్లొమాటిక్ఆ ఇమ్యూనిటీ లభించింది. పర్యవసానంగా, ఖోబ్రగడేపై ఫెడరల్ నేరారోపణలు మార్చి 2014 లో కొట్టివేసారు.[111] తరువాత ఖోబ్రగడేపై కొత్త నేరారోపణలు దాఖలు చేసారు గానీ, అప్పటికే ఆమె దేశం విడిచి వెళ్లిపోయింది.[112] (వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నంలో, అమెరికా విదేశాంగ శాఖే ఆమెను దేశం విడిచి వెళ్ళమని చెప్పింది).[113]
ఈ సంఘటన తరువాత భారతదేశంలోని అమెరికా రాయబారి నాన్సీ జె. పావెల్ రాజీనామా చేశారు. దీనిని భారతదేశం "ఈ గొడవకు పర్యవసానం"గా చూసింది.[113] కొంతమంది వ్యాఖ్యాతలు ఈ సంఘటన, దాని ప్రతిస్పందన వలన యుఎస్-ఇండియా సంబంధాలలో విస్తృత నష్టానికి దారితీస్తుందని సూచించారు.[114][115] మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా అమెరికా దౌత్యవేత్తల్లో ఉన్న స్వలింగ సహచరులను అరెస్టు చేయాలన్నాడు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 ను సుప్రీంకోర్టు సమర్థించడాన్ని ఉటంకిస్తూ భారతదేశంలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం కాబట్టి ఇలా చెయ్యాలని అతడు పిలుపు నిచ్చాడు [116][117] మాజీ విదేశాంగ న్యాయ సలహాదారు జాన్ బెల్లింగర్ ఖోబ్రాగడేను అరెస్టు చేసి నిర్బంధించే నిర్ణయం వియన్నా కాన్సులర్ రిలేషన్స్ కన్వెన్షన్ కింద "సాంకేతికంగా అనుమతించబడినా, అరెస్టు చెయ్యడం తెలివైన పనేనా" అని ప్రశ్నించాడు. 2001 నుండి భారతదేశ మాజీ అమెరికా రాయబారి రాబర్ట్ డి. బ్లాక్విల్ 2003 వరకు, ఈ సంఘటన "తెలివితక్కువదని" అన్నాడు.[118][119] అయితే, ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరంలోనే, యుఎస్ అధ్యక్షుడు ఒబామా జనవరి 2015 లో భారతదేశాన్ని సందర్శించినందున, యుఎస్-ఇండియా సంబంధాలు మళ్లీ గాట్లో పడ్డాయి.[113]
ప్రస్తుతం, భారత అమెరికాల మధ్య విస్తృతమైన, విస్తరిస్తున్న సాంస్కృతిక, వ్యూహాత్మక, సైనిక, ఆర్థిక సంబంధాలున్నాయి.[120][121][122][123][124] ఇవి విశ్వాస నిర్మాణ చర్యలను (సిబిఎం) అమలు చేసే దశలో ఉంది. అమెరికా అవలంబించిన వైరుధ్య విదేశాంగ విధానాల కారణంగాను,[125][126][127][128] పలు సందర్భాల్లో జరిగిన సాంకేతిక సహాయాల తిరస్కరణల కారణం గానూ [129][130][131][132][133] అనేక దశాబ్దాలుగా ఈ సంబంధాలు దెబ్బతిన్నాయి.[134][135] 2008 యుఎస్-ఇండియా సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ముగిసిన తరువాత వేసిన అవాస్తవిక అంచనాల (దీర్ఘకాలంలో అణు విద్యుత్ ఉత్పత్తి యొక్క సాధ్యాసాధ్యాలు, భద్రత, బాధ్యతపై ప్రతికూల ప్రజాభిప్రాయం, ఒప్పంద హామీల కోసం పౌర-సమాజ ఆమోదం మొదలైనవాటి గురించి తక్కువగా అంచనా వేసారు) స్థానంలో ఆచరణాత్మక వాస్తవికత చోటు చేసుకుంది. సానుకూలమైన రాజకీయ, ఎన్నికల ఏకాభిప్రాయాన్ని పొందగలిగే సహకార రంగాలపై దృష్టి పెట్టాయి.
భారతదేశ ఆర్ధికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందడం, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి), ఇంజనీరింగ్, వైద్య రంగాలలో భారత అమెరికన్ పరిశ్రమల మధ్య సన్నిహిత సంబంధాలు, నానాటికీ దృఢత్వం పెరుగుతున్న చైనాతో వ్యవహరించడానికి అనధికారికమైన కూటమి, ఉగ్రవాద వ్యతిరేకంగా బలమైన సహకారం, యుఎస్-పాకిస్తాన్ సంబంధాల క్షీణత, ద్వంద్వ వినియోగ వస్తువులు & సాంకేతిక పరిజ్ఞానాలపై ఎగుమతి నియంత్రణలను సులభతరం చేయడం (దరఖాస్తు చేసుకున్న 99% లైసెన్సులు ఇప్పుడు ఆమోదం పొందాయి),[136] భారతదేశ వ్యూహాత్మక కార్యక్రమాల పట్ల దీర్ఘకాలంగా అమెరికాకు ఉన్న వ్యతిరేకతను తిప్పికొట్టడం వంటివి ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న కీలక చర్యలు.
