శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు.

చంద్రగిరి సంగ్రహశాలలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలూ, వారి దేవేరులు చిన్నమదేవీ, తిరుమలదేవిల విగ్రహాలు
హైదరాబాదు లోని టాంక్‌బండ్ పై శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహము
మరింత సమాచారం విజయ నగర రాజులు ...
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646
మూసివేయి

జీవిత విశేషాలు

శ్రీకృష్ణదేవరాయలు సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, ఆయన రెండవ భార్య నాగలాంబకు రాయలు జన్మించాడు.[1] రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకుల ఇంటి ఆడపడచు. [2]

ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. రాయలును తెలుగూ, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడుగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్, న్యూనిజ్‌‌ల రచనల వలన తెలియుచున్నది. రాయలుకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు. రాయలు ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలునూ, వీర నరసింహ రాయలునూ, వారి అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు. కృష్ణదేవ రాయలు 1529 అక్టోబరు 17న మరణించినట్లు 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని తుముకూరు వద్ద బయల్పడిన శాసనం ద్వారా తెలిసింది. [3]

సాహిత్య పోషణ

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్య వధూప్రీణనము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.[4] తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందారు.

భక్తునిగా

కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు.[5][6] అనేక దాన ధర్మాలు చేసాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఏడు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.

కుటుంబము

కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలు. అయితే, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ, కమల).[7] కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు అయిన తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు.[8] పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.[9] చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు.[7][10] కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం[11] ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్నతనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524లో మరణించాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలును వారసునిగా చేసాడు.

మతము, కులము

శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది [14][15][16][17][18][19][20][21][22].

సమకాలీన సంస్కృతిలో

శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా తెలుగులో అనేక సినిమాలు విడుదలైనవి. అందులో కొన్ని మల్లీశ్వరి, మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ, ఆదిత్య 369

ఇవి కూడా చూడండి

శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు

మూలాలు

లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.