యుఎస్ సెన్సస్ గణాంకాల ప్రకారం, భారతీయుల నాలెడ్జి-ఆధారిత ఉపాధి ద్వారా జరుగుతున్నఆదాయ సృష్టి, అమెరికా లోని ఏ ఇతర జాతి కంటే కూడా ఎక్కువగా ఉంది.[137] సంపన్న భారతీయ ప్రవాసుల ఆర్ధిక రాజకీయ పలుకుబడి గణనీయ స్థాయిలో ఉంది. సగటున 1,00,000 డాలర్ల ఆదాయంతో భారతీయ అమెరికన్ కుటుంబాలు అమెరికాలోకెల్లా సుసంపన్నమైనవి. 65,000 US డాలర్లతో చైనా అమెరికన్లు తరువాతి స్థానంలో ఉన్నారు. అమెరికాలో సగటు గృహ ఆదాయం US $ 50,000.[138]
వాణిజ్యం నుండి పౌర స్వేచ్ఛ వరకు అనేక సమస్యలపై అమెరికా భారతదేశాలు విభేదిస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి 13, 2015 న ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ద్వారా భారత హోం మంత్రిత్వ శాఖ, దేశంలో ఉన్న హక్కులు అభ్యాసాలపై వెలువడే నివేదికలు విదేశాంగ విధానానికి సాధనంగా మారాయని పేర్కొంది: "ఈ నివేదికలు విదేశాంగ విధానం యొక్క సాధనంగా ఉపయోగించుకునే ఉద్దేశ్యంతోనే తయారు చేసామని యుఎస్, యుకె, ఇయు ప్రభుత్వ పత్రాల్లో, ప్రకటనల్లో స్పష్టంగా పేర్కొన్నాయి." యుఎస్, యుకె, యూరోపియన్ పార్లమెంటు నివేదికలు పక్షపాత యుతమైనవని అఫిడవిట్ పేర్కొంది. ఎందుకంటే వారు "తమ అభిప్రాయాన్ని రికార్డ్ చేయడానికి భారత ప్రభుత్వానికి గాని, స్థానిక రాయబార కార్యాలయానికి / హైకమిషనికు గాని అవకాశం ఇవ్వలేదు. లక్ష్యిత దేశానికి వ్యతిరేకంగా వారు భారీగా పక్షపాతంతో ఉన్నారు".[139] ఖోబ్రగడే సంఘటనను మానవ అక్రమ రవాణాకు ఉదాహరణగా వర్గీకరించే ప్రయత్నం చేసింది. 2014 స్టేట్ డిపార్ట్మెంట్ వారి వార్షిక అక్రమ రవాణా (టిప్) నివేదికలో "న్యూయార్క్ కాన్సులేట్ వద్ద ఒక భారతీయ కాన్సులర్ అధికారి డిసెంబర్ 2013 లో ఒక భారతీయ గృహ కార్మికురాలి శ్రమ దోపిడీకి సంబంధించిన వీసా మోసానికి పాల్పడ్డారు." అని పేర్కొంది [140] దీనికి ప్రతిస్పందనగా, కొత్తగా నియమించబడిన అమెరికా వ్యతిరేక ప్రజా అక్రమ రవాణా రాయబారి సుసాన్ పి. కాపెడ్జికి, ఎల్జిబిటి హక్కుల కోసం యుఎస్ ప్రత్యేక ప్రతినిధి రాండి బెర్రీకీ భారతదేశాన్ని సందర్శించడానికి అనుమతించడంలో త్వరపడలేదు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 ప్రకారం అప్పట్లో స్వలింగ సంపర్కం భారతదేశంలో చట్టవిరుద్ధం. అక్రమ రవాణా సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ చట్రంలో పనిచేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను అమెరికాలోని భారత రాయబారి అరుణ్ కె. సింగ్ పునరుద్ఘాటిస్తూనే, మరొక దేశం చెప్పిన "ఏకపక్ష అంచనాలను" తిరస్కరించాడు. "మేము దీనిని ఎప్పటికీ అంగీకరించము" అని అన్నాడు. వాళ్ళిద్దరి భారత్ సందర్శనలకు పెద్దగా ప్రాముఖ్యత లేదన్నట్లు మాట్లాడాడు: "వీసా ఎప్పుడు ఇస్తారని మీరు అమెరికా అధికారిని అడిగితే, 'ముందు వీసా కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు అంచనా వేస్తాం' అని చెబుతారు. ఇప్పుడు నేను ఆ సమాధానాన్ని పునరుద్ఘాటించడం కంటే గొప్పగా ఏమీ చెప్పలేను." [141]
ఫిబ్రవరి 2016 లో, ఒబామా పరిపాలన పాకిస్తాన్‌కు ఎనిమిది అణు-సామర్థ్యం గల ఎఫ్ -16 యుద్ధ విమానాలను అందించాలని, ఎనిమిది AN / APG-68 (V) 9 వాయుమార్గ రాడార్లు, ఎనిమిది ALQ-211 (V)9 ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లతో సహా సైనిక వస్తువులను అందించడానికి ఉద్దేశించినట్లు యుఎస్ కాంగ్రెస్‌కు తెలియజేసింది.[142][143] పాకిస్తాన్‌కు ఏదైనా అణ్వాయుధ సామర్థ్యం గల ప్లాట్‌ఫారమ్‌లను బదిలీ చేయడం గురించి అమెరికా చట్టసభ సభ్యుల నుండి బలమైన రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అమెరికా ఈ ప్రతిపాదన చేసింది.[144] కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన ప్రతినిధి శశి థరూర్, భారతదేశం-యుఎస్ సంబంధాలపై ప్రశ్న లేవనెత్తుతూ ఇలా అన్నాడు: "ఈ వార్త విన్నపుడు నేను చాలా నిరాశపడ్డాను. నిజం ఏమిటంటే, భారతదేశానికి ఉగ్రవాదులను పంపిన బాధ్యతా రహితమైన ప్రభుత్వానికి చెందిన ఆయుధాల నాణ్యతను పెంచుకుంటూ పోవడం, పైగా అది ఉగ్రవాద వ్యతిరేక చర్యల కోసం అని చెప్పడం సిగ్గుమాలిన తనానికి పరాకాష్ఠ".[145] పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించడంపై భారత ప్రభుత్వం అమెరికా రాయబారిని పిలిపించి తన అసమ్మతిని తెలియజేసింది.[146]
ఫిబ్రవరి 2017 లో, యుఎస్ లోని భారత రాయబారి నవతేజ్ సర్నా నేషనల్ గవర్నర్స్ అసోసియేషన్ (ఎన్జిఎ) కు విందు ఇచ్చాడు. దీనికి 25 రాష్ట్రాల గవర్నర్లు, మరో 3 రాష్ట్రాల సీనియర్ ప్రతినిధులూ హాజరయ్యారు. ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. సమావేశానికి కారణాన్ని వివరిస్తూ, వర్జీనియా గవర్నర్, ఎన్జిఎ చైర్ టెర్రీ మక్ఆలిఫ్ "భారతదేశం అమెరికా యొక్క గొప్ప వ్యూహాత్మక భాగస్వామి" అని పేర్కొన్నాడు. భారత-అమెరికా సంబంధాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను మేము స్పష్టంగా అర్థం చేసుకున్నాం. మనం మన 21 వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేస్తున్నప్పుడు, మన సాంకేతిక పరిజ్ఞానం, వైద్య వృత్తులను నిర్మించడంలో భారతదేశం చాలా సహాయకారిగా ఉంది. అమెరికాకు అంత దగ్గరి వ్యూహాత్మక మిత్రదేశంగా ఉన్న దేశాన్ని మేము గుర్తిస్తున్నాం. అందుకే మా గవర్నర్లం ఈ రాత్రి ఇక్కడ ఉన్నాం. " 15 సార్లు భారతదేశాన్ని సందర్శించిన మక్ఆలిఫ్, ఇతర గవర్నర్లను వాణిజ్య ప్రతినిధులతో కలిసి దేశాన్ని సందర్శించి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.[147]
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన S-400 ట్రయంఫ్ ఉపరితలం నుండి గాల్లోకి పేల్చే క్షిపణి రక్షణ వ్యవస్థ నాలుగింటిని కొనడానికి రష్యాతో 5.43 బిలియన్ డాలర్ల విలువైన చారిత్రాత్మక ఒప్పందాన్ని అక్టోబర్ 2018 లో భారతదేశం కుదుర్చుకుంది. ఈ విషయంలో భారత్, అమెరికా యొక్క CAATSA చట్టాన్ని పట్టించుకోలేదు. ఎస్ -400 క్షిపణి రక్షణ వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయంపై ఆంక్షలు విధిస్తామని అమెరికా భారత్‌ను బెదిరించింది.[148] ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయంపై కూడా ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించింది.[149] యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం (యుఎస్ఐఎస్పిఎఫ్) అధ్యక్షుడు ముఖేష్ అగి మాట్లాడుతూ: "ఆంక్షలు దశాబ్దాల పాటు యుఎస్-ఇండియా సంబంధాలపై ఘోరమైన ప్రభావాన్ని చూపుతాయి. భారతదేశం దృష్టిలో, అమెరికా మరోసారి నమ్మదగనిదిగా పరిగణించబడుతుంది." [150]
2014 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు, భారత-యుఎస్ వ్యూహాత్మక సంబంధం యొక్క భవిష్యత్తు గురించి విస్తృతమైన సందేహాలు ఉండేవి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యుఎస్ వీసా రద్దు చేయబడిన నరేంద్ర మోడీ, 2002 గుజరాత్ అల్లర్లలో అతడి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నందున యుఎస్ అధికారులు దాదాపు ఒక దశాబ్దం పాటు [151] అతణ్ణి బహిష్కరించారు.[152] అయితే, ఎన్నికలకు ముందే మోడీ యొక్క అనివార్యమైన విజయాన్ని గ్రహించిన అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ఆయనకు చేరువయింది . అంతేకాకుండా, 2014 లో ప్రధానిగా ఎన్నికైన తరువాత అధ్యక్షుడు ఒబామా టెలిఫోన్ ద్వారా ఆయనను అభినందించాడు. యుఎస్ సందర్శించడానికి ఆహ్వానించాడు.[153][154] అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ ఆగస్టు 1 న న్యూ ఢిల్లీ పర్యటించాడు. సెప్టెంబర్ 2014 లో, సిఎన్ఎన్ కు చెందిన ఫరీద్ జకారియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుఎస్ సందర్శించడానికి కొన్ని రోజుల ముందు, "చరిత్ర సంస్కృతి ప్రకారం భారతదేశం అమెరికా కలిసి ఉన్నాయి" అని మోడీ చెప్పారు, కాని సంబంధాలలో "హెచ్చు తగ్గులు" ఉన్నాయని అంగీకరించారు. .[155] మోడీ సెప్టెంబర్ 2014 27-30 మధ్య అమెరికాలో పర్యటించాడు.[156] ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తన తొలి ప్రసంగంతో మొదలుపెట్టి, న్యూ యార్క్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో భారతీయ అమెరికన్ సమాజపు బహిరంగ సభలో మాట్లాడి, వాషింగ్టన్, DC లో ఒబామాతో ద్వైపాక్షిక చర్చలు జరిపాడు. అక్కడ ఉన్నప్పుడు, మోడీ అనేక మంది అమెరికన్ వ్యాపార నాయకులను కలుసుకున్నాడు. భారతదేశాన్ని ఉత్పాదక కేంద్రంగా మార్చడానికి తన ప్రతిష్టాత్మక మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో చేరమని వారిని ఆహ్వానించాడు.[157][158][159]
26 జనవరి 2015 న జరిగిన భారత 66 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తొట్టతొలి అమెరికా అధ్యక్షుడతడు.[160] ఈ సందర్భంగా ఇరుదేశాల మైత్రిని ఒక స్థాయిని పెంచుతూ "ఢిల్లీ డిక్లరేషన్ ఆఫ్ ఫెండ్షిప్" ను విడుదల చేసారు. ఈ డిక్లరేషను శీర్షికను "చలే సాథ్ మే; ఫార్వర్డ్ టుగెదర్ వియ్ గో". అని పెట్టారు. భారత్ అమెరికాలు తమ దీర్ఘకాలిక మైత్రిని మరో మెట్టు పైకి ఎక్కించాలని అంగీకరించాయి. సంబంధాలను బలోపేతం చేసే ప్రతీ అడుగూ అంతర్జాతీయ భద్రతను, ప్రాంతీయంగాను ప్రపంచ వ్యాప్తంగానూ శాంతిని నెలకొల్పే దిశగా వేసే అడుగు అవుతుందని ఈ డిక్లరేషనులో ప్రకటించారు.[161] ఈ డిక్లరేషను స్ఫూర్తితో భారత అమెరికా ఉన్నత స్థాయి అధికారులు మొట్టమొదటి సారిగా ఐరాస గురించి, ఇతర బహుపాక్షిక సమస్యల గురించీ ద్వైపాక్షిక సంభాషణలు జరిపాయి. ఈ చర్చలు వాషింగ్టన్లో 2015 ఫిబ్రవరిలో జరిగాయి. 2015 తరువాత అభివృద్ధి అజెండాలో భాగంగా ఇరు దేశాల సంబంధాలను ఢిల్లీ డిక్లరేషన్ బలోపేతం చేస్తుంది.[2]
ఒబామా 2015 పర్యటనలో ప్రధానమైన నిర్దుష్టమైన ప్రకటనలేమీ లేకపోవడం, ఆతిథ్య దేశంతో అమెరికా సంబంధాల యొక్క ముఖ్య సూచిక. రెండు దేశాలలో రాజకీయ వ్యాఖ్యాతలు ఈ సందర్శన లోని విశ్వాసాన్ని పెంపొందించే అంశాలను హైలైట్ చేయడానికి దారితీసింది[162][163][164][165][166]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిలికాన్ వ్యాలీలో పర్యటించి, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. వీరిలో చాలామంది భారతీయ సంతతికి చెందినవారు. విజయవంతమైన మైక్రో ఎలెక్ట్రానిక్స్, డిజిటల్ కమ్యూనికేషన్స్, బయోటెక్నాలజీ స్టార్ట్-అప్ల సమావేశాల్లో పాల్గొని ఎన్డీఏ ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవను ప్రోత్సహించారు.[167] అక్కడి నుండి మోడీ, 2015 ఐరాస సర్వప్రతినిధిసభ సమావేశానికి న్యూయార్క్ వెళ్లాడు. అక్కడే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ద్వైపాక్షిక చర్చలు జరిపాడు.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాను సందర్శించినప్పుడు కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాడు. రెండు దేశాల ఉమ్మడి లక్షణాలను, ఇరు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహాన్ని ఎత్తిచూపాడు.[168] 45 నిముషాల కంటే ఎక్కువ కాలం ప్రసంగించిన మోడీ, ఇరు దేశాల మధ్య సమాంతరాలను గూర్చి, ఇరు దేశాలు గతంలో కలిసి పనిచేసిన, భవిష్యత్తులో కలిసి పనిచెయ్యాల్సిన అంశాలు, సమస్యలను ప్రస్తావించాడు.
జూన్ 26, 2017 న ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశాడు. 2017 నవంబరు 8 న భారతదేశం శ్రీలంక లలో మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకు రాగల సంస్థలకు యుఎస్ దాదాపు 500,000 గ్రాంటును ప్రకటించింది.
2019 సెప్టెంబరు లో, మోడీ హ్యూస్టన్‌ను సందర్శించాడు. అతను హ్యూస్టన్ ఎన్ఆర్జి స్టేడియంలో ఒక పెద్ద భారతీయ అమెరికన్ సభను ఉద్దేశించి ప్రసంగించాడు. అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు అతడు వేదికపై సభకు వందనం చేసాడు. టైగర్ ట్రయంఫ్ విన్యాసాలతో పెరిగిన సైనిక సహకారాన్ని నొక్కిచెబుతూ ఆయన భారత అమెరికా సత్సంబంధాలను పునరుద్ఘాటించారు.[169]
2020 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని సందర్శించాడు. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన " నమస్తే ట్రంప్ " కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు. తన తొలి భారత పర్యటనలో, రెండు దేశాలు ప్రధానంగా వ్యూహాత్మక సంబంధాలు, రక్షణలో ద్వైపాక్షిక సంబంధాలను గణనీయంగా పెంచుకున్నాయి.[170]
ఈశాన్య ఢిల్లీలో సిఎఎకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లు ట్రంప్ తొలి అధికారిక భారత పర్యటనను కప్పివేసింది.[171] ఈ గొడవల్లో 40 మందికి పైగా చనిపోయారు, వందలాది మంది గాయపడ్డారు.[172]
యుఎస్ తన రక్షణ భాగస్వాములతో నాలుగు "పునాది" ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. ఈ ఒప్పందాలు "భాగస్వామి-దేశాలతో సైనిక సహకారాన్ని పెంపొందించుకోడానికి యుఎస్ ఉపయోగించే సాధారణ సాధనాలు" అని పెంటగాన్ అంటుంది. ఈ ఒప్పందాలు ద్వైపాక్షిక రక్షణ సహకారానికి ఆవశ్యకమేమీ కాదని అమెరికన్ అధికారులు పేర్కొంటూ, అయితే విమానాల్లోను, నౌకల్లోనూ ఇంధనం నింపడాన్ని, విపత్తు ఉపశమనం అందించడం వంటి కార్యకలాపాలను నిర్వహించడాన్నీ ఇది సరళతరం చేస్తుంది, ఖర్చు తక్కువ అవుతుంది. అని అన్నారు.[173] ఈ నాలుగు ఒప్పందాలలో మొదటిది, జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ (GSOMIA), 2002 లో భారత అమెరికాలు సంతకం చేసిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సైనిక సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ప్రతి దేశం ఇతరుల రహస్య సమాచారాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. రెండవ ఒప్పందం, లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (LEMOA), 2016 ఆగస్టు 29 న ఇరు దేశాలు సంతకం చేశాయి. పునఃసరఫరాలు చేయడానికి, మరమ్మతు చేయడానికీ ఇతరుల స్థావరాలను ఉపయోగించడానికి ఇరు దేశాల సైన్యానికి LEMOA ద్వారా వీలు కలుగుతుంది. ఈ ఒప్పందం ఏ దేశానికైనా లాజిస్టికల్ సపోర్ట్‌ను అందించడం తప్పనిసరి చెయ్యదు. ప్రతి అభ్యర్థనకు విడిగా అనుమతులు అవసరం.[174] మూడవ ఒప్పందం, కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ (COMCASA) 2018 సెప్టెంబరులో ప్రారంభ 2 + 2 సంభాషణ సందర్భంగా సంతకాలు చేసారు.[175] ఇది భారత-నిర్దుష్ట కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (CISMOA). ఇది ద్వైపాక్షిక, బహుళజాతి శిక్షణా విన్యాసాలు, కార్యకలాపాల సమయంలో ఆమోదించబడిన పరికరాలపై సురక్షితమైన కమ్యూనికేషన్, సమాచారాన్ని పంచుకునేందుకు రెండు దేశాలను అనుమతిస్తుంది. నాల్గవ ఒప్పందం, బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బీకా). దీనిపై ఇంకా సంతకం చేయలేదు. ఇది జియోస్పేషియల్ ఉత్పత్తులు, టోపోగ్రాఫికల్, నాటికల్, ఏరోనాటికల్ డేటా, యుఎస్ నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్జిఎ) ఉత్పత్తులు సేవలను మార్పిడి చేయడానికి అనుమతిస్తుంది. LEMOA పై సంతకం చేసే సమయంలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్, చివరికి మిగతా ఒప్పందాలపై కూడా సంతకం చేస్తామని అన్నాడు.[176]
లండన్‌లోని కింగ్స్ కాలేజీలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలో భారతదేశపు ప్రాముఖ్యతను ఇలా ఎత్తిచూపాడు: "ఇండో-పసిఫిక్ లో స్థిరమైన శక్తి సమతుల్యతను సృష్టించే అమెరికా సామర్థ్యానికి భారతదేశం కీలకం. వనరుల పరిమితంగా ఉన్న ఈ సమయంలో, చైనా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో తన విశ్వసనీయతను పెంచుకోడానికి అమెరికాకు భారతదేశం వంటి భాగస్వాములు అవసరం." నియర్ ఈస్ట్ సౌత్ ఆసియా సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌లోని సౌత్ ఆసియా స్టడీస్ ప్రొఫెసర్ రాబర్ట్ బోగ్స్, "సంబంధాన్ని మెరుగుపర్చాలన్న భారతదేశపు కోరిక, అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు రెండింటినీ అమెరికా అతిగా అంచనా వేస్తోంది" అని అభిప్రాయపడ్డాడు.[177] విదేశాంగ విధాన థింక్ ట్యాంక్, గేట్‌వే హౌస్ డైరెక్టర్ నీలం దేవ్ ఇలా చెప్పడం ద్వారా భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకునే ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది: "భారత్ పెద్ద దేశం, దాని స్వంత వ్యూహాత్మక లక్ష్యాలు అత్యవసరాలను బట్టి, ఆసక్తులు కలిసే అవకాశాలపై భారత్ పనిచేస్తుంది. గతంలోనూ ఇలాగే పనిచేసింది. " [71]
భారతదేశాన్ని తన వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకమని గుర్తించిన అమెరికా, భారత్‌తో తన సంబంధాన్ని బలోపేతం చేసుకోడానికి ప్రయత్నించింది. రెండు దేశాలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు. రెండూ ప్రాతినిధ్య ప్రభుత్వాల రక్షణలో ఉన్న రాజకీయ స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాయి. హిందూ మహాసముద్రం యొక్క కీలకమైన సముద్రపు దారులతో సహా వాణిజ్యం వనరుల స్వేచ్ఛా ప్రవాహంపై భారత అమెరికాలకు ఉమ్మడి ఆసక్తులు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, హిందూ మహాసముద్రంలో అమెరికాతో కలిసి భారత్ పెద్దయెత్తున ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించింది.[178]
చైనాను ఎదుర్కోవటానికి యుఎస్ఎ తన విదేశాంగ విధానంలో భాగంగా [179] భారతదేశాన్ని ప్రధాన రక్షణ భాగస్వాములలో ఒకటిగా చేసుకోవాలని కోరుకుంటోంది. దీని కోసం భారత ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రెడేటర్ డ్రోన్లు.[180] నరేంద్ర మోడీ యొక్క మేక్ ఇన్ ఇండియా కింద సుమారు 15 బిలియన్ డాలర్లతో 100 మల్టీ రోల్ ఫైటర్ విమానాల కొనుగోలుకు (రక్షణ ఒప్పందాలన్నిటికీ బాబు లాంటిది) భారతదేశం టెండర్ పిలిచింది. ఈ ఒప్పందం 2018 నాటికి ఇంకా ఖరారు కానప్పటికీ, ప్రస్తుత యుఎస్ఎ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు అధునాతన ఎఫ్ -16 జెట్ ఫైటర్స్,,[181] ఎఫ్ / ఎ -18 సూపర్ హార్నెట్ [182] లను అమ్మాలని ప్రయత్నిస్తోంది.
అయితే, అణ్వాయుధ కార్యక్రమాలపై అమెరికా ఆందోళనలు, భారతదేశంలో ఆర్థిక సంస్కరణల వేగం వంటి విషయాల్లో కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి. గతంలో, ఈ ఆందోళనలు యుఎస్ ఆలోచనలపై ఆధిపత్యం వహించి ఉండవచ్చు. కాని నేడు అమెరికా భారతదేశాన్ని పెరుగుతున్న ప్రపంచ శక్తిగా చూస్తోంది. దానితో ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలను పంచుకుంటోంది. రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, ఈ అభిప్రాయభేదాలను పరిష్కరించి, సహకారంతో కూడిన డైనమిక్ భవిష్యత్తును రూపొందిస్తుంది. 2015 జూన్ లో, అమెరికా రక్షణ కార్యదర్శి అష్టన్ కార్టర్ భారతదేశాన్ని సందర్శించాడు. భారత సైనిక కమాండును సందర్శించిన మొట్ట మొదటి అమెరికా రక్షణ కార్యదర్శి అతడు. అదే సంవత్సరం డిసెంబరులో, యుఎస్ పసిఫిక్ కమాండ్‌ను సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అయ్యడు.[183]
జపాన్, ఆస్ట్రేలియాతో పాటు దక్షిణ చైనా సముద్రంలో నావికాదళ పెట్రోలింగ్‌లో చేరాలన్న అమెరికా ప్రతిపాదనను 2016 మార్చిలో భారత్ తిరస్కరించింది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ: "భారతదేశం ఏ ఉమ్మడి పెట్రోలింగ్‌లోనూ పాల్గొనదు; మేము ఉమ్మడి విన్యాసాలు మాత్రమే చేస్తాము. ఉమ్మడి పెట్రోలింగ్ ప్రశ్న తలెత్తదు. " [184]
1998 మేలో భారతదేశం అణు పరీక్షలు చేసాక,అణు విస్తరణ నివారణ చట్టం నిబంధనల కింద అమెరికా విధించిన ఆంక్షలను 1998 సెప్టెంబరు చివరలో, అధ్యక్షుడు బుష్ ఎత్తివేసారు. ఆ తరువాత ఇరుదేశాలు జరిపిన సంభాషణలతో వాటి మధ్య అవగాహనలో ఉన్న అంతరాలను తగ్గించింది.
2006 డిసెంబరు లో, యుఎస్ కాంగ్రెస్ చారిత్రాత్మక భారతదేశం-అమెరికా పౌర అణు ఒప్పందాన్ని ఆమోదించింది, ఇది 30 సంవత్సరాలలో మొదటిసారిగా భారతదేశంతో ప్రత్యక్ష పౌర అణు వాణిజ్యాన్ని అనుమతించింది. అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా భారతదేశం అణ్వాయుధాలను అభివృద్ధి చేసినందున, అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్ఎన్పిటి) పై సంతకం చేయనందునా గతంలో భారతదేశంతో అణు సహకారాన్ని యుఎస్ విధానం వ్యతిరేకించింది. అమెరికా అణు రియాక్టర్లను, పౌర ఉపయోగం కోసం ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి భారతదేశానికి ఈ చట్టంతో మార్గం సుగమమైంది.
10 2008 అక్టోబరు న సంతకం చేసిన భారత-అమెరికా పౌర అణు ఒప్పందం శాంతియుత అణు సహకారం కోసం చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం. దీన్ని "123 ఒప్పందం" అని కూడా పిలుస్తారు. ఇది అమెరికా, భారతీయ సంస్థల మధ్య పౌర అణు వాణిజ్యాన్ని పరస్పరం పౌర అణు ఇంధన రంగంలో పాల్గొనడాన్నీ నియంత్రిస్తుంది.[185][186] ఒప్పందం అమలు కావాలంటే, అణు విక్రేతలు, ఆపరేటర్లు భారతదేశపు 2010 అణు బాధ్యత చట్టానికి లోబడి ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగినపుడు అణు సరఫరాదారులు, కాంట్రాక్టర్లు, ఆపరేటర్లు ఆర్థికంగా బాధ్యత వహించాలి అనేది ఈ చట్టం చెబుతోంది.
ప్రముఖ పారిశ్రామిక ప్రమాదాలు (1984 భోపాల్ రసాయన-గ్యాస్ విపత్తు, 2011 ఫుకుషిమా అణు విపత్తు) కార్పొరేట్ బాధ్యత, విక్రేతలు క్లిష్టమైన మౌలిక సదుపాయాల నిర్వాహకుల ఆర్థిక బాధ్యతలపై పౌర సమాజపు సునిశిత పరిశీలనకు దారితీసింది. 2010 లో, భారత పార్లమెంటు అణు నష్టం కోసం పౌర బాధ్యత చట్టాన్ని చేసింది. అణు నష్టానికి బాధ్యత వహించడానికీ, బాధితులకు వెంటనే పరిహారం చెల్లించడానికీ నిబంధనలు ఏర్పరచింది.
భారతదేశంలో ఆరు అమెరికన్ అణు రియాక్టర్ల నిర్మాణంతో సహా "ద్వైపాక్షిక భద్రత, పౌర అణు సహకారాన్ని బలోపేతం చేయడానికి" 2019 మార్చి 27 న భారత అమెరికాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.[187]
భారతదేశం యొక్క అతిపెద్ద ప్రత్యక్ష పెట్టుబడిదారులలో అమెరికా ఒకటి. 1991 నుండి 2004 వరకు, ఎఫ్‌డిఐల ప్రవాహం $ 11 మిలియన్ల నుండి 344.4 మిలియన్లకు పెరిగింది. మొత్తం 4.13 బిలియన్లు. ఇది ఏటా 57.5 శాతం పెరుగుతోంది. విదేశాలలో భారత ప్రత్యక్ష పెట్టుబడులు 1992 లో ప్రారంభమయ్యాయి. భారతీయ కార్పొరేషన్లు, రిజిస్టర్డ్ పార్టనర్షిప్ సంస్థలు ఇప్పుడు వారి నికర విలువలో 100 శాతం వరకు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించారు. భారతదేశం యొక్క అతిపెద్ద అవుట్గోయింగ్ పెట్టుబడులు తయారీ రంగంలో ఉన్నాయి, ఇది దేశ విదేశీ పెట్టుబడులలో 54.8 శాతం. రెండవ అతిపెద్దది ఆర్థికేతర సేవల్లో (సాఫ్ట్వేర్ డెవలప్మెంట్), 35.4 శాతం పెట్టుబడులు.
3 2018 ఆగస్టు న, అమెరికా స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ -1 (STA-1) హోదా పొందిన మూడవ ఆసియా దేశంగా భారత్ నిలిచింది. STA-1 తో సివిల్ స్పేస్ లోని, డిఫెన్స్ లోనూ హై-టెక్నాలజీ ఉత్పత్తులను యుఎస్ నుండి భారతదేశానికి ఎగుమతి చేసే వీలు కలుగుతుంది.[188][189]
యుఎస్ భారతదేశానికి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, భారతదేశం అమెరికాకు 9 వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి .[190] 2017 లో, అమెరికా 25.7 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారతదేశానికి ఎగుమతి చేసింది, 48.6 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ వస్తువులను దిగుమతి చేసుకుంది.[191] భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ప్రధాన వస్తువులలో సమాచార సాంకేతిక సేవలు, వస్త్రాలు, యంత్రాలు, రత్నాలు, వజ్రాలు, రసాయనాలు, ఇనుము-ఉక్కు ఉత్పత్తులు, కాఫీ, టీ, ఇతర ఆహార ఉత్పత్తులూ ఉన్నాయి. భారతదేశం దిగుమతి చేసుకున్న ప్రధాన అమెరికన్ వస్తువులలో విమానాలు, ఎరువులు, కంప్యూటర్ హార్డ్‌వేర్, స్క్రాప్ మెటల్, వైద్య పరికరాలు ఉన్నాయి.[192][193]
అమెరికా భారతదేశపు అతిపెద్ద పెట్టుబడి భాగస్వామి. ప్రత్యక్ష పెట్టుబడి 10 బిలియన్ డాలర్లు (మొత్తం విదేశీ పెట్టుబడులలో 9 శాతం). భారత విద్యుత్ ఉత్పత్తి, టెలికమ్యూనికేషన్స్, పోర్టులు, రోడ్లు, పెట్రోలియం అన్వేషణ ప్రాసెసింగుల్లో, మైనింగ్ పరిశ్రమలలో అమెరికన్లు పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టారు.[193]
2015 లో భారతదేశం నుండి అమెరికా చేసుకున్న దిగుమతులు 46.6 బిలియన్ డాలర్లు. ఇది దేశ మొత్తం దిగుమతుల్లో 2%. భారతదేశపు మొత్తం ఎగుమతుల్లో 15.3%. భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి చేసిన 10 ప్రధాన వస్తువులు:[194][195]
2015 లో భారతదేశానికి అమెరికా ఎగుమతులు 20.5 బిలియన్ డాలర్లు ఇది భారతదేశపు మొత్తం దిగుమతుల్లో 5.2%. యుఎస్ నుండి భారతదేశానికి ఎగుమతి చేసిన 10 ప్రధాన వస్తువులు:[196][197]
2005 జూలై లో, అధ్యక్షుడు బుష్, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ట్రేడ్ పాలసీ ఫోరం అనే కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు.[198] రెండు దేశాలూ చెరొక ప్రతినిధితో దీన్ని నడిపిస్తాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబ్ పోర్ట్మన్, భారత వాణిజ్య మంత్రి కమల్ నాథ్ లు ఈ ప్రతిసిధులు. ఈ కార్యక్రమం లక్ష్యం ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి ప్రవాహాలను పెంచడం.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.